Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, July 14, 2020

Bharatavarsha-6

ముంబై మహానగరంలో జెట్ఏర్వేస్ విమానం దిగి  అంచగమనమున సాగుచుండెను. విలాసహాస విలసిత తార అరుణతార   మహారాణిఠీవి కన్నవారికి ఆమె  నర్తకి యనిన నమ్మబుద్దికాదు. యాబది వర్షములు సమీపించుచున్ననూ బుగ్గలలో తగ్గని ఎర్రని నిగారింపు, దేహంలో తగ్గని పసిమి ఛాయ తో  వెలుగుచున్న అరుణతార కామ దృష్టి తో చూచువారికి  మోహిని వలే విలాసిని వలే  కనిపించును. కళాదృష్టి తో చూచినా వారికి  ముద్దుమోము, నాట్యధాటికి  చిక్కిన నడుము, కళ్ళలో చురుకుతనం , ఆహార్యం లో అహంకారం తో, జక్కన  చెక్కిన  తీరైన శిల్పములా చూచువారికి   తరలి వెళుతున్న తెలుగువారి తరతరాల వారసత్వ సంపదలా కనిపించును. 

సూర్యకాంతి లో  మిలమిల మెరియుచున్న అరుణతారను చూచినా ఓ వృద్ధ ప్రయాణికుడు మరొక ప్రయాణికుడితో "ఎవరోయీ ఈ చెకుముకి? లకుముకి చందమున నా డెందమును పరిగ్రహించెను "అనెను. అందుకు అతడు  "ఆమె ప్రక్కనే నడుచుచున్న మొండికట్టె ఎవడోయి, నల్లని తుమ్మమొద్దు వలెనున్నాడు, ఆమె చేతిని చూరగొనుటాయే గాక చూర్ణము చేయుచున్నాడు." అనెను. అదిచూచి  మొదటి ప్రయాణీకుని ముఖము వివర్ణమయ్యెను.  విమానాశ్రయ నిష్క్రమణ ద్వారం వద్ద నుంచి బైటపడిన అరుణతార తనకై ఎదురు చూచుచున్న రధమునధిరోహించగా ప్రక్కనున్న పురుషుడు “ఓబరాయ్” అనెను. రధము దూసుకు పోయెను.

ఒబెరాయ్ నందు రధము దిగగానే ఆమెను సాదరంగా తురయ టెలిఫిలిమ్స్ వారు సమావేశ మందిరమునకు కొనిపోయిరి. విద్యుత్దీపకాంతిలో దగత్ దగాయమానమై ప్రకాశించుచున్నసమావేశ మందిరమున విద్యుత్ దీపములతో పోటీపడుచూ ఉన్నత రంగస్థలం పై కూర్చునిఉన్న తారలందరూ అరుణతార ప్రవేశముతో వెలవెలపోయిరి.   వారందరి మధ్యలో ఆమె తారల మధ్య చంద్రునివలె కనిపించెను. ద్రోణదళముల వంటి ఆమె కనులయందు విద్యాస్పర్థలో గౌడడిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించిన శ్రీనాధుని విజయ గర్వము అనేక మేటి నర్తకీమణుల శృంగార నాట్య భంగిమల  భంగపరిచి వారి స్థానములను కొల్లగొట్టిన ఆమె ముఖమునందు తొణికిసలాడ కాతులీనుచున్నఆమె ముఖమునే అందరూ చూచుచుండిరి.

మాయ అను పౌరాణిక నాటకము నూరు భాగములు పూర్తి చేసుకున్న సందర్భముగా నాటక విజయోత్సవమును తురయ టెలిఫిలిమ్స్ జరుప నిశ్చయించి ఏర్పాటుచేసిన సభకు ఆ నాటకమునందు ఆస్థాన నర్తకి గా ప్రముఖ పాత్ర పోషించిన అరుణతార గొప్ప ఆకర్షణ అయ్యెను. ఆమెపై ప్రశంసల వర్షము కురిసెను. కొందరు ఆమె నటనను పొగడగా మరికొందరు ఆమె నాట్యమును పొగిడిరి. కొద్దిమంది ఆమె అందమును పొగిడిరి.  ఎవరో ఒక రసికాశిఖామణి, కేరళ నుండి ఎంపికైన ఎగువసభ సభ్యుడు, శృంగారోత్సాహమున పుష్పగుచ్ఛమిచ్చునెపమున తూలిపడి  ఆమె కుచాగ్రములను స్పృశించెను. 

