Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Monday, November 9, 2020

Bharatavarsha 65

ప్రపంచ సాంకేతిక సమాచార సంస్థలకాలవాలముగానున్న మాదాపురము విహంగావ లోకన మందు సనాతని  పాదముద్ర వలె  నగుపించును. తెలంగాణ సాంకేతిక  భధవర్గ తేజమందు  అచ్చట నున్న సుందర  ఆకాశ హార్మ్యములు నిత్యమూ శోభిల్లు చుండును. ఆ తల్లి పాదము నల్లుకొనియున్న చిత్రప్రదర్శన శాలలు, పిల్లల  క్రీడావనము, శిల్పారామము,  ప్రదర్శనోద్యాన వనము చూచి మురియువారు  ఆ వాగ్దేవి పాదము పై  మంజీరము వలె  వ్రేళ్ళాడు మణికొండ  యనొక  జాగీరును జూచిన చేష్టలుడిగి బిక్కవోదురు. 


బహుళ అంతస్తుల నగరులుతో మాదాపురమును తలదన్నునట్లుండు మణికొండ కాశ్మీరు  కంబళి పై నుంచిన  గజ దంష్ట్ర నిర్మిత రత్నమ య  కళాఖండ ము మనిన అతిశయోక్తి కాదు. అచ్చట  పది సంవత్సములు కు పైగా నిర్మించిన ద్వాదశ హార్మ్యముల  లాంకో హిల్స్  యను ఒక సుందర పట్టణము మణికొండ శిరమున బంగారు  కిరీటము వలె నొప్పు చుండును. నిశీధిని విద్యుత్ దీపకాంతులీనుచూ ద్వాదశావతారము వలె అగుపించు ఆ ద్వాదశ ఆకాశ హార్మ్యముల నడుమ  సిగ్నేచర్ టవర్స్ యను భూమండ లోత్తుంగ ధామము మహాపర్వతమును పోలి గగ నాంతర రాళము లోనికి  చొచ్చుకొనిపోయి  చూచువారి శ్రీ మహా విష్ణువు సాక్షాత్కరించినట్లగుపించును.

లాంకోహిల్స్ కు మాడు కిలోమీటర్ల దూరమునున్న లక్ష్మీ నగరు కొండపై నున్న బీరప్ప దేవాలమునకేగి రంజని కేశవులు అచ్చటనుండి లాంకోహిల్స్ ను చూచుచుండిరి. దూరమునుండి పెక్కు భవనముల నొక్కమాఱు గాంచిన కురుక్షేత్ర సంగ్రామమందు అక్షోహిణి వలె కనిపించును.    

ఉ.       నింగిని      తాకుకూ    టముల   నేకన      మేరున       గమ్మువా లెనో 

          చెంగట       ద్వాద శా   గ్రములు   చూడస    పత్ర గిరు      లేలవా  లెనో 

          పింగళ      కాంతులీ    నుఘన   వాసము   లందము     గాంచిన   బ్రమే   

          ముంగట     భువనో      న్నత ని   వేశము   వేల్పువి        లాసమే  కదా   

నింగిని  తాకు  కూటముల నే  కన   మేరునగమ్ము   వాలెనో (అనిపించును), చెంగట ద్వాద శాగ్రములు   చూడ  సపత్ర (రెక్కలుగల ) గిరులే వాలెనో (అనిపించును), పింగళ  కాంతులీను ఘన వాసములందము గాంచిన అబ్రమే ( అబ్బురమే)  ముంగట   భువనో న్నత నివేశము (నివాసము) వేల్పువి  లాసమే  కదా!     

కేశవుడు:  ఈ ఆకాశహర్మ్య రేఖను చూడ భాగ్యముండవలెను.  అందు నివసించువారికెంత అదృష్టవంతులో కదా! ఎట్టకేలకు ఈ కొండపైనున్న దేవాలమును చూడవలెనన్న నాకోరిక నేటికి తీరెను. భాగ్యనగరమున బంజారాహిల్స్, జూబిలీ హిల్స్  విలాసప్రదేశమలని  భావించువారు మణికొండ లాంకో హిల్స్ ను చూచిన అవి  మురికివాడ వలె నగుపించును. 

