Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, January 16, 2021

Bharatavarsha 114

 అబ్బబ్బ ఈ పిల్లలకి చెప్పువారెవ్వరూ లేకున్నారు!   చూడమ్మా ఆ ఇకఇకలూ పకపకలు ద్విచక్రికు తాళము వేసితిని లేకున్నచో ఇంటి ఆవరణలో సర్కస్ ప్రదర్శన చేయుచున్నారు పోనే లేమ్మా చిన్న పిల్లలు ఆడుకొనుచున్నారు. అనుచూ ఇంటికి వచ్చిన పొరుగామె వెడలెను. ఆమెను సాగనంపుతూ బైటకువచ్చిన మాలిని జాంచెట్టు కొమ్మలపై వ్రేల్లాడుచున్న పార్వతి సుందరిలను చూసి” ఏమీ కోతి చేష్టలు అవ్వ ఈడొచ్చిన పిల్లలు ఇట్లు చెట్లెక్కిన చూచినవారు ఏమనుకొందురు!”  “అమ్మా కసరత్తు చేయుచున్నామమ్మా వైమానికులకు శిక్షణ తో పాటు కసరత్తుకూడా ఉండును. నిత్యమూ చేయవలె ను”  “నీ శిక్షకుడు చెట్లెక్కమని చెప్పినాడా? చెట్ల కొమ్మలపై వ్రేళ్ళాడుట ప్రమాదం కాదా! ఇట్లు మతిమాలిన పనులు చేయుచూ నా ప్రాణములు తీయుచున్నారు”

ఈ పార్వతి చెప్పెనమ్మా నేను నేలపై కసరత్తులు చేసుకొనుచుండగా తానే  చెట్టెక్కి చూపి పైకి రమ్మని పిలచినది. “అయ్యయ్యో జారి పడిన ఏమగును? దిగి స్నానములు చేసినచో అల్పాహారం తినవచ్చు పెసరట్లు వేయుచున్నాను”

Nandini - Art - poolabala

సుందరి చెట్టు పైనుంచి మాలిని గారి ప్రక్కకి  దుమికి "అబ్బా పెసరట్లనిన నాకు చాలా ఇష్టము" అనును ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయి చూచుచుండగా సుందరి లోనికి పోయెను. పార్వతి మాత్రమే ఇంకనూ చెట్టు పైనే యున్నది " చెట్లెక్కుట ఎప్పుడు  నేర్చినావే  దిగవే చెట్టు." మాలిని గారు  బెత్తము తీసుకుని కేకలు వేయుచున్నారు  సరిగ్గా అప్పుడే మెర్సిడెస్ బెంజ్ వచ్చి ముంగిట నిలిచెను . నందిని నీలి పరికిణి పై చెంగావి చేలము ధరించి తళ తళ మెరియుచు తన చురుకైన లేడి కన్నులను రెపరెప లాడించుచూ బెరుకుగా మాలిని గారి వైపు చూచుచూ, “ఈ బెత్తమును చూచినా నాకు భయము వేయుచున్నది” అని బెత్తమును లాగి ఆవల పారవేసెను.  నాగు పాము వంటి పెద్ద జడ, నాజూకు మెడ, గుబ్బెత్తులూగుచుండ నాట్యము చేయుచూ “మరి పిల్లలను ఏమిచేయమందువు ఇట్లు నాట్యము చేయమందువా?” అని అడుగు చుండగా, పార్వతి చెట్టు పైనుండి “నేను చెట్లెక్కుట చిన్నప్పటి నుండే నేర్చితిని. బల్లి పాడు లో మాఇంటివద్ద నున్న ఆడపడుచులందరూ చెట్లెక్కువారే.”  చెట్టు పైనుండి దూకి మాలిని గారి వద్దకు వచ్చి” చెట్టు పై నుండి దూకుట  మాత్రమూ అక్క (సుందరి)ను  చూచి ఇప్పుడే నేర్చుకొంటిని.  

సుందరి అప్పుడే స్నానము చేసి  పేంటు , చొక్కా  వేసుకొని  వచ్చినది  "నీకు  పేంటు , చొక్కా  ఎక్కడివమ్మా" అన్నయ్య బట్టలు ధరించినాను " వాడి పెట్టికి  తాళము పెట్టిన గా నీ , వాడి బట్టలు వాడికి దక్కవు "    పార్వతీ నీవు కూడా స్నానము చేసి రమ్ము అని ఆమెను లోనికి నెట్టెను.