ఇది చూచి ఒక సభికుడు  ఏమిసాహసము , ఏమి కొంటెతనము యని వ్యాఖ్యానించెను  అది విని మరొక  సభికుడు అది సాహసము గాదు దౌష్ట్యము ,  కొంటెతనము గాదు క్రొవ్విదము. అయిననూ నేటి భారత దేశమున వయసుమళ్ళిన రాజకీయవేత్తలు సిగ్గు ఎగ్గు మరిచి ఇటువంటి పనులు చేయుట సాధారణమాయెను అని సరిపుచ్చుకొనెను. ఈ స్త్రీ లోలుడు మొన్ననే మూడవ భార్యను మట్టుబెట్టి ఇంకనూ పరస్త్రీల చుట్టూ భ్రమరమువలె పరిభ్రమించుచున్నాడు అనెను. అందుకు పొరుగువారు నవ్వి స్త్రీ యనిన తేనెపట్టే కదా , ఒక్క భ్రమరమేమి ఖర్మ అనేక భ్రమరములు తిరుగుచుండును. అందు నేనొక భ్రమరము నవ్వవలెనని నా ఆకాంక్ష. ఆమెను పెట్టి ఒక చలన చిత్రము రూపొందించవలెనని యోచించుచున్నాను. అనెను. ఇచ్చట కామాతురులు పెచ్చుగా యున్నారు యని ప్రక్కవాడు వెనుకవరుసకు మారిపోయెను 

కొద్దిమంది ముఖ్యులు ప్రసంగిచిన పిదప ముంబయి విశ్వవిద్యాలయ పురాణ విభాగాధిపతి ముంబై విశ్వవిద్యాలయంలోని పురాణ విద్య కు మంచి ప్రజాదరణ లభించెనని టెలివిజన్లలో పౌరాణిక మరియు చారిత్రక నాటకాలకు ఆదరణ పెరుగుటవల్ల ముంబై విశ్వవిద్యాలయంలోని సంస్కృత మరియు పురాణ కోర్సులపై విద్యార్థుల ఆసక్తిని పెరిగెనని సంస్కృత కోర్సుల ప్రవేశాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగెనని. అదనంగా, ఈ సంవత్సరం సంస్కృతం కోసం రెండు తరగతులు పూర్తి సామర్థ్యంతో నడపడం ఇది మొదటిసారి అని చెప్పుచూ” నేను చాలా మంది విద్యార్థులను వ్యక్తిగతంగా తిరస్కరించాల్సి వచ్చెను, వచ్చే ఏడాది ప్రారంభంలో రావాలని వారిని కోరారు. సంస్కృత కోర్సులు, తులనాత్మక పురాణ శాస్త్రము నందు (కంపారిటివ్ మిథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు) ప్రవేశములు గత రెండేళ్ళలో అతిపెద్ద పెరుగుదలను చూసింది. ఇంతటివిజయానికి కారణమైనదర్శకులు మరిన్ని చారిత్రిక, పౌరాణిక నాటకాలను ఎంపిక చేసుకోవాలని కోరెను. ఆమె నటీ నటులను కొనియాడి, ముఖ్యంగా ఈ విజయంలో సింహభాగం నర్తకీమణి అరుణతారదే అన్నారు. సమావేశమందిరము అంతా కరతాళ ధ్వనులతో నిండెను.


సమావేశము ముగిసెను.అందరు వెడలిపోయిన పిదప అరుణతార మెల్లగా సమావేశమందిరము నుంచి నిష్క్రమించి నడుచు చుండెను నేను ఒక విలాసమందిరమును నిలిపిపెట్టి యుంచితిని , ఈ రాత్రి కి మనము నా తదుపరి చిత్రము గురించి చర్చించవలెను అని అరుణతార ప్రక్కన ఉన్ననల్లని వ్యక్తి ఆమెను  వేదించుచుండెను. అరుణతార వద్దని వారించుచూ  " నాయుడుగారు , మీరు నాకు అవకాశాలు ఇచ్చినారు అని కృతజ్ఞతతో నేను మీకు మారాడలేకున్నాను , మీరు ఇంత దూరము వచ్చి ఇక్కడ సమావేశములో పాల్గొనుట విడ్డురంగా నున్నది , నిజము చెప్పవలెనన్న మీకు ఈ పౌరాణిక నాటకమునకు ఏమీ సమ్మందము లేదు.  బుల్లితెర కు మీకు బాదరాయణ సంబంధమైననూ కలదా? సంవత్సరముల క్రితమే  నాకు అవకాశములు మృగ్యమైనవి, నేను రాజకీయ రంగములో చేరి నిత్యమూ నిప్పులో నడుచుచుంటిని.  వెలుగు పార్టీలో  మహిళాధ్యక్షురాలిగా నా మనుగడే ప్రస్నార్ధకమయ్యెను.

