Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, February 8, 2021

Bharatavarsha 129

 వాహనములు ఆనందనిలయము చేరెను. మీనాక్షి అగస్త్య తులసమ్మ సుందరి ఒక వాహనమందు , బుచ్చెమ్మ , బసవ చందన  మరొక వాహనమందు ఆనందనిలయము చేరిరి.  కవి సమ్మేళనము జరుగు చుండెను. కవితా ఘోష్టి ఆహ్లాద కరంగా వినిపించు చుండెను. సుందరికి అగస్త్యునికి జంట కుదిరిన  శుభవార్త  బసవడు వర్షునకు  చరవాణిలో చెప్పగా  అతడి నుండి ఆ వార్త తెలుసుకొన్న అరుణతార మాలిని మహానంద భరితులై  ప్రవేశ ద్వారము వద్దే నిలిచి వారికొరకు ఎదురు చూచుచుండిరి. అరుణ తార మీనాక్షిని చూచి  " మీనాక్షి మొఖం మెరుగు పట్టిన బంగారము వలే కాంతు లీను చుండెను.” అనెను మాలిని “ కగ్గిన ఇత్తడి వలే నుండెడి మీనా మెరుగు పట్టిన పుత్తడి వలె ఎట్లు మెరియుచున్నదో. అని ఆట పట్టించుచుండగా, అప్పుడే వర్షుడు, కేశవ   పార్వతి వచ్చినారు.  నందిని వలతి విదిష కవిసమ్మేళనం లో నిమగ్ను లయ్యిరి.  మీనాక్షికి ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. తులసి గారు " ఆసుపత్రిలో మొదలు పెట్టిన నవ్వు అట్లే మా వియ్యపురాలి మొఖమున నిలచిపోయినది" అని  చెప్పుచుండగా. యమున భయపడి మీనాక్షి జెబ్బపై గిల్లెను. అయిననూ మీనాక్షి నవ్వు ఆగకుండెను . అది గమనించిన మాలిని యమునను ఒక్క మొట్టిక్కాయ వేసినది. ఆమె నవ్వుటకు కూడా వీలులేదా? మొరటు మొగుడి వలే సాధించుచున్నావు" అని కసిరెను. అగస్త్యుడు సుందరి ఒకరికొకరు సైగలు చేసుకొనుచుండిరి.    అది  గమనించిన అరుణతార " ఏ మా సైగలు” అని సుందరిని నిగ్గ దీయగా “లేదమ్మా ఆయన ఎదో మాట్లాడవలెనని...”  సుందరి నసుగు చుండెను.   అరుణతార  “ఈ రాత్రి  సుందరి వైపు చూచుటకు కూడా వీలులేదు. ఇంకనూ సుందరి నీ భార్య కాలేదు " అని కోపము నటించగా,   మాలిని అగస్త్యుని దగ్గరకు తీసుకొని    నీకేమి తెలుసునమ్మ నా బిడ్డ ప్రాణములకు తెగించి ఆ రాత్రి  మోటారు సైకిల్ మీదవందల  మైళ్ళు పోయి, తన ప్రాణమిచ్చి ఈ పిల్లను తెచ్చుకొనెను. ఆ రాత్రి  రెండిళ్లకు  నిద్ర లేకుండెను అని అగస్త్యను  ముద్దాడెను. ఆనాడే ఈ పిల్ల అతడి భార్య అయినది . 


