స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త ఐన బాపిరాజు భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ సాహిత్యంపై ఆసక్తి తో రచనలు చేసేవారు . 1922 లో భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని జైలుకి వెళ్లారు జైలులో ఉండగా శాతవాహనుల నేపథ్యంలో సాగే హిమబిందు అనే నవల ప్రారంభించాడు. భీమవరంలో న్యాయవాద వృత్తి చేస్తూ నారాయణరావు అనే సాంఘిక నవల రాశారు . ఈ నవలకు ఆంధ్రవిశ్వకళాపరిషత్తు వారి బహుమతి లభించింది. 1934 నుంచి 1939 వరకు బందరు జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా పనిచేశారు. అదే సమయంలో కథలు రాశారు. 1939 లో సినీరంగప్రవేశం చేసి అనసూయ, ధ్రువ విజయం, మీరాబాయి లాంటి సినిమాలకు కళాదర్శకత్వం చేశాడు. 1944 నుంచి 1947 వరకు హైదరాబాదునుంచి వెలువడే మీజాన్ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఈ సమయంలో తుఫాను, గోన గన్నారెడ్డి, కోనంగి నవలలు రచించారు . 1952 సెప్టెంబరు 22 న మద్రాసులో కన్నుమూశారు .
నారాయణరావు సాంఘిక నవల మాత్రమే కాక శాస్త్రీయ సాహిత్యం( క్లాసికల్ లిటరేచర్) కూడా.
ఇది ఒక ప్రేమ కథ అంటారు : కథా నాయకుడు నారాయణ రావు. కథా నాయిక శారద .
పేమంటే పెళ్లి అయిపోయిన తరువాత ప్రేమ. పెద్దలు కుదిర్చిన సంబంధం కాబట్టి పెళ్ళికి ముందు ప్రేమ ఉండదు. అది కూడా వారిరువురి మధ్య ప్రేమ కాదు. నారాయణరావు వన్ వే లవ్.
ముఖ్య కథాంశం: పెళ్లి తరువాత చెప్పుడు మాటలు విని మొగుణ్ణి దగ్గరకి చేరనివ్వని భార్య శారదని నారాయణ రావు ఓర్పుతో చివరి దాకా ఇలా భరిస్తూ ఉంటాడు
ఈ కింద సీన్ నారాయణరావు ఓర్పు కు మచ్చుతునక
"నాలుగున్నర గంటల కులికిపడి నారాయణరావు లేచిచూడ శారద తలుపుదగ్గర నే తివాసీ పై పరుండి నిద్రపోవుచున్నది. ఆ సుందరీమణి తన యిల్లా లటుల పరుండవలసిన గతియేమి? ఆమెకు దనయెడల ఎంతటి అసహ్యతయో? ఇంతకు దన్నా బాల ప్రేమింపకపోవుటకు దనయెడల నేమిలోపము కని పెట్టినదో? ప్రేమవిషయమున లోపములు గణనకు వచ్చునా?
ఈ బాలికకు దానన్న ప్రేమ లేమియే నిజమయినచో దానేమి చేయ వలెను? ప్రేమలేని బాలికతో గాపుర మెట్లు? యువకునకు యువతి గావలెను. యువతికి యువకుడు గావలెను. మన వివాహములలో ఒకరికొకరు స్నేహితులుకండి యని మనకు నేర్పినారు. ప్రేమకూడ కుదిరినచో వారి దాంపత్యప్రవాహము గంగా నదియే. లేనిచో స్నేహితులుగానైనా సంసారయాత్ర సాగించుకొందురు. (?)
మరల తుదిప్రయత్నము చేయవలెనని యాత డూహించుకొని పరమ కరుణామూర్తియై భార్యకడకేగి నిదురబోవు నా బాలిక నెత్తికొని పోయి మంచముపై బరుండబెట్టి తనివితీర ముద్దు గొనెను. శారదకు చటుక్కున మెలకువవచ్చిన లేచి 'అమ్మయ్యో ' యని దిగ బోయినది. ఎవరైనా చూచినా నవ్విపోయెదరు కనీసము మంచము మీద పడుకొనినట్టు నటించుము అని కోరగా ఆమె మంచంమీద తలదించుకుని కూర్చొనును. కొద్దీ సేపు తరువాత నారాయణరావు ఆమె పై చేయివేయగా " నాకేమిటి బాబూ ఈ బాధ అని గదిలోనుంచి పారిపోవును. నారాయణరావు మంచము పై పడుకున్నట్టు నటించును
నారాయణ రావు గుణగణాల వర్ణన
నారాయణరావు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతానికి చెందిన ఒక పెద్ద ధనిక భూస్వామి బ్రాహ్మణ కుటుంబానికి చిన్న కుమారుడు. అతను చెన్నైలో న్యాయశాస్త్రం చదువుతున్నాడు. నారాయణ రావుని బాపిరాజు అర్జునిడితో పోలుస్తాడు, ఎప్పుడూ ఖద్దరు బట్టలు కట్టుకునే గాంధేయవాది గా చూపిస్తాడు. నారాయణరావు తాను ప్రయత్నించే ప్రతిదానిలోనూ రాణిస్తాడు- ఆయన చదువులో కర్ణాటక శైలిలో వయోలిన్ వాయించడంలో క్రీడలలో సమర్ధుడు.
