భారత వర్ష లో వాడిన భాష ఒక్క తీరుగా ఉండదు. పండితులకు పామరులకు వేరు వేరు భాషలు వాడబడ్డాయి. ఇది కాక నేటి ఆధునిక యుగమున మాట్లాడుకొని సినిమాభాష కూడా వాడబడినది
పండితుల సంభాషణలు
ఆ సందీపునెట్లు వలచితివి, అతడియందే సుగుణములు చూచినావు? నీ మూలమున నేడానంద నిలయమున ఆనందము అడుగంటినది. దుస్వప్నమందైననూ ఇట్టి దారుణ పరాభవ మునూహింపమే, అట్టిదారుణము నీమూల ముగా వాటిల్లినది నీబుద్ధిహీనతకు చిత్తచాంచల్యమునకు హద్దు లేకుండెను.
మంజూష: సమీరము వలె రేగి సమీకమును సృష్టించి ఉగ్ర నరసింహుని వలె ఊగ నేల? కలము పట్టిన వాడు చేత ఖడ్గము పట్టి అడరి బరి యందు అరిమూహము నదిలించనేల? నీ ఉద్రేకము చాలింపుము. నీ ఉద్రేకమునకు నా జీవితమును హారతి కర్పూరము చేయవలదు.
మాలిని: సోమ యజ్ఞాల సోముగ శోభిల్లు పండిత వంశమున బుట్టి సోమమును జూపిన, పెంచిన హృదయము తల్లడిల్లె, సోమకోర్వలేని సుకుమారుడను కొని రాకుమారుని వలే సాకిన నాకుమారుడు కావ్య కవితా ఛత్రపతి వలె వెలుగొందవలె, తలపులందు గేయములుండవలె తలనిండా గాయములున్నచో హ్లాదమగునా?!
పామరుల సంభాషణలు
ఆది : ఒలేయ్ పైడి నీ ల్లొట్రాయే , వేన్నీలు బేగొట్రాయే
పైడి : కుక్కనాఁగ కయ్ కయ్ మనరుత్తావెందుకు. వేన్నీలు వేన్నీలు అనిరిత్తేతొచ్చేత్తాయేట్రా! టవ్వు మీదెట్టేను కూకో! కాళ్ళు సేతులు అన్నీ సరిగ్గున్నాయా ఇరిగిపడిపోనాయాఓపాలి సూసుకో! ఆ బాబుని సూసి కూడా ఎల్లేర్రా! బుర్రతక్కు వెధవల్లారా.
దాసు : ఓలమ్మ ఇప్పుడేటనకే, ఒళ్ళంతా పచ్చిపుండైపోనాది, ఇరగ్గొట్టేసాడు. పైడి “ఆ బుద్దప్పుడే టైపోనాదీ కడుపుసేసి ఒగ్గేత్తూ రుకుంటార్రా! నాయం ఉండాలిరా రగి డీసెదవల్లాగా !”
ఆది “బావ మాటలు వినెల్లి దెబ్బైపోనాం బావో , ఇంకెప్పుడెల్లము ఆవర్స గాడి జోలికి.” పైడి ఆదితో “ ఇంతకీ మీబావేడిరా , ఈడు ఎక్కడ దూరేశాడ్రా ?” దాసు “ఇంతవరకు ఆ అరుగుమీద దొల్లేడు ఇప్పుడే లోపలికెల్లిపోనాడు. పైడి “ఏటి తాగేసి తొంగుండిపోనాడేటి? దెబ్బలు తగిలితే ఆడదే సేత్తాడు. పైడి పెంచలయ్య చేతిలో తుపాకీ చూసి “ఒరిదిగో ఎలిపొచ్చినాడ్రా! ఓలమ్మో టుపాకటు కొచ్చాడు పిచ్చెక్కిపో నాదీడికి.
సినిమాభాష
షిట్! పిచ్చిపుష్పాలే రాత్రిళ్ళు గుడికెళతాయి. మనలాటోల్లు ఏ బార్కో ఎల్లాలి!
కశ్యపా ఇంత నీచభాషణ మెందుకు, నీ తీరేమి ఇట్లు జారిపోవుచున్నది ? ఆంగ్ల మిళిత వ్యవహారికమే మా ఇంట చులకన చేసెదరు ఇంక ఇటువంటి భాష ఆడిన మనకేమి విలువ ఉండును?”
