Friday, August 28, 2020

Bharatavarsha -29

"నీ హావభావ విలాసములను జూచిన నేనిచ్చిన భక్ష్యము నారగించిన పిదప మీరు ప్రేమసాగరమునములిగినా రని పించుచున్నది. నీ నాధుని కౌగిట  ఏ మధురరాగములను పాడితివో అతడు నీకే తీపి జ్ఞాపికలిచ్చెనో,  నీబుగ్గల నిగ్గులందు.."యని డయానా జిగిబిగి పలుకులు  పలుకుచుండ  అంగయార్ కన్నె వేటరిని జూచిన జింకవలె డయానాను బెదురుకళ్ల జూచెను. ఏమీ జరగలేదని డయానాకు విషయము  తేటతెల్లమయ్యెను. హతవిధీ! నా వద్ద శృంగార శిక్షణ పొందిన యువతులు ఎవ్వరూ అపజయమును పొందలేదు.  డయానా చెల్లి లూవెల్లర్ ( ముద్దు పేరు లులు ) శృంగార శిక్షణ అన్నచో నేమి యని అడుగగా డయానా డంగై " లులు, యూ ఆ టాకింగ్ బీస్ అండ్ బర్డ్స్, గెటవే " యని అరచి 10 సంవత్సరముల  లువెల్లర్ ను తరిమివేసెను. " బీస్  అండ్ బర్డ్స్ అనిన నేమి?"యని అంగయార్ అడిగెను. పిల్లలు వినకూడనివి..  ప్చమ్ ప్చమ్ .. యని  గాలిని చుంబించి కన్నెను జూసి  కన్ను గీటెను. తుంటరి ఎంతమందికి శృంగార శిక్షణనిచ్చినావు? యనుచూ నెత్తిపై మొట్టెను. డయానా పక్కనున్న కుర్చీలో కూలబడెను. అంగయారు కన్నె ముఖమున విషాద ఛాయల లుముకొనెను. డయానా! ఇంక నీప్రయత్నములు ఆపివేయ మనుచూ గద్గద స్వరమున పలికెను. 

ప్రాయమునున్న పడతులకేలనో ఖేదము? పతులు పనికిరాకున్ననూ పేడి యైననూ ఆగ్రహమునుగాక నిగ్రహమునే చూపుచుందురు? ఇరువది నారు సంవత్సరముల పడతికిట్టి బెట్టిద మెట్టిదనిన... యని ఆపి డయానా సంకోచమున జంకుచుండ  

డయానా "ముద్ద ముందుబెట్టి మూతికట్టినట్టు" అనగా  "నిర్గంధ పుష్పమునాఘ్రాణించునట్టు" యని అంగయార్ కన్నె, డయానా వాక్యమును పూరించెను. 

డయానా: మణమక్క  పూ మోప్పం పిడిప్పదు, ఆనాళ్  నీంగళ్  అతియే చేయికిరిరాళ్.
అంగయార్: అంగయే నిరుతుక్కల్, అయ్యయ్యో! ఏమీ చిత్రము నిన్ను వారించబోయి నేనునూ తమిళమునే మాట్లాడుచుంటినే. ఇచ్చట తమిళము మాట్లాడరాదంటినా? ఇచ్చటందరికీ ఆంగ్లమునైననూ సులభముగా నర్ధమగును కనుక …డయానా:తెలుగునందే మాట్లాడవలెను, నేను తెలుగు నేర్చుకొని యుండనిచో అప్పుడేమిచేయుదువు?

గృహసముదాయమునందు వేరొక అంతస్థులో తల్లిదండ్రులతో నివసించు డయానా, జాస్మిన్ అంతర్జాతీయ పాఠశాలనందే సహోపాధ్యాయురాలుగా పనిచేయుచున్నది.   డయానా శ్వేతజాతి భారతీయురాలు. బుడతల కాంగ్లమున ప్రాసపద్యములు భోదించుచుండును.  “కన్నె కంటే చిన్న దానను కానీ కన్నెను కాన” ని మొహమాటము లేక జెప్పుచుండును. మాటలను చురకత్తులవలె విసురు చురుకైన  చిన్నది, మాతృభాష ఆంగ్లమైననూ, స్థానిక భాష తమిళమైననూ, పొరుగుభాష తెలుగైననూ తడుముకొనక మాట్లాడు త్రిభాషిణి.  శృంఖమునువోలిన మెడ , ఒంపైన నడుముతో  బంగారు కోడిపెట్ట వలెనున్న ఆమె రూప విలాసమును గాంచిముగ్దులైన వారెవ్వరునూ ,  ఆపై  ఆఠీను ఆసువలె నున్న  సొంపైన ముఖమును, కేండ్రించు కేశములను గాంచ  గాండ్రించు పులులవలె యున్న ఆమె స్తనముల వలన  వీలుచిక్కకున్నది. ఆమె బిఱ్ఱ వర్తుల కుచద్వయ కాంచన క్రౌంచ సౌందర్య ఘటనమున  ద్రష్ట హృదయముల తుత్తునియలగు  చుండ  చక్కర పాకప్రాప్తి నొందుచు లొట్టలు వేయుచుందురు . ఆమెను జూచి, ఆమె చక్కెర పలుకులు విని అంతర్జాతీయ పాఠశాల అధిపతి  రసవాద విద్వాంసుడగు రామచంద్రుడు రసవాదమును మరచి   సరసవాదమునకు తెరతీసి   ముమ్మూర్తులా జర్మన్ గానాప్సర లెనా మేయర్ వలే నున్నావనుచూ అడిగిన జీతమిచ్చి నియమించెను. ఆ కలికి వాచాలకులకందక  అందకతిరిగు  బహుగడుసరి.

మీనాక్షి యుండినచో నేడామెనాశ్రయించెడి దానను ఆమెకడ నాకు చేరిక ఎక్కువ విధివిలాసమెట్టిదో చూడుము నేడామె లేకుండెను. మాటమాత్రమైననూ జెప్పక  ఉద్యోగమునేగాక గృహసముదాయమును వీడిపోయినది. అనునంతలో నీ ప్రియసఖి గాకున్న ఇంక నేనెందులకు పోయివత్తును నని ముఖము చిన్నబుచ్చుకొని డయానాలేవబోయెను. పోవుచున్న తుంటరిని చెవినులిమి "నీ అల్లరంతా డెస్మండ్ వద్ద చూపుమని దిండ్ల కుర్చీలో కూలదోసి కాఫీ తెచ్చి ఇచ్చెను. 

నేడాదివారము, మధ్యనభోజనమునకు వచ్చునో లేక రాకుండునో చూచితివా ఇంటిపట్టునుండక ఎచ్చటికో  పోయినాడు. అనుచుండగా "ఒక గుళికను కేవై జెల్లీ నిచ్చి ప్రయత్నించమని డయానా చెప్పెను. ఐదు సంవత్సరములు అనేకవైద్యుల సలహాలపై అనేక మందులు వాడి చూసిననూ ప్రయోజనమేమియూ లేకుండెను. ఒక వైద్యునివద్ద కి వెళ్ళినపుడు నీవు నా విషయమును ఎట్లు గ్రహించితివోగాని నన్నుఒప్పించి మనస్తత్వవేత్త వద్దకు గొనిపోయితివి. అప్పుడు కొంతకాలము ప్రేమగా నుండెడివారము. ఇప్పుడతని  సలహాల ఫలము కూడా సన్నగిల్లినది. మరల భౌతిక దూరము పెరిగినది. నేడు మానసిక దూరము పెరుగుచున్నది. కడుపునొప్పి యని తలనొప్పియని తప్పించుటకొన్ననూ మామధ్య కొంచెము మాటలు మిగిలి యున్నంతవరకూ సహించితిని.  ఇప్పుడా మాటలు కూడా నశించినవి. “గుండెలోకి ప్రవేశించు మార్గము మున్న జెప్పుమ”నుచూ వాటిని త్రిప్పి ఇచ్చెను " డయానా తెల్లబోయెను. కొద్దిసేపు నిశ్శబ్దము ఆవరించెను. పిమ్మట బల్లపై పక్కనే యున్న యాపిల్ ను కొరుకుచూ కాఫీ త్రాగుచున్న డయానాను చూచి కన్నె ఛీ ఛీ యనెను. 

డయానా నీవు కూడా ఒక పండు తినుచు కాఫీ త్రాగి జిహ్వ రుచిని పొందగలవనుచున్న డయానాను చూచుచూ అంగయార్ ముఖము చిట్లించెను. " నీవెప్పుడైనా ఈ రెండింటినీ కలిపి ఆస్వాదించితివా? యని డయానా అడుగగా కన్నె "లేద"ని చెప్పెను. మరి నీకెట్లు తెలియును ? అని డయానా అనగా " కన్నె మొఖమున   దిగ్భ్రాంతి కాన వచ్చెను. అంగయార్  కన్నె ఒకయాపిల్ చేకొని   మెల్లగా కాఫీ త్రాగుచూ అల్లనల్లన పండు కొరుకుచూ చేతి బొటన, చూపుటు  వేళ్ళను సున్నవలె చుట్టి దివ్యమైన రుచి యని  ప్రసంశించెను

నీకంటే పిన్న దానను నీకు జీవితమునాస్వాదించ వలెనని  జెప్పుటకు నాకు  సభ్యత అడ్డు వచ్చుచున్నది నీకంటే ఈవిషయములలో నాకు జ్ఞానమున్ననూ వయసు అంతరముచే నోరుపెగలకున్నది  నీవు జెప్పినట్లు మీనాక్షి యున్నచో ...యని డయానా మీనాక్షిని స్మరించెను.