రంజని: రాజును చూచిన కళ్ళ న అను సామెత వలే  నున్నది   

రంజని: ఈరోజు ఒక ప్రత్యేక విషయమై మిమ్మల్ని ఆహ్వానించితిని. ఊహించగలరా ?

రామాంజనేయ యుద్ధము నాటకము వేసి చూచుకొనుటకు అయివుండొచ్చు. అయిననూ అందు నేను వాద్య సహకారమే కదా దానికి కూడా పూర్వాభ్యాసము కావలెనా ? అందులకే నేను మృదంగమును కూడా తెచ్చితిని   మీరిచ్చటనే నివసించుచున్నారని వినియుంటిని?

నేను  ఇచ్చటనే అమ్మతో కలిసి యున్నాను, తమ్ముడికి వివాహమయ్యి  ఆస్ట్రేలియాలో ఉజ్జోగము చేయుచున్నాడు. ఇద్దరూ కొండదిగి అంబాసిడర్ను సమీపించిరి. ఆమె   నడుపుచుండగా కేశవుడు ప్రక్కన కూర్చొనెను.

రంజినిగారు మీరు ఈ పాత  వాహనమును ఎందులకు నడుపుచున్నారో నాకు తెలియదు కానీ  మీకొక రహస్యము చెప్పవలెను అని ఆమె చెవిలో " మొన్ననే అతడు కొత్త వేను ఖరీదు చేసినాడు " అని చెప్పుచుండగా రంజనికి నవ్వాగలేదు. అంబాసిడర్ లాంకో హిల్స్ చేరెను. అచ్చట నున్న  ఆకాశ హార్మ్యములను జూచి  కేశవుడు విస్మయమందెను.  ఇచ్చట పండ్రెండు ఆకాశ హార్మ్యములున్నవి. వాటితో పాటు  సిగ్నేచర్ టవర్ అను భువనమును ముద్దాడు  ఈ మహా భవనము ప్రపంచ అత్యున్నత ఆవాసము.  అదివిన్న  కేశవుడి నోటి మాట పెగలకుండెను.

        తే. గొల్వ  భువనో  న్నతవాస  కూట మిదియె

         భవ్య   భువనై  కోత్తుంగ భాస  మిదియె  

         నూట పన్నెండు మేడల నూత్న గీము 

         విశ్వ  విఖ్యాత   చేవ్రాలు వెలిసె  నిచటె.

 ముంబాయిలో అంతర్జాతీయ వాణిజ్య సంస్థ భవనము 72 , పార్క్ హయాత్ భవనము 85 , గుజరాత్ లో డైమండ్ టవర్స్ 80 అంతస్తులు కాగా మణికొండ లాంకో హిల్స్ సిగ్నేచర్ టవర్స్(చేవ్రాలు భవనము) నూట పండ్రెండు  అంతస్తు లు కలిగి,  ఆరువందల నాల్గు  మీటర్ల ఎత్తుతో భవన  ఔన్నత్య మున  జగతినేలు మహాభి వలే ఆ మహార్ణమందు నిలిచి యుండెను. 

తే. త్తు  చూచిన తిలకమె త్తు  నందు  

 చిత్తు  ఈఫిలు బురుజుయు  చిన్న దగును  

 కాంచ  లోకాన  చిత్రము  గాదె చిత్ర 

కూట  మునుమీరి  ఘనమైన కోట ఇదియె       

ఈఫిల్ టవర్ ( 300 మీటర్లు ) సిగ్నేచర్ టవర్ నడుము వరకు వచ్చును.  ఏమి అదృష్టము ఈ నాడు ఇంత సుందర ప్రదేశమును కాంచితినని కేశవుడు మురిసిపోయెను.   కేశవుని ఆమె లాంకో హిల్స్ లో ఒక సదనమునకు గొనిపోయెను. ఇదియే మాఇల్లు రండని బిల్వగా కేశవునకంతయూ  వైష్ట్నవ మాయ వలె తోచెను. 

“నేడు నా జన్మదినము అదియే నేటి ప్రత్యేకత , మావయ్య మన భానోదయ కళా బృందమును తీసుకువచ్చు చున్నారు” అని చెప్పగా  "మీరు  ధనిక డంబమును జూపక  అహంకారమును అలవర్చుకొనక  నిత్యమూ సాధారణ దుస్తులు ధరించు చుండగా చూచువారు ఈమె జీవనోపాధికి  నాటక రంగమును ఎంచుకొనెనని అనుకొందురు. 

