Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, February 23, 2021

Bharatavarsha 134

తూరుపు తెల్లవారు చుండెను. వెలుగురేడు ఎల్ల లోకములనూ ప్రకాశింపజేయుచుండెను. నేడే మంజూష , లకుమ, సుందరి , పార్వతుల  వివాహము. తల్లుల కన్నులు కాయలు కాయ ఎన్నాళ్ళో వేచిన దినము.  

మంగళ స్నానమాచరించిన రుచిర, దృఢ దుర్నిరీక్ష్య తేజోమయ దేహములు గల యువకులు ధవళ వస్త్ర ధారులై ఆనందనిలయ ప్రాంగణ మందు మెదులుచుండ   పర్వతము లపై సంచరించెడి శ్వేతపర్జన్య సమూహము నేల వాలినట్లున్నది. ప్రౌఢల అలంకరణలు ముగిసిననూ పడతుల అలంకరణలు ప్రౌఢలే చేయుచుండుటచే కాలయాపన జరుగుచున్నది. మీనాక్షి యమున నిమ్మపండు రంగు చీరలు రవికలు దాల్చి జంట కవులవలె ప్రక్క ప్రక్కనే నిలిచిరి. అరుణ నీలాకాశవర్ణపు పట్టు చీర ధరించి  లకుమకు చీర కట్టుట నేర్పుచుండెను.  ఎంతకీ అది కుదరక పోవుటచే లకుమ విసిగి " అందరివలె నేను లంగా వోణీ ధరింతును రాత్రి వివాహమునకు చీర ధరింతును అని చీర పీకి పక్కన తల్పముపై  పారవేసి   లంగా వోణీ ధరించి పడతుల సమూహమును చేరెను. సుందరి అలంకరణ జరుగుచుండగా అగస్త్యుడు తొంగి చూచి పట్టుబడుటచే అరుణతార యువకులను  బైటకు నెట్టి వేయుటతో  వర్షుడు, కేశవుడు అగస్త్యుడు, బసవడు, వివేకుడు, సందీపుడు చెలిమి చలువము పూసుకొని చెట్టాపట్టాలేసుకొని ప్రాంగణ మందు విహరించుచుండిరి.

ఆనందనిలయ మందు రంగు రంగుల గుడారముల తోరణములు గాలికి బిరబిరా కదలాడుచూ నయనానందము కలిగించుచుండెను. ప్రాంగణమంతయూ ఎర్రని తివాచీలు పరువబడినవి. తెల్లని పాదముల జంటలు యెర్రని తివాచీపై నడయాడుచూ ప్రవేశ ద్వారమును చేరినవి. ప్రవేశ ద్వారమువద్ద సువాసన వెదజల్లు మరువపు ద్వారము నిర్మించ బడెను. వివేకుడు కోటేరువంటి ముక్కును మరువపు మాలలకానించి ఆహా ఏమి సువాసన అనెను కేశవవుడు నాసిక ను దట్టమైన సుమమాలల పై నుంచి అబ్బా ఎంత చక్కటి పుష్ప ద్వారము అనెను బసవడు ఆహ ఎంత కమ్మని పెస రట్ల వాసన విడిదింట అల్పాహారము మొదలాయెను.  అందరూ మరువపు సువాసన మూర్కొనగా బసవడు  పెస రట్ల వాసన నాఘ్రాణించుటతో అగస్త్యుడు "తిండి వాసన పసిగట్టు ట యందు పోలీసు జాగిలాములు కూడా వీడి ముందు దిగదుడుపేకదా!" అనగా అందరూ నవ్వుకొనిరి.  

