పెద్ద బహుళ అంతస్తుల బజారులు మరియు సాంస్కృతిక కేంద్రాలతో చుట్టుముట్ట బడిన విశాఖపట్నం నగర నడిబొడ్డున సంపత్ వినాయక దేవాలయానికి సమీపంలో మేఘాలయ అను విలాస విడిదిగృహం (హోటల్) ఉన్నది. పది గంటలకు సందీపుడు కాఫీ శాలలోకి ప్రవేశించెను. జాజ్ సంగీతాన్ని ఆస్వాదిస్తూ తన స్నేహితుడు రాఘవ కోసం ఎదురుచూచుచుండెను. అతడు ఉద్యోగమునకు ధరకాస్తు చేసుకొనగా వారు ముఖాముకీ మేఘాలయ నందు ఏర్పాటుచేసి పిలిచిరి. ముఖాముకీ పదకొండు గంటలకు అయిననూ సందీపుడు ఒక గంట ముందుగా వచ్చికూర్చొనెను.
అప్ప్పుడే సబ్బవరం శాసన సభ సభ్యుడు సింహాచలం ఫార్ట్యూనర్ వాహనము దిగి తన మందితో లోనికి వచ్చుచున్నాడు. ఆ సమూహము నందు అందరూ తెల్లని బట్టలు ధరించిరి. తెల్లబట్టలు ధరించిన జంబారాయుడొకడు అతడి వెంట జాగిలమువలె నడుచు చుండెను. రాఘవ అద్దముల గుండా అంతా చూచుచున్నాడు పోలీసులు సుడిగాలివలె వచ్చి చుట్టుముట్టి అతడికి రక్షణ ఇచ్చుచున్నారు. వారు అతడి వెంట సేవకులవలె నడుచు చుండిరి. అది చూచి రాఘవకు నిస్పృహతో నవ్వు వచ్చెను. "రాజకీయ నాయకులకు బంటులవలె వ్యవహరించుటకే వీరు జీతములు తీసుకొనుచున్నారు. సామాన్య ప్రజలను చచ్చిననూపట్టించుకోని పోలీసులు పదవిలో ఉన్న నేతలు వచ్చిన చేయు హడావిడి ఇంత అంత కాదు." అనుకొనెను.
ఆ సమూహములో నుండి తెల్లని వస్త్రములు ధరించిన యువకుడొకడు అతడిని చూచి నవ్వెను. సందీపుడు తేరిపార చూచి అతడు బైరెడ్డి అని గ్రహించెను. ఆ సమూహము ఒక సమావేశ మందిరంలోకి వెడలెను. బైరెడ్డి వారితో లోనికి బోక సందీపుని వద్దకు వచ్చెను. "ఓరి బైరి ! నీవెప్పుడు రాజకీయములలో చేరితివిరా!" అని సందీపుడు వాడిని డొక్కలో పొడిచెను. "మా అన్న నాగిరెడ్డితో వచ్చితిని. నేడిక్కక పాత్రికేయుల సమావేశము కలదు. మాపార్టీ ఎం పీ గారు కూడా వచ్చుచున్నార"ని బైరెడ్డి నవ్వెను.
సందీపు: తగాదాలు, దొమ్మీలకుముందుడువారు మీరు. పాత్రికేయుల సమావేశములో మీ అన్నకేమి పని? నీకేమిపని?
బైరెడ్డి : అదేం మాట! ఎం. ఎల్. ఏ. గారు ఎచ్చటికి పోయిననూ మా అన్న వెంటబోవునని తెలియదా? చివరకు స్నానముల గదికి పోయినను....
సందీపు: పోయి వీపు తోమునా?
బైరెడ్డి : బైట వేచియుండును.
సందీపు: యువకునివలె రంగురంగుల ఆధునిక వస్త్రములు ధరించెడి నీవు తెల్ల వస్తములు ధరించి పెద్ద వారితో తిరుగుచున్నావు. కొత్తగా చర్చ్ స్థాపించినావు కదా దాని ప్రచారము చూచుకొనక రాజకీయములలో జేరినావే! పెద్ద వాడివైపోయినావురా!
బైరెడ్డి : పెద్దవాడిపనులు చేయుచున్నానో కుర్రవాడు చేయుపనులు చేయుచున్నానో చూచెదవు రమ్మని సందీపుని చేయిపట్టి కాఫీశాలనుండి విడిది అంతర్భాగము లోనికి తీసుకుపోయెను. వారిరువురూ నడవ (కారిడార్)లో నడుచుచుండిరి. అచ్చటనున్న ఒక గదిలో ఏబీసీ పతాకం నిర్మాత చలనచిత్ర కథానాయ నడవకిరువైపులా గదులు కలవు. నడవకిరువైపులా గదులు కలవు. బైరెడ్డి ఒక గది వద్ద ఆగి తాళము దిప్పి , కొద్దిగా తలుపు తీసెను. అచ్చట ఒక యువతి అర్థ నగ్నముగా మంచము పై పడుకొని యున్నది. సందీపుడు ఖంగు తినెను. బైరెడ్డి తలుపుమూసి
సందీపు: ఒరేయ్ వ్యభిచారిణిలతో కూడితివా ?
