Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Thursday, November 26, 2020

Bharatavarsha 80

 ఆది : ఒలేయ్ పైడి నీల్లో ట్రాయే , వేన్నీలు బేగొట్రాయే

పైడి : కుక్కనాఁగ కయ్ కయ్ మనరుత్తావెందుకు . వేన్నీలు వేన్నీలు అనిరి త్తేతొచ్చేత్తాయేట్రా! టవ్వు మీదెట్టేను కూకో! కాళ్ళు సేతులు అన్నీ సరిగ్గున్నాయా ఇరిగిపడిపోనాయా ఓ పాలి సూసుకో!  ఆ బాబుని సూసి కూడా ఎల్లేర్రా , బుర్రతక్కువెధవల్లారా. 

దాసు : ఓలమ్మ  ఇప్పుడేటనకే ,    ఒళ్ళంతా పచ్చి పుండైపోనాది , ఇరగ్గొ ట్టేసాడు

పైడి : ఆ బుద్దప్పుడే టైపోనాదీ  కడుపుసేసి ఒగ్గేత్తూ రుకుంటార్రా! నాయం ఉండాలిరా రగి డీసెదవల్లాగా !

ఆది : బావ మాటలు వినెల్లి డెబ్బైపోనాం  బావో , ఇంకెప్పుడెల్లము ఆ వర్స గాడి జోలికి 

 పైడి ఆదితో: ఇంతకీ మీబావేడిరా , ఈడు ఎక్కడ దూరేశాడ్రా ?

దాసు : ఇంతవరకు ఆ అరుగుమీద దొల్లేడు   ఇప్పుడే లోపలికెల్లిపోనాడు

పైడి : ఏటి తాగేసి తొంగుండిపోనాడేటి? దెబ్బలు తగిలితే ఆడదే సేత్తాడు. 

పెంచలయ్య చేతిలో తుపాకీ చూసి ఓలమ్మో టుపాకటు కొచ్చాడు పిచ్చెక్కిపో నాదీడికి

ఒక తూటా గాల్లోకి కాల్చాడు పెంచలయ్యదెబ్బకి ఆది , పైడి , దాసు  ముగ్గురూ మంచం కింద దూరేసారు ఒరేయ్ దాసు , ఆది రండ్రా నా యాల్ది , ఒలేయ్ పైడి నువ్వు రాయే 

ముగ్గురూ బయటకొచ్చి గజ గజ వణుకుతున్నారు “దున్నపోతుల్లా గున్నారు ఒక్కణ్ణి కొట్టలేకపోయారు నీ యవ్వా

దాసు : ఆడు ఆరడుగులు , నేను ఐదడుగుల కూడాలేను ఎలకొ ట్టేతానురా, అవుంరా  ఆది మన రోజు బాగుండి ఆడు కొట్టీ సొగ్గీసాడు  గానీ  సెంకలో ఎట్టీసి  నొక్కితే మన గతి ఎట్రా !  ఆది: సెల్లికి నాయం జరగ్గపోతే రేపు మల్లొ తానన్నాడు 

ఓసోస్ నెలతక్కువేదవల్లారా, మనదగ్గిర  టుపాకి ఉంది,  టుపాకి లాంటి కుర్రోడున్నాడు   పెంచ: మనం జడవడమేటి?   ఆ మంజూసాకి మన సందీపు  టమక్ సేసేశాక ఆడేటిసేతాడ్రా?

 ఈసారోత్తే  కాళ్ళట్టుకుంటాడు, ఆడి  సెల్లికి  నాకొడుకుతో  పెళ్లి సెయ్యమంటాడు  ఈ సారి  గొడవకొత్తే ఇదిగో సూత్తన్నావు కదా సేతిలో ఏటుందో  ఆ!

సందీ: నాన్న  బావ నిన్ను కొడుతుంటే అడ్డుకుని తప్పు చేసాననిపిస్తోంది .

బావా , ఎవడ్రా నీకు బావ? ఇంత జరిగాక ఆడి సెల్లిని ఇంకా సేసుకుంటావా? సిగ్గునేదురా? సన్నాసి నాకొడకా ! 

ఓరి  ఓరి ముండమోపిది  సీమంతాకి ఆరతిచ్చిందని  నువ్వు సిగ్గు గురించి సెపుతున్నావా !

