Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, November 24, 2020

Bharatavarsha 79

విశాఖపట్నము : ఆనందనిలయమందు మాలినిగారు ఇరుగు పొరుగులతో ముచ్చటించుచూ  రెండు దినములు ఎట్లు గడిచెనో చెప్పుచుండిరి. ఇంతలోవలతి వచ్చి "వర్షుడు వచ్చెనా?" అని అడగగా మాలినిగారు  ఆమెను ఆహ్వానించి కూర్చోండ బెట్టి " వర్షుడు కొద్దిసేపటిలో వచ్చి చేరును " అని తెలిపగా ఆమె " మంజూష కలదా?" అని అడిగెను. ఆమె నిద్రించుచున్నది అని చెప్పి  మాలిని గారు "ఈమె ఏ వార్తలు మోసుకువచ్చెనో " అని అనుకొనుచు నీవు బల్లిపాడు వచ్చిన  బాగుండెడిది

"మదనగోపాలుని ఉత్సవ వేడుకలు కడు  రమ్యముగా జరిగినవి.  రధోత్సవము కనుల  విందు గా సాగినది. బంధు మిత్ర సంగమము, కొనేట జలకాలాట,  బసవ పార్వతి ప్రణయము, విడిదింట హాస్యము ,అరుణతార కవిత్వము , బసవని  ఆట పట్టించుట,  పార్వతి వీణావాదనము,  కేశవుని బుర్రకథ,  ఆ ఘట్టములన్నియూ ఒక ఎత్తుకాగా సుందరి విమాన విన్యాసము లొకెత్తు అని ఆ ముచ్చటలు చెప్పి మురిసి  "బల్లిపాడు పేరు తలిచిన ఆ దృశ్యమాలిక ఇంకనూ  మనసుని పులకరింపజేయుచున్నది. ఒక్క మాటలో చెప్పవలెనన్న కైలాసమేగి నటరాజు తాండమును చూచినట్లు న్నది అని  ఆనందాతిశయమున చెప్పి ఉబ్బి తబ్బిబగుచున్న మాలినిగారితో ఇరుగు పొరుగువారు  " పెళ్లి సంబరములకేమీ తీసిపోని విధముగా సాగినవ" నుచూ తమతమ ఇళ్లకు బోయినారు . 

వర్షుడు కొద్దిసేపటిలో  విశాఖపట్నము  చేరబోవుచున్నాడని వలతికి  తెలపగా  వలతి " అందరూ వెడలిన పిదప మీకు ఒక వార్త నెఱిగించవలెనని కాచుకొని కూచున్నా "నని తెలిపి " మీకు తెలపవలెనా  గురువుగారికి తెలపవలెనా యని  కొంచెము సందేహమున్నది , అయిననూ మీరు తల్లి కనుక మీకే తెలిపెదను అని "  వద్దకు పోయి చవిలో  మెల్లగా  " మంజూష  గర్భవతి " అను చెప్పిన ఆ మాటలకు మాలినిగారు  పిడుగు పాటుకు కుప్ప కూలిన వృక్షము వలె  నెలకొరిగిరి. ఆనందమంతయూ ఆవిరైపోయెను ఆనందనిలయము విషాధానిలయము వలే తోచుచుండెను రాధామనోహర  విరులన్నీ  జాలిగా చూచుచున్నట్లగు పించెను. 

నిద్రించుచున్న కూతురి గదిలోకి పోయి ఆమె ప్రశాంతతను చూచి వణికెను.  

పిదప వలతి హాస్యమాడెననిపించెను పిదప మనసు పరిపరి విధముల బోవుచుండ దేవుని మందిరమునకు పరిగెత్తుచు మధ్యలో గోడమీద ఉన్న భర్త ఛాయా చిత్రము వద్ద ఆగబోయి కంగారులో కాలు బెణికి క్రింద పడి తల గడపకు కొట్టుకొనగా మంజూష లేచి తల్లిని లేవదీయబోయెను ,  ఆమె చేతులు కాలయముడి  పాశమువలే తోచగా పెద్ద కేకవేసి మూర్ఛ పోయెను. మంజూష ముఖంపై నీరు జల్లి తల్లిని లేపగా సత్తువడిగిన మాలిని గారు జాలిగా ఆమె ముఖంలోకి చూడగా మంజూషకు విషయమర్ధమయ్యి  అశృనయనాలతో అవునని తలవూపెను. మాలిని గారికి  దెబ్బ  తగిలి  తల బొప్పిగట్టెను. "ఎవరు అతడు ?" అను మాటొక్కటి చిట్టచివరికి ఆమె నోట పెగిలెను అది మాట వలే కాక మూలుగు వలె నున్నది . 

