Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, January 8, 2021

Bharatavarsha 109

ఆనందనిలయం విశాఖపట్నం : భాను డింకనూ కృంగకముందే, సంధ్య కాంతులు మణగక  ముందే  సుందరి, నందిని మంజూష పార్వతిని తోడ్కొని కిలకిలా రావములతో ఆనందానిలయమందు ప్రవేశించుచుండగా మాలిని గారికి సన్నగా వణుకు ప్రారంభమయ్యెను. ముగ్గురు తోనే వేగలేక పోవుచుంటిని ఇంక నాల్గవదెట్లుండునో అనుకొనుచుండగా వారు లోనికి రానేవచ్చిరి.  “ఏమే  పార్వతి ఎట్లెక్కినావే,  గాలిలో తేలుచున్న విమానము! అని మాలినిగారు పార్వతిని చెంతకు తీసుకొనిరి. " వణుకు పుట్టునట్టు వర్ణించినావు  కదా సుందరి, విమానమెక్కవలెనన్న భయము పుట్టుచున్నది " అని మంజూష అనెను. 

సుందరి : పార్వతిని  ఆందోళన వీడమని అందరమూ హోటల్ నుండి ఇంటి వరకూ త్రోవ అంతయూ చెప్పుచేనే యున్ననూ ఇంకా అట్లే యుండెను.  మంజూష : అది ఆందోళన వలే లేదు బసవడిపై  బెంగ పెట్టుకొనెను.  

నందిని : అది బెంగ వలే కాక విరహము వలే నున్నది .  

మాలినిగారు : ఇల్లు వీడివచ్చిన పిల్ల బెదరక ధీమాగా యుండునా? మీ వేళాకోళాలతో పార్వతి మరింత బిగిలి పోవుచున్నది. మీ ముగ్గురు కాస్సేపు నోరు మూసిన అది నోరు విప్పును. అని మాలినిగారు పార్వతిని వంటగదిలోకి కొనిపోయిరి.

కాస్సేపటిలో పార్వతి అందరికీ తేనీరు తెచ్చిచ్చెను. "మన ఇంట కాఫీ తాగుట  పరిపాటి కదా తేనీరు ఏల పంపినావు ?!  కాఫీ పంపుము తల్లీ . నాకు తేనీరు వలదు. అని నందిని అనెను 

మాలినిగారు: కాఫీకి  పాలు ఎక్కువ వలయును అందుకే తేనీరు పంపినాను , పాలు తక్కువగా యున్నవి. 

నందిని :పెళ్లివారింట పంచామృతములు నిండుకున్నచో పంచ మహా పాతకములు చుట్టుకొనును త్వరగా తెప్పించి కాఫి ఇచ్చిన నా ప్రాణములు కుదుట పడును. 

మాలినిగారు: నీవెచ్చట వింటివోగాని, ఇటువంటి సామెతలు నేనెప్పుడూ వినలేదమ్మా. ఈ దగ్గర దుకాణములందు పాలు లేవమ్మా పోయి వచ్చితిని , దూరము పోవలెను. 

నందిని : అత్తమ్మా రెండడుగులు వేసినచో నీ సొమ్ముపోవునా ? పైగా ఇచ్చట చక్కటి సైకిలు కూడా కలదు.  

ఆహా సైకిల్ ఉన్నచో నేను పోయి వత్తును అని సుందరి అనెను నందిని వలదని వారించిననూ వినక విమాన వేగముతో పోయి పాలు కొని తెచ్చెను. పిదప సైకిల్ అచ్చట పెట్టక విన్యాసములు చేయుట ప్రారంభించెను

