Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, February 19, 2021

Bharatavarsha -132

భోజనములు ముగిసిన పిదప వచ్చిన అతిథులు సెలవు తీసుకొనుచూ  వెనుకకు మరలు చుండగా వర్షుడు “ప్రక్క భవనమందు పెళ్లివారికి విడిది ఏర్పాట్లు గావించబడినవి దూరముగా నున్న  హోటళ్లలో దిగినవారు కూడా ఈ రాత్రికిచ్చటే బసచేయవలెన”ని తెలిపెను. పెళ్లి బాజాలు అందిరి గుండెలలో మ్రోగుచున్నవి. ఎల్లెడలా ఉత్సాహపూరిత వాతావరణము నెలకొని ఆనంద నిలయములో తల్లుల హృదయములందు ఆనందము తాండవం చేయుచుండెను. బుచ్చమ్మగారు సర్రాజుగారు చందన బసవడు బయలుదేరుచూ వారిని సాగనంపుటకు వారిని అనుసరించు చున్న మాలినిగారితో  ప్రవేశద్వారం వద్ద  " రేపు కళ్యాణ మండపము వద్ద కలుసుకొందుము. " అనుచుండగా, బసవడు పార్వతిని క్రీగంట చూచుచూ బుచ్చమ్మగారిని ముద్దాడెను. పార్వతి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కినవి.   ఆమె కనులు బరువెక్కి వాలినవి. కృష్ణన్ గారు "బసవడి తెలివితేటలమోఘము  " అనుచూ అతడిని మెచ్చుకొనిరి. మీనాక్షి " ఈ తెలివి ఎప్పుడు నేర్చినావు? అనగా " ఆసుపత్రిలో నీ కొడుకువద్దే " అని బుచ్చెమ్మగారు అని  బదులు పలికినారు. నవ్వులు వెల్లి విరిసినవి. చంద్రమతి గారు పార్వతిని అక్కున జేర్చుకొనిరి. సర్రాజుగారి కుటుంబము బయలువెడలెను  

తరువాత పెంచలయ్యగారి కుటుంబము బయలుదేరుచుండెను. నందిని జరిగిన రభసకు చింతించుచూ వర్షునికి తన విచారమును తెలియజేయుచుండగా మాలినిగారు ఆమె నోరు మూసి "వివాహ వేడుకలకు నీ అలక వన్నెతెచ్చినది,"  అని నందినిని కౌగిలించుకొనిరి. అరుణ తార " మీ ఇరువురూ ఇట్లు మితముగా పోట్లాడుకొన్నచో హితముగానే యుండును." అని సంతోషముగా వారిని సాగనంపిరి. సందీపుడు మంజూష వైపు చూచి మందహాసము జేసి వర్షుని హత్తుకొనెను. వర్షుడు అతడి ఫాల భాగమున ముద్దిడెను . మంజూష పులకించి తల్లిని హత్తుకొనెను. పైడమ్మగారు కోడలి బుగ్గలు నిమిరుచుండగా విదిష నందిని చెవులో గుసగుసలాడుచుండెను. ఆమె మాటలు వినుచున్న నందిని కళ్ళు విప్పారినవి. 

 తులశమ్మగారు సుందరిని చంద్రమతి సుకన్యలు పార్వతి ని విడిది గృహములోకి కొనిపోయినారు. సుందరి వెడలు చుండగా అగస్త్యుడు తల్లివద్ద నిలిచి సుందరి వైపు  చూచుచుండెను. సుందరి  మీనాక్షి వైపు చూసెను. మనసునందు కూతూహలమున్ననూ  తల్లి వెనుకకుపోయి నిలిచెను. సుందరి వెనుకకు వచ్చి మీనాక్షి ముందు నిలిచెను. మీనాక్షి ఆమె కనులలో భావములు చదువుచూ కొద్దీ క్షణములు అట్లే నిలిచెను. మీనాక్షి పక్కకు తొలగగా  సుందరి  అగస్త్యులు ఎదురు బొదురు అయిపోయినారు. అనూహ్యమైన ఈ పరిణామమునకు సుందరి బెదిరి వెనుకకు తిరిగి  లేడిపిల్ల వలె తన తల్లి వద్దకు పోయి ఆమెను  కూడి  విడిది గృహమునకు పోయెను. 

