Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, November 17, 2019

తెలుగు పద్య మాధురి - పూలబాల


అమృత కామిని
సురంగ పుర వాహిని అభంగ సాగరగామిని  
అంబర సౌదామినిని  అచ్చెరువున కని
వలపు జ్వలిత లలిత సరస మధుర స్మిత 
విరహిణి, కామిని నను వరించ తరించితిన్

      III      IUI    UII  IUI        IUI        IUI      UIU

చ. కవిత  లలోనె     కన్నెసొ    గసంత   యుకాల్చి   నరాలు మీటినా                         
     కవిస  రసాల    తేలిమ      గువాత      డిగాఢ       నిషంగ   మందితా                      
     కవిత   గమారి    నగ్నము    గరాత్రి      నికాల్చె   విలాస   కేళిలో 
      కవన  పుటంచు లందువి  హరించె    నుకాగు   చురాధ  రాణియై 
 
Oct 15th 2023 

  కవితల లోనె    కన్నెసొ గసంతయు   కాల్చి  నరాలు మీటి నా 
   కవి సరసాల  తేలి మగువాతడి  గాఢ  నిషంగ మందితా    
   కవితగ  మారి    నగ్నముగ    రాత్రిని  కాల్చె   విలాస   కేళిలో 
   కవన  పుటంచులందు  విహరించెను   కాగుచు   రాధ రాణియై   


                                   
కాఫీ తో శృంగారం 
కారు మబ్బులుకమ్మి ఆకాశమున చిక్కటి చీకటి        
అలమగా చక్కటి గుమ్మఒక్కటి చిక్కటి కాఫీ నిచ్చి
చిటికవేయంగా పమ్ముకొను కోర్కెలు కెలికి కేరింతలు
పెట్ట గతి తప్పిన పతిని వారించ తరమే వారజాక్షిన్

నలకలు లేని కాపీ, అలకలు లేని ఆలి
కలతలులేని కాపురము అలవిగాదు
వర్ణింప చింతలేని జీవిత మాధుర్యము
చిదాత్మ జేర్చె కారుణ్య భావమున్
సంస్కృతం                            
ఆనంద  మరందములకు మూలమ్ము  మందారమహితమ్ము
సంస్కృత వాఙ్మయమ్ము కాళిదాసు  కమనీయత వాల్మీకి
రమణీయత నిండి శోభిల్లు  సోమధార  సంస్కృత వాఙ్మయమ్ము.

సకల శాస్త్రములకు  మాతృక  సంస్కృతమ్ము
రారమ్ము రాజభాష నేర్చుకొమ్ము సోధించి
నాడేమి సాధించినారో   తెలుసు కొమ్ము  
కల్హణ, బిల్హణ, పాణిని, కపిలులన్ మరువకుమ్ము.  

సాహిత్యం
ఒంటిగ నెప్పుడు నుండరు మరి వేదననెప్పుదు జెందరు
మంచి పొత్తము నొకటి దెచ్చి మనసార జదివి నిక్కముగ
అక్కరమును అంటిబెట్టుకు నుండి పుటలను పుష్పములుగ నెంచి
గ్రోలు చుందురు పలు రసములను ప్రియముగ సాహిత్యాభి మానులు.

తెలుగు                                       
విస్తరించేదేల వెలుగు భాష , వడుసుపోయెనేల తెలుగునేల 
అమ్మభాషయని  తెలిసి తెలిసి అక్కరకురాదనావల  పారవేసి
మిడి మిడి ఆంగ్లంబున వన్నలన్  చూప  వదరుచుండ
అమ్మభాషకేది పూల దండ , అమ్మభాషకేది అండ దండ.

