Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, January 14, 2021

Bharatavarsha 113

 రాఘవుడు, ప్రఫుల్ల, సందీపుడు వర్షునితో మాటలాడుచు మండువాలో కూర్చొని యున్నారు యమున వచ్చి మీనాక్షి సందీపుని పిలుచుచున్నదని తెలపగా సందీపుడు మండువాగదిలో నున్న మెట్లెక్కి మేడపైకి పోయెను. రాఘవుడు   ప్రఫుల్ల కూడా సెలవు తీసుకొని బైటకు వెడలుచుండగా వర్షుడు మేడపైకి పోయెను. మీనాక్షి సందీపునీతో ”నీకు పెండ్లి కుదిరినదని వినియుంటిని” “అవునమ్మా వచ్చే వారమే  పెండ్లి మీరు తప్పక రావ లెను”  అనుచున్న సందీపునకు హేమ భూషణములున్న పేటికను ఇచ్చి “ఈ మంజూషమును చిరుకానుకగా పెండ్లి కూతురికివ్వవలెను” అనెను.  సందీపుడు స్వీకరించకుండుటచే, మీనాక్షి "ఈ కానుక పెండ్లి కుమారునకు,ఈ కానుకను స్వీకరింపుము" అనుచూ అతడికి చెక్కును బహూకరించెను.  " జగన్మాతవంటి  మీ ఆశీర్వచనం మొక్కటి చాలదా! ఇంత కీర్తి ప్రతిష్టలున్న స్వరరాణి  నావంటి  వాడిని ఇంటికి పిలుచుటయే గొప్ప. మాపెండ్లి కి వచ్చి మమ్మాశీర్వదించిన అదియే పదివేల”నుచూ చెక్కును తిరిగి ఇచ్చి  ఆమె కాళ్లకు నమస్కరించెను. అది చూచి మీనాక్షి హృదయము ఎంతో ఉప్పొంగె ను. ఆమె కళ్ళు చెమర్చెను భారతవర్ష తలుపువద్దనుండి అంతయూ చూచుచూ వారిని సమీపించెను. 

కాళ్ళ వద్దనున్న సందీపుని పొదివి పట్టి లేవనెత్తి "బాహ్య ప్రపంచము అట్లు పిలుచుచున్ననూ  నేను నీకు స్వరరాణిని కాదు నేను నీకు అత్తయ్యను,  వర్షుడు , మంజూష నాకు బిడ్డలు , మా అమ్మాయిని చేసుకొనుచున్న నీవు ఈ ఇంటికి  అల్లుడివి. నాబిడ్డ మంజూష అదృష్టవంతురాలు వర్షుడు "అని చెప్పుచూ వర్షునితో "నీవు మంచి  నిర్ణయము తీసుకొంటివి " అని అభినందించెను. భారతవర్ష నేత్రము లార్ద్రము లగుచుండగా సందీపుని సమీపించి"  ఆమె  అగస్త్య తల్లి అని మెల్లగా చెప్పెను. సందీపుడు నెత్తిన పిడుగుపడ్డట్టు క్రుంగి భాదతో విలవిలలాడుచూ "రాఘవుడు ఎంత వల్లని పని చేయుచున్నాడు, తల్లి వంటి ఆమెను ప్రేమించుటయా!" ఆ నీచుని కటకటాల వెనుకకు నెట్టించవలెను. అని సందీపుడు అనుచుండగా. “అతడు జైల్లో  కూర్చొని ఏడ్చుచున్న మనకేమి వచ్చును  నాయనా”  అని మీనాక్షి అనెను.  