“ఎవరి సంగతో ఎందులకు మీరు ఏమనుకున్నారో చెప్పవలెన”ని  కేశవుని కూ ర్చుండ  బెట్టెను.  “వెంటనే ఏమి మాట్లాడవలెనో తోచక మాట మార్చి మీ ఇల్లు ఇంద్రసభవలే యున్నదనుచూ ” నిరాడంబరంగానున్న మిమ్మల్ని చూచినచో గీతగోవిందము ను గ్రోలిన ఆనందము కలుగు చుండు"ననెను.  జయదేవుని గీతగోవిందము రాధాకృష్ణుల  విరహ సంభోగ   శృంగార వర్ణనలతో నిండిన కావ్యము. అనగా నన్ను చూచినచో మీకు శృంగారభావనాలు కలుగుచున్నావా  అని రంజని అడిగెను"   "  మిమ్మల్ని చూచి నేను అట్లెందుకనుకొందునని   కేశవుడు బిక్క మొగము వేసి అసలు నాఉద్దేశ్యము అది కాదండీ. మీరుకూడా మా వలే సామాన్యులను కొని ఎప్పుడైననూ పొరబాటున మాట్లాడి యున్నచో  గణించవలద”ని చెప్పి ఒక ఆటవెలది గీతమునాలపించెను. 

ఆ. రంగము  నక్కున  జేర్చుకు  రమణి  కోరి           

కళా సేవ  జేసి   కరుగె  పుణ్య 

మూర్తి తె  లుగుభాష  యాడుచు మురియు కొమ్మ         

ఎంత గొప్ప దమ్ము  ఇట్టి జన్మ 

కళా సేవలో తరింఛి లోకమును పులకరింప జేయు కళారంజని గారికి  పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకనే కానేక శుభములు కల్గు గాక. “నేనంత పొగడ్త లకు తగనండీ” అని రంజిని అనుచుండగా”   మీకు నష్టమని తెలిసిననూ మీ స్వంత  చిత్ర నిర్మాణ,  చిత్ర  ప్రదర్శన శాలలను మూసివేసి నాటక కళకు తెలుగుభాషకు వైభమును చేగూర్చు టకు ప్రత్నించుచున్న మీరు ఎట్టి  పొగడ్తలకైననూ అర్హులే    అని కేశవుడనగా . మీకీవిషయములన్నీ ఎట్లు తెలిసినవి ?మన కళాబృందం  వారు చెప్పినారా?  అని రంజని అడిగెను. ఇంగువను మూటగట్టినట్టు మీ మంచి గుణములను మూట గట్టిన దాగునా  మన కళాబృందమువారికేమిఈ  విషయము అందరికీ తెలియును. అయిననూ ఇట్టివషయములను దాచదగునా ? అని కేశవుడడిగెను. మరి ఏమిచేయవలెను అని రంజని అమాయకంగా అడిగెను. మోత మోగించవలెను. అని కేశవుడనగా హాస్యము వెల్లువా యెను.  

కేశవుడు:  వైద్యము చదివి నాటకరంగమునకు ఎలా వచ్చెనని అనుకొనుచుండగా మీరు తెలుగు తెలుగుని తెలుగును పట్టుకొని వ్రేళ్ళాడుట ఆశ్చర్యముగానున్నది తెలుగు కొరకు మీరు ఎందుకు ఇంత  పట్టుపట్టినారు?

రష్యా  పోయి నా స్నేహితురాడ్రు వైద్యము చదుకొనుచున్నప్పుడు వారు ఆభాషలోనే వైద్యశాస్త్రము ను అభ్యసించవలెను. జర్మనీ, ఫ్రాన్స్, చైనాలలో కూడా ఆయా భాషలందు మాత్రమే వారు విద్యను అభ్యసించవలసియుండును.అజర్బైజాన్,  ఉక్రెయిన్ వంటి  చిన్న దేశములు కూడా వారి బాషలోనే వైద్యమును బోధింతురు. ఆంగ్లములో భోదించుటకు ఆయాదేశములకు  సామర్ధ్యతలేక అట్లు చేయుచున్నారా? కాదే! జీతమిచ్చిన ఆంగ్లములో బోధించువారిని నియమించుకొని సామర్ధ్యత ఉన్ననూ వారు మాతృభాషకు ప్రాధాన్యత నిచ్చుచున్నారు. 