“విడిది భవనమందు అల్పాహారం సిద్దమయినది మనము పోయి ఆరగించవలెను.” అని బసవడు అనుచుండగా వర్షుడు " వరులు ఉపవాసముండవలెను, పలహారములు నాబోటి వారికి మాత్రమే. అమ్మల అలంకరణలు పూర్తి అయిన పిదప వారితో కలసి పోయి వారికి " నేనే స్వయముగా వడ్డించవలెను.” అనెను. బసవడి మొఖము జేగురించెను. అదిచూచి   అగస్త్యుడు “అయ్యూ  ఎంత పని అయినది పెసరట్లు  తినుటకు అదృష్టముండవలెను” అని అగస్త్యుడు బసవని ఆట పట్టించుచుండెను. “అయ్యూ మా బావగారిని ఇట్లు ఆట పట్టించ దగునా!” అని కేశవుడు వ్యంగ్య మును చూపగా అది నిజమని భ్రమసి బసవడు మహానందము నొందుచుండ అలక పానుపు పై అల్పాహారము అడుగు అల్పజీవి వలె తోచి " నిన్ను చూచిన జాలి కలుగుచున్నది” అని వర్షుడనెను.  బసవడు అదియునూ అర్ధము చేసు కొనక “చందనను పిలచి రహస్యముగా రెండు పెసరట్లు తెప్పించుకొందును… అని మాట తడబడగా …అందరికీ తెప్పింతును.”అనెను.  వర్షుడు "ఇట్లు మాటలాడుటకు సిగ్గుండవలెను, అగస్త్యుని కారణముగా బైటకు గెంటివేసినారు అది గ్రహింపుము"అనగా హాస్యము వెల్లి విరిసెను. ద్వారము నుండి అందరూ వెనుకకు మరలినారు. వర్షుడు కబురు చేయుటతో పెద్ద వస్త్ర వ్యాపారులు , నగల వర్తకులుతమ తమ నాణ్యమైన సరుకులను ఆనందానిలయమందు తివాచీలపై పరుచుచుండిరి. కొలది సేపటిలో ఆనందనిలయము పెద్ద అంగడిని తలపించుచుండెను. స్త్రీల అలంకరణ పూర్తి అయినది కానీ వారు బయలుదేరునంతలో ఛాయాచిత్ర గ్రాహకుడు తన బృందంతో ప్రవేశించుటతో స్త్రీలు తమ అలంకరణలను అందాలనుచిత్రములందు స్థిరపరుచుకొనుటకు ఉవ్విళ్ళూరుచుండిరి. యువకులకు లోపల కి  పిలుపు వచ్చెను.

అరుణ తార,  అంగయారు కన్నె,  మీనాక్షి , తులసి , యమున, మాలిని , దామిని మధుబాల, జానకి, చంద్రమతి బుచ్చమ్మ గార్లు ఒక వరుసలో నిలవగా  రంజని , మంజూష , లకుమ , సుందరి, విదిష ,నందిని ,  చందన  పార్వతులు  ఒక వరుసలో నిలిచి యుండిరి.  గ్రాహకుడు వారిని బృంద చిత్రమందు బందించి, పిదప జంటలు జంటలుగా  విభజించి వివిధ భంగిమలందు వారి రూపవిలాసములను స్థిర,చలన భంగిమలందు సంస్థాపన మొనరించు చుండెను . 

మొదట కన్నె మీనాక్షి , పిదప మీనాక్షి సుందరి , పిదప యమున మీనాక్షిలు ఇట్లు ఒకరి  హత్తుకొని అనురాగములను చూపుకొనుచూ చిత్రములందినారు. అనురాగమతిశయించ మీనాక్షి సుందరిని ముద్దాడగా, యమున  మీనాక్షిని ముద్దాడెను. లకుమ తల్లి తండ్రులతో అనురాగము ప్రస్ఫుటమగు చిత్రమొకటి గొనెను.  రంజని కేశవులు చెంతకు చేరి కలసి ఛాయా చిత్రమందుటకు బిడియ పడుచుండగా వారిని అరుణ దగ్గరికి తీసుకొని లకుమ వివేకులతో కలిపి చిత్రములందెను. కేశవుడు అరుణ మొఖములోనికి చూచెను  తల్లి స్థానములో కూర్చొన్న జగన్మాత వలే ఆమె కనిపించెను. ఆమె కనులలో భరోసా , పెదవులపై చిరునవ్వు చూచి కేశవుడి కనులు వాలినవి. కేశవుడి  మొఖము  చిన్నబోయెను “నా కథ నీకు చెప్ప లేక పోతిని” అను అపరాధభావన కేశవుని కళ్ళలో  కనిపించుచుండ అరుణ

