Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, December 31, 2020

Bharatavarsha 104

హస్తినాపురి నందు వ్యోమమునకెగసిన గాలి ఓడ  మేఘ మండలముపై తేలాడుచూ ప్రచంఢఘోషా ప్రకంపములతో వ్యోమమెల్ల అదురుచుండ ఏకబిగిన రెండు గంటలలో రెండువేల రెండువందల కిలోమీటర్లు ఆగ్నేయముగా ఎగురుచూ హర్యానా , ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , ఛత్తీస్గఢ్ గగనతలను అవలీలగా దాటి ఒడిషా కలహంది, కోరాపుట్ మీదుగా ఆంధ్ర గగనతలంలో ప్రవేశించి ఆరుకు లోయ   మీదుగా జారుచూ నదీ నదములను కొండ  కోనలను క్రీగంట చూచుచూ వీరాంజనేయునివలె ఉత్తర భారతము నుండి దక్షిణ భారతమునకు కుప్పించి లంఘించి జటాయువు వలే విశాఖలో వాలిన పిదప అత్తగారి భుజముపైవాలి నిద్రించిన విదిషకు మెలుకువ వచ్చెను. ప్రయాణీకులందరూ మెల్లగా దిగుచుండగా  ఓడ ఖాళీ అగుచుండెను.  “అయ్యో ఇంతసేపూ నన్ను భుజముపై ఇట్లే మోసినారా! మీ భజములు నొప్పి చేయునేమో!” “రేపు నీబిడ్డలనూ  ఇట్లే మోసెదను.” అని మాలిని నవ్వుచుండ విదిషకామె తల్లివలె నగుపించెను.

“రెండుగంటల ఇరవది నిమిషములలో కాలాతీతము చేయక ప్రయాణీకులను క్షేమముగా గమ్యము  చేర్చిన ఇండిగోలో మరల ప్రయాణము చేయవలెను” అని ప్రకటన వినిపించుచుండెను. విదిష చేతి గడియారం చూచి “రాత్రి 9. 35 నిమిషము లయ్యెను. చలనచిత్రము చూచు సమయము కంటే తక్కువ వ్యవధిలో వచ్చి చేరినాము.” అనగా మాలినిగారికి ఆశ్చర్యముగా తోచెను. గొంతు సుందరి గొంతు వలెనున్నదే  అనుచుండగా సుందరి తమ వెనుక నుండి చెవిలో మరల అదే ప్రకటన అదే స్వరమున వినిపించెను. ఈ సారి విదిష  మాలిని ఇరువురూ ఆశ్చర్యపోయినారు. “సుందరి విశాఖపట్నము నందు..? అని మాలిని గారు అనుచుండగా “మీ ఇంటికే వచ్చుచున్నాను.” అని సుందరి అనగా మాలిని గారు” పో అమ్మా! రాత్రి పూట  పెద్దదానితో సరసములు,  వలసినచో పిల్లలు పిల్లలు సరసము లాడుకొనుడు” నిజమత్తా! జబ్బుచేసి  సెలవుపై వచ్చుచున్నాను, అదియునూ వర్షుని చలువే   ” అని సుందరి అనుచుండగా విదిష  మాలిని ఇరువురూ అయోమయములో పడిరి. “అత్తా కోడలు నన్ను నమ్మకున్న వెనుకకు పోయెదను.” అని వెనుతిరుగుచున్న సుందరి చేతిని పట్టుకుని " ఎచ్చటికి పోయెదవు , పద మన ఇంటికి పోయెదము నాకే ఇంకొక కొడుకు ఉన్నచో నిన్ను నా ఇంటి కోడలిని చేసుకొనేదిదానను. అని దగ్గరకు లాగెను . ముగ్గురూ విమానము దిగి బయటకు పోవు ద్వారమువద్ద నున్న శేషాచలమును చూచినారు   

శేషాచలం గారు వాహనంతో సిద్ధముగా నుండి వారి మువ్వురినీ ఎక్కించుకొని సాగుచూ అమ్మా మాలినిగారు ఇప్పటికైనా నా కూతురిని నాకిత్తురా అని హాస్యమాడగా “ఆనందనిలయము నల్లుకొన్న రాధా మనోహరమును చూచినారా  ఆతీగె ఈ తీగ” అని మాలిని ప్రేమాతిశయమున పల్కెను.  వాహనము ఆనందనిలయము చేరెను. వాహనంలో  విదిష చేతినూపు చుండగా శేషాచలము వాహనమునుమళ్లించి సబ్బవరం కేసి సాగెను. విరబూసిన రాధామనోహరములను చూచుచున్న సుందరి దృష్టి ముంగిట నిలచిన మెర్సిడెస్ బెంజ్పై పడెను. “నా చెలిమి మెర్సిడెస్ రాణి ఇచ్చటనున్నదే! ఆట పట్టించవలెను.”  అనుచుండగా నందిని నీ నేస్తమా ఇక ఈ రాత్రి శివరాత్రే  మాలిని అనెను. సుందరి మాలిని లోనికి అడుగిడిరి. మాలినిగారు బట్టలు మార్చుకొనుటకు తన గదిలోకి వెడలిరి. సుందరి పక్క గదిలోనున్న నందినిపై కి లంఘించెను. 

