Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, July 13, 2020

Bharatavarsha 5

అట్లు నిశ్శబ్ద వాతావరణమున భారతవర్ష , అగస్త్య ఇద్దరూ  పెరటి  చెట్టు క్రింద  కూర్చుని  మాట్లాడుకొనుచుండగా    మంజూష లకుమను  తోడ్కొనివచ్చెను. “వర్ష,  కార్యక్రమము ఎట్లు సాగెను ,సమయమునకు రాలేకయినందుకు విచారించుచున్నాను  ఏమీ అనుకొనరాదు “ అని లకుమ  అనెను.  

“విచార మెందులకు  రాకూడదనే నీవు  రాలేదు , నీకు అవధాన ప్రక్రియ అనిన వెగటించునని మా అన్నకు తెలియునులే అని మంజూష హాస్యమాడుచుండగా వర్షుడు  “ఓహో లకుమా! ఎప్పుడువచ్చితివి? పొద్దుపోయి వచ్చితివే, అనెను. “నీవునూ  దామినివలె మాట్లాడుచున్నావు, నేడు ఒకవారము రోజులు మా  అమ్మ  వద్దకు హైద్రాబాదు పోవుచున్నాను. బయట కారు నిలిచి యున్నది, పోవుముందు నిన్నొక చిన్న సహాయమర్ధించ వచ్చితిని” అనెను  చేయగలిగినదేదైనా తప్పక చేతునని వర్ష పలుకగా . “అద్దె ఎంతైననూ నాకొక  చక్కటి ఇల్లు చూచిపెట్టుము నాకు వసతిగృహమునందు స్వేచ్ఛలేదు. నా కదలికలపై దామిని ఆరాలుతీయుట నాకు మిక్కిలి అప్రియముగ నున్నది.” కన్నులు మిటకరించు లకుమ  అనెను .  

వారు మాటలాడుచుండగా కాఫీ తెచ్చుటకు మంజూషలోపలికి పోయెను. లకుమ అగస్థ్యతో కరచాలనము చేసెను.అది చూచి  మాలినిగారు  "ఒకే పాఠ శాలలో  చదువుకొన్న మీ అందరూ ఇట్లు కలుసుకొనుట చూచిన ముచ్చటగానున్నది. లకుమా, దామిని ఉత్తమురాలు నీక్షేమము కోరే ఏదైననూ చెప్పును.”అని అనిరి “ఆమె పురాతన పద్ధతులు నావంటికి సరిపడవు. స్వేచ్ఛా భావములు గల ఏ ఆధునిక  స్త్రీ ఆమెను మెచ్చదు.” అని లకుమ అనెను.  "ఎట్టి భావములను స్వేచ్చాభావములని తలకి పట్టించుచున్నారో నేటి కాలమందు చలన చిత్రములను చూచెడి వారికి  తెలియును. అని మాలినిగారు అనగా వర్షుడు " చూచెడి వారికి చూచి చెడిన వారికి కాదమ్మా , ఆలోచించెడివారకు తెలియును. చలచిత్రములలో సంభాషణాలేకాక  కాక  గీతములందు కూడా  ఇట్టి చెత్త భావములనే దట్టించి శ్రోతలపై  రుద్దుచున్నారు."  చిత్ర గీతములందు  ఏమి దట్టించారయ్య  నేను  చెవులో ఈ పాటల యంత్రము నుంచుకొని  నుంచుకొని నిత్యమూ  అనేక గీతములను వినుచున్నాను నాకేల కనిపించవు?   
వర్షుడు "ఏదీ  నీ  పాడు యంత్రమును ఇటిమ్మ"ని తీసుకొని నొక్కగా ఒక తెలుగు చిత్ర గీతము వినిపించుచుండెను 
 చెవికి పోగు పెడితే తప్పు "జుట్టుకు రంగు కొడితే తప్పు ఒంటికి టాటూ వేస్తే తప్పు ఫ్రెండ్స్ కూడా తిరిగితే తప్పు , బొడ్డుకి రింగు పెడితే తప్పు టైటుగా ప్యాంటూ వేస్తె తప్పు నైట్ అంతా మెలకువ తప్పు 9'o క్లాక్ లేస్తే తప్పు  బ్రేక్ ది రూల్స్ .... ఎక్సమ్ ఫీజు నొక్కితే తప్పు పరీక్షా వేళా క్రికెట్ తప్పు ఊరుకుంటే ఎన్నో చెబుతార్రా  బ్రేక్ ది రూల్స్ ..." వర్షుడు యంత్రమును కట్టేసి ఇలాటి పాటలు విన్నచో ఎవడైననూ  బాగుపడునా ?  
లకుమ : కానీ సంగీతము అద్భుతముగా నున్నది కదా!
అగస్త్యుడు : సాహిత్యము ఎంత చెత్తగానున్ననూ మనకభ్యంతరము లేదు. పచ్చగడ్డి కైననూ మసాలా దట్టించినచో లొట్టలేసుకుని తినుటకు జనులు అలవాటు పడినారు.  హేపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యరా , హత విధీ!  ఇది తెలుగు పాట అట. లకుమకు అగస్త్యునికి వాగ్యుద్దాము మొదలాయెను . ఇంతలో మంజూష కాఫీతో ప్రవేశించి అంతటితో ఆపవలెను సినిమాలను ఎక్కువ చర్చించిన అంతకంటే పాపము మరొకటిలేదు అనుచూ అందరికీ కాఫీ ఇచ్చి వర్ష నేడు కార్తీక పౌర్ణిమ మరిచితివా అనిగుర్తు చేసెను. ఓహో మరచితిని , నేడు పౌర్ణమి పూజ కలదు." అనెను


