పొద్దుగూకు సమయమునకు ఇంటికిచేరిన అరుణతార సర్పము కుబుసమును విడిచినట్లు నిస్పృహాకుబుసమును విడిచి మిక్కిలి యుపశమనమును పొంది తన తల్లి చిత్రపటమునకు నమస్కరించెను. అశ్రువులు నిండిన నేత్రములను వత్తుకొనుచున్న కేశవుడు కనిపించెను.
క . దర్పము అంతయు విడిచె
సర్పము కుబుసము విడిచెడి చందం బునన్
తర్పిత మొందెను వందన
మర్పణ జేసెను నిలిపెను మనసున మాతన్
ఎదురుగా నున్న దూరదర్శని తెఱయంతట అరుణతార విషాదభరిత వదనమలుముకొని యుండెను, ఆమె కంట కన్నీరు బొటబొటా కారుచుండ, పరితాపమునొంది ఆక్రోశించుచుండెను. కేశవుడెందుల కేడ్చుచున్నాడో గ్రహించిన అరుణతార వెంటనే దూరదర్శనినాపుజేసెను. పదునారేండ్ల పసివాడు కేశవుని తలనిమిరి లాలనజేయు గా దుఃఖము తగ్గి తుడుచుకొనెను.
లకుమ కానరాదేమని అడుగగా చిన్నమ్మగారు స్నేహితులతో బయటకేగినార చెప్పెను. సరే అదియునూ ఒకందుకు మంచిదే యని అనుకొనుచుండ పరుగు పరుగున లోనికి పోయి వచ్చినాడు. సోఫాలో కూర్చొని కండ్లుమూసుకొన్న అరుణతార తలవెనుకకువాల్చి కొద్ది నిమిషములట్లే ఉండెను. కండ్లుతెరిచి చూచునంతలో కేశవుడు మంచినీరు, తేనీరు అందించెను. తేనీరు త్రాగుచుండగా చిటికలో బోయి వేడినీటిబుగ్గ మీటనొక్కి మృదంగము అందుకొనెను , ఆమె ఎదురుగా నేలపై కూర్చొని గుమికి వాదన (ఎడమ చేతి వైపు దిగువ చివర భాగం తో తట్టడం ద్వారా ఉత్పత్తి అయ్యే వైవిధ్యమైన మంద్ర స్వరం) తో మొదలెట్టి, పూర్తి చాపు, అరచాపు మార్చి మార్చి తాడించుచూ చివరకు "దృవతాళ" వాదన ప్రారంభించెను "తక్కడితోం, గిడ తక్కడితోం, తద్ది తక్కడతోం థళాంగ్ థథ..థరికిట .. " కేశవుడు కన్నులరమూతలై ఆనంద పారవశుడై గాలి షడ్జమమై , పక్షులు పంచకమై కేశవుడు శివాత్మకమై చేయు మృదంగవాదనా ధ్వని యందు అరుణతార మనసు మయూరమై మైమరచి నర్తించెను. "గోపాలుని గీతా భోదవలె ఈ మృదంగ నాదము అలౌకికానందమును కలిగించి చిత్తనిర్వికార మొనర్చినది. ఈ రాత్రికి నీవు వండవలదు నేనే వండెదను"యని జెప్పి భావోద్వేగములను మకిలి వస్త్రములతో పాటు బుట్టదాఖలు చేసి, వేడినీటిబుగ్గ ఆవిరుల స్నానమాచరించి నిర్మలత్వము బొంది గృహా ఆచ్ఛాదనములు ధరించి వంటజేయుచూ లకుమకొరకు ఎదురు చూడసాగెను.