ఇంతలో గృహ ప్రాంగణము నందు కేకలు పెనుగులాట వినిపించినవి, మొదటి అంతస్తు కిటికీ నుండి మీనాక్షి యమున వర్ష సందీపులు క్రిందకు చూచిరి. రాఘవుడు, ప్రఫుల్ల బాహాబాహీకి దిగినారు. రక్షణ గృహ సిబ్బంది పరుగు పరుగున పోయి  వారిని వెనుకకు లాగుచున్నారు. ఆ జట్టు నాయకుడు పరుగు పరుగున వచ్చి ద్వారము వద్ద నిలిచి "మేడం, వారు మా చేయిదాటిపోవుచున్నారు మీరు అనుమతించిన పోలీసులను రప్పించెదము, మీరే ఫోను చేసిన మరీ మంచిది పోలీసులు వెంటనే వచ్చెదరు." అనెను. భారతవర్ష, యమున, సందీపులు అవాక్కయ్యి చూచుచుండిరి.  మీనాక్షి ముందుగా తేరుకొని " పోలీసులు వలదు నేనే వచ్చుచున్నాను” అని రక్షణాధికారిని పంపివేసి క్రిందకు వెళ్లి వారిరువురినీ ప్రేమగా తోడ్కొని వచ్చెను. “మనమందరమూ కలిసి భోజనము చేయవలెను” అని పనివారితో అందరికీ వడ్డించమనెను. సందీపుని భోజనమునకు ఉండమని పట్టు బట్టిననూ ఉండక "అత్తా, నాకొరకు పని చూచుచుండును, సమస్యలు నన్ను పిలుచుచున్నవి, భాగస్తులు అచ్చోసిన ఆంబోతులవలె తిరుగుటవలన (రాఘవుని వైపు చూచుచూ), పని భారమంతయూ నాపై పడెను. ఇప్పుడు నేను ఒక్కడినే అన్ని పనులు చూసుకొనవలెను.  పెండ్లి అయిన పిదప మీ అమ్మాయిని తీసుకొని తప్పక వత్తును. అని సందీపుడు నిష్క్రమించెను.

భోజనములు వడ్డించుచుండగా ప్రఫుల్ల 'నేను పోయివత్తును.ఎల్లుండి కేరళ పోవుచున్నాను, వచ్చిన నూ రాకున్ననూ, మాట నిలుపుకొన్ననూ నిలుపుకోకున్ననూ నీ ఇష్టము" అని ప్రఫుల్ల వెడలెను. ప్రఫుల్ల వెడలుచుండగా రాఘవ "నీవు పోయి పుణ్యము కట్టుకొనుము, నేను మీనాక్షితో చాలా విషయములు మాట్లాడవలసి యున్నది." అనెను. కోపముగా చూసి  ప్రఫుల్ల వెడలిపోయెను. 

రేగిన జుత్తు, నలిగినా దుస్తులు మొఖం పై దెబ్బలు చూచిన మీనాక్షి నీవెందుకు అతడితో గొడవ పడుచున్నావు అని అడిగెను.  అతడే నాతొ గొడవ పడుచున్నాడు, నన్నిచ్చటికి రావలదని నిరోధించుటకు అతడెవడు? నా భాగస్వామ్యమును ఒదులు కొంటిని , భవిష్యతు యందు డబ్బు యందు ,  ఆశ వదులు కొని ( నీవే కావలెనని వచ్చితిని) అని చెప్ప బోవుచుండగా  భారతవర్ష చొరకొని “పుట్టిన రోజు నాడు నీవు ఇట్లు చేయుట మమ్మందరినీ కలిచివేయుచున్నది.” అని రాఘవుని మందలించెను.  రాఘవుడు క్షమించమని మీనాక్షిని కోరి ఒక చెక్కును భోజనములు బల్ల పై నుంచి మారు మాట్లాడక వెడలిపోయెను. “నేనిచ్చిన డబ్బుని తిప్పి ఇచ్చినాడు అని మీనాక్షి అనగా   “ఒక తుఫాను ముగిసినది.” అని యమున నిట్టూర్చెను.  

వర్షుడు మాట మార్చవలెనని “తుఫాను అనిన నాకు లూయీ విల్ నుండి వెనుకకు వచ్చుచున్న విమాన ప్రమాద సంఘటన గుర్తు వచ్చుచున్నది.” అనెను.  మీనాక్షి " నీవెక్కిన విమానమునకు ప్రమాదమా?!" అనుచుండగా, “ ఎక్కువగా విదేశములు పోవలదన్నయ్యా !" అని యమున అనెను. 

