ఆనందనిలయమునకు చేరువలో నున్న "అపూర్వ" కల్యాణ మండపమందు పుష్పమాలాలంకృతమై ధగధగకాంతులీను ఉన్నత వివాహ మండపముపై గోపురములవలె నాలుగు చిన్నమంట పములలో నలుగురు పురోహితులు, పదిమంది వేదపండితుల మధ్య నాలుగు కుటుంబముల వారు నిలిచి యుండిరి. పవిత్ర మాఘ మాసమున మాంగళ్య బంధముతో ఒక్కటైన జంటలు తలంబ్రాలు , అక్షింతలు, మంచి గంధము కర్పూర సువాసనలు వెదజల్లుచుండగా బంతి చామంతులవలె ప్రక్క ప్రక్కన నిలిచిరి.
రాత్రి 8.00 గంటలగుసరికి పెళ్లిళ్లు ముగిసినవి. రాత్రి భోజనములు సమయమ గుచుండుటతో పెక్కు మంది ఆహ్వాని తులు వివాహ విందుకు పోయినారు. కొలదిమంది ఆహ్వానితులు పెద్దలు మాత్రమే ఉండుటతో మండపం గది అంత యూ ఖాళీగా కనిపించుచుండెను. సంగీత కచేరివారు కూడా తమ తమ సాధనములను తీసుకొని వెడలుచుండిరి కేశవుడు వారిని భోజనములు హాలు లోకి తీసుకు పోవుచుండెను.
సందీపుడు మంజూషను తీసుకొని తన తల్లి తండ్రులతో సబ్బవరం పోవలెనని యోచించుచుండగా మాలినిగారు " పిల్ల ఇంటనే శోభనం వేడుక జరిపించవలెను. అది ఆనవాయితీ" అని ఎంత చెప్పిననూ సందీపుడు శోభన వేడుకలకు అంగీ కరించకపోవుటచే వర్షుడు కూడా సందీపుని అభ్యర్ధించగా సందీపుడు వర్షునితో " నేను నేరుగా బెంగళూరు పోవలెను నా సంస్థ చూచుకొనుటకు ఇప్పుడు అచ్చట నా అనువారు ఎవ్వరునూ లేరు , నన్నర్ధము చేసుకొనవలెన"ని వర్షుని చేతిలో చేయి వేసి చెప్పెను.
పెంచలయ్యగారు వర్షునితో "త్వరలో మాఇంట మానందిని కి పెండ్లి చూపులకు వత్తురు ఇప్పటికి పోనివ్వవలెన"ని అనగా నందిని " అవును మానాన్నకు పెండ్లిచూపులు జరుగును మీ రందరూ రావలెన"ని చమత్కరించెను. మాలిని గారు మంజూషను వియ్యపురాలి చేతిలో పెట్టుచూ మాటలు కరువయ్యి ఏమి చెప్పుటకూ తోచక గుండెలు బరువ య్యి కొద్ది క్షణములు అట్లే నిలిచి ఎట్టకేలకు మంజూష తో " నీకు తల్లి గురువు ఈమే , అల్లుడు నీ అమ్మవలె వలె నీవాడమన్నట్లు ఆడువాడు కాదు, అన్న వలె మృదువుగా నుండకున్ననూ ,దెబ్బలాడిననూ అణుకువతో ప్రేమతో నుండవలెను. పుట్టింట సాగినట్లు అత్తింట అలకలు సాగవని గుర్తుంచుకొనుము. భర్తవద్ద బెంగుళూరులో ఎట్లుందువో అని వ్యాకులతతో సాందీపుని చేయందుకొని మంజూష చేతిని అతడికి అందించుచుండగా మీనాక్షి" బెంగుళూరులో నేను ఉండగా నీవు ఇంత విచారపడవలదు.” అని మాలినిని ఓదార్చెను.
సందీపుడు మంజూషలు మాలినిగారికి ప్రణామము చేసిన పిదప సందీపుడు మంజూషను వర్షునివద్దకు కొనిపోయెను. వర్షుడు ఆశీర్వదించి సందీపుని గుండెలకు హత్తుకొనెను. పిదప అతడి రెండు చేతులు పట్టుకొని చిన్ననాటి స్నేహితు లమన్న దయ ఉంచుము. అని వర్షుడు అనుచుండగా సందీపుని కన్నులు తడిఅయ్యెను. ఆడపిల్ల నేకపోతే ఇల్లంతా ఎలితి , ఏటి సేత్తాము పల్లకో నాయినా అని పైడమ్మ గారు వర్షునికి ఓదార్పుచెప్పుచుండగా " నందిని " ఓలి పైడి! నువ్వు పల్లకోయే , మంజూస ఎల్లిపోతే , నాను లేనేటి ?! వర్సని నా నొగ్గుతాననుకొంతన్నావేటి !" అని గ్రామీణ భాషలో మాట్లాడుటతో అందరూ చకితులయ్యి మనసారా నవ్వుకొనిరి. ఆది, దాసు, మరీదు పెంచలయ్య పైడమ్మ లను కూడి నందిని మంజూష సందీపుడు చిన్న బస్సులో సబ్బవరం బయలుదేరినారు.
