Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, February 7, 2021

Bharatavarsha 127

 విశాఖపట్నము విమానాశ్రయము: సమయము 4. 00 గంటలు : 

మధ్యాహ్నము ఢిల్లీలో బయలుదేరిన విమానము విశాఖపట్నములో వాలిన పిదప విమానము దిగిన తార బృందము తమ తమ పేటికలను సంగ్రహించి నిర్గమ ద్వారము వద్ద నిలచినారు. మీనాక్షి “ముందుగా హోటల్లో బసచేసి, పిదప ఆనందనిలయమునకు పోవలె, నేరుగా అచ్చట దిగినచో  వారికి భారమగున”ని చెప్పుచూ టాక్సీని పిలవగా వారి ముందు వర్షుడు నందిని మెర్సిడెస్ తో వచ్చి నిలచినారు. మీనాక్షి నివ్వెర పోయి చూచుచుండగా అరుణ తారకు నవ్వువచ్చెను. ఇంటికి పోయిన పిదప తీరికగా ఆలోచించుకొన వచ్చును ముందు వాహన మెక్కమ్మా అని వర్షుడు దిగి తలుపు తీసెను. అట్లు వారందరినీ వాహనమెక్కించి   విమానాశ్రయమునుండి పెళ్లి ఇంటి కి కొనిపోయినారు. 

అరుణ మీనాక్షి యమున కృష్ణలు టేక్సీ దిగుచుండగానే మాలిని విదిష పార్వతిలు ఎదురువచ్చి సాదరముగా వారిని  ఆహ్వానించినారు. మాలిని తారను, మీనాక్షిని ఆలింగనము చేసుకొనెను. మీనాక్షి కనులుఎవరికొరకో వెదుకుచుండెను. ఆమె ఆందోళన చూచి మాలిని “అంతా క్షేమమే సుందరి ఇచ్చటనే కలదు. నీ కొడుకుని కొలది సేపటిలో చూడవచ్చు.” నని చెప్పెను పిదప ఆమె యమున వైపు చూసి “నీ గూర్చి అబ్బాయి చెప్పినాడు యమున కదూ, అని ఆమె బుగ్గలు ముద్దాడెను.  తరువాత ఆమె కృష్ణన్ వైపు చూచుచుండగా అరుణ తన భర్త అని తెలిపెను. మాలిని తన చెవులను నమ్మలేకపోయెను. ఆమె హృదయము పరవశమొం దుచుండగా ఆమె కళ్ళు చెమర్చెను. “నిద్రాహారములు మాని అనితరసాధ్యమైన శ్రమ సాహసములతో మీనాక్షి మమ్ము కలిపినదని” తార చెప్పు చుండగా “ఈ తల్లి మనసింత తియ్యన కనుకనే తీయని స్వరముల వరములు కురిపించు సంగీత రాణి అయినది అని ఆమె అంకిత భావమునకు మాలిని అబ్బురపడి ప్రణమిల్లెను. లిప్త పాటులో మీనాక్షి  జీవితము  తలుపుకు రాగా మాలిని హృదయము పగిలి కళ్ళ నుండి అశ్రుధారలు కారుచుండెను. మీనను, అరుణను హత్తుకొని కృష్ణన్ వైపు చూచుచూ మా అరుణ వంటి ఉత్తమురాలి చేయి ఎట్లు వీడినారని కన్నీరు పెట్టుకొనెను. కృష్ణన్ అవమానభారంతో రెండుచేతులు జోడించెను. 

 విదిష "అత్తా! వారు అలసి పోయి వచ్చినారు” అనుచూ వారి పెట్టెలను, విదిష లోనికి కొని పోవుచుండగా సుందరి వచ్చి కొన్ని పెట్టెలనందుకొనెను. అమ్మా అనుచూ అరుణను  చూచి చంద్రుని చూచిన కడలి వలె ఉప్పొంగి ఆమెను అల్లుకొనెను. పార్వతి మాలినితో “వారిని లోనికి పిలవక చిన్న పిల్లవలె రోదించరాద"ని చెప్పుచుండగా " పోవే నువ్వు నాకు చెప్పొచ్చినావు " అని మాలిని కసరగా అందరూ నవ్వుకొనిరి. 