“చిత్రములడగవు కథలు చిత్రముగా కదిలించు మనుషులను 

రాగమాలికలై రంజన చేయును మనసులను మాలిమి 

చేయును మూలికలై, ఏలికలై ఏలుచుండు భాషా పేదల 

మనసుల  తేలుచుండును కథలై  కావ్యములై, తరతరముల

 మనుషుల కలుపుచుండు తరగని సిరులై నిలిచి యుండు. 

“అని ముగించినపిద చందన "అమ్మ ఎంత చక్కటి కవిత అల్లినదో" అనెను. తార " నేను నీవలె కవిని కాను ఛందస్సు లేని  పద్యమునెట్లు గణింతురో కదా!" అనగా కేశవుడికి దుఃఖము తన్నుకువచ్చి ఆసువుగా ఒక ఉత్పలమాల పద్యమునల్లి  తల్లి మెడలో అలంకరించెను. 

 ఉ.    చందము   చూడగా      జనని      చందురు      డేతల      వాల్చున  మ్మ నీ      

        బంధము    చూడగా     కొడుకు    బాష్పము    లందును     రాగమొ ల్లయూ             

        కందము     వోలివ       ర్షమయి    కుర్వగ        మాటలు     మంత్రము  లై నా 

         డెందము   తాకగా       వలదు      డాబుగ      చందము     మాటచా    లులే

  

         నీ  చందము( శైలి -style)  చూడగా   జనని  అందగాడని  విర్రవీగు     చంద్రుడే తల          

          వాల్చునమ్మ ,  నీ  బంధము చూడగా  కొడుకు  బాష్పము  లందును  (అను )  

          రాగమొ ల్లయూ కందము ( మేఘము ) వోలి వర్షమయి  కుర్వగ  నీ  మాటలు     

          మంత్రములై నా డెందము  తాకగా  డాబు చందము నాకెందులకు నీ మాటచా లులే


బావగారు ఉత్పలమాల  పద్యమును హృద్యముగా సంధించి స్పందించినారు మనమంతవరకూ పోము వృత్తపద్యములకు మనకూ చుక్కెదురు అనుచూ బసవడు కేశవుని దుఃఖిత వదనమును చూచి అయ్యో బావగారు మీ నేత్రములేల ఆర్ద్రములాయెను ?! అని  అనెను. పార్వతి ఉదుటున పోయి కేశవుని కౌగిలించుకొనబోవఁగా లకుమ వారిద్దరినీ కౌగిలించుకొని ఓదార్చుచుండెను , ఆమె కనుల కొలికి లందు తడి చూచిన మాలిని "అరుణ వారెంత ఎదిగిననూ నీ ముందు ఒదుగు పసిబిడ్డలేనే,  వారిని ఏడిపించవలదే" అని మందలించుచుండగా వర్షుడు " మా చెల్లి కి కూడా వెన్నవంటి మనసున్నదే " అని లకుమలో వచ్చిన మార్పు కు గర్వించుచుండగా " వివేకుడు మందహాసము చేయుచూ  “ చెయ్యి లేవకున్నచో అదియే పదివేలు " అనగా అందరూ  ఘొల్లుమనిరి.   

మాలిని లకుమ, మంజూష సందీపులను, వర్ష విదిషలను వద్దకు తీసుకొని చిత్రములు గ్రహించెను.  చిత్ర మాలిక చివరకు విదిష నందినిలను చేరెను. నందిని విదిషను కొరకొరా చూచెను మాలినిగారి గుండెలలో రైళ్లు పరిగెత్తుచుండగా నందిని కోపము చిరునవ్వు గా మారెను. నందిని విదిషను హత్తుకొని ప్రేమ నిండిన కళ్ళతో ఆమెను చూచుచుండ అందరూ అచ్చెరువంది నోళ్లు నొక్కుకొనుచుండ చిత్రగ్రాహిణి క్లిక్ మనెను. 