నాకు తల్లివంటిది ఆమె వయసులో సగము వయసు లేని నన్ను ఆమె మందలించిచొ  కలతనెరుగక నెమ్మది పొందుచుండెడిదానను. భాగస్వామితో కలిసి సన్నిహితంగా మసలుకొను విధానమతడికి దెలియకున్ననూ, వైద్యుల ఉపచారముపై  పెద్దల మంత్రాగము పై నమ్మకముంచి సంవత్సరములు వేచియుంటిని. 
“నిరాకరించినను, పనికిరాకున్ననూ ఇంతులు మత్తకాశి లైననూ ధర్మబద్దులై విలపించుచుచూ నుండవలెనని మీధర్మము జెప్పుచున్నదా పురుషార్థమనిన ధర్మార్థ కామ మోక్షములను బడయుట యని మీ హిందూ ధర్మమ ఘోషించుచున్నది గాదా? నినువలచి ప్రేమలేఖనిచ్చిన వాని నేల బాలుడిని నిరాకరించుచున్నావు?

ఆ విషయము నీకెట్లు తెలిసెను అయిననూ 17 ఎండ్ల ప్రాయమునకు ప్రేమ యనిన విన్నవారెవ్వరైననూ అవ్వ అందురు. నాకు ఇరువది యారు అని మరువకుము. 

వరదాచారి వయసు 35 మరిచి ఎట్లు పెండ్లాడితివి?

అతడు విద్యార్థి, నేను ఉపాధ్యాయురాలిని. విద్యార్థి ఉపాధ్యాయురాలి మధ్య ఎటువంటి సమ్మంధంఉండవలెను? నీవునూ ఉపాధ్యాయురాలివేకదా, గ్రహింపుము. 

నీవు సంగీతము భోదించుచున్నది చిన్న పిల్లలకి. నీవద్ద అతడు ఏమినేర్చు కొనుచున్నాడు. అతడు నీ విద్యార్థి కాదు.  రెండునెలల్లో అతడి 12 వతరగతి పరీక్షలు ముగియనున్నవి.  నీవు యాజమాన్యమునకు తెలియపరచకుండిన బాగుండేదిదేమో. అతడిని ప్రేమించమని నేను చెప్పుటలేదు అతడిని దండించుట వ్యర్ధముకదా! అతడి తల్లి తండ్రులని పిలిపించి మాట్లాడినారు విద్యార్థి రెండునెలల్లో మరొక కళాశాలకు పోవువాడని పాఠశాలనుంచి తొలగించలేదు. అది అట్లుండనిమ్ము, గుళిక నీకొరకే తెచ్చినాను ఆఖరి ప్రయత్నమ చేయుమనుచూ, ఇంటివద్ద కాదు వాతావరణము మారిన …ఆమె చేతులో పెట్టి చెవిలో గుస గుస లాడెను. 

Wednesday, August 26, 2020

Bharatavarsha 28

మరునాడు విదిష ఆలస్యముగా నిద్ర లేచెను. ఇదంతయూ కలా? నిజమయిన ఎంత బాగుండునని  అనుకొనుచుండగా "రెండున్నర జాములకు(2.pm) పడుకొంటివి కాఫి త్రాగి మరల పడుకొన్న మనసు కుదుటపడును, అనుచు తండ్రి ఆమెకు  కాఫీ  ఇచ్చి   సింహాచలం  మరణవార్త  తెలిపెను. రాత్రి స్వప్నము నేటి సత్యమని గ్రక్కున నమ్మజాలకుండెను. సింహాచలం హత్యోదంతం దూరదర్శన పేటికయందు గాంచువరకూ  స్వప్న, సత్య శంకల నడుమంబడి విదిష డెందము దండసిల్లిననూ(stuck) తత్తరపాటును వీడినామె హృదయము మెల్లన ఉల్లసిల్లె.  అంతలో ఆమెకు ఏదో తెలియని స్పృహ కలిగి  పాదముల క్రింద  భూకంప పానుభూతినిబొందెను. అవ్యక్త భావములు ముప్పిరిగొనుచుండ విదిష, తల్లి చిత్రపటము కడ మోకరిల్లెను.


ఒకప్రక్క చిరుఎండ క్రమక్రమముగా పెరుగుచు  కండ్లను చెదరఁజేయు చుండగా , మరొక ప్రక్క  విగత శాసనసభ సభ్యుని  ఇంటిముంగిట జనవాహిని పెరుగుచుండెను. "తమ ప్రియతమ నాయకుని కడసారి జూచుటకు తరలివచ్చిన జన సంద్రమును చూడండి " యనుచూ ఛాయాగ్రహణములో నిమగ్నమై  కొందరు దృశ్య మాధ్యమ పాత్రికేయులు అటునిటు తిరుగుచూ   అశ్రునయనాలతో ఉన్న కొద్దిమంది బంధు మిత్రులనే పదే పదే  జూపుచుండిరి.  మరికొందరు పాత్రికేయులు " ఆ ప్రజలనోదార్చుట కెవరు గలరు ?  వారికెవరు దిక్కు?" యని అనుచిత పద ప్రయోగమును జేయుచు భాషా కౌసల్య ప్రదర్శనమున పవిత్రభావములను మలిన పరుచుచూ రోతకల్గించుచుండిరి. 

"జన నాయకుని పార్థివ దేహమును సందర్శించుటకు అశేష జనవాహిని ఎట్లు తరలి వచ్చుచున్నదో చూడుడు యని ఒకడు వ్యాఖానించు చుండ ఒక సందర్శకునికి సెగలరేగి " కూలివాని మృతదేహమును  శవమని , ధనవంతుని  మృతదేహమును భౌతిక కాయమని అందురు , పేరు ప్రఖ్యాతులున్నచో  పార్థివదేహమందురు." యనుచూ పాత్రికేయుల దౌష్ట్యమును తూర్పారబట్టెను. చొక్కా పంట్లాముతో నున్న చక్కని చుక్క యొక్కతి కురచ శిరోజాలను మాటకు  ముమ్మారు సవరించుకొనుచూ " సబ్బవరం మూగబోయింది " యని మొదలుపెట్టగా ఊరపండగలో  నాట్యము జేసి  చిల్లర ఏరుకొను శవ నర్తకులు సైతము ఛీ ఛీ యనుచు మొఖం చిట్లించిరి. అతడ్ని దుర్మార్గుడు గర్హించు వారేగానీ అయ్యో పాపమనువారే కరువాయిరి, కొద్దిమంది లబ్దిదారులు మాత్రమతడిని లబ్దప్రతిష్ఠుడని కొనియాడిరి. 

పాడి పైకి లేచెను, పెద్దరోదనలు కలకలం వినవచ్చెను, శవయాత్ర మొదలయ్యెను పెళ్ళుమని ఎండకాయుచుండెను భానుని రౌద్రము మింటిన చండ్ర నిప్పు ను తలపించుచుండ "శవయాత్ర” సాగుచున్నది. నాగిరెడ్డి భుజముపై పాడెనొకవైపు మోయుచుండెను. ఊరంతా కోలాహలంగా ఉంది. డప్పుల మోత, ఈలలు, కేకలు, అరుపుల మధ్య  తరలిపోతున్న శవాన్ని దుకాణదారులు తమ దుకాణాలవద్దే నించుని ఇది మామూలే అన్నట్లుగా అటువైపు చూస్తున్నారు.  

శవం ముందు ముగ్గురు నాట్యం చేయుచుండిరి. వారు బిచ్చగాండ్లు, డప్పు వాళ్ళు. తాగిన మైకం తప్ప వారియందే భావానా కానరాకుండెను.  వారికి కొంచము దూరముగా పిచ్చి పట్టినట్టు  పూనకం వచ్చినట్టు ఒక యువతి నాట్యం చేయుచున్నది . కాళ్లకు చెప్పులు లేక, చింపిరి జుట్టుతో , నలిగిన బట్టలతో నున్న ఆమె వంటిమీద ఒక పురుష హస్తం సుతారముగ వాలెను " విదిషా  పద ఇంటికి పోయెదము”నన్న భారతవర్ష చెంప చెళ్లుమ నెను. మిఠాయి లాగుకొనగా చిన్నప్పుడామె కొట్టిన దెబ్బ గుర్తుకువచ్చెను "ఆమె ఇప్పుడు విదిష కాదు శాంభవి , రుద్రకాళి , మహిషాసురమర్ధిని.    ఆమె  హృదయంలో ఉరుములు మెరుపుల ఘర్షణ తో కూడిన వర్షం కురియుచుండెను. అందులో ఆమె తడిసి ముద్ద యగుచున్నది. ఆమె చెవులలో....

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే 
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే 
భగవతి హేశితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే 
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మారు మ్రోగుచున్నది. వర్షకు ఆమె లయలో రుద్రుడి జటాజూటం నుండి వెలువడిన  ప్రమథగణాల తాండవం కనిపించెను. ఆమె ఉన్మత్త నాట్యవేశము చూపరులకు భీతిగొల్పుచుండెను, ఆమె ఏక్షణమునైన తూలిపడునట్టుగా కనిపించెను. భారతవర్ష ఆమెతో శృతి కలిపి నాట్యం చేయనారంభించెను. విదిష ఇల్లు కొద్దిదూరంలో ఉందనగా ఆమెలో శక్తి పూర్తిగా అడుగంటినది అచేతనంగా భారతవర్ష చేతుల్లోకి ఒరిగిపోయినది. పవిత్ర పూర్ణకుంభన్నిదేవళమునకు కొనిపోవు భక్తునివలె  ఆ నవయవ్వన కోమలాంగిని తన రెండు చేతులపై పరుండబెట్టుకొని ఇంటిలోకి కొనిపోయి తల్పంపై పరుండబెట్టి వర్షుడుఆమె ప్రక్కనే కూర్చొనెను.  

