Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, July 25, 2020

Bharatavarsha -14

కోరమాండల్ విశాఖ వదిలి పెట్టి సుమారు ఒక గంట అయ్యినది. తూరుపు దిక్కున వెలుగు ఛాయలు పొక్కుచున్నవి. అగస్త్య భారతవర్ష  ఎదురెదురుగా   కూర్చుని   యుండిరి. అగస్త్య అప్పుడే తేనీరు త్రాగి కాగితపు దొప్పను కిటికీ నుండి బయట పారవేసి భారతవర్ష వైపు చూడగా అతడింకనూ  ఉష్ట్రపక్షి ఇసుకలో తలదూర్చి నట్లు వార్తాపత్రికల్లో తలదూర్చి తీయకుండెను. అప్పుడే మేఘాల పగుళ్ళనుండి చీల్చుకొస్తున్న వెలుగురేఖలు పంజరము నుండి విముక్తి బొందిన విహంగములవలె నెగయుచు అంబరమునరుణము నలము ముచుండెను.

అగస్త్యుడావులించి తన కూర్చున్న చోటునుండి  లేచినిలబడిరైలుపెట్టె యంతయూ మేమిద్దరమే ఉన్నాము మాటలాడుటకు మరొక నరమానవుడెవ్వడూనూ అగుపించడు,ఇప్పటికి ముమ్మారు తేనీరు త్రాగియుంటిని.  వర్షుడు ఉష్ట్రపక్షిని తలపించుచున్నాడు అనుకొని ఓర్పు నశించి ఘోరములు చదువుటయందున్న ఆశక్తి సూర్యోదయమును తిలకించుట యందు చూపిన మిక్కిలి సంతోషించెదను " అని  వర్షుని చేతనున్న వార్తా పత్రికను లాగివేసెను. చేయునదేమియూ లేక భారతవర్ష తన ప్రదేశమునుండి లేచి అగస్త్యను అనుసరించెను.

 

మిత్రద్వయము రైలుపెట్టి ప్రవేశద్వారం వద్ద సైనికులవలె నిలుచొనిరి. భారతవర్ష చిరుదరహాముచేయుచు బాలభానుని రశ్మివర్ణము లందు పులకరించుచున్న ప్రకృతిని రెప్పవేయక చూచుచూ .  "ఔరా! ఆకాశము లోపెండ్లి జరుగుచున్నట్లున్నది, మంచు తుంపర పుష్పవర్షము వలె  దోచుచున్నది, పచ్చని చీరగట్టిన పెద్ద ముత్తైదువు వలె  ప్రకృతికాంత  సౌందర్యము శోభిల్లు చున్నది. ఔరా! ఏమి  ప్రాతఃకాల మహిమ, అనంత ప్రకృతి అగణితానందమును, అభేదభావనను రేపుచున్నది. ద్వైతా, అద్వైతములని దాటి  విశిస్టాద్వైతమును తలపించుచూ, తాదాత్మ్యతము కలిగిచుచున్నది. "ఇది నాకు రైలు ప్రయాణమువలె గాక అవధాన కార్యక్రమము వలె   దోచుచున్నది.” అని అగస్త్య అనెను

యద్భావం తద్భవతి అని భారతవర్ష చిరునగవున పలికెను. ఈముక్కలకర్ధము నాకు తెలియకున్ననూ ఒక్క విషయము నాకు స్పష్టముగా తెలియుచున్నదినీవు అష్టావధానం నుంచి శతావధానము వరకు పెరిగిననూ నాబుర్ర మాత్రము అచ్చటనే యున్నది.” ఇందు తెలియుటకేమున్నది మన అంతరంగమునందున్న కోరికలే  బాహ్యమున గోచరించును  మనం కోరినదే మనకు లభించును, అగస్త్యుడొక్క గుటక మింగి వర్షా ,   అయిననూ శృంగారభావనా భరితమైన పెండ్లి, కాంత వర్ణనను వీడి అకస్మాత్తుగా  ఆధ్యాత్మిక భావములనాలింగనము జేసుకొనిన అర్ధముగాక అయోమయములో పడితిని.  విశిస్టాద్వైతం  అన్న ఏమి ? అనెను 

 