మత్తకాసినులగు ప్రౌఢ స్త్రీల పొంకము పూర్ణకుంభమును తలపించుచుండ పడతుల అందము పాల మీగడ చందము చూపుచుండ వారు మండువా గది వీడి ప్రాంగణము లోకి అడుగిడిరి. యువకులు తురగములవలె ప్రాంగణ ములో నడయాడుచుండ వొళ్ళంతా కళ్ళు చేసుకొని వనితలు వారిని చూచుచుం డిరి.  లోకచక్షువు అప్పుడే అంబరమును ఎగబ్రాకుచుండెను. బసవడు పరిసరములను చూచుచూ ఆసు కవితాస్త్రమును సంధించెను. 

వెలుగు ఱేడుకళ్యాణ కాంతులను విరజిమ్ముచుండ

ప్రభంజనుడి శీతల స్పర్శకు మేను పులకించుచుండ, 

చూచుచుండ విరులు మరులు గొల్పు నాట్యమాడుచుండ

పంచవన్నెల చిలకలు కిలకిలా రావములు చేయుచుండ  

సర్వాలంకృత కళ్యాణ గృహము కైలాసమువలె నొప్పుచుండ.  

ఇట్లు అచ్చతెలుగున పాడుచుండ యువతుల సమూహమునుండి ఎవరో  ఒక గులకరాయిని గురిచూసి బసవడిపై  విసరగా అది అతడి మోచేతికి తగిలి క్రింద పడెను “ఎవరది నా  ఆశుకవితా గానమునకవరోధము కలిగించుచూ .. అని బసవడు రంగు రంగుల పట్టు లంగాలలో కొండపల్లి బొమ్మల వలే యవ్వన శోభల కాంతులీను యువతులపై … ఎగిసి పడుచుండగా 

“పండు కొని వండుతుండ కుండ పై బండ పడ నా వొళ్ళు మండ” అని మంజూష వేళాకోళము చేసెను.  బసవడి కవితలనే ఆక్షేపించువారా మీ టుమ్రీలు అని అగస్త్యుడు నందినిని విస్మరించి విమర్శించెను.  ఇంతలో నందిని గానమునందుకొనెను , స్త్రీలందరూ ఆసక్తిగా చూచుచుండిరి.

పురుషా సమూహే సుందర రూపే చలతి వనే సంభూయే

భువనో త్తారే,   సుధా  సమూహే   దివ్య మనోహర జాతే

యశోద తప్తే , కవితా దీప్తే,   యశోధన ఘన వన మాలె. 

అనుచూ ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి చందమున గంభీర గీర్వాణమున నందిని గానము చేయగా చందన “పురుషులందెవరైననూ దీనికి సరియగు గానము చేయగలరా? అని సవాలు విసిరెను. అప్పుడు వర్షుడు అదే  చందములో దేవభాషలో శ్లోకములను గానముచేసి   

రాధా  ప్రభవే  ప్రాతః కాలే  జవతే  ప్రక్రుతి  అధికం 

తరుణీ  విభవే వివాహ ప్రభవే  రజతి వరే సులభం

రాధా  ప్రభవే (అందానికి ఆరంభం అయిన) ప్రాతః కాలే  (వేకువ జామున) జవతే ప్రక్రుతి అధికం (ప్రక్రుతి స్ఫూర్తి నిచ్చును).  తరుణీ  విభవే (యువతి అందము); వివాహ ప్రభవే  (వివాహ సందర్భములో)  రజతి వరే సులభం (పెండ్లి కుమారులు ను రంజింపజేయును)

వివాహ సమయే ఆనందనిలయే కలహే న సంప్రతి  యుజ్యతే

సంవేసన సమయే రాసక్రీడే వర్ధతే తవ శుక వైరే వర్ధతే తవ నిశ్యపినే.

