Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, January 1, 2021

Bharatavarsha -105

  వాల్తేరు అప్ ల్యాండ్స్ నందు సర్క్యూట్ హౌస్ అనిన తెలియనివారుండరు. అవి ప్రభుత్వ అతిధి గృహములని తెలిసినవారెందరు? ఆ అత్యుత్తమ అతిధి గృహముల చెంత వాటిని తలదన్ను మరియొక  విలాస విశ్రాంత గృహము యోచింపగలవారు ఆ పట్టణమునందు అత్యంత ధనికులై యుండవలెననునది లోక విదితము. డచ్ వారి   నిర్మాణ సౌదర్యమొలికించుచు, పెద్ద స్తంభములు కలిగిన  ఆ సువిశాల    రెండంతస్తుల భవనము రాజ ప్రాసాదమువలె నుండును.   చుట్టూ పెద్ద ప్రహరీ గోడ,  దాటిలోనికి పోయిన పిమ్మట పచ్చటి  పచ్చిక ప్రాంగణముతో చలనచిత్రశాల (స్టూడియో) వలే నగుపించును.  ఆ విలాసగృహము నందొకొక వృద్ధ కాపరి  నాలుగు కుక్కలను సాకుచూ  చిన్న అలికిడైననూ తన గ్రద్ద కళ్ళతో చుట్టూ పరికించుచూ  యాంత్రిక పర్యవేక్షణా నేత్రములనే  చిత్తు జేయుచుండును. 

“నిన్ను మామూలు జిలేబి అనుట పెద్ద తప్పిదము,  వయసు పాకము కారు జిలేబీ అనవలెను” “మరి నిన్నేమనవలెను పాకము కొరకు వచ్చు చీమ అనవలెనా?” అని తన ప్రియునితో వాహనమందు కూర్చొన్న  గ్రేస్ చతుర సంభాషణచేయుచూ వాహనమును నడుపుచున్న అతడి ముక్కును పట్టి వత్తెను. వారిరువురూ విలాసముగా నవ్వుకొనిరి. నల్లని కాటుక కనులు విందుకు రమ్మని ఆహ్వానము పలుకుచుండ జీవముట్టిపడు చున్న  జిలేబీ లేత గులాబీ  పెదవుల నందుకొన్న ఆ వలకాడు  గాఢముగా చుంబించ బోవు చుండగా " రహదారి ప్రణయము ప్రమాద కరమ"నుచూ అతడి పెదవులకు అరచేతిని అడ్డుపెట్టి " బంగాళా దగ్గరలోనే యున్నది కదా అనుచుండగా  వాహనము సంపత్ వినాయకుని గుడి దాటి కొండవంటి ఎగుడు దారిలో ముందుకి సాగి  సర్క్యూట్  హౌస్ వద్ద మలుపు తిరిగి “గ్రేస్ విల్లా” పెద్ద గేటు ముందు నిలిపెను. కొద్దీ క్షణములలో గేటు తెరుచుకొనెను. వృద్ధ కాపరి తన కుక్కలతో సహా ఆమెకు ప్రణామము జేసెను. “నాలుగు కుక్కలూ బాగున్నవి” అని అతడు అనగా గ్రాస్ " ఐదు కుక్కలు " అనెను. అతడి దృష్టిలో ఆ బంగళాలో నుండు జీవులు ఐదు. ఒక మనిషి నాలుగు కుక్కలు. కానీ జిలేబీ దృష్టిలో ఆ భవనమందుండునవి ఐదు కుక్కలు మాత్రమే. 


వారు ఆ భవనంలో మొట్ట మొదటనున్న విశాల సమావేశమందిరములోకి ప్రవేశించిరి. ఆ మందిరము గోడలు నలువైపులా నృత్య భంగిమల లోనున్న అర్ధనగ్న స్త్రీల చిత్రములతో అందముగా అలంకరించబడి ఒక చోట  శిలువ వేయబడిన చిన్న క్రీస్తు ప్రతిమ జేగంటవలే నున్నది.  ఆ మందిరము  మధ్యలో నల్ల మద్ది చెక్కతో చేయబడి నగిషీలతో నిగ నిగ లాడుచున్న బల్లపై  పియానో ఆ ప్రక్కనే కూర్చొనుటకు చిన్నబల్ల ఉన్నవి.  ఐదువందల మంది కూర్చొనగల ఆ సమావేశ మందిరమున  పాలరాతి నేలపై నీడలు తేలుచుండెను.  గ్రేస్  తనకిష్టమైన ఒక ఊరువును , అర్ధ వక్షము లను చూపు  నల్లని సముద్రకన్య చేలము ధరించి ప్రియుని క్రీగంట చూచుచూ, నడిచి వచ్చు చుండగా అతడి కన్నులలో విద్యత్ ఘాతము  తగిలి  వెన్నులోకి ప్రాకినది.  పియానోవద్ద కూర్చొని, పియానో మెట్లు నొక్కుచూ జిలేబీ…

అమెరికా దేశ సుప్రసిద్ద గాయకురాలు డోరిస్ డే పాడిన పాత గీతము పాడుచుండెను. జిలేబి స్వరము ఆ భవనము నందు ప్రతిధ్వనించుచు సన్నగా గేటు వరకు వినిపించుచుడెను.  

