“దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద లీగల్ బేటిల్.” యని సంతోషముగా వెడలుచున్న పాంచాలిగారికి బేంక్ చెక్ ను అందజేసి “ యువర్ కాన్స్టెంట్ హెల్ప్ హాస్ రెండెర్డ్ దిస్ వర్క్ లెస్ ఆర్డ్యుయస్ దేన్ ఇట్ మైట్ అధర్వైస్ హావ్ బీన్. ఈదర్ ద బీరీవ్డ్ ఫేమలి ఓర్ ఐ షల్ నెవెర్ ఫగెట్ యువర్ హెల్ప్” యనుచు ఆమె ఆమెననుసరించి వాహనమునధిరోహించుచుండ వందనమర్పించి వచ్చు చుండెను. కొంచెము దూరమున నిలిచి చూచుచున్న బసవడు " మనవాడు ఆంగ్లమున గాండీవమును పూనిన పార్థుడు' డని అనుచుండగా " శేషాచలముగారు "ఈ ఆడుచున్న మాటలకర్ధమేమి ?" అనిరి అప్పుడు బసవడు " అంతవిద్యయున్నచో ట్రంపు గారి కొలువున శ్వేతసౌధమందుండెడివాడను గానా!"యనగా వాతావరణము తేలికపడెను.
పిమ్మట వర్ష, బసవడు కాళ్లీడ్చుకొని ఇళ్లకుబోయినారు. బైరెడ్డిని నిక్షేపముగా పోలీసు వాహనమందు గొనిపోయినారు. విదిష శేషాచలముగారు కారులో సబ్బవరం పోవుచున్నారు. శేషాచలముగారు “వర్షుడు అద్దెకు తీసుకొన్న వాహన మును మనకు నియోగించి తానూ మాత్రము నడిచి పోయెను. మాలినిగారి కడుపున బంగారము పండెను, అతడి పాదములకు నమస్కరించవలెనన్న పిన్నవయస్కు డయనాడు, ముద్దాడవలెనన్న పెద్దవాడయినాడు.” యని విదిషతో యనుచూ శేషాచలముగారు వాహన సారథితో మాట కలిపినారు.
"ఎంత కాలము నుండి ఈ బండి అతడికి తిప్పుచున్నావు."
"ఆయ్ నెలకాంచి ఓడతన్నారండి ఈ కారు.
"నీవు ఉత్తరాంధ్రుడివలె నున్నావు.
"ఆయ్ మాది సీకాకులం కాదండి మాది కోనసీమండి.
ఈ కారు అద్దె నెలకు ఎంత యుండునో.. పది వేలుండునా?
ఆయ్ ఇది మామూలు కారనుకొన్నారేటండి. ఇది ఎస్. యూ. వీ అండి. ఎస్. యూ. వీ అంటే మీకు తెలుస్తాదేటండీ ? నెలకి ముప్పియి వేలండి ఈ బండి కిరాయి. మా అబ్బులు గారి బండా మజాకా ...
విదిష : బసవడట్లే ఆవిరి కుడుమువలె నున్ననూ ఆరడుగుల వర్షుడు చిక్కి శల్యమయ్యెను.
శేషా: బసవడిపని శారీరకము వర్ష పని మానసికము. మానసిక వత్తిడి యున్నచో ఎంతటివాడైననూ ఇట్లే యగును. అంతెందులకు వ్యాజ్యము నడుచు చున్నంత వరకు దుఃఖముతో బాటు నాగిరెడ్డి తమ్ముని తప్పించుటకు చేయు కుట్రలు పట్ల వ్యాకులత, సాక్ష్యము చిక్కునా యని సంశయము, న్యాయము దక్కునా యని ఆందోళననన్నునూ బాధిచుచుండెడిది.” ఇట్లు వారు మాట్లాడుకొనుచుండగా వాహము ఇల్లు జేరెను. వాహము వారిని దింపి వెనుకకు మరలెను. చూడచక్కని ఇంటికి దిష్టి గుమ్మిడి వలె, క్రొత్త వాహనమునకు వ్రేళ్ళాడు పాత చెప్పు వలె కళకళలాడు ఆ ఇంట దహించబడిన గృహము అట్లే యున్నది.