పరదేశభాషలు పరంపర పొదలుకొను నేటితరము
తెలుగు లేక పరభాషలు నేర్చుటెవరి  తరము
బహు భాషలు  తెలుగుతో  సరళతరము
అనువు  గాదు అంగ్లము అసలుగాదు పటుతరము.
పద్యం
తెలుగుకై  రాస్తాను తెలుగు కవినయ్యి, కాలు కయ్యి నేనే అయ్యి
కురుస్తాను హృదయ సీమలందు సువర్ణపూర్ణకంధరసంధారలయ్యి   
ప్రభావిస్తాను పద్యమయ్యి దివ్య భావాల వెలిపించు పుంజమయ్యి   
ప్రసరిస్తాను ఖిన్నల కన్నుల  వేవేల  మయూఖములయ్యి 

సంపాదనకై  పాడు ప్రాకులాట, వినోదంకై  వల్లని వెతుకులాట, 
పదవులకై రిత్తగ గుద్దులాట, కాసేపు వదిలిపెట్టు ఈ పూట 
గట్టించు గుండెల్లో పట్టుపట్టి  తెలుగు పద్యమంటే  తేనె మూట 
పద్యమంటే పదాలకోట,  మరువబోకు పద్యానిది రాచబాట. 

ద్యం
శాంతము కోరి  వారాంతము పలువురు సేవింతురు  మద్యము
విషద హర్షములందు జిగీషువులై  సేవింతురు కొందరు. నిత్యము 
నిషార్ధులై  మరికొందరు, మరి ఆరంభింతురందరు అందరు వేడుకయని
మద్యము వాడుక కాగా యది వీడక నభ్యసింతురు ధరాతలంబునన్‌.  

సీసా మద్యము నిషా నిచ్చు  సీస పద్యము త్రిష నిచ్చు తూలుటయో
వాలుటయో  కూలుటయో  తథ్యము మద్యము సేవించినన్,  ఎరుగుట,
చెఱుగుట పెరుగుట ఖాయము పద్యమును ప్రేమిచినన్, బాధాహరణమ్ము
జిజ్ఞాస ప్రేరణమ్ము విరచి రొమ్ము,   నేర్వరమ్ము తెలుగు పద్యమ్ము.

ఛందస్సు 
ఇమ్ముగా నిలిచి  గొమ్మలెంత బాగుగా గమ్ముకొన్న 
ఘనత లేదు జాజితీగకు కమ్మని పరిమళమ్ము లేక 
ఛందస్సు పట్టి పట్టి కిట్టించిన  పద్యమగునె
వన్నెఎంత బాగుగ అద్దిన కంచు కనకమగునె.

ఛందస్సు ఛందస్సు అను జచ్చు మొగమున్ జూచిన 
మెత్తగ మొత్తబుద్ధగున్ ఛందస్సు మేధస్సని వెఱ్ఱి కూతలు
కూసిన తరమబుద్ధగున్  ఛందస్సు సరిపెట్టి,  ఎబ్బెట్టుగా
పద్యంబు  వ్రాసిన వక్రబుద్ధి కవులన్  కాటికామ్పబుద్ధగున్    

అక్షరము 
అక్షరము వెలసె ముకుళమై , పెఱిగె పొగడయై, విరిసె సుమమై
పదము పదములై  చిరు దివ్వెలై  జిలుగు వెలుగులై సాగె మార్గమై
పదము శ్లోకమై కొత్త లోకమై  విమల సలిలమై  లలితలలితమై      
మధుర రాగమై జనహృదయమై  భక్తి భావమై  వందనీయమై   

అరుణాత్మజు నాఘాతము నకు దొరకని దొరయెవ్వడు
నృపాలురు, నుర్వీపతులు కారెవ్వరు కాలాతీతులు
నిశ్చయముగా సేతురు కాలము, భంగ పడి ఆశలు
కంకటిల్లి యేడ్తురు నరులు, కాల సర్గమున
దుర్గములైన దుర్గతిపాలగును అక్షరము దక్క.