 ఇంటి ప్రాంగణమందు ముందర ప్రహరీ గోడ వద్ద రాధా మనోహరం నుండి వెనుక ప్రహరీ వద్ద నున్న జాంచెట్టు వరకూ  తొక్కుచూ 30 మీటర్ల దూరము నటునిటు తిరుగుచూ వెనుక  చక్రము పై లేచి ముందు చక్రమును గాలిలో నిలిపి నాలుగు మార్లు  తొక్కి పిదప పథమును మార్చి వర్తులాకారముగ రయమున  గిరగిరా తిరుగుచూ చేతులు వదలి వెనుకకు వాలి  రెండుచుట్లు తిరిగిన పిదప నాలుగు చుట్లు తొక్కి వేగము పెంచి తటాలున ఎగిరి సీటుపై నిలిచి నవ్వుచుండెను. కిటికీ నుంచి మాలిని గారు చేష్టలుడిగి చూచుచుండిరి.    తక్కిన ముగ్గురు అమ్మాయిలు కేరింతలు చప్పట్లు కొట్టుచుండిరి. కొద్దిసేపట్లో వీధిలో పిల్లలు కూడా వచ్చి చూచుచూ ఈలలు వేయుచూ ప్రోత్సహిచుచున్నారు.  మాలినిగారు పరుగు పరుగున బైటకు వచ్చి పిల్లలను వెళ్ళ గొట్టి “సుందరి! విన్యాసములు వలదమ్మా, ఆడపిల్లవి దెబ్బలు తగిలించుకొనినచో కష్టము, దిగమ్మ” అని చెప్పుచుండగా  మంజూష ఆమెనడ్డుకొని “అమ్మా, అమ్మా, వద్దమ్మా అక్క చక్కగా తొక్కుచున్నది” అని మాలినిగారి గెడ్డము క్రింద చేయి వేసి బ్రతిమాలుచూ  లోనికి తీసుకు పోయెను.    కొలది సేపటిలో వీధి పిల్లలు మరల తిరిగి వచ్చినారు. 

ఎట్టకేలకు సుందరి నేలపై విన్యాసములు ముగించి గోడ ఎక్కి సైకిల్ ను  ప్రహరీ గోడ ఎక్కించవలెనని సూచించగా నందిని సైకిల్ ఎత్తి ఇవ్వమని పార్వతిని ఆజ్ఞాపించెను, ఇంటి పెద్ద కి ఇష్టము లేకున్నచో చేయుట ఎట్లని అనుచుండగా   “ పిచ్చిదానాఈ ఇంటి కోడలును నేను  చెప్పినది వినుము.” రేపు బసవని ఇచ్చటికి  రప్పింతును అనగా పార్వతి పార్టీ మార్చుకొనెను. అది చూచుచున్న మాలినిగారు బైటకు వచ్చి నందినితో " ఇట్టి ఆటలు నేనెక్కడా చూడలేదు. మా వర్షుడు అమెరికానుంది వచ్చు చున్నాడు , వాడితో చెప్పెదను వాడు మీ ఆటలు కట్టించును.  అమ్మ అమ్మ! ఆడపిల్లలపై కి  నీకొడుకుని తరిమెదవా! మేము నలుగురం ఒక్కటయ్యి వర్షుని ఒక ఆటాడించెదము. అనగా “బరితెగించిన దానితో మాటలనవసరము నీవు మీఇంటికి పొమ్ము” అని మాలిని చెప్పెను. నందిని " అత్తా ఆడపిల్లలు చీకటి పడిన పిదప బైటకు పోరాదని నీవే చెప్పితివి కదా. " అనెను అహహా పెద్దలనిన  ఏమి గౌరవమే తల్లి అనుచూ సుందరివైపు చూడగా గోడపై సైకిలు త్రొక్కుచుండెను “ఆడపిల్లలు ఇట్లు మగరాయుడివలె  ఏమి పనులమ్మా ఇవి ? అని కేకలు వేయుచుండగా "అమ్మా అమ్మా రెండు చుట్లు  తిరిగి దిగిపోదును అని బ్రతిమాలుచుండగా మాలినిగారు మొఖం మాడ్చుకొని లోపలకి పోయినారు .  

                                                                    ***

ఎం వీ పీ కాలనీ సెక్టార్ ఆరు : సూర్యనారాయణుడు జగములను మేల్కొల్పి సప్తాశ్వ రథారూఢుడై సగముయాత్రను పూర్తి చేసెను కానీ బసవడు మంచము దిగక , ముసుగు తీయక పరితాప హృదయుడై  క్షణ క్షణము దీర్ఘ నిట్టూర్పులు విడుచుచూ  

అగస్త్య: బసవడింత దిగాలుగా కూర్చొనుట నేనెప్పుడూ చూడలేదు ఆ ఆశుకవిత లేమైనవి? ఆ వేగము ఆ ఉత్సాహము ఏమైనవి? 

