అంగయార్ కన్నె: నీకంత కొడుకు కలడా! నీవట్లు కనిపించవు.
మీనాక్షి: కొలది సంవత్సరములుగా నేనే విశాఖపట్నము పోయి అచ్చటనే వాడిని చూచివచ్చుచున్నాను. మొదటిసారి నాదగ్గరకు వాడు వచ్చినాడు. విధి వ్రాతెట్లున్నదో చూడుము. జరగకూడనిది జరిగిపోయెను. వినకూడని దేదైనా వాడు విని యుండునేమో! నా గురించి ఏమను కొనునో?
అంగయార్ కన్నె: ఈ పాఠశాలలో నీ గురించి నాకు తప్ప ఎవరికీ తెలియదు. నీవతడిని పెళ్లి చేసుకొనదలచితివి కదా! త్వరగా అతడిని చేసుకొనిన ఇట్టి సమస్యలుండవుకదా!
మీనాక్షి: ఒకప్పుడు పెళ్లి అనిన భయము వేసెడిది. ఇప్పుడు మగవారి ఊసెత్తిన భయము కలుగుచున్నది. పరిచయస్తులతో స్నేహము పెంచుకొనుట నాదే తప్పు.
కన్నె: ఇప్పుడేమాయెను? అతడేమిచేసినాడు? అతడెట్లు పరిచయము?
మీనాక్షి: ఆరేళ్ల క్రితము నేను విశాఖను వీడి మా సొంతవూరైన తంజావూరు పోవుటకు నిశ్చయించుకొంటిని.
విక్రముడు రాజమండ్రి లో రైలులో నాకు పరిచయమయ్యి చెన్నపట్టణమువరకు
నాతో ప్రయాణించెను. అతడే ఈ పాఠశాలకు పరిచయముచేసెను. రైలుదిగినవెంటనే వారిని మరిచి పోయిన ఎంత బాగుండెడిది
.
కన్నె: సూదంటురాయవలె నీ అందము ఆకర్షించిన అంటుకొనక ఏమగును.
మీనాక్షి: ఛీ! అంగ యార్ కన్నేనా ఇట్లు
మాట్లాడుచున్నది.
కన్నె: రైల్లో కనిపించినవాడు ఇల్లిచ్చి ఉద్యోగము చూపి వదలకున్నాడన్నఏమనవలెను? చూపులు కలిసియుండును. పిదప నవ్వులు ఆపై మనసులు కలిసియుండును. అట్లనుచున్న కన్నె వీపుపై ఒక్కటి చరిచి "ఆపవే వేళాకోళమునకు హద్దుండవలెను. అతడు తల్లితో కలిసి ప్రయాణించుచున్నాడు. వారిది చాలా పెద్ద కుటుంబము." అని మీనాక్షి చెప్పగా అయినచో పెద్ద కథే నన్నమాట. చెప్పు చెప్పు అనెను.
మీనాక్షి: ఆరు సంవత్సరముల కథ ఒక్కసారి ఎట్లు చెప్పమందువు?
కన్నె "ఇప్పుడు కొంచెము చెప్పి సమయమున్నప్పుడు మొత్తము చెప్పుము. కన్నె
ముఖములో కుతూహలము స్పష్టముగా కనిపించుచుడెను.
అది చూసి మీనాక్షి మందహాసముచేసి ప్రారంభించెను.