"దేవుడు వేరు జీవుడు వేరు అన్నది ద్వైతం. ఇది మధ్వాచార్యుని సిద్ధాంతము. దేవుడు జీవుడు  ఒక్కటే అన్నది అద్వైతం. ఇది ఆదిశంకరాచార్యుల సిద్ధాంతము. దేవుడు జీవుడు  -ప్రకృతి అన్నవి వేర్వేరు అయినా ఒకదానియందొకటి మిళితమై అంతటా వ్యాపించి ఉంటాయి విశిష్టాద్వైతం. రామానుజాచార్యుని వేదాంత దర్శనము. నీవు తెచ్చుకొన్న గ్రంధము" చదువుకొనుము , మంచు ఎక్కువగా నున్నది , ఇచ్చట ఎక్కువసేపు నిలబడజాలమని వర్ష అనెను. వారిరువురు తమతమ ప్రదేశములు బోయిరి.

 

అగస్త్యా , ఎందుకో నీ మొగమున ఆందోళన ద్యోక్తమగుచున్నది , కారణమేమి యని  భారతవర్ష అడుగగానీవు  సాహిత్య సభకు పోవుచున్నావు నీకిది  నిత్య నైమిత్తికము (నిత్య కృత్యము)నేను చాలా కాలము తరువాత మా అమ్మ వద్దకు పోవుచున్నాను, నాకిది  నైమిత్తికము, (సందర్భమును బట్టి చేయుపని) మాతల్లిగారు వేరొక సహచరునితో  యున్నారు  అందుచే నాకు ఆందోళనుండుట సహజము, నాకు నీతో సాహిత్యసభ కు హాజరై  తిరిగి నీతో వెనుకకు మరలిన ఉత్తమము అనిపించుచున్నది " అనెను.   “సాహిత్య సభయందు అనురక్తి అయినచో రమ్ము   తల్లిపైన విరక్తి  అయినచో తగ్గిచుకొనుము.” “ఇది అనురక్తి యో , విరక్తి యోగాదు , భయము అని అగస్త్యుడనెను. “మీ తండ్రిగారివద్దకు పోయివుంటివికదా అప్పుడు లేని భయము ఇప్పుడెందులకు? ముదిమి ముసురుచున్ననూ  నూత్న యవ్వనమున పాలుగారు పడచును వలచి సహజీవనం చేయు తండ్రివద్దకు పోవుటకు సంకోచించక ఇప్పుడు సమవయస్కుని పెండ్లాడిన మీతల్లిగారివద్దకు పోవుటకు భయమెందులకు? నీ ఆలనా పాలనా చూచినది, చూచుచున్నది ఆమే కదా. పురుష పక్షపాతమును చూపుచూ ఆమె నీతల్లి యనునది మరువకుముఅని భారతవర్ష యనగా "నేను ఎప్పుడు అమ్మ పక్షమే వహించెదనుఏలెననగా... 

“మా అమ్మ కష్టమునందు మనోనిబ్బరమునూ   త్యాగమునందు గొప్పతనమునూ రెంటినీ మరువను.    మానాన్న ఆసీల్ మెట్ట  వద్ద  చిరుద్యోగి , చదువు కొన్ననూ , మా అమ్మ వలే విద్యాధికుడు కాదు.  మా అమ్మమ్మ చెన్నపట్టణమున  ఉండెడిది .  మా అమ్మను తీసుకొని విశాఖలో నున్న ఆమె బంధువుల ఇంటికి వచ్చినది. వారి బంధువులు మా ఇంటి ప్రక్కనే  సంపత్ నగర్ నందు  ఉండెడివారుమా అమ్మమ్మకు జబ్బు చేసి కొన్ని నెలలపాటు ఆసుపత్రిపాలయ్యెను.    రోజుల్లో మానాన్న ఆమెకెంతో  సేవజేసెనట. అప్పుడామె మానాన్న విగ్రహమును , గుణగణములు చూసి  చిరుద్యోగి అయిననూ ఈడూ జోడని భావించి అమ్మనిచ్చి పెండ్లి జేసెను.  అటుపిమ్మట  మానాన్న ఉద్యోగము  వదిలి హోటల్ నడిపెను.