ముగ్గురతివలు  కీరముల వలె కిలకిలలాడి  మయూరములవలె ఆటలాడుట మాలినిగారి చెవిన బడుచుండెను. ఇంతలో చప్పున కలకలము సద్దుమణిగి నిశ్శబ్దమావరించెను.   మంజూష  ఏడుపు వినిపించ సాగెను. పరుగు పరుగున పిల్లలున్న గదిలోకి వచ్చిన మాలిని  ఒకే మంచముపై కూర్చొని యున్న ముగ్గురినీ చూచెను. నందినిని చూచుచూ “ఏమాయె ? మొఖమును  దాచుకొని మంజూష ఎందు కేడ్చుచున్నది?” అని అడిగెను.     


మా అన్న సందీపుడి నిర్వాకమట్లున్నది, ఒక సారి వచ్చి చూడమని ఎంత కోరిననూ పట్టించుకొనక ఏ రాచకార్యములు వెలగ బెట్టుచున్నాడో !?" అని నందిని చెప్పెను. మాలిని గారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యెను. మంజూషపై మిక్కిలి ఆగ్రహము కలిగిననూ నిగ్రహించుకొని “మంజు! ఇంట అతిథి ఉన్నప్పుడు ఇవేమిచేష్టలమ్మా , అయిననూ బెంగుళూరు విశాఖపట్నమునకు  ప్రక్కనే ఉన్నదా? అల్లుడు అచ్చట ఎన్ని అవస్థలు పడుచుండెనో!” “నా సమస్య ఎవరికీ పట్టదు సందీపునకే కాక  కన్నతల్లికి కూడా వెగటయితిని” అని మంజూష ఏడవ సాగెను. “

పెళ్లి కుదిరిన  నట్టింట ఏడ్చిన ఎంత అశుభము, ఇప్పుడేమి కొంప మునిగెను . అని చెప్పిననూ మంజూష  ఇంకనూ పుల్లవిరుపు మాటలాడుచునే యుండెను.   వారి దృష్టి మరల్చుటకు మాలినిగారు మాట మార్చి  "సుందరి నీ అనారోగ్యమేమి? నీ అనారోగ్యమునకు వర్షుడేమిచేసెనమ్మా?" అని అడిగెను. ఆమె ముఖములో ఆందోళన చూసి సుందరి కిల కిలా నవ్వెను . మంజూష నందిని కూడా చకితులయ్యిరి. వారిముఖములు పాలిపోయెను.

"మీరు అట్లు అర్ధము చేసుకొనినారా? పార్వతి అపహరణము గూర్చి వినియుంటిరా?" "అయ్యో పార్వతిని అపహరించినారా?ఈ ఘాతుకామెవ్వరు చేసిననూ వారి తల వ్రక్కలగుగాక "అమ్మమ్మ  అంత  మాట అనవలదు , పార్వతిని నేనే అపహరించితిని. అని సుందరి అనెను. ఆ మాట వినినంతనే నందిని, మంజూషతో సహా మాలినిగారి మొహము పాలిపోయెను. మంజూష అలక ఎగిరిపోయెను.

“వర్షుడే  అట్లు చేయమని చెప్పెను." అని సుందరి కొనసాగించుచుండగా మాలిని గారి ఆందోళన మరింత హెచ్చెను  "నాబిడ్డ అటువంటివాడు కాడమ్మా  నీవే ఏదో పొరపాటు పడి  యుండవచ్చు" అని చెప్పుచున్న మాలిని గారిని చూసి నందిని “అత్తయ్య మీరు కలత పడవలదు నేను మాటలాడెదను.”  అని నందిని  సుందరిపై బడెను " ఏదీ కానీ వేళ గేదె ఈనె నన్నట్లు, ఏమే అర్ధరాత్రి ఈ పరాచకములు నా వర్షుని ఇందు ఇరికించ చూచున్నావా! నిజము తెలుపుము లేనిచో  బసవము వలే మీద పడి  కుమ్మెదను.  అనుచూ సుందరి పై బడెను. 

