Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Wednesday, September 9, 2020

Bharatavarsha 34

   ఆ.వె.   శోధించె వలకాడు పూబోణి   జాడ గోరి 

                సందు గొందు లందు తిరిగి తిరిగి               

                చేరెచి  వరికొక  చీకటి  చోటు యొకటి       

                 ప్రజ  లెవరు  లేని   పిచ్చి  పొంత   

     

మాదాపురమంతయూ జల్లెడ పట్టిన పిదప సంధ్య కాంతులు మడుగుచుండగా చిట్ట చివరకు అగస్త్యుడు జనులు మసలని ఒక కోన జేరెను. అచ్చట రహదారి అంతమొంది విశాల క్షేత్రము కానవచ్చెను. వాహనము ముందుకు బోవు టకు మార్గము లేక అగస్త్యుడు చుట్టూ పరికించి చూచుచుండెనుబైరు భూమివలె విశాలముగా నుండి గుబురు పొద లతో చెట్లతో నొప్పు  ప్రదేశమున నిర్మాణములో నున్న కొద్దిపాటి ఇళ్ళు  విసిరివేయ బడినట్లున్నవి. ఖాళీ ప్రదేశమునందున్న కొన్ని వృక్షములు పసుపుపచ్చని కృష్ణవృంత పుష్పములను రాల్చుచూ ముచ్చట గొల్పుచున్న వి. చెట్టుపై ఒంటరి కోయిల కూకూ రావముల అచ్చట వాహన ధ్వనులు, యంత్ర ఘోషయూ సద్దుమణిగెనని జెప్పకనే జెప్పుచున్నవి. అందొకానొక గుల్మొహర్ వృక్షము కెంపువర్ణ పంచదళ పుష్పములను రాల్చుచున్నది. తరుమూలములందు పరచుకొనియున్న ఎర్రని పూలు లకుమ పెదవులను తలుపుకు తెచ్చి వెర్రి మోహమును పుట్టించుచున్నవి. అగస్త్య శకటమును వృక్షము క్రింద నిలిపి ముందుకి నడవసాగెను.

    తే.గీ  బండి బోదిక  పొంతది  పోవ నున్న    

         దొకకాలి  బాటన  డిచెముం  దుకత  డటులె      

          ఇంతలో  నాకశ మంతకా  రుకరి బట్టె      

          తట్టె  పెనుగాలి కుండపో  తగవాన  కురిసె.  

  ఏమీ.. ఈ అకాల వర్షము, ఇదేమి దుశ్శకునమో? లకుమ యోగమెట్లున్నదో? సుందరి ఆచూకీ దొరుకునో ? ఈ రాత్రికి సుందరి దొరకనిచో ? వాన పెరిగినచో ? వానను లక్ష్య పెట్టక లక్ష్యమును సాధించవలెననుచూ తడుచుచూ ముందుకి సాగెను.  

 తే.గీ ముద్ద  గతడయు  చువెదికె వలపు రాణి

      పిలవ   గకలిగె  తరగని   పిచ్చి  వలపు 

      మోహ మెగయగ  పట్టును  వీడ డసలు     

      మరులు గొల్పగ  జవ్వని వింత ప్రేరణో!

ప్రేమ పిచ్చిలో పడ్డవాడికి  తడిసి ముద్ద గట్టినా   అలుపు  రాదు,  వల పెంత మోహమో! వలపురాణి దొరకకున్నచో  ప్రేమికుడు పడు  హృదయము వేదన మాటలలో  చెప్పలేనిది  జవరాలు వింత ప్రేరణ  ఆ బాధని  కూడా మరిచేలా చేయును.   మరుని సరములనుండి పెద్దలే మహర్షులే  తప్పించుకొన జాలరు పసిగారు బాలుడే పాటి!

తే .గీ   తడుచు  చుతడుము సాగగ  దొరికె నచట   

         చిమ్మ చీకటం  దొకసందు  చిన్న కాంతి

        నందు  కనిపించె దూరాన  లోగి  లొకటి

          ఆశ వెలగగ  చీకటే  అంత రించె  

నేడు శుభదినమని తలచి వచ్చి, వానకు చిక్కి కలత చెందితిని. వర్షము ఉదృతమగు చున్నది   ముందుకు బోవలెనా లేక  వెనుకకు మరలవలెనా ? టు డు ఆర్ నాట్ టు డు ! ఆంగ్ల నాటక కర్త  షేక్స్పియర్ గుర్తుకొచ్చుచున్నాడు. అంతలో “మనిషి దుఖాన్ని పైచేయి సాధించటానికి ఎప్పుడూ అనుమతించక ప్రశాంతముగా యుండవలెనన్న కాళిదాసు మాటలు గుర్తొకొచ్చెను “పర్వతాలు ప్రళయకాలంలో ప్రశాంతంగా ఉండును. ” అని శాకుంతలములో చెప్పినట్టు ప్రశాంత చిత్తుడై  స్థిర నిశ్చయముతో రాత్రిని జయించ పిడికిలి బిగించెను.


