"ఇది ఏమి చోద్యము మీ తండ్రిగారు దక్షిణామూర్తి అగ్నిహోత్రము వంటివారని వినికిడ"ని వర్షుడనెను. "నిప్పుకైననూ చెదపట్టుటయే కలియుగ ధర్మము."యని అగస్త్యుడు బదులు పల్కెను."నాఉద్దేశ్యము స్వదార ఉండ పరదార ఏలననీ.."యని వర్షుడు అనగా , అగస్థ్య "నేను గ్రహింపజాలకుంటిని " అనెను . "స్వదార అనిన అగ్నిసాక్షిగా పెండ్లాడిన స్త్రీ, పరదార అనిన పొరుగువాని భార్య"యని భారతవర్ష వ్యాఖ్యానించగా అగస్థ్యముఖము జేగురించెను "పొరుగింటిపుల్లకూర రుచియని వినలేదా?" యని బదులు పలికెను. భారతవర్ష వొళ్ళు మానై, కళ్ళు నిలువై మెదడు స్తబ్ధమై తేరిచూచుచుండ అగస్థ్య ఇట్లనెను " అయిననూ స్వధర్మమునే విడిచిన వాడికి స్వదార ఒక లెక్కా? "అనగా మీ తండ్రిగారు మతము మార్చుకొంటిరా !" అని వర్ష అనెను.
"మాతండ్రి గారి వివాహేతర సంబంధమే కారణమని కొందరు భావించిననూ మూలకారణము నిస్సందేహముగా ధర్మసంకరము. నాకిప్పటికీ బాధకంటే ఆశ్చర్యమే అధికము"అని అగస్త్య అనెను. అదివిని భారతవర్ష "అందులకు ఆశ్చర్యమేముంది , చరిత్రలో ఎన్ని దృష్టాంతములు లేవు, 1320 నుండి గుజారాత్ రాష్ట్రము సూరత్ పట్టణమున కటాలాన్ డొమెనికన్ మిషనరీచే ప్రారంభమైన కిరస్తానీ మతమార్పిడులకు బ్రిటిషుపాలన అగ్నికి ఆజ్యము పోసినట్టు అయినది కోట్ల మంది భారతీయులను చంపిన బ్రిటిషువాడు మనకు మోక్ష మార్గమును నుడువుట తల్లినిచంపినవాడు తగువుతీర్చవచ్చెనన్నట్లున్నది. అయిననూ వాడి దాస్యమున బడి బ్రతికిన భారతీయులకి కిరస్తానీ సంకరము తప్పినదిగాదు."అనెను. "తెల్లవాడు రాక పూర్వమే కిరస్తానీయము ఉన్నట్లు వినియుంటినే"యని అగస్త్య అనగా "ఉండిననూ మతమార్పిడులు ఊపందుకొన్నవి తెల్లవాడి ప్రభుత్వమున మాత్రమే. పాలకుల ప్రాపకం కొరకు పాలితుల పాట్లు ఏమని చెప్పుదుము ఎన్నని చెప్పుదుము?
గానకోకిల సరోజిని వలే ఆంగ్లమున అద్భుతమైన కవిత్వము సాహిత్య సృష్టి జేసి కీర్తికెక్కిన భారతీయ ఆంగ్ల కవయిత్రి తోరుదత్త జాన్ కీట్స్ అను ఆంగ్లకవి వలె పిన్న వయసులోనే 21 సంవత్సరములకే మరణించెను. బియాంకా అనే ఆంగ్ల నవల , జూర్నాల్ మద్మజేల్ దాహ్ర్వ్ అనే ఫ్రెంచ్ నవల పూర్తి చేయకనే క్షయతో మరణించెను. అని భారతవర్ష చెప్పగా ఆమె గురించి కొంచము వినియుంటిని అని అగస్థ్య అనెను " వారి తల్లిదండ్రులు గురించి వినియుండవు, వారిది దత్ వంశము, పండిత వంశము ఆమె తండ్రి గోవింద దత్ బ్రిటిష్ వారిపాలనలో వారి పలుకుబడి లోనయి చర్చ్ వల్ల విశేష ప్రభావితము గావించబడి 1862 లో మతమార్పిడి పొంది యున్నాడు. పాపము తొరుదత్ తల్లి ఎంతో కలత చెందెను . ఎంతో వేదన చెందిననూ తరువాత భర్తనే అనుసరించెను. తొరుదత్ తాత గారు రసమే దత్ హిందూ స్కూల్ స్థాపకులు కీర్తికెక్కిన విద్యావేత్త , ఆమె దాయాదుఁడు రొమేష్ ( రమేష్ కాదు)చందర్ దత్ చరిత్రకారుడు , రచయిత మరియు అధికారివలెపాలనాధికారి అనిన ఐ.ఏ .ఎస్. అధికారి ఇటువంటి విద్యాధికులైన వారిని బ్రిటిష్ వారు అధికారబలంతో సునాయాసముగా మతము మార్పిడి చేసెడివారు.
