గ్రీష్మతాపము ఎడారిని తలపింపజేయుచుచున్నది. ప్రకృతంతయూ కళతప్పి పచ్చదన మెచ్చటనూ కానరాకున్నది. బడబాగ్నిని జతగూడిన గాలి అంబుకంటకము (మొసలి) వలె కరకర నములుచూ ప్రాణసంకటముగా మారినది. గాడుపులు గూబలలోనికి గుచ్చి సూళపు పోట్లను తలపింపజేయుచున్నవి. నాటికాలమున గ్రీష్మతాపమునకు బెజవాడను చిరునామా గా చెప్పుకొనెడివారు. నేడు విశాఖకూడా శీతల వైభవమును కోల్పోయి గాడి పొయ్యి వలే మారినది. దయ్యములైననూ తిరగని శూన్య రహదారి విధవరాలి వైనమును చూపుచున్నది.
మ. బెజవా డెండలు జూసినం తటనె బెంబేలె త్తుటఖా యమే
నిజమా డంగవి శాఖప ట్నమున నూనేడ ట్టికాల మొచ్చె
రజ నీ గంధము రాలిపో యినది గారాల కుగాడ్పొ చ్చెసా
రజమే పూసుకు దారిలో నడవ మారాడ కరొట్టే యగున్
ఎం. జి. హెక్టర్ వాహనము కదన తురగము వలె కదం తొక్కుచున్నది. దామిని, మీనాక్షి వెనక కూర్చొని యుండ గా ఉల్లాసము హృదయమునూపుచుండ దామిని హృదయేశ్వరుడు నవతేరును నడుపు చుండెను. మధ్యాహ్నం కావచ్చు చున్నది...
మనుజుడు కానరాడు మద్దెల పాళెమందు
రహదా రెడారిని తలపించ రణ తురగమల్లె
లంఘించె నవ శకటము లంకకేగు పవన
సుతుడల్లె వేగముక నింతులు తల్లడిల్ల
అల్లరి వలదని వల్లరి గిల్లుచు చల్లగ
హెచ్చరించ వల్లదె గయక హెక్టారది
మార దతడి తీరు వేగము మీరి మీరి
తట్టెనొక తట్టను పట్టెను పోలీసు జూసి
ఇసుకతోట వద్ద శకటమాపి వికట
మాడుచు నడిగె నెంత రుసుము
నెపమున కిచ్చెద రాయమన నెమ్మి
చూపి పోలీసు వద్దకొచ్చి చెమ్మగిల్లె
కాయము పరపర కోయు దొర
నాతల్లిని కాపాడిన దొర పోరా
ఆగక నెచ్చట నీ సతులు సుతులు
చల్లగుండ మెల్లగ పోరా వీరా
దామిని "మీనా, ఈరోజు నీ ముఖము ఎంత కళ కళ లాడు చున్నాదో చెప్పనలవి కాదు. నీ మనసు ఎంత గంతులు వేయుచున్నదో నీ ముఖమే చెప్పుచున్నది. హృదయాలిజిస్టు “పేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్" అని ఊరకనే అన్నారా మన పెద్దలు.” అనెను. “అట్లన్నది ఇంగిలీషువారు. వారు మన పెద్దలెట్లగుదురు?” అని మీనాక్షి అనగా, దామిని చొరుకొని “మీనాక్షి, నువ్వూరుకొనుము నీకు పుణ్యముండును ఇతగాడెప్పుడూ ఏదో ఒక కథతో సిద్ధముగా నుండును" హృదయాలజిస్ట్ "అయ్యో నన్ను చెప్పనివ్వకున్నారే" అనుచుండగా దామిని విరుచుకుపడి " అయ్యా ఇంగ్లీషువారే మన పెద్దలు " ఇంక బండి ముందుకి పోనిచ్చిన మంచిది " అనెను.
అటులనా అని ఐ వాంట్ టు సి ద స్కై అని హృదయాలిజిస్టు అనుటతోనే శకటపు పై కప్పు తెరుచుకొనెను. వెనక కూర్చొనియున్న దామిని, మీనాక్షి తుళ్ళి పడి, అబ్బుర పడి చూచుచుండిరి. ఎం జి హెక్టర్ సాంకేతిక పరిజ్ఞానము తొంబది మౌఖిక ఆజ్ఞలను స్వీకరించి అమలుపరచగలదు. లెఫ్ట్ విండో ఓపెన్ , రైట్ విండో క్లోజ్, ఆటో ఏ సి ఆన్ , రేడియో ఆన్ అని అల్లరి చేయుచుండెను. వాహనము ఆ ఆజ్ఞలను తూ.ఛతప్పక అమలు చేయుచుండెను.
