Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, January 3, 2021

Bharatavarsha 106

బల్లిపాడు నుండి  చిపిడి మార్గములో గండిపోచమ్మ దేవాలయ సమీపములోని, అన్నదేరపేట మార్గమందు బ్రహ్మంగారి గుడి సమీపములోని, బల్లిపాడు నవగ్రహ దేవాలయము సమీపములో ఇట్లు అనేక ప్రదేశములలో ఇళ్ళు  లోగిళ్ళు కలిగిన గౌడసోదరులు ఎప్పుడు ఎచ్చట ఉందురో చెప్పుట కష్టము. అవసరమును బట్టి వేష, ప్రదేశములను మార్చుటలో ఊసరవెల్లి కేమాత్రము తీసిపోని గౌడసోదరులు నేడు బల్లిపాడునందు గౌడ నివాసమందు బసచేసినారు.

 రెండంతస్తుల గౌడనివాసము చుట్టూ కొబ్బరి చెట్లు, పాత ప్రహరీ గోడచూచినవారు అది పాత ఇల్లని ఇట్టే చెప్పగలరు.  ఆ ఇల్లు వారు  బెదిరించి వశపరుచుకొన్నదని  వారిని తెలిసినవారు ఎవరైననూ చెప్పగలరు. గౌడసోదరులిరువురు కాఫీ బల్లవద్ద కూర్చొని కాఫీ త్రాగుచూ  వార్తా పత్రికలూ చదువుచుండిరి  “కట్ట, ఈ  చోద్యము  చూడుమ”నుచూ కొలాయి గౌడ దినపత్రికను కట్ట ముఖంపై విసురుగా కొట్టెను. కట్ట ఆ దినపత్రికను తెరచి చూచి, దిగ్గని లాగి చెంపపై కొట్టినట్టు అదిరిపడి “ఆ నాట్యగత్తె  మంత్రి అయి కూర్చున్నది, మనకి శని దాపురించినది.” అని నుదుటిపై అరచేతితో కొట్టుకొనెను.   

కొలాయి గౌడ: మంచికి వారికి రోజులు కావు! దుష్టులకే దశతిరుగుచున్నది. ఆమె దశ తిరిగి ఆమె  కేంద్ర మంత్రి అయినది. మనకి చెడ్డ కాలము దాపురించినది. మనమిక తగ్గక తప్పదు, ఆ పార్వతి కావలెనన్న మనమే సొమ్ము ఎదురిచ్చుకొని మన కార్యము సాధించవలెను.

కట్ట: చంద్రమతి మనకిచ్చిన మాట మీరినచో ఏమగునో ఆమెకు తెలియును.

కొలాయి: వెర్రిబాగులవలెనున్నావే ఇప్పుడా అరుణతార మంత్రి అయినది.  చంద్రమతిని ఇంకనూ భయపించచవలెననుకొనుట మూర్ఖత్వమగును. నీవెప్పుడూ ఒక స్త్రీ నీకు భార్య కావలెనని  కల్లోనైనా అనుకొనలేదు. ముప్పయి దాటిన పిదప నీకీకోరిక ఎందుకొచ్చేనో, నీకోరిక తీరవలెనన్న రాజీ పడక తప్పదు. 

కట్ట: రాజే వచ్చి అడిగిన  రాజీ  యనునది కట్టగౌడ జీవితములో లేదు

కొలాయి: లేనిచో పార్వతిని మరిచిపొమ్ము. 

కట్ట: పార్వతిది మరిచిపోవు అందము కాదు పాలకోవాలాంటి చిన్నది దానిని మరువగలనా !

కొలాయి: ఆ పార్వతి నీకు దక్కవలెనన్న చంద్రమతిని , ఆమె కూతురుని అల్లుడిని  ప్రసన్నము చేసుకొని వెనువెంటనే నీవు పార్వతిని పెళ్లి చేసుకొనవలెను. 

కట్ట: అవును వారు అరుణతారనాశ్రయించిన  మన ఆటలుసాగవు. త్వరలో పెళ్లి కొక పెట్టుడు ముహూర్తము చూసుకొని మదన గోపాల స్వామి ఆలయమందు పెళ్లాడిన .. 