రాత్రి 9 గంటలు అగుచుండగా దూరవాణి మ్రోగినది లకుమ కలదా? యని నాయుడు అడిగెను. ఆమె ఇచ్చట నుండెనని నీకెవరు చెప్పినారు అని అరుణతార అడుగగా నాయుడు చిన్నగా నవ్వినాడు , " నేను చిత్రనిర్మాణమునకు కావలిసిన డబ్బు సమకూర్చుకొనినాను ఎట్లైననూ చిత్రమును నిర్మించి తీరెదను. మినర్వా నందు బసచేసి యున్నను , లకుమ వత్తుననిచెప్పెను, గుర్తుచేయవలెనని చెప్పి ముగించెను. "కామపిశాచి వలె బంకపీషాణము వలె తగులుకొన్నాడు చిత్ర నటనా బులుపున లంపటమున జిక్కెను అని తల్లి మనసు తల్లడిల్లెను. "నేను కాకున్న నాకూతురు , నీ బులబాటము తీరిన పిదప చివరికేమిదక్కునో నాకు బాగా తెలియును , నాకూతురిజోలికి రావలదని తీవ్రముగా హెచ్చరించి సంభాషణ ముగించెను.
ట్రింగ్.. ట్రింగ్ .. మరల దూరవాణి మ్రోగుచుండెను. పరికరము నుండి మాట్లాడు సాధనమును లేపి సందేశము విని నివ్వెరపోయెను. అమ్మా ఎందులకు నిశ్చేష్టటు లైనారు? అని కేశవుడడిగెను, “లకుమ వాహనమును నడుపుచుండ ప్రమాదం సంభవించెను, వాహనము బురదలో దిగిపోయి నడువకున్నది” మరుక్షణము కుర్రవాడు అమ్మగారూ మీరు ఆందోళనలో ఉన్నారు మీరు కోర్చొనిన నేను నడిపెదనని శ్వేతవాహనమును పరుగెత్తించెను. ఒక గంట తర్వాత వూరికి దూరముగా నున్న నిర్జన ప్రదేశమునకు జేరెను. అచ్చట ముగ్గరు అమ్మాయిలు నిలబడి యుండిరి, కేశవుడు వారియొద్ద వాహనమును నిలిపగా అరుణతార దిగి లకుమను చూసి ఏమి జరిగెనని కంగారుగా అడిగెను. పక్కనున్న అమ్మాయిలు " ఎవరో తుంటరికుర్రవాళ్లు మమ్ము ఏడిపించవలెనని , కొద్దిగా రాసుకునిపోయినారు , లకుమ కంగారున వాహనమును రహదారిపక్కనున్న గుంతలోకి దింపివేసెను.
వాహనమును పరికించి చూసి "పెద్ద దెబ్బయే తగిలినట్లు గోచరించుచున్నది. బురద అంటుకొని ఉండుటవలన స్పష్టముగానగుపడుటలేదుగానీ, ఇది చిన్నగా రాసుకొనిపోవుటకాదు నిజము చెప్పినచో సరే, లేనిచో మీ తల్లితండ్రులను పిలిచి మాటలాడెదను అని అరుణతార పలుకగా లకుమ స్నేహితులు బిక్క మొఖమువేసి " ఇందు మాతప్పుఏమియునూ లేదు మేము ఎంత వద్దని చెప్పిననూ మీ అమ్మాయే వారిని కవ్వించినది. అతి వేగముగా నడుపుచూ వారికి తోవ ఇవ్వక కవ్వించుటవల్ల స్పర్ధ పెరిగి పందెమునకు దారితీసేను. అనిచెప్పగా వారిని పరిశీలించుచుండగా మాకు పెద్ద దెబ్బలేమియునూ తగలలేదు. కానీ యంత్రము స్తంభించి, వాహన ప్రారంభము కాకున్నది అనిరి. కేశవుడు యంత్రముకప్పు తీసి పనిముట్లనుపయోగించి పనిచేయుచున్నాడు.
"మీ డ్రైవర్ కి మరమత్తు చేయుటవచ్చునా ?" లకుమను ఆమె స్నేహితులడిగిరి . ఇది చాలా ఖరీదైన వాహనము చెడినచో.... అని వారు భయపడుచుండ "చిన్నమ్మగారు నేను, ఒక యంత్రకారునివద్ద పనిచేయుచుండెడివాడను నేనునూ యంత్రకారుడునే, సందేహము వలదు. అని పని ముగించి యంత్రమును తాళము తో ప్రారంభించెను. బురదనుండి వాహనమును తప్పించి చిటికలో రహదారి పై నిలిపెను. పద్మాకరంబున సూర్యదీప్తిచే ప్రకాశించుచున్న తామరలవలె ఆ పూబోణుల మొఖములెల్ల ఆనందమతిశయించ వెలిగిపోయినవి.