మీనాక్షి మొఖం నందు చిరునవ్వు నిలిచిపోయెను. ఆ చిరునవ్వు పేరే సుందరి.  మీనాక్షి సుందరిని దగ్గరకు తీసుకొని మురియుచుండెను.  వెనుకానిలచిన బుచ్చెమ్మ గారు, “ఇంక లోపలకి పదర్రా వచ్చువారికి దారి వదలక ఏమీ సయ్యాటలు అని అందరినీ అదిలించినారు. అతివలందరు దారివిడిచినారు. అప్పుడే చంద్రమతి, చక్రవంతుడు , సుకన్య వచ్చుచుండిరి. ఆడవారందరూ వారిని తోడ్కొని లోనికి పోయినారు. మగవారు ప్రవేశ ద్వారము వద్ద నిలిచి యుండగా పండిట్, తల్లి తండ్రులతో వచ్చుచుండెను. లకుమ ఎచ్చట కలదు?  వర్షుడు అడిగెను " మండువా గదిలో తండ్రి ని విడువక అంటిపెట్టుకొని యన్నది.” అని కేశవుడనెను.  


 ఆమె ఎంత కోల్పోయెనో కదా అని వర్షుడు విచారము వ్యక్తము చేసి “ ఇతడే లకుమ వరుడు, వీరు ఇతడి తల్లి తండ్రులు   వీరిని లోపలకి తీసుకు పోవుచున్నప్పుడు లకుమ చూడరాదు పోయి అరుణమ్మను , మాఅమ్మను పిలుచుకు రమ్ము, అట్లే ఒక పంచెల చాపు కూడా తీసుకు రమ్ము అని కేశవునకు చెప్పగా కేశవుడు లోపలకు పోయెను.

విశాలమైన మండువా నిండుగా స్త్రీలు కూర్చొని యుండగా వారి సంభాషణల జుమ్ముటీగలవలె ధ్వనించు చూ ఆ పెద్ద గది అంతయూ ముసురు కొనెను. రంగు రంగుల పట్టు చీరలు, కళ్ళు మిరిమిట్లు గొలుపు చుండెను. మీనాక్షి, యమున అరుణ , మాలిని తులసి  ఒకే సోఫా పై కూర్చొని  మేఘములలో తేలాడుచుండిరి. యమున ప్రౌఢ కాకున్ననూ మీనాక్షి శరీరములో అంతర్భాగమగుటచే ఆమెకు కూడా ఆ గౌరవమే దక్కుచున్నది. 

మాలిని మీనాక్షితో  " ఆమ్మో! నీ కొడుకు ఎంత గ్రంథసాంగుడమ్మా! వైద్యము ముగిసిననూ ఆశుపత్రిలో ఉండి ఎంతనాటక మాడినాడు" మీనాక్షి మాలిని వైపు చురుకుగా చూసి "నాకొడుకు నాడిపోసుకొనుచున్నావు కానీ,  నీ కొడుకే గ్రంథసాంగుడమ్మా, ఈ నాటకమంతటికీ రచన దర్శకత్వము నీ కొడుకే. డాక్టరుని వప్పించి,  నాకొడుక్కి మప్పినాడు.   అన్ని చేసిననూ నీ కొడుకు ఎమెరుగని సదాచారివలె కనిపించును.  నా కొడుకు అమాయకుడు కనుక దొరికి పోవును.”అని మీనాక్షి నిట్టూర్చెను. అప్పుడు తులసమ్మ గారు మీనాక్షితో  " అవును నీ కొడుకు ఎంత అమాయకుడో, ఆసుపత్రిలో గదిలోకి పోగానే నాకూతురి పైట లాగినాడు." అట్లు వారు సరస సంభాషణలో ములిగి తేలుచుండగా  కేశవుడు "అరుణమ్మా , బంధువులు వచ్చినారు”  అని అరిచెను. వారికోసమే ఎదురు చూచుచున్న అరుణకు లకుమ అత్తమామలు నరేంద్ర పండిట్ వారి సతీమణి మధుబాల వచ్చినారని అర్ధము చేసుకొనుటకు సమయము పట్టలేదు. అరుణ లేచి లకుమవైపు చూసెను.  ఆమె తండ్రితో కూర్చొని ముచ్చటలాడుట చూసి ఆమె నేత్రములార్ద్ర మాయెను. అరుణ మాలిని మీనాక్షి యమున తరలి వచ్చి పండిట్ను అతడి తల్లి తండ్రులను  సాదరముగా లోనికి తోడ్కొని పోవుచుండిరి. 