కొలాయి: మన వూరి దేవాలయములోనా! అదెంత మాత్రము శ్రేయస్కరము కాదు. నాయస్థానమున వాయిదాకి హాజరుగుచున్నట్టు క్రమముతప్పక వారముకొకసారి హాజరుగు ఆ బసవడు మరల వచ్చి గొడవ చేయడని నమ్మ కమేమియునూ లేదు. ఎవరు రచ్చచేసిననూ ఈ విషయమందు ఈ ఊరివారు మనకు మద్దత్తు ఇచ్చువారు కాదు. అందుచే మైసూరువద్దనున్నచాముండేశ్వరి దేవాలయములో నీ పెళ్లి జరిపించెదను. పెళ్లి చేసుకొని, నీ భార్యను  మన గ్రామము హూటగల్లి లో నున్న మన స్వగృహమునకు కొనిపొమ్ము.

“ఒక పది ఎకరముల పొలము వ్రాసి ఇచ్చి అల్లుడిని , నగలు చీరలు కానుకలిచ్చి వీరిచేత పెళ్ళికి అవును అనిపించవలెను.” అని కొలాయిగౌడ అనగా “అయినచో బయలుదేరుము” అనుచూ కట్ట గౌడ కుర్చీపైనుండి లేచెను. 

పిచ్చికన్నా! మనము నేరుగా పోయినచో మన విలువపోవుటయే కాక ప్రభావవంతముగా యుండదు. అందుకే హరికథా భాగవతార్ని  పంప  నిశ్చయించినాను. 

భాగవతార్ ఎందుకు పోవును అతడితో ఈమధ్యనే ఘర్షణ పడి చేయికూడా చేసుకొంటిమి కదా

తనపొలము తనకిచ్చివేసి, కొంత డబ్బిచ్చి మధ్యవర్తిగా పంపెదము.  సోదరా కొలాయి గౌడ  నీ  ఎత్తుగడ  అద్భుతము.

                                                                      ***
భాగవతార్  అన్నియూ చెప్పినాడా, సుకన్యకీ నగలు ఎట్లుండును?
సుకన్య : నగలు చక్కగా యున్నవి, నాకే  నగలైననూ చక్కగా నప్పును. అన్నిటికంటే రవ్వల హారము ముచ్చటగాయున్నది. దండవంకీలు  కూడా ఉన్నచో బాగుండెడిది.   
చంద్రమతి: అంతదూరం పెళ్లి అనిన ఎంత కష్టమో కదా! 
సుకన్య , చక్రి:  పార్వతిని మైసూరు  తీసుకుపోవుట కూడా  కష్టమే కదా.   
కట్ట : పెళ్లి అయినచో ప్రతిఏడాది మీకిటువంటి నగలు కానుకలు వచ్చును 
కొలాయి గౌడ : కష్టమే కానీ అదియే శ్రేష్టము, పార్వతికి పెళ్ళి అని చెప్పకుండిన మంచిది. 
చంద్రమతి:  గట్టిగా మాట్లాడవలదు పార్వతి లోపల గదిలోనున్నది.  
సుకన్య: ఆమె  గాఢ నిద్రలో నున్నది అది మొద్దు నిద్ర పోవును. 
రేపు 8. 40 నిమిషములకు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయము లో బయలుదేరు ఇండిగో విమానము నకు బయలుదేరిన 10. 30 ఆ విమానము బెంగళూరు చేరును. అచ్చటనుంచి మైసూరు ఒకే బస్సులో పోవలెను. మీరు 8. 00  గంటలకు రేపు మధురపూడి విమానాశ్రయములో నుండవలెను.రేపు  మనము రాజమండ్రి విడి విడిగా పోవ లెను.  చాముండిగుడివరకు ఒకే వాహనమందు ప్రయాణించిననూ కలుసుకొనరాదు.

