Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, November 28, 2021

Lakuma Accident

I expanded the single line from Old Bharatavarsha  into eight pages .                                              

పాత భారతవర్షలో లకుమ కారు ప్రమాదానికి గురి అయినదని ఫోన్ వస్తుంది.  ప్రమాదం ఎలాజరిగిందో వర్ణన ఉండదు. కొత్త భారతవర్ష లో లకుమ కారు ప్రయాణ ప్రమోద ప్రమాద ఘట్టాలు ఇలా వర్ణించడం జరిగింది.   



                                                                        ***

This is the situation  

"తక్కడితోం, గిడ తక్కడితోం,  తద్ది తక్కడతోం థళాంగ్ థథ..థరికిట ." కేశవుడు కన్నులరమూతలై  ఆనంద పారవశ డై  గాలి షడ్జమమై, పక్షులు పంచకమై కేశవుడు శివాత్మకమై చేయు మృదంగవాదనా ధ్వని యందు అరుణతార మనసు మయూరమై మైమరచి నర్తించెను. "గోపాలుని గీతా భోదవలె ఈ మృదంగ నాదము అలౌకికా నంద మును  కలిగించి చిత్తనిర్వికార మొనర్చినది.  భావోద్వేగములను మకిలి వస్త్రములతో పాటు బుట్టదాఖలు చేసి, వేడినీటిబుగ్గ ఆవిరుల స్నానమాచరించి నిర్మలత్వము బొంది గృహాచ్ఛాదనములు ధరించి వంటజేయుచూ లకుమకొరకు ఎదురు చూడసాగెను. .. 

Here Arunatara receives a phone call

ట్రింగ్.. ట్రింగ్ .. మరల దూరవాణి మ్రోగుచుండెను. పరికరము నుండి మాట్లాడు సాధనమును లేపి సందేశము విని నివ్వెరపోయెను. “అమ్మా  ఏమైనది?” అని కేశవుడడిగెను, “లకుమ వాహనమును నడుపుచుండ ప్రమాదం సంభవించెను.  This read line is described in New Bharatavarsha.

                                                                        ***

గచ్చిబౌలి నుండి  యాబదిరెండు కిలోమీటర్ల దూరములో నున్న షాద్నగర్ వైపు కృష్ణవర్ణ  హ్యుందాయ్ టెర్రాకాన్  దూసుకుపోవుచున్నది.   నల్లని రబ్బరు  చక్రములల్లన తిరుగుచుండ   వాహనము మందగమన మున సాగుచుండెను. వాహన చక్రము (steering)వెనుక పల్లవి యనొక చేప కళ్ళ చిన్నది కూర్చున్నది. ఆమె పేరుకేగాక  చూచుటకు కూడా పల్లవమువలెనున్నది.  ఆమె తన  కోమల హస్తములు తో చక్రమును చేకొని తమలపాకుల వంటి పాదములతో ప్రవేజకము(acceletor) నొత్తుచు ఎదురొచ్చు వాహనములు చూచి తత్తరపడుచుండెను.   అదిచూచి  వాహనంలో ఆమె ప్రక్కనే యున్న లకుమ వెనుక నున్న సురభి, శ్రావణి, మాధురి పరిహాసమాడుచుండిరి. 

ఇంతలో ఒక యువకుడు రివ్వున పిచ్చుకవలె ద్విచక్ర వాహనంపై వెంట్రుకవాసి దూరమునుండి టెర్ర కాన్ ను రాసుకొని వారిని దాటుకు పోయెను. ఒక లిప్త ఎడమకు వాల్చి మరు లిప్తలో మరల కుడికి వాల్చి పిదప ముందు చక్రమునెత్తి కొంత దూరము పోనిచ్చి ఆపై వెనుక చక్రమునెత్తి మరికొంత దూరము పోనిచ్చి ఆపై  మోకాలు తగులునంత వరకూ బండిని వాల్చి ఇట్లనేక విన్యాసములు చేసి చూపి ముందుకు సాగుచుండెను. ఆ షోకిల్లా వేగమును చూసి బిత్తరపోయి తన గుండెలపై తు.. తు.. అని ఉమ్ముకొని పల్లవి వాహనమును ఎడమ ప్రక్క నిలిపి రొప్పుచుండెను. 