బైరెడ్డి: ఆమెవ్యభిచారిణి కాదు విద్యార్థిని. ఆమె పేరు సంధ్య లకుమతో కలిసి చదువు కొనుచున్నది . ఇప్పుడు చెప్పుము, యువకులు చేయుపనులు చేయుచున్నానా? అని వెకిలి నవ్వు నవ్వెను .
సందీపు: ఇవా యువకులు చేయుపనులు!!! యువతులను చెడగొట్టుచున్నావు కదరా!
బైరెడ్డి: నేను చెడగొట్టుట ఏమి అది ఒక ఆచార్యుడితో సహజీవనము చేయుచున్నది. ఆయన భార్య అనేక మార్లు రచ్చ జేసినది. అయిననూ వారు సంబంధమును కొనసాగించుటతో ఠాణాలో పిర్యాదు చేసినది. అట్లు మాట్లాడుకొనుచూ వారు కాఫీశాలకు పోయిఒక బల్ల వద్ద కూర్చొనిరి.
రాఘవ 10.30 గంటలకు వచ్చెను. "ఏంట్రా ఇంతాలస్యమా! సమయానికి రావాలని తెలీదూ !" అని సందీపుడ డిగెను. "ఇదేనా అమెరికా సమయపాలననిన, అమెరికా పోయి వచ్చినావెందుకూ సిగ్గులేదూ! అని బైరెడ్డి అనెను.
"నేను అమెరికా పోయివచ్చినానే కానీ అమెరికావాడిని కాను. భారతీయుడను."అని బైరెడ్డితో అని సందీపు తో "ఒరేయ్ సందీపు నీవు తరగతులకు ఎన్నడైననూ సమయానికి వెళ్లితివా? నీవు నన్నాడువాడవా? నీకుండవలెనురా సిగ్గు!" "మీ చదువులు ముగిసి రెండేళ్లయినది. ఇప్పుడు తరగతుల గోలందుకు ఉద్యోగములు చూచుకొనక"ని బైరెడ్డి అనెను.
రాఘవ: రెండేళ్లనుంచి ఆ పని మీదే ఉన్నామురా! ఈ సారి విజయము తథ్యము.
బైరెడ్డి: ఎందుకొచ్చిన ఆందోళన, నావలె కుటుంబ వ్యాపారము చేసికొనక! సందీపుడి తండ్రి కోట్లకు పడగలెత్తిన వ్యాపారి, రాఘవ పేరుమోసిన తండ్రి సినిమా దర్శకుడు. మీరు ఉద్యోగముల వెంట పడుట నాకు సిగ్గుగా యున్నది.
సందీపు:మతములు మార్చే చర్చివ్యాపారి మానాన్న.అట్టి వ్యాపారము నేను చేయలేను.
సినిమా తీయుటకు శక్తి లేకున్ననూ ఆస్తులమ్ముకొని రోడ్డెక్కిన దర్శకుడు మానాన్న.
బైరెడ్డి: అయిననూ ఒకప్పటి పేరుమోసిన దర్శకేంద్రుడు కదా!
రాఘవ: మానాన్న పరదేశి నాయుడు ఏ పేరు మోసెనో నేను బాగుగా నెఱుగుదును. పొలము పుట్ర నగ నట్రా అమ్ముకొని చలనచిత్రములు నిర్మించి దివాలా తీసి దివాలా నాయుడుగా, స్త్రీలోలుడగుటచే కాసనోవా అని పేరుమోసెను. అతడు చేసిన అప్పులను మాకుటుంబము మోయుచున్నది. అతడు అమ్ముటకు ఒక చిత్ర మందిరము మేముండు ఇల్లు మాత్రము మిగిలినవి. అదియునూ అమ్మకముందే నేను ఉద్యోగము చూసుకొని మా అమ్మను తీసుకు పోవలెను.
సందీపుడు: నువ్వుండెడిది పాత పాడి పరిశ్రమ (డైరీ ఫార్మ్) ప్రాంతంలో. అది ఇక్కడికి దూరం కాదు, అయినా అరగంట ఆలస్యంగా వచ్చితివి. నేను నేను సబ్బవరం నుండి ఇక్కడికి 10 గంటలకే చేరుకొంటిని.
రాఘవ: నీవు ముందు వచ్చి ఏమి చేయుచున్నావు? కాఫీ తాగి ముఖాముఖీ కి పోవలెను.
సందీపుడు ఏమి చూచినాడో చెప్పెను. బైరెడ్డి ముసిముసి నవ్వులు నవ్వెను. లకుమన్న నీకు పిచ్చని నాకు తెలియును కానీ లకుమను చెడగొట్టవలదని రాఘవ బైరెడ్డిని వేడెను. "లకుమ మంజూష వంటి అందగత్తెలను, పెద్ద కుటుంబములవారిని పెండ్లి యాడెదను. నీవలె ఫారెస్టు బంగ్లాలో ప్రశాంతముగా నివసించెదను కానీ చెడగొట్టన" ని బైరెడ్డి నవ్వెను.
రాఘవ: నేను ఫారెస్ట్ బంగ్లాలో నివసించుట లేదు. ఫారెస్ట్ బంగ్లాదారిలో నివసించుచున్నాను.