మంజూష అప్పుడే నిద్రలేచి స్నానాలగది వద్దకు పోయెను అచ్చటనే సుందరి నందిని పార్వతితో కబుర్లు మొదలు పెట్టినారు. " లోపల అది స్నానము చేయుచుండగా మీ ముగ్గురూ అచ్చట నిలబడి ఏమిచేయుచున్నారే " మాలిని గారు కేకలు వేయగా " వీపు తోముచున్నాము " అని నందిని అనుచూ మా అందరికీ  పెసరట్లు వేయుచున్నారా ?" అని అడిగెను . స్నానాలగదిలో నుండి పార్వతి " సబ్బు అరిగి పోయినది" అని అరిచెను  

సుందరి  పాత సబ్బు పారవేయుమని  కొత్త సబ్బు తెచ్చి ఇచ్చెను.   నందిని " ఆ పాత సబ్బు పారివేయుటకు బదులు నీ బసవడికి చ్చినచో అతడు దానిని పెట్టెలో భద్రముగా దాచుకొనును."అనెను. " అరిగి పోయిన సబ్బు కు అంత ప్రత్యేకత కలదా?" అని సుందరీ మంజూష  ఆశ్చర్య పోవుచుండగా  నందిని ఒక దండకమునాలపించసాగెను. 

పడుచు దేహమంతయూ తాకి  నురుగగా ప్రాకి, ఔష్ఠ ములు నాకి

 కంబు కంఠంబు పై  జారి మధురాంగముల జేరి , 

గిరగిరా తిరిగి జరాజరా ప్రాకి నడుము పై నర్తించి , 

నాభి అంతయూ నిండి   ఊరువుల పై  పొంగి   

 దిండీర భిండీర మై  పెక్కు కోణాలు శోధించి,  మోహ బాణాలు సంధించి  

 నీ   నిమ్నోన్నతములు సేవించి ,  నీ చేతిలో వొరిగి నీ వొంటిపై  కరిగి 

నీ ఇంపైన సొంపుల కు   గంభీరవంపులకు   గంబూర  పరిమళములద్దు, మెరుగులేదిద్దు సబ్బు, స్త్రీలు వాడినా,  ఎంత అరిగినా,  కొంత తరిగినా, ముక్కలుగ విరిగినా, ఏంతో  కొంత మిగులు,  అదియే   పురుషులకు ఇంపు   ఉత్సాహమే నింపు  ఉల్లాసమే పెంచు  ” సబ్బు బహు  చిన్న  విషయమ్ము ,స్త్రీ వాడిన సశేషమ్ము,  పురుషునకదియే  విశేషమ్ము. పార్వతీ సబ్బు పారెయ్యకుమ్ము  అదియే బసవడికి సొమ్ము 

అని సబ్బు దండకమును    చదువుచుండగా మాలినిగారు చెవులు మూసుకొని “అచ్చట ఆపుము తల్లీ నీ దండకములకొక దండము సబ్బు నురుగ కళ్ళ లోకి పోయి కనులు  మండు  చున్నవి . చిన్న పిల్లలు చెడిపోవుచున్నారు” అని కేకలు వేసిన పిమ్మట అంతయూ సద్దు మణిగినది.