బసవడు: నాపారు దొరుకు వరకు ఆసుకవితలు,  వ్రాసు కవితలు లేవు. 

బుచ్చమ్మగారు: ఇప్పుడేమైనదని వినమనము (డిప్రెషన్)?  చేయుచున్న ఉద్యోగము మాని ఇట్లు ముండమొపివలె ముసుగువేసుకొని కూర్చుంటివి ?  

చందన : అమ్మా అన్నయ్య ఇంటివద్దనుండి పనిచేయుచున్నాడు దీనినే  వర్క్ ఫ్రొం హోమ్ అందురు.  ఈ బుచ్చమ్మ అందరికీ  కొడుకు ఉద్యోగమూ పోగొట్టుకున్నాడని  చెప్పుచుండును. 

అని తలబాదుకొనుచూ వెడలెను. ఇంతలో ఇంటివద్దనే ఉన్న సర్రాజుగారు వచ్చి " మగాడివికాదా అదికానిచో దాని కంటే రంభ వంటి పిల్లని తెచ్చి పెళ్లి చేసెదను. దుప్పటి ముసుగు వేసుకొని మంచము పై కూర్చొని ఇట్లు కృంగిపోవుట మాని దర్జాగా ఉండుము. మగవానివలె బ్రతకరా,  చవట సన్నాసి! "అని బసవడికి గడ్డిపెట్టి (అగస్త్యుని వైపుతిరిగి) ఆ పిల్ల శని వలే చుట్టుకొన్నది. ఒక్క మారు చూచినంతనే మోహమునందు పడిపోవుటయేనా ? అన్నన్నా ! అగస్త్యుడు ఇట్లే చేయుచున్నావా?  తండ్రి ఆస్తిని నిలుపుటకు తపన  పడుచున్న ఆ కొడుకుని చూచి సిగ్గు తెచ్చుకొనుము. 

ఆ మాటలు వినుచున్న అగస్త్యుని ముఖము పాలిపోయెను, బసవడి వత్తికాలెను (fuse blown off). వారిరువురు ఒకరినొకరు మొఖములు చూచుకొనిరి  

బుచ్చమ్మగారు : మొదటినుండి మాకు ఆ పిల్ల ఇష్టం లేదు బాబూ , పిల్ల బాగున్నది పిల్ల బాగున్నది అని  వీడు వెంట పడుచున్నాడని వప్పుకొంటిమి. 

ఆ మాట విన్న బసవడు "పార్వతేమి తప్పుజేసినది, ఆమెను ఎవరు అపహరించినారో విచారించక మీరిరువురూ ఇట్లు కాస్తావాదము పెట్టుకొనుడు, పోలీసులకు పిర్యాదు చేయమనిన అదియునూ చేసినారు కారు. 

బుచ్చమ్మగారు : చూడు బాబూ ఈ మతిలేని మాటలు, మేమెట్లు చేసెదము పిర్యాదు, పిల్ల మీకేమగునని అడిగినచో ?

అగస్త్యుడు :  బసవ ముసుగు తీసి లెమ్ము,  నేను ఆలోచించి నేడే  ఏదో ఒకటి చేసెదను. 

ఇంతలో బసవడి  చరవాణి మ్రోగెను ఏదో  అపరిచిత సంఖ్య అనుకొనుచూ బసవడు 

చరవాణిని తెరవగా తీయగా పార్వతి గొంతు వినిపించెను “నేను పార్వతిని, “పారూ నేను బసవ”  పార్వతి: నేను క్షేమముగానే యున్నాను త్వరలో మిమ్ముల్ని కలిసెదను, విశాఖ పట్నమందు "అనుచుండగా వాణి అంతమైనది. బసవడి మోము దివిటీ వలె వెలిగిపోవుచున్నది, మనసు గోదారి వలె పొంగుచున్నది. 

అగస్త్య: తప్పడిన లేగదూడ తిరిగి దొరికిన గోమాత వలె, గూడు దొరికిన పక్షి వలె, ఎలకను పట్టిన పిల్లివలె, ఎముక దొరికిన  కుక్కవలె ముదమున ముప్పిరి గొనుచున్నది  “ పారూ పారూ ఏమి హుషారు. పోవలె మనము కలిసి షికారు” అని పాడుచూ, అని బసవడి వైపు చూచెను

బసవ: ఓరీ మిత్ర ద్రోహీ! కష్టములందున్న మిత్రునితోనే పరాచకములాడు అల్ప బుద్దీ! నా పారు దొరుకువరకు నేను పాడరాదు, మేమిరువరమూ కలసి ఆర్ కె బీచ్ లో పాడుకొందుము. విశాఖ పట్టాన ఎచ్చట ఉన్నది నా పారు? నేనట్లు ఎప్పుడు పాడుకొనవలెను?      