సందీపుడు : "ఓహ్! ఫారెస్ట్ బంగ్లా దారి కొండలతో మరో అరకు లోయవలె యుండును "
రాఘవ సందీపుడితో: కానీ మీనాన్న చర్చ్ స్థాపించి ప్రశాంతతను పాతిపెట్టి శబ్ద యంత్రములతో మాయ తంత్రములతో ప్రజలను పిచ్చివాళ్లను చేయుచున్నాడు.
సేవకుడు అందరికీ కాఫీ తెచ్చెను.
సందీపు:వాళ్ళు కేవలం ప్రార్థనలు చేయడం లేదు. మత మార్పిడులు చేయుచున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భూములను ఆక్రమించింది. మిషనరీలు మనసులను ఆక్రమించుచున్నారు. భారతదేశంలో మహమ్మారి సమయంలో 50,000 గ్రామాలలో 50,000 చర్చిలను నిర్మించారు. ఈ మహమ్మారి గత 25 సంవత్సరాలలో కంటే ఎక్కువ మత మార్పిడులకు కారణమైనది. ఈ మహమ్మారి వారికి మత మార్పిడిలో విజయం సాధించడానికి వీలు కల్పించినది.
రాఘవ: వారు విష్ణు సహస్రనామాన్ని క్రీస్తు నామావళిగా క్రీస్తు ను విష్ణువు యొక్క తాజా అవతారంగా నమ్మించి గ్రామస్తులను మోసగించుచున్నారు. మొన్ననే సరస్వతి వీణను యేసు చేతిలో బెట్టి సరస్వతీ పూజకు బదులు యేసు పూజ నిర్వహించించినారు. వారిప్రచారము వారు జేసుకొనక విగ్రహారాధనను దెయ్యాల ఆరాధన అని జెప్పుచూ హిందూ మతంపై ద్వేషాన్ని వ్యాపింపజేయుచున్నారు. అంతేకాక జీవితంలోని అన్ని కష్టాలకు కారణం 'అబద్ధపు దేవుళ్లను' పూజించటే యని నమ్మబలికి ప్రజలను క్రైస్తవం లోకి మార్చుచున్నారు .
సందీపు: గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 60% కంటే ఎక్కువ మంది క్రైస్తవ మతంలోకి మారిరి. ఆంధ్రప్రదేశ్‌లో 10,000 పెద్ద మరియు సంపన్న చర్చిలు కలవు.
రాఘవ: క్రైస్తవ మిషనరీలు హిందూ లేదా బౌద్ధ లేదా సిక్కులు అధికంగా ఉన్న గ్రామాలను ఎంచుకొందురు. మహమ్మదీయులున్న ప్రాంతములకు, ఊళ్లకు వీరు బోరు.
బైరెడ్డి : ఎక్కువగా ప్రజలు ఈ మధ్య క్రైస్తవం లోకి వచ్చుచున్నారు. అందుకే నేను చర్చ్ స్థాపించితిని.
రాఘవ: వారెక్కడ వచ్చుచున్నారు ఎరవేసిచేపను లాగినట్టు మీరు లాగుచున్నారు. కానీ ఎట్లన్నది అంతు చిక్క కున్నది.
బైరెడ్డి : మతం మారు వారికి లేని సమస్య మీకేల?
సందీపు: ఇది చట్టవిరుద్ధం కాదా! మాయ మాటలు చెప్పి మతం మార్చుట చట్ట విరుద్ధము. దానికి శిక్ష పడును.
బైరెడ్డి: నీ బొంద, నేటి ఉదయము ఆరు గంటలకు వాహన పందెములు జరిగినవి ఆశీలుమెట్ట విశ్వవిద్యాలం దారిగుండా పెక్కు మంది విద్యార్థీ విద్యార్థినులు ఈ పోటీలో పాల్గొనిరి.ఇంత బాహాటంగా ద్విచక్రికా పందెములు పలుమార్లు జరిగినప్పటికీ చట్టము ఏమి జేసినది ? అంతెందులకు ఈ పత్రికా సమావేశము ఎందులకు తెలుసునా?
ముఖ్యమంత్రి సోమినాయుడి కొడుకు స్త్రీలోలుడని తెలియును కదా. అతడు ప్రజా దర్బారు నిర్వహించునపుడు వచ్చిన ఒక స్త్రీని తన పడక గదికి లాక్కొని పోయెను. అవి బైటకి పొక్కగా, అతడి రాసలీలలను ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించెను. దానితో స్థానిక నాయకులు ప్రతిపక్ష నాయకుణ్ణి హెచ్చరించుచూ, ముఖ్యమంత్రి కొడుకు గొప్పతనమును తెలియజేయుటకు ఈ పత్రికా సమావేశము నిర్వహించుచున్నారు.
రాఘవ: ఓరి కీచకులారా! ముఖ్యమంత్రి కొడుకు గొప్పవాడా!!