“మీది క్లాసికల్ తెలుగు అంటే గ్రాంధికం, ఒక రకం గా చెప్పాలంటే రాచ భాష ఒకప్పుడు వెర్రి పువ్వులు, వెర్రి పుష్పాలు ఇలాటి భాష అస్సలు ఉండేది కాదు.నువ్వు అప్డేట్ అవ్వలేదు గానీ అందరూ అప్డేట్ అయిపోయారు. ఇప్పుడు సిని మాలు చూసి ఆడవాళ్లు కూడా ఇలాటి భాష ఫ్రీగా ఎక్కడపెడితే అక్కడ మాట్లాడేస్తున్నారు. మనం ఎన్ని బూతులు మాట్లాడిన ప్రజలు మననే కొలుస్తారు.”
ఇందులో చెడిపోవుటకేమున్నది? కళ్యాణోత్సవాల్లో పాల్గోవాలని ఆమె తపించుచున్నది. నాకొరకు ఎదురు చూచుచుండును.
నీ యమ్మ ఏటా భాష ? నీ యమ్మ వింటుంటే బ్రహ్మనందం కామెడీలాఉంది. ముందు భాష మార్చు. నాకు పిచ్చెక్కుతున్నాది.
ఇంతకీ హరికథలు వినేస్తే బాగుపడతారానా మీ అమ్మ ఉద్దేశ్యం?
మన సంస్కృతి సనాతనధర్మము గురించి మనం తెలుసుకోవాలని.
హు.. సనాతన ధర్మం! షిట్! టీవీ కావాలా సనాతనధర్మం కావాలా అంటే విసిరిపారేస్తారు
సనాతన ధర్మాన్ని. అవకాశం వస్తే ఎప్పుడు విదేశాలు దొబ్బేదామా అని చూసేవాళ్ళే, గుంట దొరికితే ఎప్పుడు ఎక్కేద్దామా అని చూసేవాళ్ళే అంతా. ఫకింగ్ హిపోక్రసి! నోరిప్పితే నీతులు, ఆర్డ నరీ క్లాస్ పూర్ క్లాస్ లో ఇదొక కంపల్షన్.
భారతవర్ష అనే బంగారు ఉంగరంలో పొదగబడిన ఉపమాన రత్నాలను తీసి ఒక చోటకు చేర్చడం అంటే దుస్సాహసమే. భారతవర్షాలో ఉపమానాలు ఏరి ఏరి అలిసిపోయాను. ఆపేస్తున్నాను.
భారతవర్షలో 2000 ఉపమానాలు ఉండొచ్చు. కొన్ని ఇక్కడ మీకోసం
నీలి గగనమందు పాలపొంగులు వంటి మేఘముల గుండా క్రిందకు జారుతున్న విమానముచూపరులకు అప్సరవలె, విమానాశ్రయము తపమాచరించు ఋషివలె నగుపించెను.
విమాన గవాక్షము నుండి చూచుచున్న యమునకు కొచ్చి విమానాశ్రయ ము కోనేట తేలుచున్న తామర పుష్పమువలె, మహాబ్ధివంటి విశాల హరిత పచ్చికలో తేలు చిన్ని ఓఁడ వలె మనోజ్ఞముగా కనిపించెను.
యమున దృష్టి ఎగిరిపోవుచున్న సంగీత సంకేతములున్న కాగితములపై పడెను. పూరెక్కల వలే నున్న ఆ కాగితములను చూచి అవి నోరు తెరచి పాడుచున్నట్లనిపించి మీనాక్షి లో సరస్వతికి మనసులో నమోవాక్కములర్పించుచూ శిల్పంవలె నిలిచి పోయెను.
మీనాక్షి మందగమనమున పియానో వద్దకు పోయి రాగములు పలికించుచూ గానము చేయుచుండగా ఆమె చుట్టూ ఉన్న విద్యుత్ దీపములమధ్య ఆమె ఒక విద్యుద్దీపమువలె మెరియుచూ రసరాగ సంగీత వెల్లువలోకి తానేపాటై ప్రవహించుచూ యమున అనే ప్రేమ కడలి తనను అక్కున జేర్చుకొని ఓదార్చుచున్న అనుభూతి పొందెను.