అదివిని లకుమ నవ్వుచూ "నీకిటువంటి చాదస్తములు కలవని నాకు తెలియదు,  సంధ్యావందనాలు, పూజలు, వ్రతాలు… విసుగు." అనగా  వర్షుడు “మన  సంప్రదాయ ములు గొప్పవని చాటించి పాటించకున్న ప్రయోజనమేమి ? ఈ పూజ ఎందుకు చేతురో తెలుసా? పూజకు వ్రతమునకు భేదమెరుగుదువా?  అని వర్ష  చెప్పదొడిగెను  “నేను స్త్నానం చేసి పూజా వస్త్రములు ధరించి వత్తును ఈ లోగా మీ చర్చ ముగియవలెను” అని మంజూష   లోపలి పోయెను. "వ్రతము అనిన నిర్ణయము ఒక సంకల్పము నీ లక్ష్యమును దృఢ పరుచుకొను  మార్గము వ్రతము    అని చెప్పి "సంధ్యావందనమెందుకుచేతురో తెలుసా? యని వర్షుడు అడగగా "సంధ్యావందనము మూఢనమ్మకం, హిందూ బ్రాహ్మణుల మూడాఛారామని " లకుమ చెప్పెను

 "స్నేహితులు చెప్పినది విని నీవట్లనుచున్నావు కానీ నీకై నీవు చదివి , శోధించి తెలుసుకున్నది కాదు.  అగస్త్యుడు "గూగుల్ నందుకూడా అట్లే  లిఖించబడెను" అనెను. " గూగుల్ నందు ఒక అజ్ఞాని అట్లు వ్రాసిన అదియే నిజమని నమ్మతగదు. గూగుల్ నందు కొన్ని తప్పులు దొర్లినచో వారునూ సరి చేసికొందురు. నేడందరూ ఏది ప్రచారము గావించిన అదే నిజమని నమ్ము చున్నారు. అసలు ఎన్ని సంధ్యాలున్నవో తెలియునా? త్రిసంధ్యలు అందురు సంధ్యా వందనము రోజునకు మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము (రాత్రి) యొక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. సూర్యోదయమైన తరువాత చేయుట అధమము. 