ఒలేయ్ పైడి ఏ టేనోరు లెత్తండి , నా సెయ్యి లెక్కుండా  సూసుకో 

నాయెనక కత్తలబడి, మాయయ్య కాళ్ళొట్టు కుంటే నిన్ను సేసుకున్నాను మరిసిపోనావేటి, సేతిలో డబ్బులున్నాయని, టుపాకుందని కొట్టేత్తాను, సంపేత్తా నటన్నావు, ఆరోజు నీమీద సిన్న కోడిపెట్ట లకేసులోంచి  ఒగ్గించుకొనేకపోతే  నానొచ్చి ఇడిపించినాను.   

నాన్నా నిన్ను తలుచుకుంటుంటే నాకు సిగ్గేస్తోంది. నువ్వు చేస్తున్నది చాలా తప్పు  నిన్నుకొడుతుంటే  అడ్డుకోడానికి నేను అనవసరం గా వచ్చాను. ఆతను కొట్టడానికి ఎందుకొచ్చాడో   తర్వాత తెలిసింది, నువ్వు మాలినిగారిని ఎలా అవమానించావో  తలుచుకుంటే నీ కడుపున పుట్టినందుకు సిగ్గేస్తోంది. నేను ప్రేమించిన పిల్లని బిడ్డ పుట్టేదాకా ఆగి ఆబిడ్డకి ఎవరిపోలిక లొచ్చాయో ఆళ్లింటి కెళ్ళి  గొడవాడకోమంటావా ?  

ఓరి పెంచ నాకొడకా ఎందుకలగనీసినావురా ! 

సందీపు: అంతటి తో ఆగలేదు అమ్మా నాన్న " ఆర్మ్ వాళ్ళ పెళ్ళాలని కూడా నమ్మలేము , మొగుళ్ళు బోర్డర్ దగ్గర మేలుకునుంటే  వాళ్ళ పెళ్ళాలిక్కడ ఎవరితో పడుకొని పిల్లలని కంటారు అన్నాడు. అమరవీరుని భార్య న్యాయం కోసం  చర్చి కొచ్చి నిన్ను అర్దిస్తుంటే దేవుడి దగ్గర అలా అవమానిస్తావా, ఆప్రభువు నిన్ను క్షమించడు నాన్నా!  

 అసలు నేను నందినమ్మ మాట విని ఉంటే బాగుండేది.  హృదయం దోచు కోమని  చెప్పింది కానీ శీలం దోచుకోమని చెప్పలేదు. హద్దు దాటొద్దని ఎన్నో సార్లు చెప్పింది.  నీమాటలు విని నేను హద్దు దాటాను. మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని మోసం చేశానని ఇప్పుడనిపిస్తోది. 

ఇదంతా ఇన్నాక నన్ను సెప్పుతున్నాను , ఆ యమ్మే నాకోడలు

నేను ఎం ఎల్ ఏ అవ్వడం నీకిట్టం నేదే ట్రా? ఆ దేవుడమ్మని తప్పుకోమై సెప్పితే సాలూరా!

దాసు: ఆ యమ్మ తప్పుకోపోతే ? ఆ సెసాచలం ఒప్పుతాడేటి!   

 అప్పుడే మరీదు ప్రవేశించి 

అల్లు ఒప్పుకోపోతే ఆ తప్పు  గురువుగారిదా , శిచ్చ ఆల్ల చెల్లికా ?

ఏరోరి మరీదు నువ్వేట్రా యిలగైపోనావు? నీకు ఆడు ఒక్క రోజుకూడెట్ట గానే గురు వైపోనాడు కుక్కనాఁగ తోకూపుతు న్నవు. నాకు విదేశాలనుంచి ఫండ్స్ ఒత్తన్నాయిరా. అవి ఖర్చెట్టి నేను ఎం ఎల్ ఏ అయ్యి  మీ అందరికీ ఉరిసిచ్చే

ఛీ నాన్నా కొడుకుని మోసం, చర్చికి వచ్చే డబ్బుని సొంతానికి వాడుకొని చర్చిని మోసం.  దగా దారుణం. 

దారుణం అంటే ఎటోచూబిస్తాను రా ఇప్పుడే మన స్పెట్టర్ని పంపి బారతవర్ష సంగతి చూస్తాను. నా ఇంటిమీదకి వచ్చి నన్నే కొడతాడా ?   నా సత్తా చూబితాను   

మరీదు : సాటి దొంగ గా చెప్తున్నాను , నాకు దొంగ తనం అంటే అసహ్యం వేస్తోంది.  