“కోరమాండల్ రాజమండ్రలో ఆగిన పిదప ఒక తెల్ల చీరధరించిన ఒకామె తనకొడుకుతో రైలులోకి ప్రవేశించెను. అతడి చేతిలో రెండు సంచులున్నవి. విశాఖపట్నములో నేను ఎక్కునప్పుడు ఖాళీ గాఉన్న పెట్టె రాజమండ్రి లో నిండినది. నేను కిటికీ వద్ద కూర్చొని యుంటిని "ఆరక్షణ (reservation)యున్నదా ? లేనిచో తొలగమని చెప్పెను. ఏరక్షణ లేదని చెప్పి నేను లేవబోవుచుండగా అతడి తల్లి నన్ను అచటనే కూర్చొమ్మని సైగచేసి ఆమె నాప్రక్కనే కూర్చొనెను. ఆమె పేరు నమక్కల్ జయంతి అయ్యర్, ఆమె కొడుకు పేరు అని మీనాక్షి ఇంకనూ చెప్పబోవు చుండగా “విక్రమన్ అతడి అన్న కనిష్కన్, అతడి తండ్రి నమక్కల్ నరసింహన్ అయ్యర్” అని కన్నె గడగడా అప్పచెప్పెను. "ఇవన్నీ నీకెట్లు తెలియున"ని మీనాక్షి ఆశ్చర్యపోయెను. కన్నె“తమిళనాట పుట్టిన ఎవరికైననూ తెలియును. నరసింహన్ అయ్యర్ తమిళనాడు ప్రభుత్వ అత్యుత్తమ పురస్కారం కళైమామిని బిరుదును, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీతకళానిధి బిరుదును పొందిన గొప్ప వాయులీన విద్వాంసుడు.” మీనాక్షి “అయినచో ఇంకా నీకు చెప్పవలసిన దేమున్నదని?” అనెను. కన్నె కోపముగా “నీ కథ చెప్పుము. నీకు విక్రమన్ కి మధ్య జరిగిన కథ.”
మీనాక్షి “నాకు జయంతిగారి పరిచయము చాలా కష్టకాలమందు జరిగెను. అప్పటికి నరసింహన్ గారు పరమపదించి కొద్ది రోజులాయెను. ఆయన పుట్టినూరు రాజమండ్రి కావున ఆయన అంత్యక్రియలు రాజమండ్రిలో జరిగినవి. ఆ పని ముగిసిన తరువాత వారు చెన్నపట్నము తిరిగి వచ్చుచున్నారు. రాజమండ్రిలో మాపరిచయము చెన్నపట్నము చేరుసరికి స్నేహముగా మారెను. మేమిద్దరమూ పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకొనుచుండగా విక్రముడు దూరముగా వేరొక కిటికీవద్ద కూర్చొనెను. కన్నె “అట్లయిన మీకు స్నేహము ఎట్లు కుదిరెను ?”
నా స్నేహము జయంతిగారితో నే
విక్రమునితో కాదు. ఆమె తన విషయములన్నియూ నాకు చెప్పి నా నాభర్త గురించి అడగగా
"లేడ"ని చెప్పితిని. మా పూర్వీకుల వూరు తంజావూరుపోవుచున్నాని చెప్పగా ఆమె
మేము వేలచేరి లో నివసించుచున్నాము. ఒక్కసారి తనవద్దకు రమ్మనెను. ఆమె ఒంటరితనము నాకర్ధమైనది. ఆమెను
ఒక్కసారి కలిసి పిదప తంజావూరు పోవలెనని నిర్ణయించుకొంటిని.
కన్నె: మీది మద్రాసు కదూ, తంజావూరు
మీ సొంతూరు ఎట్లాయెను?
మీనాక్షి: మా తాత ముత్తాలది తంజావూరు. మా ముత్తాత తాతగారు సంస్కృతాంధ్ర మున పండితులు. నాటి నాయక్ రాజుకొలువులో పని చేసెడివారు. చరిత్ర చదివిన నాయకులు కళాపోషకులని సాహిత్యమునాదరించినారని అర్థమగును. కాలక్రమేణారాజ్యములంతరించి, వారు కాలము చేసిన పిదప మా నాన్నగారు మద్రాసు మకాము మార్చిరి. “మీ పూర్వీకులకు
ఇంత గొప్ప చరిత్ర ఉన్నచో నాకేల చెప్పలేదు!”
మీనాక్షి: వారిగురించి నాకు కొంతయే తెలియును. పైగా అట్లుచెప్పుకొన్నచో ఎవరైననూ ఏమనుకొందురు? .