ఇంతలో యమున తల్లిదండ్రులు కళ్యాణి, వనమాలి వచ్చి మీనాక్షికి పుట్టిన రోజు దీవెనలందజేసిరి. యమున వారితో " ప్రొద్దున్న రమ్మంటే ఇప్పుడు వచ్చినారు" అని నిష్టూరమాడుచుండగా మీనాక్షి " తప్పమ్మా పెద్దవారితో అట్లనరాదు ఎప్పుడో ఒకప్పుడు వచ్చినారు కదా?" భారతవర్ష "తల్లి తండ్రులు కనిపించిన ఎవరైననూ చిన్న పిల్ల లయిపోదురు. అయిననూ అంతా మన మంచికే మీరు చాలా మంచి సమయమునకు వచ్చినారు.” అనగా యమున "మంచి సమయమనగా ?"  తుఫాను వెలసిన పిదప వచ్చుట మంచిదే కదా అని వర్షుడనగా యమున సంతోషించెను కానీ విమానంలో తుఫాను గూర్చి చెప్పమనెను. వారికి కూడా భోజనములు వడ్డించగా అందరూ కలిసి తినసాగిరి. వనమాలి చేతి సంచి యందు ఎదో వెతుకుచుండిరి. “ప్రమాదం ఎట్లు జరిగెను? అని మీనాక్షి అడిగెను. అప్పుడు వర్షుడు " ప్రమాదం తృటిలో తప్పెను.  విమానము అట్లాంటిక్ సముద్రము పై ఎగురుచున్నప్పుడు రాత్రి మెరుపులుతో కూడిన వాన పడుచుండెను, పెనుగాలులకు విమానము నడిసంద్రములో నావవలె ఊగిసలాడెను, ప్రయాణీకులందరూ ప్రాణములరచేతిలో పెట్టుకొని కూర్చొనిరి. మీనాక్షి , యమున రాఘవుని గొడవ మరచి రెప్పవేయక వినుచుండిరి. ఆపై ఏమిజరిగెను అని అడుగగా భోజనములు చేసిన పిదప చెప్పెదను అని వర్షుడు అనెను. భోజనములు చేసిన పిదప వెండి గిన్నెలలో పాశయము వచ్చెను. 

వర్షుడు “పాయసము తిన్న పిదప మనము హోటల్ రాయల్ ఆర్కిడ్ కు పోవలెను.   అక్కడ ఒక గంట నవలపై సంతకము జేయు కార్యక్రమము కలదు ఆపై మనము స్వేచ్ఛపక్షులవలె విహరించెదము. నేడొక్కదినము నీవు స్టూడియో ఊసెత్తరాదు. రేపు నీ ఇష్టము అందుకు అంగీకరించినచొ విమాన ప్రమాదం ఎట్లు తప్పించితినో మీకు చెప్పెదను. అని భారతవర్ష అనగా మీనాక్షి నవ్వి సరే అనెను.

మరల వనమాలీ ఎదో వెతుకుచుండిరి. మీనాక్షి మీరు దేనికొరకు వెదుకుచున్నారు? అని అడుగగా కళ్యాణి " ఈయనకి మతిమరపు ఎక్కువ,  బహుమతి మరచి వచ్చినారు. అని విచారించుచుండగా, మీనాక్షి "మీ అమ్మాయి నాకు పెద్ద బహుమతి, ప్రేమ కంటే పెద్ద బహుమతి ఏముండును ఇచ్చుట మీ అమ్మాయి ఎంత ప్రేమించుచున్నదో ఎంత సేవించుచున్నదో. యని పొంగిపోవుచుండగా, కళ్యాణి “అంతా ప్రేమనుకొనుచున్నారు. అందు స్వార్ధము కూడా ఉన్నది”  “స్వార్ధమా!!” యని మీనాక్షి అచ్చెరువందెను. వనమాలి  “స్వార్ధమేనమ్మా ఎందుకు చేయుచున్నదో ఎప్పుడైననూ విచారించితిరా?" “లేదు ఇప్పుడు విచారించెదను , ఎందుకమ్మా నాకు ఇంత  సేవ చేయుచున్నావు ?" అని మీనాక్షి యమునను అడిగెను.