 అందరూ లోపలకి పోయి మామిడి తోరణములు కట్టిన మండువా గదిలో సోఫాలపై కూర్చొనిరి. వంట గదిలో దోశలు వేయుచున్న  తులశమ్మగారు  చేతిలో గరిటెతో వచ్చి  “మీ రాకతో ఇంటికి కళ  వచ్చినది.” అని విప్పారిన మొఖముతో చెప్పినారు. అందరూ స్నానములు చేసి వచ్చిన పిదప తులసమ్మ గారు దోసలు వేయుచుండగా విదిష అందరికీ అందించుచుండెను.  అరుణ రక్తవర్ణము పట్టు చీర, కృష్ణన్ తెల్లని వస్త్రములు ధరించగా మీనాక్షి యమునలు ఒకే రకమైన నెమలి పింఛపు రంగు చీరలు ధరించిరి. సుందరి ఎచ్చటికి మాయమాయెనో కానీ తులసమ్మ అరుణను అంటిపెట్టుకొని ఉండెను. కేశవుడు కూడా అమ్మ అనుచూ అరుణ వద్దకు వచ్చెను. నాభుజముల క్రిందకి ఉండెడివాడవు. వర్షునకు ధీటగు ఒడ్డు పొడవు విశాలమైన వక్షస్థలము బలిష్టమైన బాహువులు... ఊ పెద్ద వాడివైపోయినావురా అని తనతో పొడవు కొలుచుకొని చెప్పెను. 

అరుణ తో తులసి చేరికగా నుండుటచే మీనాక్షికి సంతోషమాయెను.  మీనాక్షి తులశమ్మగారితో మాట్లా డుటకు ప్రయత్నించిననూ ఆమె వంట గదిలోకి పోవుటచే కుదరలేదు. 

అరుణ : కేశవ నీ ప్రేమ కథ ఇకనైననూ కంచికి చేరునా ? 

కేశవుడు: రంజినిని చూచుచు కంచికి చేరుటకు అనేక ఆటంకములున్నవి, అదొక పెద్ద కథ  

మీనాక్షి: పరితాపముతో అగస్త్యుడు ఎచ్చటగలడు? ఎట్లుండెను? ఎప్పుడు వచ్చును? భారతవర్ష: అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుచుండెను , బసవడు, బుచ్చెమ్మగారు, చందన ప్రక్కనే ఉం డి కంటికి రెప్పవలె చూచుకొనుచున్నారు 

మీనాక్షి ఆసుపత్రిలో ఎందుకు చేరెను? నాబిడ్డకేమైనదని బెంబేలెత్తుచుండగా 

మాలిని : ఇపుడు నీబిడ్డ క్షేమముగా యున్నాడు. అది ఒక పెద్ద కథ తరువాత చెప్పెదను, ముందు ఫలహారము చేయవలెను. కొలది సేపటిలో మనము ఆసుపత్రికి పోయెదము. 

 అందరికి దోసలు వడ్డించిన విదిష నందిని ని పట్టించుకొనక వంటగదిలోకి పోయెను. 

మాలిని: అయ్యో అతిధులకు మర్యాద చేయవలెను కదా!

విదిష: ఇదిగో వచ్చుచున్నాను. వంట గదిలో నుండి మాట వచ్చెను  గానీ మనిషి రాకుండెను   వెంటనే నందిని " హు .. నా ఇంట నాకు మర్యాద అవసరము లేదు దానికే నేను మర్యాద చేసెదను అని వంటగదిలోకి పోయెను. 

 అరుణ: వీరిద్దరి పచ్చగడ్డి వేసిన భగ్గు మనుచున్నది , కారణమేమి?

మాలిని “అది ఒక పెద్ద కథ "  అనెను.  ఇంతలో బసవడు వచ్చెను. 

మాలిని : బసవా ఆస్పత్రినుండి వచ్చుచున్నావా?” 

బసవడు :   అమ్మ చెల్లి ఆసుపత్రిలో ఉన్నారు. నేను లాయరు వద్దనుండి వచ్చుచున్నాను.

వర్షుడు: లాయరువద్దకు ఎందుకు పోయినావు?” 

బసవడు: అది యొక పెద్ద కథ. 