కన్నె: చెట్టుపేరుచెప్పికాయలమ్ముకొన్నటుండునని నీవనుకొనుచున్నావు. అట్లనుకొను వారు మూర్ఖులు. వారి మాడు పగులగొట్టవలెను. కీర్తికెక్కిన మన పూర్వజులను స్మరించుకొనుట మనకు గర్వకారణమే కాక బాధ్యత. అట్లు చెప్పుకొనకపోవుటవలనే మనకీదాస్యమబ్బినది. ఎవరో ఏదో అనుకొందు రట.. ఇంత మెత్తదనము పనికిరాదమ్మా అందులకే నీమొగుడు .. ...అట్లనుచుండగా మీనాక్షి ముఖము నిస్తేజమగుచుండెను.
మౌనముగా బాధపడుట దూరముగా తొలగిపోవుట ఈ మీనాక్షి లక్షణములని మనసున తలచిన కన్నె “ నీ మనసెంత సున్నితము! నీ గతమెంత ఘనము!! పువ్వు కంటే సున్నితమైన మనసు,మంచుకొండ వలే ఉన్నతమైన గతము”అనెను.అంగయార్ కన్నె గొంతు బరువెక్కెను. అది చూచి మీనాక్షి చలించెను. ఆ మంచంతయూ కరిగిపోయినదని మీనాక్షి హాస్యమాడుచుండగా కన్నె “మంచు కరిగిపోయిననూ గౌరవము తరిగిపోవలెనా? వారి గూర్చి నాకు చెప్పుము.” అని మరల మరొక కాఫీ చెప్పి తరువాత తరగతి మన ఇద్దరికీ లేదు కదా “అలా పచ్చికలో కూర్చొని మాట్లాడుకొందుమని” చెప్పెను. ఇద్దరూ మౌనముగా కాఫీ సేవించిరి.
ఫలహారశాల నుండిబయల్వెడలి యాసంగీత లలామలు జోడు గుఱ్ఱములవలె సాగుచుండ యా కింకిణి సమ్మేళన మూర్ఛనంబు మేఖల కన్యకా ప్రవాహ లావణ్యమును తలపించుచూ చూపరులకు నయనానంద మగుచుండెను. కన్నె, మీనాక్షి పచ్చికలో కూర్చొనిరి. కన్నె"నీకు మీ పూర్వీకుల గూర్చి ఎవరు చెప్పినారు?"
మాతాత గరికిసోమయాజులుగారు చెప్పగా నాకు తెలిసినది. నా బాల్యము మద్రాసులోనే గడిచెను (ఇప్పుడు చెన్నపటము అయినది గానీ అప్పుడు మద్రాసనెడివారు). మానాన్న గారికి మద్రాసు విశ్వవిద్యాలయమందు పరీక్షా నిర్వహణాధికారిగా ఉద్యోగము వచ్చుటతో తంజావూరు నుండి ఇచ్చటకు వచ్చి స్థిరపడినవారు. మాతాతగారు బ్రతికి ఉన్నంతకాలము నేను తంజావూరు పోవుచుండెడిదానను. ఆ మూడు మేడల భవనము మాదే. ఆయనకు చరిత్ర పై మంచి అవగాహనుండెడిది సాహిత్యముపై మంచి పట్టు ఉండెడిది. జీవితముపై పట్టు ఉండవలెనన్న చరిత్ర సాహిత్యములావశ్యకమని ఆయన చెప్పుచుండెడివారు.