మంజూష సందీపుని చిత్రమును తల్లి చేతులో నుంచి మంజూష తన గదికి పోయెను. రెండు నిమిషములు ఎట్లు గడిచినవో ఆమె  చిత్రము వైపు చూడక  ఏటో సూన్యములోనికి చూచుచూ ఉండిపోయెను. పిమ్మట ఆ చిత్రమును చూచి   పట్టరాని కోపముతో  భగ భగ  మండు  దావానలమువలె  మంజూష గదిలోనికి ప్రవేశించి  ఆమెను రెండు చెంపలు  వాయించిమీద బడి రక్కి కొట్టి  చివరకు నిస్సహాయముగా నేడ్చుచూ కూర్చొండెను.  కొలది సేపటికి మంజూష వచ్చి" మనకేదిదారి  ఇప్పుడేమి  గతి పట్టించితివో కదా    పోయి పోయి ఆ దరిద్రుని పాల బడితివి. 

"చాలాకాలమునుంచి మేమిరువరమూ ప్రేమించుకొంటిమి. నాకతడు కావలెను."  "ఈ పోకడలు మన ఇంట వంట కలవా ?  ఇది ఎట్టి కళంకము !" "నాకు సందీపునకు పెండ్లి జరిపించిన కళంకమెట్లుండును ? "

ఆ పెంచలయ్య పాము వంటి వాడని లోక ప్రతీతి. అతడు ఒప్పనిదే ఈ పెళ్లి ఎట్లు జరుగును  ఇప్పుడు నేను పోయి వాడి కాళ్ళపైబడ వలెను. "నీవు వర్షుడు ఇద్దరు కలిసి అతడి కాళ్ళ పై బడైననూ నా పెండ్లి జరిపించవలెను.  ఆడపిల్లని కన్న తల్లికి అంత  అహంకారము కూడద"ని తల్లికి హితవు పల్కెను. మాలిని కొలది సేపు చేష్టలుడిగి కూర్చున్ననూ లేచి పెంచలయ్య వద్దకు పోవుచుండగా 

మంజూష " సబ్బవరం పోవలసిన అవసరము లేదని తమ ఇంటివద్ద నున్న వారి చర్చిలో ఉండునని చర్చ్ చిరునామా ఇచ్చి పొమ్మని చెప్పెను. మాలిని గారు వెడలిన పిదప సందీపుడు ప్రవేశించెను. "అనురాగవతీ!" యని  ఆమెను ఆలింగనము జేసుకొని " నా తల్లి  నిన్ను ఎల్లప్పుడూ మెచ్చుకొనును నాతండ్రి  కూడా మంచివాడే కానీ వివాహమునకు  ఒక్క షరతు పై అంగీకరించును మీకాబోవు  వదినమ్మను ఆమె తండ్రి శేషాచలం  ఎం ఎల్ ఏ  బరిలో నిలిపినాడు.  ఎం ఎల్ ఏ అవ్వవలెనను మానాన్న చిరకాల కోరిక తీరవలెనన్న విదిష బరినుండి వైదొలగవలెను, 

అనగా పోటీ చేయరాదు . అట్లయినచో ఈ వివాహము తప్పకజరుగునని హామీ ఇచ్చుచున్నాను. మంజు , బెంగుళూరు నందు రాఘవుడు నాకు పదవిచ్చిననూ పోక నిరర్ధకునివలె ఇచ్చట తిరుగుచున్నాను , నీకొరకే కదా ! ఆలోచింపుము అనగా మంజూష సందీపుని గుండెలకు హత్తుకొని " చెల్లి కొరకు వర్షుడు , కూతురికొరకు మాలిని చేయక ఛత్తురా!  ఇప్పడే మా అమ్మను పంపినాను మా అన్న వచ్చు వేళాయెను అనగా  సందీపుడు నిష్క్రమించెను.

 ఘోరపరాభవమును చవిచూచి తల్లి ఇంటికి చేరి తనకు జరిగిన అవమానమును మంజూషకు చెప్పుచుండగా  వర్షుడరుదెంచెను. తల్లి చెప్పుచున్నదంతయూ గడపబయిట నుండి విని మహోన్మత్త వికార రూపుడై దక్షప్రజాపతి పై దండెత్త బోవుచున్న త్రినేత్రుని వలే పెంచలయ్య వద్దకు  సాగుచుండ మాలిని మంజూషలు భయకంపితులైరి. 

సాధారణముగా ధారణము దప్ప రణము దెలియని సూరి బరిలో దూకిన ఓడుటయే కాక నెత్తురోడును. ఇది తధ్యమని తలచి మాలిని వర్షుని వారించి నివారించ లేకున్ననూ  రోదించి నిరోధించుట తక్షణ కర్తవ్యమని, పోరు వలదని పోరుచూ,  కన్నీటి కంట వాటముగ కవాటముకడ నిలిచెను.  వర్షుని లో అధిపుడంతరించి వీరజవాను అవతరించెను

కల్పము సంభవించునని వికల్పము చెందుట వీరపత్నిచేయదగునా!  నీ సంక్రాందనా క్రందనలునను  నను నిలువరించజాలవు విజయము వరించకున్ననూ రణము  అనివార్యము, సూరి రణసూరి కాకున్ననూ , అధిపుడు  అధిపురుషుడు కాకున్ననూ  పురుషుడని గ్రహించుము. అని తల్లిని తొలగించుకొని కదనరంగమునకు సాగిపోయెను.