బైరెడ్డి: రాజకీయ నాయకులందరూ కూడా గొప్పవారేకదా !!! సినిమా దర్శకులుకూడా గొప్పవారే. ఆ శ్లేష కర్థము తెలిసిన రాఘవ తలదించుకొనెను. అప్పుడే కాఫీ కోపములు తీసుకుపోవుటకు వచ్చిన సేవకుడు వారనేమున్నది నేటి కాలమున విద్యార్థులు కూడా గొప్పవారే" అని నవ్వుతూ చల్లగా వెడలిపోయెను.
చట్టము పోలీసులకు పట్టదు. తప్పుచేసిననూ ఎవ్వరినీ పట్టుకొనరు. కానీ నీకు నీతి యుండవలెను కదా.
బైరెడ్డి: ఎందుకు పట్టుకొనరు అమాయకులను పట్టుకొందురు. ఆయేషా హత్యలో ఏమి జరిగినది? అటులనే నేటి ఉదయమున సూర్యోదయమునకు ముందు సాగర తీర రహదారి లో ద్విచక్రికా విన్యాసములు చేయుచున్న లకుమను మరికొందరు విద్యార్థులను పోలీసులు వాహనం మెక్కించినారు.
రాఘవ: అయ్యో మరి నీవు ఏమిచేయుచున్నావు?
బైరెడ్డి: నేను పందెములో వాయువేగముతో నడుపుచున్నాను. నేనెట్లు ఆపగలను?అయినా లకుమతల్లి కథానాయకి రాజకీయ నాయకురాలు కూతురు గూర్చి ఆమె చూసుకొనును. మనకెందుకా సమస్య"ని బైరెడ్డి అచ్చటకు వచ్చిన స్త్రీ తో వెడలి పోయెను.
రాఘవ: నీకు నీ అన్నకు ఏ సమస్య లేదు! అని నిర్వేదంగా నవ్వుచుండెను
సందీపుడు: వాడికి సమస్య లేదు! సమస్య నీకే, ఎందుకనిన వాడు మాదక ద్రవ్యముల వ్యాపారంలో ఉన్నాడు. వాడి స్నేహితులు కూడా అదే పని చేస్తున్నారు.
నిజమా అని రాఘవ నిర్ఘాంతపోవగా మరి అతడి విలాసములకు డబ్బెక్కడినుంచి వచ్చుచున్నది? అని సందీపుడనెను.
సందీపుడు: పోలీసులకు చిక్కువారు అమాయకులే. నాయస్థానములు కూడా చిన్నవారినే సులభముగా శిక్షించును. రాజస్థాన్లో దినేష్ కుమార్ గుప్త అను న్యాయమూర్తి, వ్యాపార దిగ్గజం అదానీ తప్పు ఉన్న కారణంగా జరిమానా విధించెను. కానీ తీర్పు ఇచ్చిన రోజే ఆ న్యాయమూర్తి బదిలీ అయ్యెను. తరువాత అతడిచ్చిన తీర్పు కొట్టివేయబడెను. ఢిల్లీ న్యాయమూర్తి వర్మ గారింట్లో పెద్ద ధనాగారమే దొరికిననూ ఆయనను కేవలము బదిలీ చేసి సరిపుచ్చినారు.
రాఘవ: ఈ రోజుల్లో చాలా మంది కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యములు సరఫరా చేయుచున్నారని చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థులు బహిరంగంగా మాదక ద్రవ్యములమ్ముతున్నారు. పది శాతం మాదక ద్రవ్యములు చెన్నై కళాశాలలకు చేరుచున్నవి. పంజాబ్‌లో 3 మిలియన్ల కంటే ఎక్కువ మంది మాదక ద్రవ్యములకు బానిసలని, పంజాబ్‌లో ప్రతి మూడవ విద్యార్థి మాదక ద్రవ్యములకు బానిసని పంజాబ్ హైకోర్టు చెప్పినది. ఉడతా పంజాబ్ చిత్రము నందదియే చూపినారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మరియు విశాఖపట్నంలోని విద్యార్థులు మాదక ద్రవ్యముల సరఫరా చేయుచున్నారని వార్తాపత్రికలందు వ్రాసినారు, కానీ మనలో ఒకరు డ్రగ్స్ వ్యాపారంచేయుచుట నిజంగా దిగ్భ్రాంతికరం.
సందీపుడు: ఇకపై అతను మనలో ఒకడు కాదు.
***
భారతవర్ష లకుమను విడిపించుటకు న్యాయవాదితో ఠాణాకి పోయి అచ్చట హేమ, సంధ్యలను చూసెను. పోలీసు అధికారి భారతవర్ష ను చూచి " భారతర్ష మీరా ! ఏమైనా పుస్తక విడుదల కార్యక్రమమా!" "కాదండి విద్యార్థినీ విడుదల కార్యక్రమము" అనెను. హేమ సంధ్యలు అప్పుడే తమ న్యాయవాదితో మరొక పెద్దాయనతో బయటకు పోవుచుండిరి. వర్షుడు విషయము విచారించగా ఠాణా అధికారి చెప్పిన మాటలు విని నివ్వెరపోయెను. "హేమ తాగి వాహనము నడుపుచూ పట్టుబడెను. సంధ్య ఎవరితోనో సహజీవనం చేయుచుండెను.