ఇంతలో భారత వర్ష అరుణ వద్దకు వచ్చి అరుణమ్మ చెవిలో ఎదో గుసగుసలాడు చుండగా  మాలిని అతడివైపు  చూసి ఇంక చాలింపుము నాయినా అని కోపముగా అనెను. అప్పుడు కేశవుడు చాలింపుము అనుచున్నావా   ఇంకనూ నయము తాలింపు అనలేదు, వంట మొదలు పెట్టనిదే" అని హాస్యమాడెను.  “హాస్యము లేని వివాహమా!  క్రీడలు లేని శృంగారమా! పాపము శమించుగాక!” అని వర్షుడు “పండిట్ వచ్చినట్టు లకుమకు తెలపరాదని అందరికీ తెలిపెను. 

 అరుణ "అది నాన్న తో అచ్చటనే కూర్చొని యున్నది రహస్యముగా ఎట్లు కొనిపోగలము?” అని అడిగెను.  వర్షుడు నవ్వి ఇట్లు అని ఒక పంచెల చాపు ఒక కొస తన చేతిలో పట్టుకొని మరొక కొస కేశవు నకిచ్చి పండిట్ కు అడ్డుగా తెరవలె పట్టుకొని లోపలకు తీసుకుపోవుచుండిరి. ఇది యేమని నరేంద్రుడు ప్రశ్నించగా ఇది దక్షిణాది ఆచారమని వర్షుడు చెప్పెను. మధుబాలగారు “దక్షిణాది వివాహ సంప్రదాయములు చాలా ఆశక్తి కరముగానున్నవి అనిరి” “ఇచ్చట ఆటలు ఇంకనూ ఆశక్తి కరముగా నుండును.” అని వర్షుడను చుండగా “మమ్మందరినీ ఆడించెదరా లేక మా అబ్బాయినే ఆడించెదరా?” అని అడుగుచున్న లకుమ మామగారిని చూచి మాలిని, అరుణకు నవ్వాపుకొనుటకు కష్టమయ్యెను.    అట్లు లకుమ వరుని , అతడి తల్లి దండ్రులను తీసుకుపోయి మగవారి గదిలో కూర్చోండ బెట్టి నారు. అచ్చట పెక్కు మగ వారిమధ్య పచాకో కూడా యుండెను.  అతడు పండిట్ను పలకరించి వద్దకు వచ్చి కరచాలనం చేసెను. వారిరువురూ మాట్లాడుకొనుచుండగా, వర్షుడు అతడి తల్లి తండ్రులతో “మీరు స్నానమాచరించదలచుకొన్న స్నానముల గది అదిగో అని చూపి కొత్త పట్టు బట్టలు కట్టుకొనమ”ని చెప్పెను. ఇంతలో బసవడు అగస్త్యుడు , ఆ గదిలోకి ప్రవేశించగా వర్షుడు వారికి  కూడా తన పథకమును చెవిలో తెలిపెను. బసవడి మొఖం దివిటీ వలే వెలిగెను. అతడు మండువా గదిలోకి పోయి కొలది సేపు ఆగి లకుమను వివాహమాడుటకు వరుడు తల్లి తండ్రులతో వచ్చి యున్నాడని అరుణ తారకు చెప్పవలెను.  