“ఆహా! ఎంత ఆహ్లాదంగాయున్నవీ పూలదండలవంటి పద్యములు, ఆ భావ పరిమళములందునా మనసు ఊయలలూగుచున్నది కదా!”
నిగనిగలాడు పసిమి దేహము అజంతా శిల్పము నవనవ లాడు పెదవులు పూరేకుల, దంతములు మిలమిల మెరియు ముత్యాల సరులు, గలగల పారు నగవులు సెలయేరు , మిరపపండు రవిక, కుంభస్తనద్వయము, చూచుకములును దాచలేని జాలువారు పారదర్శక రజత శ్వేత చేలము, చిత్తిని చిట్టి చేఁతలు మేనిమెరుపులు చూడ నీలాకాశము నేల వాలినట్లున్నది.
ఘనస్తనముల జంబునేత్రి మీనాక్షి దీర్ఘ కుంతలములను సడలించ కీకారణ్యమును తలపించు యా నిబిడ కేశములు సైకత పిరుదులపై బడి నర్తించుచుండగా ఆ గజయాన మందగమనమున మిద్దెపై హిరణ్య సమయమున సంచరించు చుండెను.
శిల్పనిర్మాణసౌ ష్టవమునుకలిగి సాహిత్య సంగీత కళాహారముల కాంతులీను యోష, త్రివేణీ సంగమ ఘోషను ముహుర్భాషా శ్వాస లో నిలిపి భారత రాజధాని యందు సాహిత్య జ్ఞాన జిజ్ఞాసులకు సోపానములవలె జిగజిగలాడు జియ్యవలె, సనాతని విశ్వరూపమువలె వెలుగు చున్న దివ్వెవలె కోపర్నికస్ మార్గమందు కళాదేవళ ధ్వజ స్తంభమువలె నిలిచియుండెను.
లేలేత సూర్యకిరణములు లేలెమ్మని జగతిని తట్టి లేపుచున్నవి. ఆశిరుడు శిశిర కాంతను తన లంబ కిరణములతో తాకుచూ హిమ బిందువులతో తడిసిన ఆమె దేహమును ముద్దాడు చుండెను.
ఆర్యాణి, కల్యాణి, కాత్యాయణి, నీహారమే, నిహారమై, ప్రకృతికి హారమై, జీవులకు ఆహారమై నొప్పుచున్నది కదా!"
చంద్రు కాంతిలో జలరుహమ్ముల (కలువపువ్వుల) మేని కాంతులు మెరియుచుండ జోడు గుఱ్ఱములవలె అతివలిరువరు నిలిచి అతిథుల నాహ్వానించుచుండిరి.
విదిష తన పుష్పాలంకృత ద్రాష్టిగ కేశములను పొడవాటి పూల జెడను చేతపూని నిలవగాఎక్కుపెట్టిన శృంగార క్షిపణి వలె కనిపించుచుండెను.
నిహారస్నాన మాచరించిన ప్రకృతికాంత ఆ లోకచక్షు పసిడి రేఖలందు తన అందములనా రబెట్టుకొని నిగనిగ మెరియుచున్నది.
"శిరము మబ్బులందు సరము మిద్దెనందు గల రాజగృహమును కాంచిన ఈ రాజహంస ఏల నేల వాలెననిపించును.
మన మేనమామ, చందమామ ముక్కొకటి తెగిపడెనేమో!
వన్నెలు దోచిన యామిని నందినిని మధురస్మిత మందహాసమును గాంచి వీరులు వివశులవ్వగా విరులు అసూయచెందినవి.
రాధామనోహర పుష్పములు పిల్లగాలికి తలలు ఊపుచూ పిళ్ళారిగీతమేదియో పాడుచుండెను.
అడుగడుగునా అలంకారాలు
తల తిప్పితే తేనెలొలుకు చందాలు అడుగు తీసి అడుగేస్తే వర్షంలా కురిసే వర్ణనలు. వెరసి భారతవర్ష లో అడుగడుగునా ఉర్రూతలూపు కవనాలే, శృంగార సుమపరిమళాలే. ఇది నిజమా అతిశయోక్తా?