కాని మనము సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది.  సంధ్యా వందనము సూర్యుడికి శక్తినిచ్చి  ఆధ్యాత్మికంగా  విశ్వానికి చైతన్య మిచ్చును." “నేను చదువజాలను కానీ చెప్పినచో  వినుటకు బాగున్నది” లకుమఅనగా. అగస్త్య “అదియునూ ఒక సుగుణమే, నేటివారికి పుస్తకపఠనమన్న అత్తిపూచినట్టే.  కోటికొక్కడు పుస్తకపఠనము నందు ఆశక్తి కనబరుచును” అని చెప్పుచూ   "నాకు కూడా తెలుగు మాసములెన్నియో తెలియవు , ఇది ఏ తెలుగు మాసమో  తెలియదు ,  ఋతువులెన్నో తెలియవు , పొర్ణమి అమావాస్యలు తెలియవు  దిక్కులు కూడా  తూర్పుపడమరలు తప్ప ఉత్తర దక్షిణములు తెలియవు." అని ముగించెను. 

లకుమ, అగస్త్య  ఇరువురు బయలుదేరవలెను అనగా " నేడు అతిధులకు భోజనము పెట్టుట మన సంప్రదాయము కావున పూజ చూసి భోజనం చేయవలసినదిగా మాలినిగారు కోరిరి . మంజూష  చెంబుతో నీళ్లు పసుపు కుంకుమలు తీసుకుని వచ్చి మండువా లోగిలిలో నున్న తులసి కోటను  దీపములతో అలంకరించెను. ఇంతలో  వర్ష స్నానమా చరించి చలువ చేసిన వస్త్రములను ధరించి తాను కూడా పూజలో పాల్గొనెను.

శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .. సతతము నిను సేవింతుము సత్కృపకనవే” మంజూష తులసి పూజాగీతమును పాడి  ప్రదక్షణ ఆచరించి పూజ ముగించి న తరువాత అందరూ లోపాలకి వెళ్లిరి. అబ్బో నీకిట్టి పాటలు వచ్చునా ! అని అగస్త్య అనగా   మాలిని గారు “పూజలు  వ్రతములు  ఖగోళ గతులను నిత్య జీవితమునకు దగ్గరగా తీసుకువచ్చి నిత్యా జీవితమును ఆనందమయము చేయునని నమ్మినచో  అందరూ నేర్చుకొనవచ్చు”

భోజనములు  ముగిసిన పిదప వర్ష గదిలో గోడపై అతికించి ఉన్న చిత్రము అగస్త్య లకుమలను ఆకర్షించెను. అది ఒక పెద్ద వృక్షము. దాని దిగువున వంశ వృక్షము అని వ్రాసి ఉన్నది.  ఇది ఎందులకు ? అని అగస్త్య ప్రశ్నించెను. మీ తాతగారి గురించి  నీకెంత తెలియును అని అడిగెను ?”   అని వర్ష అడుగగాచాలా  కొంచెము తెలియును” అని అగస్త్య అనెను.  మీ తాతగారి నాన్నగారి గురించి ఏమైనా తెలియునా ? అని అడుగగా అగస్త్య పెదవి విరిచెను. వర్షుడు" తెలుసుకొనుటకు ప్రయత్నించుము నేను ప్రయత్నించుచున్నాను" అనెను నీకు ఇట్టి ఆసక్తి ఎట్లు కలిగెను అని అగస్త్యుడు అనగా  

