Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, September 4, 2020

Bharatavarsha 33

ఆదిత్యుడు పశ్చిమాద్రిన క్రుంగుచుండ పన్నీటి పుష్పరాగ విరాజమాన, జంత్ర నిస్వన, జంభ, లంబ సాటోప స్వయంచలిత శృంగార బహుప్రళయ గామిని -స్కోడా ఆక్టేవియా - వృక్షశ్రేణీశోభిత భాగ్యనగర రహదారినందు, ఇక్ష్వాకు వంశసంభవ రఘురామ సంధిత శరము వజ్రావర్తనము(శ్రీరాముని ధనుస్సు)ను వీడి అరి భంజనమొనర్చ బోవునట్లు క్షోణి కంపించ ప్రచండ గతిన సాగుచుండెను.

పబ్బస పుష్పము

పబ్బస పుష్ప శోభలీను ఆ వాహనసారథి నడుమంతర సిరి ప్రభాసిత, కౌమార శోభా విభూషి తానం దాగస్త్యుడు    తండ్రి కడ సంగ్రహించిన ద్రవ్యమును ద్రవము వలె పారించుచు అభినవ కుబేరుని వలె అలరారుచు  నవనాగరిక  కామాకర్ష , రసాకర్ష,  చిత్తాకర్ష  ఉడుపులన్ శృంగారించు కొని  తారాతనూజ చంచజ్జఘనాంగి చారుశీల వద్దకు నాల్గు మాసములుగా ప్రతి వారాంతము ఏక ధ్యేయంతో పోవుచున్నాడు. లకుమకు ఆమె చేడియలకు విశేషముగా ధనము పారించిననూ ఆమె పొందు బడయలేదు. లక్ష్య సిద్ది జరుగలేదు. "నేడెట్లయిననూ ఆ ముగ్ధను నాగపాశ, నరసింహ,  క్షుబ్ధ, ధేనుక, ఉత్కంఠ,  రతి నాగ బందాల బందించి చుంబించి క్రీడించి పరవసించవలెను.”  తండ్రి నడిగి తెచ్చుకున్న వాహనము ముందుకిపోవుచుండ ఆలోచనలు ఉదయం బసవడింట్లో విందు, బుచ్చమ్మగారి ఔదార్యము స్మృతి పదము మెదిలి అగస్త్యుఁడు దృశ్యావిష్కారము బొందెను.

                                                                         ***

బుచ్చెమ్మగారు పుణుఁకులు, పాలకాయలు పులిబొంగరములు వంటి పలు భక్ష్యములు జేసినారు, వంటగదిలో పీట వేసి అగస్త్యను పిలిచి ఆరగించమనిజెప్పి “నేడు బసవయ్య చెల్లి రమ్యచందన పుట్టినరోజు.” అనగా “రమ్యచందనా? నాకు రమ్యయని దెలియును. పేరున చందనము దాచుకొని చెప్పకుంటివా! యనుచు “చిన్నారి చందనకు పుట్టినరోజు జేజేలు” చెప్పి అగస్త్యుడు జంట కలములు   బహుమతినొసంగెను. “చందనోత్సవం నాడు పుట్టినందుకు చందన యని వాళ్ళ నాన్నగారు అట్లు పిలుచుచుందురు.”   “ఆంధ్రా పిండివంటల లో అందెవేసిన చెయ్యి మాయమ్మ బుచ్చెమ్మ ఆలసించక ఆరగించవలె నన్నా అనుచు రమ్య కొప్పముతో మంచినీటి  నొసగెను. “నేడు బసవడేల జాగుచేయుచున్నాడు? ఈ తిండిపోతు భక్ష్యములన్న ముందుండవలెనే” యని మనసులో అనుకొనదలచిన మాటలు గట్టిగా బయటకు అనినంతనే , బుచ్చెమ్మగారు , రమ్య పక పక నవ్వుచుండిరి.  “పంచెకట్టుటలో కొంచెమాలస్యమైనది” అనుచూ ప్రవేశించిన బసవడు వంటగదిలో ఎదురు జూచుచున్న అగస్త్యను తట్టి పలుకరించెను. పంచ కట్టులో నున్న బసవని జూచి అగస్త్యుడు “చెలువరాయుడి చలువమును పంచెలోనే జూడవలెను.” అనెను. 