కేశవుడు :  మరి మనదేశమునందు ఎందుకిట్లు చెప్పుచున్నారు. ఆంగ్లమాద్యములో నే చదువుకొనవలెనని , ఆంగ్లము రానిచో ఉద్యోగములు రావని బెదరగొట్టి చంపుచున్నారు.

అప్పుడే భానోజీరావుగారు కళా బృందమును తోడ్కొని లోపలకి   ప్రవేశించి  దీనినే ఆంగ్లమున బ్లాక్ మెయిల్ అందురనెను.   

రంజని: వీపుల వాతలకిచ్చి   కుత్తుకలు కత్తులకిచ్చి గుళ్లకు గుండెలు నిలిపి, ఉరికొయ్యల ఊయలలూగి సాధించిన స్వాతంత్రమును ఇట్లు జారవిడిచి వారి భాషకి నాగరికతకు దాసోహమన్నచో మన జాతిగౌరవమేముండును?   

ఆ.  తెలివిగ  తెక్కలి  జేసిరి    తెలుగు నడిచి   

ముక్క లుగచి  దిమిరి  మ్లేచ్చు  లిట్లు

భాషల  వంచించి  పడుకొండ బెట్టి గొప్ప 

భాష లెల్ల  వారు మాపి నారు.

గ్రీకు లాటిన్ వంటి భాషలను జంపి  వైద్య, న్యాయ విద్యలందు, జంతు, వృక్ష శాస్త్రములందు ఆభాషల పదములనే వాడుకొనుచున్నారు. భాషలకు ఊపిరితీసి వారిపాదములవద్ద కాలిపట్టా వలే పడవేసు కొనుచున్నారు. 

భానోజీ : జాతి గౌరవము కావలెనా గౌరమ్మా ! నేటికాలమున ఆ త్మగౌరవమును కూడా పట్టించుకొనక ధనార్జన  పైనే దృష్టిని నిలుపుచున్నారు.  

రంజని : అందులకే  తెలుగు బాష క్షీణదశకు చేరుకొన్నది. తెలుగు మాద్యమమును చదువుకొనువారు ఐదు శాతము కూడాలేరు. 

భానోజీ :  ఆంగ్లమాధ్యమము న చదువుకొని కూడా   ఆంగ్లమున  మాట్లాడలేనివారే ఎక్కువ. 

గుర్రం "అయిననూ విద్య జ్ఞానము కొరకు గానీ ఉద్యోగముకొరకు కాదు కదా"  అని  అనగా. పిల్లి పాపాయమ్మ "లెస్సపలికితివి ధర్మజా ఏనోట విన్ననూ  ఇదేమాట కదా "  అనెను 

నక్క నాగేశ్వరావు:   కాకికి ఎప్పుడూ  ఎండికలమీదే కళ్ళు . ముష్టివాడికి ఎప్పుడు ముద్దమీదే కళ్ళు . తెలుగువాడికి  కెప్పుడూ ఉద్యోగం మీదే కళ్ళు . చదువు ఎందుకురా అంటే జ్ఞానం కోసమని కోతలు కోయువారి దృష్టి అంతయూ   ధ్రువీకరణ పత్రాల  పైనే కదా!   బట్టీ పట్టయినా,  కాపీ కొట్టి అయిన నూ పైరవీలు చేసైననూ  ధ్రువీకరణ పత్రాల మర్చుకొనవలెను.  లేనిచో ఉద్యోగమెట్లు వచ్చును ? ఉద్యోగంలేనిచో  బ్రతుకెట్లు సాగును ?  జ్ఞానం, భాష కొరకు ఎవరు  చదువుకి వచ్చుచున్నారయ్యా?  