ఆరెండు లేకనే నేడు అధికులు ఆంగ్లేయుల గొప్పతనమును కీర్తించుచూ బ్రతుకుచున్నారు. అని చెవొగ్గి వినుచున్న గయార్ కన్నెఅనెను. మీనాక్షి గలగలా నవ్వెను. “ఆ మూడు మేడల భవనము మీదేనా. ఇప్పుడది గ్రంధాలయమునకు ఇచ్చివేయబడినది కదా! నేను గత ఏడాది తంజావూరు పోయినప్పుడు అక్కడున్న ముఖ్య ప్రదేశములలో అదొకటని నాకు చూపినారు. మీ తాత గరిక సోమయాజులు గారి చిత్రపటము నేను చూచితిని. అప్పటికి మనమింకనూ దగ్గరకాలేదు. నువ్విట్లు నవ్వు చుండుము తల్లీ”అని కన్నె అనగా “అటులనే పద పోయెదము అగస్త్యుడేమిచేయుచున్నాడో” అని మీనాక్షి ఆందోళన చెందుచుండెను.
నీ కొడుకేమైనా పసివాడా అట్లు బెంగ పెట్టుకొనుటకు. “అతడికీ విషయములు చెప్పినావా?” అని కన్నె అడిగెను. మీనాక్షి మరల గలగలా నవ్వెను. “సరియన సమయము రాలేదు కానీ చెప్పుటకు ప్రయత్నించితిని. "ఇంత కాలమునుండి ఈ విషయములు చెప్పుటకు సమయము లేదా అని అంగయార్ కన్నె అచ్చెరువొందెను."
"మా అమ్మమ్మ చనిపోవు సమయమునకు నాకు పెళ్లి కాలేదు. నా పెళ్ళైయిన ఐదేళ్లకి మా అమ్మ చనిపోయినది, అప్పటికి అగస్త్య చిన్నవాడు. తరువాత వాడికి అర్ధము చేసుకొని వయసు ఉన్ననూ ఇంటి వాతావరణము ప్రతికూలముగానున్నది. మేము విడిపోయిన తరువాత మా నాన్న గారు కాలం చేసినారు. అప్పుడు అగస్త్య ఇచ్చటకి వచ్చినాడు అప్పుడు చెప్పుటకు ప్రయత్నించితిని. నాలుగు వందలయేళ్ళ చరిత్ర తెలుసుకొనిన నాకేమి ఒరుగునునని మాట్లాడినాడు.నని మాట్లాడినాడు. యువకులకు చలనచిత్రములు, ఆడపిల్లలు పెద్ద ఆకర్షణలుగా నుండును. భారతవర్షయనొక స్నేహితుడు సాహిత్యప్రేరణ కలిగించగా చలన చిత్రప్రభావము అంతమొందెను. ఇప్పుడు చూడవలె." “జాతి సంపదవలే అలరారుచున్నమీ వంశస్తుల గూర్చి వినుటకు నీకొడుక్కి అదృష్టముండవలెను. అతడూసుమాని నాకు చెప్పుము. నాకు వినవలెననున్నది” మీనాక్షి మరల చెప్పదొడిగెను.
తంజావూరు చోళుల పాలనలో రాజధానిగా గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకొనెను. చోళుల పతనం తరువాత, ముత్తరైయర్ రాజవంశం, పాండ్యులు, విజయనగర రాజులు, మదురై నాయకులు, తంజావూరు నాయకులు, తంజావూరు మరాఠాలు మరియు బ్రిటిష్ సామ్రాజ్యం వంటి వివిధ రాజవంశాలచే పాలించబడెను. నాయక్ రాజులు సాహిత్యము ఆదరించిన వారిలో ప్రముఖులు. చెవ్వప్ప నాయక్ కృష్ణదావరాయల ఆధ్వర్యంలో పాలనాధికారిగా పనిచేసెడివాడు.