You work and work  For years and years

You're always on the go You never take the minute off

Too busy making dough Someday you'll say

You'll have your fun When you're a millionaire 

భవనముముందర భాగమునున్న స్తంభముల వద్ద కుక్కలతో కూర్చొని చుట్ట  కాల్చుచూ కళ్ళు మూసుకొని కాలు ఊపుచూ ఆవృధుడు మైమరచి వినుచుండెను. ఇంతలో నల్లని వస్త్రములు ధరించిన యువకుడు తన పిల్లి కాళ్లతో నిశ్శబ్దముగా కదులుచూ గేటు ముందునే నిలిపి యున్న వాహనమును సమీపించెను, ఆ  ఫెరారీ వాహనమును చూడగానే అతడికి నేత్రములు విప్పారినవి, శ్వాస స్తంభించెను వెంటనే తన రహస్య కెమెరాతో అతడు దాని చిత్రములను గ్రహించెను. అతడు తన చరవాణి కంపనమును గ్రహించి సందేశము వచ్చినదని గమనించి. వచ్చుచున్నానని తిరుగు సందేశము పంపెను.   
Imagine all the fun you'll have  In your 'ol rocking chair
Enjoy yourself  It's later than you think
Enjoy yourself  While you're still in the pink

ఆమె కోకిల కంఠమున జాలువారు శృంగార వేదాంత  భావ పూరితమైన ఆ ఆంగ్ల గీతము విన్నఆమె ప్రియుడు “ఎంతో చిన్నది జీవితం  ఇంకా చిన్నది యౌవనం  ఆగదు ఆగదు యౌవనం… మధువులు నిండిన అధరం అన్నిటిలోఅతి మధు రము అనుభవించరా జీవితం”  అనెడి ఘంటాసాల గీతము వలే నున్నది. అని పాడి వినిపించెను. 

జిలేబి తియ్యగా నవ్వుచూ ఘంటసాల గానమందు భక్తి భావము పండును.  "మరి   శృంగారము" అని ఆమె ప్రియుడు అడగగా  జిలేబీ కిలకిలా నవ్వుచూ అదికూడా భక్తి వలే నుండును.  ఆస్కార్ వైల్డ్ చెప్పినట్టు  " వాట్ ఈజ్ రొమాన్స్  ఫర్ ద పూర్ , రొమాన్స్ ఈజ్ ఫర్ ద రిచ్  రొమాన్స్ పాడిన చేసిన మనవంటి ఐశ్వర్యవంతులే చేయవలెను  "అతడట్లే మైమరచి  చూచుచుండగా "సుందర్ నీవు కూడా దక్షిణామూర్తి వలె రాత్రంతయూ రాచ్చిప్ప వలె నిలిచి యుందువా? అని క్రీగంట చూచుచూ అడిగెను. అతడు మెల్లగా వెనుకనుండి ఆమెను హత్తుకొనెను. 

                                                                       ***

యితడు దక్షిణామూర్తి గారి కొడుకు అగస్త్య, అతడు బసవ వీరిద్దరూ మిత్రులు. అగస్త్య, బసవలను సత్యమూర్తి గూఢచారి కి పరిచయము చేసెను. నేను అగస్త్య , నేను బసవ, నేను జే అని ఒకరితో ఒకరు కరచాలనం చేసుకొనిరి. జే మొరటుగా నల్లగా లావుగా  పొడవుగా ఉండెను. అతడితో కరచాలనము   మిత్రులిద్దరికీ ఉక్కు చేతిని పట్టుకొన్న భావ నను కలిగించెను. "ఇప్పుడు నొమ్మిదిన్నర కావస్తున్నది వేళ మించిపోవుచున్నది కావునా భోజనము చేయుచూ మాట్లాడుకొనుట ఉత్తమము” అని సత్యమూర్తి సూచించెను. 
సత్యమూర్తిగారిల్లు మెడపైనే అగుటతో అందరినీ  మేడపైకి కొనిపోయెను.  అందరూ భోజనముల బల్ల  వద్ద   కూర్చొనగా ఒక్క నిమిషము అని జే తన బట్టల క్రింద తొడుగుకొన్న  రబ్బరు తొడుగు గాలి తీసివేసి సన్నగా మారిపోయెను. సంచిలో ఒకడబ్బా నుండి కొంత ద్రవమును దూదిపై వేసి మొఖమును పెదవులను బాగా రుద్దగా నల్లగా తారు రోడ్డు వలెనున్న జే మొఖం తెల్లగా మల్లె పూవువలె మారిపోయెను. కోమలత్వము అతడి మొఖంలో తొంగిచూచుచుండగా బసవలు ఇద్దరు తమను తాము గిల్లి చూసుకొనిరి.   “మన కళ్ళముందు ఈ పనులు చేయకున్నచో యితడు ఆ నల్లని మొద్దు వంటి వ్యక్తి అని చెప్పినా నమ్మెడివారము కాదు. జే అందముగా నవ్వి “ఈ వృత్తియందు ఒకే విధముగా కనిపించిన ప్రమాదము, ఒకే ఆకారము గల వ్యక్తి ని తరుచుగా చూచినా జనులు శంకింతురు. అందుకే ఎక్కువ కాలము ఒక వ్యక్తి ని అనుసరించునప్పుడు  వేరు వేరు  వేషములు వేయవలెను.  