మొట్ట మొదటి పేజీలో భారతవర్ష ఆనంద నిలయం ముంగిట నిలిచి తలతిప్పి రాధా మనోహరం పుష్పాలను చూస్తాడు అంతే పుష్పాలను కన్నె పిల్లల్తో పోల్చి శార్దూల పద్యం , ఆట్లాడే సుమబా లలంత మురిసేరపార బ్రదీప్తందు అని పుష్పాలను కన్నెలతో పోల్చి వెలిగె రాత్రి రాధామనోజ్ఞ ద్యుతిన్ అంటే పువ్వుల కాంతిలో రాత్రి వెలుగుతున్నదని , రాత్రికే పువ్వులు అందాన్నిచ్చాయ ని అదవ్వగానే పిళ్ళారి కృతులెన్నొ పాడి విరులే మీటేను సారంగమే, కళ్ళా రా కన వేల్పుచేడియలు ఈ గారాల పూబాల లే అని మరో శార్దూలం ముందుకొస్తుంది
తర్వాత తల పైకెత్తి ఆకాశంలో చంద్రుడిని చూస్తాడు అంతే మళ్ళీ మొదలౌతుంది శృంగార కవనం
చంద్రుని చూసిన భారతవర్ష కి గ్రీకు పురాణములో ఎండిమియన్ గుర్తు కొస్తాడు. ఎండిమియన్ను మోహించి రాసలీలలో సమ్మోహ పరిచిన సెలీన్ నీవేకదా! ఆంగ్ల ప్రణయ కవి జాన్ కీట్స్ ఎండిమియన్ పద్య కావ్యమును టంకిస్తూ కవనం
మరుసటి అధ్యాయంలో
పిలవని పార్టీ కార్యక్రమానికి పోవుచున్న అరుణతార మనో వేదన
“నేడెందుకో మనసు వికలముగా నున్నది, ఈ వర్షమెందులకో తీతువుపిట్టరాయబారము వలె నున్నది, ఇది ఎట్టి దుశ్శకునమో కదా! “
ఘోర పరాభవం చవిచూసి పార్టీ నుండి వచ్చుచున్నప్పుడు
అవమానించబడి మనస్తాపం చెంది చెప్పిన మాటలు “దయ్యపుతాడిని (ఏడాదిపొడుగున గలలువేసి పిందె పాటుననే రాల్చివేయు తాటిచెట్టు; తప్పిదారి ఒకకాయ నిలిచినా, దానిలో ముంజకట్టి యుండదు) సాకిన ఫలసాయ మీరీతినే యుండునుకదా! “
అరుణ తార ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమింపజేసి మంచిమాటలతో ఆమె బాధను మాన్పిన పాత్రికేయ మిత్రుడు దుర్గాప్రసాద్ పట్ల అరుణ తార మనోభావాల వర్ణన
అరుణ పెదవులపై అప్రయత్నముగా చిరునవ్వు వెలసినది. ఆమె ఎదలో అవ్యక్త మధుర రాగమేదియో పలికినది. అది స్నేహారాగమై అంతర్వాహిని వలె దేహమంతయూ ప్రాకి చిత్తవృత్తి(మూడ్) నున్నతి జేసినది.
మరుసటి అధ్యాయంలో
బొంబాయిలో జెట్ ఎయిర్ వేస్ విమానం దిగిన అరుణతార రూప లావణ్య వర్ణన
నాట్యధాటికి చిక్కిన నడుము, ముద్దుమోము కళ్ళలో చురుకుతనము, ఆహార్యమందు అహంకారముతో, జక్కన చెక్కిన తీరైన శిల్పమువలే చూచువారికితరలివెడలుచున్నతెలుగువారితరతరాల వారసత్వ సంపదలా కనిపించును.
విమానాశ్రయం నుండి ఒబెరాయ్ హోటల్ లో జరిగే టెలిఫిల్మ్స్ ఉత్సవాల సమావేశ మందిరము లో
విద్యుత్దీపకాంతిలో దగద్దగా యమానమై ప్రకాశించుచున్న సమావేశ మందిరమున ఉన్నత రంగస్థలం పై ఆసీనులై విద్యుత్ దీపములతో పోటీపడుచున్న తారలందరూ అరుణతార ప్రవేశముతో వెలవెలపోయిరి. వారందరి మధ్యలో ఆమె తారల మధ్య చంద్రునివలె కనిపించెను.