శేషాచలం గారు తన్మయత్వ మునంతయూ చూచుచుండిరి. రుద్రభూమికి దారి వారి ఇంటి ప్రక్కనుండి పోవుటవల్ల శవ యాత్ర వారికనులముందునుండే సాగుచుండెను. డప్పులు ఎడతెగక మ్రోగుచుండెను.  మోత అడిగిన పిదప ” ఏజన్మ బంధమో మీది అనేక మంది మిత్రులున్ననూ ఎవ్వరునూ ఆమె కష్టములొ తోడునిలవలేకపోయినారు.” యనుచు వర్ష చేతులని తన చేతులలోకి తీసుకొని అతడి కన్నులందు దృష్టి నిలిపి కృతజ్ఞతా పూర్వకముగా చూచుచుండిరి  

భారతవర్ష  నిజమే అయ్యి ఉండవచ్చు. కొన్ని బంధాలు మనకి తెలియకనే అనేక జన్మలు కొనసాగును. శక్తి ఉన్నవారికి పూర్వ జన్మల గూర్చి   తెలియును. అని వర్షుడనగా,  శేషాచలంగారు " పూర్వజన్మ లుండుట నిజమేనా ?" అని అడిగినారు.  " కొంతమందికి ఈ ప్రశ్న  ఆశక్తి కరముగా నుండును.  మరికొంత మందికి హాస్యాస్పదంగా నుండును.  వారికి ఇట్టి విషయములు వినుటకు కూడా ఇష్టముండదు" ని జెప్పి   వర్షుడు శ్రీకృష్ణుని కథ చెప్పసాగెను   “తథా సత్యం గతం జ్ఞానం యస్య, శ్రీకృష్ణుని చరితంలో ఎన్నోలీలలు కనిపించును. బాల్యంనుండి తన అవతార విశేషాలు తెలుపుతూనే ఉన్నాడు. పండితులు పురాణేతిహాసాలనూ,వేదాలను, శృతులను పరిశోధించి గోపికల పూర్వజన్మ ఏమిటో, వారంతా కృష్ణభగవానుడికి  చేరువ ఎలా అవ్వ గలిగారో వివరించి యుండిరి. సృతులలో గోపికల ప్రస్తావనను పరిశీలించినచో  గోపికలు, ఎంతగొప్పవారో దెలియును.

ఈ గోపికలలో దుర్వాసమహర్షి, ఉగ్రతపుడు, సత్యతపుడు, హరిధాముడు ,జాబాలి, సుచివ్రతుడు వంటి పలువురు తపోధనులు గలరు. వీరిలో కొందరు కృష్ణుని భార్యలుగా అవతరించిరి. దుర్వాసమహర్షి సత్యభామగా, సత్యతపుడు సుభద్రాగా, హరిధాముడు అనే తపస్వి సారంగుడు అనే  వాని ఇంట రంగవేణి పేరున జన్మించి శ్రీకృష్ణుని చేరువయ్యారు. జాబాలి మహర్షి చిత్రాంగధగా, అలాగే సుచివ్రతుడు, సుపర్ణుడు కూడా గోపికగా జన్మించి భగవానునికి చేరువయ్యిరి. ఉగ్రతపుడు సునందుడు అనే గోపాలనుని ఇంట సునందాదేవి పేరున జన్మించి కృష్ణుని చేరువై తన జీవితమును సార్ధకము జేసుకొనెను. కలియుగమున గతజన్మల జ్ఞానముండుట దుర్లభమైపోయినది కదా, మనకెట్లు తెలియును? యని ఆపి  తల్పం ప్రక్కనే యున్న చిత్రమును గాంచెను. మిషెల్ బొమ్మ మహిషాసుర మర్ధిని రూపమున  చిత్రించబడి యున్నది. భారతవర్ష తదేకంగా జీవకళ ఉట్టిపడు ఆ చిత్రమువంక చూచుచుండెను. శేషాచలముగారి ముఖమున చిరునవ్వు తొంగిచూచెను. 

Monday, August 24, 2020

Bharatavarsha -27

శేషాచలం గారు ఉపాంత్ర శస్త్రచికిత్సానంతరం(appendectomy)మూడు రోజులాసుపత్రిలో ఉండవలసి యున్ననూ రెండురోజులు మాత్రమే యుండి  మూడవరోజు భార్యకారోగ్యము సరిగా లేదని జెప్పగా ఇంటికి  వచ్చి విషయము దెలుసుకొని కుప్పకూలినారు. దుఃఖమునంతటినీ దిగమింగుచూ అంతిమ సంస్కారాలను యధావిధిగా జరిపించినారు. భారతవర్ష   అంతిమయాత్ర నందు పాల్గొనగా  మాలిని మంజూషలు విదిషనోదార్చ ప్రయత్నించుచుండిరి. బసవడు సిద్దాంతిగారు కూడా వచ్చి విదిషను పరామర్శించిరి. దు:ఖభారాన్ని తగ్గింపబూని సిద్దాంతిగారు పురాణ ఇతిహాసాదులనుండి జీవితమింతేనని తెలుపు గాథలను, జీవితసత్యాలను బోధపరిచిరి అయిననూ ఆమె శాఖలువాఱు  శోఖప్రేషమున   తిండి తినక చినిగిన చేటవలె నగుపించుచుండెను. ఎవరైనా యున్నచో    పెల్లుబికి వచ్చు అశ్రు  ప్రవాహమును బిగబెట్టుకుని, నిలువుగుడ్లు బడి చేష్టలుడిగి చేటపెయ్యవలె  యుండి  ఏకాంతమున పెట్టునేడ్చుచుండెను. ఇదంతయు శేషాచలంగారిని కలిచివేయుచున్ననూ అతడు దిట్టగుండె గలవాడగుటచే నిగ్రహించుకొనుచూ విదిషనోదార్చుచుండెను. 

బైరెడ్డిపై భారతవర్ష పోలీసులకు పిర్యాదు జేసిననూ బైరెడ్డి వారికి చిక్కక తప్పించుకు తిరుగుచుండెను. భారతవర్ష పోలీసుపెద్దదికారులతో మాట్లాడిన జోరు చూసి నేరస్తుని అన్వేషణకు ఆదేశములు జారీ జేసినప్పటికీనూ బైరెడ్డి పరారీ లోనుండుటచే పోలీసులు మిన్నకుండిరి. మంజూష స్నేహితులు వారి తల్లిదండ్రులు బైర్రెడ్డి  విషయమై పోలీసులను సంప్రదించుచుండిరి. బైరెడ్డి అన్ననాగిరెడ్డి  నక్కజిత్తులున్నూ రాజకీయపలుకుబడి నుపయోగించి ఒక వారము క్రితమే బైరెడ్డి కర్ణాటక రాష్ట్రమందలి  హసను కుబోయి యుండెనని  సాక్ష్యమును జూపుచూ  బైరెడ్డి అసలీ రాష్ట్రములోని లేడని పోలీసులను అవ్యవస్థిత బరుచుటతో వ్యవహారము కకపికలగు నేమోయని మహిళా  బృందములు  దిగులుకొనుచుండ  భారతవర్ష రంగములోకి దిగి పోలీసు దుస్తులలో  స్థానికులను  విచారించి కూపీలాగుచుండగా మరీదు కనిపించెను “ ఇచ్చటేల యుంటివోయి? ఏదైనా పనిచేయుచున్నావా?"యని అడుగగా “పని చేయకున్నా నాకు గడుచుటెట్లు, సహకారరంగమున చేయుచున్నాను.” యని మరీదు జెప్పను. 

ఒక క్షణమాలోచించి నేరుగా అడుగుటకు నిర్ణయించుకొని “మరీదు నీ మంచి గుణము నాకు దెలియును అతివృష్టి వలె ఎంతకురిసిననూ తాత్కాలికమే నీవంటి మంచివానికి కష్టములు తాత్కాలికమే.యని ప్రారంభించి తదుపరి బైరెడ్డి ఛాయాచిత్రమును చూపి అతడు చేసిన ఘోరమును దెలిపి  "యితడు నీకు తెలియునా?" యని అడిగెను. మరీదు జరిగిన కథంతయూ, చలన చిత్రమును చూచుట, కోటిగాడిని కలుసుట అంతయూ చెప్పెను.   నాడు వారు చూచినది విడుదల చిత్రము పాత్రికేయులను సంప్రదించిన ఛాయాచిత్రములేమైననూ దొరకవచ్చని భావించి హర్ష పాత్రికేయుడు మారయ్యగారిని సంప్రదించగా మారయ్యగా రొక గంటాగి దూరవాణి యందు “నాలుగు ఛాయా చిత్రములున్న”వని తెలపగా వారిని కలిసి యా ఛాయాచిత్రములను నేత్రములు గుడ్లగూబలవలె విశాలమొనర్చి పరిశీలించి జూచెను. అందు బైరెడ్డి కానరాకుండెను.  సూర్యుడు పడమట క్రుంగుచుండ చీకటిలలుముచుండెను ,  నైరాశ్యమలుము  చుండ వర్షుడు కుంగుచూ ఇంటిముఖంపట్టెను.  