                                                                         ***

బసవడు స్త్రీలు కూర్చొన్న మండువా గదిలోకి పోయెను.  విదిష అప్పుడే అచ్చటికి వచ్చి కవి సమ్మేళనము కొలది సేపటిలో ముగియును పిదప భోజనములు కలవని వర్షుని ఇతరులను రావలెనని ప్రకటించెను.  షూ అని కూసి వర్షుడు పురుషుల గదిలోనుండి “అట్లే” అని సమాధానమిచ్చెను.  సోఫాపై మీనాక్షి సుందరి యమున, అరుణ, మాలిని కూర్చొనగా వారి పాదములవద్ద తివాచి పై చంద్రమతి,సుకన్యా కూర్చొనగా వారి మధ్యలో పార్వతి కూర్చొనెను. కొలది దూరములో కుర్చీ లపై  మంజూష,  వలతి బుచ్చెమ్మ గారు , జానకి గారు , కూర్చొని యుండిరి. చందన అందరికీ పానీయములు పలహారములు అందించుచుండెను. 
పండిట్ తల్లి దండ్రులు తయారగుటకు కొలది సమయము పట్టును కావున కొలది సేపు వేచి యుండి అరుణతారను కుటుంబముతో వచ్చి వరుని చూడవలెనని వారి తల్లి తండ్రులతో మాట్లాడవలెనని పిలచుటకై కాలయాపన చేయుచూ బసవడు పార్వతివైపు చూచు చుండెను.
 
పార్వతిని బసవడికి ఇచ్చి చేసెదనని మాటిచ్చి నిలుపుకొనకుండుటను బుచ్చెమ్మగారు చంద్రమతి ని   తప్పు పెట్టిరి.  చంద్రమతి “ఆ గౌడ సోదరులు మావూరికి పట్టిన దరిద్రము, వారికి జడిసి మేము అట్లు జేసినాము. మా గ్రామమునకు పట్టిన దుష్ట గ్రహ సంహారము జరిగెను. పట్ట పగలే ప్రజలందరూ చూచుచుండగా సింహము ఆ దుష్టులను సంహరించెను. ఆ జగన్మాతే వచ్చి ఆ దుర్మార్గులను సంహరించెనని, సింహము గ్రామము లోనికి వచ్చుట ఏ అందుకు తార్కాణమని ఊరు ఊరంతయూ నమ్ముచున్నది.  ఈ వింత వార్త టీ వీ లలో హోరెత్తుచున్నది” అని చెప్పగా సుకన్య “అచ్చట ఇప్పుడు దుర్గామాత ఆలయ నిర్మాణమునకు సన్నాహాలు జరుగుచున్నవి. మీరు టి వీ చూచుటలేదా?” “టీ వీ చూచు తీరుబాటెక్కడున్నదమ్మా ఈ పెళ్లి ఇంట” అని మాలిని గారు బదులు పలికినారు.  

ఊరి ప్రజలందరికీ సింహమొక్కటే కనిపించెను కానీ నాకు సింహము పై వచ్చిన దుర్గ మొహము కూడా కనిపించెను. విదిష అచ్చటనుండి వెడలు చుండెను సుందరి విదిష వద్దకు పోయి ఆమె పాదములకు ప్రణమిల్లెను. విదిష ఆమెను ఆశీర్వదించి అచ్చటనుండి భోజనములు ఏర్పాట్లు చూచుటకు వెడలెను. 

మాలినిగారు అరుణ తారకు “బసవడు పార్వతిని తదేకముగా చూచుచున్నాడ” ని చెప్పగా అరుణతార పార్వతి మొఖం పై తన పైట చెంగు కప్పి బసవడి వైపు కొంటెగా చూచెను. బసవడు బిక్క మొఖం వేసెను. స్త్రీలందరూ నవ్వు చుండగా   బసవడి వద్దకు కేశవుడు చేరి " మన తంత్రము మనపైనే ప్రయోగించుచున్నారు " అని గట్టిగా చెప్పగా వారిరువురూ నవ్వులపాలు అయ్యినారు .   వలతి పార్వతి వద్దకు చేరి “పిల్లవైపు చూడవలెనన్ననీవు ఒక ఆసుకవిత చెప్పినచో నేను (పార్వతి) ముసుగు తీసెదను” అని బసవని కవ్వించగా “అదెంత పని అనుచూ  సందర్భోచితముగా

వెచ్చగ వచ్చిన విచ్చని మొగ్గను 
మెచ్చని కాంతలు కాంతుడు కాంచిన 
ఓర్చని భామల కొచ్చెను పొచ్చము 
పైయెద మాటున నవ్విన సవ్వడి చేసిన చాలును. 