వారి మిత్రోత్సాహము వారికి మల్లికలు కురిసి నట్టు  సీమ పన్నీరము చల్లినట్టు  చంద్రికా సోలము తాకినట్టు ఉన్ననూ  మాలినిగారు వారి జగడము నిజమేమో అని తికమక పడిరి. ఒక నిమిషము పిదప వారు సిగపట్లు వీడి కూర్చొనిరి . సుందరి ఇదంతయూ బసవని కోసము చేయవలసి వచ్చెను. అని జరిగిన కథను పూసగుచ్చసాగెను.

                                                   ***

శేషాచలముగారు లేండ్ రోవర్ ను నిదానముగా పోనిచ్చుచున్నారు. విదిష “నాన్నా మన పాతవాహనము ఏది ? ఇది కొత్త  వాహనము వలే నున్నదే!” ఇది లేండ్ రోవర్ నీవు హస్తినకు పోయిన పిదప హైదరాబాదు పోయి తెచ్చితిని. విశాఖ నందు ఈ వాహన అమ్మకాల కేంద్రము ఇంకనూ లేదు. “ఇది చాలా గమ్మత్తైన సుఖమునిచ్చుచున్నది. దీని ధర  ఎంతుండును ?

“దీని ఎనిమిది ఇంచీల  సమున్నత నిర్మాణమే అందులకు కారణము . ఇందులో కూర్చున్న ఎవ్వరైననూ ఉన్నత అనుభూతిని పొందుదురు. దీని ధర నాలుగు కోట్లు” “మన పాత ఇన్నోవా వాహనము కూడా బాగానే యుండెడిది కదా!”

పాత వస్తువులు ఏవియూ మన వద్ద లేవు. వాహనములు భవంతులు అనీ సరికొత్తవే నున్నవి. నీవిప్పుడు బాగుండుట వరకే ఆలోచించరాదు, శ్రేష్టమైన ప్రతిష్టాత్మకమైన వస్తువులన్నియూ మన  వద్ద యుండవలెను. అనగా మన మాతా  ట్రస్ట్ వద్ద ఉండవలెను.

మాతా ట్రస్ట్ అనగా ? మన ఆశ్రమమును ట్రస్ట్ గా తీర్చి దిద్దినాను తల్లీ.   నీవే  మాతవు ఆ ట్రస్ట్ నీదే తల్లీ , నేను నిమిత్త మాత్రుడిని. నాన్న ఇటువంటివి మనము చేయదగ్గపనులేనా ? నాకీ ట్రస్ట్ నందు ఏమాత్రము ఆసక్తిలేదు , ఇల్లు మాతానిలయముగా , మాతా నిలయము ఆశ్రమముగా, ఆశ్రమము ట్రస్ట్ గా మారిపోయినది. నేను ఇల్లాలిగా మారవలెనని కోరుకొనుచున్నాను. మాత వలె నుండుట నాకు అప్రియముగా నుండును. “ప్రియాప్రియములెట్లున్ననూ ధర్మాధర్మములుండవలెనుకదా  ఇల్లాలైననూ, మాతైననూ  పదిమందిని ఆదరించవలెను కదా. మనమిప్పుడు  అదే చేయుచున్నాము. అనేక సాధు సత్పురుషులకు మునిజనోత్తములకు ఆశ్రయము కల్పించుచున్నాము అదియే ట్రస్ట్ అంతరార్ధము. నీవు దేవి వలే అచ్ఛటుండిన చాలును.” 

నాన్నా ఈ పెంచలయ్య పతాకములు  తాటిచెట్టు ఎత్తున కనిపించుచున్నవి! అని విదిష అనుచుండగా శేషాచలముగారు వాహనమును పతాకం ముందు నిలిపిరి.  విదిష " ఎం ఎల్ ఏ గా గెలుపొందిన పెంచెలయ్య గారికి శుభాకాంక్షలు " అని చదివి “ఎట్టకేలకు మంజూష మామగారు ఎం ఎల్ ఏ అయ్యెను.” అనెను. అంత  సంతోషముగా  ఎట్లు చెప్పుచున్నావమ్మా నీవు కోరుకున్నచో ఆ స్థానమునందు నీవు ఉండెదిదానవు. ఆ స్థానము నీది. అని శేషాచలముగారు గద్గద స్వరమున ఆవేదన చెందుచుండగా నేను కోరుకున్న  స్థానము  నాకు దక్కినది , హస్తినాపురమునందు హ్లాదము, మాలిని గారి మాలిమి చెప్పనలవి కాదు అరుణతారగారు కేంద్రమంత్రి అయిననూ ఇంత పదవీకాంక్షనెప్పుడునూ చూపలేదు, ఉన్నతురాలయిన  ఆమె నా తల్లి స్థానమునలంకరించి నాకు తల్లి లేని లోటు తీర్చుచుచున్నది. నా వర్షుడు ఉన్నతుడై  నేనే  లోకమై బ్రతుకుచున్నాడు. నేను హస్తినకు పోయి పొందినది మాటలలో చెప్పలేనిది అనుచుండగా వాహనము మాత  ఆశ్రమము ముందు నిలిచెను. 

