బెంగుళూరు, ఇందిరానగరు, సమయము రాత్రి 8.00 గంటలు. ఇన్నోవా మీనాక్షి విలాసము నుండి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయమునకు బయలు దేరు చుండెను. వర్షుడు తెల్లని సంప్రదాయ వస్త్రములను ధరించగా, మీనాక్షి చెంగావి చేలమునందు మెరియుచుండెను. లేతాకుపచ్చ పరికిణీ పై నారింజవర్ణ వోణీ ధరించి వర్షుని చక్ర సంకల్పిత ప్రయాణ పేటికను యమున త్రోయుచుండెను. వారు ముగ్గురు ప్రాంగణములో నున్నవాహనమును సమీపించిరి. చాలకుడు పేటికను అందుకొని వాహనమందుంచెను.
“నన్ను సాగనంపవలసిన పని ఏమి కలదు? నీ బిడ్డను ఇట్లు అతిథి వలె చూచుచున్నావే!” అనుచున్ననూ మీనాక్షి మౌనముగా వాహనము నధిరోహించెను. వర్షుడు వాహనమునెక్కగా యమున కూడా అన్నయ్య ప్రక్కనే కూర్చొనెను. అప్పుడు వర్షుడు యమున వైపు తిరిగి “యమునమ్మ విశ్రాంతి తీసుకొనుమని నీవైనా ఈ మీనాక్షికి చెప్పవమ్మా” అనగా యమున , “ఎంతమాట, అన్నయ్యని చెప్పి ఆదరణ , సత్కారము మరిచెదమా!” అని సాగదీయుచూ చెప్పెను. అట్లు ఎంతచెప్పిననూ వినక వర్షుని సాగనంపుటకు మీనాక్షి యమునలు సిద్దపడిరి. వాహనము వెనుకవరసలో వారు మువ్వురూ కూర్చొనిరి , తలుపులు మోసుకొన్నవి. శ్వేత వస్త్రములు ధరించిన చోదకుడు వాహన వేగవర్ధనిని (vehicle accelerator) ఒత్తగా నల్లని చక్రములు పరిభ్రమించుచూ వాహనము కదిలెను.
వర్షుడు వెడచుండగా ఇంతులిరువురికీ రెండు రోజులనుండి పొందిన ఆనందామృతమును కోల్పోవుచున్న ట్లుండుటచే వాహనమందు నిస్సంకుడు (మౌనము) రాజ్యమేలు చుండెను. ఎన్ని చక్కని విషయములను తెలియజేసినాడు,ఎన్ని సాహిత్య సుధలను చిలికినాడు. ఇతిహాస, తత్వ, సాంకేతిక, కవితా, సాహిత్యములను గ్రోలిన మధుపమితడు. అయిననూ ఏమి లాభము ఈ రాత్రికుండి రేపు పొమ్మన్ననూ మాటవినని మొండివాడని యమున తలచుచుండెను. ఇంతలో వర్షుని చరవాణి మ్రోగగా విదిష తో ఒక్క నిమిషము మాటలాడి నవ్వుచూ ముగించెను. “అన్నయ్యా ! ఒక్కసారి నేను మాటలాడెదను" అని యమున చరవాణిని చేగొనబోయెను. వర్షుడు" అయ్యో ముందుగా చెప్పవలసినది, మరి ముగించితినే! మరల చేయమందువా?” అని అడగగా యమున మూతి మూడు వంకరలు తిప్పెను.
మ. వనవా సాన
మనసా రాపిలి
అనురా గాలను
అనుకో నాథిధ్య
“ఆహా! చూడుము తడిసిన దేహముపై సబ్బుబిళ్ళ జారుచున్నట్టు రహదారిపై వాహనమెట్లు ఎట్లు జారుచున్నదో!” అనుచూ వర్షుడు యమున దృష్టి మరల్చ ప్రయత్నించు చుండగా మీనాక్షి ముసిముసి నవ్వులు నవ్వు చుండెను. “ఎంత తుంటరివయ్యా మారాము చేయుచున్న చిన్నపిల్లకి, గిలక్కాయ చూపి ఆడించినట్టు, రహదారులు, కారులు చూపి నన్ను ఏమార్చుచున్నావు. నేనిచ్చిటిపిల్లనే, బెంగుళూరు నందు రహదారులన్నీ ఇట్లే చక్కగా ఉండును." అనెను.