అగస్త్య: పాడు పాటలు ఎప్పుడైననూ పాడుకొనవచ్చు. నా పాట్లు చూడుము. వాటాదారులకు తిరగి చెల్లించవలసిన ఓవర్ సబ్ స్క్రిప్షన్ మొత్తమును గడువు దాటిననూ చెల్లించకపోవుటచే విచారణ మొదలయినది. మానాన్నని  అరెస్ట్ చేయు అవకాశములు కలవు.  గ్రేస్ ఇంటికి వచ్చుట కూడా మానివేసినది. 

బసవ: ఆమె ఇంటికే రాకున్నచో, వారిరువురి మధ్యవ్యవహారము చెడినదని అర్థమగుచున్నది  కథ ఇంతదూరం పోయిన పిదప ఉపేక్షింప పనిలేదు.  నేడే పోయి ఇంటిలో పనివారందరినీ తరిమివేసి గృహ ప్రక్షాళనం చేసి పిదప సంస్థ ప్రక్షాళన చేయవలెను. అందుకు మీ నాన్న సహకారము కావలెను. 

                                                                    ***

సుందర శిల్పకళా నైపుణ్యముట్టిపడుచున్న ఆ సుందర సౌధమందు(స్టూడియో) అడుగిడి విద్యుతాలంకృత మనోజ్ఞ భవనాన్తర్భాగ రజిత ప్రదీప్త విమల శోభలందు కనులు చెదురుచుండ యమునకు అదంతయూ స్వప్నగృహ మువలె నగుపించెను. లోపలకి పోవుచుండగా అచ్చట తలమునకలుగా పనిచేయుచున్న అనేక వడ్రంగి, విద్యుత్, శబ్ద, నిశ్శబ్ద, నియంత్రణా కళాకారులను చూచి విభ్రమనొందిన యమునకి మీనాక్షి  ఒక మహా వృక్షమువలే కనిపించెను.  అనేక కళాకారులకు ఆశ్రయ మిచ్చిన ఈ చల్లని వృక్షము ఎప్పటికి వర్ధిల్లవలెనని మనమున దేవుని కోరుచుండగా, మీనాక్షి యమున  చేయి పట్టుకుని లోపలి తీసుకుపోయెను. సువిశాలమైన గదులు శీతల యంత్ర ప్రభావమున ఆహ్లాదపరచుచుండగా, అలంకరణలు తుదిమెరుగులు దిద్దుకొనుచున్నవి. వారిరువురు ఇటుక , చెక్క,  గాజు గదులను దాటి చివరకు వారు ఒక విమానమును పెట్ట గల విశాల  సమావేశ మందిరము లోకి ప్రవేశించిరి. అచట గుల్ల చెక్కగోడలు తో సర్వాలంకృతమై , శబ్ద వర్ధక,  శబ్ద గ్రాహక యంత్రము లమర్చబడి యున్నవి.

శతాధిక సంగీతకారులొక్క సారిగా కొలువుతీరుటకవకాశము ఆ అర్ధవృత్త ఆకార పాలరాతి రంగస్థలం పై అనేక సంగీత సాధనములు అమర్చబడి యున్నవి.  మరో మయసభ వలే , సంగీత భువనము వలే  కాంతులీనుచున్న ఆ మందిరమును చూచి యమున తన్మయమత్వమొందెను. 

యమున: మధ్యలో ఈ వెండితెర ఎందులకు?" 