                                                                    ***

రాధామనోహరము నేడు కళావిహీనంగా తోచుచున్నది. యింటనెవ్వరూ లేక ఇల్లు వంటరిదైనది. మాలినిగారు, మంజూష, కేశవుడు కానరాక  మనసు బోరుమనుచుండగా బాల్య స్నేహితురాలు విదిష విషణ్ణ వదనము స్మృతి పథమున మెదులుచుండ మానిపుక్కిటిపులుఁగు హృదయమును గొట్టుచున్నట్లుండగా  వీణా వాదనము జేయుచూ  బాధాతప్త డెందమునకు సంగీత లేపనమును పసమనమును కలిగించుచూ అట్లే  వీణపై పడి నిద్రించెను. కొంతసేపటికి ఎవ్వరో తట్టిలేపుచున్నట్లనిపించి కనులు తెరచి చూచెను అన్నము తినమని తల్లిగారు చెప్పుచున్నట్లనిపించి లేచి చుటూ చూసిననూ ఎవ్వరూ కానరాకుండిరి. బైటకు పోయి చూడగా తల్లి చెల్లి వచ్చుచు కనిపించిరి  " కేశవుడేడి ఎచ్చటకు బోయినాడని వారినడిగెను.  కేశవుడి అక్క ( చారుమతిగారి కూతురు ) మంచము  పట్టెనని కబురు తెలిసెనని కేశవుని బస్సెక్కించి వచ్చుచున్నామని చెప్పిరి. హతవిధీ కష్టములన్నియూ కట్టకట్టుకొనిరావలెనా.అని భారతవర్ష అనగా "ఇదంతయూ  ఏమి అరిష్టమునకు దారితీయునో?" యని మాలినిగారు వాపోయినారు. భోజనములు చేయుచూ  "మనముఁబోయినచో పోలీసులు హడావిడి చేయుచున్నారు తప్ప బైరెడ్డి వ్యవహారము  ఎచ్చట వేసిన గొంగళి అచ్చటనే యున్న"దని మంజూష అనెను. బలమైన సాక్ష్యమున్నాకానీ  పోలీసులేమియునూ చేయజాలరు.అని మాలినిగారు అనుచుండగా "  సాక్ష్యములను తారుమారు చేయగల సమర్థులు వారు సాక్ష్యమున్న ప్రయోజనమేమి యని మంజూష అనెను. వారట్లు మాట్లాడుకొనుచుండగా వర్షుడి మనసున ఒక ఆలోచన తళుక్కు మనెను. అతడు ముఖపుస్తకమున విడుదల చిత్ర వర్ధమాన కథానాయకుని అభిమాన సంఘములవారి కొరకు దేవులాడుచుండెను. నిశరాత్రి....ఒక అభిమాని తన మిత్రులతో గూడి ఆ సబ్బవరం చిత్రమందిరము ముంగిట గ్రహించిన ఛాయాచిత్రమును కనుగొనెను అందు బైరెడ్డి సుస్పష్టముగా కనిపించుచుండ మేఘమండల మదురునట్టు ఆత్మధన్యనాదము జేసి పిమ్మట నాలుక కరుచుకొనెను. 

                                                                  ***

అర్ధరాతి  విదిషకు చిత్తవికారముచే తనతల్లి చావుకు కారకుడైన  బైరెడ్డి , వాడి అన్న నాగిరెడ్డి , ఎం ఎల్ ఏ సింహాచలం దివిటీలు చేతబూని భూతప్రేత పిశాచములవలె తనను చుట్టుముట్టి వలయాకృతిన రాక్షసతాండవము చేయు  దృశ్యము చాక్షుషప్రత్యక్షమైనది. ఆమె అంతర్జ్వలన కీలలందు ఎంతకాలిననూ గుండెబాధ  గండశిలవలె కరుగకుండెను. ఆమె అట్లే అధోలోకము నందలసి సొలసి నిద్రించెను.

                                                                  ***

మిషేల్కు నిజము దెలిసిపోయినది.   పాఠశాల భూవివాదమంతయూ    బూటకమని ఆదంతయూ  ఎం ఎల్ ఏ తనని వశపరుచుకొనుటకు పన్నిన జాలమని తెలిసి మొఖం ఎర్రబార  తనకు జేసినా మోసముతోపాటు తనఇంటనే తనతో కామక్రీడలాడుచున్న  కామ పిశాచమును తలుచుకొని హృదయము రగులుచుండ తల్లితండ్రులకు కలిగిన క్షోభ అవమానమునకు తుదిపలుకు చెప్పుటకు నిర్ణయించుకొని  ఎం ఎల్ ఏ రాకకోరకు ఎదురు చూచుచూ " ప్రతిరోజూ నేను పులి నువ్వు  జింక " యనుచు ఇచ్చము వచ్చిన రీతిన   నన్ను అనుభవించెడివాడవు కానీ నేడు నేను పులి నీవు జింక " యని గట్టిగా జెప్పుకుని. “ఆ మృగము వచ్చిన మేడపైకి పంపవలెనని  తల్లితో జెప్పి    మేడమీద గదిలో ఎదురుచూచు చుండెను. " పులి వచ్చింది , జింక ఎక్కడ ?" యనుచు లోపలికాడుగిడుచున్న కామరోగిని మానవ మృగమును ఛాతిలోనొక్క పోటుతో అంతమొందించెను. పూర్తిగా శ్వాస నిలుచువరకూ వేచియుండి శవమును ఠాణాకు ఈడ్చుకొనిపోయి నేరమునఁగీకరించి  మిషేల్  లొంగిపోయెను.   

                                                                   ***

మరునాడు విదిష ఆలస్యముగా నిద్ర లేచెను. ఇదంతయూ కలా? నిజమయిన ఎంత బాగుండునని  అనుకొనుచుండగా "రెండున్నర జాములకు(2.pm) పడుకొంటివి కాఫి త్రాగి మరల పడుకొన్న మనసు కుదుటపడును, అనుచు తండ్రి ఆమెకు  కాఫీ  ఇచ్చి   సింహాచలం  మరణవార్త  తెలిపెను. రాత్రి స్వప్నము నేటి సత్యమని గ్రక్కున నమ్మజాలకుండెను. సింహాచలం హత్యోదంతం దూరదర్శన పేటికయందు  గాంచువరకూ  స్వప్న, సత్య శంకల నడుమంబడి విదిష డెందము దండసిల్లిననూ(stuck) తత్తరపాటును వీడినామె హృదయము మెల్లన ఉల్లసిల్లె.  అంతలో ఆమెకు ఏదో తెలియని స్పృహ కలిగి  పాదముల క్రింద  భూకంప పానుభూతినిబొందెను. అవ్యక్త భావములు ముప్పిరిగొనుచుండ  విదిష తల్లి చిత్రపటము కడ  మోకరిల్లెను.                              


Saturday, August 22, 2020

Bharatavarsha 26

 సబ్బవరమున అపరాహ్ణము అంజిష్ఠుని తీక్షణ వేండ్రము ఎండకారును తలపించుచున్నది.  ప్రార్ధనలు ముగిసి అనేక మంది స్త్రీ లు చర్చి నుండి  గుంపులు గుంపులుగా ఇండ్లకుబోవుచుండిరి. ఆందొకిద్దరు యువకులు జంబూవృక్షముక్రిందనిలిచి పోవువారిని చూచుచుండిరి. “ఈ తాపమును జూచి శీతాకాలమని ఎవ్వడు ననుకొనజాలడు” అనుచూ అచ్చట నున్న ఒక రాతిపై చతుకుపడెను. అట్లయిన ఈ చెట్టుకింద చాతక పక్షులవలె వేళ్ళాడుటెందులకు మనమును బోయెదమని, ఒకడు సంసిద్దుడగుచుండగా రెండవ వాడు వానిని వారించి  “ఆ పోవుచున్న కన్నెపిల్లలు  నడుములు జూడుము ఆహా! ఎంత వయ్యారంగా నున్నవోకదా.”అనెను అంతట రెండవవాడు “నీకు పైత్యము ముదిరినదనిపించుచున్నది. అందు కన్నెపిల్లలెవ్వరునూలేరు. అందరూ వివాహితులువలె కనిపించుచున్నారు” అనెను. 

                               

బోవువారిలో అధికులు ఆ  జంబూవృక్షము క్రిందనున్న వారిని జూచి అందొకనికి హస్తార్పణము గావించుచుండిరి. "బైరి, నీకింత పలుకుబడి యున్నదని నాకు దెలియదు. ఎం ఎల్ ఏ గా పోటీ చేసించో తప్పక నెగ్గెద వనిపించుచున్నది నీవిక విదిష కై కలవరించుటాపి  ప్రజాదరణ చూరగొను పనులు జేసిన మంచిద”నెను."  ఓరీ! సందీ, తాతకు దగ్గులు నేర్పుచున్నావా?” నాకాసంగతి దెలియును రాజకీయములు మాకుటుంబమునకు వెన్నతోపెట్టిన విద్య ఒక్క రెండు నిమిషమూలాగిన విదిషఇటుగా పోవును. దానిని చూచి జూచి తనివి తీర్చుకొని కోడి పలావు తిని బోయెదము” యనగా సందీపునకు అరికాలిమంట నెత్తికెక్కెను. రౌడీవంశము రాజకీయవంశమెట్లయినదని అడగవలెనని అనుకొన్ననూ కోడిపలావు గుర్తుకొచ్చి నోరూరుటచే “ ఇంతమందిని  చూచిన తీరని తనివి ఆమెను జూచిన ఎట్లు తీరునని మాత్రము అనెను. బైరి "నీవే చెప్పితివి కదా చాతక పక్షులమని అందుకే  చాతకజీమూతన్యాయం (చాతకపక్షికి నీరు అంతటా దొరికినా దానిదప్పిక మేఘంనుండి పడ్డ నీటిబిందువుల చేతనే కాని తీరదు) వర్తించు”నని చతురోక్తి రువ్వెను. 