లక్ష్మి కాంత్  ప్యారేలాల్ ,రాజ్ కోటి , కళ్యాన్జీ ఆనంద్జి , రాజన్ నాగేంద్ర , శంకర్ జైకిషన్, బప్పిలహిరి " ఇట్లు సాధారణంగా సంగీత దర్శకులు జంటకవులవలె ఇద్దరిద్దరు ఉందురు . అట్లే నేను కూడా నీతో కూడి సంగీత దర్శకురాలిన య్యెదను. అని యమున గడగడా సంగీత ద్వయముల పేర్లు చెప్పెను.  మీనాక్షి కిలకిలా నవ్వుచుండగా యమున ఆమె వైపు అయోమయంగా చూచుచుండెను. చివరకు బప్పి లాహిరి ఒకేవ్యక్తి అని తెలుసుకొని యమున కూడా నవ్వెను. 

విమాన ప్రమాదము నీవు ఎట్లు తప్పిచితివి అని యమున కుతూహలంగా అడుగగా ఎచ్చటికి పోయిననూ ఆవు గడ్డివలె విమాన ప్రమాదము వదలకున్నది అని వాహనంలో చెప్పెదను అని యముని ఊరించెను. 

యమున తలిదండ్రులు వెడలిన పిదప ఇన్నోవా వాహనము బయలుదేరినది. డ్రైవర్ నడుపుచుండగా ముగ్గురూ వెనుక కూర్చొనిరి. ఇక నైనా చెప్పెదవా ? ఇంకనూ ఊరింతువా ? అని యమున నిష్టూరములాడుచుండగా మీనాక్షి నవ్వాగకుండెను. ఎట్టకేలకు వర్షుడు నోరువిప్పెను " చెల్లెమ్మా , అని నుదుటిపై చేయి వేసి చూసి “చాలా వేడిగా నున్నదే!”  “అయిననూ మాట ఇచ్చిన పిదప నిలుపు కొనక తప్పదు కదా!  నేను విమానములో కూర్చొని నవల చదువు కొనుచున్నాను. ఆ నవల మూసి వేయుటతో ఆ తుఫాను పోయినది. అని జెప్పెను. "నిజమా ?" "ఆ తుఫాను, పెను గాలి, ప్రయాణీకులు భీతిల్లుట ఆ నవల యందొక సన్నివేశము. అందుచే ఆ నవలను మూసివేసినాను. మూసివేసి  ప్రశాంతముగా నిద్రించినాను. యమునకు పట్టరాని కోపము వచ్చి అన్నయ్యను పిడిగుద్దులు గుద్ద సాగెను. వాహనమంతయూ నవ్వుల దీపావళి.

                                                                      ***

వాహనము హోటల్ రాయల్ ఆర్కిడ్ చేరుకొనెను. రచయిత సంతకము చేయు కార్యక్రమమునకు మంచి స్పందన లభించెను. జూలియా రాబర్ట్స్ అని ఒక హిందుత్వమును శ్వీకరించిన అమెరికా నటీమణి ఆ పుస్తకమునకు ప్రొఫెసర్ రాజు వ్రాసిన ముందుమాట చదివి  అది వాస్తవ సంఘటనలాధారముగా వ్రాయబడినది  అని తెలుసుకొని, ఆపుస్తకము నందలి పునర్జన్మల గూర్చి అనేక విషయములడిగి తెలుసుకొనెను.  సవ్య సాచి ముఖర్జీ అను ఫేషన్ డిజైనర్. ఐ ఐ స్ సి సైటిస్ట్లు మరికొందరు సాంకేతిక , రాజకీయ ప్రముఖుల వారసులు కూడా ఆ కార్యక్రమమునకు వచ్చిరి. మీనాక్షి ప్రక్కనుండుటచే అనేక ప్రముఖులు ఆమెతో మాటలాడుటకు ఉవ్విళ్ళూరుచుండుటచే నిర్వాహకులు ఆమెను యము ననూ హోటల్ నందు గల వనము, ఈతకొలను, బిలియర్డ్స్ గది వంటివి  చూపుచూ కాలయాపన చేయుటకు తంటాలు పడుచుండిరి.
 కార్యక్రమము ముగిసిన పిదప వారు ప్రకృతి అందాలకు ఆలవాలమై నంది కొండలకు పో వలెనని వర్షుడు సూచిం
చెను. ఇన్నోవా అరువది కిలోమీటర్ల దూరములోనున్న నంది కొండలకు సాగుచుండెను. మల్లేశ్వరం రహదారి లో హెబ్బల్,  యెలహంక దాటి , నంజనగూడు  రాఘవేంద్ర స్వామి  ఆలయమును దాటుచున్నది. అచ్చటికి సమీపములో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయము  ఉండుటచే ఆకాశమున  విమానములెగురుచూ కనువిందు చుండెను. ఎత్తైన నీలగిరితైల వృక్షములు రహదారికిరువైపులా స్వాగత తోరణములవలె నిటారుగా నిలిచి స్వాగత గీతము నాలపించుచున్నవి. వర్షుడు వాహనము అద్దాలనుదించగా పిల్లగాలులు నీలగిరి సువాసనలతో సన్నాయి ఊదుచూ మదిని పులకరింపజేయుచున్నవి. యమునకు హోటల్ నందు నిర్వాహకుల అవస్థలు గుర్తువచ్చి నవ్వసాగెను. పిమ్మట ముగ్గురూ కొండ పైకెక్కు వరకూ ఆవిషయమును తలుచుకొని నవ్వుచునే యుండిరి. అమ్మ నీ పుట్టిన రోజు ఇట్లు నవ్వులతో గడవవలెను. అని తల్లిని చెల్లిని గుండెలకు హత్తుకొనెను. సమయ మంతయూ నవ్వులలో కరిగిపోయెను వాహనము నంది కొండలనధిరోహించెను 1478 మీటర్లు ఎత్తుకు చేరి వాహనమును నిలిచెను.

