Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, July 20, 2020

Bharatavarsha -11

విశాఖపపట్టణ నగరపాలక సభాభవనము (మునిసిపల్ ఆడిటోరియం)విద్యుత్ దీప విరాజమానమై  జిలుగువన్నెలలీనుచున్న  పీతాంబరదారియైన బింబాధరివలె  చూపరులను సమ్మోహన పరుచుచుండెను.   ఎర్రని తివాచీలు పరిచిఉన్న సువిశాల సుందర సభ అంతర్భాగము, వివిధవర్ణ-వస్త్రధారులైన, సాహిత్యానురక్తులతో నిండి చిత్రవర్ణములతో గూడిన  తులిప్స్  వనమువలె నగుపించుచుండెను. కవి, పండిత, కళాకారులు,  కలిసి-పారుచున్న  ఏరులవలె, త్రివేణి సంగమ పవిత్రతను తలపోయుచూ, ఙ్ఞానసింధువున విలీనమగు సాగరగామినివలె కనిపించిరి. దృశ్య మాధ్యమ వార్తప్రతినిధులకు, పాత్రికేయులకు, రాజకీయనాయకులకు, చలనచిత్ర ప్రముఖులకు సభ  అలకనందవలె కానరాగా, విరహోత్కంఠిత నాయిక ప్రియునికొరకు ఎదురుచూచుచున్నట్లు సభారంభమునకొరకు ఎదురు చూచుచుండిరి.  కొండకచో బూతు సంభాషణములను నెరుపుచు కాలహరణము చేయుటకు సభలో దూరిన కొలదిమంది ధూర్తులు  ఆలయమున  మూర్తుల దొంగిలించుటకొచ్చిన చోరుల వలె ఒకరిమొగములొకరు చూచుకొనుచు, పండ్లిగిలించు కొనుచుండ  రసజ్ఞులకు వీరు  తలలో దూరిన పేల వలె నగుపించిరి.  అట్టి నీచులందధముడొక్కడు, ఆంగ్లసర్పద్రస్టుండై  ఆంగ్లమునాలింగనమును జేసుకొని శ్లాఘించుచుండ  " పరపిండము తస్కరింపబూనిన పరేతుఁడి ( ప్రేతాత్మ) వలెనున్న   మ్రుచ్చుడెవ్వఁ డీవు ? " యని బసవడు వ్యాఖ్యానించెను. ఉన్నత రంగస్థలమున కవి పండిత సాహిత్య ద్రష్ట   పరివేష్టితుడయిన   భారతవర్ష మాత్రమువింధ్య శిఖరమున ఒంటికాలిన తపమాచరించుచున్న ఋషి వలె నగుపించెను. సమయము 6 గంటలు కావచ్చుచున్నది. భువన విజయం సాహితీ రూపకం ప్రారంభముకానున్నది.
భారతవర్ష తల్లి మాలిని గారు, చెల్లి మంజూష  తన మిత్రులందరితో ముందరివరసన  కూర్చొని ఉండగా వారి వెనుక  అగస్త్య,  విదిష ,కేశవ , రాఘవ , కూర్చొని ఉండిరి. బసవయ్య ఎచ్చటనూ కూర్చొనక నిలిచిన చోట నిలవక ఆసు యందు కండెవలె తిరుగుచుండెను. బన్నీ వచ్చిఇట్లు  కూర్చొనుము అని అగస్త్య అనగా నేనిపుడు బన్నీయనిన  యూరుకొనను , బసవడని పిలువుము కొంతమంది  మిత్రులు లింకనూ రావలసి యున్నది. నాకు వ్యవధి లేదు అని అనగా "ఇది ఏమి చోద్యము వీడు వెలగబెట్టవలసిన రాచకార్యమేమి కలదు"అని మిత్రులు భావించుచుండ వేదికపైనున్న భారతవర్ష సంకేతమివ్వగా చకచకబోయి బసవడు వేదిక నధిరోహించెను. 

పంచకట్టులో బసవడు గమ్మత్తు నున్నాడు. తెలుగువారికి పంచ కట్టు కడు ముచ్చటగా నుండును అని మిత్రులందరూ అనుకొను చుండ, వేదికపై బసవడు మాట్లాడుటకుపక్రమించెను. “మైక్ మొరాయించెను, పక్కనున్న ఎలెక్ట్రిషన్ ని పిలిచిన యెడల మైక్ సరిచేయును” అని ఒక నిర్వాహకుడు అనగా, బసవడు  ఇట్లనెను