యమున: ఇచ్చటన్నియూ పెద్ద కథలే యున్నవి కానీ సమాధానములు లేకున్నవి 

కేశవు డు:  బావా ! ఏమాకథ?  చంపక ఒక్క ముక్కలో చెప్పవలెను 

మాలిని కూడా అట్లే వత్తిడి చేయగా బసవడు “మీనాక్షి ఫిషరీస్ చైర్మన్ గారిని అరెస్టు చేసినారు” అని ఒక్క ముక్కలో చెప్పెను. కొలది నిమిషములు అంతయూ నిశ్శబ్దమలుముకొనెను. 

ఇంతలో యమున "మేము వచ్చి అర్ధ గంట గడిచిననూ పెండ్లికూతురు కనిపించదేమి ?" నందిని: అది ఒక చిన్న కథ చెప్పినచో...” అని అరుణ తార వైపు చూచుచూ అనెను. అరుణ: హతవిధీ! ఉత్కంఠ చలన చిత్రము చూచుచున్నట్లున్నది. విషయము చెప్పనిచో చెవులు మెలివేసెదను అని అరుణ నందిని చెవి అందుకొనెను. 

వర్షుడు “అయ్యయ్యో అరుణమ్మ నందిని అర్భకురాలు ఆమె చెవిని విడువుము” అని అనుచుండగా తులసీగారు, రంజిని ఆ మాటలు విని నవ్వగా విదిష మొఖం ఎర్రబడెను. ఆమె వర్షుని వైపు కోపముగా చూచుచుండ టపా(post) వచ్చు టచే బ్రతుకుజీవుడా అన్నట్లున్నది అని  సంతకము చేసి తీసుకొనుటకు వర్షుడు పోయెను. 

మండువా గది అంతయూ నవ్వులతో నిడిపోయెను.  అరుణ తార మాలిని  చెవిలో ఇరువురిని కోడళ్ళుగా చేసుకొన్నచో అని అనగా " మాలినిగారి వెన్నులో వణుకు పుట్టినది. మరల నవ్వులు విరబూసినవి, వర్షుడు టపా తీసుకొని వచ్చిన పిదప యమున " అన్నయ్యా ఎచ్చట నుండా ఉత్తరము? " అనెను అదియునూ ఒక కథయేమో అని బసవడు అనగా " వర్షుడు " అవును అది అరుణమ్మకి చెల్లమ్మకి తెలిసిన కథయే. నేను ఐ ఏ ఎస్ కు ఎంపికైనాను. వచ్చేవారం డెహరాడూన్ లో నాలుగునెలల శిక్షణ కొరకు పోవలెను. " వర్షుడు ముగించగానే సుందరి యమునా అన్నయ్యను అల్లుకు పోయినారు. మాలిని అదృష్టమును అరుణ మీనాక్షి కొనియాడి అభినందించినారు.

"నాకీ విషయము ఎప్పుడో తెలియును అత్తా" అని విదిష అనుచుండగా నందిని మూతి విరిచెను. కేశవుడు బసవడు కృష్ణన్ అందరూ వర్షుని వద్దకు పోయి చేతులు కలిపి అభినందిం చిరి. 

అరుణ :  మాలిని, మంజూష ఎచ్చటున్నది? రేపు పెళ్లి అనగా ఇప్పుడెచ్చటికి పోయినది?

వర్షుడు: అరుణమ్మకు మంజూష ఎచ్చటున్నదో  తెలిపినచో, చిన్నపిల్లవలె సంయమనమును కోల్పోయెదవేమో ! కొలదిసేపు ప్రక్క గదిలో కూర్చోండ వలెను. అట్లయినచో ఒక రసవత్తర మైన దృశ్యమును చూడవచ్చని మాలిని చెప్పగా తార అటులనే అని వప్పుకొనెను. కృష్ణన్ మొఖంలో ఆత్రుత తొంగి చూసెను. 

మాలిని:  నీవు రాకముందే లకుమ వచ్చి చేరినది మంజూష లకుమ దక్షిణ పడక గదిలో ఉన్నారు. మంజూష లకుమ నిస్పృహ పోగొట్టుటకు  యత్నించుచుండెను.  అని  విషయమును వెల్లడించగానే అరుణ లేగ దూడకొరకు పోవు పాడి ఆవు వలె పరుగు పరుగున పోవుచుండ  ఆమెను, భర్తను మాలిని ఒక గదిలోకి కొని పోయి, " నీ బిడ్డను ఇచ్చటకి పంపెదము అంతవరకూ నీ నోటికి తాళము పెట్టి కూర్చొనుము అని  తలుపు మూసెను.