ఇంతలో విదిష అటుబోవుచూ కనిపించెను “కన్నులు జూచిన కలువలు సిగ్గుపడును నడకలు జూచిన హంసలు సిగ్గుపడును” అనుచూ ఆమె సమీపమునకిపోయి ఆమెకు వినిపించునట్లు అనెను. “కానీ నీవు మాత్రము సిగ్గుపడకున్నావు భీతి యనునది లేకపోయె, మొన్న జరిగిన శృంగ భంగము చాలినట్లు కనబడదు. ఆమె నన్ను కూడా చూచినది” నేను బోయివత్తునని సందీపుడు కదులుచుండగా. “బిడాలము వలె బెంబేలెత్తుచున్నావు  సింగమువలె జీవించనేర్చుకొనుమ”ని బైరెడ్డి జెప్పుచుండగా  “వెరవరిగాక వీఁడు కురువీరులకుం బొడసూపువాఁడె…” అని గానము చేయుచూ ప్రవేశించిన వేరొక యువకుడు “కోట్లవిలువైన మాటను జెప్పినారు రెడ్డిగారు బాగుంటిరా” యనుచు ముకుళిత హస్తములతో నొకడు వారిని సమీపించి “మీరునిక్కముగ సింగమే” యనుచు కావలించుకొనెను. 

మీరెవరు ఏమిచేయుచుందురని సందీపుడడుగగా, “నాపేరు మరీదు, నేను కృషీవలుడను “అనగా రైతన్నమాట యని బైరెడ్డి సంబరపడెను , మీరెట్లనుకొన్ననూ  మంచిదే యనుచూ మరీదు జారు కొనెను. కొలది సమయము లోనే బైరెడ్డి జేబులోనున్న సొమ్ము పోయినట్లు గ్రహించెను. ఇంకేమి కోడిపలావు యని సందీపుడ నుచుండగా హోటల్కు కొనిపోయి వలసినంత తినుము ఇచ్ఛట  నన్ను పైకమడుగు వాడెవ్వడూనూ లేడు యని తిని  ఖాతాలో వ్రాసుకొమ్మని వెడలి వచ్చెను. "బైరెడ్డి నీకు అది దొరకదు నామాట విని దానిని మరచిపొమ్ము ఇదియే నేను  నీకు చెప్పగల మంచిమాట" యని సందీపుడనగా " అయినచో నేను చేయవలసినది జేసెదను" యని బైరెడ్డి ముగించెను. ఆదివారము ఇంటికిబోయి ఏమిజేతువని బైరెడ్డి అనెను. పిమ్మట వారిద్దరూ మధ్యానపు ఆటకు బోయిరి.  

అయ్యారే కోటిగా ! బహుకాల దర్శనము ఎట్లుంటివి ? యని రెడ్డి అడుగగా "  మూడు మాసములు కారాగృహము నందుండి వచ్చుచున్నాను" అని బదులు పలికెను.  అచ్చట మొదటి ఆటకు పెద్దక్యూ ఉండగా  కృషీవలుడచ్చట కనిపించెను. ఏరోయ్ మరీదు బాగుంటివా? యని కోటి వానిని ప్రేమగా పలకరించెను.  సందీపునకు భవిష్యత్తు ఒక్కసారి కళ్ళముందు కనబడగా మెల్లగా జారుకొనెను. కోటి పానశాలకు పోయెదమనగా బైరి సరేయనెను. బైరి త్రాగుచు తన వేదననంతా కోటి కి నివేదించగా " నేనొక ఉపాయము చెప్పెదను మరి నాకునూ వాటా ఇత్తువా? యనెను. "సరే ననగా కోటి " విదిష తండ్రి ఆసుపత్రిలో నుండుటచేత తండ్రికి భోజనము నిత్యమూ తీసుకొని పోవుచున్నది. 8. 00 గంటలకు కాపు కాచిన తప్పక దొరుకును. యని   తన ఉపాయమును రహస్యముగా చెవిలో చెప్పెను. 

బైరెడ్డికి కళ్ళు బైరులు గ్రమ్మెను. అద్దెకు వాహనమును రప్పించ మందువా యని బైరెడ్డి అడుగగా సొంత కారు ఉండి తీరవలెనని కోటి  చెప్పగా తన అన్న వాహనమును  తెప్పించెను. క్రమముగా చీకటి అలుముకొనగా రహదారిపై  వాహనములు పలుచబడెను. కోటి, రెడ్డి  వాహనంలో కూరోని వేచుచుండిరి. కొద్ది సేపటి తరువాత వారి కళ్ళు చీకట్లో నొక్కసారిగా మెరిసినవి. వారి ముఖముల జింకపిల్లను చూచిన పులి కళ కనిపించెను. గ్రెద్ద కోడిపిల్లను తన్నుకుపోయినట్లు విదిషను వారు వాహనంలోకి లాగి , ముందుకు పోనిచ్చిరి. 

రాత్రి పది గంటలు అయ్యెను విదిష ఎందుకు రాలేదో యని అహల్యగారు కంగారు పడుచుండగా వాన మొదలయ్యెను.ఇంతలో గోమాత అరుపు వినిపించెను.  తన ఆందోళనను ఆకాశము, గోమాత అర్ధము జేసుకొని శృతి కలిపినట్లనిపించెను. ఆమె తడుచుచున్న గోమాతను కట్టువిప్పితీసుకుపోయి కొత్తగా కట్టిన శాలలో కట్టివేసి   లోపలకు వచ్చి కిటికీవద్ద నిలబడి విదిషకొరకు ఎదురు తెన్నెలు చూచు చుండెను. 10.00 గంటలు కావచ్చుచుండగా విదిష ఇంటికి వచ్చెను. తల్లి వద్ద బోరున విలపించి ఇంక ఇక్కడ ఉండుట అనవసరము వేరే చోటకి బోవుట ఉత్తమము. అని బైరెడ్డి తనను ఎత్తుకుపోయి నిర్మాణములో నున్న 5 అంతస్తుల భవనమునందు భంగపరుచుటకు ప్రయత్నించగా తప్పించుకొని , ఒకొక్క అంతస్తు నందు నక్కి యుండి,  గుండెలు తల్లడిల్లుచుండ ఒక అంతస్తునుండి వేరొక అంతస్థు కు మారుచూ  చివరకు మిద్దెపైనున్న నీటి తొట్టెనందుదాగి వారి వాహనము వెడలుట మిద్దె పైనుండి చూచి  తరువాతవచ్చితినని చెప్పెను.

నిశరాత్రి సమయము 12 గంటలు సమీపించుచుండ గోమాత  పెద్ద పెట్టున అరచుచుండెను. గోశాల మంటలలో చిక్కుకొనెను. ఎంత సమయమునుండి ఈ దహనము జరుగుచున్నదో శాలకప్పు అంతయూ ముట్టుకొనెను.  అయ్యో గోమాత అందు చిక్కుకొనెను అనుచూ పోవుచున్న విదిషను వారించి అహల్యగారు పరుగుపరుగునపోయి గోమాత కట్టలు విప్పివేసిరి. అంతట కాలిన శాలదూలము కట్టు తెగి ఆమె పైబడగా విదిష లోపలి వెళ్ళుటకు ప్రయత్నించగా మండుచున్న చూరు భాగమంతయూ నేలరాలెను. అమ్మా అమ్మా యని అరచుచూ విదిష నిర్వేదమునచ్చట కుప్పకూలెను. 

గోశాల చుట్టూ  ఇటుక కట్టుబడి యుండుటచే వీరు అందు నిద్రించు చుండుట ఎవరో  గ్రహించిరి. ఇది బైరెడ్డి పనే అయినప్పటికీ వాడికి ఎవరో సహకరించనిచో వాడొక్కడూ ఈ పని చేయజాలడు అని మరుసటిదినమున పోగయిన ప్రజలు అనుకొనుచుండిరి. భారతవర్ష మంజూష మాలినిగారు తరలివచ్చి విదిషనోదార్చిరి. “అయ్యో ! గోమాతను రక్షించి అహల్యగారు అసువులు బాసినారు.” అనుచూ ఇరుగుపొరుగు తరలివెళ్ళినారు. 

 

Friday, August 21, 2020

Bharatavarsha -25

ప్రొద్దుపొడుపున తూరుపు కనుమల నావరించిన నీహారము(దట్టమైన పొగమంచు) ప్రాచ్యోదధి వరకు ప్రాకి విశాఖపట్టణ కంఠమందు మణిహారమై మెరియుచుండ శిశిరఋతువు వన్నెలుచిన్నెలన్ని వరమాల చేసి రమ్ము రమ్ము ననుగొనిపొమ్ము ఈఅదను వ్యర్ధంబైన రాదెన్నడున్ యని ఘోషిల్లి వైశాఖఱేడును పరిణయమాడు చున్నట్లున్నది. మంచుతుంపర జిగిముత్యాలవలె కురియుచుండ, వధూ వరులకవి అక్షింతలువలె, పూలరేకులవలె నొప్పుచుండెను.  వైశాఖ శిశిర రాణిల వివాహసంబరము నంబరము నుండి ఎండఱేడు మందహాసపూరితుఁడై తిలకించు చున్నట్లున్నది.