తే .గీ వడివ డిగపోయి  టకటక మనిత లుపును 

     తట్టి  నంతనె   తరుణొచ్చి తలుపు తీసి 

     తడిసి వచ్చిన  ముచ్చును   తేరి  చూచె   

      చూచి సుందరి అతడిని చకిత మయెను  

వాన కురిసి విద్యుత్ నిలిచిపోవుటచే పరిసరములన్నియూ చీకటిలో నల్ల బురఖా ధరించిన మహిళవలె  రూపమును  మరుగు పరిచి రేఖా మాత్రము ఆకారము చూపు చున్నవి.  గుడ్డి దీపపు వెలుగులో సుందరి అగస్త్యుని జూసి "భాగ్యనగరము ఎప్పుడువచ్చినారు? యని పలకరించగా అగస్త్యుడు సుందరిని సంభ్రమాశ్చర్యముల కని డెందముప్పొంగుచుండ “నిన్ను జూచిన పిదప దైవమున్నదని నమ్మిక కలిగెను.”   సుందరి మధురహాసము జేయుచూ కొయ్య కుర్చీ చూపగా ఆమె తల్లి తులశమ్మగారు తువ్వాలు దెచ్చి ఇచ్చినారు. తడిసిన  కపోటమువలె వణుకుచున్న ఆ కుర్రవాడినిచూసి తేనీరు కాచుటకు పక్క గదిలోకి పోయినారు.  బావిలో తేలుచున్న కొబ్బరి బొండముల వలె గోడల నుండి ఇటుకలు తేలి చూచుచున్నవి.  ఆచ్చాదనలు లేని  రెండు గదుల పేద పెరటి ఇంట నుండుటకు కారణము లేమి గాకేమి యుండును. “తళుకుబెళుకులు లేకున్ననూ ఉపవనమున ఉండుటచే   ఈ  ఇంటి చక్కదనము హాయి గొలుపుచున్నది”  అనిన అగస్త్యను జూచి  సుందరి మధురహాసము చేసెను. “అదియే మధురహాసము మరల కనిపించి మైమరిపించే చున్నది  దీపకాతి లో సౌందర్యదేవత వలే కనిపించిన సుందరిని జూచుచు విగ్రమువలె నిలిచిన అగస్త్యునకు తులశమ్మగారు తేనీరందించిరి. అగస్త్య తేనీరు సేవించు చుండెను. 

నా చిరునామా నీవద్ద లేదే , మరి నా ఇల్లు ఎట్లు  దొరికెను ? 

హతవిధీ!  నీ ఇల్లు దొరికెనా?  కాళ్ళరుగునట్టు  బొంగరమువలె  దిరిగి చివరకు సాధించితిని. నీ చరవాణి సంఖ్య తీసుకొని యుండిన బాగుండెడిది.  

ముమ్మారు కలిసినాము కదా అడిగిన ఇచ్చెడిదానను. 

అప్పుడు మొహమాటము అడ్డు వచ్చెను, కానీ నేడు అవసరము వచ్చెను. 

నీ అవసరము నా అవసరము గా భావించెదను నీ కొచ్చిన అవసరమేమి?

రెండు దినములనుండి లకుమ కానరాకున్నది

 తల్లి దగ్గరికి ముంబయి పోయెనేమో?

అట్లయిన నాకు చెప్పి పోవును,. తల్లిదగ్గరికి బోయిన చరవాణి ఏల పలుకకున్నది? అని అగస్త్యుడు యామిని, సమంతల ప్రవర్తన మరియు వారు భవంతిని వీడిపోవు వృత్తాంతమును ఎరిగించి " నాకు ఆ భవన యజమాని పై  అనుమానముగా యున్నది" 

 యని చెప్పుచూ పక్కనే చాప పై కూర్చిని యున్న తులశమ్మగారి వైపు చూసి నీళ్లు నమల సాగెను, అప్పుడే విద్యత్ పునరుద్ధరణ జరిగి ఆ గది దేదీప్యమానమయ్యెను.