“విశాఖనందు మువ్వవాని పాలెము, డాబాగార్డెన్స్ వలె; హైదరాబాద్ నందు ఫిలింనగర్ , మణికొండ వలె; బొంబాయి నందు జుహు బీచ్, బాంద్రా వలె ; ఢిల్లీ నందు గ్రేటర్ కైలాష్ , నార్త్ అవెన్యూ వలె బెంగుళూరు నందు సదాశివనగరు, ఇందిరానగరు అత్యంత శ్రేష్టమైన విలాస ప్రదేశములు. అత్యంత ధనిక రాచ, బుధ వాణిజ్య వర్గముల కాలవాలమీ రెండు ప్రదేశములు. రాయలకు చెన్నమదేవి, తిరుమలదేవి అను ఇరువురు రాణుల వలె, బెంగుళూరుకు సదాశివనగరు, ఇందిరానగరు రాణులు. అని చెప్పుచుండగా మీనాక్షి మనసులో "ఈ పిల్లవాడు మాటల మాంత్రికుడివలె నున్నాడే." అనుకొనెను.
మీనాక్షి ముఖమున విషాదమలుముకొనుటకు కారణము యమునకు అవగతమయ్యెను. అందుచే ఆమె మాట మార్చుటకు మీనాక్షి తో "నాకొక ధర్మ సందేహమున్నది నీ జ్ఞాననిధిని అడుగమందువా ? అనెను
మీనాక్షి యమున వైపు కొరడా ఝుళిపించినట్లు చూపు రువ్వి ఏమి అడిగిననూ అడగవచ్చు అని కరవాలము తో వేటు వేసినట్టు జెప్పెను. “శ్రీ కృష్ణ దేవరాయలు కెంతమంది భార్యలని నేను అంతర్జాలమందు ఒక గంట సేపు వెతకవలసి వచ్చినది. ఆరుగురు, భార్యలని కొంతమంది, పన్నెడు మంది భార్యలని కొంతమంది వ్రాసినారు. తీవ్ర ముగా వెదకులాడిన పిమ్మట రాయలుకిరువరు భార్యలని వారి పేర్లు తిరుమల దేవి , చిన్నమ దేవి అని తెలిసినది. ఏ రాజు చరిత్ర చూసుకున్ననూ ఇట్లే ఎందుకు ఉన్నది ?”
మీనాక్షి మరల మౌనముద్ర లో కూర్చొని మరల ఆలోచనలో ములిగిపోయెను
వర్షుడు: ఇదా నీ ధర్మ సందేహము?!
యమున: నాసందేహమదికాదు రాయలు హైందవరాజు కదా అతదికిద్దరు భార్యలైట్లుండిరి?
వర్షుడు: చాలా చరిత్ర చదివినదే చెల్లమ్మ! 1960 లో భారత పార్లమెంట్ నందు ముస్లింలకు తప్ప హిందువులకు రెండు వివాహములు చెల్లవని చట్టము చేయువరకు, సామాన్య హిందువులు కూడా బాహాటంగా రెండు మూడు వివాహములు చేసుకొనెడివారు. ఇంక రాజుల సంగతి అడుగపని ఏమున్నది? ఏ రాజుకు చూచిననూ పది మంది భార్యలుండుట సామాన్యముగా కనిపించును , ఏ కాల మందైననూ ఏ దేశమందైననూ అట్లు లేనివారే అరుదు.
యమున మీనాక్షి వైపు చూచెను ఆమె మనసింకనూ విషాదరాగమునఆలాపించుచున్నది.
యమున : నాకింకొక సందేహము, మన చరిత పురాణములందు ఎచ్చట చూచిననూ పురుషుల వలే ఎక్కువ వివాహములు చేసుకున్న, (ఎక్కువ భర్తలు గల స్త్రీలు) ఎందుకులేరు?
"ద్రౌపది కలదు కదా" అనుచు మీనాక్షి బాహ్య ప్రపంచములోకి వచ్చెను
యమున : ఎంత సేపు చెప్పిననూ ఒక్క స్త్రీ గూర్చి చెప్పుచుందురు.