కారు దిగి పచ్చిక పై నడుచుచుండగా శీతాలవాయువులు వారిని తాకుచుండెను. మబ్బులలో దాగి నీలి కొండలు దోబూచు లాడుచుండెను, ప్రకృతి రమణీయత శృంగార భావాలను తట్టి లేపుచుండగా వారు మెల్లగా నడుచుచూ ఒక ఎత్తైన ప్రదేశమును చేరినారు. అచ్చట వారు మబ్బులపై తేలాడుచున్న అంబరమణిని చూచిరి. “మనము మబ్బులపై నిలబడి సూర్యుని చూచుచున్న బ్రాంతి కలుగు చున్నది.” అనుచూ మీనాక్షి కేరింతలు కొట్టసాగెను. నీవు నవ్వుచున్నచో పద్మములు వికసించుచున్నట్లు, పారిజాతములు రాలుచున్నట్లు ఉన్నది అనుచూ అచ్చటనే ఉన్న కుర్చీలలో కూర్చొనిరి. కాళ్లక్రింద మబ్బులు ప్రాకుచున్నవి అని అనుచున్న మీనాక్షిని చూచిన యమున “తప్పంతా రాఘవుడిదే కాదన్నయ్యా” అనెను. "అయినచో నాదా? నేను ఇకపై ఈ నగలు ఈ అలంకారములు  ధరించను. ఈ ఖంఠా భరణము ఏల అలంకరించితివి? ” అని  కినుక వహించెను. 
 
“తప్పు నీదు కాదమ్మా ఆ బ్రహ్మ దేముడిది. నీకు అందము సంగీతము రెండు రెండు వరములు. ప్రకృతిని  చూచి నీవు ఎట్లు పరవసించితివి? అట్లే నీ అందమును చూచి ప్రపంచము పరవసించును. అందు కొండొకచో రాఘవుని వంటి దుర్బలుడు మతి చెడి  ఆత్మ నిగ్రహము కోల్పోయినచో నీ వెందుకు అలంకరణలు తీసివేయవలెను? కామ సూత్రలో వాత్సాయనుడు ముష్టివారు చుటూ ఉన్నారని వంట చేసుకొనుట మానరాదనెను.” అని వర్షుడు ముగించెను.

“కామశాస్త్ర మాట వర్షుని నోట విన్న యమున ఆశ్చర్యముతో “కామశాస్త్ర స్త్రీలు  చదువవచ్చా?” అని అడిగెను. “కామశాస్త్ర హిందూ పురుషార్ధ శాస్త్రములను వివరించిన శాస్త్రము. కామసూత్ర చదివినచో మనుధర్మములో గల లోపములను తెలుసుకొన గలము.