నీవిట్లు పార్వతి పార్వతి యని మెలికలు తిరుగుచున్నచో ఈ ఆగంతకుడు కూడా తప్పించుకొనును . త్వరగా ఆ వాహనము ను అనుసరించుము. బసవడు వేగమును పెంచెను. ద్విచక్రిక 120 కి. మీ వేగమును అందుకొనెను  విద్యుత్ కోస ( బ్యాటరీ ) వాహనము ఇంత వేగము పుంజుకొనుట నమ్మశక్యముకాకున్నది. వలసినచో  ఈ ద్విచక్రిక  ఆ వాహనమును మించి గలదు . అదియే మన సందీపుని విజ్ఞానమునకిదియే సంకేతము.    మిత్రులిద్దరూ ఆ వాహనమును అనుసరించి పోవుచుండగా ఆ వాహనము ఆశీలుమెట్ట వద్ద నున్న ఒక ఆసుపత్రి ముందు నిలిచెను. ఆ వాహనము నుండి దిగిన వ్యక్తి ని వెలుతురులో చూచి మిత్రులిద్దరూ ఖంగు  తిని "యితడు మన సైకాలజిస్ట్ సత్యమూర్తి గారు  అనుచు ఆయనను అనుసరించి లోపలి పోయిరి.   

పరిచయములయ్యిన పిదప సత్యమూర్తి గారు " దక్షిణ మూర్తి గారి సమస్య గుండెపోటువలె కనిపించిననూ దానికి మూలము మానసిక సమస్య , దానికి మూలము మీ సవితి తల్లి  గ్రేసీ అందుకు కారణము ఆమె అబద్రతాభావము అందుకు మూలము నీ భాద్యతా రాహిత్యము " అని తన తండ్రి ఆరోగ్య  పరిస్థితి విచారించుచున్న అగస్త్యునికి చెప్పెను బసవడు " అనగా కొడుకే తండ్రి అనారోగ్యమునకు కారణమనుచున్నారా?” "ఖచ్చితముగా" అని బదులు పలికి అగస్త్యునితో "వలసినప్పుడు వచ్చి వలసినంత ధనము తీసుకొనిపోవుట  నీ భాద్యతారాహిత్యము , కొడుకును కాదనక అడిగినంత ఇచ్చుట మీ నాన్నగారి బలహీనత నిన్ను భావి అధ్యక్షుని చేసిన తన గతి యేమగునని నీ సవతి తల్లి భయము అభద్రతా భావము."  ఈ విషయమై వారు తరుచు గొడవలు పడుచుండెడివారు సత్యమూర్తి గారు చెప్పు చుండగా బసవడికి జాన్ కూడా ఇవే మాటలు చెప్పుట గుర్తుకొచ్చేను. "ఆ గొడవలు కారణముగా పొడచూపిన విభేదములు సమసిపోక ఇంకనూ వారిని వెంటాడుచున్నవా ?" అని బసవడు అడిగెను.  