నిజము చెప్పవలెనన్న 52 ఏ . డి నందు థామస్ అను వర్తకుడు భారతదేశమునందు ప్రవేశించిన మొదటి కిరస్తానీయుడు. అతడిని సెయింట్ థామస్ అని థామస్ ఆపొజెల్ అని కూడా అందురు. అతడు కేరళలో క్రాగ్నోర్ నందు మొట్టమొదటి మతమార్పిడుల కు శ్రీకారం చుట్టిననూ 72 లో అతడు తన రెండవ భారత సందర్శనములో తన కార్య క్రమము లను చెన్నపట్టణమునాకు మార్చి వేసెను. అచ్చట ప్రజలకు ఆ మతము ఏమాత్రము నచ్చలేదు . అందుకు వారు అతనిని చంపివేసిరి. 1523 లో పోర్చుగీసు వారు అతడి సమాధిపైన చర్చ్(థామస్ చర్చ్) ని నిర్మించినారు. అప్పటి చెన్న పట్టణమే మద్రాసుగా మారి సెయింట్ థామస్ చర్చ్ యే సాంథోమ్ గా మారెను. మరికొంతకాలం పిమ్మట చరిత్ర పై స్పృహ కలిగిన వారు దానిని తిరిగి చెన్నైగా మార్చి వేసినారు.
చరిత్ర స్పృహకల్గి, వేదమును గౌరవించు ప్రజలుండిన మతమార్పిడులు దుర్లభము అగును. మరి నేటికాలమునచరిత్రయనిన ఏవగింపు వేదములన్న మన సంస్కృతి యన్న చులకన ఇదంతా కుట్ర, దుర్భుద్ధితో దేశ వ్యతిరేకులు చరిత్రను వక్రీకరించి విద్యయందు జొప్పించిన ఫలితము. 52 ఏ . డి అనగా అనగా నేమి ? అని అగస్త్య అడుగగా, 2000 గడిచిన కొద్దికాలం పిదప , 500 ఏ . డి అనగా 2000 దాటిన 500 సంవత్సరముల తర్వాత (అనగా 1500 సంవత్సరముల వెనుక ) అని జెప్పి "అది అట్లుండనిమ్ము మీ అమ్మగారు భర్తకు బుద్ధి చెప్పట పోయి విడాకులకు సమ్మతించి మీ నాన్న గారికి మేలు చేసినారు ? " అని వర్షుడు అనగా "ఆమె తన భర్త అడుగుజాడలలోనే నడుచు చున్నది. వలదన్న మగని పట్టి వ్రేళ్ళాడినచో ఒరుగునది ఏమున్నది? భర్తననుసరించి కిరస్తానీ మతమును స్వీకరించిన వనిత గొప్పది అయినచో భర్త చేసిన పనినే తానూ చేయుచున్నది మా అమ్మ కూడా గొప్పదే. నా తల్లి, నా తండ్రిని భూదేవి వలె చాలాకాలం భరించినది. భ్రష్టాకారి కాకున్న ఇంకనూ సహించెడిదే. మీ తల్లిగారి పట్ల నీకున్న అవగాహన అభినందనీయము. నీవు చూపు గౌరవం శ్లాఘనీయము.
నీ గాయము మానెనుకదా విచారము వీడుము అని భారతవర్ష అనగా ఈ గాయము మానుటకు ఆరు సంవత్సరములు పట్టెను ఇంకనూ మచ్చ మిగిలి యున్నది. నాకు కుటుంబము లేక పోయెను నేను తల్లి వద్దకు పోయి ఉండలేను తండ్రివద్దకు అసలు పోలేను. “ఇది ఎంతదుర్దశ! నీవు వసతిగృహములో ఉన్నావని తెలియును, కానీ ఈ విషయములన్నియు నాకు దెలియవు. " మానాన్న ఎగుమతి వ్యాపార సంస్థను స్థాపించి యున్నాడు. నాల్గు కోట్ల పెట్టుబడికి చేరిన పెద్ద సంస్థకి పెట్టుబడి అంతయూ మా అమ్మ ఆస్తే. ప్రస్తుతము మా అమ్మగారు చెన్నపట్నములో ఉద్యోగము చేయుచూ నాకు కావలిసిన ధనము పంపుచున్నారు. మా తల్లిదండ్రులు భౌతికముగ ఎప్పుడో వేర్పడిననూ విడాకులు వ్యాజ్యము నడుచుచున్నది. ఆస్తుల గొడవలింకనూ మిగిలియున్నవి.
చరిత్రకు సంబంధించిన చాలా విషయాలు తెలియచేసారు
ReplyDeleteఇంత లోతుగా విషయాలు వ్రాస్తున్నారు అంటే ఎన్ని విషయాలు కూలంకషంగా చదువుతున్నారో
ReplyDeleteకథ చాలా ఇంట్రెస్టింగా వుంది ముఖ్యంగా భారత్ వర్ష అగస్త్య మధ్య సంబాషణ
ReplyDeleteచరిత్ర ఎప్పుడు బాగుంటుంది సార్, తెలియని విషయాలు బాగా చెప్పారు చరిత్ర గురించి . మీరు ఎప్పుడు ఎన్నో కథలు రాయాలి అని కోరుకుంటున్నాను
ReplyDeleteఅచ్చ తెలుగులో అద్భుతంగా రాసారు. అబినందనలు
ReplyDelete