ధూమిక(పొగమంచు)అలిమిన సాగరతీరము వెంబడి నావవలె తేలియాడుచున్న ఎర్తిగా వాహనమందు జాజ్ సంగీతరాణి ఎల్లా మధురస్వర పుష్పరసాహ్వయము నోలలాడుచున్న అగస్త్య, బసవ, సందీప మిత్రత్రయమునకు - గవాక్షం నుండి ప్రాచ్యోదధి మహా ముకురమువలె నగుపించెను. తీరరేఖ వెంబడి రివ్వున సాగుచున్న వాహనము, విహంగావ లోకనమున, పిపీలకమువలె నగుపించుచుండ, వాహనమునున్నవారి కొకచెంప ఉద్యానవనములు వేరొకచెంప ప్రజ్ఞాశాలుల విగ్రహములు వాహనగతినందు క్రమక్రమముగ అవగతమగుచుండెను. ఉల్లము నవనవోన్మేషమ (increasing delight) గుచుండ వారు చక్కర కణము చిక్కిన చీమలవలె చెలరేగుచుండిరి. 

ఏమి ఈ అగస్త్యుని జోరు ఈ విలాస వాహనమునద్దెకు దీసుకొని మమ్మందరిని ఉత్సాహ పరుచుచున్నాడు. అని సాందీపుడనగా “ఎంతడిగిననూ విషయము జెప్పకున్నాడు ఇంకెతమాత్రము నేనోర్వజాలను ఈ సంబరములకు కారణమేదో చెప్పుము” అని బసవడు గట్టిగా అడుగ అగస్త్య వాహనమును నిలపమనెను.  చోదకుడు వాహనమును నిలిపెను. ఏమిరా! నీ దౌష్ట్యము! కారణమడిగిన వాహనము దిగమందువా యని బసవడు ఎగ్గుగొనెను. ఇంతలో విరామ కేంద్రమువద్ద  వేచియున్న రాఘవ వాహనంలోకి ప్రవేశించెను.  అప్రాచ్యుడు సమయపాలకుడే. అని అగస్త్య అనుచుండగా ఎవరిని అప్రాచ్యుడు అనుచున్నారు అంతపెద్దతిట్టు ఎట్లు తిట్టినారు?”  అనుచూ రాఘవుడు కోపగించుచుండ బసవడు పడిపడి నవ్వుచూ " అప్రాచ్యుడనిన తిట్టుగాదే , ప్రాచ్యము అనిన తూరుపు యని అర్ధము, బె ఆఫ్ బెంగాల్ అని ఆంగ్లేయులు దీనికి నామకరణము జేయక పూర్వము దీనినే ప్రాచ్యోదధి లేదా తూర్పు సముద్రము అనెడువారు. అప్రాచ్యుడనగా పశ్చిమదేశమువాడు, ప్రాచ్యుడుగాని వానినప్రాచ్యుడు అనిన తప్పులేదు.  అయిననూ ఇచ్చట నీకంటే అప్రాచ్యుడెవడు కలడు అమెరికాబోయి వచ్చినావు, మరలబోవుచున్నావు." యని బసవడు ఎకసెక్కెమాడెను.

అంత సాందీపుడాగ్రహించి ఓరీ బసవా! జల్పములాడుచు కాలయాపన జేయుచున్నావు, అగస్త్యుని జూడుము అసలు విషయము మరచి మనము వాదులాడుకొనుటచూచి ఎట్లు ముసి ముసి నవ్వులు నవ్వుచున్నాడో. అనగా బసవడు “ఓరీ అల్పబుద్ధి! మమ్ము తప్పించుకొనవలెనని పన్నాగము పన్నినావా యనుచు అగస్త్యేని పై బడి పిడిగుద్దులు గుద్దుచుండ అగస్త్యుడు నోరువిప్పెను. 

మా తండ్రిగారు నాకు ఒక లక్ష రూప్యములనిచ్చినారు. నేనొక అద్భుతము నావిష్కరించ బోవుచున్నాను యని ముదమున జెప్పెను. అంతడబ్బుతో నేమిచేయబోవుచున్నావు యని అందరు ఉత్సుకతతో యడుగగా వారికి, చేతులో లకుమ చిత్రము.. అగస్త్య మౌనము కానవచ్చెను. అతడి నిశ్శబ్దతూటాకి అందరు అదిరిపడి అవాక్కయ్యిరి. భారతవర్షను ఉద్యోగమునుండి తొలగించినారు. యని జెప్పి రెండవ తూటాపేల్చినాడు. అందరు మొగమొగములు జాసుకొనిరి. ఇంతలో వాహనము జంతుప్రదర్శనశాల వద్దకుచేరి నిలిచెను. అగస్త్యుడు వాహనమునున్న శీతలపానీయ సీసా గయకొని వాహనము దిగి చోదకునకు "వేచి యుండు"మని చెప్పి అగస్త్య ఎదుటనున్న కంబాలకొండ అడవిలోనికి బోయెను. మిత్రులతని ననుసరించిరి. 

అలనాడు విజయనగర రాజులాధీనమునందున్న కంబాలకొండ విజయవాడ నగరము కంటే పెద్దదనిన విస్మయము కలుగకమానదు. ఆ సతతహరితారణ్యము గిరులతో, విరులెత్తు కొండగోగులతో, రమణించు రేలపూలతో, మేడి, చండ్ర వంటి వృక్షములతో,  మదాళించు (over grown) పొదలుతో , ఏటవాలు డొంకలతో,  పచ్చని పచ్చికతో  పలు  మృగ విహగములతో    కనువిందు జేయుచుండెను.  గిరుల మధ్య నొకసరస్సు పూలపానుపువలె నగుపించెను.  అందు కొన్ని జంటలు రాసక్రీడా తత్పరత్వమున నౌకావిహారం చేచున్నవి. వారి సల్లాపములను గాంచిన  అగస్త్యుడు  చేష్టలుడిగి చూచుచుండ అందొకడు "అగస్త్యునకు శ్వాసక్షయమగుచున్నట్లున్నది" యని పరిహాసమాడగా, అగస్త్యుడు  “ఈ అడవిన చొత్తించు జంటపక్షులు దేహంబులాహిరిగొన(మైకము) బాహ్య ప్రపంచము మసక గమ్మి సుషుప్తి (పూర్తిగా లీనమైన స్థితి) శిఖరమునకు చేరుచుందురు.” యని వ్యాఖ్యానించెను. 

ఆ మిత్రబృందము ఆ బృందావనమునందు ఒక గోగువృక్షము క్రింద కూర్చొనెను.

సుషుప్తావస్థ వర్ణన రమ్యముగా నున్నదనుచూ  రాఘవుడు  అగస్త్యునకేలనో నానాటికీ  కవితాశక్తి అధికముగుచున్నది అనగా సాందీపుడు " అవధాని సాంగత్యము వలన కావచ్చు"ననెను , " అయినచో అవధానం చేయవచ్చున'ని రాఘవుడు పరిహాసమాడెను. "భారతవర్ష ఇప్పుడేమిచేయుచున్నాడో? నీవేమైననూ ధన సహాయము జేసినచో..."యని బసవడనుచుండగా" అగస్త్యుడు  "సార్ధక నామధేయుడు, బసవడు ఎద్దువలె నాలోచించుచున్నాడు , నాడు అరుణతార వారింటికి వచ్చినప్పుడు భోజనమునకు ఇంటికి వచ్చుసరికే  కళాశాల యాజమాన్యము వారు ఉద్యోగమూ  చాలించుకొమ్మని జెప్పియుండిరి , నాడు అరుణమ్మకీ విషయము జెప్పమనగా నన్ను మందలించెను. నాడు తల్లికైననూ ఆవిషయము జెప్పలేదు, నేను ధనమిచ్చిన, దానమిచ్చిన వర్షుడు పుచ్చుకొనువాడు కాదు."  తెలుగు పండితునిగా అతని ప్రతిభను చూచి  పిలిచి ఉజ్జోగామిచ్చినారు,  అట్లే నేడు  వేరొక కళాశాలవారు పిలిచి ఆంగ్లోపన్యాసకునిగా ఇచ్చినారు. యని అగస్త్యుడు జెప్పెను.

 నాకు దెలిసి అతడికి  ఆంగ్లమున విద్యార్హత  లేదు యని రాఘవుడనగా , బసవడు  "నీ తెలివి ఇట్లుండబట్టే  నిన్నప్రాచ్యుడనుచున్నారు. పర్షియాదేశ కవివరేణ్యుడు ఒమర్ ఖయ్యాం పేర విని యుంటివా ? యని అడుగగా "  తెలియుననుచూ , అతడి వ్రాసిన   పానశాలను  కవికోకిల  దువ్వూరి రామిరెడ్డి   తెలుగులోకనువదించినారు "అని రాఘవుడనెను.  "ఒమర్ ఖయ్యాం పానశాల వ్రాసియుండలేదు ఖయ్యాం  వ్రాసిన రుబాయాలను రామిరెడ్డిగారు  తెలుగులోకనువదించి  పానశాలగా పేరిడినారు.  ఆ కవికోకిల బిరుదాంకితుడు రామిరెడ్డి గారి చదువు 8 వతరగతి మాత్రమే.