కథానాయకుడి మామగారు: తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు - విశ్వలపురంజమీందారు
రైలు ప్రయాణం తో కథ మొదలౌతుంది . గవర్నరు గారికి స్వాగతము పలుకుటకు రాజమండ్రి పోవు బృందంలో తల్లాప్రగడ లక్ష్మి సుందర ప్రసాదరావు ఒకరు. ఆయన స్వరాజ్య సముపార్జన యజ్ఞ మందు పాల్గొనిన దేశభక్తుడు సాంప్రదాయ వాది. అతడు నారాయణ రావు రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారమ్ పై చూసి, నారాయణ రావు ఎక్కిన పెట్టిలో ఎక్కి స్నేహితులతో ) ప్రయాణిస్తున్న నారాయణరావును చూసి తన కుమార్తె శారదకు చక్కని పెండ్లికొడుకగునని భావించి అతడి పేరు ఇంటిపేరు, గోత్రము అడిగి చివరిగా అతడికి వివాహంమైనదా లేదా అని అడుగుతాడు. నారాయణరావు కాలేదని సమాధాన మిస్తాడు. దాంతో పెళ్లిచూపులుఏర్పాటు చేస్తారు , కథ మొదలౌతుంది
నారాయణరావు మిత్రులు ; లక్ష్మీపతి , రాజారావు , పరమేశ్వరరావు , ఆలం.
చదువులు : నారాయణరావు , ఆలం సాహెబ్ ఎఫ్ ఎల్ చదివారు, రాజేశ్వరరావు ఎం బి బి ఎస్, పరమేశ్వరమూర్తి కవి చిత్రకారుడు గాయకుడు , లక్ష్మీపతి నారాయణరావు బావ..
విలన్ : కథా నాయిక శారద తల్లి విలన్
ఆ చెప్పుడు మాటలు చెప్పేది శారద తల్లి. నారాయణ రావుది సంపన్న కుటుంబమే అయినా శారద తండ్రి అంత కాదు. అందుకే శారదా తల్లికి నారాయణరావు కుటుంబంతో సంబంధం నచ్చదు. వారంటే చిన్న చూపు అందుకే శారద మనస్సును విషపూరితం చేయడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తుంది. దారుణంగా కూతురికాపురంలో నిప్పులు పోసేస్తుంది.
ఈ క్రింది శోభన రాత్రి సంఘటన చదివితే ఆమె విలనీ తెలుస్తుంది
శోభనం రాత్రి : నారాయణరావు భార్య శారద లోనికి వెళ్ళనని పట్టుపట్టినది. ఆమె తల్లి కుమార్తెకు భర్తపై అ యిష్టమని తెలిసి సంతోషించినది. కాని గర్భాదానమునాటి రాత్రి కొమార్తె గదిలోనికి వెళ్ళదనుట నలుగురకు దెలిసినచో నేమనుకొందురో యని భయపడి 'లోపలికి వెళ్ళు తల్లీ' యనిమాత్ర మన్నది.
ఇంతకన్నా దారుణం ఏంటంటే శారద ఏదో ఒక రోజు తనను ప్రేమిస్తుందని నమ్మి నారాయణరావు భార్య దగ్గరికి రానివ్వకపోయినా తాక నివ్వకపోయినా సహనంతో భరిస్తాడు. రచయిత కథానాయ కుడి ఓర్పు నిబద్దత గురించి గొప్పగా చూపిస్తున్నానని అనుకుంటాడు . హద్దు దాటిన సహనం కథ చివరిదాకా సాగుతూ వెగటుగా అనిపిస్తుంది. ర ఒక చెంప వాయిస్తుంటే రెండో చెంపచూపుతు న్న ట్టనిపిస్తుంది. మొగుడంటే కనీసగౌరవం లేకుండా అతడి నుంచి తప్పించు కునే భార్య శారద పట్ల అంత సహనం అపాత్ర దానంలా చేతకాని తనంగా కూడా అనిపిస్తుంది.