                                                                  ***

అందరూ వంటగదిలో క్రింద కూర్చొని పెసరట్లు తినుచుండగా, పార్వతి " నేడు ఆయనకి  మన చిరునామా ఇవ్వక తప్పదు, అడిగిన బహుమతులు చెప్పిన చోటకి పంపెను కదా" కానీ కారు తీసుకొని రమ్మని చెప్పెదను” అని నందిని చెప్పుచుండగా " అయ్యో వారి వద్ద కారు లేకున్నచో?!”   “బల్లి పాడులో అతడిని ప్రశ్నలు అడుగుచుండగా నీవిట్లే వీగిపోయినావని వింటిని , ఆ మెతకతన మి చ్చట  చూపవలదు.” అతడి తంటములెట్లు పడవలెనో అతడికి తెలియును, చెప్పినది చేయుట అడిగినది ఇచ్చుట మగవారికి నేర్పవలెను అనుచూ   నందిని  మగవారినెట్లు చెప్పుచేతలలో ఉంచుకొనవలెనో సులభ సూత్రములు చెప్పుచుండెను ఇంతలో దామిని వచ్చెను. “దామినీ నీకునూ పెసరట్లు వేసెదను కూర్చొనుమ 'ని మాలిని పీట వేసెను. పెసరట్లు తినుచూ సుందరి,  నందినితో  "అక్కా మధురాంగములనిన ఏమి?" అని అడిగెను, మంజూష నాకు కూడా మధురంగములనిన అర్థము తెలియదు అనుచుండగా. దామిని కూడా ఆ పదమునకు అర్ధము తెలుసుకొనుటకు మిక్కిలి కుతూహలము చూపుచుండెను. మీ ఇద్దరికీ వాతలు పెట్టెదను అని సుందరిని దామినిని మందలించుచూ, మాలిని అట్లకాడ  చూపెను. “ఏమే మంజూషని వదిలి వేసినావు అది కూడా అడిగినది కదా, నీకూతురని దానిని వదిలివేసినావా ?” అని దామిని అనెను.  మంజూషను   దండించరాదు  కారణము  చూచి గ్రహించవలెను అనగా పార్వతి " నాకు అర్థమైనది నాకు అర్థమైనది " అని అరుచుచుండగా " అబ్బా నాకునూ  అర్థమైనది , బల్లిపాడు పిల్లకు మునుపెంతో  సిగ్గరి , ఇప్పుడు నోరు పెరిగినది  " అనుచూ " అట్లయిన అదే కారణమున నన్ను కూడా  దండించరాదు " అని దామిని అనుచుండగా మాలిని కళ్ళు విప్పారినవి. “నీవు కూడా ?” అని మాలినిగారు దామిని వైపు చూడగా అవును అని దామిని సిగ్గుతో తలా ఊపేను. 

సుందరి నీవు పెసరట్లు వేసి పట్టుకుని రావలెను మేము పడక గదిలో కూర్చొని విశ్రాంతి తీసుకొందుము అని మాలిని నోట్లో పంచదార జల్లు చుండెను. సుందరి "నాకు రాదే ఎట్లు చేయవలెను ?" అను చుండగా మాలిని గారు " నేర్చుకొనవే , ఆ నందినితో తిరుగుట తగ్గించి నేర్చుకొనిన  సులభముగా   వచ్చును " అని నెత్తిపై ఒక్కటి మొట్టినారు " 

నందిని "అట్లైనచో నీవు విమానము నడుపుట సుందరివద్ద నేర్చుకొనుము , నేర్చుకొనిన సులభముగా వచ్చును." అనెను.  “అబ్బబా! ఇదమ్మ దీనివరుస” అని మాలిని విసిగిపోవుచుండగా “కోడలు అత్తతో సరసమాడరాదా?” అని నందిని దామినితో అనెను” మాలినిగారు " నేనే కోడలు నీవే అత్తవలే నున్నావు." దామిని గర్భవతి అయినది అన్న శుభవార్త విని ఆమెను తీసుకొని పడక గదిలోకి పోయి ముచ్చట లాడుచుండగా నందిని పెసరట్లు వేసి వారిరువురికీ అందించెను. “నీకు సంతానము కుండుటచే అందరమూ చిన్నబోయినాము, నేడెంత  శుభదినము , ఎంత శుభవార్త తెచ్చినావు అని స్నేహితురాలిని మాలిమి చేసెను.”

“ఎం ఎల్ ఏ కూతురినని చూడక నాచే వంట పని కూడా చేయించుచున్నావు!” అని అలక ప్రారంభించెను. అప్పుడే ఆనంద నిలయ ప్రాగణంలోనికి లేండ్ రోవర్ వాహనము ప్రవేశించెను. అందరూ బయటకు వచ్చి చూసిరి. ఆ వాహనమును విదిష నడుపుకొని వచ్చుట అందరినీ అబ్బుర పరచగా ఆ వాహనమునుండి విదిష తో కూడి వచ్చిన మరొక స్త్రీ అందరినీ మరింత అబ్బుర పరిను.    ఆమే నందిని తల్లి పైడమ్మగారు.