వారిని ఇంటివరకు అనుసరించి జరిగిన విషయమును తల్లితండ్రులకు విశిదీకరించి ఇంటికి జేరుసరికి నిశరాత్రి కావచ్చెను. లకుమ కొంచెము మత్తు లో సోలుతున్నట్టు గమనించెను అది నిద్రమత్తా లేకా నిషామత్తా యనునది తెలియక అరుణతార కలవరపడి, లకుమ స్నానమునకు పోయిన తరువాత కేశవుని ప్రశ్నించగా అపరాహ్ణవేళ విందు జరిగెనని, చిత్ర గారు సీసా పట్టుకుని వచ్చినారని విందులో త్రాగినారని క్లుప్తంగా చెప్పెను. కోశాధికారి కోటీశ్వరరావు గారు కూడా వచ్చెచ్చిరని చెప్పి అయితే తాను చెప్పినట్టు చెప్పవలదని కోరెను . లకుమ నేరుగా పడకగదికి పోవుచుండగా వారించి కేశవుడికి లకుమ భోజనము వడ్డించెను, భోజనము ముగించిన పిదప కేశవుడు పోయి పడుకొనెను.
తల్లీ కూతుళ్ల మధ్య సంభాషణ జరిగెను
అపరాహ్ణవేళ ఏమి జరిగెను ?
ఏమియునూ జరగలేదు.
ఏమీ జరుగనున్న చిత్ర ఏల వచ్చెను? కోటేశ్వరావు ఏల వచ్చెను?
నీకివన్నీ ఎవరు జెప్పినారు ?
ఎవడో వల్లకాట్లో రామనాథాయ! నిజమా అబద్ధమా ?
మౌనం .... ........
వాడికి నీవయసు కూతురున్నదని గమనింపుము.
ఒక్కచరవాణిని కొని ఇమ్మన్న ఇవ్వవు అతడు నాకు విద్యార్థి ఋణమును మంజూరు చేసెను ఇంకనూ ఏమైనా కావలసిన ఇచ్చెదనని వాగ్దానము చేసెను. నేనతడిని ఒక తండ్రివలె చూచుచున్నాను కానీ నువ్వు నేరస్తురాలివలె చూచుచున్నావు.
నీవతడిని తండ్రివలె చూచుచున్ననూ అతడు నిన్ను కూతురివలె చూచుటలేదు అదితెలియక పిచ్చిదానివలె మాట్లాడుచున్నావు. నామాటలిప్పుడు కఠినముగానే తోచును. అది యట్లుంచిన చిత్ర విందు ఇచ్చుటకు కారణము?
ఆమెకు విడాకులు లభించెను. అందుకే ఆమె పండగ చేసుకొనుచున్నది. ఆ ఒక్క మాట అరుణతారకు తన గడిచిన జీవితము మొత్తమును మనోఫలకము మీద స్సాక్షాత్కరింపజేసెను. తాను భర్తనుండి విడిపోయిననూ అందుకెన్నడూ ఆనందించలేదు . ఈమె విడిపోవుటయే కాక విందు కూడా చేసుకొనుచున్నది అరుణ తారకు మెదడు స్తంభించెను
Super! Very interesting.
ReplyDeleteNice sir. Waiting to see the flash back of Arunataara in next episode
ReplyDeleteI like this novel and the way u write in native telugu
ReplyDeleteకేసవుడు వాయుంచు నాదమును మొదటి సారి పదాలతో చదివాను. అద్బుతం గురుగారు. చదువుతున్నంత సేపు ఒక ఉహ చిత్రం మెదులుతుంది. అబినందనలు
ReplyDelete