భగభగ లాడే రేడే గడ బిడ గడ అడుగుల పడ  

జడి వడి వడి వడిగా సుడిలా కదిలెను తల్లే  

తడబడి జగడమాడు వాడటుబడి ఇటుబడి

కుడి ఎడమలగా ఆప జూడగా 


ధగద్ధగ ధగ ధగధగ లాడే కడియం తొడిగెను

కోడె దూడలా కాలు దువ్వుచూ వాడి వాడిగా

సడి జూడక, మడ గడి  దాటెను రగడ మాడగ 

రంకెలు వేయుచు అరినే పిలిచెను బరిలో దూకెను


పట పట పట పట పళ్ళే కొరికెను పెంచలయ్య 

కళ్ళెర్రబారెను గుర్రని చూచుచు అఱ్ఱము

ఓలే ముఖమును జీరి వర్ర పూసిన

గుర్రము ఓలే కరమున కర్రతో బరిలో దూకెను


గిర గిర గిర కర్ర త్రిప్పుచు కొక్కిరిబిక్కిరి

ఆటలాడుచు వర్షుని పైబడి వరాహమల్లె

దడ దడ దడ  దడ బాదసాగెను 

ఆదరబాదర  లేని యోధుఁడు

ఉక్కుమేనితో చక్కగా నిలిచెను


బొటబొట బొటబొట అశ్రుబిందువులు

మాలిని వీడి నేలను తాకునంతలో

తత్తడి రయమున రేగెను వర్షుడు

పక్కటెముకలో జీరి నంతనే


విలవిల విలవిల  విలవిల లాడుచు 

ఒక్క దెబ్బకే కుప్పకూ లెను పెంచలుడే

నేలనంటెను, ఉగ్రరూపమున ఉత్తుంగ 

చెండమున ఆకాశములో వర్షుని చూచెను

 

సల సల రుధిరము మరుగు చుండగా  

అధిపుని కళ్ళే చింత నిప్పులై 

విస్పు లింగములు కురియుచుండగా 

పెంచడి పంచే జారిపోయెను లేచి నిలుచుటకు

 త్రాణము లేక ప్రాణము కొరకు పాదము లంటెను 


జల జల జలమని చమూచరులు 

ఆయుధీయులే దూకిరిగా నిరాయుధ యోధుని 

ముట్టిరిగా ఆయువులే మరి తీతురుగా యని

బిక్కచూపుల చూచు తల్లి కి బిత్తరబోవు ఉత్తరమిచ్చెను


గజ గజ వణికెను  వైరి వర్గము

కాలరుద్రుడై  చెలగెను వర్షుడు

జగడ మడఁగ మై బొగడము

పేల గొడవ నెగడగా రణము రగిలెను


అతడే అతడే వర్షుడురా 

విలక్షణ అక్షర యోధుడురా 

కార్గిల్ పోరున అసువులు బాసిన 

అమర జవానుకి పుత్రుడురా

సాహిత్య ప్రియ ధీరుడు రా 

వీరుడు రా రణ శూరుడు రా 

పట్టిన పట్టును విడవడురా 

అధిపుడురా అజేయుడురా


కొట్టిన కొట్టుడు కొట్టక కొట్టగ 

పక్కటెముకలుపట పట విరిగగ

ప్రత్యర్థుల లో జీవము చచ్చెను 

ఇంతలోని సందీపుడు వచ్చెను.

కర్ర దీసుకొని వెనక మాటుగా 

వర్షుని బుర్రన వేటు వేసెను 


దిగదిగ లాగెను అతిరథుడు 

అనీకస్థుడైన నిరాయుధుడు

గిరగిర  గిరగిర శిరమే తిరిగెను

ఎగుడు దిగుడగుడవ తట్టుకు నిలిచెను


వెనుకకు తిరిగెను దీపుని గాంచెను 

దిక్కులూగ పొలి కేకే పెట్టెను పులిలా 

దూకి ఖంఠము పట్టెను కళ్ళలో మృత్యువు 

కదల  కాళ్ళే వణికె సందీపునకు


వలవల ఏడ్చుచు చెల్లమ్మ 

అన్నను వేడుచు పాదాలంటెను 

నా కడుపులో బిడ్డకు తండ్రితడు 

నీ భగినికి జీవన దాతితడు


అయ్యలేని బిడ్డను రా

అన్నయ్య నీవే అయ్యవురా

అత్తింటికి నను సాగనంపర

నీ బావను కాటికి పంపకురా

1 comment:

  1. రామా! ఇది అస్సలు ఊహించని మలుపు.ఇప్పటి వరకు వర్ష విద్వత్తు చూశాము.ఇప్పుడు వీరత్వాన్ని పద్య రూపంలో చక్కగా వివరించారు.ఎంత వీరుడైననేమి! సోదరి కోసం తలవంచక తప్ప దు కదా!

    ReplyDelete