విలువిద్యలో అర్జునునకు సాటియగు నితంతు మహారాజు ఐదుగురు కుమారులగు సాల్వేయ , శ్రుతసేన, సురసేన, తిందుసరస, అతిసరసులను శిబి చక్రవర్తి కుమార్తె బౌమస్వి స్వయంవరమున వివాహమాడెను. యయాతి కుమార్తె మాధవి వివాహమాడ కనే ఐదుగురు భర్తలతో బిడ్డలను కన్నది. కుంతీ, మాద్రి, అంబిక అంబాలిక ఇట్లు అనేక మంది అని వర్షుడు చెప్పుచుండగా
యమున : పిల్లలను కనిపెట్టుట గూర్చి కాక జీవితము కొరకు వివాహము చేసుకొన్న స్త్రీలు ఎందుకు కానరారు?
వర్షుడు: నాడు సార్వభౌములైననూ , సామాన్యులైననూ సంతాన చింత ఎక్కువగా యుండెడిది , స్త్రీ పురుష సంగమము భోగము కొరకు అనెడి భావన పిదపకాలమందు ప్రభలిపోయినది. అప్పుడు రాజుల పాలనే తప్ప ప్రజా ప్రభుత్వములు లేవు , రాజుకు వారసులుండుట తప్పని సరి కావున వారు పుత్ర సంతానము కొరకు పడరాని పాట్లు పడుచుండెడివారు. మహాభారతంలో కుంతి మరియు పాండురాజు మధ్య "స్త్రీ బిడ్డల కొరకు గర్భం ధరించే అనేక మార్గాల గూర్చి" చర్చకలదు. తన భర్త ద్వారా, పండితుని ద్వారా, డబ్బు కొరకు మరొక వ్యక్తి నుండి గర్భము ధరించుట, భర్త మరణానంతరము కుటుంబాన్ని విస్తరించుట కొరకు గర్భం ధరించుట , పెళ్ళికి ముందే భార్య ద్వారా పుట్టిన బిడ్డను శ్వీకరించుట, దత్తతచేసుకొనుట , డబ్బు ద్వారా పిల్లవాడిని కొనుట, ఒక వ్యక్తి స్వచ్ఛందంగా ఇతరుల కుమారుడిగా ఇచ్చుట, గర్భిణీ స్త్రీని వివాహం చేసుకొనుట పిల్లలను పొందు మార్గములు. ఒక్కొక్క వంశమందు మహాపురుషులుండెడివారు. అందుచే వంశమునకు , గుణ గణములకు అంతటి ప్రాముఖ్యత యుండెడిది.
మీనాక్షి పూర్తి గా నిమగ్న మయ్యి వినుచుండెను ఆమె ముఖమున విషాద ఛాయాలంతరించినవి. “చాలా సేపటివరకూ నీ మనసిచ్చటలేదు. అనుచుండగా " మరి ఎచ్చటికి పోయెను?" అని యమున అడుగుచుండగా, వర్షుడు ఆమె వైపు తిరిగి " ఉష్... హాస్యమాడరాదు అమ్మ మౌనరాగమందు భైరవరాగము దాగి యున్నది "
యమున: నా స్థాయికి రావయ్యా స్వామీ అట్లు చెప్పిన నాకేమి అర్ధమగును? "
మార్జా లము అనిన బిడాలమనినట్టు
వర్షుడు " భైరవరాగమనగా విషాదము అమ్మ బాధను గమనించితివా ?" అని అడిగెను. ఆమె మౌనముగా ఉన్నదనిన ఎప్పుడూ కొడుకు గూర్చి చింతించు చుండును. నేనెంత చెప్పిననూ ఆమె అట్లే ఉందును , నేను ఓదార్చి న యెడల దుఃఖము పెరిగి కన్నీరు పెట్టుకొనును. అందుచే నేను కూడా కొలది సేపు మౌనము వహించి యుందును.
అమ్మని ఊరడించు వయసు జ్ఞానము అనుభవము లేకున్ననూ, మనసున్నది , అది అమ్మ ఎప్పుడూ అర్ధము చేసుకొనును !" అని యమున ఏడ్వ సాగెను. మీనాక్షి భోరున విలపించుచూ యమునను గుండెలకు హత్తుకొనెను. చాలకుడు కంగారుపడి వాహనమును నిలి పివేసెను. వర్షుడు వాహనము కిటికీ నుండి బయటకు చూచెను. వాహనము యెలహంక చేరెను. “సమయము 8.30. గంటలయ్యెను, పోనిమ్ము నాయినా” అనగానే వాహనము మరల బయలుదేరెను.
