Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, February 14, 2021

Bharatavarsha -131

నందిని వాహనమెక్కి వెడలిపోవుటకు ప్రయత్నించుచుండగా మాలినిగారు తలుపు   తీసి  “నీవు వెళ్ళుటకు వీలులేద”ని నందిని క్రిందకు దింపి ఆమెచేయి పుచ్చుకొనెను. “అత్తయ్య నన్ను ఆపు హక్కు నీకు లేదు నన్ను వదులుము” అని నందిని  చేతిని విడిపించుకొనుచుండెను.   పార్వతి "ఆపు హక్కు ఎందుకులేదు? రోజూ అత్తా అని ఆమెన   ల్లుకొని ఆమె వెనుక తిరిగి హాస్యములాడు నీకు నేడిట్లు మాట్లాడు హక్కు కలదా !" అని నిగ్గ దీసెను. ఇందు  పురుషులెవ్వరూ కలుగజేసు కొన కుండుట అదృష్టము మని చెప్పవలెను. 

అరుణ మీనాక్షి, యమునా పార్వతి, మంజూష కారుచుట్టు చేరి చూచుచుండిరి. ఇంకనూ మరికొందరు కారువద్దకు మెల్లగా వచ్చుచుండిరి వర్షుడు చకితుడయ్యి దూరముగా నిలిచిపోయెను. విదిష ప్రక్కనే నిలిచి అతడి మొఖంలోకి చూచుచూ అతడి భావములను గ్రహించుచుండెను.  యమున మీనాక్షితో " మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు నవ్వినందుకు అన్నట్టు ....  మీనాక్షి " ఉష్ నీవు మాట్లాడరాదు"  

బుచ్చెమ్మగారు "వర్షుడు చేతిని వెనుకకు లాక్కొన్నందుకు కాదు అది చూసి విదిష నవ్వినందుకు ఎక్కువబాధ నంది ని  పడుచున్నది. విదిష ఎందుకమ్మా అట్లు నవ్వి కవ్వించితివి” అనిరి.  "అట్లయినచో విదిష వైపు చూచుచూ నందిని వర్షుని చేతిని గ్రహించుట, ముద్దాడుట కవ్వించుటయేకదా “అని తులసీగారు అనగా అరుణతార  ఢిల్లీ లో పాత అనుభవమును గుర్తు చేసిరి “ వీరిద్దరూ కలిసిన  ఇట్లే అగుచున్నది, ఢిల్లీ ఆంద్ర భవన మందు కూడా ఇట్లే జరిగినది.   మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళ వలే నుండక ఇట్లు కలిహించుకొని పెద్దల మనసులను గాయ పరుచుచున్నారు. అని విదిష ఇట్లు రావమ్మా అని పిలచి నందిని  చేతిని విదిష చేతిని కలుపుటకు ప్రయత్నించగా విదిష చేతిని వెనుకకు లాక్కొనెను. నందిని మొఖం వివర్ణమాయెను. నందిని తలుపు తీసి వాహనము నధిరోహించెను.

 సందీపుడు కూడా చెల్లి ప్రక్కన కూర్చొనెను. అది చూసి మంజూష వెలవెల బోయెను. ఇంతలో పైడిమ్మ గారు వచ్చి సందీపుని దింపి నీ చెల్లి ఎడిత్తే నువ్వు సూడనేవు, మరి నా కోడలు ఏడిత్తే  నాను సూడగలనేటి బోయినాలకి నడవండి రేపు పెల్లె ట్టుకొని ఏటి ఇకటాలాడతన్నారేటి , కోపమొత్తే నాను మడిసిని కాను.   ఆ  గ్రామీణ భాష వెనుకనున్న ఆమె తియ్యని మనసు అందరినీ పులకరింపజేసినది.  మంజూష వచ్చి పైడమ్మపై వాలి కంట తడి పెట్టుకొనెను. నందిని కళ్ళు అశ్రుధారలు కురిపించుచుండగా చూసి, మంజూష "వదినా నామాట వినవూ !" నందిని "నాకు చెప్పుదానవయినావా !" అని కసురుకొనెను ఇంక ఈ గొడవ ఎట్లు ముగియునో ఎవ్వరికీ బోధపడకున్నది. ఇదిట్లుండగా యమున సలహాపై  బయటకు వెళ్లిన బసవడు అగస్త్యుడు  కీబోర్డు పట్టుకొచ్చినారు. వారు స్పీకర్లను, కీ బోర్డును అమర్చుచుండగా వర్షుడు నందిని వద్దకు పోయెను.  "సంస్కృతాంధ్రములందు పాండిత్యము, అపార సృజనాత్మక శక్తి నీ సొంతము.  నీ కర్దము కానిదేమున్నది. నీ గాన మాధుర్యమున కవి పండితులను ఓలలాడించిన నీవు ఇట్లు కిల్లి కజ్జములుఁ పెట్టుకొని నీ సంస్కృతమునకు, మన సంస్కృతికి కళంకము తెచ్చుచున్నావు నావల్ల తప్పు ఉన్నచో  క్షమించవలెను.   అని వర్షుడు అను చుండగా నందిని మెత్తబడిననూ కారు దిగకుండెను. 

