Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, July 19, 2020

Bharatavarsha -10

జాము రాత్రి దాళువాళించిన నక్షత్ర ముక్తావళి క్రమక్రమముగా కరిగిపోగా, జాముచుక్క  యొక్కటి అంబరమున మిగిలి యున్నది . బాలభానుడాకాశమున కూర్మము వలె ప్రాకుచుండ కెంజాయలలుముకొన్న అంబరముదయరాగము పాడుచుండెను. మలయమారుతాము తాకగ  ప్రక్రుతి యంతయు పులకరించ నల్లంచిగాఁడు(Indian robbin) అల్లన రాగమేదియో పాడుచుండగా, పిగిలి పిట్ట యొకటి బిగ్గరగా కూయుచుండెను. ఆ కూత  ఉదయరాగమందు మేళవించి ఎగయుచున్న  కపిలవర్ణ  తీవ్రతను తెలియజేయుచూ అప్పుడే కండ్లు తెరిచిన అరుణతారకు మేలుకొలుపు రాగమువలెననిపించెను. ప్రకృతి ఎంత ముచ్చటగా నున్నదోకదా!

అరుణతార లేచి దేవునికి నమస్కరించి కేశవుడేల లేవకుండెనో యనుకొని, నిశిరాత్రివరకూ మేలుకొన్నచో ఎట్లు లేవగలడనుకొని కూతురి గదిలోకి బోయెను. లకుమను తట్టి నిద్రలేపి కాఫీ కలిపి ఇచ్చి తానూ కూడా సేవించుచుండెను.   

లకుమ:  ఇది మన స్వగృహమైనచో ఎంత బాగుండును.
అరుణ : ఈ భవంతి వెల ఎంతో తెలియునా? పది కోట్లు.  
లకుమ : పది కోట్లా!!!  అయిననూ మనకి ఇట్టి భవనముండవలెను 
అరుణ : అంత సొమ్ము కుమ్మరించు స్తొమత మనకు ఉండవలెను కదా. 
లకుమ: నాటి చలన చిత్రనటి,  నేటి ప్రముఖ నర్తకీమణి అరుణతార యేనా ఇట్లు మాట్లాడు చున్నది. 
మునుపెప్పుడూ నీవిట్లు మాట్లాడుట వినలేదు.”  
అరుణ : అదియే నేను చేసిన తప్పు , కానీ ఇప్పుడు నీకన్నియునూ జెప్పు సమయ మాసన్నమైనది. 
ఈ భవనమునకు  ఏబదివేలు అద్దె చెల్లించుచున్నాము. ఇంతలో పిల్లవాడు వార్తా పత్రికను తెచ్చి ఇచ్చినాడు. లకుమ, తల్లి ఏడ్చుచున్న చిత్రమును చూసి వార్తను  వడివడిగా చదివి, నీకు చలన చిత్ర రంగమే సరియైనది అనెను. నాకు ఏది సరియైనదో చెప్పువయసు , అనుభవము నీకున్నచో నాకంటే సంతోషించువారెవ్వరు. నడుచు దారిలో  ముళ్లకంచెలున్ననూ కనలేని  మూఢమతివి  నీవు, నల్ల అను తెల్ల అను భేదమెరుగని బేలవు .   పయట మాత్రమే పరికించు నాయుడు,  పెఱిమ (ప్రేమ) జూప పులకించి సర్వమర్పింపదలచినావెంత తెంపరివి నీవు! సినిమా నాయుడన్న నెరుగనివారు లేరు.  వాడు  దర్పకుఁడు మాత్రమే,  దర్శకుడు కాదు.  ఆ కోశాధికారి నిన్నుద్ధరించునని నమ్ముచున్నావు.  గోముఖవ్యాఘ్రము  సంచరించు జనారణ్యమున కారుణ్యమనునది వట్టిమాట. 