తులశమ్మ గారు గోడకు చారబడి చేత నొక పుస్తకముతో చదువులో లీ*మయ్యిరి. ఆమె ప్రక్కన ఇంకనూ రెండు పుస్తకములున్నవి. అందొకటి పోతన భాగవతము మరియొకటి పాకుడురాళ్ళు.  

నేను అచ్చటనే ఆ భవంతిలోనే ఉండుటకు వచ్చి యుంటిని కానీ నేను వచ్చిన రోజే యామిని , సమంతల మొఖం చూచి వారి విషయము గ్రహించితిని. అందులకే నేను వారితో కలిసి యుండుటకు ఇష్టపడలేదు. వారు పరాన్న బుక్కులు. మా నాన్న వ్యవసాయదారుడు, కేన్సర్ పీడితుడు. ఆయన వైద్య నిమిత్తము ఉన్న డబ్బంతాయో హరించుకుపోగా పొలము అమ్మవలెనని యోచించుచున్న సమయంలో నాట్య , రంగస్థల అనుభవమున్న నాకు చిత్ర రంగమందు ప్రయత్నించమని ఒక్క చిత్రములో నటించిన ఒక గోటుగత్తె సలహా ఇచ్చెను “తక్కువకాలములో ధనము సంపాదించుటకు ఇంతకన్న మార్గము లేదని” జెప్పగా ఇచ్చటికి వచ్చివుంటిని.  అని సుందరి జెప్పుచుండ తులశమ్మగారు తొలిసారి పెదవి విప్పి…..

         ఆ. వె.  హీనము జూదమిక మరింత హీనము వాటా

                   లాట, యందు సొమ్ము  బోయి  నబో

                   వచ్చును  జీవము  పదిలము వాటి మందు

                   నిలప చిత్రరం గమికను నీచ  ముగద 

బోవలదని చెప్పి యుంటిని, నేడు పిన్నలకు పెద్దల మాటలెచ్చట రుచించును, కానీ వాసన పసిగట్టి దుష్టులకు దూరముగా నుండుటయే అది చేసిన మంచిపని. ఆ భవనములో నుండిన నా బిడ్డ గతి ఏమయ్యెడిదో అనుచుండగా సుందరి తల్లి పై ఎగ్గుగొని   నీవు "దుష్టులు" అనువారిలో ఇతడి ప్రేమిక లకుమనూ కలదు. ఇతడే నా తండ్రిని ఆసుపత్రిలో జేర్చి పుణ్యము కట్టుకొనన.. అని సుందరి అనుచుండగా అయ్యో  యని ఆ తల్లి  విచారించి   

“దయజూపి నాడాశుపత్రిలో జేర్చినావు. లేనిచో నా భర్త నాకు దక్కెడివాడు కాదు యని లోపలి పోయి ఒక సంచితో తిరిగివచ్చి , ఆ సంచి నుండి యాబది వేలు తీసి అగస్త్యకిచ్చెను " ఆనాడు నాకూతిరి వద్ద డబ్బు లేకుండెను, ముక్కు మోగమైననూ తెలియని వారికొరకు నీవు అంత  డబ్బు చెల్లించి ఆసుపత్రి లో చేర్చుట చాలా గొప్పవిషయము, పైకము గైకొనమ”ని ఇచ్చుచుండ అగస్త్య వద్దని వారించుచూ “  నాకు నేడు  లకుమ కొరకే గాని  పైకమున కేమి ఆందోళన గలదు ? మీరీ పెరటి గృహమును వీడి ఆపైకముతో నగరములో మంచి ఇంటికి మకాము మార్చినచో నాకు మిక్కిలి ఆనందముగా నుండును.” అనెను. హహ్హ  హ్హ   సుందరి మరల మధుర హాసము జేసి 

“భోగములందిచ్ఛ   లోలాత్మతతో నేనిచ్చటికి రాలేదు, నాతండ్రికొరకు, ఆయన ప్రాణములను నిలుపుటకు, ఆయన ఒక్కగానొక్క ఆస్తి పొలమును కాపాడుటకు వచ్చితిని. నగరజీవితమందు ఆశ, ఇచ్చట యుండవలసిన అవసరము రెండునూ తీరిపోయినవి.” 

అగస్త్యుని హృదయము ఉండేలు దెబ్బ తిన్నకాకము వలె విలవిల లాడెను, “నాకెంత ఇంగితము లేకుండెను మీ నాన్న గారి కెట్లున్నదని అడుగుట కూడా మరిచితిని. ఆయన కుశలమేనా? వైద్యము ఫలించెనా?”

