Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Saturday, September 26, 2020

Bharatavarsha 41

బారామతి నగరమందు జలోచి పథమున బహు మహీజ వర్ధిత , సౌరు  సాటోప  గౌరు గంభీర నక్షత్ర నందనము గలదు.  ఆ సువిశాల ఉద్యానవనము సాంద్ర, నీరంధ్ర  లతిక పరివృత  పుష్ప దములతో, ఘన ద్రుమములతో, పిల్ల పల్లవములతో, వనమూలికలతో, పచ్చని దరువులు తో నొప్పు చుండెను. అందొక  తటాకము ఎర్రని తామరలతో మెరియుచూ కసిగాటు గోటు బీటగిల్ల విహర్తలకు గుప్తకేళి  మోహము గొల్పుచుండెను. ఆ సుందర ఉద్యానవనమున రవిద్యోత రహిత పూపొదలయందు లకుమ  అగస్త్యులు తీగెలలో తీగలవలె మదోత్తేజిత లటపట లాడుచుండిరి.   

ప్రేమికులకీ ఉద్యాన వనములు శ్రీరామ రక్షగా నిలచినవి. వారము రోజుల నుండి ఇచ్చట బారామతిలో నుండి  ఎదురుచూచిన శుభ ఘడియ రానే వచ్చినవి. కనువిందు జేయునీ అందాలు ఒకనాడు నా చేత చిక్కునని కన్న కల నిజమైనది యనుచూ 


 తే. నీపరు  వాల పాల  నురువు లనుజాచి      

  నతడి యారు  పెదవి,  నీజవ్వ  నప్రణ   

త్రాణ ముతెలుపు  నీజి  లిబిలి  సొగసు 

బిగిమాన మురతి కేళికే భూరి వరము        

పాలు  పొంగు వంటి  పరువపు మెరుపు ను చూసినచో నా పెదవులు తడి యారిపోవును నీ వయసు లో ఉన్న ( ప్రణయ త్రాణము ) శృంగార శక్తి నాకుఆశక్తిని  పెంచుచుండును. నీ సొగసు జిగిమానము (బిగుతు) నిరుపమానము. అది రతి కేళికే బహుమానము. యని పొదరింట  అగస్త్యుడు పై బడుచుండ 

అనువు గాని చోట తమకమేలరా !వేళ చూసి నన్నేలరా ! 

వయసులో వేడుండనిమ్మురా!! చిన్నది నీని నమ్మరా!! 

ని చెలికాని వారించుచున్నలకుమ ఆందోళనను గాంచి 

అగస్త్య: ప్రాణ రక్షణ కొరకు నీవు వాడిని తన్నినావు గానీ చంపవలెనని కాదు కదా. 

లకుమ: నాకు ఆశ్చర్యముకల్గుచున్నది, విదిషకీ విషయమెట్లు తెలిసెను. ముందుగా నీకెట్లు దెలిపెను? 

అగస్త్య: విదిష అమ్మమ్మ భవిష్యవాణి నెఱిఁగించెడి దైవజ్ఞురాలుఈమెకూ ఆశక్తి వంశపారంపర్యముగా వచ్చెనేమో?  ఈమెకు తల్లి ఆత్మ కనిపించుచున్నదట . 

లకుమ: అది నీవు నమ్ముచున్నావా? 

అగస్త్య: ఆ విషయము ప్రక్కన పెట్టి నీవు ఆందోళన జెందక స్తిమితముగా నుండవలెను.   

ల:  నాకాందోళనేల కల్గును మా యమ్మ ఉండగా. నాకు మా అమ్మపై నమ్మకమున్నది. 

అ:కానీ ఆమెకే నీపై నమ్మకము లేదు. ఆ నమ్మకమే యున్నచో నీవు  సొంతగా చిత్రనిర్మాణము జేయక ఇట్లగచాట్లు పడవలసిన ఖర్మమేమి?

ల:అది నామనసునెప్పుడూ దొలిచివేయుచుండును,కానీ నీకు నాపై నమ్మకమున్నదా ? 

అ: ముంజేతి కంకణమునకు అద్దమేల, నీకు నాకు జత కుదిరిన నాటినుండి నేను విశాఖలో నుండుట మానివేసితిని. నీ చుట్టూ భ్రమరము వలే తిరుగుచూ నన్ను నేను పట్టించు కొనుట మానివేసితిని.  అన్నిటికంటే ముఖ్యమైన విషయము మానాన్నకు నాపై నమ్మకంలేదు. అది నాకు లాభించును. 