ప్రకాశ ప్రక్షేపణి ( ప్రొజెక్టర్ ) తో ఈ తెరపై ప్రదర్శించబడు నిశ్శబ్ద(మూగ) చలనచిత్రమునకు శబ్దాలంకరణ   జరుగు ప్రదేశమిదియె. 90 మంది సంగీత కారులు చలన చిత్రముననుసరించి, స్వరకర్త రచించిన సంగీత సంకేతముల (స్కోరుషీట్స్)చూచుచూ నేపధ్యసంగీతమును(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) సమకూర్చెదరు.  మనము విను అనేక పాటలకిది జన్మ స్థలము. ఇప్పుడు నేను  నిలుచున్న   ప్రదేశము  అర్ధవృత్తమునకు మధ్య ప్రదేశము.  నాచుట్టూ వాద్య పరికరములు అమర్చబడి యున్నవి.     నా ఎడమ చేతి వైపు ఫస్ట్ వయోలిన్స్, వాటి పక్కన , సెకండ్ వయోలిన్స్,  కుడు చేతివైపు సెల్లోస్ , డబుల బాస్ యున్నవి, నాయెదురుగా మొదటివరుసలో గాయకులు వారివెనుక వేణువులు, సన్నాయివంటి వుడ్ విండ్  పరికరములు వాటివెనుక , ఫ్రెంచ్ హార్న్స్ , ట్రంబోన్స్ , ట్యూబ్స్, ట్రంపెట్స్, వాటి మధ్య రకరకముల మద్దెలుఉన్నవి. దీనినే ఆర్కెస్ట్రా అందురు.” అని మీనాక్షి వివరించెను.

 “అయినచో ఇవి ప్రతి స్టూడియోనందు ఉండునా?” అని యమున అడిగెను. 

మీనాక్షి : దీనికి పూర్తి స్థాయి ఆర్కెస్ట్రా  ( ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆర్కెస్ట్రా ) అందురు ఇందు 90 మంది సంగీతకారులుందురు. మధ్య స్థాయి ఆర్కెస్ట్రా నందు 45 మంది సంగీత కారులుందురు. బెంగళూరు నందు మనము చూచు ఎక్కువ రికార్డింగ్ స్టూడియోస్ పదిమంది సంగీత కారులు కూడా కూర్చొన వీలులేనంతచిన్నవి. అనగా పూర్తి స్థాయి ఆర్కెస్ట్రా (ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆర్కెస్ట్రా) పనిచేయుటకు అవకాశము గలవి రెండే కలవు మనది మూడవది అని మీనాక్షి చెప్పుచుండగా యమున నేత్రములు విశాలమయ్యెను . 

“మేడం టీ” ఒక అబ్బాయి తేనీరు అందించెను. నవీను కుర్చీలు తెచ్చి వేసి “మేడం కూర్చోండి మీరు నిలబడినచో మాకు కాళ్ళు నొప్పిపుట్టును.” అని నవ్వుతూ అనెను. మీనాక్షి కూడా నవ్వెను. ఇద్దరూ తేనీరు త్రాగుచూ కూర్చొనిరి. యమున తన చేతి సంచిని కుర్చీ వద్ద పెట్టి తేనీరు కోపనందుకొనెను. మీనాక్షి “చెప్పితినా నవీను మంచివాడని ఇప్పటికైనా నమ్మెదవా?” యమునకు మీనాక్షిపై పిచ్చి కోపము కలిగి  “ఛీ ఇటువంటివి చూచి ఇంకనూ  వలలో పడుచున్నావు. తియ్యగా మాట్లాడినచో కోసుకొనుటకు  గొంతునప్పజెప్పెదవు, ఆ విక్రముడట్లే చేసెను కదా!” అని కసిరి వెంటనే స్పృహనొంది " ఒక కనుసైగతో వందలమంది కోవిదులను  శాసించగల వ్యక్తిని ఇట్లు అనుట పాపమని భావించి యమున తలదించుకుని కూర్చునెను. మీనాక్షి జాలిగా చూచుచూ " అట్లు కనిపెట్టిన నాజీవితము ఇట్లెందుకుండును" అని జాలిగా అడుగుచుండగా గంగి గోవు వంటి వ్యక్తిని భాదించితిని అని యమున కళ్ళలో  అపరాధభావం హెచ్చి కన్నీరు సుడులు తిరుగుచుండెను. ఆ కన్నీటిసుడిలలో సంగీత సాధనములన్నియూ కరిగి మీనాక్షిలోకి అంతర్ధానమగుచుండగా మీనాక్షి పద్మముపై కూర్చొన్న సరస్వతి వలే నగుపించెను. యమున ముందుకు వంగగా ఆమె కన్నీరు మీనాక్షి పాదములపై పడెను.