నాగదిలోకి పోయెదమనుచు అగస్త్యను లేపుచున్న బసవని వారించి బుచ్చెమ్మగారు " మాకళ్ళముందు కూర్చొనిన మాకానందము , తినునంతవరకైనా ఇచ్చటనుండవలెను " అనిరి. వీరి రహస్యములు మాట్లాడుకొనుటకు ఇచ్చట అసౌకర్యమేమో" యని రమ్య వెటకారమాడు చుండ "మామాటలు నీకేమి అర్ధమగును?" యని బసవనగా" తెలుగున మాట్లాడిననూ అర్ధముకానివారుందురా?" యని ఈసడించెను. “అయినచో మేము ఇచ్చటనే మాట్లాడు కొందుము మా మాటలకర్ధము కనిపెట్టుము." అనెను. 

అగస్త్యుడు : భాగ్యనగరము  పోవలె,  లకుముకిని చూడవలె తారాతనూజకు గండమంచు విదిష భవిష్యవాణి నాకు దూరవాణిన దెలుప  “జివజివ జివ జివ లాడుచున్నది దేహము జిల్లని లాగుచున్నది ప్రాణము. 

బసవడు : ఛీ ఛీ ఏమియా కవనము కుకవి వలె. ఇప్పుడు నే జెప్పెద వినుమన్న  బసవడి ఆశుకవితావనమున  మరుమల్లి, బంతి, చామంతి, సన్నజాజివంటి పుష్పములు వికసించి,  దూర్వార గంధములు గుభాళించె.  

నీ ఆధర రాజీవముల సొంపారు శోణిమ శోభలు నిర్జించు నింగి కెంజాయలనైన, నీ చలచ్చంచల నేత్ర సౌందర్యచాతుర్యమహిమ అబ్బునే మేటి పద్మంబులకైన, గుబ్బరాసుల రాసికెక్కిన గిబ్బరాసిని గాంచి గుబ్బతిల్లవె రసికడెందంబులెల్ల, నీలజీమూత సంకాశ చారు కేశముల్ నర్తించవే చంచజ్జఘనాంగి జఘనమెల్ల ,  నీ ముత్తెంపు మేని కాంతులన్ చూచి  పాలిపోవె  పారిజాత పుష్పంబులైన

రమ్య చందన : ఒక్కముక్క అర్ధం కా లేదు 
బుచ్చమ్మగారు : విడ్డూరం! తెలుగువారికి తెలుగు అర్థం కాకుండుట. అయిననూ తెలుగుతన మినుమడించు తేనెలూరు తెలుగు విన సొంపుగానున్నది. "ఇందు విడ్డూరమేమియునూ లేదు, భారతవర్ష సాంగత్యమున బసవడు పాండిత్యమును బడసినాడు.  ఇది పండిత భాష సామాన్యులకర్ధముగాదు, మాన్యులకు దక్క. కానీ మీరు సామాన్యులలో అసామాన్యులు, మీకీ భాష పట్ల ఉన్న మక్కువ యే అందుకు తార్కాణము." యని అగస్త్యుడనెను.

ఇంతలో రాఘవుఁడరుదెంచి చందనకు ఆశీస్సులందజేసెను. అతడికీ  పిండిభక్ష్యములు లభించినవి. అతడు పోయి కాళ్ళు కడుక్కొని వచ్చి  పీటపై  కూర్చొని ఆరగించుచు " తెలుగు నేర్చిన ఏమిలాభము ఆంగ్లము నేర్చుకొనిన జీవితమునకక్కర వచ్చును.”   

“నేనునూ నీవలె పొరబడి  తెలుగును లక్ష్యపెట్టక  ఆంగ్లమునే  మెచ్చుచూ అదియే విజయ సోపానమని నమ్ముచుంటిని. ఎంతకాలము నేర్చిన నీవు ఆంగ్లమిట్లు మాట్లాడగలవు? ఆంగ్లమునిట్లు వ్రాయుట నీకు సాధ్యమగునా? అంతెందుకు అమెరికా పోయివచ్చితివికదా ఆదేశస్తులు మాట్లాడిన భాష నీకెంతవరకు అర్ధమగును? చదువు మాట అటుంచిన బసవడికి  సద్బుద్ధి సంస్కారము అబ్బెనదియేజాలు’యని పంచె కట్టున కాంతులీనుచున్న బసవడిని రాఘవునకు జూపెను. బసవడు సిగ్గు పడుచుండెను. “చూడునాయనా అగస్త్య, భాష అర్ధముకాకున్ననూ భావము అర్ధము కాదా? లకుమ తో ప్రేమ ప్రమాదకరము. ఈ వయసులో ప్రేమజోలికి పోకుండుట మంచిది. చేయని నేరానికి విదిష శిక్ష యనుభవించుచున్నది. ఆ బైరెడ్డి కేమి? చక్కగా తప్పించుకొని తిరుగుచున్నాడు.