చిన్నప్పుడే తండ్రిపోగొట్టుకొన్న మా అమ్మకు తల్లిని  పోగుట్టుకున్న తరువాత ఒక్కతే కూతురగుటవల్ల ఆస్తి అంతయూ సంక్రమించెను. హోటల్ దివాలా తీయుచున్ననూ సంవత్సరము నడుపుటకు మా అమ్మే ఆర్ధిక సాయము చేసెను. తరువాత లాభముల బాటలో పడినప్పటికీనూ రహదారి విస్తరణ కార్యక్రమములో హోటలు భవంతి పూర్తిగా తొలగింపబడినది.  హోటల్ కు సొంత  భవనము లేక ఇబ్బందులెదురయినవి. మా నాన్న సంపాదించిననూ  కొత్త భవనము కొనుటకు చాలకుండెను. మరల మా అమ్మ భారీ మొత్తములో సాయము చేయగా మా నాన్న స్థిరపడి, తనవద్ద పనిచేయుచున్న గ్రేసీ యను వగలాడి మోజులో పడి మా అమ్మ నెత్తిన చేతులు పెట్టెను.  

ఒకనాడు మానాన్న మా అమ్మను చర్చికి రమ్మని పిలిచెను. అప్పటికే మానాన్న మతము మారియుండెను.   తరువాత మా అమ్మకీవిషయముదెలిసెను. అటుపిమ్మట వారంలోనే  గ్రేసీ విషయము తెలిసెను. కానీ దక్షిణామూర్తి మారడని తెలియుటకు మా అమ్మకు ఒక సంవత్సరముపట్టెను.” సమయము ఒంటిగంట కావచ్చుచున్నది.     


decadent art - క్షీణకళాచిత్రము

బండి ఒంగోలు చేరినది. ఇచ్చట దిగి ఏదైననూ తినుటకు తెచ్చెదను అని అగస్త్యుడు దిగుచుండగా బండి బయలుదేరెను . అతడిని తోసుకుని ఒక తల్లి కూతురు బండిలోకి తోసుకుని వచ్చిరి. తల్లి మధ్యవయస్కురాలు చీర కట్టుకొని యుండెను , కూతురు ఆధునిక పడుచు ఆధునికతయంతయూ వంటికి అంబరమువలె చుట్టుకొనెను. అత్తరువలే పూసుకొనెను. అత్తరు వాసన ఘుభాళించు చుండెను.  చిరుగులు జీన్స్ ధరించి నారింజవర్ణపు చొక్కా  ధరించెను . ఎత్తుమడమల జోళ్ళు, అందు నాచురంగు  మేజోళ్లు ధరించెను. చూచితివా ఎట్లు గుద్దుకొనిపోవుచున్నదో అని అగస్త్యుడనగావాహనము భోజన సదుపాయముండగా క్రిందికి దిగుట ఎందులకు” అట్లే  కానిమ్ము అని అగస్త్యుడు తన స్థలములో కూర్చొనెను. " “మొట్టమొదట విశాఖనగరమును  వాల్తేరు అనెడివారు.  నేడు విశాఖనగరము - వైజాగ్గా ఎట్లు  మారిపోయెనో  మీ నాన్న కూడా అట్లే మారిపోయెను .” అని భారతవర్ష అనెను.

 

భోజనములు తెప్పించుకొని తిన్న తరువాత అగస్త్యుడుమొదట వాల్తేరు ఎట్లుండెనుచోళులు చెన్నపట్నమునుంచి, గజపతుల ఒడిశా నుంచి పాలించినపిమ్మట ఆంద్ర రాజులు   వేంగి పల్లవరాజులు విశాఖను పాలించిరి. విశాఖవర్మ పాలించిన నగరము కావున విశాఖనగరమని పేరు వచ్చెను  తరువాత కుతుబ్ షాహీలు , నిజాములు , మొఘలులు పాలించిన పిమ్మట ఫ్రెంచి వారు పాలించిరి  తరువాత 1804 లో విశాఖ నగరము బ్రిటిష్ వారి హస్తగతమయ్యెను . అప్పుడు వచ్చెను వాల్తేరు అను బ్రిటిష్ వాడుఇందాక  క్షీణకళా (డికాడెంట్ ఆర్ట్ - అనగా   మితిమీరిన  అలంకారము - కృత్రిమత్వము ఎత్తిచూపు చిత్ర కళ  ప్రకృతి మరియు  నైతిక విలువల పతనమును కాకుండా కాపాడుటకు ఫ్రాన్స్ లో ఉద్బవించిన కళా విప్లవం.) చిత్రమువలె  నున్న చిరుగుల చిన్నది బండిలోకి ఎప్పుడు వచ్చెనో (ప్రయాణము మధ్యలో వచ్చెను )అట్లే వాల్తేరు కూడా.