పాపాయమ్మ :  చదువు అనిన ఇష్టము అని చెప్పుదురు  అది లోకరీతి  

కేశవుడు : బ్రతుకు గడుచుటకు  చదువు కొనుచున్నప్పుడు ఇష్టా ఇష్టములతో పనియేమున్నది  

క.  ముష్టికి  వచ్చిన మనిషి 

కిష్టము ఏమ ను  నుముద్ద  కేడ్చును  గానీ        

ఇష్టము లేనిది జ్ఞానము     

స్పష్టము  మార్కుల ఏడ్తురు  చదువరు లిట్లే   

అని పద్యము చెప్పగా విని అందరూ గొల్లని నవ్వినారు.  కేశవుడు వారివైపు తేరిపారి  చూడగా " ఆపద్యము అట్లున్నది"అనిరి. కేశవుడు వారివైపు అయోమయములోపడెను.  పద్యము అట్లుండుట కాదు నీ పద్య చతురత బాగున్నది.    నీ వలే పద్యములు చెప్పుట యోగము బాగున్నది నీ భాషా ప్రయోగము. అని అందరూ తమ ఆనందమును తెలియజేసిరి.  

బాషా సంప్రదాయములు గురించి నేను వేదన చెందుచుండగా మీరు విద్య జ్ఞానము అని కొత్తవాదము తెచ్చిమాట మార్చినారు.  భాష ఎట్టి ఆనందమును కలిగించుచున్నదో భాష అర్థము అయినచో  ఈ పద్యములు హృద్యములు లేనిచో వ్యర్థములేకదా. మాతృబాష విని ఆనందించ లేనివానికి  మాతృమూర్తి మొఖము చూసి ఆనందించనివానికి బేధమేమి?  

గుర్రం వెంకటేశ్వరావు:  ఇంత కఠినమైన భాషనువాడిన మన యువకులు బిత్తరపోదురు  వారు చలన చిత్రములలో వాడు  నాసి రకమైన భాష నేటితరమునకు తలకెక్కినది అందుకే  నేటికాలమున అందుకే చలనచిత్రములనిన మోజు 

రంజని : చక్కటి భాషను ఆస్వాదించ లేనివారి జీవితము ఎంత నాసిగా  ఉండునో కదా?   

నక్క నాగేశ్వరావు: నేటికాలమున మంత్రములు కలవా అని సందేహించవలదు  ఆ చలన చిత్రములందు వాడు బూతు భాషను వాడినచో మన తెలుగువారు మిక్కిలి ముద్గులగుదురు. వారి పై అది మంత్రము లవలె పనిచేయును.   

కొత్త సుబ్బారావు : విడ్డూరంగా నున్నదే. వివరింపుము  

నక్క : వివేకహీనుడికి మంత్రం అనగా వికృతాకారంగల మాంత్రికుడు, మంత్ర దండం పట్టుకుని జపించే మాటలు. దానివల్ల ఎలుక - పిల్లిగానో, మనిషి - కుక్కగానో మారిపోడం మంత్రమని తలుచువారికి విడ్డూరముగానే తోచును మానవ మస్తిష్కాన్ని ప్రభావం చేసే ప్రతి మాట మంత్రమే.  

 ఉ . చిత్రము      గాదెవెం  డితెర  చిత్తము నేలచు   వేలుపే   యగున్ 

మంత్రము   లెచ్చట  కలవు మాటలు పాటలు  అన్నివే    ద ధీ   

మంత్రము  లేకదా  పనికి   మాలిన  భావము  లన్నియూ  విరాట్

తంత్రము    లేకదా  జనులు   తప్పక    విందురు  చప్పట్ల  దురన్ 

కేశవుడు అడుగకనే ఆశువుగా చక్కటి  చంపకమాల పద్యమును చెప్పుటతో అందరూ చప్పట్లు కొట్టి హర్షమును తెలియజేసిరి. రంజనిగారు " అద్భుతము" గానున్నది అని మెచ్చుకొనగా . అందరూ ఆమెతో మరొక సారి చప్పట్లు కొట్టిరి. " నిలువెత్తు అద్భుతము మీరు   మీకంటే అద్భుతము ఎచ్చటుండును.  జీవితమునకు ఏ గమ్యము ఉండరాదని  స్థిరపడిన నన్ను  మీకృషి మార్చినది. నేటినుంచి నేను కూడా తెలుగు భాషకు మీవలె సేవ చేయుట  ఆశయముగ పెట్టుకొంటిని. అని  చెప్పగా మరొక సారి చప్పట్లు మోగినవి. 