అని అని బసవడు చెప్పుచుండగా వలతి కొద్ది క్షణములు  పార్వతి ముసుగు తొలగించి మరలా మూసివేసెను. బసవడు మ్రాన్పడెను. చూచితివా స్త్రీల తెలివి అని కేశవునితో అనెను. పార్వతి గలగలా నవ్వుచుండెను. అది విని బసవడు మురియుచుండెను.  అరుణ తార “కవిత ద్వారా సందేశము లివ్వకుండా కవిత చెప్పవలెను, అసలు అర్ధరహితమగు ప్రాస సహితమగు కవిత చెప్పినచో  పార్వతికి నీకు పక్కపక్కన భోజనములు నేను వడ్డించెదను. అని అనగా తప్పక చెప్పెదను, కానీ లకుమ కొరకు పెళ్లి కుమారుడు తల్లి తండ్రులతో విచ్చేసి యున్నాడు, మీరొక సారి పోయి వారితో మాట్లాడి రావలెనని నా వంటి శ్రేయోభిలాషుల కోరిక.   అని చెప్పగా లకుమ నాకు పెళ్లి వద్దు నేను పెళ్లి చేసుకొనను అని చెప్పెను. 
కృష్ణన్" పెళ్లి చేసుకొన్నచో నీ జీవితమునకు శాంతము చేకూరునమ్మా  నామాట విని పెండ్లి చేసికొనుము. అని చెప్పినారు " ఒక్కసారి నీవు పోయి చూసినచో నీకు నచ్చునేమో అని అప్పుడే అచ్చటికి వచ్చిన వర్షుడు, నందిని , కూడా నచ్చచెప్పిరి.  వలతి  కూడా పెళ్లి చేసుకొనుటయే ఉత్తమమని చెప్పెను. లకుమకు కోపమావహించెను. నేను చేసుకోనని ఇదియే ఆఖరు సారి చెప్పుచున్నాను , నన్ను విడువవలెను అనెను. 
నీ మనసులో ఉన్న వ్యక్తి పండిట్ వచ్చినచో చేసుకొందువా అని వర్షుడు అడిగెను . లకుమ మొఖం ఎర్రబారెను. అడిగినది నీవు కానిచో మూతి పై గుద్దెడి దానను.మూతిపై కొట్టుట చెంప కొట్టుట ఇట్లు చేసిన నిన్ను పండిట్ పెళ్ళాడునా ?  పెళ్లాడిననూ ఆ పెళ్లి నిలుచునా ? అని నీ కోపము తగ్గించుకొనుటకైననూ పోయి చూచి రావలెను అని వర్షుడు మరింత ముందుకి పోయెను . ఆ మాటలు లకుమను ఆపివేసినవి " సరే పోయి ఒక్క సారి చూసి ఒక్క నిమిషములో వచ్చెదను , మరల నన్ను పొమ్మని అనరాదు అని లకుమ అనెను . అట్లే నీవునూ ఒక్క నిమిషము మించి గదిలో ఉండరాదు అని నందిని అనెను.  లకుమ సరే అనగా ప్రౌఢలందరూ నవ్వుచుండిరి .  వర్షుడు “ అరుణమ్మ లకుమ ఒక్క నిమిషము మించి గది లో యున్నచో నీదే భాద్యత”  అనెను .  అరుణ " అది నాభాద్యత ఎట్లగును " అని తల్లి అనుచుండగా లకుమ తల్లికి భరోసా ఇచ్చి వెడలెను. మండువా గదిలో అంతా సూది పడిన వినిపించు నిశ్శబ్దము, ఉత్కంఠ నెలకొనెను.