 ఒమర్ ఖయ్యాం  ఆర్ధిక పరిస్థితి  మందగించినపుడు , అతడి సహపాఠి  రాజుగారి కాప్తుడు  రాజాస్థానమున ఉద్యోగము ఇప్పించుటకు ఒమర్ ఖయ్యాం ను కొనిపోవగా , అతడు  ఉద్యోగము నందు ఆసక్తి చూపక రచనమునందాసక్తి జూపెను. అతడి పాండిత్య ప్రతిభను కాంచి రాజతడికి గౌరవవేతనమునిచ్చి రచనలు జేసుకొమ్మని పంపివేసెను. అతడి చరిత్ర బీజగణితము నందు కూడా విశేష ప్రతిభను కలిగి యుండెను గణితము స్వయముగా సిద్ధాంతములను రూపొందించుచూ ఖగోళ శాస్త్ర  పరిశోధనలో నిమగ్నుడై న అతడిని ఖగోళశాస్త్ర పరిశోధనా కేంద్రమందు పరిశీలకుడిగా నియోగించినారు.

 అతడి రుబాయాలను ఫిట్ జరాల్డ్  యను అమెరికా రచయిత ఆంగ్లా నువాదము జేయగా అందు పెక్కు లోపాములుండుటచే హరికథ పితామహుడు  బహుభాషా కోవిదుడు  ఆదిభట్ల నారాయణ దాసు గారు తనదైన శైలిలో ఆంగ్లానువాదం జేయగా  ఫిట్ జరాల్డ్  ఆ అనువాదం జూచి తన అనువాదం కంటే మెరుగుగా నున్నదని అంగీకరించెను. యని బసవడు జెప్పుచుండగా  " ఇప్పుడు పాండిత్య ప్రతిభ గూర్చి చర్చ ఎందులకు అని సాందీపుడు పలుకగా " మనము జదువము,  ఎవరైనా జదివిచెప్పిన వినువారము కూడా కాదని నిరూపించుచున్నావు అనుచూ బసవడు  అన్నిటికంటే ముఖ్యమైన విషయమొకటి జెప్పెదను వినుము. నాసావారు చంద్రునియందొక లోయకి ఒమర్ ఖయ్యాం పేరిడినారనిన దానియర్ధమేమి?” యని బసవడన "ప్రతిభాఉన్నచో అమెరికాలో మంచి ఉజ్జోగములు వచ్చున”ని రాఘవుడనుచుండగా “మనుజుడమరుడగును” యని అగస్త్యుడు ముగించి మధువు కలిపిన శీతల పానీయమును అచట దొరుకు కోపల యందు బోసి ఇచ్చెను.

రాఘవ సందీపులు తీసుకొనిరిగానీ బసవడు నిరాకరించెను. సందీపుడు  పొదల చాటున జంటలను చూపెను. కొండొక సఖుడు దుద్దుగ చెట్టు వద్దనున్న పొదలలో బిమ్బాధారి ఓష్ఠములను చుంబించు చుండెను.  విరగ కాసిన ఎర్రని దుద్దుగ పండ్లువలె ఆమె పెదవులు మెరియుచుండెను. నేలంతయూ రేలపూలు రాలి యుండెను. పచ్చని గోగుపూలు వాటి పై రాలుచూ మనము నాహ్లాద పరుచుచుండెను. 

భోగించుట తప్పుకాదని రాఘవ సందీపులు పలుకుచుండ బసవడు వారితో సంవాదమునకు పూనుకొనెను. అప్పుడగస్త్యుడు  వాదిప్రతివాదుల పరస్పర ప్రాగల్భ్యము నకిది సమయముకాదు యని జెప్పుచూ,  

 "ఈ  సుందర ప్రకృతి  లోకమంతయూ పానశాల వంటిదని  స్వర్గమున్నచో ప్రియురాలి ఎదపైనేయున్నదన్న   ఒమర్ ఖయ్యాం తత్వమునూ, ఆనందమే జీవిత మకరందమనిన గ్రీసుదేశవాసి ఎపిక్యూరస్ సుఖజీవనవాదమును,  విషయాసక్తత పురుషార్థమనిన అరిస్టిపస్ భోగపరాయణ తత్వమును తనలో ఐక్యము జేసుకొనె"ననెను. 

Wednesday, August 19, 2020

Bharatavarsha 24

ఆనందపురము సమీపమున కలుఉప్పాడ గ్రామీణక్షేత్రమందు సస్యపరీవృతమై, నవ్యమై భవ్యమై అలరారు మహోన్నత భవంతితొకటి మేరు పర్వతమువలె నిలిచి కౌముది యందుతడిచి  కాంతులీనుచుండెను. అర్ధనిశ సమీపించుచుండ కలువచెలి కౌగిట పాలమబ్బులు పరవశంబునుబ్బతిల్లుచుండెను. నగరమునకు అన్యమైన   ఆ సువిశాల మిద్దెపై నొక  మదనాత్ర సంచలిత జవ్వని సంచరించుచు, మగని రాకకు ఎదురు చూచుచూ సోమజ్వాల యందు కాగుచు, లేలిహ(snake) దేహమును  నిడుపాటి కుర్చీయందు కాస్సేపు చౌకాలి-పీటపై కాస్సేపు పలు భంగిమల మార్చుచూ  మిద్దెపై  సంచరించుచుండెను. చంద్రకాంతి యందు నీలోత్పలము ( నల్ల కలువ)వలె మెరియుచున్న  ఆ  జవ్వని విరహ జ్వరమును తాళలేక,  తామరదళా కృతినున్న ఈతకొలనందు  దుమికి ఈదులాడుచుండెను. అప్పుడే వచ్చిన సఖుని కంటికొలను నుండి చూచి యాకామిని ముఖమును  తిప్పుకొనెను. అంతనతడా కొలనునందు దిగి ఆమె వద్దకు బోయి “జిలేబి!” యని ఆ జవ్వని చుబుకమును తనవైపు త్రిప్పుకొని “నల్లని మత్యమువలె ఈదులాడుచున్న నిన్ను చూచుచున్న ఇచ్చట తామరతూపరి (cupid) కాపుగాసెనేమో యనిపించుచున్నది” అనెను “రూబీ! వచ్చితివా! అయినదా మీనాక్షీ నందనునితో సంవాదము, మిక్కిలి జాగు జేసినది జాలక మీనము వలెనున్నావని పరాచకములాడుచున్నారు. అవ్వ! ఇంకా రొయ్యవలెనున్నావనలేదు. బుద్దులెచ్చటికి పోవును?” అనగా అతడి మొఖం వివర్ణమయ్యెను. అతడి మొఖములో విచారము జూసి మరుక్షణము “పరాచకమాడితిని నిజమనుకొనుచున్నావా? నీ కొడుకు నీ ఇష్టము, యని మృదుభాషణములు పలుకుచుండ ఆమె నోటినిమూసి కొద్ధిసేపు జలక్రీడలాడెదము పిదప సంవాదము. తక్కినవన్నీ వేచి యుండగలవు యనుచు ఆమెను కొలనులోకి నెట్టెను. 

పైకి వచ్చినామె ఒక పీఠముపై కూర్చొనగా,  ఆర్ద్రత నున్న ఆమె ప్రక్కనే అతడు కూర్చొనెను ఆమె కొంచెము దూరము జరిగికూర్చొనెను.  నీవు ప్రేమతో రూబీ యని పిలిచిన నేను యువకుడిని అయిపోవుదును. " తీయగా నుండుటచే  నన్ను జిలేబి అనుచున్నావు, నీవు ఎర్రగా యుండుటచే , నిన్ను రూబీ అనుచున్నాను" ......అతడు చేరుకొనబోగా ఆమె పరుగున బోయి చౌకాలి పీఠమునధిరోహించెను...... మరల అతడు సమీపించబోవుచుండ.... నిడుపాటి కుర్చీయందు కూర్చొని కవ్వించెను. “నీవు నన్ను జూడక కొద్దిసేపు పూర్వమే వచ్చి నక్కియుండి నీ యోగాసన భంగిమలను చూచితిని. ఇప్పుడు హంపి విరూపాక్ష శిల్ప లావణ్య విలాసమును జూపి, నన్ను పురిగొల్పి అందకున్నావు అనుచూ ఒక్కఉదుటున అలవలె నెగసి ఆమె చేయందుకొనెను.   శశాంకుఁడు మబ్బుల చాటుకి జారుకొనెను. కొలది సేపు వారిరువురూ ఈత  కొలను గట్టు పై మీనములవలె మైధునమాచరించి పిదప పడకింటికి పోయిరి.

శయ్యపై పడుకొని గవాక్షం నుండి చంద్రుని చూచుచూ “జిలేబి! నేడు మనసెందుకో మహానందము నొందినది. అగస్త్యుడు రేపు కళాశాలకు బోవలెనని జెప్పినాడు. వలసినవి కొనిపెట్టి పంపించి

ఉంటిని. అగస్త్యుడు వెడలినాడు” “తనయుని జూచిన ఏ తండ్రికైననూ ఆనందమే కదా”.  ఈ ఆనందము వాడిని చూచినందుకు కాదు వాడియందు చిన్న మార్పు చూచినందుకు. “ఇంతలోనే అతడిలో మార్పు చూచితిరా! అతడిలో మార్పుయనిన అత్తిపూచినట్లే.(అసాధ్యము)  "బహు సంకుచిత స్వభావము అంతలోనే ఎట్లు మారును?"