"మనుధర్మములో లోపములను మనమెందుకు తెలుసుకొనవలెను?"
ఎందువలననగా మన సమాజము ఇంకనూ ఆ ప్రభావముననే యున్నది స్త్రీలు అది అనుసరించుచున్నారు. వేయేల అమ్మ కలత చెందుటకు కారణము కూడా అదియే. చూచుట, వినికిడి,  స్పర్శ , రుచి మరియు వాసన, అను ఐదు  ఇంద్రియముల   మనస్సు ఆత్మతో కలిసి పొందు స్పృహను కామమందురు. మీనాక్షి ఓర్చుకొన జాలక కుర్చీనుండి లేచి దగ్గరలో పచ్చికపై నడయాడసాగెను.

సంతానము కొరకు మాత్రమే స్త్రీపురుషులు కలవవలెనన్న మనువు పరపురుషులను కోరిన స్త్రీని ముక్కు చెవులు కోయవలెనని హిసించవలెనని చెప్పెను.  పురుషుని తో సుఖములేని స్త్రీ అతడిని విడిచిపెట్టునని చెప్పి వాత్సాయ నుడు మనువు కంటే కొన్ని కాంతి సంవత్సరముల ముందుండెను. వాత్సాయనుడు స్త్రీపురుషులు సంతానము కొరకు మాత్రమే కలిసినచో జంతువులకు మనుషులకు భేదముండదని, కామము జీవిత సాఫల్యతా లక్ష్యము అని చెప్పెను. కామసూత్ర స్త్రీ స్వేచ్ఛను ప్రోత్సహించిన గ్రంధము. యమునా పోయి మీనాక్షిని కొనివచ్చి కుర్చీ యందు కూర్చోండ  బెట్టి " అన్నయ్య రెండు శాస్త్రముల మధ్య అంతరమును చెప్పినాడు , ఏమీ తెలుసుకొనక ఎందుకట్లు తిరుగుచున్నావు అని ముద్దుగా  మందలించెను అయిననూ మీనాక్షి కినుక వీడ కుండెను. మీనాక్షి ప్రకృతిని చూచి పరవసించుచుండగా    వర్షుడు ఆమెను తన గానమందు సేదతీర్చేను. 

సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ, రాగాల కూనలమ్మ
గారాలు సేయరమ్మ రాగాలు పూయు నమ్మ   2
సృష్టించెను బ్రహ్మ ఇది పట్టుతేనే కొమ్మ అందాల కోయిలమ్మ
అమ్మమ్మ చూడరమ్మ అజంత శిల్పమమ్మ ఇది జాతి సంపదమ్మ 
యాగాలు చేయ జేజెమ్మ జెజ్జరిల్లి జేజి తిమ్మనిచ్చెనమ్మ ఈ కొమ్మ 
ఆ సోమిదమ్మ కొమ్మ, కమ్మ నైన రాగాలకు పెమ్మి ఈ అమ్మ                     
చిమ్మ చిమ్మ ప్రోది చేసి ఇమ్ముగ తరతరాల కిమ్మ 
  
వర్షుడు పాడుట పూర్తి చేయగానే మీనాక్షికి సిగ్గు, ఆశ్చర్యము దుగుణము లయినవి . ప్రక్రుతి రమణీయత చూచుచూ ఆ పాట విన్న మీనాక్షిమనసు గువ్వ వలే రివ్వని స్వేచ్చా కాశములోకి ఎగిరి పోయినది. పిదప వారు గంగవంశపు రాజు కట్టిన నందిదుర్గమును భోగనందీశ్వరాలయమును చూచి ఇందిరానగరుకు ప్రయాణమయ్యిరి. తిరుగు ప్రయాణ మంతయూ మీనాక్షిని ఘాడనిర్ద్ర ఆవహించెను. భాద వీడిన మీనాక్షి మనసు  తేట పడి  అది ఆమె  ముఖములో స్పష్టంగా  కనిపించుచుండెను. పిల్లలిద్దరూ తల్లి ముఖమును ముద్దాడిరి.