చెంగావి రంగు మేక్సీ నంటిపెట్టుకొనియున్న ఆమె పడుచు గుండెలదురు చుండెను. వీడి పీచమడుచుటకు  కొంచము దూరములో  వేగనిరోధక మున్నది   అచ్చట వీడు చతికిల బడుట ఖాయమని సురభి అన్నది కానీ వారందరినీ నిరుత్సాహపరుచుచూ అతడు అక్షోహిణీ యందు అభిమన్యుని వలె  చెలరేగి వేగమింకనూ పెంచి  తన ద్విచక్రికను రెండడుగుల పైకెగిరించి మరీ  వేగనిరోధకమును  దాటుకుని పోయినాడు. మాధురి  కనురెప్పలను  అల్లల్లా డించుచూ “ ట్చు  ట్చు.. ట్చు.. ఎంతటిఘనుడో! ఎంత ధాటి యో! రాకెట్ కేంద్రమందు ఉద్యోగమిచ్చిన రాణించున”నెను.  “రహదారిపైనున్న వేగనిరోధకమును దాటుట సులభమే. జీవితమునున్న పెళ్లి అను వేగనిరోధకమును ఎంత ధాటి యున్ననూ దాటలేక చతికిలపడుట ఖాయమ”ని పల్లవి అనెను. నిజమా అని మాధురి సంశయించుచుండగా  పల్లవి “ సందేహమెందులకు షాద్నగర్ లో జాతీయ అంతరిక్ష గ్రాహక  కేంద్రము (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్) కలదు. అచ్చట భూఉపరితల కేంద్రము (గ్రౌండ్ స్టేషన్) భారతీయ మరియు విదేశీఉపగ్రహాల నుండి సమాచారమును సంగ్రహించును.”అని చెప్పుచుండగా “అదందరికీ తెలిసినదే కదా ఎందుకు  చెప్పుచున్నావ”ని లకుమ చిరాకుపడెను.

“మీకు తెలియనిది మరొకటుంది మానాన్న అందు శాస్త్రజ్ఞుడిగా పనిచేయుచున్నాడు.  అతడు అంతరిక్షంలో గుండుసూది పరిమాణము నుండి గ్రహ పరిమాణము వరకూ నున్న ఏ వస్తువునైననూ ద్రవ్యరాశి పరిమాణము ఇతర గ్రహములనుండి  దూరము మున్నగునవన్నియూ లెఖించు (telemetry) నిపుణుడు.  కానీ ఆ అమ్మతో చీరలు కొనుటకు పోయిన ఎంత సమయముపట్టునో లెక్కించలేడు. కొన్న సరుకుల సంఖ్య ధరలు చెప్పలేడు వేయేల పొయ్యిమీద పోపుకూడా చూడలేడు. మా అమ్మ చెప్పినదానికి ఊ కొట్టుచూ ఉపగ్రహములను చూచుమానాన్న ఉపగ్రహమువలె మారి మా అమ్మచుట్టూ తిరుగుచుండున”ని ముగించెను. 

“ఎంతవారులైన వేదాంతులైన గానీ..” శ్రావణి పాడెను. అందరూ నవ్వుచుండగా, ఆరుణీకృతవదన  వినీత నేత్ర, వియత ముఖ లకుమ షటప్ అని బిగ్గరగా అరిచి వాడి పెళ్లి అగువరకూ ఆగవలెనా? లేక వాడికి సంబంధము చూడవలెనా? అనరిచెను.  సురభి “వాడిపై పోలీసు కేసుపెట్టవలెన” నెను.  శ్రావణి “ఆమ్మో పోలీసు కేసులా! వాటి జోలికి పోకుండుటే మంచిద”నెను.” మాధురి “మా అమ్మకి చెప్పకుండా వచ్చుచున్నాను అంతదూరం ఎందులకు పోవుచున్నారని నాకు తలంటును”నెను.  లకుమ “ఆమ్మో పోలీసు కేసులా”యని శ్రావణిని అనుకరించి, వెక్కిరించి అట్లు మాట్లాడుటకు సిగ్గుండవలెను. వాడికి తగినబుద్ది మనమే చెప్పవలెను అని పల్లవిని త్రోసి సారధ్యమును స్వీకరించి ప్రవేజకమును బలముగా నొత్తెను. మరునిమిషము వాహనము ప్రళయ వేగమున దూసుకొని పోవుచుండెను. ప్రభంజనుడు(wind) వాయునిరోధకమును(windshield) గుద్దుకొని  ఈ దుష్కృతము నాపుట కన్నటు వికృతముగా కేకలువేయుచుండెను. అందరు ప్రాణములర చేతిలో పెట్టుకొని కూర్చొనిరి. 

కొద్దినిమిషములో నారింజ వర్ణ ద్విచక్రిక గోచరించెను. వాయువేగమున అతడి బండికి నూలువాసి దూరము నుండి పోనిచ్చి వాహనమును ఎడమకు త్రిప్పుచూ అరోధము నొత్తెను. ఆరోధ రంభము(breakdrum) నుండి  కీచుమను కరాళ ధ్వని వెలువడుచుండగా తూర్పుకు పోవుచున్న వాహనము పడమరకు గవ్వవలె తిరిగి ద్విచక్రికకు ఎదురు నిలిచెను. దానితో ఆయువకుడు చేష్టలుడిగి బిక్క చచ్చెను. సంయోక్తము (గేర్ )ను మధ్యస్థముగా (న్యూట్రల్ ) గా నుంచి  ప్రవేజకమును నొత్తి  టెర్రా కాన్ యంత్రము నుండి ప్రళయ నాదమును పుట్టించెను. ఆ  నాదము యువకుని గుండెలలో  విజయనగర యుద్ధబేరివలె మ్రోగి అతని గుండెలు గలగలలాడినవి. అతడు ద్విచక్రికను నేలపారవేసి  "ఆయువు యందు వాయువులు కపాలమును తాకినవ"ని చేతులెత్తి నమస్కరించెను. లకుమ అతడిని మిర్రి మిర్రి చూచుచూ "సంయోక్తము సంధించిన కపా లమోక్షమగును. వదిలివేసితిని పొమ్ము " అనెను. ఆ యువకుడు  విగత జ్ఞానుడై  ద్విచక్రికను తోసుకొని పోయెను.