నెత్తిన పిడుగుపడి వానివలె వర్షుడు చూచుచుండగా ఠాణా అధికారి "సంధ్య తండ్రి ఉత్తముడు. స్త్రీ స్వేచ్ఛపై ఉదారంగా ఉపన్యసించుటయే కాక అభ్యాసములో కూడా చూపుచున్నాడు. వర్షుడి ముఖము తెల్లబారెను "అనగా అర్థమేమి?" అని వర్షుడు అడిగెను. "అనగా అతడు కూడా ఇట్టి సంబంధములను కలిగి యున్నాడు. అందుచే అతడు కూతురికి గట్టిగా జెప్పక మెతక వైఖరి చూపును. యథారాజా తథా ప్రజా! ఇదియే నేటి సమాజము" అధికారి వివరించెను.
"భాద్యలేని తలితండ్రులు , సచ్చీలత లేని నాయకులు వేలంవెర్రి విద్య , చెత్త చలన చిత్రములు సమాజమునకీ గతి పట్టించినవ"ని పోలీసు ఠాణా నుండి భారతవర్ష లకుమను, స్నేహాను విడిపించెను. ఆ రాత్రి లకుమను దామిని వద్దకు తీసుకువెళ్లి అప్పగించెను.
దామిని ఆవిషయమును దూరవాణిలో అరుణకు తెలియజేసెను. అరుణ డగ్గుత్తికపడి విలపించసాగెను. దామిని గ్రాహకమును లకుమకు అందించెను. ఇప్పుడు ఏమైనదని ఎందుకు రోదించుచున్నావు? అని లకుమ తల్లినడిగెను. "నీవు ఎద్దువి, మొద్దువి సుద్ధవి. నీ కెంత జెప్పిననూ జీవితం అవగతము కాకున్నద"ని అరుణతార నీతి చంద్రిక పోసి తలంటెను.
అరుణతార గొంతులో కోపము కంటే బాధ, బాధ కంటే ఆందోళన ధ్వనించు చున్నవి. లకుమ బెల్లంకొట్టిన రాయివలె, కొయ్య బొమ్మవలె నిలిచి కిమ్మనక వినుచుండెను. ఆమె ఉదాసీనత దామినిని దబ్బలము వలే గుచ్చెను. లకుమ చేతి నుంచి గ్రాహకమును కోడిపిల్లని గ్రద్ద తన్నుకుపోయినట్టు లాక్కుని "చెవిటివాని ముందు శంఖ మూదినట్లు ఎందుకీ వృధా ప్రయాస? నీ కూతురు కంగదు. ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు."అనెను. అరుణ "దాని కనులకు వయసు పొరలు కమ్మినవి. చదువు మానిపించి పెళ్లిచేసినగాని దాని తిక్క కుదరద"నెను.
వర్షుడు గ్రాహకమును చేకొని "లకుమ వాహన పందెములలో పాల్గొనలేదు. ఆమెకు వాహన క్రీడాశక్తి (మోటార్ స్పోర్ట్స్)మెండు. అది ప్రమాద కరమే కానీ చట్టవిరుద్ధం కాదు. పందేలు జరుగుతున్న తప్పుడు సమయంలో ఆమె సముద్ర తీరము వద్దకు వచ్చెను. క్రీడా దుస్తులు ధరించి యుండుటచే ఆమెను పోలీసులు తీసుకోపోయినారు. అది యాదృచ్ఛికం!"అని అరుణను అనునయించసాగెను.
కూతురు ఠాణాకు వెళ్లిన విషయం అరుణను కలచివేసెను. లకుమ ప్రవర్తనకు ఆవేదన జెంది దామినితో "చదువు కంటే సంస్కారము, ప్రవర్తన ముఖ్యము. దానికి చెడు స్నేహములబ్బినవి. చెడు స్నేహములు దెచ్చు చేటు తల్లిదండ్రుల గుండెల్లో కత్తిపోటేకదా! చదువు మానిపించి దానికి కల్యాణము చేయవలె" ననెను. ఆ మాటలు విని లకుమ "నీవు ఇప్పుడు చేయుచున్నది అదేకదా! క్షవర కళ్యాణము చేయుచున్నావు. ఎప్పుడూ జీవితము అద్దమువంటిది, ఆడది అరిటాకు వంటిదని
ఇట్లు పెద్దలు కాలము చెల్లిన సామెతలు చెప్పుచూ ముందు తరములకాంతిని హరించి తిరోగమనము పట్టించుచున్నారు . నాడు కౌరవులు నిండు కొలువులో కోడలిని కోకలిప్పి అవమానించిరి. నేడు నీవు కూతురిని అందరిలో అవమానించుచున్నావు. రాజకీయ ప్రాబల్యమున్ననూ పట్టించుకొనక నా ఖర్మకు నన్ను విడిచిపెట్టినావు. సంధ్య తండ్రి ఠాణాకు వచ్చి ఆమెను ఒక్క మాట అనకనే తీసుకుపో యెన"ననెను.