నారాయణరావు పాత్ర పాత తెలుగు సినిమాల్లో కోడలు పాత్రలా అనిపిస్తుంది అత్త అవమానించి నా, హింసించినా , చంపేస్తున్నా నోరెత్తని పాత సినిమా కోడలు గుర్తుకి వస్తుంది . అత్తా ఒకింటి కోడలే సినిమాలో రమణమూర్తి భార్య సంధ్య తన అత్త సూర్యకాంతం అవమానాలని బాధలని తట్టుకుని చివరకు తిరగబడుతుంది. నారాయణరావు అంత కంటే ఎక్కువ సహనం చూపిస్తాడు చివరివరకూ సద్దుకుపోతాడు.
శారదకు తానంటే ఇష్టం లేదని నారాయణరావు కాశీ యాత్రలకు పోతానని బయలుదేరతాడు. కొంచెం ఎడబాటు ఉంటే బాగుంటుందని భావిస్తాడు. యాత్ర ముగించుకుని చాలా కాలం తర్వాత వస్తాడు మావగారు. పునస్సంధాన మహోత్సవము ఏర్పాటు చేస్తారు
అప్పుడు నారాయణరావు పరిస్థితి
"నేడెటులశారదతో మాట్లాడగలిగెనోయతనికే తెలియదు. ఉస్సురని వెడలిపోవజూచుచు 'మాట్లాడ వేమి శారదా!'నాపై ప్రేమలేదా యని జాలిగ ప్రశ్నించెను. శారద భయమునిండిన హృదయముతో నిజము చెప్పిన ఈయన వదలు నను ఆశతో కంపిత స్వరమున నాకు ప్రేమలేదు' అని గబుక్కున కన్నుల నీరునిండ నేడ్చినది. నారాయణరావును కొరడాతో మొగమున గొట్టినట్లయి చివుక్కున వెనుకకు జరిగి మెదడు ర క్తహీన మైపోవ తూలి, లేచి, అచ్చటనుండి వచ్చి సోఫాపై తాను కట్టుకున్న దివ్య భవనము కూలిపోయినదని తన బతుకు నిరర్థకమైపోయినదని ఏడ్చును. "
నారాయణ రావు నవలలో అనేక పాత్రలు ఉన్నాయి. కథాంశాలు మరియు ఉప కథాంశాలు ఉన్నాయి.అసలు కథ నడవ కుండా ఉపకథలు తగులు కుంటాయి. అలా అని ఉపకథలేవీ ఉన్నతమైన కథలు కాదు. ఆ ఉపకథలలో పాత్రలన్నీ సాధారణ మానవ దుర్గుణాలను బలహీనతలను కలిగి ఉంటాయి.
ఉపకథలలో ఒక అక్రమ సంబంధం కూడా ఉంది.
పుష్పశీల రాజేశ్వరరావు కథ - ఒక అక్రమ సంబంధం గురించిన కథ
అక్రమ సంబంధాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి కానీ ఆరోజుల్లోనే ఇంత బరి తెగించిన ఆడవాళ్లు ఉండేవారని ఊహించలేము. ఆ రోజుల్లో రచయిత ఎంతో ధైర్యంగా రాసారని చెప్పచ్చు
సుబ్బయ్య శాస్త్రి గారి భార్య పుష్పశీల. ఆమె రాజమంద్రిలో భర్తతో ఉండును. బి ఇ . మూడవ సంవత్సరము చదువుతున్న నారాయణరావు స్నేహితుడు రాజేశ్వరరావును ఆమె మోహించును. రాజేశ్వరరావు కూడా ఆమె కొరకు తహతహలాడును. ఆమె రాజేశ్వరరావు కౌగిలిని రుచిచూసి ఆ రుచిని ఈనాటికీ ఆస్వాదించుచున్నది. అతడు తన భర్త అయినచో తన జన్మ ధాన్యము అగునని ఆమె తలచి భర్త సుబ్బయ్య శాస్త్రి ని ప్రేమలో ముంచి మురిపించి అతడి మీద కవితలు చెప్పి భర్తను నమ్మించి అతడు కోర్టుకు వెళ్ళినప్పుడు తన ప్రియుడిని పిలిపించుకొని అతడి ప్రేమను పొందును. అతడు తన ప్రేమ గురించి నారాయణరావుతో నిర్లజ్జగా ఇలా చెపుతాడు " రాజమండ్రి వెళ్లినందుకు నాకు పనైందిరా . నా ప్రేమ సఫలమైందిరా . ఆమె అందం కనీవినీ ఎఱుగనిదిరా. ఆమె లేని మగ జన్మ వ్యర్థం రా!" ఇలా సాగుతుంది సంభాషణ చదివితే నిండా మునిగితే అందరు అంతే అనిపిస్తుంది
రాజేశ్వరరావు ఉత్తరం చదివితే ఈరోజుల్లోనే కాదు ఆరోజుల్లోకూడాఅంతే అనిపిస్తుంది.