                                                      ***
అన్నయ్యా , నేను పార్వతిని ఎచ్చటున్నావు ?
నేను మీ అమ్మ అరుణతారమ్మ ఇంట హస్తినాపురమునందున్నాను. ఇంకనూ మూడు దినములుండవలెను. నీవెట్లున్నావు ? మీ పెద్దమ్మ క్షేమమేనా?
మా పెద్దమ్మ దిబ్బరొట్టెవలె దిట్టముగానే యున్నది కానీ నాపరిస్థితే అంతుచిక్కకున్నది 
రేపు మైసూరు వద్ద చాముండి ఆలయము సందర్శించవలెనని కొనిపోవుచున్నది. మా అక్క , మా బావ చక్రవంతుడు కూడా వచ్చుచున్నారు. గౌడ సోదరులు వచ్చి మా పెద్దమ్మకు , అక్కకు కానుకలు సమర్పించిరి.  నేను నిద్రించుచున్నానని భావించి పెళ్లి మాటలాడుకొనిరి. 
వర్ష: మంచి పనాయెను, ముల్లును ముల్లుతోనే తీయవలెను , నేను సుందరిని కొండపైకి పంపుచున్నాను. సుందరిని చూచితివికదా. ఆమె వచ్చిన విమానములో రావచ్చును. నిన్ను  గుర్తు పట్టుటకు వీలుగా  పెద్ద ఎర్రగుడ్డ మెడలో వేసుకొని యుండవలెను. చిన్న చేతి అద్దము తో సూర్యకాంతిని విమానము పైకి ప్రసరింపజేసిన ఆమెకు నిన్ను కను గొనుట  మరింత సులభమగును. సుందరి అసామాన్యురాలు.  ధైర్యముగా నుండి పెద్దమ్మకనుమానము రాకుండా మెలగవలెను.
                                                                     ***

చాముండీ కొండపైకి గౌడసోదరులు , పార్వతి కుటుంబము చేరినారు. కొండపైకి చేరిన ఆపిదప  "శుభవార్త" అనుచూ పెద్దమ్మ పార్వతికి పెళ్ళివిషయమును తెలియజేసెను. పార్వతి అతడికింకనూ భయపడవలెనా నేను అరుణమ్మతో మాట్లాడి నా విషయమును చూచుకొందును అనగా " పెళ్ళివిషములో మాట ఇచ్చి తప్పరాదు , మాట ఇచ్చితిమికదా అనుచున్న పెద్దమ్మపై పార్వతికి ఏవగింపు కలిగెను. కానీ అన్నయ్య చెప్పిన మాట గుర్తుకువచ్చి కిమ్మనక నవ్వుచు మెలుగుచుండెను.
 మధ్యానము అయినది.  ముహూర్తములేవియూ లేనప్పటికీ పెద్దవాడైన కొలాయి దేవస్థానమువారితో సంప్రదించుటకు  దేవాలయములోకి పోయెను. మిగిలినవారంతా దేవాలయము బైట యుండిరి.  చముండేశ్వరి ఆలయం సముద్ర మట్టానికి 3,489 అడుగుల ఎత్తులో మైసూర్ కి 13 కిలోమీటర్ల దూరంలో  ఉన్న చాముండి కొండ పైభాగంలో ఉన్నది. 1008 మెట్లు గల ఆ ఎత్తైన మహీధరాలయ ప్రాంగణము సువిశాలముగానున్నది. 5 మీటర్ల ఎత్తుగల నంది, ఎత్తైన గోపురము, చల్లని గాలి మనసునాహ్లాదపరుచుచున్నవి.     

సుకన్య: కొండపైనుండి ఎటు చూచినా  కొండలు కనపడుచున్నవి.  ఇచ్చటనుండి క్రిందకు చూచిన కళ్ళు తిరుగుచున్నవి. దూరముగా  మైసూరు పట్టణము కనిపించుచున్నది.  పార్వతి , చంద్రమతి, సుకన్య , చక్రి కట్ట గౌడ ప్రక్రుతి సౌందర్యమును చూచుచుండిరి. ఇంతలో దూరమునుండి పిచుకలు వలే  రెండు విమానములు వచ్చుచు కనిపించుచుండెను. మరు క్షణములో ఒక విమానము  ఆలయముపై తిరుగుచూ విన్యాసములు చేయుచుండెను. ఆ శబ్దమునకు భక్తులందరూ గుమిగూడిరి. "అక్టోబరు 8 వ  తేదీన వాయుసేన దినమునాడు భారత  వాయుసేన నిర్వహించు విన్యాసములవలె నున్నవ"నుచూ అచ్చటున్నవారు అందరూ ఆ విన్యాసములు చూచు చుండిరి. 