అది వాక్ధాటి యో వాగ్దాడి యో కాని ఆ వాక్కులు శరములవలె అరుణ హృదయమును చీల్చినవి. లకుమ వైఖరి వెల్లడయ్యి అరుణ కనుల ముందు అరుణ ప్రకాశము అంతరించి అంధకారమలిమెను. లజ్జావహమగు లకుమ అత్తిపిత్తి మాటలకు అరుణ అత్తపత్తి రెమ్మ వలె కృంగి పరితాపము చెందెను. "ఔరా ! ఔన్నత్యమనిన అదిగదా! నేటి తరానికి ఆదర్శమనిన అదియేకదా! " అనెను. మాటల తేలు మనసుని కుట్టిన పరితాపము పొక్కుట సహజమే కదా! " అరుణ మాటలు కూతురికి మాట్లు వేసెను.
లకుమ తూటాలు లేని ఖాళీ ఫిరంగి వలె నిలిచెను అరుణ శివంగివలె రేగి భారతవర్షతో "ఆ మొండిని, శిఖండిని స్టేషన్ నుండి ఎందుకు తీసుకువచ్చితివి? దాన్ని స్టేషన్‌లోనే పడి ఉండనిచ్చిన బుద్ధి వచ్చెడిది" అని అరుణ నిస్సహాయముగా అరవసాగెను.
మాలిని " లకుమ మంచి పిల్ల. పిల్లలిట్లు చెడిపోవుచున్నారనిన కాలప్రభావమే! వర్షుడు ఏమైనా కొత్తవిషయములు చెప్పినా లకుమ శ్రద్దగా వినియా నందించును. నేటి
కాలంలో లోకజ్ఞానం, గురుశిష్య సంబంధములులేని, కంఠస్తపు చదువులతో పిల్లలు తావులేని పూవులవలె, వ్యక్తిత్వము, ఆత్మ బలము, జీవిత గమ్యము లేక జీవన యాత్ర సాగించుచున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యముగా బ్రతుకుతల్లిదండ్రుల పిల్లలు ఇంకెట్లుందురు . అమాయకులనాడిపోసుకొనుట అనుచితము. పిల్లలను పెంచుట ఈ దామినికేమి తెలియును క్రమశిక్షణ అనిన కేకలు వేయుట అనుకొను మూఢ వనిత. మీ అమ్మాయికి మాయింట నుండి చదువుకొనవచ్చును. చక్కగా చదువుకొని మిమ్మలిని మించి పోవును. మిమ్మలిని నేనెరుగను కానీ దామిని నాబాల్య స్నేహితురాలు నాకు మీ గురించి చెప్పుచుండును"మాలిని నోట వచ్చు మాటలు పూజా మంత్రములవలె నున్నవి. అరుణతో సహా అందరూ ఊపిరి నిలిపి వినుచుండిరి.
"మీ మనసు వెన్నవంటిది. మీ దీవెన వెన్నెల కంటే చల్లన"ని మాలినితో పలికి "లకుమా వింటివా మాలినిగారు నీకు అమ్మ, వర్షుడు అన్నయ్య, మంజు చెల్లి. వారి స్నేహము నీ అదృష్టము. వారింటి వాతావరణమే క్రమశిక్షణ వారితో సంభాషణే చదువు. "అని చెప్పెను. దామిని లకుమవైపు తిరిగి పరీక్షలుముగిసినవి కదా హైదరాబాదు పోయి సెలవులలో అమ్మవద్ద ఉండి రమ్ము. ఇకనైననూ మగరాయుడి వలె కాక ఆడపిల్లవలె యుండవలెన"ని లకుమ బుగ్గలు పొడిచెను. లకుమ చెంపలు రుద్దుకొను
చుండగా మాలిని లకుమ చెంపపై ముద్దుపెట్టుకొనెను.
***
గచ్చిబౌలినందు“ద్వారక” యనునొక విలాసహార్మ్యము చక్కని ఉపవనముతో విరించి యాత్మను ఆవిష్కరించుచున్నది. తారాధిపుడు వెలసిపోయిననూ మబ్బు మందారముగా నుండుటచే సూర్య ప్రభ కానరాకుండెను. చెట్లమధ్య కౌజు పిట్టలు కూయుచుండెను చల్లగాలి వీచుచూ తెరిచివుంచిన కిటికీల ద్వారా శయన మందిర లోపలకి వచ్చి పలుచని లోవస్త్రములతో నిద్రించుచున్న లకుమని తాకెను. లకుమ కనులుతెరిచి కిటికీ గుండా ఆకాశమును చూచి చిటపట చినుకులు విని అతిశయపడి చిందులువారి, తల్లి గుర్తుకురాగా రాగమతిశయించి అమ్మా, అమ్మా అని పిలుచుచు ప్రక్కనున్న పడకగదిలోకి పరుగు తీసెను. పడక ఖాళీగా అగుపడుటతో ఆమె డెందము శూన్య మాయెను. ముఖమున నిరాశ అలుముకొనగా " అమ్మ ఎప్పుడు ఆడి తప్పదు నేడేల ఇట్లు జరిగెనని అనుకొనుచుండగా మృదంగ వాదము ఆలాపన వలే వినుపించుచున్నది. ఎక్కడ చచ్చెనో కదా ఈ కేశవుడు అనుకొనుచూ పక్కనున్న మరొక పడక గది తలుపు తోసెను.