వైద్యమేరీతిన సాగుచున్నదో తెలియకున్నది కానీ డబ్బు మంచినీటి వలె  ఖర్చగు చున్నది.   రోగి బాధ మాత్రము తెలియుచున్నది. నీ విచ్చిన   యాబది వేలు కాక వారములో ఇంకొక  యాబది వేలు ఖర్చయినవి. నగరములో వేరొక ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో వైద్యము జరుగునని రేపు అచ్చటకు పోవుచున్నాము.    మా అమ్మ పొలమమ్మి పైకమును తెచ్చెను.  నీ పైకము నీవు తీసుకొనుము యని అతడి చేతిలో పైకమునుంచెను.   అగస్త్య పైకమును దీసుకొని  మ్రాన్పడి చూచుచుండెను.     

పొలమమ్మక ధనమును కాపాడుకొన వలెనని, తన ప్రాణమును ఎవ్వరూ కాపాడజాలరని డబ్బును ఖర్చుజేసి రోడ్డున పడవలదని నా భర్త అభిప్రాయము. 

మీరు ధనము ఖర్చు జేయవలసిన పని లేదు నేను రేపు మంచి ఆసుపత్రికి తీసుకుపోయెదను అని అనుచుండగా. 

ఏమి చెప్పు చున్నావయ్యా నీవు ఖర్చు జేయువాడవు మేము దాచుకొను వారమా మా డబ్బు మాత్రమే కాదు ప్రాణములైననూ ఇచ్చుటకు మేము సిద్దమే

సుందరి మొఖమున మధురహాము బోయి విషాద ఛాయలు కనిపించుచున్నవి. దుఃఖ బాష్ప పూరితమైన ఆమె కళ్ళు వర్షించుటకు సిద్ధముగా యున్నవి. అమ్మా  నన్ను అపార్థము చేసుకొనవలదు, రేపు చెన్న పట్టణము నందు  ఆడయారులో గల ప్రముఖ కేన్సరు ఆసుపత్రికి తీసుకు పోగలను. అచ్చట వైద్యము ఉచితమే. 

అచ్చట వైద్యము నలభై శాతము వరకు ఉచితము గా ఇచ్చు చున్నారు అని తులశమ్మగారు అనుటతో అగస్త్యుడు ఖంగు తినెను.

“మా అమ్మకు పుస్తక లోకజ్ఞానములు రెండునూ ఎక్కువే” యని సుందరి జెప్పుచుండ        “ మేము అచ్చటివారమే వారు పెక్కు రోగులకు బహుతక్కువఖర్చుతో వైద్యము చేయుదురు. కొద్ది మందికి ఉచితంగా కూడా చేయుదురు. నాకచ్చట తెలిసిన వారు కలరు, మీ డబ్బు ఖర్చు కాని మార్గమును నేను చూచెదను. మీరు నిశ్చింతగా యుండవచ్చు  డబ్బు వెనుకకిచ్చి  మీపొలమును మీరు దక్కించుకొనవచ్చు”  అని అగస్త్యుడు చెప్పగా వారి ముఖములలో ఆనందము వెళ్లి విరిసెను. “వాన వెలిసెను రేపు వచ్చెదను” అని అగస్త్య బోవుచుండగా చుండ“ఎంత చిత్తచాపల్యమున్నదో అంతే దయాగుణ మున్నది. మానవత్వమనిన అదియే కదా. మనుజునకు మానవత్వము కన్న మిన్న ఏమున్నది?” యని సుందరి అంతర్వాణి మారుమ్రోగ అగస్త్యపై  సుందరికి జాలి కలిగెను. 

  ఆ. వె.  ఏల వచ్చినా డుచిఱుత డేలత్వ రపడి 

          అరిగి నాడు, ఆశ వీడి, మోహ

           పాశముం త్రుంచి, వాడెంత తల్ల డిల్లెనో!

           నిరాశ భూత మావ హించె నో!! 


4 comments:

 1. ప్రతీ పాత్రను ఉన్నతంగా మలుస్తున్నారు.కథలో మలుపులు ఒక ఎత్తైతే,తేటగీతి, ఆటవెలది పద్యములలో ప్రతీ అక్షరము వెనుక రచయిత కఠోర శ్రమ కనపడుతుంది. భాషా శ్రామికునికి వందనములు

  ReplyDelete
  Replies
  1. दुर्लभं साहित्यसंश्रयः देवानुग्रहहेतुकम् దుర్లభం సాహిత్య సంశ్రయః
   దైవానుగ్రహ హేతుకం Association of literature is God's blessing

   Delete
 2. i love soya food and thanks for this post i like this information please provide few more information about this post mock meat

  ReplyDelete
 3. i love soya food and thanks for this post i like this information please provide few more information about this post mock meat

  ReplyDelete