"ఓవిద్యుత్వేత్తా, ధ్వనిపెంపు యంత్రోద్దారకా,సమయపాలనకాటంకమగుచున్నది ధ్వనిపెంపు యంత్రమును సరిజేసి  కవి పండిత వరేణ్యులాశీనులై  విద్వాంస విరాజమానమైన ఈ సాహితీ సభను నిర్విఘ్నమొనర్చ రయమున రమ్ము.” యని ఆశుకవితా ప్రజ్ఞనందరినీ అలరించెను. విద్యుత్వేత్త వచ్చి ధ్వనిపెంపు యంత్రమును సరిజేసినపిమ్మట బసవడు’ "ఎం.ఏ చరిత్రనందు గెలుపొంది, మరల ఎం.ఏ తెలుగు నందు గెలుపొందిన భారతవర్ష ఈ సాహిత్య సభను నిర్వహించుట, అందులకార్ధికసహాయము చేయుచున్న సాహిత్యమండలి అధ్యక్షులు   శ్రీ పైడిరాజుగారికి, ఇతర సభ్యులందరికి నా నమోవాక్కములనర్పించుచున్నాను. పండితులకు  ఉన్నతులకు  వేడుక గల్గించు ఈ సాహితీ రూపకం    ప్రారంభకులకు సదావకాశము.  వేదజ్ఞుఁడు,  అవధాని , కవియైన భారతవర్ష  సరసన నిలుచుటయైన నావంటి అల్పజ్ఞానుల సుకృతము. విద్యాంసుల ఉచ్ఛ్వాసనిశ్వాసములైననూ, విదుషీమణుల నూపురముల ఘోషయైననూ, జ్ఞాన ప్రేరితములు ,స్ఫూర్తిదాయకములు. ఈ తెలుగు సాహిత్య సభకు  మంగళమగుగాక!!! 
   
చంద్ర శేఖర సిద్ధాంతిగారు భువన విజయము సాహితీ రూపకం ఉపోద్ఘాతమునిచ్చుచూ “ఆంధ్ర సాహిత్యంలో ఎన్నో ప్రయోగాలు, సంవిధానాలు, ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. వాటిలో సాహితీ రూపకాలు కొన్ని. రూపకమనిన  నటులు ఆయా పాత్రల రూపములను  ఆరోపించుకొని అభినయించుట. అయితే సాహితీ రూపకాలలో పాల్గొనేవారు ఉద్దండ పండితులు, కవులు. అంతే కాని నటులు కారు. మామూలు నాటకములయినచో  నటులు అవసరమైన వేషధారణ చేసుకుని నాటక రచయిత వ్రాసిన దానిని కంఠస్థం చేసుకుని అభినయించటం జరుగుతుంది. ఈ సాహితీరూపకాలలో పాల్గొనే కవులంతా స్వయంగా రచయితలు కాబట్టి వీరికి మరొకరు వ్రాసియివ్వవలసిన అవసరంలేదు. అప్పటికి అప్పుడు సద్యస్ఫూర్తితో పద్యాలు చెప్పుతూ, చమత్కారాలు సృష్టిస్తూ, కావ్య ప్రసంగాలు చేస్తూ, సమస్యలు పూరిస్తూ సహజమైన సాహితీగోష్ఠిని తలపించే స్థితి ఈ సాహితీ రూపకాల లక్షణం.

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. దీనిని స్ఫూర్తిగా తీసుకుని 1952 ప్రాంతాలలో గుంటూరులోని ఆంజనేయులు అనే సంపన్నుడికి పెద్దనాది కవులుగా విశ్వనాథ సత్యనారాయణ వంటి పెద్ద కవులను ఆహ్వానించి రాయలుగా ఎవరైనా సాహితీప్రియుడైన ప్రముఖవ్యక్తిని కూచోబెట్టి గోష్ఠి నిర్వహించిన ఎటులుండునని యోంచించి జమ్మలమడక మాధవరామశర్మ గారిని సంప్రదించగా వారీ బృహత్ రూపకమును  రూపకల్పనచేసిరి. ఆవిధముగా మొట్టమొదటి భువనవిజయ రూపకం గుంటూరులో ప్రారంభమైనది . నాటి  హైకోర్టు నాయమూర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రను పోషించసభ మనోరంజకంగా సాగెను. కవి పండితులందరూ  సాంప్రదాయ సూచకమైన ధోవతి, శాలువా, లాల్చీలే తప్ప ప్రత్యేకమైన వేషధారణ చేసుకోలేదు.

ఆనాటి నుండి భువన విజయము పేరుతో ఆంధ్రరాష్ట్రం నలుమూలలా కొన్ని వేల ప్రదర్శనలు జరిగినవి . తెలుగు రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాలలో తెలుగువారున్న ప్రతిచోటా ఈ సాహితీరూపకం ప్రదర్శింపబడెను. అంతే కాకుండా తానా సంస్థ సహకారంతో అమెరికాలో న్యూయార్క్, పిట్స్‌బర్గ్, న్యూజెర్సీ, డెట్రాయిట్, చికాగో, డెన్వర్, లాస్ ఏంజిలిస్, శాన్ ఫ్రాన్సిస్కో మొదలైన నగరాలలో ప్రదర్శింపబడినది .” అని ముగించారు  

తదుపరి దామిని శబ్దోద్దరిణి సాధనముకడ  నిలిచి "ఇప్పుడు విఘ్నేశ్వర ప్రార్ధన. మార్దంగికుడు శ్రీ కేశవుడు, వైణికుడు శ్రీ భారతవర్ష వాతాపి గణపతింభజే అనే కృతిని సమర్పించెదరు"అని ప్రకటించెను. కేశవుడు , భారతవర్ష ఇరువురు తివాచీపై కూరోని వాతారాగణపతింభజే యని శ్రోతల వీనులవిందుచేసిరి. కేశవుడికి సన్మానం జరిగిన పిదప సభ మొదలైంది. సాహిత్య మండలివారు కేశవునికి శాలువాకప్పి నొక జ్ఞాపికనిచ్చినారు.భారతవర్ష పెద్దన పాత్రను పోషించెను. సభ ప్రేక్షకులను  ఆద్యంతం అలరించెను. భారతవర్ష కులపతుల ప్రశంసలు  పొందెను . సభ ముగిసినది.  
 