వయసులో ఉన్న స్త్రీ కి కోరిక  స్వాభావికము అది సమస్య ఎట్లగును?  శారీరక ధృఢత్వము సన్నగిల్లి  ఇటువంటి రోజొకటి వచ్చునని దక్షిణామూర్తి  గారు కలలోనైనా అనుకొనియుండరు. కానీ ఆ రోజు రానే  వచ్చెను.   ముప్పై లో ఉన్న గ్రేసీ  అరయై లోనున్న ఆయనతో  తృప్తి   లేక మరొకరితో సంభందం పెట్టుకొనటయే కాక , ఇల్లువిడిచి వెళ్లి పోయెను. దక్షిణామూర్తి గారు అనేక సార్లు ఫోను చేసిననూ స్పందించని  గ్రేస్ నెలరోజుల తరువాత  ఒకరోజు మాటలాడెను.   వారు మరల కలుసుకొనినారు. మీ అమ్మ ఎందుకో పరివర్తన చెందినట్టు కనిపించెను కానీ పరివర్తన చెందలేదు.  మీ నాన్నగారు కూడా  ఆమెను పూర్తిగా నమ్మక ఒక కొత్త చరవాణి కొని ఇచ్చి ఆమె వద్దనున్న పాత ఫోను తీసుకొనెను. గ్రేస్ తన ఫోనులో గల చిత్రములను సంఖ్యలను  తీసివేసి  ఇచ్చెను.   కానీ మీనాన్నగారు పాతఫోనులో ఉన్న తీసివేసిన ఫోటోలను వెనుకకు రప్పించి  ఆమెను ప్రశ్నించగా ఆమె బుకాయించెన.  ఆమె వేరొక వ్యక్తితో  తీసుకొన్న  నగ్న చిత్రములను  ఆమెకు చూపగా , ఏడ్చుచూ క్షమించమని  వేడుకొనెను. 

ఆమె కోర్కెలు  తీరచలేకున్ననూ  బంధించియుంచి,  అసమంజసమని గ్రహించక, విశ్వాసము చూపవలెనని   కోరుకొనెను.  ఆమె  తిరిగి వచ్చినదని డబ్బుకొరకు మాత్రమే, అది  తెలుసు కొనని నీ తండ్రి  కొంత కాలము ఆమె విశ్వాసముగా నుండగా సంతసించి ఆమె మాట ప్రకారము పబ్లిక్ లిమిటెడ్ సంస్థ చేసి ఆమెను కూడా అందు వాటాదారుని చేసి డైరక్టరుగాచేసెను. ఒక రోజామె స్నానములగదిలో తలుపు  మూసి ఫోను ప్రియునితో మాట్లాడుచున్నది. దక్షిణ మూర్తి అది ఎవరని అడుగగా గ్రేస్  సమాధానమివ్వలేదు. దక్షిణామూర్తి  ఫోను  తీసుకొని చివరిసారి మాట్లాడిన సంఖ్యను తిప్పగా ఫోను మ్రోగుచుండెను కానీ  ఆమె ప్రియుడు మాట్లాడక మిన్నకుండెను. అట్లు పలు మార్లు ప్రయత్నమూ చేసి విసిగిన ఆ మీ నాన్నగారు కడకు అతడి  చిరునామా తెలుసుకొని కలిసినారు. అతడే శ్యామ్. అప్పటికే  పరిస్థితి మీనాన్నగారి చేయి దాటిపోయెను.  

ఆవిడ కుతంత్రముల యందు ఆరి తేరెను. అవి తెలుసు కొనుటకు మీ నాన్నగారు ఒక పరిశోధకుని నియమించినారు. అవన్నియూ  ఆ గూఢ పరిశోధకునకు తెలియును అతడు ఎలప్పుడూ ఆమెను నీడవలె అనుసరించుచు మీ నాన్నగారికి సమాచారమును చేరవేయుచుండును. "అట్లయిన అతడిని వెదకి  పట్టుకొనవలెను". అని బసవడనెను.  అతడిని వెదక వలసిన పనిలేదు అతడి చరవాణి  సంఖ్య  నావద్ద కలదు  అతని రప్పింతును. అని సత్య మూర్తి అతడికి ఫోను చేయసాగెను.                                                              


4 comments:

  1. మొత్తానికి బసవవడి సమస్యను వర్షుడు ఆ విధంగా తీర్చెనన్నమాట.మనస్ఫూర్తిగా మంచి కోరుకొనే స్నేహాన్ని మించిన నైతిక బలం, మనోబలం ఇంకేముంటుంది.ఇంక అగస్త్యుని సమస్య పరిష్కారం కావలెను.

    ReplyDelete
  2. ఈ నూతన సంవత్సరం మీకు మరిన్ని విజయాలను , ఆయురారోగ్యాలని సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.మీ కలం నుండి మరిన్ని గద్య, పద్యములు జాలువారాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. మనస్సాక్షి నీకు బలిమి జగత్సాక్షి నీకు చెలిమి
    చెలిమి బలిమిలు బడసి కొలువు తీరగదే కువలయాక్షి!!!

    ReplyDelete
  4. Barrel e roles
    Loops
    Spinning
    ఎనిమిది ఇంచుల ల్యాండ్ రోవర్
    Interesting gowda culture
    విహంగ వీక్షణం చేయిస్తున్నారు

    ReplyDelete