అందొక సభ్యుడు సందర్భము తెలియకున్ననూ “మీరు తగుతారు  తగుతారు  కోట్లు ఖరీదు చేసే భవంతి ఉన్న మీరు కాక ఇంకెవరు తగుతారు.” అనెను. అందరూ గొల్లు మని  నవ్విరి.  వారందరూ , ఆభవ సౌందర్యమును కొనియాడుట, అబ్బురపడుటకు కొలది కాలము గతించినపిదప భానోజీరావు గారు మరల విశాఖపట్నము పోయి ఉక్కు కళా మందిరమును సందర్శించవలెనని చెప్పిరి.  కళ్యాణ  మండపము  వలె  నున్న ఆ సువిశాల గది యందు గల పెద్ద భోజనాల బల్లవద్ద అందరూ కూర్చొనగా యాదమ్మ వారందరికీ పలహారము లందించెను.  

రంజిని: మరల ఉక్కు కళ్లామందిరమునకు పోవలెనా ?

కేశవుడు :మొన్ననే కదా తులాభారము  ప్రదర్శన జరిగెను!

భానోజీరావు:ఈ సారి నాటకము కొరకు  కాదు అంతకంటే ముఖ్యమైన  పని కలదు 

కేశవుడు: ఈ వారము మన సభ్యులకి భాగ్యనగరంలో కార్యక్రమములున్నవికదా అవి అవి ముగిసిన పిదప… 

నక్క నాగేశ్వరావు: బుధవారం రవీద్రభారతి ఘంటసాల కళావేదిక  యందు 7 నుంచి 9  గంటలవరకు నా కార్యక్రమము కలదు. ఆ కాంట్రాక్టరు కార్యక్రమము ముగిసిన తరువాతే పైకమిచ్చును. 

ఏనుగు శ్రీహరి: ముందు గా కొంత పైకమీయడు మీ కాంట్రాక్టర్ , మా కాంట్రాక్టర్ అట్లు కాదు ముందుగా కొంత పైకము ఇచ్చును. శుక్రవారం  చిక్కడపల్లి త్యాగరాజ గాన సభ నందు 6 గంటల నుండి 9. గంటలవరకు నాకు కార్యక్రమము కలదు. నేను కూడా మిగితా పైకమును తీసుకొన్నచో సరదాగా మీతో వై జాగు వచ్చెదను.

భానోజీరావు:  నక్క , ఏనుగు  ఉషారుగా ఉన్నాయి , గుర్రం ఏంటి డీలాగా ఉన్నాది ?

గుర్రం వెంకటేశ్వరావు : నక్కకి , ఏనుగుకి నాటకం అయిపోయిన తరువాత  డబ్బులు ముట్టు ను నా పరిస్థితి చూడవలెను ఇంతకముందు చేసిన నక్షత్రకుడి పాత్రకి , అంతకు ముందు చేసిన దుర్యోధనుడి పాత్రకి కూడా పైకము ఇవ్వలేదు, నేను దుర్యోధనుని వలె అతడిని భాదించజాలక, నక్షత్రకుని వలె వేదించజాలక సతమతమగుచుండగా  ఇప్పుడు నాకు  చితికిన బతుకులు అను సాంఘిక నాటకమందు  మూడవ పాత్ర ఇచ్చి వేయమనుచున్నాడు

 పిల్లి పాపాయమ్మ : మనమేమన్న సినిమా నటులమా… వెంటనే పైకము ఇచ్చుటకు! సర్దుకొనవలె నూ… అయిననూ డాక్టరుగారు అందరికీ బాగానే ఇచ్చుచున్నారు కదా! చివరి అక్షరము ను పట్టి లాగుచూ రాగాలాపనవలె మాట్లాడు పిల్లి పాపాయమ్మ అనిన అందరికి హాస్యము పొంగుకువచ్చును. 

కొత్తగా వచ్చిన కొత్త సుబ్బారావు : పాపాయమ్మకి పేరులోనే రెండు దీర్గాలు ఉన్నవి . 

నక్క : ఛీ సన్నాసి , అందులకు కాదురా , ద్రౌపది పాత్రలు వేయునప్పుడు ఆమె పైటను  లాగీ లాగీ లాగుచుండగా 

ఏనుగు : ఆ లాగుచుండగా ?

నక్క : ఆ లాగుడు ఆమెకు పట్టుబడెను

అమ్మ పిల్లి నీకు సంపాదించు భర్త కలడు అట్లే మాకు సంపాదించు పెళ్ళాలు  ఉన్నచో మేమునూ నీవలె మాట్లాడెదము అని బంటి  బలరాం అనగా అందరూ గొల్లని నవ్వినారు.