                                                                   ***


 లకుమ తలను మోకాళ్ళలో దూర్చి  జుట్టు విరబోసుకొని విశాలమైన గదిలో పందిరి మంచము పై దిగులుగా కూర్చొం డెను. అందరూ ఆమె గదిలోకి ప్రవేశించిరి.  

కేశవుడు:  చలన చిత్రములో పేరుకెక్కిన తార ఇట్లుండునా? నీవెదుకు దిగులుగా కూర్చొంటివి?  అట్లు  గుర్తు చేసిన లకుమ దుఃఖము పెరుగుచుండెను కానీ తగ్గకుండెను. అందరూ ఆలోచనలో పడిరి. వర్షుడు మంజూషతో          “నీ పెళ్లి కబుర్లు చెప్పినచో బాగుండును కదా!” 

మంజూష: పెళ్లికబురులు ఎన్ని చెప్పిననూ  ఆమె మనసునలిమిన విషాదము తొలగలేదు. 

వర్షుడు : అయినచో ప్రేమ కబుర్లు చెప్పుము

అట్లే చెప్పెదను నీవి విదిష వదినవి చెప్పమందువా ? అంతటా నవ్వులు చెలరేగినవి.

ప్రేమ కబుర్లు చెప్పిననూ ఆమెకు పండిట్ తలుపుకు వచ్చుట అధికమయ్యేను బాధ పెరిగెను

వర్షుడు : నీకు ఒక బహుమతి ఇచ్చెదను దానితో నీ విషాదము తొలగి పోవును.

లకుమ : నాకే బహుమతులు వద్దు, మీరిట్లు బలవంతము చేసినచో,  నేను వెనుకకు పోయెదను మీ అందరినీ చూచుటకు వచ్చితిని ఆ పని నెరవేరెను. 

కేశవుడు : అమ్మమ్మ, ఎంతో కష్ట పడి తెచ్చిన బహుమతి  ఆ గదిలో  నీవు చూసి వలదన్నచో బయలుదేరవచ్చు. భారత వర్ష : ఇంకొక బహుమతి కూడా కలదు ,  ఆబహుమతి ఇంకనూ వచ్చినట్టు లేదు , ఎప్పుడు వచ్చునో ! తెలియకున్నది. నేడో రోపో, అది కూడా వచ్చును, అదియునూ నీ చేతికిచ్చెదము అది కూడా చూచుకొని అప్పుడు నీ నిర్ణయం చెప్పవలెను. లకుమ ను అందరూ కమ్ముకొని నెట్టగా గది తలుపుపై  పడెను. తలుపు తెరుచుకొనెను , అచ్చట కనిపించిన దృశ్యము ను చూచి లకుమ తన కళ్ళను నులుముకుని చూసెను. 

తల్లి తండ్రులిరువురూ పక్క పక్కనే నిలిచి పార్వతీ పరమేశ్వరులను తలపించుచుండగా లకుమ గుండెలలో పేరుకొన్న  విషాదము కరిగి  కన్నీరై ప్రవహించసాగెను. కుమార్తెను చూచిన తండ్రి చిరునవ్వుతో   చేతులు చాచిన నిలిచెను. కన్నీటితో పరుగుపరుగునపోయి   తండ్రి వద్దకు పోయి నిలిచి పోయి తల్లి వైపు తిరిగి తల్లి కాళ్లపై బడగా ఆమె లకుమని లేవనెత్తి గుండెలకు హత్తుకొనెను. పిదప తండ్రి వద్దకు పోనని మొండికేసి  దూరముగా పోయి కూర్చొనెను. మాలిని , తులసి , నందిని, విదిష  రంజిని లాలించగా మెత్త బడిననూ తల్లిని అల్లుకొని వీడకుండెను. అరుణ తార కృష్ణన్ ను నాకూతురు వొప్పుకున్నచో  నేను వచ్చెదను లేనిచో మీరు కేరళ పోవలెను. అని కోపము నటించగా కృష్ణన్ బాధతో దిగులుగా నిరాశ నిండిన కళ్ళతో గోడకు చారబడి న్యాయస్థానం తీర్పు కొరకు ఎదురు చూచు ముద్దాయివలె కూర్చొని  యుండెను.   అందరూ వారిని వంటరిగా వదిలి ప్రాంగణములోకి పోయిరి. 