లకుమ తలుపువద్ద నుండి ఒక సారి లోపలకి చూచి వెనుకకు తెరిగెను విశాలమైన కాంతివంతమైన గదిలో ఆది శేషుని పై శ్రీ మహావిష్ణువు వలే ఆజానుబాహుడైన పండిట్ తల క్రింద చేతి నుంచుకొని ధవళ వస్త్రముల కాంతులీనుచూ సోఫాలో పడుకొని యుండెను. లకుమ అతడి భంగిమ చూచి దిగ్భ్రాంతి చెంది ముందుకు పోవలెనో వెనుకకు పోవలెనో తెలియక ముందు కొకడుగు వెనుకకి ఒక అడుగు వేయుచుండగా మండువా గది అంతయూ నవ్వులతో నిడిపోయెను. అరుణతార కన్నుల నుండి  ఆనందభాష్పములు రాలు చుండెను. లకుమ సందేహమునకు తెర దించుచూ పండిట్ లకుమ చేతిని అందుకొని లోపలి లాగి తలుపు వేసెను. లకుమ పండిట్ ను అల్లుకొనెను. లకుమ ఓడిపోయినది, వోడి పోయినది అని  అమ్మలక్కలు అనుచుండిరి.  మాలిని తారకు మిఠాయి తినిపించు చుండగా, యమున మీనాక్షికి మిఠాయి తినిపించుచుండెను.  కేశవుడు బసవడు పోయి తలుపు కొట్టి నారు లకుమ బైటకు వచ్చి తల్లి ఎదపై వాలి అమ్మా. నేను మరల ఓడితిని, " నీవు మరల గెలిచితివి అని అరుణ కూతురిని బుగ్గలు నిమిరి గారం చేసెను . నేను పండిట్ ను పెళ్లి చేసికొందును. అని లకుమ చెప్పుచుండగా బాగున్నావమ్మా నీ కూతురి రాగాలు  నీ  గారాలు , వరుని మేము కూడా చూడవలెను వర్షుడు పరీక్షించవలెను , పిదప ఆ పరీక్ష నందు పండితుడు వివేకముతో నెగ్గినచో  అప్పుడు పెళ్లి. అని బసవడు అనుచుండగా లకుమ మిక్కిలి కలవర పడెను. అది చూచి నా అల్లుడుకి పరీక్షలు వలదు అతడు ఇక్కడివాడు కాదు 
అని అనగా  బసవడికి తిక్కరేగి " బల్లిపాడు నందు నాకు  పరీక్షలు ఎట్లు  పెట్టినావమ్మ అను చుండగా అరుణ తార డంగయ్యెను. ఒప్పుకొనక తప్పలేదు , అంతలో పచాకో వచ్చి  కుర్రవాడు నేరపరిశోధనలో, గుట్లు రట్టు చేయుటలో దిట్ట. రైఫిల్ షూటింగ్ , డ్రైవింగ్ , కంప్యూటర్ హెకింగ్ బాగుగా చేయును , పరీక్షించి చూడవలెను అనుచుండగా " డబల్ బారెల్ సింగల్ బారెల్,  బోల్ట్ రైఫిల్, ఎయిర్ పిస్తోల్ , ఆటోమాటిక్ , సెమి ఆటోమేటిక్ , ఎస్సాల్ట్ రైఫిల్స్ ఎని రేంజ్ ఐ యాం రెడీ.” అను చుండగా మా మున్నా గత సంవత్సరము నేషనల్ రైఫిల్ షూటింగ్ ఛాంపియన్ అని మధుబాలగారు చెప్పుచుండగా ఇదెక్కడి మేళమురా బాబు అని అగస్త్యుడు కేశవుడు తలపట్టుకొనిరి. ఆ దృశ్యము చూసి అందరూ ఒకటే నవ్వు  " నీ అల్లుడు చూడుమమ్మా.. ” అని మాలిని పగల బడి నవ్వసాగెను. నందిని " అయ్యా పండిట్ గారు తమకి ఛందస్సు