అతడికేమైనా అయినచో పోలీసు కేసులు లగును మనకెందులకీ వ్యర్ధ ప్రహసనము అని శ్రావణి భీతిల్లుచుండగా “పోలీసు కేసులైనచో  మా అమ్మ  చూసుకొనును. ఈ రాష్ట్రములో మా అమ్మను  తెలియనివారుఎవరు కలరు?నీవు పోలీసు కేసుల గూర్చి బెంగమానకున్న నీ జడ కత్తిరించెదను. వాహనంతో నేరుగా గుద్దిన నూ నన్నెవ్వరూ ఆడువారులేరు. పిచ్చుకపై బ్రహ్మాస్త్ర మెందులకని నేనే ఊరకుంటిని.” లకుమ అదోదంతిని (low gear)యందు   వాహనమును త్రిప్పి,  పోనిచ్చు చుండెను. 

కొంచెము దూరము పోవుసరికి వారికి ఒక కూడలివద్ద  ఒక శ్వేత వాహనము కనిపించెను. అందు నలుగురు  యువకులు కలరు.  లకుమ వారి వాహనము వెనుకగా పోయి శృంగమును మ్రోగించెను. రహదారంతయూ ఖాళీగా యున్ననూ పక్కకిపోక లకుమట్లు శృంగమును మ్రోగించుచుండగా శ్వేత వాహనము లో వారద్దములు దింపి వెనుకకు కోపముగా చూసి పోనిచ్చుచుండిరి. నీవు శృంగ ప్రియ(హార్న్ కొట్టుట) వనుకొందురు చాలించుమని పల్లవి అనెను.  ఇంతలో శ్వేత వాహనము నిలిచి పోయెను. లకుమ కూడా తన వాహనమును నిలిపి ఈ యువకులు వృద్ధులు వలెనున్నారనెను. ఇంతలో పల్లవి "శ్వేతవాహనమందు చాలకుడు మారెన"నెను "కొత్త సారధి దూకుడు గిత్త వలే నున్నాడ”ని శ్రావణి అనెను. “వాడు దూకుడు గిత్త అయినచో లకుమ పోట్ల గిత్త అని మరువరాద”ని మాధురి అనెను. ముందునున్న వాహనము కదిలి క్రమముగా వేగము పుంజుకొనెను. లకుమ కొద్దిక్షణములలో తన వాహనమును వారికి సమాంతరంగా నిలిపెను. ఇరువాహనములు ప్రక్కప్రక్కనే జోడుగుఱ్ఱముల వలె  సాగుచున్నవి.

పండుగకు కేరళ  పంపా తీరమునున్న అరన్మూలలో నౌకాస్పర్ధను చూచితిని. నేడదే ప్రమోదము నందుచున్నాన "ని సురభి అనెను. కేరళలో కృష్ణుని గుడి వద్ద జరుగు నౌకాస్పర్ధ లందు పురుషుందురు ఇచ్చట స్త్రీలు కలరు."అని లకుమ అనగా “నీకెట్లు తెలియును? నీవు కేరళ పోయినావా?” అని మాధురి అడిగెను. లకుమ మందహాసము చేసెను. పల్లవి "వాళ్ళ నాన్నగారు కేరళవారే"అని చెప్పుచుండెను కానీ లకుమ ద్యాసఅంతయూ రహదారిపైనే యున్నది. శ్వేత, కాల వాహన స్పర్ధ మొదలాయెను. క్షోణి కంపించునట్టు రెండు వాహనములు పరిగెడు చున్నవి.  

2 comments:

  1. Pramadam annna maata vintne bhayam kaluguddi. Kanee jarigina pramaadanni inta chakkaga varniste bhasha soundaryame kanappadutundi. Pramadam kanapadatledu.

    ReplyDelete
  2. ప్రమాదం అన్న మాట వింటేనే భయం కలుగుతుంది. కానీ జరిగిన ప్రమాదాన్ని ఇంత చక్కగా వర్ణిస్తే భాష సౌందర్యమే కనపడుతుంది. ప్రమాదం కనపడట్లేదు. Thank you. Your comments are as beautiful as you are.

    ReplyDelete