ఒక ఘడియ ఇద్దరూ నిద్రించి లేచి బండి నెల్లూరు దాటినదని తెలుసుకొనిరిపక్కన కిటికీల వద్ద నున్న స్థానములను ఆక్రమించుకొని యున్న ఇద్దరు స్త్రీలను చూసి" చిరుగులు చిన్నది ఇక్కడికివచ్చి జేరేనాయని అనుకొని అగస్త్య చూచుచుండ చూపులు కలిసెను. తల్లి అగస్త్యను చూసి చిరు దరహాసము జేసెను. అగస్త్యకూడా అట్లే స్పందించెనుపిల్ల మాత్రము పాటల పెట్టెను చెవికమర్చుకొని చిన్నగా ఊగుచూ వేరేప్రపంచములో నుండెను. ఇంతలో అక్కడికి తేనీరు రాగా వేడివేడి తేనీరు నాలుగు కాగితపు దొప్పలతో తీసుకొనెను,  అందరూ తేనీరు త్రాగిరి.  తదుపరి పరిచయములయినవి.  నేను డాక్టర్ మాళవిక.  చెన్నపట్టణమందు  అనువాదకురాలిగా పనిచేయుచున్నాను , తెలుగు చలన చిత్రములకు ఆంగ్లమున ఉపశీర్షికలు రూపొందించెదను, అమ్మాయి మా అమ్మాయి ఋతురాగిణి,   రీతూ  యని చెప్పుకొనును


ఓహో మా బసవడి మాదిరిగా నన్నమాట వాడు కూడా బన్నీ యని పిలిపించు కొనెడివాడు.” అని అగస్త్య అనెను భారతవర్ష " నేను విశాఖపట్నమున తెలుగు ఉపన్యాసకునిగా పని చేయుచున్నాను, విశ్వ విద్యాలయమున సాహిత్య సభకు పోవుచున్నాను " అని చెప్పగా " నేను మిమ్ములనెరుగుదును , అనేక సార్లు వార్తాపత్రికలలో మీ వ్యాసములు , మీ అవధాన కార్యకర్మములగూర్చి నేను చదివి యుంటిని.  తెనాలి నేను చిన్నప్పటినుండి  పదవ తరగతి వరకు తెలుగు మాధ్యమమునే చదివితిని. తెలుగు అనిన చాలా ఇష్టము. "కానీ భాష పేరే తెలియనట్లు ఉన్నదే మీ అమ్మాయికి" అని వర్ష హాస్యమాడగా " కపటమంతయూ ఆత్మన్యూనతాభావమే !  దానికి వచ్చిన ఆంగ్లము బహు స్వల్పం , నేటి పిల్లలందరికీ వచ్చిన భాష తక్కువ వేషము ఎక్కువ . ఓటి కుండకు మ్రోతెక్కువ  అన్నట్టు   ప్రతి  రెండు తెలుగు మాటలకి  మధ్య  ఒక  ఆంగ్లపదమును జొప్పించి తెలుగును నాశనము  చేయుచున్నారు." అని మాళవిక అనుటతో "యదార్ధము!" అని అగస్త్యుడనెను. కొలది సేపు అందరూ మౌనము వహించగా రైలు ధ్వని మాత్రమే వినిపించెను . రైలు  జంఘామారుతముగా సాగుచుండగా  అగస్త్యుడు పుస్తకములో తలదూర్చెను. వర్షుడు  వార్తా పత్రికను శోధించుచుండెను.   