ఆరు నెలలలో బసవడిలో  వచ్చిన మార్పునుజూసి   అపరిచితులేమియునూ  ఆశ్చర్యమునొందకున్ననూ  మిత్రులందరూ విస్మయమొందిరి. బసవడి తల్లిదండ్రులు , బుచ్చమ్మ ,సర్రాజు అమితానందమునొందిరి. గర్వమున కించిత్తు గగుర్పాటు కూడా కలిగెను.  ఆంగ్ల ప్రభావమునున్న రాఘవ, ఆదిత్య మరి కొందరు ఆంగ్లానుకూలముగా మాట్లాడి" ఏమి సాధింపనెంచి ఇంత తెలుగు నభ్యసించవలెను, రాఘవను  చూడుము అమెరికా పోయివచ్చినాడు. జీవితమునక్కరకు  వచ్చునది ఆంగ్లమే కానీ తెలుగు కాదు అనెను. అంతలో  సభకు వచ్చిన తెలుగు విశ్వవిద్యాలం  పాలనాధికారి  భారత వర్షకు  తెలుగు మహాసభల సందర్భంగా నాంపల్లిలోని  విశ్వవిద్యాలయ ప్రాంగణం లో జరుగు కథా, నవలా చర్చాగోష్ఠిలో పాల్గొనవలసిందిగా ఆహ్వానమిచ్చెను. 

కార్యక్రమ నిర్వాహకులు రాత్రిభోజనములు ఏర్పాటు చేసిరి.  అందరు దగ్గరిలో నున్న భోజన సాలకేగిరి . అచ్చట భోజన శాలలో మరికొద్ది మంది రచయితలు రచయిత్రులు ఉండిరి. అతడు వారిని కూడా ఆహ్వానించి విశ్వవిద్యాలయ ప్రాంగణం లో జరుగు కథా, నవలా చర్చాగోష్ఠిలో పాల్గొనవలసిందిగా కోరి  ఆహ్వానము పంపించెదనని చెప్పెను. అనంతరము వారు పరస్పర చతుర సరస సంవాదము జేయుచూ,  సంతృప్తి చెందక వాదము లోకి దిగగా ఈ వివాదమెచ్చటికి దారితీయునోయని భోజనశాల యాజమాన్యమువారు కలత జెందుచుండిరి. కథకి కాలం మూడిందని కొందరి అభిప్రాయపడగా, అది ఒట్టి భ్రమేనని సమాజాన్ని పాలించేది సాహిత్యమేనని   మనం ఎలాంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తే అలాంటి సమాజం మన ఎదుట ఆవిష్కృతమవుతుందని  భారతవర్ష అభిప్ర్రాయపడెను. 

పాలనాధికారి చర్చాగోష్ఠి తదుపరి వారము ఇప్పుడు కాదని, భోజనములు కానివ్వమని ఛలోక్తి విసిరెను. భోజనానంతరము మార్దంగికుడు కేశవుని కూడా మృదంగవాదనమొనర్చుటకు రమ్మని ఆహ్వానించెను.  

6 comments:

 1. సాహితీ రూపకం పుట్టు పూర్వోత్తరాలను చాలా బాగా వివరించారు. బసవడు తెలుగు నేర్చుకోవడం ఆశ్చర్యంగా ఉంది

  ReplyDelete

 2. ఇది ఒక లోకం, నవలోకం
  అక్షరములు నాట్యమాడు లోకం
  ఇదియే పూలబాల గారి రచనా లోకం

  ReplyDelete
  Replies
  1. ముఖ ప్రీతి మాటలు వలె కాక నిరుపమానమైన మీసాహిత్యాభిమానము ఎల్లప్పుడూ స్పష్టముగా గోచరించుచుండును. మీ ప్రియోక్తులు కవి ఛలోక్తులకాలంబనములైయున్నవి. మీ అభిమానమునకు నా సలాములు

   Delete
 3. The words are not understanding but understanding the narrating of the novel through telugu is great sir

  ReplyDelete
 4. సమాజాన్ని పాలించేది సాహిత్యమేనని మనం ఎలాంటి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తే అలాంటి సమాజం మన ఎదుట ఆవిష్కృతమవుతుంది. నిజమే నాకున్న సాహిత్యబిమనమే మీ వంటి గురువల చెంతకు చేర్చినది. అందులకే బారత వర్ష చదివే సదవకాసం కలిగింది

  ReplyDelete