అక్షరమే దీపము జగతికి అక్షరమే సోపానము ప్రగతికి
అక్షరమే ఆయుధమ్ము , అదియే అవ్యయమ్ము
బంగారము, శృంగారము అక్షర ఆవశ్యమతివకి ,
నిరక్షరుడు నిర్భాగ్యుడు మరి సిరిలెన్నున్నన్.

క్షరం కాని ద్యోతము ధాత్రిన్, అక్షరమ అక్షయమ్ము
మహిమాన్విత మవ్యయమ్ము హరం లేని వరము
అదియే  నిత్యము సత్యము ధృతిన్ ధరిత్రినన్
సతతము ప్రకాశించు తరళము అంతః చక్షువు అక్షరమ్ము.

అక్షర గమనము సాగె ఝంకృతిన్  తాకె గగనమున్
పెంచే జగమున్  పంచె జ్ఞానమున్ సుకవుల కొసంగె కీర్తిన్
ఒసగె  కావ్యముల అమరత్వమున్,  గలదె  ప్రత్యామ్నాయ
అక్షరమునకున్  అదియే  బాట  అబ్రపదముకున్.

నెయ్యమునకు నిగారింపు  రిధమము నకు  తమకము
క్లేశమునకు శమితము తాపమందు  పికానందము అక్షరమ్ము
ఋక్కులకు  ఇమ్ము , ఱేనికి కొసంగు తక్షణ సంతసమ్ము
అంతర్వాణి పక్షముసేయు అక్షరమ్ము

అచిరము విత్తము వైభవమనిత్యము భాషే భవము
సమాహ్వయము అఖండము అనిలము  ఆరాధ్యము
బుద్ధి కి నాంది బాష,  సౌర్యమునకు  భాష్యము భాష ,
ద్వైతాద్వైత మర్మము భాషను మించదు ప్రపంచము

స్నేహితుడు  
హిమకరుడ లరించడే మహితలమున్  చంద్రికా చలువన్ 
ఇందుమతి ద్యుతిన్ హేమంతుడలరింపడే  హేమంబు పూసి 
మంజులము కావె సకల భూతముల్  ధరముల్, ధరణిరుహముల్ 
మురియ కురవదే నీరదము ముద్దాడి నగములన్  నేమందు
నీ హేమంతుని బాయక బాసట రగడ తెగడలం పాలించు మిత్రధర్మమున్

అనురాగమనెడు  పెద్ద పీటవేసి  ఘనముగా సౌజన్య గంధము పూసి  
పద్యముల పన్నీట  కలియఁబెట్టి   ప్రేమతో గోముగా అభ్యంగనమొనర్చి 
కస్తూరీతిలకములు సంభూషించి ఇంద్రచాపము నుత్తరీయముగ గప్పి
మైత్రి ముత్యము ఇచ్చట వెలిసెనోయియని చాటి సత్యమెల్లెడ తెలపవోయి.

హితుడు  
ఘాటు రాతలతో మేటిగ రాటుదేలిన రామకృష్ణన్
తెల్లముగా నుతింతు ఎవ్వాండ్రు ఏడ్చినన్ ఆక్షేపణన్
జేయక మోటుగ నైన సూటిగా జెప్పు నీ తృష్ణ ,రామకృష్ణా
మెచ్చి సత్యమున్ పరాసుడైన జేయఁడే ప్రదక్షిణన్

విద్యని విల్లు జేసి క్షత్రముల నక్షత్రములన్ రాల్చి
అక్షర రక్షకభటుల ఛందస్సు ఛత్రమున్ దాల్చి
నిను గద్య , పద్య ప్రాస సాధ్య వేడ్కన్ దేల్చి
గారవమున కొనిరావ నంపితిన్ ఘంటాపథనన్

పెక్కు గురు లఘు శ్రేణుల్ నిను పలకరించి
సీమపన్నీరము శిరమున చిలకరించి
బింబాధర నివహంబు దరహాసామృతమర్పించి
దెత్తురు నిను ఘనముగ నిఘంటు పల్లకిన్ పూంచి