వారిరువురినీ చూడగానే నందిని కుతూహలము కుత్తకయందు కుంభకము కాగా   బకము వలె నిలిచెను.  సబ్బు దండకమునకు చెప్పిన పండితురాలికి మబ్బు పట్టెను.    రాధామనోహరమల మెరుపు ద్విగిణీ కృతమయ్యెను.  మూల మూలల నున్న  విరులన్ని వికసించి హసించుచున్నవి. “ఆనందనిలయమునకు పెళ్లికళ వచ్చినది రండి రండి” అంచు మాలిని గారు ఎదురేగి పైడమ్మను సాదరముగా ఆహ్వానించుచుండగా విదిష మాలిని గారి పాదములకు నమస్కరించెను. అది చూసి మంజూష పైడమ్మగారి పాదములకు నమస్కరించుచుండగా ఆమె మంజూషను వారించి చెంతకు తీసుకొనిరి. 

అత్తకాడ ఉంటాను, అత్తకాడ ఉంటాను, అంతాది అమ్మా  మా నందిని , నా నొద్దమంతే మావు  నల్ల గుంటాము   సూత్తన్నారు కదా.     నాకేటి మీనాగ బాస్సొచ్చా  మీ పద్ధతొచ్చామీరా బేమ్మర్లు.  

కులము దేమున్నదమ్మ, గుణముండవలెను కానీ, మీరు నలుపైననూ మీ మనసు మల్లి పువ్వు వలే తెల్లగా మెరియుచుండునుఅని మాలిని గారు పైడమ్మను కౌగిలించుకొనిరి. నా కూతురికి నా రంగు రానేదు తెల్లగుంటాది, ఆ కిట్ట పరమాత్మ దయవల్ల,  నీ కొడుకు పున్నె ము సరస్వతి కటాచ్చముంది, మంచి కోడలుపిల్ల లొత్తంది. అనుచుండగా “మాలినిగారు వియ్యపురాలిని లోనికి తీసుకొని పోయి పడకగదిలో మంచముపై కూర్చోండ బెట్టి “వదినగారి పట్టు చీర చాలా బాగున్నదే, వారిని కూడా తీసుకొచ్చిన బాగుండెడిది, అన్నయ్యగారు బాగున్నారా?” అడుగగా విదిష " ఈ మధ్య కొంచెము పని వత్తిడి పెరిగి ఖాళీ లేకుండెను , ఒక పక్క చర్చ్ లను , మరొక ప్రక్క రాజకీయములను చూచుకొనవలెను   కదా!

ఈ మద్దెన చర్చీలేటి బాగోనేవమ్మా  అమెరికా ఓల్లు  డబ్బు ఆపేసినారు , అల్లు పంపిత్తే  ఇక్కడ మనోళ్లు ఖర్చు లెట్టి పెచారాలు సేత్తారు, డబ్బిచ్చి సెడగొడతాన్నారమ్మా  అంటా ది,  మా నందిని. అనుచూ మాలినిగారి చెవి లో గుసగుసగా " ఈ గుంట సిన్నబొమ్మేటి , ఇదే ఆ అమెరికా  ఓల్లకి ఈల్లు  డబ్బు లెలాగా నొక్కేత్తన్నారో  రాసేసింది ఉత్తరము. "  ఆ మాట వినిపించకున్ననూ తనగురించి ఎదో చెప్పుచున్నది అర్థమయ్యిన నందిని కి తాపము హెచ్చి "అమ్మా మనము ఎం ఎల్ ఏ గారి కుటుంబమని మరువరాదు "అనుచూ పైడమ్మగారిపై పడి “నీకెక్కడికి వచ్చిననూ ఏదేదో మాట్లాడుచుందువు నీకుమాట్లాడుట రాదు, ఇంటికి పోయెదమ పద పద అని తొందర చేయుచుండెను. అది చూసి  మాలినిగారికి సెగలు రేగినవి “ఆమె ప్రపంచము బహు స్వల్పము,  పాపము, తన పిల్లలులే తన సంపద. కల్లా కపటము లేని ఆమె తన బిడ్డలగూర్చి చెప్పుకొని మురియుచున్నది. అందుకు నీవెందుకు కినుక వహించవలెను” అని మాలినిగారు అనగా , దామిని " ఆమె పేరు లో నే కాక గుణము కూడా బంగారమున్నది  , ఆమె ఎంతో  చక్కగా మాట్లాడు చున్నది అనెను. సుందరి, పార్వతి, లు ఏమియూ అర్ధము కాకపోవుటచే తెల్ల  మొఖం వేసిరి. మంజూష కాఫీ చేసి అత్తగారికి ఇచ్చెను.  