 రేపు హైదరాబాదులో జరుగు  పార్టీ సమావేశము నా భవిష్యత్తును నిర్ణయించును. అంతే గాక నా కూతురు రేపు హైద్రాబాదు చేరుకొనును. రాత్రికి నేనిచ్చట బసచేసిన అది నాకు మరణ శాసనమగును.    నేను చలచిత్రములందు ఆశలు త్రుంచుకొంటిని.  మీకు ఏమి కావలెనో  నాకు తెలియును. కానీ అది జరగని పని అని అరుణ అనగా , నీ అందంచూసి మనసు పడి వచ్చితిని నన్ను నిరుత్సాహపరచకు , నేను చలన చిత్రము నిర్మించలేనని మన ఇరువురికీ తెలియును. కానీ నిన్నూరక రమ్మన్నను అని కొంత డబ్బు తీసి నాయుడు ఆమె చేతిలో కుక్కుటకు ప్రయత్నించగా అది ఘర్షణకు దారితీసెను.  విసిగిపోయిన నాయిడు ఆ డబ్బు అక్కడ విసిరేసి వెళ్లిపోయెను. 

ఆ దృశ్యము  చూడగానే ఇద్దరు పాత్రికేయులు నాయుడు వెంటపడిరి. ఒక్కడా పనిచేయు ఒక కుర్రవాడు ఆ డబ్బును ఏరి నాయుడికి అందజేసెను.  అరుణ తార అవమాన భారంతో మసకవెలుతురుతో నిండిన ఒక ఉపహారగృహములోకి వెళ్లి ఒక బల్లవద్ద  కూర్చొని  పండ్ల రసము త్రాగుచుండగా ఆమె మనసు కుదుటపడసాగెను. ఇంతలో ఆమె మీద ఒక చేయి వాలెను , మసకవెలుతురులో అతడు వెంటనే కనిపించలేదు  కానీ  కొద్ది సమయములోనే అరుణతార అతడు ఎవరో గ్రహించెను. నాపేరు శశి మా పార్టీ లోకి నిన్ను ఆహ్వానించుటకు వచ్చియున్నాను.  మా పార్టీ జాతీయపార్టీ  నీవు పని చేయుచున్న ప్రాంతీయపార్టీకన్నా వేయి రేట్లు మెరుగు. నీవంటి ప్రజాదరణగల తారామణులు ఉండవలసినది ఆకాశమున గానీ పంకిలమున గాదు. అని ఆమె పడుతున్న శ్రమను హెచ్చుజేసి మాట్లాడి ఆమె ఖేదమును బాపి, నీవిప్ప్పుడు తాగవలసినది పండ్ల రసము కాదు అని మెల్లగా ఆమెను ప్రక్కనే ఉన్న పానశాలలోకి తీసుకుని పోయెను. 

మధువు సేవించి మగువ శాంతిని బొంది
ముదముగ చిలకరించె వన్నెలు కోమలాంగి
పట్టుతప్పె రసికుడు సురతమూహించుకొనుచు
మధువు కంటెను మత్తిల్లె మగువ సొగసు 

కామ రోగమున మత్తెక్కిన శశి ఆమె కంఠమును , పెదవులను వక్షమును   శ్లాఘించి ఆమె కుసుమ సౌందర్యమును కాంక్షించి ఒక వజ్రపుటుంగరమును బహూకరించెను  "నాకు ఎల్లపుడు ఇక్కడ ఒక విలాసమందిరము నిలిపిపెట్టబడి ఉండు"ననిజెప్పి, మదిర ప్రభావమున ఒరిగిన లలామ లావణ్యమును పెనవేసుకొనెను.  తార అతడిని ఒక్క వుదుటున నెట్టి ఉంగరమును అతడి మొఖంపై కొట్టి బయలుదేరుచుండగా  ఆతడు "నీ రూపము చూసి  నీవు విలాసవతివలె  కనిపించుటతో దూకుడుగా ప్రవర్తించితిని అని  నేను మంచి వారికి మంచివాడిని విలాసవతులకు మాత్రమే శృంగార పురుషుడను ఆమెను క్షమాపణవేడుచూ ఉంగరమును తిరిగి ఇచ్చి పానశాలను వీడి  వెడలిపోయెను." అరుణతార  విమానాశ్రయమునకు బయలుదేరెను.  


5 comments:

  1. My god. I had a lump in my throat when I read this

    ReplyDelete
  2. I got a great feeling after reading your comments, hope you are also enjoying the language apart from the story. Is my decision of using old Telugu for this novel correct?

    ReplyDelete
    Replies
    1. Dear sir it is very tough to write in perfect telugu without using English words. I can understand your efforts. But people addicted to Tinglish(Telugu+English)Very few people can understand this.

      Delete
  3. The language which is used in bharatavarsha remembering my old days of school

    ReplyDelete
  4. నాటి సబా సబికులు, ప్రజలు అరుణతార అందమును, ఆదరించినారో లేదో తెలియదు గాని మీ రాతాలలో ఆమెను నేను స్పస్టముగా చూడగలిగాను. మీ వంటి రచయుతలు ఈ రోజులలో కూడా ఉండబట్టే తెలుగు తల్లి బ్రతికి ఉండనే నమ్మకం వస్తుంది. ధన్యోస్మి గురు గారు

    ReplyDelete