                                                                    ***
మరుసటిరోజు మీనాక్షి జన్మ దిన వేడుకలు అన్ని ప్రముఖ వార్తాపత్రికలలోను వెలువడినవి. కాఫీ తాగుచూ ముగ్గురూ తమ పుట్టినరోజు చిత్రములను వార్తాపత్రికలలో చూచుకొనుచుండిరి. దివాను పై మీనాక్షి పట్టుచీరలో కూర్చొన్న చిత్ర ము మహారాణి వలే అగు పించుచుండగా అనేక సంఘటనల దృశ్య మాలిక ఆమె మదిలో మెదిలెను. 
వర్షుడు: మంజూష వివాహము సమీపించుచున్నది  24 వ తారీకున రాత్రి అనగా ఇంకనూ వారము రోజులైనా లేదు , ఈ రోజు సాయంత్రము తో ఇచ్చట నవల సంతకముల కార్యక్రమము ముగిసైనా పిదప నీకు కనిపించి బయలుదేరెదను. నీతో ముఖ్యమైన విషయమొకటి చెప్పవలెను , అని  "యమునా , నీవు నేటి సాయంత్రము నాతో  వచ్చెదవా ?" 
యమున: ఆమ్మో అమ్మను విడిచి నేను రాను. అర్ధ రాత్రి వరకూ  దూరవాణి అట్లే మ్రోగుచుండెను.  అమ్మకు నేను కుడిభుజముగా నుండవలెను . అనేక రికార్డింగ్ కార్యక్రమములు కలవు.   
వర్షుడు : అమ్మ దగ్గర ఉన్నచో ఒత్తి సంగీతమే నమ్మా! అచ్చట నీఈడు పిల్లలే అంతా , సంగీతముతో పాటు నాట్యము కూడా చేయుచున్నారు. 
మీనాక్షి: మీ ఇద్దరు వెడలినచో ఈ ఇల్లు చిన్న బోవును. నేనొక్కతి నీ ఉండలేను బాబూ అనుచుండగా వర్షుడి చరవాణి మ్రోగెను. మాలిని గారు ఆందోళన పూరిత స్వరముతో  "బాబూ ఇచ్చట ఆడపిల్లల కిష్కిందకాండ నేను  తట్టుకొన జాలను. నీవు వెంటనే వచ్చి వీరిని చక్కదిద్ద వలెను.  ఇల్లు పీకి పందిరి వేయు చున్నారు."  ఈ పెండ్లి అయ్యిన పిదప నేను ఎదో ఒక  ఆశ్రమము చూచు కొందును.  అని వాపోవుచుండగా నేను నేడే వచ్చుచున్నాను , నేను రాక ముందే నీ సమస్య తీరిపోవును , కంగారు పడవలదు అని చెప్పి ముగించి చూడమ్మా నీవు నలుగురు ఉన్నచో బాగుండునను కొనుచు న్నావు అచ్చట మా అమ్మ ఒంటరిగా ఉన్నచో ప్రశాంతముగా నుండునని వాపోవుచున్నది. 

మీనాక్షి గారు నవ్వుచూ "పెళ్లి ఇంట సందడి ఉండవలెను కదా! తొమ్మిది గంటలగుచున్నది.” అనుచూ యమునతో కలసి స్టూడియోకి బయలు దేరిరి. 

5 comments:

 1. Happy Pongal sir.Very happy to see Meenakshi as a celebrity and to see tremendous success of varsha as a writer. The song sung by Varsha is awesome.Well differentiated Manudharma and Kamasutra. Well described the nature.

  ReplyDelete
 2. ఇంక మంజూష పెళ్లి సందడిని ఎట్లు వర్ణింతురో!

  ReplyDelete
 3. ధన్యవాదాలు మీ ఫీడ్ బ్యాక్ లాగా ఈ సంవత్సరం మీకుహృద్యంగా ఉంటుంది పిల్లలు ఇంత అల్లరి చేస్తున్న మీరు వాళ్ళని ఒక్క మాట కూడా అనటం లేదు. ఇది అన్యాయం

  ReplyDelete
  Replies
  1. అల్లరి చేయటం పిల్లల హక్కు.ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తారు? చెయ్యనివ్వండిలే పాపం!😄

   Delete
 4. Sir, narration of the characters in the story is so beautiful. In this story sir tells many things like way of Meenakshi beauty of her character & attitude and her nature enjoying way you shown is great. The song sung by her son is wonderful, and you describe the beauty of Nandhi hills sunrises in hills is speechless, when I read this my heart and mind enjoying and beauty of Banaglore airport that you describe is marvelous. Thank you so much for giving me a chance to read this story.

  ReplyDelete