మరియొక విమానమందున్న సుందరి క్రిందనున్నమెడలో ఎర్రగుడ్డ చుట్టుకున్న  స్త్రీని  చూచెను. కానీ ఎర్రవస్త్రములు ధరించిన స్త్రీలు ఆ ప్రదేశమందు ఇంకనూ కనిపించుటచే సుందరికి అందు పార్వతి ఎవరని సందేహము కలిగెను.పార్వ  తి తన చేతిలోనున్న అద్దమును పైకి చూపెను. సుందరి విమానమును నిట్టనిలువుగా క్రిందకి దించి విమానము తోక  భాగము నేలకి రెండడుగుల ఎత్తులో నిలిపి యుంచెను. తోకపై కాలు పెట్టి  కాకిపిట్  తలుపుతీసుకొని కూర్చొనుట చాలా సులభము కానీ పార్వతి ఎక్కలేకుండుటచే సుందరి విమానమును పైకి లేపెను.  తేజస్ మార్క్ 2 జెట్ , విమాన విన్యాసములకనువైన ( ఏరోబాటిక్ ) విమానమగుటచే సునాయాసముగా పైకి లేచి మేఘమండలములోకి పోయెను.
 
మొదటి విమానములో నున్నస్క్వాడ్రన్ లీడర్  స్నేహ  అందరినీ ఆకర్షించు చున్నది. ఆమె తన విమానమును బారెల్ రోల్ చేసెను, అనగా పొర్లు దండములు పెట్టు భక్తుడు నేలపైబడి దొర్లినట్టు విమానము గాలిలో పలుమార్లు దొర్లించెను. లూప్స్  , స్పిన్ లతో డచ్ రోల్స్తో ఆకట్టుకొని అందరినీ కట్టి పడవేసెను. జనులందరూ గుమిగూడి కనురెప్పవేయక తాటిచెట్టు ఎత్తులో జరుగుచున్న వొళ్ళు గగుర్పొడుచు అద్భుత ఉచిత విమాన విన్యాసములు  తిలకించుచుండిరి. మరుక్షణములో విమానము నింగిలోకెగసెను. పైకి పోయి చుక్క అయినపిదప తిరిగి నేలపైకి (నోస్ డైవ్) నిటారుగా 90 డిగ్రీ లలో వచ్చుచుండెను నేలను గుద్దుకొని ముక్కలాగునేమో అని అందరూ  భయపడుచుండగా విమానము అటి ట్యూడ్  రికవరీ( చాలా క్రిందకు వచ్చి లేదా   స్పిన్ నుంచి తిరిగి యధాస్థితిని పొందు) పొందెను.
 


సుందరి రెండసారి క్రిందకు వచ్చినపుడు తానే తలుపుతీసి ఉంచగా పార్వతి తన ఇంటి పెరటి జాంచెట్టు ఎక్కినంత సులభముగా తలుపు వరకు ఎక్కెను కానీ లోపలకు ప్రాకలేకుండెను అదిచూసి సుందరి (బారెల్ రోల్ ). అటుపక్కకు  వాల్చెను దానితో పార్వతి కాక్ పిట్లోనికి జారిపడెను. సుందరి తలుపు మూసి యంత్రవేగమును పెంచ గానే విమానము మబ్బులలోకి చేరెను. 
 
కొలాయి గౌడ పెళ్ళికి  ఏర్పాట్లు చేసుకొని బయటకు వచ్చి పార్వతిని తీసుకొని రమ్మని చంద్రమతిని  అడుగగా సుకన్య  చక్రి అచ్చట చుట్టూ చూచుచుండిరి. పార్వతి విమానమెక్కుట  చూచిన ఒక చిన్న పిల్లవాడు తన చేతిని ఆకాశములోకి చూపుచుండెను. పార్వతి మబ్బులలో నున్నది  సుందరి విమానము లేజీ ఎయిట్ , డచ్ రోల్ వంటి మెనూవర్లతో  మైసూర్ వైపు దూసుకుపోయేను.  స్నేహ కూడా తన విమానమును సుందరికి సమాంతరంగా ఎగిరించుచుండెను. రెండు విమానములూ  అట్లు ఆకాశములో సాగుటచూచి భక్తులు నివ్వెరపోయిరి.