చిన్నపిల్ల వాడివలె రేగుచున్న అతడిని చూచి మీనాక్షి నవ్వుచూ " ఎట్లు వేగుచున్నావమ్మా ఇతడితో " అని దామిని చెవులో చెప్పెను. హృదయాలజిస్ట్ అక్కసుతో వాహనము నిలిపివేసెను. దామిని " ఏమొచ్చెను ?" అనగా రాధాకృష్ణ "యంత్రమునకే మొచ్చెనో తెలియదు, ఆగిపోయినది ." అనెను. అప్పుడు మీనాక్షి " మీ ఇద్దరూ ఇద్దరే. మీరిట్లు వాదులాడుకొనుటకు కారణము మన పురాణములందు చెప్పబడినది. అనెను. అది చెప్పమని హృదయాలజిస్ట్ పట్టు బట్టగా " దామిని నెత్తిన చేతులేసుకుని " దొందు దొందే " అనుచుండగా “ అది చెప్పవలెనన్న బండి ముందుకు సాగవలెను " అని మీనాక్షి అనెను. బండి కదిలెను. " దామినికి ఆశ్చర్యము సిగ్గు కలిగెను" చూడమ్మా ఆయన చేయు పనులిట్లున్నవి" అనుచుండగా
మీనాక్షి " నేను దామిని కథ చెప్పు చున్నాను. దామిని శని దేవుని భార్య. శని గొప్ప శివభక్తుడు. అతడు సతతము చిత్తము శివునిపై నుంచి ధ్యానించు చుండెను. ఒక నాడు దామిని యముని కోరి పిలుచుచుండ అతడు పట్టించుకొనక శివ ధ్యానములో యుండెను. అంతట దామినికి ఆగ్రహము కలిగి తన భర్త వైపు ఎవ్వరూ చూడకుండు నట్లు శాపమిచ్చెను. అట్లు సువర లోకమందు భర్తతో గొడవ పడిన దామిని భూలోకమున విశాఖపట్టనమున ఇంకనూ వేడిగా భర్త ని ఆడిపోసుకొను చున్నది." అందరు నవ్వుకొనుచుండగా హెక్టార్ మువ్వ వాని పాళెమందు “రవళి ఆర్కెస్ట్రా” ముందు నిలిచెను. కారు దిగి వారా భవనమందు ప్రవేశించిరి. సంగీత ఉద్యానవనం వలే నున్న ఆ సువిశాల మహలు నందు పది మంది కళాకారులు వివిధ ప్రదేశములలో కూర్చొని సాధన జేయుచుండిరి. లోపలకి ప్రవేశించి నా మువ్వురిని కని అచ్చట మురళీ సాధన చేయుచున్న శ్యామల మురళినాపి వచ్చి "ఈరోజేమియూ కార్యక్రమము లేదే!” అనుచూ సోఫాలో కూర్చుండబెట్టెను. పిమ్మట మీనాక్షి "ఈరోజు ప్రఫుల్ల వచ్చుచున్నారు కదా వారిని కలుసుకొనుటకు వచ్చితిని. " అని చెప్పెను
శ్యామ: ఓహో! ఆ కేరళ మ్యూజిక్ బ్యాండ్ అధినేత ప్రఫుల్ల ఆ.. గుర్తుకు వచ్చెను, ఇప్పుడే వచ్చెదరు, వ్యాస్ గారు అతడిని తీసుకు వచ్చుచున్నారు. మావంటి పిన్న వయస్కులకి దుర్లభము కానీ మీవంటి ప్రౌఢ సంగీతకారులు తప్పక ఆ బ్యాండ్ నందుండవలయును.
ఒక మూల రిథమ్స్ మీటుచున్న సాంబ మీనాక్షిని గాంచి వద్దకు వచ్చి" బాగున్నారా ! అని తానూ ఒక సోఫాలో కూర్చొనెను.
మీనా: శ్యామ, సంగీతపరిణితికి ప్రౌఢ కళాకారులని పిల్ల కళాకారులని వ్యత్యాసము కూడదు సృజనాత్మకత కు ఆలంబన సాధన గానీ వయసు కాదు సుమీ !
సాంబ : ఆర్కెస్ట్రా యందు సృజనాత్మక అవాంచితము, అనుకరణే ఉచితము. చిత్రగీతములు యథా తథముగా అనుకరించకున్న మా తథాగతుఁడు ఒప్పునా! జనులు మెచ్చెదరా!
ఇంతలో ఉంగరముల జుట్టు, కోటేరువంటి ముక్కు, కోల ముఖముతో ఆరడుగుల వ్యక్తిని తోడ్కొని రవళి ఆర్కెస్ట్రా అధినేత లోకడుగిడెను. వారిని చూచి కళాకారులందరూ వారిని చుట్టిరి. వ్యాసుడు ప్రఫుల్లను మీనాక్షికి పరిచయము జేసెను తదుపరి ఒక్కొక్కరిని అతడికి పరిచయము చేయుచుండెను. ప్రఫుల్ల ను చూచినామెకు అగస్త్య గుర్తుకొచ్చెను. అతడికి మాత్రము మీనాక్షి అప్సరసవలె కనిపించెను.