ల:నాకేమీ అర్ధము కానున్నది. అది నీ  కెట్లు లాభించును? 

అ: నాకే కాక నీకునూ లాభించును  అదిచెప్పినచో నాకేమిత్తువు? 

ల:నీకు వలసినదిత్తును యని కన్ను గీటుచూ అనెను. 

అగస్త్యకి రక్తపోటు  పెరిగి తగ్గిన పిదప మానాన్నకి పశ్చాత్తాపము పెచ్చు. మా అమ్మని నిర్లక్ష్యము జేసినందుకు ఎప్పుడూ దుఃఖించు చుండును. 

ల:జేయునదేమియునూ లేకున్ననూ మగవారు అట్లు నటింతురేమో. మా నాన్న కూడా ఇట్లే జెప్పుచుడెడివాడు. నేను మా అమ్మ నాన్న విడిపోయిన కొత్తలో ఆతడి వద్దకు పోవుచుడెడిదానను. 

అ:అటులనా? మీనాన్న ఎచ్చట ఉండును? ఏమి జేయుచుండును?  

ల:ఆయన చిత్ర దర్శకుడు, కేరళవాసి. ఇప్పుడు రంగమునుండి పింగము లోనికి బోవలదు. మీ నాన్న విషయము జెప్పుము. 

ల: మా నాన్న పశ్చాత్తాపము నటన కాదు, నిజము. నాకు లక్షలు ఇచ్చుచున్నాడు. ఇందుకు నేను జేయవలసిన దల్లా ...

ల: మీ నాన్న పక్షము వహించవలెను , నిజము జెప్పుము నీవెవరి పక్షము?

అ:నిజము జెప్పవలెనన్న నేను నీపక్షము, డబ్బు పక్షము.

 శరీరము వంక ఆశగా చూచుచూ జెప్పుచున్న అగస్త్యను జూసి  లకుమ సిగ్గు గొనెను

అ: నిన్ను మానాన్నకి పరిచయము జేసి  చిత్ర నిర్మాణము చేపట్టమందును

ల: అయినచో నీవు హీరో , నేను హీరోయిన్

అ: ఛీ ఛీ నాకు నటిచవలెనని ఆశలేదు , నాకు  పైనే ఆశ. అన్ని  విషయములు చెప్పితిని కదా , అన్న మాట నిలబెట్టుకొనుము.

ల:ఇది ఉద్యానవనము ఇచ్ఛటెట్లు  కుదురును?

అ: అయినచో మీ ఇంటికి పోయెదము , మీ అమ్మ ముంబయి పోయినది కదా రాత్రికి కానీ రాదు. ల:అట్లు నాకెవరు జెప్పినారు. తాను మధ్యాన్నమే వచ్చునేమో ?

అ: మధ్యానమే వచ్చుటకు ఆమె విమానము పై పోయినా? సమయము కావలెను కదా  వచ్చుటకు ?

ల: వారము రోజులనుండి ఇచటనే యుండి బారామతి గూర్చి ఏమి దెలుసుకొనినావు?

అ: బారామతి  మయూర పండిట్ అను మారాఠీ కవి జన్మ స్థలమని భారతవర్ష జెప్పినాడు.  

ల: ఈ వర్షునకు సాహిత్యము తప్ప  ఇంకేమియు దెలికున్నది!  

అ: అట్లు కొట్టిపారేయవలసిన కవి కాదు. అతడు 108 రామాయణములను వ్రాయ నిశ్చయించి 95 రామాయణములను వ్రాసేనని వినికిడి.

ల: బాగు బాగు, ఇచ్చట విమాన శిక్షణా కేంద్రము ( కర్వేర్ ఏవియేషన్ స్కూల్ ) కలదని వినలేదా? 1996 లో బారామతి నగరానికి 12 కిలోమీటర్ల దూరములో  ఈ వైమానిక పేలిక ను నిర్మించినారు. మా అమ్మ అచ్చటనుండి ఛాపర్ కానీ విమానములో కానీ పోయి వచ్చుచుండును. ఇప్పుడు నాపని మీదే  వకీలును కలవ ముంబాయిపోయెను. నీవు ఇచ్చట యున్నట్లు ఆమెకు తెలియదు. నీవు ఇంటికి వచ్చిన చో  ఆమె చూచును అది బాగుండదు . పైగా సుందరి కూడా ఇచ్చటనే యున్నది, పైలట్ శిక్షణ పొందుచున్నది. దానికొరకు పది లక్షలు ఖర్చు జేసెను. భగవంతుడు మేలు జేసి తన శిక్షణ పూర్తి జేసుకొని పైలట్ గా స్థిరపడిన చో మంచిదే కదా. వారిద్దరూ ఉద్యానవనం నుండి నిష్క్రమించి. రహదారిపై నడుచుచుండగా వారిపక్కన నుండి ఒక కారు దూసుకుపోయెను . 