 

అగస్త్యుడు "అన్నా కరేనినా "  చివరి నాల్గు పుటలు చదివి  దీర్ఘముగా నిట్టూర్చి  పుస్తకమును పక్కన పడవేసెను.  ఏమయినదని భారతవర్ష అడిగెను. అగస్త్య చిరునవ్వు నవ్వి  లియో టాల్ స్టాయ్ విరచితమైన అన్నాకరేనీనా వేయి పుటల  గ్రంధము పూర్తిచేసినాను." అనెను.   "ఘనకార్యము చేసినావని నిట్టూరితివా ?" అని వర్షుడనగా  “అది ఒక కారణము మాత్రమే , అంతకంటే ముఖ్యమైనది  వివాహేతర సమ్మందములోకి దిగి ప్రియుడితో లేచిపోయి రష్యానుండి యూరోప్ పారిపోయిన కథానాయికి అన్నా అను  స్త్రీ , యూరోప్ సమాజ నిరాదరణకి గురి అగుటయే కాక అనేక కష్టములు పడుట ప్రధాన ఇతివృత్తము.  చివరికి రైలు క్రింద పది ఆత్మహత్యచేసుకొనుట గ్రంథమందలి చివరిఘట్టము. “ కథను యదార్ధగాధ యని భావించవచ్చా

 "మగనితో విడివడిన స్త్రీకి  ఆత్మహత్యే  శరణ్యమా ?” ఎక్కడచూసినా ఇటువంటి రచనలకు కొదవులేదు" అని మాళవిక స్పందించెను. అన్నా  స్టెఫనోవాన   అనే మహిళ  యదార్ధగాధ "అన్నా కరేనినాఅమెరికా ఫ్రాన్స్ రచయితలు కూడా ఇటువంటి కథలు రచించినారు.  ఫ్లోబే  అను ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత వ్రాసిన మదామ్ బొవారి అను గ్రంధము కూడా ఇటువంటి ఇతివృత్తమునే కలిగి యున్నది. ఎమ్మా అను స్త్రీ పల్లెటూరి వైద్యుడైన భర్తతో శృంగారహీనమైన జీవితముతో విసిగి  ఒక కళావిహీనమైన  జీవితమును గటుపుటకు ఇష్టములేక ఒక భూస్వామి తో, అట్లే మరొక వ్యక్తితో అక్రమ సమ్మందమును  పెట్టుకొని    విలాసవంతమైన జీవితము కొరకు అప్పులు చేసి ఆర్ధిక సమస్యలతో విషముత్రాగి ఆత్మహత్య చేసుకొనుట ఇతివృత్తము

మాళవిక "మదాంబోవారి" అను నవల ఫ్రాన్స్ లో నిషేదించబడినిది. రచయితని న్యాస్థానమునకు రప్పించి విచారించిరి. అతనిని మాటలాడుటకు కూడా అనుమతించక దీనస్థితిలో నుంచి విచారణ జరిపిరి. తుదకు నవలను మరియు రచయితను విడుదల చేసిరి ఇటువంటి నవలలన్నియునూ చలన చిత్రములుగా మారి తదుపరి కాలమందు విశేష ప్రజాదరణ పొంది యున్నవి. నేటి తరము స్త్రీల ఆలోచనలు మారినవి." అని మాళవిక అనగా  "భర్త ని విడిచిన స్త్రీ సమాజములో సుఖముగా జీవించగలదా?"అని అగస్త్యుడడిగెను. వర్షునికి అగస్త్యుడి మనోగతము అవగతమయ్యెను 

నిస్సారమైన జీవితమునకు విరుగుడుగా మాత్రమే ఎమ్మా సమ్మందములను నెరిపెనుఆమెకు చేటు తెచ్చినది ఆమె చేసిన అప్పులు విలాస లాలస.” అనెనురైలు చెన్నపట్నము చేరెను.  "ఫ్రెంచ్  రచయిత  ద్యుమా  చెప్పినట్టు వివాహ సంకెళ్ల భారము ఇద్దరు మోయాల్సి యుండును ఒక్కొక్కసారి మూడవ వ్యక్తి కూడా." అని చెప్పుచుండగా రైలు చెన్నపట్నము చేరెను మాళవిక రైలు దిగి కుమార్తెతో కలిసి  వెళ్లిపోయెను.