వేదన
కలం శకలమై కలలు వికలమై
కాలము కీలయై గుచ్చ రచ్చయై
సాగునెట్లు రచనము రసాత్మకమై
నొవ్వద డెందము దంగాసేయ భగ్నమై
ఏగెద నే రసాతలము పోవ సిద్దమై
సాగునచట కవనము స్నిగ్ధమై.
శృంగారం 

అపరంజి సాలభంజిక సోయగమున్ సొక్కి వివశమొందడే
వీక్షకుడనీస్తకుడైనను మస్తకమున్ వాల్చడే, సెగపెట్టవే
వగలాడి వంపులు ఉడుపున బిగియార కట్టినన్ పొందడే
పులకరమున్ ప్రవరాఖ్యునికైనా కొంకర వంకర బోదె ఆర్ద్రతన్

బంగరు వలువముల పుప్పొడివన్నెలు మోమునన్ చింద
వన్నెకాడి వలపుల  తలపులన్, చెలి చెక్కిళ్ళు  కంద
చిరు దరహాస శోభా వ్యాకీర్ణ జాణ చెకుముకి చూపుల
తూపులన్ పరిగొనె డెందమున్ లకుముకి చందమున్.

నా ప్రస్థానం 
శ్రీమంతంబగు నీమహిమ దుర్గామల్లేశ్వర
నీ పాద పరీవృతంబు ఈ వాడనందు
నాటితినే వృక్షంబు నాడు, దశవర్షంబులయ్యె
నేటికి  తిరిగె  నాదశ  అక్షర సేద్యంబునన్.

కర్మేంద్రియమై రసజగత్తుల నోలలాడించగల నేర్పునఁ దీర్చి
జ్ఞానేంద్రియమై  రసజ్ఞుల నలరించు ధీశక్తినిం సమకూర్చి
నా డెందమందుబ్రాహ్మీమయ పవిత్రమై నిలిచి
మృదు గీతుల నొసంగి విరాజిల్లుమా వాగ్దేవీ

నేటి విద్య
ప్రాకారములు, ఆకరములు నేటి మన విద్య ప్రమాణములు
తల్లి దండ్రులకు కావలె శీతల బస్సులు, మేలిమి భవంతులు
నొప్పదు యాజమాన్యములకు ప్రవేశములు లేక మెండుగ
మరి యందుకె ఆపక చేతురు ప్రచారముల మోత నిండుగ
బజారు లాయె బడులు దుర్గంధమాయె విద్యాగంధము

పరీక్షలముందు పుస్తకముల బూజును దులిపి
ముఖ్యమైన ప్రశ్నలను ముక్కున బట్టి
భాషను మరచి, సంస్కారమును విడిచి
సాధించి నారు నేటి విద్యావంతులు భాహుళ 
జాతి సంస్థల యందు బానిస త్వమును.

జ్ఞాన ము కొరకు కాదు , సచ్చీలతకొరకు కాదు
మేటి  కొలువుల కొరకు నేటి విద్య, కొలువు
గొప్పదయిన విద్య గొప్ప బ్రతుకుతెరువు విద్య
విలాసములకు విద్య, మనోవికాసము పెద్ద  మిధ్య. 

మీ వీసాలొస్తే మెలేస్తాం మా మీసాలు
మీ చదువుల కొరకు, మీరీతిన బ్రతుకుట కొరకు
మీరే రీతిన సెలవిచ్చిన ఆ రీతిగా నడుచుకుంటూ
మీ వాకిట్లో నిల్చుంటాం, మీ కరుణ కొరకె  మా జాగరణ
మీ పిలుపే మాకు శివ సాన్నిధ్యం.

రేయిం బవళ్ళు పని పిసరంత తిండి లేదు రవ్వంత విశ్రాంతి,  
కానరాదు  మనశాంతి అయినా  ఏదో నోల్లెద్దమనే బ్రాంతి
గానుగెద్దు జీవితం, ఎవరికీ నీవాధార్సం ఏమిటి నీ జీవితం?