చెవ్వప్ప నాయకుని భార్య మూర్తిమాంబ అచ్యుత దేవరాయలకు కోడలు మరియు విజయనగర రాణి తిరుమలాంబ సోదరి. చెవ్వప్ప తంజావూరు రాజ్యాన్ని అచ్యుతదేవ రాయ నుండి స్త్రీధన (కట్నం)గా పొందెనని ప్రతీతి. మాముత్తాత తాత కంఠంభట్టు ఆయనవద్ద పనిచేసినారు. ఆయన అరుణాచల దేవాలయ చరిత్రను తాళపత్రములపై లిఖించెను. ఆయన మనవడు మా ముత్తాత వ్రాసిన “వైదిక చరిత్ర” “ఆర్యులచరిత్ర” అముద్రితంగా చేతివ్రాతనున్నవి. ఇట్టి ప్రాచీన గ్రంధములను చరిత్ర పరిశోధకులు, ప్రభుత్వము తరలించుకు పోయిననూ ఇంకనూ మా పూర్వీకులు వ్రాసిన పలు గ్రంధములు ఆ ఇంటిలో ఉండెడివి. నేను పన్నెండు చదువుచుండగా మా తాతగారు కాలము చేసినారు. పిదప మా అమ్మమ్మ సోమిదేవమ్మను ఒప్పించి మద్రాసు తెచ్చి అంత్యకాలమందు మా అమ్మే చూచుకొన్నది. ఆమె చివరి రోజులలోనాకు సంగీతమునందు శిక్షణ నిప్పించినది. అదే నాకిప్పుడు బ్రతుకుతెరువైనది. అంగయార్ కన్నె ఛ.. ఛ..అది నీవంటి వారనవలసి మాట కాదని నొచ్చుకొనెను. మా అమ్మమ్మ మరణించిన పిదప వారు నివసించిన భవనమును గ్రంధాలయమునకు ఇచ్చివేసినారు.
కన్నె: మీనాక్షి వైపుకు అపురూపముగా చూచుచూ నిన్ను తాకుటకైననూ అదృష్టముండవలెను.
నీ చెయ్యందుకొని ఏడడుగులు నడిచి ఇట్లు చేయుట… ఛీ..ఛీ అని కన్నె చీదరించుకొనెను. “పురుషులు కామము నకు లొంగి ఏమైననూ చేతురు. నామొగుడు వేరొక పిల్లని వలచి నాతో చీటికీ మాటికీ గొడపడుచుండెడివాడు. ఆ పోట్లాటలలో అగస్త్య ఎప్పుడూ తల్లిపక్షమే వహించుచుండెడి వాడు.
వాడు ఏడవ తరగతిలో ఉండగా ఒక నాడట్లు తండ్రితో గొడవకు దిగి తన్నులు తిని ఇల్లువదిలి పారిపోయి పదిరోజుల తరువాత పోలీసులకు దొరికినాడు. ఆ సంఘటన తర్వాత కొద్ది కాలము నా భర్త ఇంటికి రాక ఎచ్చటనో ఉండెడివాడు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చిననూ వాగ్వివాదము లు చెలరేగెడివి. అగస్త్య పాఠశాల చదువు చక్కగా సాగుచుండెను. అందుచే అతడి చదువుకి అంతరాయము కలుగకుండా అతడిని ఇంటి వాతావరణమునకు దూరముగా వసతి గృహము నందుంచితిని అతడు పెండ్లి చేసుకొనుటకు విడాకులు కోరగా అనుమతించితిని. అతడు పెళ్లి చేసుకొనువరకూ అచ్చటనే ఉంటిని. అగస్త్య పదవ తరగతి లో నుండగా అతడు పెండ్లి చేసుకొనెను. పిదప అచ్చట ఉండుట అనవసర మనిపించెను. నీకు చాలా ఆస్తి ఉన్నది కదా ఇట్లు పనిచేయుటకు అవసరమేమున్నది?
ఆస్తి కొరకు నేను పట్టు పట్టక అతడికే వదిలివేసితిని.
అంగయార్ కన్నె తలపట్టుకొనెను. కొంతసేపాగి
విక్రమునకేమొచ్చెను?
చెన్నపట్టణములో దింపి ఈ పాఠశాలకు పరిచయము చేసెను. “విక్రముడు చక్కటివాడు సుమీ!” అని కన్నె అతడిని మెచ్చుకొనెను. చిరుద్యోగిగా యున్నప్పుడు దక్షిణామూర్తి కూడా మంచివాడే. డబ్బు వచ్చిన పిదపనే మనుషులు మారిపోదురు.