కొద్ది క్షణాలు తరువాత ఆమె పై ప్రశంసల వర్ష కురిసిన తరువాత
విద్యాస్పర్థలో గౌడడిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించిన శ్రీనాధుని విజయ గర్వము అనేక మేటి నర్తకీమణుల శృంగార నాట్య భంగిమల భంగపరిచి వారి స్థానములను కొల్లగొట్టిన ఆమె ముఖమునందు మురారిని కొంగున గట్టుకొన్న సత్యభామ దర్పము తొణికిసలాడ కాంతులీనుచున్న ఆమె ముఖమునే అందరూ చూచుచుండిరి.
అంబర వర్ణన
జాము రాత్రి దాళువాళించిన నక్షత్ర ముక్తావళి క్రమక్రమముగా కరిగిపోగా, జాముచుక్క యొక్కటి అంబరమున మిగిలి యున్నది. బాలభానుడాకాశమున కూర్మము వలె ప్రాకుచుండ కెంజాయలలుముకొన్న అంబరముదయరాగము పాడుచుండెను. మలయమారుతాము తాకగ ప్రక్రుతి యంతయు పులకరించ నల్లంచిగాఁడు(Indian robbin) అల్లన రాగమేదియో పాడుచుండగా, పిగిలి పిట్ట యొకటి బిగ్గరగా కూయుచుండెను. ఆ కూత ఉదయరాగమందు మేళవించి ఎగయుచున్న కపిలవర్ణ తీవ్రతను తెలియజేయుచూ అప్పుడే కండ్లు తెరిచిన అరుణతారకు మేలుకొలుపు రాగమువలెననిపించెను. ప్రకృతి ఎంత ముచ్చటగా నున్నదోకదా
ప్రకృతి వర్ణన
ప్రొద్దుపొడుపున తూరుపు కనుమల నావరించిన నీహారము(దట్టమైన పొగమంచు) ప్రాచ్యోదధి వరకు ప్రాకి విశాఖపట్టణ కంఠమందు మణిహారమై మెరియుచుండ శిశిరఋతువు వన్నెలుచిన్నెలన్ని వరమాల చేసి రమ్ము రమ్ము ననుగొనిపొమ్ము ఈఅదను వ్యర్ధంబైన రాదెన్నడున్ యని ఘోషిల్లి వైశాఖఱేడును పరిణయమాడు చున్నట్లున్నది. మంచుతుంపర జిగిముత్యాలవలె కురియుచుండ, వధూ వరులకవి అక్షింతలువలె, పూలరేకులవలె నొప్పుచుండెను. వైశాఖ శిశిర రాణిల వివాహసంబరము నంబరము నుండి ఎండఱేడు మందహాసపూరితుఁడై తిలకించు చున్నట్లున్నది
సముద్రతీర వర్ణన
ధూమిక(పొగమంచు)అలిమిన సాగరతీరము వెంబడి నావవలె తేలియాడుచున్న ఎర్తిగా వాహనమందు జాజ్ సంగీతరాణి ఎల్లా మధురస్వర పుష్పరసాహ్వయము నోలలాడుచున్న అగస్త్య, బసవ, సందీప మిత్రత్రయమునకు - గవాక్షం నుండి ప్రాచ్యోదధి మహా ముకురమువలె నగుపించెను. తీరరేఖ వెంబడి రివ్వున సాగుచున్న వాహనము, విహంగావ లోకనమున, పిపీలకమువలె నగుపించుచుండ, వాహనమునున్నవారి కొకచెంప ఉద్యానవనములు వేరొకచెంప ప్రజ్ఞాశాలుల విగ్రహములు వాహనగతినందు క్రమక్రమముగ అవగతమగుచుండెను. ఉల్లము నవనవోన్మేషమ (increasing delight) గుచుండ వారు చక్కర కణము చిక్కిన చీమలవలె చెలరేగుచుండిరి
ఆధునిక సాంకేతిక విషయాలను అచ్చ తెలుగులో
ప్రపంచ సాంకేతిక సమాచార సంస్థలకాలవాలముగా నున్న మాదాపురము విహంగావలోకనమందు సనాతని పాదముద్రవలె నగుపించును. తెలంగాణ సాంకేతిక భధవర్గ తేజమందు అచ్చటున్న సుందర ఆకాశ హార్మ్యములు నిత్యమూ శోభిల్లు చుండును. ఆ తల్లి పాదము నల్లుకొని యున్న చిత్రప్రదర్శనశాలలు, పిల్లల క్రీడావనము, శిల్పారామము, ప్రదర్శనోద్యానవనము చూచి మురియువారు ఆ వాగ్దేవి పాదము పై మంజీరము వలె వ్రేళ్ళాడు మణికొండ యనొక జాగీరును జూచిన చేష్టలుడిగి బిక్కవోదురు.