భోజనము లు వడ్డించు చుండగా చచచకా రహస్య కెమెరాతో తీసిన  ఫెరారీ చిత్రములను  చిన్న ద్రోణు కెమెరా ఉపయోగించి గేటు వెలుపలనుంచే  తీసిన  సుందర్ జిలేబీల చిత్రములను  చరవాణి యందు చూపగా అగస్త్య బసవల మొఖములు కళ  తప్పినవి. గ్రేస్ ముగ్గురు ప్రియులని కలిగి యున్నది, అందు ఇద్దరు శ్యామ్ మరియు సుందర్ . వారిరువురూ డైరెక్టర్లే కాక కుట్రదారులే. మూడవ వ్యక్తి ఎవరో తెలియదు. ఇంకనూ కనిపెట్టవలసి యున్నది. వారి ముగ్గురి వాటాల మొత్తము దక్షిణామూర్తి గారి వాటాలకు ఇంచుమించు సరి సాటి. మరి కొన్ని షేర్లను వారి కొని  వారు సంస్థనుండి దక్షిణామూర్తిని బైటకు పంపవలెనని చూచి అది కుదరకపోవుటచే సంస్థ నిధులను  వేరొక సంస్థకు మళ్ళించుచూ  మాతృ సంస్థను దోచుకొనుటయే కాక, సంస్థ నిధులలో నుండి డబ్బును వాడి దక్షిణామూర్తి గారి పేరు మీద  కారు కొని రెండు విధములుగా ఆయనను ఇరికించినారు. 

బసవడు " రెండు రకములుగా ఇరికించుట అనగా ?"
సంస్థ నిధులను వ్యక్తి గత అవసరములకు వాడుకొనుట శిక్షార్హమైన నేరము. అందుకు అతడు జైలుకు పోవలసి యుండును. రెండవది ఫెర్రారీ కారు…  అని జే  కొద్దిసేపు ఆపి ఊపిరి తీసుకొనుచుండగా తక్కిన అందరూ ఊపిరి తీయుట మరిచి విన సాగిరి.  కరకర నములుట కూడా మాని అందరూ చెవులు నిక్కించి వినుచుండగా అగస్త్య గొంతులో నున్న మంచినీరు  మింగుట కూడా ఆపి విను చుండెను. జే కొంచము సేపు మౌనము వహించి పిదప " ఆ కారు లండన్ లో దొంగిలించబడినది, శ్రీలంక మీదుగా ఇచ్చటకి  దొంగ రవాణా చేయబడినది. ఇంతలో బసవడి  చరవాణి మోగుచుండెను. జె స్నానముల గదిలోకి వెళ్లెను. అవతలివైపు పార్వతి గొంతు ఒక్క క్షణము వినిపించి మూగ బోయే ను. బసవడు మిక్కిలి ఆందోళన చెందుచుండగా పక్క నుంచి ఒక స్త్రీ చేయి ఊపి వెడలుచుండెను. అతడే జే అని అతడు వెడలిన పిదప వారికి తెలిసెను.    

2 comments:

  1. కథ ఊహించని మలుపులు తిరుగుతోంది.అతిది గృహాన్ని చక్కగా వర్ణించారు. గూఢచారి పనితీరు అద్భుతం. జిలేబి కథ ఎట్లు కంచికి చేయునో!🤔

    ReplyDelete
  2. కథ ఊహించని మలుపులు తిరుగుతోంది.అతిది గృహాన్ని చక్కగా వర్ణించారు. గూఢచారి పనితీరు అద్భుతం. జిలేబి కథ ఎట్లు కంచికి చేయునో!🤔

    ReplyDelete