విదిష “భీతి యాందోళనలింతవరకు దుఃఖమునావరించి కట్టియుంచినవి. ఆ కట్లిప్పుడు న్యాయము జరుగుటతో తొలగిపోయినవి” యని దుఃఖము పొగులుచుండ కన్నీరు కట్టు తెగిన ప్రవాహమువలె ప్రవహించుచుండ “అమ్మా అమ్మా” యని ఆమె, “అహల్యా అహల్యా” యని అతడు రోదించుచూ ప్రవేశించిరి. శేషాచలముగారు అవశేష గృహము నందు కూర్చుని రోదించుచుండగా విదిష నూతి వద్ద కూర్చొని తనివితీరా ఏడ్చుచున్నది.
ఊరి వెలుపల నున్న ఆ విశాల క్షేత్ర గృహమున ఆమె రోదన కొండలు, ప్రకృతి తప్ప వినువారెవ్వరు. ఆ దైవజ్ఞ తనూజ రోదన కొండలు విని సానుభూతి ని ప్రతిశ్రుతి యందు ప్రసరింపజేసెను. పక్షులు కిలకిలలు మరచి విలవిలలు వినిపించినవి. పుష్పములు మూతులు ముడిచినవి. కళకళలాడెడి తోట కళావిహీనమయ్యెను. వారిరువురి రోదనలు విని, గోమాత లేగ దూడ కూడా అంబా అంబా యని విలపించు చుండెను. గోధూళివేళ యా గృహము శోకవికలిత మయ్యెను. పరితపించు విదిషను గోమాత ఆర్తనాదము తట్టి లేప విదిష గోమాత కడకు పోయెను.
తే. ఏడ్చెంత తల్ల డిల్లి నతిరిగి రాదు
జనని ఊరడి ల్లుముతల్లీ న్యాయ మైన
చిక్కింప తడెంత అలిసెనో దీని కైన
శాంతించి నదక్కు తల్లి కాత్మ శాంతి.
ఓ గోమాత , నీవు మా అమ్మకు ప్రాణము నీకొరకు తన ప్రాణము విడిచిన నా తల్లి నీ ఆర్తనాదమును వినజాలదు. గోమాత దుఃఖించిన అశుభమగును యని గంగడోలు నిమురుచు లేగ దూడను కౌగిలించుకొని ఓదార్చుచుండెను.
పంతులుగారు వచ్చి దూరముగా నిలచినారు. విదిష పోయి తండ్రిని పిలుచుకువచ్చెను. రేపు మాసిక కార్యక్రమము గూర్చి రెండు ముక్కలు జెప్పుటకు వచ్చినాను యని పంతులుగారు అనుచుండగా విదిష లోపాలకి పోయి కుర్చీలు తెచ్చి వేసెను. వారు కుర్చీలపై కూర్చొనక అట్లే నిలుచొని యుండిరి. పంతులుగారు " ఆ దుష్టుని మదమడిచి వాడిచే ఊసలు లెక్కించినారు. ఆ నాగుపాము (నాగిరెడ్డి) తలపై కొట్టినారు. మీగొప్పతనమును ఊరంతయూ కీర్తించుచున్నది. అయ్యా అందు రవ్వంతైననూ నా గొప్పతనము లేదు. మేమంత శక్తి గలవారము కాదు. మేధో సంపత్తి చే కీర్తికెక్కిన భాషావేత్త భారతవర్ష యను కుర్రావాడు ధనమును మంచినీటి వలె ఖర్చుజేసి , రేయింబవళ్లు శ్రమింపగా దక్కిన న్యాయము మా పుణ్యఫలము. విదిష లోపలకి బోయి భారతవర్ష న్యాయస్థానమున న్యాయమూర్తి స్థానమున కూర్చొన్న చిత్రమును గీసెను. దుర్గ రూపమునున్న మిషెల్ చిత్రము ప్రక్కనే వర్ష చిత్రమునుంచి చూడసాగెను.