                                                                    ***

విమానములు ప్రఖ్యాతిగాంచిన లలితమహల్ పేలస్ మీదుగా పోవుచుండెను. చాముండి కొండలకు 9 కి.మీ.  దూరములో నున్న లలితా మహల్ మైసూర్ లోని రెండవ అతిపెద్ద ప్యాలెస్. మైసూర్ నగరానికి తూర్పున ఉన్న చాముండి కొండల సమీపంలో ఉంది. 1921 లో మైసూర్ మహారాజా హిస్ హైనెస్ కృష్ణరాజ వడయార్ IV ఆదేశాల మేరకు ఈ ప్యాలెస్ నిర్మించబడింది. పునరుజ్జీవన నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ప్యాలెస్కు కేంద్ర గోపురం ముఖ్య ఆకర్షణ. ఇంగ్లీష్ మనోర్ మరియు ఇటాలియన్ పాలాజ్జోస్లను ప్రతిబింబించుచుండెను  “ఈ రెండు అంతస్తుల స్వేత సౌధము పచ్చని పచ్చికపై తెల్లని ముత్యారాసివలె నగుపించుచున్నది” అని పార్వతి సుందరితో అనుచుండగా ఆ పేలస్ పైకప్పుకు వెంట్రుకవాసి ఎత్తులో సుందరి దూసుకుపోయెను. పార్వతికి కళ్ళు మైకముకమ్మెను. మరుక్షణములో విమానము మైసూర్ పేలస్ పై ఆకాశమందు తేలుచుండెను. మైసూరు పెళుసు పళ్ళెములో పెట్టిన మైసూర్ పాక్ వాలే కనిపించెను. కొద్దిసేపు అచ్చట ఎగిరిన తరువాత  విమానము జగన్మోహన్ పేలస్ , జయలక్ష్మి విలాస్ మెన్షన్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భవంతులపై  ఆకాశమందు  దొర్లుచుడెను. 

సుందరి వైమానికురాలివలెకాక విమాన నర్తకురాలివలె నున్నావు , విమానంతో ఇట్లు శాస్త్రీయ పాశ్చాత్త్య నృత్యములను చేయించుట కనీవిని ఎరుగము. అనుచుండగా విమానము  ఫోక్ లోర్ మ్యూజియం ప్రాగణమందు ప్రవేశించెను . దీపావళీ సిసింద్రీవలె తక్కువ త్తులో తారాట్లాడుచూ నిటారుగా నిలిచి గిరికీలు తిరుగుచూ అమాంతము ఆకాశములోకి దూసుకుపోయి పట్టుతప్పి నేలపై పడుచున్నట్టుగా  భూమికి అత్యంత సమీపములోకి వచ్చి తారాజువ్వ వలే పైకి లేచెను.  "ఇచ్చట భూమ్యాకర్షణశక్తి ఉన్నదాన్ని సందేహము కలుగుచున్నది , ఇది తారాజువ్వ వలె ఎట్లు పైకి లేచుచున్నది " అని పార్వతి ఆశ్చర్యపోయుచుండగా "జెట్ యంత్రమనిన మంత్రమే కదా!"  

యంత్రమో మంత్రమో   ఇంక నాకు చెమటలు పట్టి గుండె కొట్టుకొను వేగము పెరిగెను.  అన్నపిదప విమానము నిలకడగా గాలిలో తెలుచుండెను.  " బృందావన్ గార్డెన్ చూచి పోయెదము" అని సుందరి అనెను. " బృందావనమూ వలదు ఏమీవలదు నన్ను విశాఖపట్నము కొనిపొమ్ము"  అమ్మ ఎంత మాట  అన్నీ చూపి బృందావనం చూపకున్న నాకు మాట వచ్చును, అది చూచిన పిదప  బెంగళూరు లో  ఈ విన్యాస విమానము అప్పగించి మనము ప్రయాణీకుల విమానంలో ఇంటికి పోయెదము. అని స్నేహాకు బృందావనం పోవుచున్నామని రేడియో తరంగ సందేశమందించెను. వేరొక విమానంలో నున్న వారితో మాట్లాడుట వీలుపడు నా అన్నట్లు చూచు చున్న పార్వతి తో    "250 నాటికల్ మైళ్ళ దూరం 36,000 అడుగులు ఎత్తు వరకూ సందేశములు  సాధ్యమగున"ని తెలిపి సుందరి పార్వతికి కన్ను కొట్టెను.  