 నేటి మధ్యానము అతడు సంస్థ ఆవరణలందు కలియ తిరిగినాడు.తీక్షణ శీతలగది (ఛిల్ల్ రూమ్) యందు విహరించినాడు. నేడు నేను జాన్ తో మాట్లాడుతున్నప్పడు పక్కగదిలో పరదా వెనుక నిలబడి నన్ను గమనించుచున్నాడు." 

"నేటి యువతీ యువలకు లైంగిక జ్ఞానము లేదు లైంగిక స్వేచ్ఛ కావాలె నందురు కానీ అది ఇతరులకు దక్కిన దుఃఖింతురు"

 నేటి యువతీ యువకులేకాదు పెద్దలుకూడా అట్లే యున్నారు.  చక్కగా చెప్పినావే యనుచు చెక్కిలి నిమురగా “పలు పుస్తకములు చదివియుంటిని.  నేటి జనులు పఠనము లేక బ్రష్టు బట్టినారు, చదవక కూపస్థమండూకములవలె  ఇతరుల వ్యక్తిగత విషయములలో జోక్యం కలిగిచుకొనుచూ మారీచులవలె మారి  స్త్రీలను వేదించుచున్నారు. 

ఐరోపా బోయినపుడకడ చూచితిని కదా ఒక కప్పు కాఫి త్రాగు సమయమున మాటలాడుచు స్త్రీపురుషులు మనసులు కలిసిన జాలు కొద్ది సమయములో శృంగారేచ్ఛను తీర్చుకొందురు. ఇట్లెంతమందినో కలిసి యుండుటవల్ల  వారు మరల ఒకరినొకరు  కలిసిన ముఖమైననూ గుర్తుపట్టలేరు.  అందరు  అట్లుండవలెనని కాదు కానీ ఇచ్చట వారివలె నుండరాదు. 

అబ్బో ఉపన్యాసము బాగా దంచుచున్నావే! అనేక పుస్తకములు చదివితివా ఏ పుస్తకములు చదివినావు? ఎక్కడ చదివినావు?

మన  ఇంటి  గ్రంధాలయం లో  మీరు సేకరించిన పుస్తకములే చాలును. ఎచ్చటికో పోవాల్సిన పని ఏమున్నది? అని చెప్పుచూ  తానీ మధ్యనే చదివిన కాదంబరి గూర్చి చెప్పసాగెను.

 “శ్రీహర్షుని ఆస్థానకవుల్లో ఒకడైన  బాణభట్టు “కాదంబరి” యను వచన కావ్య రచన జేసినాడు. కాదంబరి ఇతివృత్తం శృంగారభరితమైనది. దీనిలో అనేకానేకమైన కథలు. అందొక కథలో శ్వేత కేతువనే మహర్షి, నలకూబలుడిని మించిన అందగాడు, పుష్పములకొరకు ఆకాశగంగలో దిగినపుడు పద్మదళము పై కూర్చొనియున్న లక్ష్మీదేవి అతడిని జూచి మోహించి చూపులతోనే సంభోగ సుఖమనుభవించి బిడ్డను కని ఆ మహర్షికి అప్పగించినట్లు వ్రాసెను. నేటి సమాజములో పురాణములలోలేని కథను అట్లు వ్రాయగలడా? వ్రాసిన బ్రతకనిత్తురా? వేదించి   చంపివేతురు" అని ముగించెను.

 దక్షిణమూర్తి: నీవుచెప్పినది నిజమే చదవకుండుటవల్లే ప్రజలకు బుద్ధి నాశనమైనది. పురాణములలో ఏమున్నదో తెలుసుకొన జాలకున్నారు. గ్రీక్ ,రోమను , భారతీయ పురాణములేవైననూ  ఉన్నదంతా స్వేచ్చా శృంగారమే కదా. గ్రీకుపురాణమందు గేయా  భూమాత,యురేనస్  ఆకాశదేముడు. గేయా, యురేనస్ యొక్క తల్లి మరియు భార్య. వీరికి క్రోనస్ చివరిగా జన్మించిన బిడ్డ. తల్లి ఆజ్ఞానుసారము క్రోనస్ తండ్రి యురేనస్ను వధిస్తాడు.  

మొదటి శతాబ్దపు గెలీలియన్ యూదు మహిళ యోసేపు భార్య, యేసు తల్లి యగు  నజరేతు, మరియు ఆమె బంధువు పూజారి జెకర్యా భార్య యగు ఎలిజబెత్  పవిత్రాత్మతో కలిసి   బిడ్డలను పొందారు.  ఎలిజబెత్ వివాహిత, నజరేతు కన్య.  ఈ పాత్రలు మహాభారతం లో కుంతిని పోలి ఉంటాయి. నాటి స్త్రీలను  వారు అంత  వమానించ లేదు.

 

 పురాణముల విషయము అటులుండనిమ్ము, ప్రజాస్వామ్యము రాకపూర్వం 18 వ శతాబ్దము వరకు ఫ్రాన్స్, జెర్మనీ చైనా ఎక్కడ చూచినా రాచరిక వ్యస్థలే ఉండెను. భారత దేశమును పరిపాలించిన మొఘలులు నుండి    ఫ్రెంచ్ లూయీ రాజులు, చైనా మింగ్ చక్రవర్తులు, రష్యా జార్ ప్రభువులు ఎవ్వరైననూ ఒకొక్క రాజుకు పెక్కు భార్యలుతో బాటు అనేక సహచారికలు (ఉంపుడుగత్తెలు)

ఉండెడివారు. రాజుల వలె కవులు మేధావులు తత్వవేత్తలు కూడా  ఎక్స్ట్రా మరీటల్ లియేజన్స్  (వివాహేతర సంబంధములు) నెరిపిననూ వారి గౌరవమునకు ఏమియునూ భంగము రాలేదు. ఉదాహరణప్రాయమైన ఫ్రెంచ్ ఎన్లైటెన్మెంట్ ఫిలాసఫర్ (వేదాంత జ్ఞానోదయమూర్తి) గా కీర్తి కెక్కిన వోల్తేర్, స్విస్ ఇల్లస్ట్రస్ రైటర్  (ప్రబోధాత్మ రచయిత)  రూసో  విగ్రహములు , వారి  లైంగిక, వ్యక్తి గత జీవితములో ఎన్ని లోపములున్ననూ,   షాతో దు ఫెర్నీ లో  నెలకొలిపి గౌరవించుట మనమెరుగమా. మహా కవి శ్రీనాధుడు, అష్టదిగ్గజములలో ప్రధానమైన ధూర్జటి కూడా వేశ్యలోలరు కాదా మరి వారి   వ్యక్తి గత జీవితములో దూరక వారిని గౌరవించుటలేదా?

మన పూర్వీకులు వ్యక్తిగత స్వేచ్ఛను ఇట్లు అడ్డుకొనుట మనము చూడము. అజంతా  ఎల్లోరా  , కోణార్క్ , విరూపాపక్ష వంటి అనేక  దేవాలయములయందు చూపిన అపూర్వ శిల్ప కళ వెనుక ఏమిదాగియున్నది?

జిలేబి నీ వాక్ధాటి విన్న సురేంద్రుడు, నరేంద్రుడు కూడా  మెచ్చుఁ కొందురు, అని దక్షుడు అనుచుండగా , “కానీ నేడు నీ కొడుకువంటి వారు అనుమానించి పొంచి చూతురు. జాన్ తో నేనెక్కువసేపు మాట్లాడుచున్నానని గమనించి అట్లు పొంచి చూచినాడు.” 

 “జాన్ నీ అన్న వరుస యని తెలియక ..  దక్షుడనుచుండగా తల త్రొక్కిన త్రాచువలె    శయ్యమీదనుండి లేచి “తెలియక ఇట్లు జూచిన మనము నవ్వుల పాలవ్వమ్మా? పనివారు అతడిని చూచినారు.”

ఆ జ్ఞానము వాడికుండవలెను, లైంగిక జ్ఞానము నేనెట్లు భోదించగలను. నీకు నేను బోధించలేదుకదా.

నీవు చెప్పలేకున్న పుస్తకములున్నవికదా చదవమని చెప్పుము

“పుస్తకములు అందరివద్దనున్నవి కాని అవి చదివిన జ్ఞానము వచ్చునని ఆ జ్ఞానము తమకు వలయునని అది వారి జీవితమునకు  వెలుగు దెచ్చునని నమ్మకము లేదు.  వైరాగ్యము జ్ఞానము బోధించిన నేమి ప్రయోజనము?” యని 

“పుస్తకములు అందరివద్దనున్నవి కాని అవి చదివిన జ్ఞానము వచ్చునని ఆ జ్ఞానము తమకు వలయునని అది వారి జీవితమునకు  వెలుగు దెచ్చునని నమ్మకము లేదు.  వైరాగ్యము జ్ఞానము బోధించిన నేమి ప్రయోజనము?” యని

“అది అట్లుండనిమ్ము, నీవీమధ్యన ఇంగిలీషు ముక్కలు కూడా బాగానే ప్రయోగించుచున్నావు.” అనగా “నాకేమి తక్కువ మిలియనీయర్ అండ్ ఫ్యూచర్ సి ఈ ఓ ఆఫ్ మీనాక్షి ఫిషరీస్ యని ముంజేతో తో అతడి డొక్కలో నొక్క పోటు పొడిచెను. " అబ్బా!! దుర్మార్గురాలా! ఇంత జ్ఞానము కలిగి  స్వార్ధము చూపుచున్నావు." అని వగచెను " జ్ఞానమున్నచో స్వార్ధముండదని ఎవ్వరు చెప్పినారు స్వామీ !”    

 


Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...