మంజూష   "నేనెవరికీ చెప్పుదానను కాను ఎవ్వరికీ కావలసిన దానను కూడా కాను"  అని కన్నీరు పెట్టుచుండగా. లకుమ జంటగా వచ్చి కారు వద్దనున్న సమూహము లోనికి చొచ్చుకొని వచ్చెను.  పండిట్  మంజూషను చూచి ఇచ్చట ఏమి జరుగుచున్నది? అని అడిగెను. ఇచ్చట  ఆటలాడుచున్నారు అని కేశవుడు చెప్పెను. ఏమి ఆట లాడుచున్నారు ? అని పండిట్ కుతూహలంగా అడుగగా " ఈ ఆటను అలక అందురు , ఎక్కువగా ఈ ఆటను స్త్రీలు ఆడుచుందురు ." అని బసవడు చెప్పెను. వర్షుడివద్దనున్న విదిష చీరకొంగు బొడ్డున దోపి వడివడిగా అడుగులు వేయుచూ వాహనమును చేరి తలుపు తీసి నందినిని లాగి కౌగిట బంధించెను ముద్దులతో మొఖమును నింపు చుండగా పైడమ్మగారు సందీపుని దించి మంజూష వద్దకు కొనిపోయినారు.  


ఒక్కసారిగా  అనూహ్యమైన సంగీత  ఝరి  "టడ  టట్ట టడ.."  మ్రోగుచుండెను , అగస్త్యుని మీనాక్షి అమ్మ వలే కాక ఆకాశములో మెరుపువలె కనిపించుచుండెను. మీనాక్షి వేళ్ళు లయబద్ధముగా  నాట్యమాడుచుండ శబ్దములు సుడి గాలివలె రేగు చున్నవి. అచ్చట యున్న పెద్ద చిన్న అందరూ నాట్యము ప్రారంభించి, సంగీత లయననుసరించి అలలు వలే కదులు చుండిరి. విదిష నందినిలు ఒకరితో ఒకరు నాట్యము చేయుచుండ అరుణ కృష్ణన్ ఒకదరి చేరినారు. ఆనంద నిలయ ప్రాంగణమందు చెట్లు , కొమ్మలు , చిగురు  సైతము మైమరచి నర్తనమాడి అలసినవి. ఆ నాట్యమందు సర్వ శక్తులు హరణమాయి, క్లేదము నశించి స్వేదక్లేద చేలములందందరూ లఘుచిత్తము  నొందిరి. సుందరి అగస్త్యుడు మీనాక్షిని అల్లుకొని నిర్వికార నిర్యాణ మందిరి.  తైలము హరించి దీపము ప్రతిశాంతమయినట్లు సంగీత ప్రభంజనము భాధను హరించి క్రమేణా సమసి పోగా మనసులు ప్రశాంతత నొందినవి.  విదిష నందినులు ఒకరి చేతు లొకరు పట్టుకొని నిలిచినారు.  అందరిని ఆనంద భాష్పములు  ముంచెత్తినవి. భోజనములు మొదలయినవి. 

స్త్రీలందరూ వంటరిగా ఒక వరుస లో కూర్చొనగా వివాహితులు జంటలుగా కూర్చొనిరి, కృష్ణన్ , రఘువరన్ జానకి , బుచ్చెమ్మ సర్రాజుగారు ప్రక్క ప్రక్కనే కూర్చొనిరి  చంద్రమతి , సుకన్య మంజూష ప్రక్కన కూర్చొనగా మీనాక్షి యమున ప్రక్కన ప్రక్కన కూర్చొనిరి. మాలిని, అరుణ మీనాక్షిలు కూడా వడ్డన కు ఉపక్రమించినారు.    విదిష  నందినివర్షులను ప్రక్క  ప్రక్కన కూర్చొండబెట్టి వడ్డించుచూ  తిరుగుచుండ  మాలిని గారు   విదిష ను చూచి ముచ్చట పడి " కోడలన్న మా విదిష ,  బంగారము! " అని అనగా అరుణతార " నీకు ఉండబట్టకున్నది, ఇంతవరకు జరిగినది మరచినావా?” అనగా మాలినిగారు తప్పు  తెలుసుకొని నాలికకరుచుకొనట చూసిన వారికి నవ్వాగినది కాదు. దూరముగా వుండి వారి మాటలు వినిపించకుండుటచే నందిని వారందరితో శృతి కలిపి నవ్వసాగెను. 