“మోహనము తొలగగా, లకుమ కొరకు పాడిన మోహన రాగమువీడి తండ్రి సేవలో దివ్యమైన తోడి రాగమునఆలాపించుచున్నాడు. ఇప్పుడు నీకొడుకు వాస్తవ ప్రపంచములోకి అడుగిడినాడు. అగ్నియందు కాలిన కుప్యము. బాధ్యతల దాగలి పై బాధల సమ్మెట దెబ్బలు అతడిని తీర్చిదిద్దుచున్నవి. ఇకపై నీకొడుకు తప్పులు చేయడు , కానీ అతడు ముందు చేసిన తప్పులకు ఇతరుల జీవితములు బలి అగుచున్నవి. ఆ తప్పు దిద్దుకొన వలెను. అందుకు నీవే భాద్యత తీసుకొనవలెను. ఆ నష్టమునకు ఎంత డబ్బయిననూ నేను భరించెదను. అని మీనాక్షి అనుచుండగా, వర్షుడు " డబ్బు ఆ సమస్యను పరిష్కరించ జాలదు" అని చెప్పుచుండగా మీనాక్షి చరవాణి మ్రోగెను.
ఓ! తారా , ఎచ్చటనుండి , .. మేము విమానాశ్రయమునకు పోవుచున్నాము , వర్షుడు పది గంటలకు విశాఖ కెగురుచున్నాడు. తరువాత కొలది సేపు మీనాక్షి బదులైననూ పలక విను చుండెను. శుభవార్తే చెప్పినావు. నీకు కూడా నేనొక శుభవార్త తెలిపెదను. ఇప్పుడు చెప్పజాలను. నీ ఇంటికి వచ్చి నీ చెవిలో చెప్పెదను. నీకు కొక బహుమతినిచ్చిన శ్వీకరింతువు కదా? ఇచ్చిన మాట మరువరాదు. మనమిద్దరమూ కలసి విశాఖ పోయెదము. అట్లు అరుణతారతో కొలది సేపు మాట్లాడి వర్షుని వైపు కొరకొరా చూచెను.
నీవు మధ్యానము ఇండియా గేటువద్ద కనిపించినావని అరుణతార చెప్పెను. నీవు పెద్దలతో చెప్పకూడని పనులు కూడా చేయుచున్నావా? ఏ ఇంగ్లీషు తారామణి తో తిరుగుచున్నావయ్యా ? ఢిల్లీ ఎందుకు పోయినావయ్యా ? వర్షుడి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్టయ్యెను. నీళ్లు నములుచూ అయోమయముగా చూచుచూ “నామీద నమ్మకము లేదా?” అనుచున్న అతడి మొఖం చూచి మీనాక్షి "నాయనా నీమీద నమ్మకమున్నది నీవు వెళ్లిన పని విజయవంతమగును అని కూడా నమ్మకమున్నది. నీవు చెప్పవలదని అనుకొన్నచో నేనీవిషయము ఎవ్వరికి చెప్పుదానను కాదు కదా నాకైననూ చెప్పి ఉండవచ్చు కదా ? "అని మీనాక్షి అనగా వర్షుడు “పని పూర్తి అయిన పిదప తెలపవలెనని " అని నీళ్లు నములుచుండెను .
అరుణ తార చూచెను , నీకు తెలిపెను , మీ ఇద్దరికీ తెలిసెను. నాకు చెప్పుటకు మీకిష్టము లేకున్నచో చెప్పవలదు అని యమున ముఖం తిప్పుకొనెను, “నాచిట్టి చెల్లి” అని వర్షుడు చుబుకమును పట్టి త్రిప్పుచుండగా " నీ ముద్దులు ఏమీ వలదు ఫో , మీ ఇద్దరూ తోడు దొంగలు " అని యమున ముఖము దాచుకొనెను.