వచ్చా . అనుష్టూప్   ఛందస్సు దానిపై పరీక్ష , అనగా  “ఎస్,  ష్టూపింగ్  , నాకు తెలియును అనగా డైవింగ్ లో వంగుట,   మైనస్ ఫైవ్ డిగ్రీస్ నుండి 10 డిగ్రీస్ వరకు వంగవలెను దీనిని ఆప్టిమల్ యాంగిల్ ఆఫ్ రిలీస్ అందురు దీనివలన… అని చెప్పుకు పోవుచుండగా బుచ్చెమ్మగారు అవాక్కయ్యిరి  “మా బసవడు కంటే నాసిగా నున్నది నీ అల్లుడివరస. పద్యములు వ్రాయుట నేర్చుకొనలేదా మీ పిల్లవాడు అని మధుబాలను అడగగా ఆమె ముఖము తిప్పుకొన్నది. అరుణ మూతి మూడు వంకలు తిప్పినది. 
 బసవడు “ లకుమ గూర్చి ఒక  ఆశుకవిత  చెప్పిన అది చాలును అని చివరి అవకాశమునిచ్చినారు. వర్షుడు పండిట్ను ప్రాంగణము లోకి కొనిపోగా మగవారంతా అతడిని అనుసరించిరి , తరువాత ప్రౌడలు కూడా అతడిననుసరించిరి లకుమ వంగి వంగి కిటికీలోంచి తన లేడికళ్ళను తప తప  లాడించుచూ  పండిట్ను చూచుచుండెను. తన ప్రియుడి కొరకు లకుమ ఎట్లు చూచుచున్నదో అని అందరూ లకుమవైపు చూచుచూ వినోదించుచుండగా, పండిట్ ఆశుకవిత కూడా చెప్పలేకపోవుటచే ఏదైననూ ఒక చిన్న పొడుపు కథ చెప్పమని మీనాక్షి అడిగెను.  అదియునూ చెప్పజాలక పండిట్ అలిగి వెడలిపోవుచుంచుండెను. లకుమ మిక్కిలి ఆందోళన చెంది పండిట్ కొరకు బయటకు వచ్చుచుండగా వర్షుడు పండిట్ వెనుక పరుగు పరుగున పోయి గెడ్డము పట్టుకొని “ రావయ్యా పండితా ఎచ్చటికి పోవుచున్నావు , నీ అంత  ఘనుని పోనిత్తుమా !  అఖిల భారతమందు నీ అంత పరిశోధకుడు లేడని అంతర్జాలమందు , పత్రికలలో చదివి  నీవెంత ఘనుడవో తెలుసుకొంటిమి , నీకు తగిన చిన్నది మా చెల్లాయి, నీ పై తలమునకలగు ప్రేమతో,  తన ప్రాణములన్నీ నీపైనే పెట్టుకొని కళ్ళల్లో వత్తులు వేసుకొని నీకొరకు ఎదురుచూసినది, నీవు లేనిచో జీవితమే నిస్సారమని తలచినది.   ఆమెను వదులు కొందువా!  మీరు ఇరువురూ ప్రక్క ప్రక్కన నిలచినచో మా మనసులలో ఇంద్రధనస్సు వెల్లి విరియను.  మీరు ఇరువురూ మాట్లాడుకొన్నచో మహతి (నారదుని వీణ) నాదము మాహృదయములలో మ్రోగున”ని బ్రతిమాలుచుండగా మరి మమ్మీరువరినీ  మాట్లాడుకోనిత్తురా అని అడిగెను. అలిగిన పిల్లవాడు మిఠాయి అడిగినట్లనిపించి నవ్వు వచ్చిననూ నవ్వినచో ప్రమాదమని “కోపము వీడి అందాలరాశి అయిన తన చెల్లి చేతినందుకొనవలెనని   గానము చేయసాగెను ఆ గాన మాధుర్యమున కు సాహితీ సభ స్థంభించెను. కవులందరూ అతడి గానమునాలకించుచుండిరి. 