రఘువరన్ జానకి గారు కూడా వారితో పాటుగా బయలుదేరినారు. లకుమ అత్త వద్దకు పోయెను. జానకి లకుమను ఎంతోగారము చేయగా "అత్తా చిన్నప్పుడు నన్నెప్పుడూ ఎత్తుకొని తిప్పెడిదానవు" అని లకుమగుర్తుచేసెను అప్పు డు  జానకి గారు " భుజములపై ఎత్తుకొని నేను గుండెలలో పెట్టుకొని అరుణ పెంచుకొన్న మీ అమ్మ నీ క్షేమము కొరకు ఎంత తల్లడినదో. నీ క్షేమము చూచుటకు అల్లుడిని అచ్చటకు పంపినది మీ అమ్మ, తల్లి ప్రేమ అర్ధమైనదా ! ఇకపై నిన్నెత్తు కొని తిప్పువాడు అల్లదిగో!"  అని వివేకుని చూపెను. లకుమ అత్తను కౌగిటచేరి కన్నీటి పర్యంతమయ్యెను . మధుబాల , నరేంద్ర  గారు వివేకుని కొనిపోవుచుండగా మధుబాల అరుణ వైపు చూసెను.   అరుణ తార  మధుబాల కలిసి క్రీగంట తమ బిడ్డలను చూచిరి . లకుమ వివేకులు నేత్రములతో సంభాషణ నెరుపుచుండ గా అది తెలుసుకొనుటకు వారు విఫల ప్రయత్నము చేయుచుండిరి.   మాలిని వారిని చేరి " ఇతరుల రహస్యములను ఛేదించు వృత్తి గలవాడి రహస్యములను నీవు ఛేదించ జాలవు, వారిని పోనిమ్ము  అని అరుణతో గుసగుసలాడెను.  నరేంద్ర గారు తన కుటుంబముతో బయలువెడలినారు. లకుమ తల్లి  కౌగిట చేరెను ఆమె నేత్రములార్ద్రము లాయెను. పిదప వర్షుడు లకుమను ఓదార్చెను  

అరుణ మాలిని వద్దకుచేరి ఆమెను కౌగిలించుకొనగా ఆమె కనుల నుండి  ఆనంద భాష్పములు  వర్షిచుచుండెను. మీనాక్షి వచ్చి ఆమె కన్నీరు తుడిచి  ఆమెను హత్తుకొనెను.  " మరి మేము హోటల్ కు పోయి బసచేసి రేపు కళ్యాణ మండపము వద్ద కలిసెదము " అని అరుణ అనుచుండగా మీనాక్షి కూడా అట్లే అనెను మాలిని వారిద్దరినీ రెక్కలు పట్టి మండువా గదిలోకి కొనిపోయి చుటూ ఉన్న ఆరు గదులు చూపుచూ "  ఇంత  ఇల్లు వున్నది ఉండుటకు కదా!”  అని నిగ్గ దీసెను.  మిగిలినవారు కూడా లోనికి ప్రవేశించి నారు.  

విదిష శేషాచలముగారు, మీనాక్షి యమున లు , అరుణ కృష్ణ లులకుమ వర్షులు సోఫాలపై కూర్చొనగామీనాక్షికి  నందిని పాట గుర్తుకువచ్చి ఆలాపన చేయుచుండెను. అరుణకు మీనాక్షి సంగీతము గుర్తుకువచ్చి " నీ పాటలందు అంత పడుచు ఊపు ఎట్లవచ్చె నో  అందరినీ ముంచెత్తి నావు కదా!"  అనెను, వర్షుడు " పాట లయందు ఊపు లతో రాష్టములెల్ల ఊగుచున్నవి." అనెను    యమున " అయ్యో అరుణమ్మ నీవు ఈమె పాటలయందు ఘాటు చూడలేదు నేన్ను చూపెదను అనుచూ కన్నడ ప్రేమ గీతములనుగుర్తు చేసెను. " మండువా గదిలో విద్యుత్ దీపములు నేత్రముల నలరించుచుండగా గాత్రము సంగీతము చెవులనలరించుచుండెను.  మాలిని  "వివాహమైన కొత్తలో నేనునూ వీణవాయించెడి దానను వర్షుడు నావద్ద వీణ నేర్చుకొనెను. మంజూషను గారము చేయుట వల్ల ఏమియూ నేర్చుకొనక లేక పోయెను. “ఏమీ నేర్చు కొనకుండుటేమి పెంకితనము , మంకుతనము  నేర్చినది.” అని విదిష అనగా మంజూష అలక నటించెను.  నావీణ వాదనము గాత్రము వారితోనే అంతరించింది. అని మాలిని వాపోవుచుండగా విదిష " అత్తా నీవు ఇప్పుడు కూడా తలచినచో  వీణ వాయించగలవు అని వాపోవుచున్న మాలినివద్ద వర్షుని వీణను పెట్టగా మాలిని తాకుటకు సయితము జంకుచుండెను . విదిష ఆమె తలపై చేయి వేసి నిమిరి ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూచి పాడమని సైగ చేసెను.  మాలిని వీణా వాదనము ప్రారంభించెను. పిదప అనూహ్యముగా గానము చేయసాగెను     

పుస్తక ధారిణి భాషా వాహినీ  శాంతిరూపిణీ కచ్ఛపి ధారిణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - అతులిత స్వర రాణీ  వీణా పాణి,  

అలసిన మనసును మురిపించు విరిబోణి అమరగాన మును అలరించుగీర్వాణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే  - 