రాఘవ: లేదమ్మా  భారతవర్ష కోర్టులో కేసుపెట్టి  స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో  బైరెడ్డి క్రైమ్ను ప్రూవ్ చేసెను. వాడు నా స్నేహితుడని జెప్పుకొనుటకు సిగ్గుగా యున్నది. సందీపుడింకనూ హైడింగ్లో నున్నాడు మేటర్ తెలిసిన బైటకు వచ్చును.

“ హత విధీ తేనెలొలుకు తెలుగుకేగతి పట్టెను !భారతవర్ష నాగిరెడ్డి పై వ్యాజ్యము వేసి అతడి వ్యాజము బైటపెట్టెను. గట్టి సాక్ష్యము లను సేకరించి విదిష సాఖ్యమును నిలుపుకొనెను.” యని తన శైలిలో జెప్పి బసవడు నవ్వుచుండ రాఘవు డ యోమయముగా చూచుచుండెను. 

అప్పుడు అగస్త్యుడు “వ్యాజ్యము అనగా court case వేసి అతడి వ్యాజము అనగా wickedness బైటపెట్టెను. గట్టి సాక్ష్యము అనగా witness  సేకరించి విదిష సాఖ్యమును అనగా  friendship నిలుపుకొనెను.” తర్జుమా తో విషయమును విశద పరిచెను. తెలుగువాడికి తెలుగువాడు తెలుగును ఆంగ్లమున వివరించుట ఇది మరింత విడ్డూరంగా నున్నది. యనుచు బుచ్చెమ్మగారు నిర్ఘాంతపోయిరి.

ఆంధ్రదేశమున విద్యయే ఒక పెద్ద విడ్డూరము అందుచే ఇచ్చటన్నియూ విడ్డూరములే గోచరించుచుండును. ఇచ్చట  చూడవలె! రాఘవునకు బైరెడ్డిని జూచిన సిగ్గువేయుచున్నదట , వీడి తెలుగును జూచిన నాకు సిగ్గు వేయుచున్నది.

కొలది దినములలో నేను బసవ వలే మాట్లాడనిచో అని రాఘవుడనుచుండ  

ఓరీ రాఘవా!  “న్యాయస్థానము లో బైరెడ్డి నేరమును రుజువు చేసెను” అనుట చేతకాక డింకీ గొట్టుచున్నావు నీవా ప్రతిన పూనుచున్నావు?! వారి వాదులాటలు పుట్టినరోజు వేడుకను ద్విగుణీకరించెను. 

                                                                   ***

ఆక్టేవియా ఫిలిమ్నగర్ జేరెను. రెండు దినముల నుండి లకుమ చరవాణి మ్రోగుచున్నదే గాని లకుమ సమాధానమిచ్చుటలేదు. నేడెందులకో చరవాణియునూ మ్రోగకున్నది. లకుమెచ్చటికి బోయినది? ఆమె కేమి జరిగి యుండును? అనుకొనుచూ అగస్త్యుఁడు లకుమ భవంతి ముందు వాహనమును నిలిపి లోనికి ప్రవేశించి నగస్త్యకు లకుమ కానరాలేదు. యామిని, సమంత లు  వారి సామానులు పెట్టెలలో  సర్దుకొనుచుండిరి " పెక్కు బహుమతులను గ్రహించి స్నేహము నటించి నేడు కనీస సభ్యతను  చూపక మొఖమున గాటు బెట్టుకొని పోవుచున్నారు అనుకొని "యామిని లాకుమా లేదాయని అడుగగా " మాకు తెలియదని సమాధానము వచ్చెను" అగస్త్యుడులిక్కి పడి “ రెండు దినముల నుండి లకుమ చరవాణి లో చిక్కకున్నది. ఎచ్చటకు పోయెను అదియైన జెప్పిన చాలును.” 