పైకి ఆప్యాయత, లోన మాత్సర్యము తో నిండిన ఆ నాయుడు వయోముఖ విష కుంభ ము (పాల లాగా కనిపించే విషముతో నిండిన కుండ) వానికి దూరముగా నుండుము.  కోటిఈశ్వరావు వచ్చుట, చిత్ర తో కలిసి మద్యము సేవించుట, ఇవియన్ని చాలవన్నట్టు ప్రమాదభరితముగా వాహనము నడుపుట. నాయుడుని  రాత్రివేళ  కలుసుకొనెదనని మాటిచ్చుట… అని తల్లి అనుచుండగానే  అందు తప్పేముంది అతడు నాకు అవకాశమి చ్చెదనని మాట ఇచ్చెను. యని లకుమ పలుకగా "  అవకాశమిచ్చుట కాదు  , జీవితమును కూల్చును " అని అరుణతార ఆవేశముగా పలికెను.  

లకుమ: అష్టోత్తరము పూర్తి అయినదా? ఈ ప్రభాత సమయమున ఇట్టి ఉత్పాతము సంభవించునని ఊహించలేకుంటిని. అరుణ  "ఈ చలన చిత్రముల మోజులో నీ చదువే మగునో ఒక్కసారి ఆలోచింపుము" అని తల్లి అనుచుండ “ఇంక నేను చదువజాలను ఈ చదువుకి స్వస్తి పలికి నేను నటనయందు నా భవిష్యత్తును వెదుకు కొనవలెనని  నిర్ణయించుకొంటిని.” యని లకుమ గట్టిగా చెప్పెను. 
ఎంతకు తెగించినాడు నాయుడు నీ చదువుకి చరమగీతమగునని కలనైనా యనుకొనలేదు” నీవు నిర్ణయించుకొన్న అటులనే  కానిమ్ము" లోక కర్తయైననూ మూర్ఖుని  మార్చలేడు, నుదుటినవ్రాసిన వ్రాలు తప్పించ తరమే నూరేళ్లు చింతించినన్" యని కేశవా కేశవా యని పిలుచుచూ కేశవుని గదిలోకిపోయి, అక్కడ పడకపై పడి యున్న యుత్తరమును చదివి " ఆయూ కేశవా ఎంత పని జరిగెను , ఇల్లు విడిచిపెట్టి పోయితివా యని అరుణతార  శోకించుచుండ "బ్రహ్మాండభాండమ్ము పగిలె నన్నట్లు  భువన కంపనము కలుగునట్లు ఎందులకు శోకించెదవు?" అని లకుమ అనుచుండగా అరుణతార చేతిని లకుమ చెంపకాదేశమొనర్చెను. లకుమ కళ్ళు చెమర్చుచుండ, “కేశవుడు పోయినచో తప్పునాదా? అయిననూ   కేశవుడనిన యున్న ప్రేమలో రవ్వంతయిననూ నాపైలేదుకదా. నీతో పడలేకున్నాను నేను కేరళ పోయెదను.   మా నాన్న వద్దకు  పోయెదన” నిన లకుమను   “నీ యూహపోహలకు (ఏది అవసరమో ఏది అనవసరమో నిర్ణయించుకొనుట) నేను సంతసించితిన” ని అరుణతార మెచ్చుకొనెను. దూరవాణిలో పోలీస్ అధికారితో సంప్రదించి స్నానము చేసి వచ్చుసరికి పోలీస్ అధికారి ఇంటనుండెను. అతడికి కేశవుడి చిత్రమిచ్చి ఎటులైననూ తీసుకురావలెనని కోరెను.
పోలీసు అధికారి వెడలిన పిదప అనునయమున లకుమను తన గదిలోకి తీసుకుపోయి “ నా హితవాక్యము నీకు రుచించనియెడల నీవు అనుభవమున నేర్చుకొనగలవు.” అని అనునయించుచుండగా  లకుమ  “ధూర్జటి మొదట రసికుడై సుఖభోగాలనుభవించి, రాజాశ్రయ సౌఖ్యాలన్నీ చవిచూసి, ముదిమి ముసిరే వేళకు మోక్షకామియై శివభక్తిలో మునిగి  శ్రీకాళహస్తి మాహాత్మ్యము , శ్రీకాళహస్తీశ్వర శతకమును  భక్త్యావేశంలో రచించినట్లు,  వృద్ధనారీ పతివ్రత అన్నట్లు  నీవు యవ్వనంలో అన్ని సుఖములు అనుభవించి , ఇప్పుడు నా జీవితము పాడగునని వంకలు పెట్టుచున్నావు." అని తల్లి పై విరుచుకు పడెను. 