అయినచో మనము శనివారం ఉదయము బయలుదేరి సాయంత్రము నకు విశాఖ ఉక్కు కళాక్షేత్రమును జేరవలెను. శనివారం  భారతవర్షకు సన్మాన కార్యక్రమము కలదు. సభ్యులందరూ  హర్షమును వ్యక్తము చేసిరి. నేడు మధ్యాన్నం భోజనములిచ్చటే కావున ఈ ప్రదేశమును ఉద్యానవనములను చూచువారు పలహారములు ముగించి న పిదప బొయిరావచ్చును. అని భానోజీరావుగారు చెప్పిరి.  పలహారములు ముగించి నపిదప  రంజిని నేడు ఒక ముఖ్య నిర్ణయమును తెలియజేయవలెను, ఒక్క నిమిషము వేచి యుండుమని సభ్యులకి చెప్పి లోపలకు బోయి ఒక పళ్ళెము నిండా పొట్లములలో పెట్టిన డబ్బు తీసుకు వచ్చి " నేటి నుండి మీ అందరికీ నెలనెలా జీతములు అందును , మీరు ఇంకొక సంస్థ నందు చయయ నవసరము లేదు" అనగా అందరూ సంతోషముగా అంగీకరించిరి  డబ్బును తీసుకొనిరి “ అందరూ పోయిన పిదప కేశవుడు ఇంటిలోనే కూర్చొని యుండెను. మీరునూ పోయి నచో అన్నీ చూడవచ్చు అని రంజిని అనగా

ఇచ్చట ఉన్న దానికంటే గొప్పవి బయట ఏమియూ లేవని తెలియక వారు పోయినారు.  అది తెలిసి నేనెట్లు పోగలను. కానీ అంత గొప్ప మనిషిచ్చుటకు నావద్ద ఏమియూ లేకుండెను. అనుచూ ఆ... గుర్తుకు వచ్చెను అని ఒక పొట్లమును జేబునుండి తీసి అది విప్పి అందునుండి ఒక బంగారు గొలుసును తీసి ఆమె కు బహూకరించగా  ఇప్పటి వరకు ఏమియూ  లేదని  చెప్పి ఇప్పుడే ఈ స్వర్ణ  దౌరును ఎట్లు తెచ్చినారు?   ఇది అక్క  పార్వతి కొరకని ... ఆమెకు పెళ్లి సంబంధములు చూచు చున్నాము. కొంత బంగారము వివాహమునకు కావలెను కదా , నేను కూడపెట్టిన ధనముతో ఈ గొలుసు… 

రంజని:  అక్క  కొరకు కొని నాకు ఇచ్చివేయుచున్నారే! 

పార్వతికి మరల కొనవచ్చును అనుచుండగా ఆమె లోపలి బోయి బంగారు గాజుల జత  ఒక గొలుసు తెచ్చి పార్వతికి నా బహుమతిగా అందజేయవలెను అనిచెప్పి ఒక చిన్న పెట్టెలో పెట్టి  వలదని వారించుచున్న అతడి చేతిలో పెట్టెను.  మీరు నన్ను మీరు అని సంబోధిచకుండిన మేలు అని కేశవుడు అనగా అది మీ చేతిలో నున్నది " మీరు  రంజని నువ్వు అని పిలిచినా నేను కూడా అట్లే పిలిచెదను." అనెను. కేశవుడు హతాశుడయ్యెను. 


   

 


4 comments:

  1. ఇప్పటి కిప్పుడు మణికొండ వెళ్ళాలి అన్నట్టుగా లాంకోహిల్సును వర్ణించారు.కేశవుడి అమాయకత్వం😄, రంజని చురుకుతనం బాగున్నవి.కళాకారుల మధ్య సంభాషణలు సహజంగా ఉన్నవి.

    ReplyDelete
  2. టెక్నాలజీ తదితర ఇతర నాగరిక విషయము లను తేట తెలుగులో వినడం గమ్మత్తుగాఉంది సర్

    ReplyDelete
    Replies
    1. టెక్నాలజీ తదితర ఇతర నాగరిక విషయము లను తేట తెలుగులో వినడం - I am excited about writing such things in Telugu. I am glad that it interests you too.

      Delete