నీరంధ్ర కురులతో నిలిచె మా లక్ష్మి
చంద్రికలు మోములో దొరలు మా లక్ష్మి
సూరి సూరుని భవ భావముల రశ్మి
ఇంద్రనీలాల కనుల బులిపించు లక్ష్మి 
పండిత వాసముల నడయాడ లక్ష్మి
అరిపాదములకు మకిల మంటకుండ
నడిపింతురు అన్నలందరు అరచేతలంట.
అటులే నడిపించవయ్యా ఈ శుభాంగి ఇక నీ అర్ధాంగి 

(బసవ కేశవ వర్ష  అగస్త్యులు తమ చేతులు నేలపై నుంచి  బయటకు వచ్చుచున్న లకుమను తమ  చేతులపై నడిపించి పండిట్ వద్దకు తెచ్చినారు. అప్పుడు నందిని ఇట్లు పాడుచుండెను.)

శుభాంగి నయనముల దాగె సారంగి 
నారంగి వయనములో మ్రోగె సారంగి
తొంగి తొంగి సంపంగి వంగి చూడ
అంగాంగమున పలికె నయగారము
చేరింక మురిపంగ దాటించ వారము
చేరికతో కాంతుడు చేయాలి గారము
ఈ కాంత కోరెను ఏకాంత వాసము. 
(అనుచూ లకుమ చేతిని పండిట్ చేతిలో పెట్టెను. అరుణ మాలిని మీనాక్షి కనులు వత్తుకొనుచుండగా కేశవుడు అరుణమ్మను చూచుచూ ఇట్లు గీతమునఆలాపించెను.) 
ఈ శుకవాణి, విరిబోణి నీ అలివేణి  
నీ కనుల కదిలేటి   నీ కళల రాణి 
దిద్ది పెండ్లి పారాణి ఘనతార మంత్రిణి
తెలిపె సమ్మతి ఇచ్చే అనుమతి  
చేకొనవయ్య  బహుమతి  (పండిట్ లకుమ చేతిని చేకొని తోటలోకి నడవసాగెను)

*జాగ్రత్త నాన్న కేంద్ర మంత్రి, తేడా పాడాలోస్తే తోలు తీసేస్తుంది. (కేశవ అగస్త్య బసవ)

అందరూ కవిసమ్మేళనం ముగించుటకు వేదికవైపుకి పోయినారు. వర్షుడు వేదికనెక్కెను. 

4 comments:

  1. పిల్లలందరికీ వివాహములు చేసేస్తున్నారు.ఎక్కడ చూసినా పెళ్ళి సందడే కనపడుతుంది.అమ్మాయిలు, అబ్బాయిల కొంటెతనం, అల్లరి ఆటవిడుపులా ఉంది.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. లకుమకి ఎంత ప్రేమదక్కిందో చూసారా! ఒక ప్రక్క అమ్మ ప్రేమ మరోప్రక్క నాన్న ప్రేమ. ఒక ప్రక్క ప్రియుడి ప్రేమ అన్నింటినీ మించి అన్న ప్రేమ. చేతుల మీద నడిపించే దృశ్యం మీ మనసు నితాకినట్టు లేదు పండిట్ కి చెల్లిని అప్పగిస్తూ పాడినఆ పాట ఎలా ఉంది?

    ReplyDelete
  4. పాట బాగుంది.తల్లి మాట పెడచెవిన పెట్టిన ఆమె చాలా దెబ్బతింది.ఆత్మన్యూనతా భావంతో, అసహాయ స్థితిలో ఏమగునో అనిపించెను.కానీ ఆమె జీవితానికి పూలబాట వేశారు.

    ReplyDelete