గచ్చిబౌలినందు“ద్వారక” యనునొక విలాసహార్మ్యము చక్కని ఉపవనముతో విలక్షణముగా శోభిల్లు చుండెను. తారాధిపుడు వెలసిపోయిననూ మబ్బు మందారముగా నుండుటచే సూర్య ప్రభ కానరాకుండెను. చెట్లమధ్య కౌజు పిట్టలు కూయుచుండెను చల్లగాలి వీచుచూ తెరిచివుంచిన కిటికీల ద్వారా శయన మందిర లోపలకి వచ్చి పలుచని లోవస్త్రములతో నిద్రించుచున్న లకుమని తాకెను. లకుమ కనులుతెరిచి కిటికీ గుండా ఆకాశమును చూచి చిటపట చినుకులు విని అతిశయపడి చిందులువారి, తల్లి గుర్తుకురాగా రాగమతిశయించి అమ్మా, అమ్మా అని పిలుచుచు ప్రక్కనున్న పడకగదిలోకి పరుగు తీసెను. పడక ఖాళీగా అగుపడుటతో ఆమె డెందము శూన్య మాయెను ముఖమున నిరాశ అలుముకొనగా " అమ్మ ఎప్పుడు ఆడి తప్పదు నేడేల ఇట్లు జరిగెనని అనుకొనుచుండగా మృదంగ వాదము ఆలాపన వలే వినుపించుచున్నది. ఎక్కడ చచ్చెనో కదా ఈ కేశవుడు అనుకొనుచూ పక్కనున్న మరొక పడక గది తలుపు తోసెను.
అచ్చట కేశవుడను పదునారేండ్ల పిల్లవాడు మృదంగ వాదనము చేయుచూ కనిపించెను. లకుమను చూడగానే కేశవుడు వాదనమాపి "అమ్మగారు వచ్చినారు. రాత్రి మీరు భోజనము చేసి పడుకొన్న తరువాత."
అని చెప్పేడు కేశవుడు. ఇంతలో పూజ గదిలో గంట
మ్రోగుతున్న చప్పుడు. తల్లిదగ్గరకి పరిగెట్టింది
లకుమ. స్నానం చేయకుండా పూజామందిరమునడుగిడరాదని చెప్పిననూ లేడిపిల్లవలె దుముకుచూ వద్దనివారించుచున్ననూ లకుమ
తల్లిపైబడెను. "అతిగా లాలించుటవల్ల పూర్తిగా
చెడినావు స్నానము చేసిరమ్మ"ని తల్లి కఠిన మభినయించిననూ " ఉహు హూ యని ఊగుచూ
తల్లి వద్దనే చిందులు వేయుచుడెను "అతి గారభమున నెత్తి నెక్కించుకొంటిని కదా అని కూతురుని ప్రేమతో కౌగిలించుకొని
ముద్దాడెను." దృతరాష్ట్రుని అతిగారాబము దుర్యోధనునకు చేటు దెచ్చెనని మరువకుము. అని మెల్లగా చెవియొద్ద
చెప్పెను. నీ బాల్య మిత్రురాలు దామిని నీకు తెలుగునంటించగా అది నా కంటించినావు , ఇప్పుడు
పురాణములు అంటించుచున్నావు అని లకుమ హాస్యమాడుచూ
త్వరలో నీవు హరికథా భాగవతారిణివి అగుదువేమోయని సందేహము కలుగుచున్నది అనెను.
తల్లి ఉత్తుత్తి కోపముతో కూతురివెంట పడగా కూతురు చిక్కక ఇల్లంతయూ పరుగెడుచుండెను. బల్లలు కుర్చీల చుట్టూ తిరుగుతూ , పక్కలమీద నుంచి
దుముకుతూ పరిగెడుచున్న లకుమ వెంట పడుచూ నీకూ.. నీకూ.. దేహశుద్ధి చేయవలె అనుచుండగా లకుమ స్త్నానలగదిలోకి
దూరి నా దేహశుద్ది నేను చేసికొందును నీకెందుకు శ్రమ అని తలుపువేసుకొనెను. డేనిమ్స్
జీన్స్ బిగుతైన టీ షర్ట్ ధరించి వచ్చిన లకుమని చూసి “షూటింగ్ కి పోవుచునట్లు ఎందులకీ ప్రయాస , గృహవస్త్రములు
ధరించుట మెరుగు కదా, అని అరుణతార అనెను. కేశవుడు వార్తాపత్రిక వచ్చెనని
లకుమ చేతినందుంచెను. పత్రిక లోనొక తావు కాగితమంతయూ
అరుణతార బొమ్మలతో కూడిన వ్యాసము చూసి " నిజము చెప్పవలెనన్ననీవునూ జీన్స్ ధరించవలెను. నీవు జీన్స్ ధరించినచో పురుషులు మతి స్తిమితమును
కోల్పోవుదురు. అనేక సార్లు జీన్స్, అనేక అధునాతన వస్త్రములను ధరించితివికదా నీవలె నేను..