చంద్రమతి పార్వతిని బుచ్చెమ్మగారికి అప్ప గింతలు పెట్టుచూ పార్వతి తల్లి చారుమతి పేరు తలఁచి కన్నీరు పెట్టి కేశవుని పై వాలి “నీ డబ్బు నేను అన్యాయముగా అట్టే బెట్టుకొంటినని” విలపించి రెండు దస్తావేజు కాగితములను తన సంచిలోనుంచి తీసి ఒకటి కేశవునకి మరొకటి పార్వతికి ఇచ్చి బుచ్చెమ్మ గారితో “కేశవునకు తన తల్లి ఆస్తి పది ఎకర ముల పొలము అప్పగించితిని. పార్వతికి నాఆస్తిలో నా పిల్లలతో సమముగా వాటా ఇచ్చితిని జాగ్రత్తగా చూడవలెను. అని చీర కొంగుతో కళ్ళు త్తుకొనుచూ అరుణ తారవైపు చూచుచూ “మా కుటుంబమునకు పెద్ద దిక్కు నీవే, అరుణా అంతా చూచుచున్నావు కదా!” అని సుకన్యను తీసుకొని బయలుదేరెను. “ఈమె పెండ్లికూతురిని అప్పగింతలు పెట్టినదా లేక ఆస్తి అప్పగింతలు పెట్టినదా?” అని బుచ్చెమ్మ తుచ్చ ప్రశ్నను సంధించగా అందరూ ఘొల్లుమనిరి. పార్వతి చేయందుకొని బసవడు కేశవుని రంజిని గారిని తీసుకొని బయలుదేరెను.
తక్కిన రెండు జంటలకు శోభనములు మా ఇంట జరుపవలెనని అనుకొనుచున్నాము అని మాలిని మీనాక్షితో అనుచుండగా యమున మీనాక్షి చెవులో ఎదో గుసగుసలాడుచుండెను విదిష ఆమెను జబ్బ పట్టి వెనుకకు లాగి ఏమా గుసగుసలు రహస్యములు అని కసిరి ఏమనుచున్నది ఈ బుడత అని అడుగగా మీనాక్షి నవ్వుచూ “సుందరిని బెంగుళూరు తీసుకొని పోవలెనని కార్యము అచ్చట జరపవలెనని అను చున్నది.” అని చెప్పెను. ఈ రాత్రికి ఇచ్చట నిద్ర చేయవలసినదే పిల్లలు ఆడి ఆడి అలసినారు. అని మాలిని గారు అనుచుండగా అగస్త్యుడు తల్లి చెవి కొరుకు చుండెను. ఏమో నాకేమియో తెలియదు కోడలు ఎట్లు కోరుకొనునో అనుచుండగా అరుణ “ఏమి కావలెనయ్యా కొత్త పెళ్లికొడకా!” అని బుజ్జగించగా అగస్త్యుడు సిగ్గుపడుచుండెను. “ఫైవ్ స్టార్ హోటల్ లో కావలెనట” అని సుందరి అరుణ చెవిలో చెప్పెను. అరుణ నిట్టూర్చెను. “నీ కోరిక?” అని సుందరి వైపు చూసెను “అన్నయ్య ఇంటికి పోయెదము” అని మెత్తని స్వరమున తెలిపెను. ఆమె సుందరిని బుగ్గలు నిమిరి మెచ్చుకొనెను. లకుమ కూడా అన్నయ్య ఇంటికి పోవలెనని చెప్పగా వర్షుడి మనసు సంతోషము తో ఉప్పొంగెను.
లకుమ సుందరి ఏక స్వరమున అన్నయ్య అల్ప సంతోషి, మా సుఖమును చూచి సంతొషించు మనసుగల అన్నయ్య మమ్ము ఆశీర్వదించి పంపువరకు మేము అన్నయ్య ఇంటనే ఉందుము, అని పలుకగా అది విని వర్షుడు ఉబ్బి తబ్బిబ్బయ్యెను. అది చూచి క్రిష్ణన్ “అరుణా నేను ఏమి కోల్పోయినానో ఇప్పుడు తెలిసినది అని కన్నీళ్ళ పర్యంత మయ్యెను. మీనాక్షి అగస్త్యునికి లకుమ సుందరి లను చూపి “ఆడపిల్లల ప్రేమ అట్లుండును అన్నయ్యకు ఎంత అనురాగము పంచుచున్నారో!” జానకి రఘువరన్ కూడా కళ్ళు వత్తుకొని “మీరెంతకాలమున్ననూ మీ ఇష్టము మేము మాత్రము రేపు కొచ్చిన్ పొవలెను.” అనుచుండగా వివేకుడు “మేడం రేపు నేను కూడా ఒక ఇన్వెస్టిగేషన్ పై శ్రీలంక పోవలెను” అని అరుణతారతో చెప్పగా ఇంకా అదే పాత పిలుపు ఎందుకు నాయినా అత్త గారు అని పిలువుము, నాకూతురిని సుఖపెట్టి కేసులు తరువాత చూచుకొనుము అని లకుమవైపు ప్రేమ నిండిన కనులతో చూచెను.