ప్రాంగణములో కవి సమ్మేళనము కొరకు అద్భుత వేదిక ఏర్పాటు చేయబడెను. అతిధులు కూర్చొనుటకు వేదికముందు మెండుగా సోఫాలు, దివానులు ఆసనములు యున్నవి  మనము  వచ్చుసరికి  ఈ వేదికలేదే అని మీనాక్షి అనెను , అప్పుడు విద్యుత్ దీపముల దండలు కూడా లేవు అని యమున అనగానే ఎదురుగా నున్న వేదికను చూచుచున్న  అందరూ వెనుకకు తిరిగి భవనమును చూచినారు. 

సాయంసంధ్య అగుచుండగా  చెంగావిరంగు నింగిన పులిమి  జగచ్చక్షువు అత్తమిల్లు చుండ, అత్తరు మేలి గుభాళింపు లతో విద్యత్ దీపముల దండలతో ఆనందనిలయము అలరారుచుండగా  చప్పన్న శాస్త్రములు చదివిన సుబ్బన్న పంతులుగారు  ఆనందనిలయమున ప్రవేశించుచూ  భారతవర్షను చూచుచూ  “రాజాధిరాజ , రాజ కంఠీరవ , రాజ మార్తాండ రాయలు  సింగాసనమునధిష్టించి ఠీవిగా కొలువును కలయజూచుచున్నట్లు ఆనందనిలయము ఆంధ్రభోజుని వలె నగుపించుచున్నది.” అనెను. భారతవర్ష ఆ వృద్ధ పండితుడి  పాదములకు నమస్కరించెను. కవులు, పండితులు వచ్చి చేరినారు. వేదిక నిండినది   కవి సమ్మేళనము జరుగుచుండెను.

పెళ్లి వారింటికి వచ్చు జనుల సంఖ్య క్రమక్రమముగా పెరుగు చుండెను. ఆ వచ్చువారిలో వలతి  కూడా కనిపించెను. ఆమె నేరుగా నందిని వద్దకు పోయి విశ్వవిద్యాలయమువారు తనకు పీహెచ్డీ ప్రకటించినట్లు చెప్పెను. ఆ ప్రక్కనే ఉన్న వర్షుడు"విజయవంతముగా డాక్టరేట్ పూర్తి  చేసుకొన్న వలతికి  అభినందనలు”  తెలిపెను. మాలిని మీనాక్షి పార్వతి తులసమ్మ రంజిని  నిలిచి యుండగా , విదిష  లోపల కాఫీ చేయుచుండెను.   
 
 సుందరి   లోపలకు వెడలెను, తార అట్లే లకుమ ను తన హృదయముపై లాలించి, మాటలతో బుజ్జగిం చుచూ మీనాక్షి గొప్పతనమును సంగీత ప్రజ్ఞను, మంచి మనసు గూర్చి సుందరికి కూడా అర్ధము అగునట్లు చెప్పెను. ఆమె కేరళ పోయి కృష్ణన్ ను ఎట్లు లాక్కొచ్చేనో తెలియజేసెను.  సుందరి మీనాక్షి  గూర్చి తెలుసుకొని అరుణ ఎదపై   వాలెను. ఒక వైపు కన్న బిడ్డ లకుమ మరొక వైపు పెంచుకున్న బిడ్డ సుందరి తో ప్రేమ సాగరమందు మునిగి తేలుతూ వారిని లాలించుచుండగా  జానకి రఘువరన్, పచాకో వచ్చి చేరినారు. వారితో  లోపలి వచ్చుచున్న మాలిని, నందిని మీనాక్షి బసవడు, రంజని కేశవుడు వర్షుడు  తదితరులు చూచుచుండగా జానకి (కృష్ణన్ అక్క) లకుమ ప్రక్కన కూర్చొని మాలిమి చేయ సాగెను. అత్తను చూసిన లకుమ నేత్రములు విప్పారెను, మనసు వికసించెను. అత్త స్పర్శ అ లకుమకు భయము వలె తోచినది.   ఆమెలో జడత్వము కరిగినది. లకుమ మెల్లగా తలయెత్తి చూట్టూ కలియ జూసెను.    ఆమెకు నవ్వు ముఖములతో నిలిచిన ఒక పెద్ద కుటుంబము   కనిపించెను. 

