Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, November 6, 2021

గురుచరణములకు సుమవర్ణమాల

భారతవర్ష  పూర్తిగా చదివి ముద్ర వేసి మూడు పేజీలు ఇచ్చిన గురువు గారు నాకోసం ఎంత శ్రమ తీసుకున్నారో  కదా! నాలాటి అనామకుడికి మీరు ఇంత  సమయం వెచ్చిస్తారని కలలో కూడా అనుకోలేదు. ముత్యముల వంటి  మీ పదాలు చూసి తెలుగు తల్లి నవ్వులనుకున్నాను. మూడు పుటల వ్రాసిన మీచేతులు తెలుగుతల్లి చేతి చేమంతులను  కున్నాను.



                                     గురువుగారి చరణాలకు వర్ణమాలలో సుమమాల



అ - ఆ 

అన్యభాషల్లో వ్రాసినా  -  ఆనందం దొరకలేదు. 

 ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ లో పుస్తకాలు  వ్రాసాను,  పద్యాలు వ్రాసాను.  ఇంగ్లీషులో పుస్తకాలు వ్రాసాను,  న్యూస్పేపర్లలో  వ్యాసాలూ వ్రాసాను.  అప్పుడు పొందిన ఆనందం  భారతవర్ష వ్రాసినప్పుడు కలిగిన ఆనందంతో పోలిస్తే చాలా తక్కువ. 

ఇ - ఈ 

ఇప్పుడు కలిగిన -  ఈ ఆనందాన్ని చెప్పడానికి నాకు స్ఫురించిన ఒకే ఒక మాట "బాల్యంలో మా అమ్మ  నన్నెత్తుకొని  ముద్దాడినట్టుంది. పెద్దవాడినయ్యాక ఆ అమ్మ పాదాలు తాకినట్టుంది." 

ఉ - ఊ 

ఉన్నపళంగా ఆశుకవితలు ఎన్నో వ్రాసాను.  ఊహించినా ఇప్పుడేమీ తట్టడంలేదు. ఉన్న మాట చెప్పాలంటే మనసు ఊయలూగేస్తోంది.    

ఋ - ౠ

ఋషి వంటి మీ కరస్పర్శ  భారతవర్ష గ్రంధానికి కలిగి గ్రంధపు ౠ ఛందము పెరిగింది.  

ఎ- ఏ  - ఐ 

ఎగ్గులు ( దోషాలు )  ఏఱుగొని ( వరద ప్రవాహంలో కొట్టుకొని పోవు) గ్రంధం గంధం పూసుకొంది.  మీ ప్రోత్సాహంతో సవరణలు చేసిముద్రణా దోషాలు దిద్ది  అక్కడక్కగా శైలి  సవరించుకో గలిగాను. ఐనా ఇదంతా  మీ దయేకదా !                                                      

ఎలక  పరిమాణం ఇతర భాషల్లో వ్రాసినప్పుడు కలిగిన ఆనందం                                                                  ఏనుగు  పరిమాణం తెలుగులో పుస్తకం వ్రాసినప్పుడు కలిగిన ఆనందం.                                                           ఎలక - ఏనుగు , పోలికేలేదు తెలుగు తెలుగే. 

ఒ - ఓ  - ఔ 

ఒనరారు పదములతో ఎనలేని ఓర్పుతో  ఓరుదీర్చి మీరిచ్చిన ముందుమాట  నా తెలుగు రచనకి  మీరిచ్చిన  అక్షరదీవెనలు జంకు తో  వేచియున్న నాకు మంచి ఔషధం లా పనిచేసి నాలో ఉల్లాసాన్నినింపింది.    

అం - అః                                                                                                                                        అంతాయత్తైన(సొంపైన ) మీ ముందుమాట  నాకు అందుమాటా!  మీ పేరిమి అద్భుతః                                              ముత్యముల వంటి  పదములు చూసి తెలుగు తల్లి నవ్వులనుకున్నాను.                                                      మూడు పుటల వ్రాసిన  మీ చేతులు తెలుగు తల్లి  చేతి చేమంతులు. 

అందుకే  మందాక్రాంతమందు గురువర్యులకు పూలబాల పాదాక్రాంతము  

UUU     UII          III          UUI     UUI     UU

శ్రీమంతం  బౌనెన    రుగన      పత్రంబు  లేకాంచ  చిత్త 

మేమందా రంబగు    చదవ     నామ్రేడి    తంబౌగు  ణంబు               

హేమంబే  యంచుతొ లగగ    దాహేఠ    ముల్లాస మెల్ల  

ఆమంత్రి  తంబౌము  దముగ   తెల్గంద   మేలెకృ  తినే

శ్రీమంతంబగు (మీరు వ్రాసిన) పత్రములను చూచిన చిత్తము మందారమగుచున్నది.  మీ  తెలుగందం ఆ మూడు పత్రములనూ పరిపాలించుచూ ఆనందమును ఆమంత్రించుచుండగా (నాలో) హేఠము తనంత తానే తొలగి పోయెను.  


1 comment:

  1. డియర్ పూలబాల: నీవు తెలుగులో లిఖించిన భారతవర్ష వర్ణనాతీతం.నీ కీర్తి భారతదేశ ఎల్లలు దాటి దేశ నలుమూలల వ్యాప్తి చెందాలని నామిత్రుడికి ఈ చిన్ననాటి స్నేహితుడి అభిలాష.

    ReplyDelete