నేనేమి చేసేది, నారాయణా!
నాకూ మతిపోయింది. ప్రపంచంలో ప్రేమ లేదనుకున్నాను. స్త్రీకీ, పురుషుడికీ ఒకరిదేహంమీద ఒకళ్ళకు కోర్కె కలగడమే ప్రేమ అనుకున్నా. ఇప్పుడు నా సంగతిచూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇదివరకు చక్కని బాలికలతో స్నేహంచేసి వారి మనస్సులు చూరగొన్నాను గాని, ఇదేమిటో నా కర్థం కాలేదురా. పుష్పశీలాదేవికి నేనంటే పిచ్చే! 'నిన్ను వదిలి ఒక్క నిముషంఆన్నా ఉండలేను, నాకీ భర్త వద్దు' అని మొదలు పెట్టింది.
మొదట భర్తకావాలి, నేనూ కావాలి అన్నది. శ్రుతి మించి రాగాన్ని పడింది. ఇద్దరము ఇక విడిగా ఉండడం పడలేదు. కాబట్టి బయలు దేరివచ్చి ఈ హైదరాబాదులో మమ్మెవరూ పట్టుకోలేని మేడలో ఉన్నాము. మేమే నిజమయిన భార్యాభర్తలము. నీ స్నేహము వదలుకో లేను. నా యీ భార్యనూ వదలుకోలేను. నీ సదభిప్రాయం నాకు ఉండాలి. నీ కొక్కడికే నా అడ్రసు ఇస్తున్నాను. నాకు ఆవసరం వచ్చినప్పుడు వేయి రూపాయలవరకు నువ్వు ధనం సప్లయి చేయవలసి ఉంటుంది.
మరొక చిన్న ఉపకథ సత్యవతి కథ -
సత్యవతి నారాయణరావు చెల్లెలు. ఆమె భర్త వీరభద్రరావు పరమ కర్కోటకుడు. అవకాశవాది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టు రకము. భార్యని గొడ్డుని బాదినట్టు బాదుతాడు. ఆమె దెబ్బలు తింటూ "రామ రామ రామ" అనుకొంటుంది తప్ప భర్తకి ఎదురు చెప్పదు. ఆ రంపపుకోతకి పెద్ద పిల్ల తప్ప ఆమెకి పుట్టిన పిల్లలందరూ చనిపోతారు. అలాటి వ్యక్తికి నారాయణరావు భారతదేశంలో స్త్రీలు ఎంత గొప్పవారో ఎంత భక్తి గలవారో చెపుతాడు. అతడి మనసు మార్చి చెల్లి కాపురం చక్కబెట్టాలని అతడి ఉద్దేశం.
"బావ మన స్త్రీలు ఎంత గౌరవనీయులోయి, మన గౌరవాన్ని , మన నాగరికతను నీతిని జాతిని కాపాడుతున్నది స్త్రీలోయి , రుద్రమ దేవి, తరిగొండ వెంగమాంబ ను గుర్తుచేసుకో మంచాల తన భర్త బోగందాని వలలో పడితే భర్తను కాపాడమని దేవుని స్మరించి భర్త వీరమరణం పొందితే సతీ సహగమనం చేసింది, చరిత్ర తెలీదా బావా నీకు." బావా నీవు ఉద్యోగంలో చేరడంవల్ల అలా అయిపోయావు గానీ నీ హృదయం చాలామంచిదోయి అని నారాయణరావు బావని గంటలు గంటలు పొగుడుతాడు.
ఇక ఉపకథలు పొతే కుటుంబాలు, రాజవంశాల రాజకీయాల గురించి చర్చలు , సాహిత్యం, సంగీతం మరియు కళల గురించి చర్చలుఉంటాయి . అవి కొంత విసుగు తెప్పిస్తాయి.
No comments:
Post a Comment