మూలాధారిణి మంజుభాషిణీ  హంసవాహిని సూక్ష్మ రూపిణి –అతులిత  స్వరరాణీ వీణా పాణి

కోరి వేడుచూ కొలిచిన భక్తుని జ్ఞాన మార్గమున నడిపించు యోగిణి

నాదము నీవే,  వేదము నీవే,  వేదన బాపే భామిని నీవే  - 

యశో కారిణి ఆనందదాయిని వేద రూపిణి, కమల లోచని - అతులిత స్వరరాణీ వీణా పాణి

దుర్భోధ పీడిత దుర్లోక మూషిత నిర్దోష పురుషుల ముక్తి ప్రదాయిని

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - 

శుద్ధ స్ఫటిక రూపాయై ముక్తాలంకృత సర్వాంగ్యై నిష్కళాయై                                               

వాగ్మ్యై వరద హస్తాయై వరదాయై నమోనమః

దుర్బల మానస, ఉన్మాద పీడిత ఉన్మార్గ జీవుల కరుణించు మాలిని

నాదము నీవే, వేదము నీవే,  వేదన బాపే  భామిని నీవే - అతులిత  స్వర రాణీ

పాట  పూర్తి ఐన పిదప మాలినిని మగత ఆవరించి ఆమె వీణ పై అట్లే నిద్రించెను. ఆహా ఏమి వీణా వాదనము!  ఏమి గానము!  నందిని గానమును తలదన్నునట్లున్నది కదా ఎవరు రచించ ఈ గీతము నాలపించెనో కదా !! అని అందరూ సంభ్రమాశ్చర్యములను ప్రకటించిరి.  మా మా అమ్మ కేమాయెను ఇట్లేల సోలిపోయెను అని మంజూష అడుగుచుండగా విదిష " ఉదయమునుండి పనిలో తలములకలయిన పెద్దవారు అలసి సోలుటలో వింతయేమున్నది !  

ఆమెను కొలదీసేపు తాకరాదని చెప్పి విదిష శేషాచలము గారి తో విడిది ఇంటికి బయలుదేరెను. వారిని అగస్త్యుడు కేశవుడు సాగనంపి వచ్చుసరికి మాలిని నిద్రలేచి ఏమిజరిగినదని అడిగి తెలుసుకొని అచ్చెరువొందెను.  ఆటు పిమ్మట అరుణతారకు కృష్ణ కు ఒక గది యమునకు మీనాక్షికి ఒక గది ఇచ్చి మాలిని లకుమ మంజూషలను తన గదిలో కి తీసుకొని పోయెను. 


10 comments:

  1. వ్యక్తిగత కారణాల వల్ల అలసి, సొలసి విసిగి వేసారి మౌన సమాధి చెంది వివాహమునకు హాజరు కాలేకపోయాను. ఈ మూడు భాగములు చదివిన తర్వాత పెళ్ళి సందడి ఎంత మిస్ అయ్యానో అర్థం అవుతుంది. పాత్రలు మధ్య పొరపొచ్చములు లేకుండా , బంధాలు దెబ్బ తినకుండా కాపాడుతున్నారు. ప్రతీ అక్షరములతో భావుకత్వం కనపడుతుంది.

    ReplyDelete
  2. 130వ భాగంలో శ్లోకములు చాలా బాగున్నవి.

    ReplyDelete
    Replies
    1. సుబ్బన్న పండితుడు వరేణ్యుడు వర్షుని ఆశీర్వదించిన తీరు

      సరస కవిరాజ రసిక సురరాజ ఘనరాజ రాజ రాజదోష రాహిత్య, నిత్య సాహిత్య భోజ, మహిత సాహితీ మనో వల్లభా కీర్తి దుర్లభా, భక్తివిజయ జ్యేష్ఠ, విదిష శృంఖలిత శృంగార శ్రేష్ఠ , కృష్ణ క్రీడల దృష్టి ఘన కృష్టి మదన గోపాల కావ్య సృష్టిలుగు భక్తి పుష్టి కురియు నీదు నీలాల మీద క్రిష్ణనీలాల వృష్టి....మీకు నచ్చిందని వ్రాసారు

      ఇది ఒక పాఠకురాలి స్ఫూర్తి అంటే నమ్ము తారా?

      Delete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  4. Please listen to Bharatavarsha Title song (Nandini's song) in YouTube and leave a feedback

    ReplyDelete
  5. Malini"s Verna song in this episode is the the power of Vidisha. Compare this song with nandini song and tell me which is better?

    ReplyDelete
  6. https://www.youtube.com/watch?v=9ZdfF-MvFJ0 Bharatavarsha song link

    ReplyDelete
  7. మాలిని వీణ పాట - నందిని సంస్కృత కీర్తన రెండిటిలో ఏది బాగుంది ?

    ReplyDelete
  8. మాలిని గారి వీణ పాట విదిష లీల కావచ్చు, నందిని శ్లోకం ఆమె ప్రతిభకు నిదర్శనం కావచ్చు. కానీ నందిని శ్లోకం, మాలిని గారి వీణ పాట, సుబ్బన్న పంతులు గారి ఆశీర్వచన శ్లోకం అన్నింటా రచయిత ప్రతిభ, కృషి కనపడుతుంది. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నవి

    ReplyDelete