టాం టాం డాం డాం పెల్చేస్తాం 
వికృత శబ్దాలతో ప్రకృతిని రాల్చేస్తాం
టపాసుల చెత్త తో వీధులన్నీ నిం పేస్తాం
నరకుడు చచ్చినా వారసులం బ్రతికున్నాం.          


మానవ ప్రవృత్తి - కొరోనా   
గృహమున్  భూగ్రహమున్ మరిచి ఆ గ్రహము 
ఈ గ్రహము  వెదికిన్ వచ్చు ఈశునకాగ్రహము 
భూత దయలేనివాని ప్రాణమునకు లేదు త్రాణము  
సర్వేశ్వరుండొసంగడు నేడు అనుగ్రహము, గ్రహ
శాంతులు నొసగవు సుఖశాంతులు భ్రాంతులు.

మనుజుడు మరిచెను నిద్రను చెఱచెను అణువును చేరెను
చంద్రుని, బహు ఋణములు దారుణముల వెరవక జేసెను
మరువక తరుణిని అంచల నిలిపెను వారుణి వాహిని, కోరెను   
భువనము, వాంచలు  క్షుద్రము రుద్రము  ప్రాణము భద్రము       


కొరోనా ప్రళయం 
మరిచితివట నూరు తప్పులు, మీరగ మరి చక్రధారివై
నురిచితివట శిశిపాలుని, నెరపితివట రాజసూయమ్ము.
నిను బంధింప, ద్వాపరమున చూపితివట  విశ్వరూపమ్ము
చూపుచున్నావు కలియుగమున సూక్ష్మరూపమ్ము,
చెలరారు భీషణమ్ము  జగములాయె  నిర్మానుష్యము. 

తొడితొడి సౌఖ్యములకు సాగిలపడి యెఱిగి యెఱిగి అంచిత ధర్మంబుఁ వీడి
అవాంఛిత మర్మంబుల తోడి తొడితొక్కిడిగా పడి ప్రకృతి జీవజాతులం పెక్కు
రీతులన్ ఛేది  సందడి దొందడి జేయ అగుణము ద్విగుణము కాగా దిగిరాడా  భగవానుడు అజేయుడై జేయడె నరమేధము నియమోల్లంఘన నెపమున్


కవిత   -  ప్రేమ  గీతం

విప్లవగీతాలు శ్రోతలు పీడితులే!  ప్రేమ గీతాలకు శ్రోతలు ప్రేమికులే!!

ఉన్నత హిమాలయాల్లో కురిసిన  ప్రేమ వర్షం పాయలై 
ప్రవహించి భగ్న హృదయం బీళ్ల లోతులన్నీ నగ్నముగా
ముద్దాడి  భీషణ జ్వాల లందు మరిగి ఆవిరి పొగలుగా మారి
ఆకాశమార్గాన పయనిస్తూ  చీకటి ముసురుతుండగా  వంద్య మై
సంధ్యలో  నిలిచిన ప్రేమ తన అస్తిత్వాన్ని తానే చెప్పుకోలేని
దుస్థితి లో  గొంతు పెగలని క్షణంలో  కలం చిందమై
 గాయాన్ని గేయంగా మాత్రమే పాడగలదు.

కవిత   - నా పల్లె

మండుటెండలో కొంగ
మండువాలో దొంగ
నూతి నిండా మరలు
చెరువునిండా తామరలు
పొలాల నిండా  సీతాకోకలు
రెపరెప లాడే కొత్తకోకలు
నింగిలో నీలి మేఘాలు
చెట్ల పై ఖాళీ పక్షి గూళ్ళు
చెట్లనీడల లేగ దూడలు
తీరం వెంబడి ఓడలు
నా పల్లె నవ  ప్రపంచం
నేనే నిత్య యాత్రికుడు
నేనే నవయుగ వైతాళికుడు