అరుణ మనసు గాయపడిననూ ఓర్చుకొని "సినిమాతారలు అందరినీ ఒక్క గాటనకట్టు లోకరీతి ననుసరించుచున్నావు  నేనటువంటి దానను కాదని చెప్పుకొన్న వలసి వచ్చుచున్నది. అని   గోడ బీరువా తలుపు పక్కకి జార్చగా పాత తైలవర్ణ చిత్రమొకటి కానవచ్చెను.  ఈ చిత్రము మా అమ్మమ్మ మా అమ్మకి ఇవ్వగా మా అమ్మ నాకు ఇచ్చెను. లకుమ ఆ చిత్రమును తేరిపార చూచి  "ఈ నాట్యము భారత నాట్యమే కదా! ఈమె రాజాస్థానమందు నర్తించు రాజనర్తకివలెనున్నది. రాజ నర్తకులనగా వేశ్యలేకదా !"అని లకుమ కించుత్తు  వంచాడించక మాట విసిరెను.

గాయముపై దెబ్బ పడెను అరుణ ప్రాణమువిలవిలలాడెను "రాజ నర్తకులు వేశ్యలుకారు.మిడి మిడి జ్ఞానమున్నవారితో మాట్లాడుట ఎంత కష్టమో ఇప్పుడు తెలియుచున్నది.  అజ్ఞానముతో చరించు  మూర్ఖులు తాము మేధావులని, పాశ్చాత్యులైనచో  మనకన్న తెలివైన వారు అను భావములను ఏర్పరుచుకొందురు. అట్టి వారికి చెప్పి ప్రయోజనమేమి?  నేను చలనచిత్ర రంగమందు ఉండుటచే నీవిట్టి దురభిప్రాయమున కొడిగడిట్టితివి.   చలనచిత్రరంగము నీకు స్వర్గము వలే కనిపించుచున్నది .  ఇప్పుడు నీకు తల్లి మాటలు ఎట్లు రుచించును ?

అని అరుణ బీరువానుండి చిత్రము తీసి  పైట కొంగుతో దానిని  తుడిచి "నువ్వు చూచిన నాట్య భంగిమ కథక్. మొఘల్స్ కాలంలో కథక్ ని బాగా  ఆదరించారు.  అప్పుడు  కథక్ రెండు రకాలుగా ఉండేది. దేవాలయాలలో చేసే భక్తి భావ కథక్ , రాజాస్థానాల్లో చేసే శృంగారభరిత కథక్. నీకంతాయో ఒక్కవిధముగానే కనిపించును.  నువ్వు  నటనని వృత్తి చేసు కొనవలెనని ఉవ్విళ్ళూరుచున్నావు. నాటి  మహానటులు నటనని జీవితముగా చేసుకొనగా, నేటి విద్యార్థులలో అత్యధికులు జీవితాన్ని నటనగా చేసుకొనుచున్నారు. నీవునూ అదే  చేయుచున్నావు. లకుమ  “నేను జీవితమును నటించుచున్నానా?” కాలేజీలకు పోవుటయే కానీ అందు నిజంగా చదువుకొను వారెందరు? చదువునటించుచున్నారు. నువ్వు 18 సంవత్సరముల నుండి  చేయుచున్నదంతా  నటన కాక మరేమి? అని అరుణతార   విస విసా పోయివాహనము  తీసుకుని బైటకు వెడలెను.  

5 comments:

  1. అబ్బో కథ మంచి రస కందాయంలో పడినట్లున్నది. తరువాత ఏమగునో అనే ఉత్కంఠ పెరిగి పోతోంది.

    ReplyDelete
  2. Very interesting sir waiting for next one....

    ReplyDelete
  3. సినితారాలు ప్రజలతోనే కాదు... సొంత బిడ్డ లతోనే మాటలు పడతారని ఇది చదివాకా తెలిసింది. రంగు రంగుల ప్రపంచంలో బోగాలు అనుభవిస్తున్నారని మనం అనుకుంటాం... కాని వారి త్యాగాల విలువ సొంత వారు కూడా గుర్తించలేకపోవడం బాధాకరం. అరుణ తార గారి బాధ కళ్ళకి కట్టినట్టు రాశారు అబినందనలు sir

    ReplyDelete