బహుళ అంతస్తుల నగరులుతో మాదాపురమును తలదన్నునట్లుండు మణికొండ కాశ్మీరు కంబళి పై నుంచిన గజ దంష్ట్ర నిర్మిత రత్నమయ కళాఖండమనిన అతిశయోక్తి కాదు. అచ్చట పది సంవత్సములుకు పైగా నిర్మించిన ద్వాదశ హార్మ్యముల లాంకోహిల్స్ యను ఒక సుందర పట్టణము మణికొండ శిరమున బంగారు కిరీటము వలె నొప్పు చుండును. నిశీధిని విద్యుత్ దీపకాంతులీనుచూ ద్వాదశావతారము వలె అగుపించు ఆ ద్వాదశ ఆకాశ హార్మ్యముల నడుమ సిగ్నేచర్ టవర్స్ యను భూమండ లోత్తుంగ ధామము మహాపర్వతమును పోలి గగనాంతర రాళములోనికి చొచ్చుకొనిపోయి చూచువారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించినట్లగు పించును.
ఒకే దృశ్యము - బహుముఖ వర్ణన
పిమ్మట వారిరువురూ అతిధి గృహ మునకు పోయిరి. అతిధి గృహము చుటూ పచ్చిక కనువిందు జేయుచుండెను ఆ పచ్చిక నందొక జలయంత్రమమర్చబడి యున్నది, అందుండి పైకి చిమ్ము రెండు నీటి ధారలు ఈడైన నిగ్గులాడి జోడైన సొగసుకాడిని గూడి సయ్యాటల ఒయ్యార మొలికించునట్లున్నది. చిప్పిల్లు ధారల విరజిమ్ము సూక్ష్మ బిందువులు సూర్యకాంతి పరావర్తనమున ఇంద్రధనుస్సును తలపింప జేయుచున్నవి. జలయంత్రము చుట్టూ మిట్ట పల్లముగా నున్న పాలరాతి కట్టడము ముత్యపు చిప్పవలె నుండి ఆ కైవారం వెంబడి గుత్తులు గుత్తులు గా నున్న ఎర్రని పూలు జేగంటలు మ్రోగించు చున్నట్లున్నవి. ఆ మనోహర దృశ్యము కాముకునకు మిధునమును, తత్త్వజ్ఞునకు ప్రకృతి శ్రీమన్నారాయణునకు జేయు పూలంగిసేవను ఆవిష్కరించు చున్నది.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే పదసంపద
భారత వర్ష ఠాణాలో విదిష ఫిర్యాదును స్వీకరించక నిరుత్సాహ పరుచుచున్న పోలీసధికారితో
మీరు శల్యకవానాఖున్యాయమును పాటించుచున్నారు.
"చుంచెలుక పరుండియున్నవారి పాదములను నొప్పింపక కరుచుట”
నీవు సైంధవోదకన్యాయము ను పాటించ వలెను ఎచ్చట ఓడినామో అచ్చటనే నెగ్గవలె.
“సముద్రపు నీరు ఆవిరై , మేఘముగా మారి వర్షించి సముద్రములో కలియుట.”
“నేను చదువజాలను కానీ చెప్పినచో వినుటకు బాగున్నది” లకుమ అనగా. అగస్త్య “అదియునూ ఒక సుగుణమే, నేటివారికి పుస్తకపఠనమన్న అత్తిపూచినట్టే. కోటికొక్కడు పుస్తకపఠనము నందు ఆశక్తి కనబరుచును”
కోటేశ్వరావు ఏల వచ్చెను? అని అరుణ తార లకుమను అడగగా “నీకివన్నీ ఎవరు జెప్పినారు?”
అరుణ తార “ఎవడో వల్లకాట్లో రామనాథాయ! నిజమా అబద్ధమా?”
చారిత్రిక, సాహిత్య, పురాణ, ఇతిహాస, వైమానిక, ఆధ్యాత్మిక మంజూషం.