కాఫీ త్రాగుచు పైడమ్మగారు “ కోటి రూపాయ లొట్టుకోని  తెల్ల కోడలుపిల్ల ఒత్తంది, ఇంకేటి కావాలి? మా యజమాని ఎగిరి గెంతేత్తన్నాడు.”   పిల్లలందరూ చుట్టూ చేరి ఆలకించుచుండిరి కానీ పిల్లలందరికీ ఆ భాష,  విషయము రెండూ అర్ధము కాక  తెల్ల మొఖములు వేసిరి  . 

మాలిని గారు " వియ్యపురాళ్లు ఇరువురూ మాట్లాడుకొనుచుండగా మధ్యలో పిల్లలు దూరవలదు పిల్లలు వలే నున్నచో మంచిదనగా, నందిని ముఖము ఎర్రబారెను" ఇదంతయూ ఆ వర్షుని పని, ఈ నాటకుమునకంతయూ అతడే సూత్రధారి అని సుందరి,  పార్వతి మంజూషలతో అనుచుండగా విదిష విని "అయ్యూ, వర్షుని ఒక ఆడించు భామకు ఎన్ని కష్టములొచ్చెనో " అనెను. 

"ఇందులో నీ మోసము కూడా యున్నది "అని ఉక్రోషముతో మీదకు వచ్చుచున్న నందినిని విదిష కను సైగ చేసి సోఫాలో కూర్చుండ బెట్టెను. నందిని మంత్ర ముగ్ద వలె సోఫాలో కూర్చొనెను. విదిష ఆమె ప్రక్కనే కూర్చొని తలనిమురుచూ " కొంత సేపు పడుకొని ప్రశాంతతను పొందుము, అత్తతో పోట్లాడినది చాలు అమ్మతో, కలిసి ఆడుకొనుము" అని కళ్ళలో కళ్ళు పెట్టి చూచుచుండ, ఏ దివ్య శక్తి ఆకనులయందు కదలాడుచుండెనో నందినిని మెల్లగా మగత కమ్మెను. ఆమె కన్నులు మూతపడుచుండగా సోఫాలో అట్లే పడుకొనెను. కాలము స్తంభించెను. అందరూ అవ్యక్త అతులిత అలౌకికానంద డోలికలలో తెలియాడిరి.

నందిని నిద్ర లేచి చూసుసరికి మాలిని గారు పైడమ్మ ఆనంద నిలయము ఆవరణ లో  పాశ్చాత్య నాట్యము  చేయుచుండిరి.  నందిని తన కళ్ళనుతానే నమ్మలేక కళ్ళను నులిమి చూడగా నాట్యము వేగము పెరిగినది. మాలినిగారు ఊపులో జయమాలినిని మించి నారు.   వారి నాట్యము ముగిసి న పిదప పైడమ్మ దామిని తో కూడి నృత్యము చేయుచుండిరి. 

పిదప పైడమ్మ గారు చలవ కళ్లజోడు ధరించి విదిషను కూడి హంస నడకలు నడుచుచుండగా నందిని లేచి మాలినిగారి పట్టు చీర ధరించి తల్లి వద్దకు పోయెను.  విదిష ప్రక్కకు తప్పుకొనెను. నందిని తల్లితో కొంతసేపు అట్లాటలాడెను.  అట్లు వియ్యాలవారి ఆటలు పూర్తి అయిన పిదప పైడమ్మ "ఇక సెలవు పెళ్ళిలో కలుసు కొందుము అని "నందిని కారులో వెడలెను. తుఫాను వెలసెను.  మాలిని గారు విదిషను కౌగిట చేర్చుకొనిరి. 

5 comments:

  1. Sabbu dandakam audio will be inserted tomorrow.

    ReplyDelete
  2. బాగానే ఉంది‌ ఆనంద నిలయంలో పెళ్మి సందడి.అమ్మాయిల కిష్కింధ కాండ, పెద్దల పాశ్చాత్య నృత్యం 🤣🤣🤣
    Pic of Nandini is awesome👌

    ReplyDelete
  3. కోటి రూపాయలు కట్నం? ఊహించనే లేదు🤔🤔🤔

    ReplyDelete
    Replies
    1. Thanks for sharing your joy. Varsha gives 1 Cr cheque to penchalayya. Hope you have read that in previous episode

      Delete
  4. సుబ్బు బిళ్ల, ఆడపిల్ల, కుక్క పిల్ల కాదేదీ కవితకనర్హమని విన్నాము.ఇప్పుడది నిరూపించారు.

    ReplyDelete