అ: అదిగో ! మన కారు పోవుచున్నది ,  అందు సుందరి ఎచ్చటికి పోవుచున్నది?

ల: సుందరిని విమానాశ్రయము వద్ద  దింపి మా అమ్మను దీసుకు వత్తురు.  

ఇంక అయినట్టే యని దిగాలుపడుచున్న అగస్త్యను "నా స్నేహితురాలి ఇంటికిపోయెదము."  అని నవ్వుచూ లకుమ  వాహనమును పిలిచెను

                                                                     ****

సబ్బవరమందు  క్షేత్ర గృహమున  మంజూష  విదిష లిద్దరూ  సరస సంవాదమందు  మునిగి లోకమును మరిచి ఆనందడోలికలయందు తెలియాడుచుండిరి . "నాటి గోశాల నేటి పర్ణ శాలగా మారి చూడ ముచ్చటగా  నున్నది." యని  మంజూష అనగా,  విదిష  "చిత్రముల గీయుటకు మనసునాహ్లాద పరుచు నట్లీ  పర్ణశాలను ప్రత్యేకముగా అలంకరించితిని." అనెను. "ఎచ్చట చూచినా వర్షుని చిత్రములే కనబడుచున్నవి ప్రత్యేక అలంకరణ యనిన ఇదేనేమో!" యని  మంజూష అనగా, విదిష బుగ్గలు ఎరుపెక్కెను.   భారతవర్ష చిత్రపఠం ముందు వారిరువురూ చాపపై  కూర్చుని యుండిరి. విదిష చేత వీణ మ్రోగు చున్నది.  

  నాహృద  యంశృతి  బాసిన

సంత వీణియ దొరకొని మీటర శూరా! 

అహర్ని శమునీ ధ్యాసే 

హతహ  పడునాడు లతపన తీర్చ గ రారా!!    

 నా మనసు వసంత వీణ నానాడులే  తీగలు తీగలు శృతి తప్పి అలమటించుచున్నవి. నీవు వాటిని సరిచేసి నా తపనను దీర్చవలెనని చక్కటి రాగాలాపనతో వీణ వాయించుచున్నది. మంజూష ఎదురుగా కూర్చొని ఆలకించి ఆనందించుచున్నది. " నీవింత చక్కగా పాడగలవాని నా  వద్దెందుకు దాచితివి. ఇంతలో చిత్రకళకు స్వస్తి జెప్పి సంగీత పాఠశాల ప్రారంభింతువా ?" అనెను.

చిత్రకళ ఆర్ధికంగా నన్ను నిలబెట్టినది. సంగీతము మనసును విశ్రాంతి  పరచుటకు. ఇప్పుడు ఎక్కువమంది   తైల వర్ణ చిత్రముల కొరకు నావద్దకు వచ్చుచున్నారు. అని విదిష అనగా "  నీ  విజయమును  వార్తాపత్రికలు , బుల్లితెర చానళ్ళు ఆరు నెలలుగా ఊదర గొట్టుచున్నవి. ఇప్పుడు డీ రాష్ట్రమున నిన్ను దెలియనివారుందురా!” యని మంజూష అనగా విజయము నాదని  నీవునూ అనుచున్నావా ?” యని విదిష వాపోయెను  నీ వ్యాజ్యము న్యాయ చరిత్రలోనే పెను  సంచలనము. ఇంత సత్వరన్యాయము ఎచ్చటనూ  దక్కలేదని లోకము కోడై కూయుచుండగా నన్నడిగెదవేమమ్మా" యని మంజూష విదిషనాట పట్టించుచూ విదిష కంట నీరు చూసి " అయ్యో నీకింత భాద కలుగునని దెలిసిన ఇట్లనెడిదానను కాను."