వారి నవ్వు మొఖముల మధ్య దిగులుగా కూర్చొని ఆకాశము  వైపు చూచుచున్న వ్యక్తిని చూచెను, ఆ మనిషిలో  పదిమందిలో కూతురిచే తిరస్కరించబడిన తండ్రి, అవమాన భారంతో తలదించుకొని కుములుతున్నతండ్రి కని పించెను.  ఆమె వంటరి తనము అభద్రతా భావము నశించి లకుమకు అతడిపై జాలి కలిగెను. ఇరవై ఏళ్ళు అజ్ఞాన ముతో తన అర్ధాంగిని అర్ధ జీవితమును కోల్పయి  నాన్న ను మీనాక్షి అను దేవత కరుణించి కంటి వెలుగునిచ్చెను , కానీ రెండవ కంటికొరకు  ఏడ్చుచున్న నాన్నకన్నీరు తుడుచు దేవత వేరేవరును లేరు.  నాన్న పై దయ చూపుము అని జానకి అనుచుండగా లకుమ కన్నీటి అలవలె అత్త పై ఎగసి పడి ఇక వినలేను అని ఆమె నోటిని మూసి,   ఒక్క ఉదుటున లేచి సోఫాలో కూర్చొన్న నాన్నమెడ  నల్లుకొనెను .  ఆ దృశ్యమును చూసి అందరూ పులకరించిరి. తండ్రి కూతురిని ఆలింగనము చేసుకొని కన్నీరు కార్చుచుండగా కూతురు తండ్రి కన్నీరు తుడుచుచుండెను. మీనాక్షి బసవను తీసుకొని ఆసుపత్రికి పోయెను.   

అప్పటికీ అరుణ తార నల్లుకొని యున్న సుందరి తల్లి తండ్రుల ప్రేమ ఎంత మధురము అనుచుండగా అరుణ సుందరి చెవిలో    “పురుషుని ప్రేమను పొందు వయసు వచ్చినది ఆ మాధుర్యమును కూడా చవి చూడవలెను అని గుసగుస లాడెను. ఈ అమ్మ కోరిక మీ అమ్మ కోరిక కూడా అదియే అనుచుండగా తులశమ్మ కూడా  సుందరి ప్రక్కనేకూర్చొని తల నిమురుచూ  " ఇద్దరు అమ్మల ప్రేమను అర్ధము చేసుకొన్న నువ్వు  మూడవ అమ్మ ప్రేమ ను కూడా పొంద వలెను.  అగస్త్యను స్వీకరించిన ఒక గొప్ప వారసత్వమునకు వారసులను ఇచ్చు అవకాశము కలుగును.”  సుందరి సిగ్గు పడెను.   


3 comments:

  1. ఈ సుదీర్ఘ భాగంలో చాలా కధ జరిగిపోయింది.చాలా కాలం తర్వాత తల్లీ దండ్రులను కలుసుకున్న బిడ్డలు, వారి మధ్య భావోద్వేగాలు, బంధుమిమిత్రుల మధ్య ముచ్చట్లు బాగున్నాయి.కేశవుని పెద్ద కధ తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది

    ReplyDelete
  2. కష్టములు కరిగి బంధములు మిగిలిన కమ్మని కల. ఒక గుండెను వెతుక్కుంటూ మరొక గుండె స్వప్నంగా మారి ఆస్వప్నానికి రెక్కలొచ్చి తన గుండెను వెతుక్కుంటూ గుడ్డిదైన కథ. గుడ్డి గుండె కథ బాగుందా?

    ReplyDelete
  3. మీ ఆనందంకోసం వ్రాయ బడుతున్న ఈ కథలో అక్షరం నేను భావం మీరు. పడవ నేను తెడ్డు మీరు. అంచుల దాకా అమృతం నిండిన ఆనంద కావ్య సాగరం

    ReplyDelete