ఇంతలో నవీను పియానో విభాగము వద్ద పని పూర్తి చేసి పియానో కూడా అమర్చెను."మేడం పియానో సిద్దము చూచెదరా?" మీనాక్షి మందగమనమున పియానో వద్దకు పోయి రాగములు పలికించుచూ గానము చేయుచుండగా ఆ విద్యుత్ దీపములమధ్య ఒక విద్యుద్దీపమువలె మెరియుచూ రసరాగసంగీతవెల్లువలోకి తానేపాటై ప్రవహించుచూ యమున తనను అక్కున జేర్చుకొని ఓదార్చుచున్ననుభూతి పొందెను. 

ఆ గొంతుయందే మాధుర్యమున్నదో, ఆ రాగమందే అనురాగమున్నదో యమున మనసు నందు మాలిన్యమంతయూ మాయమయ్యి ఆమె  మనసు మయూరమువలె విప్పారి నర్తించుచుండగా మీనాక్షి వాదనము నిలిపిచిరునవ్వు రువ్వెను. యమున మనసు తేలిక పడెను. వారిరువురూ నడుచుచూ వాహనము వద్దకు చేరుకొనగా డ్రైవర్ తలుపు తీసెను వారు వెనకన కూర్చొనిరి. యమున యధాలాపముగా పైకి చూడగా యమున స్టూడియోస్ అను పేరు కనిపించెను. మాటలకందని భావమేదో యమునను ఆవహించెను. మీనాక్షి "త్యాగరాజనగర్" అనగా ఇన్నోవా బయలుదేరెను.  

                                                                       ***

ఇరువురూ కారు దిగి స్టూడియో లోకి అడుగిడిరి. స్టూడియో మేనేజర్ , చిత్ర దర్శకుడు  నవ్వుతూ నమస్కరించిరి. అంతాసిద్దామా అని మీనాక్షి అడుగగా అంతా సిద్ధం మేడం అందరూ జామ్ రూంలో ఉన్నారు. అని స్టూడియో మేనేజర్ బదులు పలికెను. మీనాక్షి జాంరూంలొకి ప్రవేశించుచుండగా యమున కూడా ఆమెను అనుసరించుచుండెను. స్టూడియో మేనేజర్ యమునను" మేడం మీరు బయట యుండవలెను, లోపల రికార్డింగ్ జరుగును." అని సూచించెను. లోపలి పోయిన  మీనాక్షి వెనుకకు వచ్చి యమునను లోపలి రమ్మనెను. యమున అతడి గొంతు విని, పొద్దున్న ఫోను చేసినది ఇతడే అని గ్రహించెను. లోపల ఆర్కెస్ట్రేటర్ "స్కోర్ షీట్స్(సంగీత సంకేత రచన) ఇవ్వవలసినదిగా కోరగా మీనాక్షి యమున వైపు చూసెను. "పొద్దున్న ఫోన్ చేసిన ఆర్కెస్ట్రేటర్ ఇతడన్నమాట "అనుకొనుచున్న యమునకు తనచేతిసంచి మరిచినట్లు గుర్తుకొచ్చి నెత్తిన పిడుగు పడినట్టయ్యెను. మీనాక్షి    ఏమనునో అని  యమున హడలిననూ అది ఏమీ పట్టించుకొనక మీనాక్షి “సంగీతకారులను ఆర్కెస్ట్రా గదిలోకి పంపక జామ్ రూంలో నుంచవలసిన పనియేమి?” అని కోఆర్డినేటర్ను ప్రశ్నించెను " ఇప్పుడే తరలించుచున్నాను " అని వారందరినీ ఆర్కెస్ట్రా గదిలోకి తీసుకుపోయేను. మీనాక్షి ఒక నాలుగు కాగితములు  తీసుకొని సంకేత భాష లో పాట మొత్తము రచించి  ఇచ్చి  యమునను  ఆర్కెస్ట్రా గదిలోకి కొనిపోయెను. 