" మీకుటుంబము మమ్మాదుకొననిచో .." "ఛీ ఏమి మాటలవి , చిన్నప్పటినుండి కలిసి ఒకే బడిలో చదువుకొని  ఒక ఇంటి వారివలె నున్నాము. మనము ఒకరికొకరు జేసుకొనుట గొప్పవిషయమన్నట్లు జెప్పుచున్నావు"  నే నాజన్మాంతమూ వర్షకు రుణపడి యున్నాను" యని   విదిష గద్గద స్వరముతో పల్కుచుండ నీవు కన్నీరు పెట్టుకొనిట్లు మాట్లాడిన నే నుండజాలను పోయివత్తును యని మంజూష లేచెను.  విదిష కళ్ళు తుడుచుకొని " సరే నేను  నవ్వుచుందును నెవిచ్చటికీ పోవలదు." యని మంజూషను వారించెను. " ఎంత గడసరి జాణ వో   నాకు తెలపక నీవు వీణ కొనుటకు  వాల్తేర్ అప్లాండ్స్ కు బోయినావు. నన్నడిగినచో మా ఇంట నున్న వీణ నీకివ్వకుందునా ?  మా అమ్మ నిన్ను  అచ్చట చూసి  ఇంటికి పిలుచుకుపోయి వీణనివ్వనిచో  కొత్త వీణ కొనెడిదానవేకదా!" యని ఒక్క మొట్టికాయ వేసెను. ఆహ్ .. అబ్బా అది వర్షుడి వీణ నేనెట్లడుగగలను" యని విదిష అనగా. " అడగ వలసిన పని ఏమున్నది. అడుగుట  కంటే  దొంగిలించుట  సులభము " యని మంజూష అనగా విదిష దిగ్భ్రమ నొంది చూచుచుండెను. "తాటకీ ! నీవు జేసినదేమే? వర్ష హృదయమును దొంగిలించలేదా ? " యనుచు చెవి నులమగా ఉప్పొంగిన హృదయముతో విదిష  మంజూషను హత్తుకొనెను.

మీ అమ్మ నన్ను అంగీకరించునా ? యని దిగులు చెందుచున్న విదిష తో  మంజూష " ఆమె నిన్నెప్పుడో ఆ దృష్టి తో నే చూచుచున్నది. " అనగా  " ఏ దృష్టి తో ?" యని విదిష అడుగగా " అబ్బా ఏమి జాణ  మావదిన , మా అమ్మ   ఏ దృష్టి తో చూచుచున్నాదో  నేను చెప్పవలెనట." యని మంజూష మొఖం త్రిప్పుకొనగా "  చెప్పవా .. చెప్పవా..  యనుచూ విదిష మంజూష గెడ్డము పట్టి బతిమాలెను. నిన్నెన్నెటి నుంచో కోడలిగానే చూచుచున్నది. అందుకు కూడా కారణమున్నది  కొన్ని వార్తా పత్రికలలో బైరెడ్డి నిన్ను బలాత్కరించెను  అని అర్ధము వచ్చునట్లు వ్రాసి , బొమ్మలు ద్వారా సంకేతములిచ్చిరి. విదిష  నోట మాటరాలేదు. ఎంత ఉత్తమురాలు నీ తల్లి. ఆమె కోడలగుట కు నేను పెట్టిపుట్టినాను. విదిషకళ్లు  మరల  చమర్చినవి .  

5 comments:

  1. విదిష జీవితంలో శుభగడియలు మొదలైనవి. అగస్త్య ద్వారా లకుమ కోరిక కూడా తీరబోతుంది.ముందు ముందు జరగబోయే పరిణామాల గురించి కుతూహలం మొదలయ్యింది.

    ReplyDelete
    Replies
    1. Great, never expected your fast response. Thank you.

      Delete
  2. తేటగీతి పద్యము అద్భుతము. కథలో మలుపులు, పాత్రలు ఒక ఎత్తు, జాతి పద్యముల ద్వారా పాత్రల భావాలను పలికించి కథకు జత చేయడం మరో ఎత్తు.

    ReplyDelete
    Replies
    1. జాతిపద్యాలు వ్రాయడం కష్టమే కానీ జన జాగృతం కోరి ఇష్టంగా చేస్తే నష్టమేముంటుంది. కృతి లేని చోట సంస్కృతి ఉండదు. కలంతో కాదు హృదయం తో వ్రాస్తున్నాను నా హృదయ స్పందన లో పద్యాలు నా శ్వాసలో గీతాలు. ఇంకా
      అర్థవంతంగా వ్రాయాలనుంది కానీ అర్ధహృదయం సాహిత్యార్పణమైంది.

      Delete