“ఎవరికి తెలియును ఆమె ఇంటికి వచ్చి రెండురోజులయ్యెను" అని సమంత చెప్పుచుండగా " మీ వైఖిరి చూచుచున్న ఇక్కడేదో జరిగెనని అర్ధమగుచున్నది. మీరెచ్చటికి పోవుచున్నారు?” “మేము ఇల్లు ఖాళీ చేయుచున్నాము నీవు సరియైన సమయములో వచ్చినావు కొలది నిమిషము లాలస్యమైనచో మేము చిక్కెడివారము కాదు.” యని విసవిసా బోవుచున్న ఆ కన్నెలను జూసి అగస్త్యుడు పోలీసు వారు వచ్చిన విషయములు వాటంతటవియే బైటకు వచ్చును." అనగా యామిని తెల్లబోయెను. "నాకేమియునూ తెలియదు నేను తొమ్మిదింటికి బోయి రాత్రి కొచ్చుదానను, ఆ ఇంటి యజమాని మొగమైననూ నేను చూడలేదు. నాకు దారివిడిచిన కార్యాలయమునకు బోవలెను "యని సమంత వేడగా అగస్త్యకు క్రమముగా వెలుతురు ప్రసరించుచుండెను. 

స్నేహభావం ఇసుమంతైననూ లేక చిరునవ్వైనను నవ్వని వీరా నిజము జెప్పువారు యనుకొని అగస్త్యుడు ద్వారమునుండి  అడ్డు తొలగగా " నీవు పోలీసులకు పిర్యాదు చేయదలచినచో జేయుము కానీ ఆమె తల్లి ప్రముఖురాలు కావునా ఈ వార్త  అన్ని మాధ్యమములందు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని  దావానలం వలె వ్యాప్తి జెందును.  ముఖ్యముగా దూరదర్శన పేటికలందు మన బొమ్మలను నిరంతరమూ తిప్పి తిప్పి చూపుచుందురు. అందు పురుషుడివి కావున నీమొఖ ప్రముఖంగా నుండును, ఇచ్చట జనులు ఇతరుల రంకు పురాణములన్న ఉవ్విళ్ళూరుచుందురు.   పాత్రికేయ రాబందులకు మన శవములు చిక్కుటయే తరువాయి .. ఫో  ఫొమ్మనుచూ వారిరువురూ  విస విసా పోయిరి.  

“విదిష జోస్యమును శంకించితిని ఇప్పుడా శంక తొలగిపోయెను” యని విదిషను తలంచుకొనుచూ వంటరగస్త్యుడు ధూమపానం జేయుచూ, అచ్చట ఇచ్చట తిరుగుచూ ముచ్చటలాడుచు విచారించ, లకుమ నివాసమున్న భవనము లోగడ నొక విలాస గృహమని అదియొక వార వనితా నివాసమని తెలిసి శిరమున అగ్నిపర్వతోద్భేదము పొంది భూగోళము తలక్రిందులగు చున్న భ్రాంతిని పొందెను.   ఈ పాప పంకిలము నుండి దూరముగా సుందరి రొక్క తి మిగిలి యున్నది ఆమెను ఎట్లైననూ కలవవలెను. శకటము మాదాపుర మార్గముననుసరించెను. “ఆ భవన యజమాని స్త్రీ లోలుడని అతడు స్త్రీ లనుండి అద్దెనాశించక మరేదో ఆశించున” ని జెప్పుచున్న వారు గుర్తుకొచ్చి లకుమ నిద్రాణాగ్నిపర్వతము వలె తోచెను. “అయిననూ లోకుల మాటలు పూర్తిగా నమ్మరాదు నిజము దెలుసుకొనవలెన”ని  సుందరి అన్వేషణార్ధము మాదపురము బయలుదేరెను    

2 comments:

  1. చాలా బాగుంది
    స్నేహితుల మధ్య సాగిన సంభాషణము నా స్నేహితులను, వారి హాస్యోక్తులను జ్ఞప్తికి తెచ్చెను

    ReplyDelete
  2. పద్యము బాగుంది. లకుమకు ఏమి జరిగెను?

    ReplyDelete