వివాహ సమయే ( వివాహ సమయంలో ) ఆనందనిలయే ( ఆనందనిలయంలో) కలహే న సంప్రతి  యుజ్యతే ( జగడమిప్పుడు ఒప్పదు) సంవేసన సమయే ( శోభనం గదిలో ) రాస క్రీడే ( శృంగార  క్రీడలలో)  వర్ధతే తవ శుక వైరే  (కవితా శక్తి వర్ధిల్లును)  వర్ధతే తవ నిశ్యపినే (నీ శృంగార శక్తి వర్ధిల్లును) కనుక నీ సామర్ధ్యము అచ్చట చూపవలెను.  

వీటికి అర్థము వివరించినచో బంగారు గాజులు  కొనిఇత్తునని ప్రకటించెను  నందినిని యువతులందరూ వత్తిడి చేసిననూ సిగ్గుపడి ముడుచుకు పోవుటయే గానీ పలుకు పైకి రాకుండెను, అప్పుడు మీనాక్షి నందినివద్దకు పోయి నీకు సిగ్గయినచో నా చెవులో చెప్పుము అని చెవి అందించగా నందిని ఆ శ్లోకములకు అర్థమును ఆమె చెవిలో చెప్పెను. మీనాక్షి బుగ్గలు ఎరుపెక్కినవి. పిదప ప్రౌఢలందరూ చెవులుకొరుక్కొని  నవ్వుకొనుచూ అల్పాహారం కొరకు విడిదింటి కేగినారు.  ఆ పిదప ఆనందనిలయము చేరి అరుణతార , మీనాక్షి , రంజిని  రత్నములు , నగలు  విరివిగా కొనుగోలు చేసిరి. మీనాక్షి తులసీగారికి సుందరికి పలు వస్త్రములు నగలు బహూకరించెను.   మాలిని కూడా వారితో సమముగా వస్త్రములు నగలు సందీపునికి పైడమ్మగారికి తీసుకొనెను, దామిని గాజులు కొని మంజూషకు బహూకరించెను. అందరూ బహుమతులతో ఒకరినొకరు సత్కరించుకొనిరి. 

సాయంత్రము వరకూ ఆట పాటలతో సాగిన సమయము వివాహ ముహూర్తమునకు గంభీరంగా మారెను. ఒకే కళ్యాణమండపమున, ఒకే శుభ ముహూర్తానికి  వధువులందరికీ మాంగళ్య ధారణ జరిగెను. మధు పర్కములలో నాలుగు జంటలనూ  తల్లులందరూ తనివి తీరా చూచుకొని ముచ్చటలుచెప్పుకొని , చిత్రములు బహుమతులు  ఇచ్చి పుచ్చుకొనిరి.   


7 comments:

 1. Who is the deity appeared in the dream of Bharatavarsha? and why?

  ReplyDelete
 2. Am I right? Or is there any twist. I am very curious to know

  ReplyDelete
  Replies
  1. వర్షుడి కలలో కనిపించినది సరస్వతి మాత. అటువంటి స్వప్నము వర్షునకు కలుగుటకు కారణము రచయితకు అటువంటి భావప్రాప్తి కలుగుటయే!వర్షునికి వచ్చిన రెండవ స్వప్నము కథను పెద్ద మలుపు తిప్పును. ఆ స్వప్నము గూర్చి చెప్పిన యెడల కథ ముగిసిపోవును కావునకొద్ది భాగములు ఓపికతో చదవవలెను. 140 వ భాగముతో భారతవర్ష కథ కంచికి చేరును.

   Delete
  2. అంకితభావ ఫలితం సరస్వతీ దర్శనం.

   Delete
 3. నాలుగురమ్మాయిల వివాహములూ ఘనముగా జరిపించినట్లు భావించవచ్చునా ? లోపములేవైనా ఉన్నచో మన్నించి తెలియజేయవలెను.

  ReplyDelete
 4. ఘనంగా జరిపించా రు అనుటలో సందేహములేదు

  ReplyDelete