 కవిత  - ప్రాస కోసం ప్రయాస
రంగుల సీతాకోకకి , పాతకోక తో సరిపుచ్చావ్
నిండు చందమామని నూతులోపారేయకు
సిగలో పెట్టుకుంటాను అంటే విన్నావు కావ్
రేపటికి పెరుగన్నంలోకని ఫ్రిడ్జ్ లో పెట్టేశావ్
పాలకోవాలాంటి నన్ను పక్కన పడేసావ్
పెళ్ళాం తో పేచీ పెట్టుకుంటే గోచీ ఊడిపోతుంది
తర్వాత తూచ్ అంటే తుఫాన్ ఆగుతుందా
రాజీ పడకపోతే పీజీ చేసావని చూడను
పేజీ చింపేస్తాను , మావిడి పండు కావాలని
మీ ఆవిడను పీడించక , మావిడతాండ్ర తిను
లేదా తాట తీసి తాంబూలమిస్తా

వర్షం కురిసిన రాత్రి
గుట్టుగా పిట్టల పై రాళ్లు రువ్వే పిల్లగా!
నా మనసు కొలనులోకి రాయి విసిరావు,
కొలనులో వృత్తాలు వ్యాపించినట్లు నాలో
ఆలోచనాతరంగాలను వ్యాపింపజేశావు.
నింగి నుంచి నీటిపూలు రాలుతుండగా
మెరుపులా మెరిసావు వర్షం కురిసిన రాత్రి
వద్దన్నా పెదాలపై ముద్దర వేసి నిద్దర లేకుండా
చేసావు , నీటి ఎద్దడి లో వరద సద్దడి
వరద వెల్లువలో ఊరంతా కొట్టుపోయాక
నేనేమీ పట్టుకుపోలేక మండుటెండలో
వంటరిగా నిలుచున్నానిద్దుర రాని
నా హృదయం వేచి ఉంది వానకోసం
ఎందుకంటే వానోస్తే నువ్వు వస్తావుగా                                                                                         ఆకాశం భూమి కలుస్తాయి గా 

బాల్య మిత్రునకు తరళ బహూకరణ ( Octorber 25, 2021)

విఠలు   డేమరి      వాగ్విలా  సమువీ  డిసొత్తు  సవిత్తు  డే  
పఠన    మందున   రేగనే    తనమాతృభాషకి ముగ్దు డై 
కఠిన    శిల్పము   నందునన్ కని  కౌముదందము మెచ్చగా  
విఠల     కిచ్చెను   పూలబా     లుడుపేర్మితో  తరళంబు  నే

వాగ్విలాసము ( అందముగా మాట్లాడుట)  సొత్తైన  విఠలుడు చక్కగా చదివి జీవితమునందు పురోగమించిననూ మాతృభాషను విడువక (నా) ఉన్నత రచనా శైలిలో కౌముది వంటి  తెలుగు అందమునాలింగనము చేసుకుని కవిపారంగతునివలె ( అందుచే యితడు సవిత్తు అనగా కవి) మెచ్చెను. అందుకే పేర్మితో ( ప్రేమతో )  ఈ  తరళము ను ( హారము) బహుకరించుచున్నాను.


3 comments:

  1. సాహిత్యం అనేది ఒక కళ, ఇది అందరికి చేతకాదు. ఈ రోజుల్లో మనుషులకి ఇలాంటివి ఉన్నాయని కూడా సరిగ్గా తెలవటం లేదు. మీరు ఈలాంటి సాహిత్యాలు మరెన్నో చేస్తూ ఈ కళ చనిపోకుండా కాపాడతారని కోరుకుంటున్నాం గురువు గారు.

    ReplyDelete
  2. Super sir marala na padava tharagathi Telugu mastaru gurthuku vachharu

    ReplyDelete
  3. Nice sir. Sahithyam chaalaa bagundhi.

    ReplyDelete