“1940 దంకెక్ అనే ఫ్రెంచ్ పట్టణములో జర్మన్ సేన బ్రిటిష్ సేనను అడ్డగించి వెనక్కి పంపింది. అడాల్ఫ్ హిట్లర్ “బ్లిట్స్ క్రీగ్” ఒక తరహా మెరుపుదాడి, పథకం వల్ల 68,000 బ్రిటిష్ సైనికులు చనిపోయారు అందులో మా తాతగారు ఉన్నారని భావన
1320 నుండి గుజారాత్ రాష్ట్రము సూరత్ పట్టణమున కటాలాన్ డొమెనికన్ మిషనరీచే ప్రారంభమైన కిరస్తానీ మతమార్పిడులకు బ్రిటిషుపాలన అగ్నికి ఆజ్యము పోసినట్టు అయినది
1862లో మతమార్పిడి పొందియున్నాడు. పాపము తొరుదత్ తల్లి ఎంతో కలత చెందెను. ఎంతో వేదన చెందిననూ తరువాత భర్తనే అనుసరించెను. తొరుదత్ తాత గారు రసమే దత్ హిందూ స్కూల్ స్థాపకులు కీర్తికెక్కిన విద్యావేత్త, ఆమె దాయాదుఁడు రొమేష్(రమేష్ కాదు)చందర్ దత్ చరిత్రకారుడు, రచయిత మరియు పాలనాధికారి అనిన ఐ.ఏ .ఎస్. అధికారి ఇటువంటి విద్యాధికులైన వారిని బ్రిటిష్ వారు అధికారబలంతో సునాయాసముగా మతము మార్పిడి చేసెడివారు
మా తాతగారు సైన్యమునందు పనిచేసి రెండవ ప్రపంచ యుద్దములో పాల్గొనిరి. భారత సైనికులు రెండు లక్షల యాబదివేలమంది పాల్గొనగా ఎనబదివేలమందికి పైగా వీరమరణము పొందిరి. ఆ కాలమందు సైనికులు గోతులులో రోజులతరబడి కూర్చొని ఉండెడివారు. వారు ఏదైనా ఆరోగ్య నెపమున సెలవడిగిన కాల్చి చెంపెడివారు. బయటకుపోవుటకు అవకాశములేక సైనికులు నిస్పృహ తో తుపాకీ గొట్టమును నోటిలో పేల్చుకుని సెలవు తీసుకొనెడివారు. లెనార్డో డావించి, లిప్పి , సార్జెంట్ వంటి చిత్రకారుల కథలు.
సాహిత్య
సుందరి అపరిక్షితకరకం అపరిక్షితకరకం అనెను. విషయము అర్ధమైన తులశమ్మగారు మౌనము వహిం చిరి. విష్ణుశర్మ అనే సంస్కృత పండితుడు పంచతంత్రంమను అడవి జంతువులతో, కూడిన నీతి కధలను వ్రాయగా పరవస్తు చిన్నయ సూరి అనే పండితుడు వాటిని తెలుగులోకనువదించెను. పంచ తంత్రములు అనగా ఐదు తంత్రములు. మిత్ర లాభము, మిత్ర భేదము, అపరిక్షితకరకం, లబ్దప్రణాసం, కాకోలుకీయం. అపరిక్షితకరకం నందు పరాధికారము పైవేసుకొనరాదను కథ చెప్పబడెను. గాడిదతనది కాని పనిని చేసి ప్రాణములమీదికి తెచ్చుకొనెను. అనవసరమైన విషయములందు జోక్యంకల్పించు కొనవలదని తల్లిని పరోక్షంగాహెచ్చరించుటయే “అపరిక్షితకరకం” అనుమాట కర్థము.