వర్షుడు  "మా తాతగారు సైన్యమునందు పనిచేసి రెండవ ప్రపంచ యుద్దములో పాల్గొనిరి. భారత సైనికులు రెండు లక్షల యాబదివేలమంది పాల్గొనగా ఎనబదివేలమందికి పైగా వీరమరణము పొందిరి.  ఆ కాలమందు సైనికులు గోతులులో  రోజులతరబడి కూర్చొని ఉండెడివారు. వారు ఏదైనా ఆరోగ్య నెపమున సెలవడిగిన కాల్చి చెంపెడివారు , బయటకుపోవుటకు అవకాశములేక  నిస్పృహ తో తుపాకీ గొట్టమును నోటిలో పేల్చుకుని  సెలవు తీసుకొనెడివారు.
వర్ష: మా తాతగారు యుద్ధమందు వీరమరణము  పొందినారు.
అగస్త్య: ఏ యుద్ధమందు  వీర మరణము పొందినారు?  
“1940 దంకెక్ అనే ఫ్రెంచ్ పట్టణములో జర్మన్ సేన బ్రిటిష్ సేనను అడ్డగించి వెనక్కి పంపింది. అడాల్ఫ్ హిట్లర్ “బ్లిట్స్ క్రీగ్” ,ఒక తరహా మెరుపుదాడి, పథకం వల్ల 68,000 బ్రిటిష్ సైనికులు చనిపోయారు అందులో మా తాతగారు ఉన్నారని భావన. మాతండ్రిగారు,  కూడా అట్లే సైన్యమునందు పనిచేసి వీరమరణము పొందినారు.”
అగస్త్య: భావన అనుచున్నావు, ఖచ్చితంగా తెలియదా ?
వర్ష : ఎట్లు తెలియునోయి అది యుద్ధము, భౌతిక కాయాలని ఇండ్లకు పంపుటకు ఎట్లు వీలుపడును? సమాచారం కూడా ఊహామాత్రమే. దంకెక్నుంచి నలుగురు ఈతగాళ్లు ఈదుకుని ఇంగ్లాండ్ పోయినారని అప్పట్లో అనుకున్నారట. గజఈతగాళ్ళు మాత్రమే అట్లు చేయుటకు వీలున్నది. మాతాత గజ ఈతగాడు.
అగస్త్య: నాకునూ మా పూర్వీకుల పై ఆసక్తి కలుగుచున్నది. లకుమ మరి నీకు మీ పూర్వీకుల గూర్చి తెలుసుకొనవలెనని లేదా ?
లకుమ : మా పూర్వీకులు రాజనర్తకులని మా అమ్మ ఆప్పుడప్పుడు చెప్పుచుండును వారు ఎట్టివారో అందరికీ  తెలియును వారి గూర్చి తెలుసుకొనుట వ్యర్ధము. వర్షుడు "అగస్త్య ఆసక్తి ఉన్న ముందునువ్వు మీ తాతగారి గురించి తెలుసుకొనుము.   అగస్త్య "నేను మా   నాన్న ని కలసి సంవత్సరములాయెను. ముందు నేను మా నాన్నగారిని  కలిసెదను. లకుమ కారులో అగస్త్యను వదిలిపెట్టెదనని చెప్పగా లకుమ అగస్త్య కలసి బయలుదేరిరి. 

10 comments:

  1. చాల బాగుంది. తలా అటుఇటు తిప్పకుండా చదివిస్తోంది మీ భారత వర్ష

    ReplyDelete
  2. భిన్నమైన పాత్రలు, విభిన్నమైన మనస్తత్వాలు
    చరిత్ర వివరణ ఒక వైపు, సంస్కృతీ సాంప్రదాయాల వర్ణన ఒక వైపు

    ReplyDelete
    Replies
    1. Your joy of reading will increase as we advance. Thank you.

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. కథ ని చదువుతూ ఉంటే ఎప్పుడు ముగించి ఇంకో ఎపిసోడ్ ని ఎప్పుడుఎప్పుడు చదువుదాం అని మనస్సు అంటుంది

    ReplyDelete
  6. The bharathavarsha is giving me the immense pleasure of reading telugu.

    ReplyDelete
  7. వైవిధ్యమైన పాత్రలు, సంప్రదాయాలు,మనస్తత్వాలు..... ఆహా ఒక మనిషికి కావాల్సిన అనుభావాల పుట ఈ భరతవర్ష... అబినందనలు పూలబాల గారు

    ReplyDelete
  8. భరతవర్ష చదవటం మొదలెట్టాను. అచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు

    ReplyDelete