అన్నయ్యది ఎదో ప్రేమ వ్యవహారమమ్మా అని మీనాక్షి సర్ది చెప్పబోగా యమున " హి హి హి , నీ కట్టు కథలు నాకేమీ వలదులే” అని తన చేతిలో పుస్తకమును చూపుచూ "అట్లేమైననూ చేసిన చో మావదిన తాటతీసి తాంబూలమిచ్చును ఆమె కళ్ళు కప్పుట మీ తరము కాదు , సరే, మీరు చెప్పనిచో నేను ఆమెతో మాట్లాడి విషయమును తెలుసు కొందును." అని తెగేసి చెప్పెను. వర్షుడు “ ద్రోహీ ఎంతకు తెగింతివే , అన్నా వదినల మధ్య అంటించుచున్నావు"
మీనాక్షి “వర్షుడు ఢిల్లీలో ధోల్పూర్ హౌస్కు పోయి అచ్చట జరుగు ఐ ఏ ఎస్ అంతిమ పరీక్ష, (ఇంటర్వ్యూ) కు హాజర య్యెనని తెలిపెను.
యమున "నీవు నీ స్థాయికి తగ్గ పని చేసినావు, నావంటి వారు ప్రయత్నించిన అది అత్యాశ అగును గానీ నీవంటి వారు ప్రయత్నించకున్న అది తప్పే అగును.”
ఈమె రెండు సార్లు పోయి తప్పినది అని మీనాక్షి అనగా యమున పరీక్ష కఠినముగా నుండునని ప్రత్యేకించి చెప్పపని లేదు. రెండు సంవత్సరముల క్రితము నేను పరీక్ష వ్రాయుచున్నప్పుడు రెండు లక్షలమంది ప్రాధిమిక పరీక్షకు హాజరు కాగా ముఖ్య పరీక్షకు పది వేల మంది చేరగలిగిరి. చివరి మౌఖకిక పరీక్షులకు రెండు వేల మంది మాత్రమే చేరుకొనిరి. “ఇప్పుడూ అట్లే యున్నది అని వర్షుడనెను.” మీనాక్షి “ఈ మౌఖిక పరీక్ష ఫలితములు ఎప్పుడు వెలువరించెదరు ?” వర్షుడు “ఒక వారము లో, ఆపై 15 వారములు డెహ్రాడూన్ లో శిక్షణ ఉండును.”
***
ఇన్నోవా కెంపెగౌడ విమానాశ్రయము చేరెను. గడియారం సమయము 9.00 గంటలు చూపుచుండెను. విమానాశ్రయములో నున్న మాల్గుడి పలహార శాల యందు ప్రవేశించి అల్పాహారం తీసుకొనుచుండిరి. మీనాక్షి , యమున ప్రక్క ప్రక్కన కూర్చొనగా వారికెదురుగా వర్షుడు కూర్చొనెను. పలహారసాలంతయూ ఖాళీగా యున్నది "60 నిముషముల ముందు బోర్డింగ్ పాస్ తీసుకొనవలెను కదా?" అని యమున అడిగెను. "30 నిమిషముల ముందు కూడా తీసికొన వచ్చునని వర్షుడనెను." తినుట ముగిసిన పిదప నీవు రక్షణ తనికీ ( సెక్యూరిటీ చెక్) పూర్తి చేసుకొని ప్రవేశించవలెను. అని మీనాక్షి అనెను.
ముగ్గురు మౌనముగా తినుట ముగించి ఫలహారశాల బయట విశాల ప్రదేశములో నిలుచుని యుండిరి "నా పుట్టినరోజు ఇంత ఆనందముగా జరుగునని కలనైనా ఊహించలేదు. వర్షుని వీణాగానము నా మదిలో ఇంకనూ మ్రోగుచున్నది." అను చుండగా యమున"నందికొండలలో మేఘమండలములో పాడిన పాట విని నామనసు పులకరించింది. పూర్తిగా అర్ధము కాకున్ననూ వినుటకు ఎంతో బాగున్నది
మీనాక్షి: అర్ధము కాకపోవుటకు ఏమున్నది మా తాతగారు సోమయాజులు ,అమ్మమ్మ సోమిదమ్మ
వర్షుడు: యమునా ఆపదములకు అర్థము తెలియునా?
యమున: అవి వారి పేర్లనుకొనునుచున్నాను.