కొద్ది క్షణాలలోఫోక్ లోర్  మ్యూజియం నుండి 16 కిలోమీటర్లు దూరములోగల బృందావన్ గార్డెన్స్ పై సుందరి విమానమును  ( లేజీ ఎయిట్) మెల్లని  గిరికీలు కొట్టుచుచుండెను.  కొద్ది  క్షణములైననూ కాకుండా ఎట్లు చేరుకొనుచున్నావు అని పార్వతి సుందరిని తడియారిన గొంతుతో అడిగెను   “మన విమానము పేరు  తేజస్.  తేజస్ పేరు నీవు వినియె యుందువు. ఇది ఐదవ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్.  దీని గరిష్ట వేగము ఏంతో  చెప్పుకొనుము?” అని అడుగు చుండగా పార్వతికి సన్నగా వణుకు పుట్టెను. ఒక క్షణమాగి సుందరి 2222 kmph. అని చెప్పి యధాప్రకారం విన్యాసములు చేయించుచుండెను . ఈ గోదావరి పిల్ల కంటే  గౌడలే మెరుగు ఈ గోదావరి పిల్ల భారీ నుండి నన్ను రక్షించు చాముండేశ్వరీ అని దణ్ణం పెట్టుకొనెను. ఆ విమానమును అనేకకోణములలో వాల్చి వంచి దొర్లించి , పైకి మబ్బులలోకి ఎగరవేసి పిదప కింద పడవేసి చిన్న పిల్లవాడు బంతి తో ఆడుకొన్నటుగా క్రీడించిన పిదప బెంగుళూర్ వైపు మరలించెను 
 
 87 వ వైమానికదళం స్క్వాడ్రన్ లీడర్ స్నేహ ను అనుసరించి సుందరి తన  తేజస్ విమానమును  ఉత్తర బెంగళూ రులోని యలహంక వైమానిక దళం స్టేషన్లో దింపెను.  విమానములు రెండు నేల వాలిన పిదప, స్నేహ  "ఈ రోజు ఎయిర్ షో కార్యక్రమాన్ని తిలకించుటకు  రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ గారు వచ్చియున్నారు, పదినిమిషములు ఉన్నచో  ఎయిర్ షో కార్యక్రమాన్ని తిలకించవచ్చు" అని పార్వతితో అనెను. సుందరి "నాకు ఒక అవకాశమిచ్చిన విమానవిన్యాసములు చేయవలెననునది అనుచుండగా " ఇప్పటివరకు చేసినవి చాలా తల్లీ , ఇంకనూ చేయవలెనట " అని పార్వతి సుందరివైపు భీతిల్లి చూచుచుండెను.  స్నేహ నవ్వి వారిని సాగనంపెను. ఏకబిగిన ఢిల్లీ విశాఖ విమానం వలె గుక్క త్రిప్పుకొనక జరిగినదంతయూ చెప్పి సుందరి "అట్లు పార్వతీ అపహరణ పర్వము ముగిసెను. అని ముగించెను. 


6 comments:

 1. Nice sir.. along with the story.. this episode is quite informative about airlines & aerobatics..
  You grip in language is quite evident with every episode...

  ReplyDelete
  Replies
  1. Thank you very much. Your feedback is quite encouraging.

   Delete
 2. గౌడ సోదరులు అయిననేమి? ఏ సోదరులు అయిననేమి? తాత్కాలికమే ఎత్తులు, జిత్తులు.బయటపడును ఊసరవెల్లుల రంగులు.సుందరి పార్వతిని అపహరించుట అద్భుత ఘట్టం.సుందరి విన్యాసాలు ఊపిరిని ఆపినంత పని చేసెను.

  ReplyDelete
 3. గౌడ సోదరులు అయిననేమి? ఏ సోదరులు అయిననేమి? తాత్కాలికమే ఎత్తులు, జిత్తులు.బయటపడును ఊసరవెల్లుల రంగులు.సుందరి పార్వతిని అపహరించుట అద్భుత ఘట్టం.సుందరి విన్యాసాలు ఊపిరిని ఆపినంత పని చేసెను.

  ReplyDelete
  Replies
  1. Waiting waiting and waiting for your signature. Thank you.

   Delete
 4. The description of the characters like Gowda’s, Parvathi and Sundari is good. When I read this sir I feel it is not easy to write the story we have to knowledge on so many aspects I feel and enjoy the Mysore beauty like the places chamundeswari temple, Mysore Maharaj palace, Lalitha palace, jaganamohan palace, Jayalalitha palace Brundavana garden. When I reading the Parvathi escaping i feel so enthusiasm. I feel great to read the way you narrate the aircraft stunts is superb. At the end of the story few lines rhyming is good Sundari enjoying the job , the composing of pilot to dancer taught is good . The rhyming is good not in this story every story sir your writing the rhyming is too good.

  ReplyDelete