సంగీతకారులందరూ సద్దుకొని తమతమ స్థానములందు కూర్చుచున్నారు 

ఆర్కెస్ట్రా గది ఎట్లున్నది అని మీనాక్షి యమునను అడిగెను "యమున స్టూడియోస్ లో సగమున్నది" అని యమున చెప్పెను.  ఇచ్చట సంగీతకారులు కూడా 40 మందే  యున్నారు. “స్కోర్ షీట్స్ ఆర్కెస్ట్రేటర్ ఏమి  చేసుకొనును.” నేను ఇచ్చిన స్కోర్ షీట్ లో అన్ని వాద్యములకు కలిపి సంగీత సంకేతములుండును. ఆయన దానిని ప్రతీ సంగీత వాద్యమునకు విడదీసి, ఎవరు సాధనమునకు తగ్గట్టు వారికి  వ్రాసి ఇచ్చును.” 

సంగీతకారులు అందరూ కూర్చొనిరి, స్కోర్ షీట్స్ వచ్చి చేరినవి. హృదయమును తట్టు సంగీతము నది వలె సన్నగా మొదలయ్యి దుముకుచూ, మలుపులు తిరుగుచూ సాగుచున్నట్టు గలగల పారుచున్నట్టు, వాన కురుయుచున్నటు జడి రేగినట్టు రేగి చల్లారెను. కళాకారులందరూ లేచి గౌరవమును ప్రకటించిరి. ఏమి కళా కుశలత కొద్దీ నిమిషములలో పాటకి సంగీతమును కూచిన ఈమె బ్రహ్మ మానస పుత్రికే కదా అని కో ఆర్డినేటర్ అనుచుండగా యితడు ఆర్ డి బర్మన్ బృందమందు సంగీతకారుడని. ఎవరో చెప్పుచున్నారు 

మీనాక్షి శక్తి సామర్ధ్యములెరి గించుటకు ఈశ్వరుడే ఇట్లుచేసినాడేమో లేనిచో నేను కాగితములచ్చటేల మరువవలెను కనీసము ముఖమునందు విసుగైననూ చూపక అప్పటికప్పుడు వ్రాసి ఇచ్చిన ఈమె ఎంత గొప్పదో కదా "నీ ప్రతిభాపాటవము, నీ సహనము నాకు తీయటి గుణపాఠము" అని అనుకొనుచూ యమున మీనాక్షితో కలసి బైటకు వచ్చుచుండగా మీనాక్షి ఒళ్ళు యమునకు తగిలెను. ఆమె వొళ్ళు కాలిపోవుచుండెను. 

ఎదురుగా నవ్వుతూ ప్రఫుల్లకనిపించెను. యమునకు ఆందోళన హెచ్చెను. ఆమె మీనాక్షి  కంటే ముందుగా వడివడిగా పోయి  “ఒకవారంలోగా మీనా కేరళవచ్చును నేనే తీసుకు వచ్చెదను ఇప్పుడు ఆమె మూడుగంటలు నిలబడి మరల జ్వరము తెచ్చుకున్నది. ఇప్పుడు నీతో వచ్చుట కుదరదు అని తెగేసి చెప్పెను. ఆ మాటల తీవ్రత చూసి ప్రఫుల్ల నీవెప్పుడు నాకు మద్దత్తిచ్చినావు రాక్షసీ నా ఉసురు నీకు తగులును." అనుచూ వెడలిపోయెను లేదని చెప్పుట రాని మూగజీవిని తీసుకొని యమున ఇందిరానగర్ బయలుదేరెను     

6 comments:

  1. మొత్తానికి సుందరి ద్వారా పార్వతి విశాఖ చేరెను.మీనాక్షి వైభవం మనస్సుకి ప్రశాంతతను చేకూరుస్తుంది.ఆనంద నిలయంలో అమ్మాయిల సందడి బాగుంది.

    ReplyDelete
  2. మా అమ్మాయిలు చాలా అల్లరి పిల్లలండీ నందిని ఉంది చూసారు అదే ఉత్త రౌడీ అదే అందరినీ చెడగొడుతోందండీ వీళ్ళని ఎలా దారిలో పెట్టాలో కొంచెం చెప్పగలరా

    ReplyDelete
    Replies
    1. పెళ్ళి చేసేస్తే పోద్ది.

      Delete
  3. How is the knowledge of film score, film orchestra, studios ?

    ReplyDelete
    Replies
    1. Incredible. Bharatavarsha is an ocean of knowledge and a book of unique philosophy

      Delete