వర్షుడు: యజ్ఞము చేసిన పురుషుని సోమయాజులు అని, స్త్రీని సోమిదమ్మ అని పిలుతురు. ఈమె ముత్తాత తండ్రి కేరళ రాచకుటుంబమునకు సంస్కృతము, ఆంగ్లము భోదించుచుచూ పద్మనాభస్వామి దేవాలయమందు అరుచుకునిగా నుండెడివారు. ఆంగ్లేయులు వచ్చినపుడు ఆంగ్లము వచ్చుటచే రాజుకు దుబాషీగా పనిచేయుచుండెడి వారు. ఈమె ముత్తాతగారు గొప్ప సంస్కృతాంధ్రములందు గొప్ప పండితుడే కాక నైఘంటికుడు. ఒక ఆంగ్ల దొరవద్ద దుబాషీగా పనిచేయుచుండెడివారు. మొట్టమొదటి తెలుగు ఆంగ్ల నిఘంటువు వీరు వ్రాసినదే.
యమున: అమ్మ ఏమియూ చెప్పదు. యెచ్చటైనా కష్టము కలిగిన చో నిశ్శబ్దముగా మాయమగును, లేదని, పొమ్మని చెప్పుటరాదు.
వర్షుడు: ఈమె సున్నిత మనస్కురాలని చెప్పుటకు కొంత జాగు చేసితిని. కానీ నేడిక చెప్పక తప్పదు అని అగస్త్యు సుందరిని ఏమిచేసెనో చెప్పెను.
యమున: ఈమె కడుపున అటు వంటి బిడ్డ పుట్టుట విడ్డూరము గానున్నది. అను చుండగా మీనాక్షి కాళ్లక్రింద భూమి కంపించుచుండెను
మీది గొప్ప వంశము అను భావన నీకున్నచో, ఆ వంశ కీర్తిని నిలుపు భారము స్వీకరింపుము. నేటి వారికి వంశ పూర్వజులతో వారి కీర్తి ప్రతిష్టలతో పని లేదు, వారికి కావలసినది శారీరక సుఖము మాత్రమే. దానికొరకే కల్లా కపటమెరుగని గుణవతి అయిన సుందరిని లొంగదీసుకొనెను. కృతజ్ఞత అనెడి బలహీనత తో తనను అర్పించుకొనిన సాధ్వి సుందరి.
పైకి నవ్వుచున్ననూ ఆపిల్లని కనిపించని వైరాగ్యము అలుము కొన్నది. పైకి ఆమె ఆటలే కనిపించుచున్ననూ ఆమె ఉద్యోగమునకు రాజీనామా చేసెను. భారత వైమానిక దళములో చేరి యుద్ధమునందు మరణించవలెనని చావును లక్ష్యముగా చేసుకొని బ్రతుకుచున్నది. అంత గుణవతి ఉత్తమురాలిని కోడలు గాపొందవలెనన్న నీవు నీవు ఆమెను ఒప్పించుటకు ఏ మైననూ చేయవలెను. నీ వంశము నిలుపు కొను అవకాశము, తప్పుదిద్దు కొను అవకాశము ఇంకనూ కలవు. మంజూషవివాహము లో ఆమెను ఒప్పించి వివాహము చేయవలెను. అని వెడలు చుండగా , మీనాక్షి గుండె బ్రద్దలైనది, మానసము అగ్ని గుండమయి దహించు చుండగా పట్టుతప్పి నే లకొరుగు చుండెను. యమున ఆమెను పట్టుకొని పక్కనే ఉన్న పొడవాటి కూర్చొను బల్లపై వాల్చెను
***
వర్షుడు విమానమందు ప్రవేశిం చెను. చరవాణిని విమాన శైలి ( మోడ్) లో నుంచుచుండగా వచ్చిన సందేశమును చూసి నమ్మలేక పోయెను. మరల నిదానముగా చదివి నివ్వెరపోయెను. కళ్ళుతిరుగుచుండగా మరొకసారి సందేశమును చదివెను " సుందరిని గౌడ సోదరులు బీచ్ వద్ద నుండి అపహరించుకు పోయినారు" వర్షుని శరీరమును నిస్త్రాణ కమ్ముకొను చుండగా విమానము గాలిలోకి లేచెను. అప్పుడే స్పృహలోకి వచ్చిన మీనాక్షి ఎగురు చున్న విమానమును చేష్ట లుడిగి చూచు చుండెను.