ల్యాండ్ రోవర్ ఆలలపై పడవవలె కదులుచుండెను. విదిష నడుపుచుండగా మీనాక్షి ప్రక్కన కూర్చొనెను. సుందరి అగస్త్యుడు వెనుక కూర్చొనిరి. అరుణ భర్త అల్లుడు కూతురు ఒక కారులో విదిష కారుని అనుసరించుచుండిరి. అంగ యారు కన్నె, శేషాచలముగారు, తులసి, మాలిని , నరేంద్ర పండిత్ మధుబాల మున్నగు వారిని వర్షుడు వేనెక్కించు కొని తార కారుని అనుసరించుచుండెను. ముందు మీనాక్షి కొడుకు కోడలు , పిదప అరుణ, కూతురు, అల్లుడు పిదప వర్షుడు, తల్లి ఆనందనిలయము కేసి సాగుచుండిరి.
సుందరి సిగ్గుతో మొఖం ప్రక్కకి త్రిప్పుకొని ఎడమవైపు దూరముగా కూర్చొనెను అగస్త్యుడు ఆమె చిటికన వేలు అందుకొన ప్రయత్నించుడగా విదిష అద్దమందు చూచి మీనాక్షి చెవిలో వేసెను. మీనాక్షి తన కళ్ళ కొలికిల నుండి వెనుకకు చూచి విదిషవైపు చూసి ముసిముసి నవ్వులు నవ్వుచుండెను.
లకుమ వివేకులు ఒకరినొకరు చూచుకొని మైమరచి పరిశరములను మరిచి కొన్నిలిప్తలు ఇనుము సూదంటు రాయి వలె ఒకరినొకరు అతుకుకొని విడిపోవుట చూసి క్రిష్ణ గారు అరుణతార చేతిని గిల్లగా అది వివేకుడి కంట పడెను. వర్షుడు మనసంతయూ బాల్యజ్ఞాపకాలు చుట్టినవి. అతడు తల్లి వొడిలో తలపెట్టుకొని అమ్మా అని పిలిచెను మాలినిగారు కొడుకు తలలోకి వేళ్ళు పొనిచ్చి నిమురుచూ “బరువులు భాధలు భాద్యతలు అన్ని బ కారములు ముగిసినవి అని అనుచుండగా “బాల్యము కూడా ముగిసినదికానీ భవిష్యత్ మాత్రము మిగిలి యున్నది. అనెను.
***
హిమకరుడు చంద్రికలను పరచి ఆనందనిలయమును అలరించుచుండెను. తెరచిన భోషాణము వలె పై కప్పు ఆచ్చాదనలేని మండువా గదిలో నేలంతయూ వెండిపూత పూసినట్లున్నది. చల్లగాలికి చలించుచున్న చెట్టుకొమ్మ లుచంద్రికల కవరోధము కలిగించుచూ చాయలు ఏర్పరచు చుండెను. మండువాగదిలో చలించు వాటి ఛాయలు చూచువారికి చెవుల పిల్లు లాడుచున్నట్లు నయనానందమును కలిగించు చుండెను. గడప గడపకూ వ్రేళ్ళాడు బంతిపూదండల పరిమళములు నాసికలు తాకి మత్తెక్కించుచుండెను. వివాహ మేళతాళములింకనూ అందరి చెవులయందు మారుమ్రోగుచున్నవి.
స్త్నానములు చేసి నూతనవస్త్రములు దాల్చి వచ్చిన నూతన వధూవరులు సైకత శిల్పములవలె నిలచి యుండి ఆనందపారవశ్యమునందుచుండగా, తార మీన తులసి మధుబాలల కళ్ళు మెరియుచుండెను. చుట్టూ ఉన్న ఆరు గదులు ఒక్కొక్క గది ఒక్కొక్క జాతి పుష్పములతో అలంకరించబడెను. రెండు జంటలే కదా ఆరుగదులకు అలంకరణ ఏలనో అని తార మీనాక్షిలు భావించిననూ మాలిని గారు తలుపు తీసి చూపుచుండగా పుష్ప పరిమళ సొభితమై పానుపులు శృంగారభావములను మోల్కొలుపుచున్నవి. లకుమ వివేకులు సుందరి అగస్త్యులు ఆనందపు అంచులలో విహరించిరి. కాముడు ఆ రాత్రి పిల్లలనూ పెద్దలనూ ఒక్కవిధముగా అలరించెను.