అనుచుండ చూడమ్మా, పైమెరుగులు చూసి నేను వెళ్లెడిమార్గమున
వెళ్లవలెనని ఉవ్విళ్లూరు చున్నావు నేను వెళ్లెడిమార్గము
కడు కఠినము, నేను చూపిన మార్గమున నడిచిన అది శ్రేయస్కరము అని తల్లి అనుచుండగా లకుమకు
ఉల్లాసము జచ్చి అల్లాటము గల్గి చేతిలో నున్న దూరనియంత్రణ బిళ్ళను నొక్కి గోడపైనున్న దూరదర్శన పలకమును ప్రారంభించెను.
మాయ విజయోత్సవకార్యక్రమము ప్రసారమగుచుండెను
అరుణతార ముఖము పదేపదే తెరపై మెరియుచుండెను
ఆమె వంపుసొంపులు ప్రస్ఫుటమగుచుండ అకస్మాత్తుగా " వేదికపై ఆమె ప్రక్కనే కూర్చున్న
వ్యక్తిని జూసి " అమ్మా నిన్న నీతో పాటు నాయుడుగారు వచ్చారా? నాకు చలన చిత్రములలో
నటించవలెనని కోరికగా యున్నది , నీవు సిఫార్సు చేసిన నాయడుగారు కాదనరు , అమ్మ అమ్మా
... అంటూ బ్రతిమాలుతున్న లకుమ చిత్త చాపల్యమునకు ఎట్లు అడ్డుకట్ట వేయవలెనో తెలియక, ఆమె చేతిలోనున్న దూరనియంత్రణ మును చివాలున లాగి అంకించుకొని ఒక్క కసురున పథమును (ఛానెల్)
మార్చగా " హైదరాబాద్లో నేడు వెలుగు దేశం
పార్టీ సమావేశమునకు ఏర్పాట్లన్నీ పెద్దఎత్తున పూర్తి అయినవి అని సంధానకర్త చెపుతూ మహిళాధ్యక్షురాలు
అరుణతార వీడియో ని పదే పదే చూపుతూ
ఏదో చెప్పుచుండెను. నేను చదువుకోక ఈవృతిలోకి వచ్చితిని , వృత్తికోసం వేషం తప్పుటలేదు. ఈవృత్తి కంటే కత్తులపై నడుచుట మిన్న, నిన్ను చదివించుకుంటున్నది ఈ రొంపియందు లాగుటకు కాదు. అని అరుణతార అనెను. "డబ్బున్నచో చదువుకోకున్నను గౌరవము, గౌరవ డాక్టరేటు
పొందవచ్చు. డాక్టర్ అరుణతార అని వ్రాసుకొనవచ్చు. డబ్బు ఉన్నచో అన్నీ సుసాధ్యమగును కదా."అని లకుమ బదులు పలికెను
ఇరువురికీ ఫలహారము పట్టుకొచ్చిన కేశవుడు వాటిని
బల్లపైనుంచి " చిన్నమ్మగారూ మీరు కోప్పడనన్న చో నాదొకమాట అని అనెను. లకుమ సరే చెప్పమనెను. కేశవుడు " గౌరవ డాక్టరేటును పేరుముందు వ్రాసుకొన రాదు , కార్డులపై
ముద్రించ రాదు, అది విద్యాసంబంధిత అర్హత కానందున
చట్టప్రకారం అట్లు చేయకూడదట అనెను. మరి డాక్టర్ ఎం టీ ఆర్ డాక్టర్
, ఏ ఎన్ ఆర్ అని వ్రాసుకొనుటలేదా? చూబించుటలేదా?" "అది కూడా సరికాదు అని కేశవుడు
చెప్పుచుండ నీవా నాకు మంచి చెడ్డలు చెప్పుచున్నావు అని లకుమ అతడి చెంప చెళ్లు మనిపించెను. కేశవుడు తలదించుకుని వంటగదిలోకి వెడలిపోయెను. అంతలో
డ్రైవర్ వచ్చి అమ్మగారు అని దూరముగా నిలిచెను "నీ చేయి తరుచుగా లేచుచున్నది. అహంకార తిమిరము నిన్ను కమ్మివేసెను,
అని అరుణతార లకుమను గద్దించి పార్టీ సమావేశమునకు బయలుదేరెను.
బాగుంది
ReplyDeleteSir. Realy I liked the language in this episode
ReplyDeleteI really loved this novel other than the language
ReplyDeleteఒక్క ఆంగ్ల పదంలేకుండా ఈ నాటి పరిస్థితులను వివరించడం సామాన్యమైన విషయం కాదు.....అయినను ఒక వెలితి... వెలుగు దేశం పార్టి లో పార్టి పదాన్ని కూడా తెలుగులో చదవవలేనని ఉబలాటముగానున్నది.
ReplyDelete