                                                                   ***

ఆనందనిలయం: వర్షుని ముఖ వర్ణన 

  . రుధిర  ధారల   వర్షమే    గని యా  అభిజ్ఞు నికన్ను లన్
       అధిక  విభ్రమ   పొందిరా  క్రుధర   క్తసిక్త   ముఖార  విం    
       దధిప  తేజము డాగురిం  చగతాం డవప్రి  యతాళ  సం
       విదిత సంచలి   తోగ్రనే     త్రభవ   త్కరాళ  వికల్ప మున్

       రుధిర  ధారల వర్షమే   గని యా  అభిజ్ఞు  నికన్ను లన్
        రక్తపు ధారాలే చూచి  ఆ పండితుని  కన్నులందు   
        అధిక     విభ్రమ నొందిరా  రక్తసిక్త    ముఖారవింద   
        అధిక భ్రాంతిని పొందిరి  ఆ రక్త సిక్త ముఖమునందు 
        అధిప తేజము  డాగురించగ  తాండవప్రియ  తాళ  సంవిదిత 
        విద్యా తేజము  దాగొనగా శివుని లయని ఒప్పి   
        సంచలి  తోగ్రనేత్ర   భవత్  కరాళ   వికల్పమున్
        చలించు ఉగ్రనేత్ర ములను, క్రోధమైన దుర్గ రూపమును (కని  అధిక భ్రాంతి నొందిరి)

ఆ పండితుని కన్నులందు రక్తపు ధారాలే చూచి   ఆ రక్త సిక్త ముఖమునందు  విద్యా తేజము  దాగొనగా శివుని లయ ని ఒప్పి, చలించు ఉగ్రనేత్రములను, క్రోధమైన దుర్గ రూప మందు అధిక  విభ్రమ నొందిరి.
      
ఆ సందీపునెట్లు వలచితివి , అతడి యందే  సుగుణములు చూచినావు?  నీ మూలమున  నేడానందనిలయము నందిక ఆనందము అడుగంటినది. దుస్వప్న  మందైననూ ఇట్టి దారుణ పరాభవమునూహింపమే, అట్టి దారుణము నీమూలముగా వాటిల్లినది నీ బుద్ధి హీనతకు చిత్త చాంచల్యమునకు హద్దు లేకుండెను. 

మంజూష: సమీరము వలె రేగి  సమీకమును  సృష్టించి ఉగ్ర నరసింహుని వలె ఊగ నేల?  కలము పట్టిన వాడు చేత ఖడ్గము పట్టి అడరి బరి యందు అరిమూహము నదిలించ నేల? నీ ఉద్రేకము చాలింపుము. నీ ఉద్రేకమునకు నా జీవితమును హారతి కర్పూరము చేయవలదు. 

వర్ష: ఓసీ మూర్ఖ శిఖామణీ! మన ముత్తాత తండ్రి రామానుజం 1875 లో పుట్టి   39 సంవత్సరములకు  మొదటి  ప్రపంచ యుద్ధమందు 1914 లో మరణించెను అతని కొడుకు  నరసింహుడు  1898 లో   పుట్టి 1945 లో సెప్టెంబర్ 25 న రెండవ ప్రపంచ యుద్ధమందు మరణించెను. అతని కొడుకు ఆదినారాయణ మన తాత  తండ్రి   1917  నుండి 1985 వరకు జీవించెను. మన తాత నరసింహం 1936 నుంచి 2002, మన తండ్రి ఉగ్ర దీక్షిత 1957 లో పుట్టి 1999 లో కార్గిల్ యుద్ధమందు మరణించెను. వీరందరూ ఎందులకు మరణించినారే అల్పబుద్ధి ? ఆ  అమర వీరుల ఆత్మ  నాయందు లేదా! కేసరి కూన నేను గానా! వారు   మాతృ భూమి కొరకు మరణించినచో నేను మాతృ మూర్తికొరకు మరణించెదను. నీ తెలివిట్ల ఘోరించెను!