అచ్చట కేశవుడను పదునారేండ్ల పిల్లవాడు మృదంగ వాదనము చేయుచూ కనిపించెను. లకుమను చూడగానే కేశవుడు వాదనమాపి " రాత్రి మీరు భోజనము చేసి పడుకొన్న తరువాత అమ్మగారు వచ్చినార"ని చెప్పెను. ఇంతలో పూజ గదిలో గంట
మ్రోగుతున్న చప్పుడయ్యెను. లకుమ లేడిపిల్లవలె తల్లివద్దకు పరుగెత్తెను. స్నానం చేయకుండా పూజా మందిరమునడుగిడరాదని చెప్పిననూ, వద్దని వారించుచున్ననూ, లకుమ తువ్వాయి వలె దుముకుచూ చిలకవలె కిలకిలా రావములు చేయుచూ తల్లిపైబడెను.
"అతిగా లాలించుటవల్ల పూర్తిగా
చెడినావు స్నానము చేసిరమ్మ"ని అరుణ ఘీంకరించెను. అయిననూ లకుమ పట్టించుకొనలేదు. తల్లి కఠిన మభినయించి ననూ "ఉహు ...హూ.. యని ఊగుచూ
తల్లి వద్దనే చిందులు వేయుచుడెను "అతి గారభమున నెత్తి నెక్కించుకొంటిని కదా! అని కూతురుని ప్రేమతో కౌగిలించుకొని
ముద్దాడెను. ప్రేమచందన చర్చనమున లకుమ ఓలలాడుచుండగా
"దృతరాష్ట్రుని గారాబము దుర్యోధనునకు చేటు దెచ్చెనని మరువకుము." అని మెల్లగా లకుమ చెవియొద్ద
చెప్పెను. నీ బాల్య మిత్రురాలు దామిని నీకు తెలుగు నంటించగా అది నా కంటించినావు, ఇప్పుడు
పురాణములు అంటించుచున్నావు" అని లకుమ హాస్యమాడుచూ "త్వరలో నీవు హరికథా భాగవతారిణివి అగుదువేమోయని సందేహము కలుగుచున్నది." అనెను.
తల్లి ఉత్తుత్తి కోపముతో కూతురివెంట పడగా కూతురు చిక్కక ఇల్లంతయూ పరుగెడుచుండెను. బల్లలు కుర్చీల చుట్టూ తిరుగుతూ, పక్కలమీద నుంచి
దుముకుతూ పరిగెడుచున్న లకుమ వెంట పడుచూ "నీకూ.. నీకూ.. దేహశుద్ధి చేయవలె"ననుచుండగా లకుమ స్త్నానలగదిలోకి
దూరి "నా దేహశుద్ది నేను చేసికొందును నీకెందుకు శ్రమ!" అని తలుపువేసుకొనెను.
ప్రియ తులోరుకములను(ఫేవరెట్ జీన్స్)బిగుతైన అంతర్యుక్తము(టీ షర్ట్)ను ధరించి వచ్చిన లకుమని చూసి అరుణతార “ సిపాయి దళమున జేరినావా? దండయాత్రకు పోవునట్లు ఎందులకీ ఆహార్యము?! గృహ వస్త్రములు
ధరించుట మెరుగు కదా! ఈ వస్త్రములు ఏమిబాగున్నవి?" అనెను. "వెండితెర తారవు నీవు ఇట్టి సాధారణ చీర ధరించుట ఏమిబాగున్నది? నీవు తులోరుకములను ధరించినచో
అయస్కాంతమువలె ఆకర్షించగలవు. నీవు చేయవలసిన పనిని నేను చేయుచున్నాను." "ఆకర్షించి ఏమి జేయవలెను! అని అరుణ తార జీవము లేని నవ్వు నవ్వెను. ఆ నవ్వు ఎంత నీరు పోసిననూ ఓటికుండ నిండునా! అన్నట్టున్నది.
"నేను చలన చిత్రములలో మాత్రమే అధునాతన వస్త్రములను ధరించితిని. నిత్య జీవితములో ఎచ్చటికి పోయిననూ మన సంప్రదాయముననుసరించి చీర కట్టుకొని పోయెదను." అనెను.