బసవడు పార్వతివద్ద కూర్చొని భోజనము చేయవలెనని   ఉవ్విళ్ళూ రుచుండగా అరుణాతార  బసవని " నీవు ప్రాస మాత్రము కలిగిన   అర్థ రహితమగు కవిత చెప్పినచో పార్వతి ప్రక్కన నేను విస్తరి వేసి వడ్డించెదను అని  చెప్పగా బసవడు  కాబూలీవాడిని చూచినట్టు భ్రాంతి నొంది  " ప్రయత్నించెదను అని  మొదలు పెట్టెను.      

బండ గుండెల బలగ   జిలగారిపోవగా 

చెలఁగి రగిలెడి గుండె కొదడు మదడు

విప్ప లగలగ  లాగ చుట్ట చుట్టెది పట్ట,  

అట్టగట్టగ అడుగు  కొట్ట కొట్టగ పట్ట   ఎలుగెత్తి 

పలుగెత్తి పరిగెత్తి వంచి తుంచి పెంచి 

పంచి పోరా, వీరా, సూరా. 

ఇంత అర్థ రహితమగు కవితను మేమెచ్చటనూ వినలేదని అందరూ ద్రువీకరించగా  అందరి నవ్వులమధ్య వారిద్దరినీ  ఒక దరికి చేర్చి  అరుణ వడ్డించుచుండెను. “బసవడి  పక్కన కూర్చొన్న పార్వతి కనులు వాలినవి అని మీనాక్షి అనుచుండగా “నీ కొడుకు మాత్రము నీ కోడలి వంక దొంగ చూపులు  చూచుచుండెను” అని అరుణ మీనాక్షి దెప్పిపొడిచెను. మాలిని " " మీ అమ్మాయి సుందరి కూడా అగస్త్యుని అట్లే  చూచుచున్నది.” అని అగస్త్యుని  పక్షము వహించెను.

"నీ  కొడుకు అగస్త్యుడు కూడా అట్టి కవిత చెప్పినచో మా అమ్మాయి ప్రక్కన కూర్చొండబెట్టి  వడ్డించెదను"   అని అరుణ అని మీనాక్షితో అనుచుండగా, "అందరికీ కవిత్వము ఎట్లు వచ్చును? నీ అల్లుడు ఏమి కవితలు చెప్పినాడు?" అని అరుణను వేళాకోళము చేసెను. "షూటింగ్,  డైవింగ్ అనుచూ ఏమేమో చెప్పి మా మతులు పోగొట్టినాడు" అని మాలిని  గేలి చేయగా అందరూ నవ్వుచూ భోజనములు చేయసారిగి. 

అప్పుడు పండిట్ నేను కవితలు చెప్ప జాలను కానీ మీ అందరి కథలు చెప్పగలను  అని పండిట్ ఫ్రెంచ్ కిస్ ఎట్లున్నది వదినగారూ అని విదిష వైపు చూసెను.  ఫ్రెంచ్ కిస్ గూర్చి నాకేమి తెలియును?” అని విదిష అనగా పండిట్ “కానీ నాకు తెలియును ఇందాక వర్షుని సభ ముగియుచున్నది అని మీరు సభకి పిలిచినప్పుడు షూ అని ఒక  శబ్దము చేసినాడు కదా  అది పెరటిలో కలుసుకొనుటకు సంకేతము అని చెప్పుచుండగా వర్షునకు అలజడి మొదలయినది.  అందరూ ఆశ్చర్యముగా వర్షుని వైపు చూచుచుండగా పండిట్ “ ఆ పిదప వదినగారు  పోవుట బావ గారి పై వాలుట , ఎన్నో వర్షము కురిసిన  రాత్రులు  వదినగారి లేండ్ రోవర్ కారులో  పక్షులవలె విహరించుచూ చంద్రుని చూచుచూ.. వర్షునకు పొలమారినది, "ఇంక తినలేనని" లేచి పోవుచుండ అరుణ " వినలేనని  చెప్పరాదూ " అని చతురాస్త్రము సంధించెను.  విదిష కూడా అచ్చటనుండి జారు కొన్నది.

ఇవన్నియూ మీ కెట్లు తెలియును అని బసవడు  పండితు నడుగగా  అగస్త్యుడు “సూది కొరకు సోదికి పోయినచో పాత రంకు లన్నీ బయటపడును, నోరుమూసుకొనుట ఉత్తమము” అని బసవని మందలించెను.  వివేక్ నవ్వుచూ "నా సహాయకుడు మీలోనే , ఇచ్చటనే యున్నాడు." అనగా అందరూ నమ్మలేనట్లు నలుమూలలా చూచుచుండిరి. పండిత్ వేదిక వైపు చూపగా అందరూ తలతిప్పి అటు చూచినారు. “అచ్చటున్నది ఒక స్త్రీ కదా!” బసవడు అనగా వివేక్ " జే" అని పిలచినాడు. స్త్రీ వేషధారి అయిన జే వచ్చి ముందునిలచి క్షణములొ వేషమును తొలగించగా అందరూ నోళ్ళు తెరచి నారు. 

No comments:

Post a Comment