క. సొంతగ గీచిన బొమ్మను .వింతగ చూచుచు లతాంగి బొమ్మగ మారే పంతము పూనిగె లిచెసఖు డెంతము రిపెమో సురవరు డెంతము రిపెమో
చిత్రమందు అట్లే లీలమై చూచుచున్న విదిష కు ఆ గదిలో మూలగా, లీలగా నవ్వుచూ క్షణకాలం కనిపించిన తల్లి రూపము " బ్రహ్మగారు వెడలినారు రేపు మాసిక జరిపించ వత్తురు” అనుచూ శేషాచలముగారు లోపలి వచ్చుటతో వెలిసిపోయెను. తల్లి రూపము కానరాక కలత చెందిన విదిష కళ్ళు, నలుమూలలా వెదకుచుండ ఆమె పెదవులు అప్రయత్నముగా అమ్మ అమ్మ యని కలవరించుచుండెను. ఆ మాటలు విన్న తండ్రికి మిక్కిలి ఖేదమాయెను. తల్లికొరకు వగచుచున్న విదిషను దగ్గరకు తీసుకొని కుమార్తె దుఃఖమున చిత్తబ్రాంతి నొందెనని భావించి" తల్లీ చావు పుట్టుకలు సురజేష్టుని ఇష్టా ఇష్టముల' ని అనునయించెను. "అమ్మ ఇచ్చటకు వచ్చి నన్నుచూచి నవ్వెను. నాకు నేడు దివ్యానుభూతికలిగెను." అన్న ఆమెతో " అమ్మ ఎవరికైననూ స్వర్గమే కానీ చనిపోయిన తల్లి ఎట్లువచ్చును. అది నీ బ్రాంతి తప్ప నిజముకాదు. నీవు మళ్ళీ కుంచె పట్టగలవాని నేను అనుకొనలేదు. చిత్రకళ యందు మనసు లగ్నముచేసిన ఇట్టి వికారములు కలుగవు. "నన్ను నమ్మజాలకున్నావుకదా" యనుచు విదిష వంటగదిలోకి పోయి వంట జేసితండ్రికి బెట్టి తాను తిని పడుకుండెను.
ఆలోచనా సందోహ సంక్షుభిత బాల కన్మోడ్పు లేక బేలయై తల్పముదిగి గవాక్షం నుండి నిశీథిని తేఱి చూచుచూ తనలోతాను మాట్లాడు కొనుచుండెను " తండ్రి రాకతో అంతర్ధానమైన తల్లి మరల వచ్చునా? కారణమేమై యుండును? ఇదివరకు స్వప్నములో కనిపించెడితల్లి ఇప్పుడు నేరుగా కనిపించెను." " నీతల్లి నీ స్వప్నమున కనిపించటగాదు, నీవు ఇప్పుడు స్వపంలోకమునున్నావు." యని తండ్రి హెచ్చరిక స్వరము వినిపించెను. తండ్రి తన ప్రక్కనే ఉండుటచే దిగ్బ్రాంతి పొంది. "నాకు మా అమ్మగూర్చి చింతతో నిద్రపట్టకున్నది, నీకునూ నిద్ర పట్టకున్నదా? "యనిన విదిష తో " నాకు నా కూతురు గురించి చింతతో నిద్రపట్టకున్నది. అమ్మ కనిపించుట సత్యమైననూ బ్రాంతి యనువారే ఎక్కువ. నీవట్లు పదిమందితో పలుమార్లు జెప్పినచో మానసిక సమతుల్యము చెడినదని భావింతురు కావున నీవికపై సమ్యయమును పాటించవలెన"ని జెప్పి తనగదిలోకి పోయి నిద్రించిరి. విదిషయూ నిద్రించెను. మీనాక్షిగారు ఒక పేద ముఱికి ఇంట పియానో వాయించుచూ పాడుచూ కనిపించిరి. ఆమె ముఖము తేజోభరితమై ఆమె స్వరము సంతోషభరితమై యున్నది.
మొత్తానికి న్యాయం గెలిచింది.వర్ష అనుకున్నది సాధించాడు.మద్యలో జత చేసిన తేటగీతి, కందపద్యములు బాగున్నవి. కానీ ఆఖరి వాక్యము అర్థం కాలేదు.పియానో వాయిస్తూ కనిపించింది ఎవరు?
ReplyDeleteAs it was written in the same sentence Meenakshi is seen playing the piano. Needless to say who Meenakshi is.
Deleteఈ భాగం నిజానికి చాలా ఉద్వేగభరితంగా ఉంది.తల్లిని పోగొట్టుకుని విదిష అనుభవిస్తున్న వేదనని చాలా బాగా వివరించారు
ReplyDeleteమీనాక్షి కి విడాకులు ఇచ్చిన దక్షిణా మూర్తి, అగస్త్య ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ మీనాక్షి కథే అంతుపట్టకుండా ఉంది. ఉద్యోగం వదిలి ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఆమె మళ్లీ ఇన్నాళ్లకు పియానో వాయిస్తూ కనిపించింది. విధిష కథ నడుస్తుండగా చివర్లో మీనాక్షి ప్రస్తావన రావడం ఊహించని మలుపు.
ReplyDelete