కేశవుడు వార్తాపత్రిక వచ్చెనని
లకుమ చేతినందుంచెను. పత్రికలో నొక ఠావు కాగితమంతయూ
అరుణతార బొమ్మలతో కూడిన వ్యాసము చూసి" లకుమ నా స్నేహితురాండ్రు అందరూ నా అదృష్టమును కొనియాడుచున్నారు. నేను కూడా చలన చిత్రములలో చేరినచో ఆంధ్రావని అంతయూ జై జై నాదములు చేయును." అనెను ఒక్కరోజులో ఈ మందమతిని ఉద్దరించుట సాధ్యమనుకొని మిన్నకుండెను. లకుమకు ఉల్లాసము జచ్చి అల్లాటము గల్గి చేతిలో నున్నదూరనియంత్రకమును నొక్కి గోడపైనున్న దూరదర్శనమును ప్రారంభించెను. మాయ విజయోత్సవకార్యక్రమము ప్రసారమగుచుండెను అరుణతార ముఖము పదేపదే తెరపై మెరియుచుండెను. ఆమె వంపుసొంపులు ప్రస్ఫుటమగుచుండ అకస్మాత్తుగా " వేదికపై ఆమె ప్రక్కనే కూర్చున్న వ్యక్తిని జూసి " అమ్మా నీతో పాటు యున్నది నాయుడుగారు కదూ? నీవు సిఫార్సు చేసిన నాయడుగారు కాదనరు, అమ్మ అమ్మా ...అని బ్రతిమాలుతున్న లకుమ చిత్త చాపల్యమునకు ఎట్లడ్డుకట్ట వేయవలెనో తెలియక, ఆమె చేతిలోనున్న దూరనియంత్రకమును చివాలున లాగి అంకించుకొని ఒక్క కసురున పథమును (ఛానెల్)మార్చెను. "హైదరాబాద్లో నేడు వెలుగు పార్టీ సమావేశమునకు ఏర్పాట్లన్నీ పూర్తి అయినవి అని సంధానకర్త వెలుగు పక్షం (పార్టీ) మహిళాధ్యక్షురాలు అరుణతార దృశ్యపరిషద్ ను పదే పదే చూపుతూ ఏదో చెప్పుచుండెను.
రాజకీయములలో చేరెదవా అట్లయిననూ మంచి పేరు సంపాదించుకొనవచ్చు? అనెను. లకుమ" ఛీ వెధవ రాజకీయములు నాకు సరిపడవు. చలన చిత్రములే నా అభిమతము." అనెను
నా పూర్వపాపకార్యములు నిన్ను వెంటాడుచున్నావన్నమాట, పెద్దలు చేసిన పాపములు పిల్లలకు తగులని మా అమ్మ చెప్పెడిది. పైమెరుగులు చూసి నేను వెళ్లెడిమార్గమున
వెళ్లవలెనని ఉవ్విళ్లూరు చున్నావు నేను నడిచిన మార్గము మిక్కిలి ప్రమాదకరమ"ని అరుణ అనెను. "అమ్మ చూపిన మార్గమున నడిచిన అది శ్రేయస్కరమ"ని కేశవుడు నోరుజారెను.
ఆ మాట లకుమకు ఆవకాయ కారమువలె తోచి హృదయము భగ్గుమని మండి కేశవుని చెంప పగులగొట్టెను. అరుణ లకుమవైపు ఉరిమి చూచెను.
నీవు విశాఖ పట్నము పొమ్ము నా ప్రాణాలుతినివేయుచున్నావు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చెనని నీ సెలవలు నా ప్రాణమునకు వచ్చినవి. నేను చదువుకోక ఈవృతిలోకి వచ్చితిని , వృత్తికోసం వేషం తప్పుటలేదు. ఈవృత్తి కంటే కత్తులపై నడుచుట మిన్న, నిన్ను చదివించుకుంటున్నది గౌరవంగా బ్రతుకుటకు ఈ రొంపియందు లాగుటకు కాద"ని అరుణతార అరిచెను .
"డబ్బున్నచో చదువుకోకున్నను గౌరవము, గౌరవ డాక్టరేటు
పొందవచ్చు. డాక్టర్ అరుణతార అని వ్రాసుకొనవచ్చు. డబ్బు ఉన్నచో అన్నీ సుసాధ్యమగును కదా."అని లకుమ బదులు పలికెను.
ఇరువురికీ ఫలహారము పట్టుకొచ్చిన కేశవుడు వాటిని
బల్లపైనుంచి " చిన్నమ్మగారూ మీరు కోప్పడనన్నచో నాదొకమాటనెను. లకుమ సరే చెప్పమనెను. కేశవుడు "గౌరవ డాక్టరేటును పేరుముందు వ్రాసుకొన రాదు, కార్డులపై
ముద్రించ రాదు, అది విద్యాసంబంధిత అర్హత కానందున
చట్టప్రకారం అట్లు చేయకూడదనెను.
నీవా నాకు మంచి చెడ్డలు చెప్పుచున్నావు అని లకుమ కేశవుడి చెంప చెళ్లు మనిపించెను.కేశవుడు తలదించుకుని వంటగదిలోకి వెడలిపోయెను. అంతలో వాహన చాలకుడు వచ్చెను. అరుణ సమావేశమునకు సమయమగు చున్నది "అహంకార తిమిరము నిన్ను కమ్మివేసినది. నీ చేయి తరుచుగా లేచుచున్నది." అరుణతార లకుమను గద్దించి పార్టీ సమావేశమునకు బయలుదేరెను.

బాగుంది
ReplyDeleteSir. Realy I liked the language in this episode
ReplyDeleteI really loved this novel other than the language
ReplyDeleteఒక్క ఆంగ్ల పదంలేకుండా ఈ నాటి పరిస్థితులను వివరించడం సామాన్యమైన విషయం కాదు.....అయినను ఒక వెలితి... వెలుగు దేశం పార్టి లో పార్టి పదాన్ని కూడా తెలుగులో చదవవలేనని ఉబలాటముగానున్నది.
ReplyDelete