జెఫ్రీ షాజర్ కేంట్రబెరి టేల్స్ 24 కథల సంకలనం. లండన్కు 90 మైళ్ళ దూరంలో ఉన్న సేంట్ థామస్ బెకెట్ (కేంట్రబెరి చర్చి)కు వెళ్లే 31 మంది తీర్ధ యాత్రికులు లండన్ లో టాబార్డ్ సత్రంలో బసచేస్తారు. కాలక్షేపం కొరకు యాత్రికులంతా ఒకొక్క కథ చెప్పాలని షాజర్ ఒక కథల పోటీ పెడతాడు. నెగ్గిన వారికి బహుమతిగా తిరుగు ప్రయాణంలో ఉచితభోజనం లభిస్తుందని చెపుతాడు. ముప్పది మంది తీర్ధయాత్రీకులు ఒక్కొక్కరు నాలుగు కథలు ( వెళ్ళు నప్పుడు రెండు, వచ్చునప్పుడు రెండు) చెప్పునని తలచి 120 కథలు వ్రాయవలెనని భావించెను. కానీ ఇరువది నలుగురు మాత్రమే కథలు చెప్పిరి. ఇందు అసంపూర్తి కధలు కూడా కలవు. వంటవాడి కథ అసంపూర్తి కథ. తాగిన మత్తులో గుర్రం మీద నుంచి క్రిందపడిపోడం వల్ల సగం కథే చెప్తాడుఈ కథను షాజార్ పూర్తి చేయలేదు.
ధూర్జటి మొదట రసికుడై భోగాల నుభవించి, రాజాశ్రయ సౌఖ్యాలన్నీ చవిచూసి, ముదిమి ముసిరే వేళకు మోక్షకామియై శివభక్తిలో మునిగి శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తీశ్వర శతకమును భక్త్యావేశంలో రచించినట్లు, వృద్ధనారీ పతివ్రత అన్నట్లు నీవు యవ్వనంలో అన్ని సుఖములు అనుభవించి, ఇప్పుడు నా జీవితము పాడగునని వంకలు పెట్టుచున్నావు." అని తల్లి పై విరుచుకు పడెను. లియో టాల్ స్టాయ్ విరచితమైన అన్నాకరేనీనా వేయి పుటల గ్రంధము , ఫ్లోబే అను ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత వ్రాసిన మదామ్ బొవారి....
పురాణ - ఇతిహాస
గరుడపురాణం: “వైతరిణీనది ఎచటకలదు?” అని దారినబోయెడి దానయ్యడుగగా బ్రహ్మగారు ఇట్లు జెప్పిరి. వైతరణీ నది యమపురి దక్షిణ ద్వార మునకు 86 వేల ఆమడల(12,55,000కి.మీ) దూరంలో ఉన్నది మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు (మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల(3600 కిలోమీటర్లు) చొప్పున నడుస్తూ సౌమ్య, సౌరి, నాగేంద్ర , గంధర్వ, శైలాగ, క్రౌంచ,క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురములను దాటుకుని యమపురికి చేరును .
ఇదే 13 రోజుల సంతాపం వెనకున్న కథ. ఇదే ఈస్ట్రన్ ఆర్థోడాక్ చర్చ్ నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా ఈ నమ్మకం ఇస్లాం, సిక్కు ధర్మాల్లో కూడా కనిపించును. ఈ ధర్మాల్లో 13 రోజులు ప్రార్ధనలు చేయుదురు.ఆత్మకుఓదార్పునివ్వటమేప్రార్థనలఉద్దేశ్యంఅయినప్పటికీ ఆత్మ 40 రోజులు తాను నివసించిన ప్రదేశాల్లో వదిలివెళ్లలేక సంచరించుచుండును. ఆత్మలు తమ ఇళ్ళని గుర్తించడానికి వీలుగా రష్యాలో చనిపోయిన వారి ఇంటికి చెట్ల కొమ్మలు పెట్టుచుందురు. మృతుడికి, రొట్టె ,నీళ్లు పెట్టడం,పక్కవేయడం కూడాచేసెదరు. 40వ రోజు మృతుడి వస్తువులన్నీ దానం చేసిఅతడి గురుతులన్నీ చెరిపేసి విందు చేసుకుంటారు. దీనర్ధమేమనగా ఇంక ఈ ఇంటికి రావద్దని.
విశ్వామిత్రుని తపోభంగమొనర్చవలెనని రంభ పదివేల ఏళ్ల పాటు శిలలా ఉండవలసి వచ్చెను. భర్తల ఎదుట, గొప్ప ధర్మవేత్తలుగా పేరు పొందిన వారు చూస్తుండగానే, గుడ్డలు లాగివేయబడే హీనాతిహీనమైన పరాభవం ద్రౌపదికి జరిగినది .
సుందరి వైమానికం, విదిష ఆధ్యాత్మికం