 మాలిని: సోమ యజ్ఞాల శోభిల్లు పండిత వంశమున సోమమనుజూపఁ పెంచిన హృదయము తల్లడిల్లె,  . సోమకోర్వలేని సుకుమారుడను కొని రాకుమారుని వలే సాకిన నాకుమారుడు  కావ్య కవితా ఛత్రపతి వలె వెలుగొంద వలె, తలపులందు గేయము లుండ వలె  గానీ తలనిండా గాయములున్నచో  హ్లాదమగునా?!
    
వర్ష : వెరచి వెనుదీసి వెన్ను జూపి మనుటకంటె మరణించుట మిన్నకాదా?

మంజు: వారు నీ తల్లి నవమానించినారు నీవు పోయి వారిని తన్ని పగతీర్చుకొనినావు, చెల్లుకు చెల్లు, బాగున్నది మరి చెల్లి బ్రతుకు? నీ విజ్ఞతిట్లఘోరించెను! ఆ మాటలు వినుచుండగానే వర్షుడు చెల్లి చెంప చెళ్లు మనిపించెను.
అంతవరకూ శయ్యపై నిస్త్రాణ ముగా పడియున్న మాలిని గారు లేచి “వారు అవమానించిన సహింపుము, బాల్యమున దానిని ఎత్తుకొని మోయలేదా? దానివల్ల దెబ్బలు తినలేదా? అన్నవైనచో ఇప్పుడు రెండు తిన్ననూ ఆమె పెండ్లిచేయ వలెను. విజ్ఞత యన్నచో చేయదగ్గపని తెలుసుకొనుము. అది గర్భవతి అనిమరచి  నీ తాతముత్తాలను పేరు పేరున తలిచి  కుటుంబమునకు కళకము తేవలదు.” ఆ సాందీపుని వేడుకొనుట వేరు మార్గమేమియూ లేదు అట్లే చేసెదను అని వర్షుడు అను చుండగా "సి ఐ గారు స్టేషన్కి తీసుకురమ్మన్నార" ని జెప్పుచూ పోలీసులు వర్షను వారి వాహనమందు కొనిపోయిరి.
                                                                ***

ఆది : బావ,  వర్సనట్టుకెల్లి  పోనారట !! టేషన్ నుంచి పోను 
పెంచలయ్య : ఇలగివ్వరా , నాను మాటాడు కోవాలి. ఆది దూరవాణి సాధనమును పెంచలయ్యకందించెను 
సి ఐ గారా, ఒట్టు కెళ్లిపోడంగాదు, ఆడు బైటకి రాకూడదు , మాఇంటి మీదకొచ్చినట్టు సాచ్చాలున్నాయి. ఇంకేటివ్వాలి , ఫిర్యాదివ్వాలా  ఓ ఇత్తాను ఇప్పుడే వత్తాను.  
పెంచలయ్య: ఒరేయ్ దాసు   ప్రభువు దయ వల్ల ఆడు బైటకి రాకుంట ఉంటె ఈ ఆడోల్లే ఆ దేవుడమ్మని ఒప్పిత్తారు.  పదరా టేసన్ కెలదాం  అని దాసును , ఆదిని పిలవగా వారు మొదట నిరాకరించిననూ పిదప మెత్తబడి అతడిని గూడి పెంచలయ్య వాహనమందు  ఠాణాకు పోయిరి. సందీపుడు చింతించుచున్న తల్లినోదార్చు చూ కూర్చోండగా నందిని వచ్చెను, మొత్తము విషయము నెఱిగించగా చేతి గాజు విరగ్గొట్టి  ఖంఠమును కోసుకొనెను. బొటబొట రక్తము కారుచుండగా తల్లి గంగివెఱ్ఱిలెత్తుచూ కేకలు వేసెను. మెడకు గుడ్డ చుట్టి శీఘ్రముగా ఆమెను  అంబులెన్స్ నందు విశాఖపట్నము  ఆసుపత్రికి తరలించిరి.

2 comments:

  1. కథ ఊహించని మలుపులు తిరుగుతోంది.మరింత ఉత్కంఠ భరితంగా సాగుతుంది.వర్షుని ఆగ్రహమును తరళ పద్యములో చాలా బాగా వివరించారు.పెంచలయ్య కుటుంబ సభ్యుల మద్య సంభాషణలు ఉత్తరాంధ్ర యాసలో సహజంగా ఉన్నవి.

    ReplyDelete
  2. Thank you, here you have another electrifying scene.

    ReplyDelete