ఉ. బంగరు చేలమే తొలగ బంగరు బంతుల భా సమే లదా
మంగళ క్షేత్రమే కనుల ముంగిట బంగరు కాంతులీ నగా
పొంగద నుల్లమే హొయలు మోహము గొల్పగ నోపత రమే
భంగము నొందరా వయసు వాసన కడ్డుగ నిల్వనే లనో
మీనాక్షి బంగారు వన్నె చీరయందు బంగారము వలే మెరయుచుండెను. ఆమె పైట తొలగి వెలువడు బంగారు బంతుల భాసము, చూచువారి కనులను ఏలుచున్నది. బంగరు కాంతులీను మంగళ వక్ష క్షేత్రమే కనుల ముంగిట నిల్వగా నుల్లము పొంగదా? హొయలు మోహము గొల్పగా నోప తరమే? అట్టి అందగత్తె వయసున అధికురాలైనచో భంగము నొందరా? (అయ్యో నావయసుదైనచో ఏట్లో ఒప్పించి పెండ్లిచేసుకొందునుకదా) వయసు వాసన ( కోరిక) కడ్డుగ నిల్వనేలనో!
అందరికీ కాఫీలు వచ్చినవి అందరూ ఎవరి స్థానములకు వారు పోయిన పిదప వ్యాసుడు , ప్రఫుల్ల మీనాక్షి వారి కున్న రంగస్థలం పై సమావేశమయ్యినారు .
ప్రఫుల్ల : వ్యాసుడు మీ సృజనాత్మకతను ఆకాశమునకెత్తు చుండ ఎట్లయిననూ మీ కచేరీ చూడవలెనని వరుసగా మీ ప్రదర్శనలు చూచితిని. మీరు చేసిన జింగిల్స్ సంగీతమును విని అబ్బురపడితిని. మీరు నిత్యమూ మనోరంజనమగు కొత్త బాణీలు రూపొందినురని విని ఇప్పటికీ నమ్మజాలకున్నాను.
వ్యాసుడు : మొన్న కూర్చిన కె ఎఫ్ సి జింగిల్ ఒక్కమారు వినిపించవలెను.
మీనాక్షి : అది పాతది , నిన్న కూర్చిన ఒక కొత్త జింగిల్ వినిపించెదను అని కీబోర్డుపై వేళ్ళు జింకల గుంపుల వలే పారించగా , గంగా ప్రవాహము వలే సంగీత ఘరితో ఆ గది అంతయూ నిండెను. ఆరోహణావరోహముల తో ఊయలలూగించుచూ క్రమేపి పతాక స్థాయికి తీసుకు పోయి ఉవ్వెత్తునెగసి తీరంపై విరుచుకు పడిన కెరటమువలె ఒక్క సారిగా క్రింద పడి గాజు జుతొట్టె నేలపడి పగిలి నట్టు ఆగగా అందరూ ఉద్విగ్నత తో కరతాళ ధ్వనులు చేసిరి.
తదుపరి ప్రఫుల్ల ఒక భుజముకు గిటారు , మరొక భుజముకు . ఆల్టో సాక్సాఫోను , మోకాటి జేబులో మురళి , మరొక చేత బరోకె ట్రంపెట్ నడుమున దోపిన జాజ్ స్టిక్స్ తో రంగముపై ప్రత్యక్షమయ్యెను.
షాన్త్ దు లినోస్ స్వరమును (1944 లో ఫ్రెంచ్ స్వరకర్త ఆండ్రే జోలివెట్ వేణువు మరియు పియానో కోసం స్వరకల్పన తరువాత దీనిని జీన్-పియెర్ రాంపాల్ వేణువు, వయోలిన్, సెల్లో కోసం లిప్యంతరీకరించాడు. అప్పటి నుండి ఈ అత్యంత సంక్లిష్ట స్వరము ఆధునిక వేణువుల కచేరీలకు అలంకారమైనది ) వేణు నాదమున వెల్లువవలె సాగించుచూ, పిదప సాక్సాఫోనుతో బి ఫ్లాట్ మేజర్ తో ప్రారంభించి ఆక్టేవ్ తొమ్మిదవ స్కెల్ డిగ్రీ ని అందుకొని అందు సరిగమ పదని పలికిం చి ఆపి, ఫిల్లీ జోన్స్ టోనీ విలియమ్స్ రో హైన్స్ లయతో దరువులు వేయునట్లు జాజ్ మ్రోగించెను అట్లు ఐదు ల వాద్యము నొక్క సారి వాయించి అందరిని ఆశ్చర్య పరిచెను. మీనాక్షి అతడి విద్వత్తును గ్రహించి రెండు చేతులు జోడించి మ్రొక్కెను.
వ్యాస్ మిగితా విషయములు మాట్లా డును అని చెప్పి అతడు బయటకు పోయి సిగరెట్టు పెదవులమధ్య పెట్టుకొనగా హృదయాలజిస్ట్ అప్పుడే తన సిగరెట్టు ను ముట్టించుకొని అదే అగ్గిపుల్లతో ప్రఫుల్ల సిగరెట్టును ముట్టించి " ఈ ఆర్కెస్ట్రా ను నడుపుచున్న గ్యాస్ నా మిత్రుడు మిత్రుడి మిత్రుడు మిత్రుడేకదా అందుచే మనమిద్దరమూ మిత్రులం " అని తన ధోరణిలో మాట్లాడసాగెను.
లోపల మీనాక్షి “విదేశములలో మ్యూజిక్ బ్యాండ్స్ ఎక్కువగా నగు పడును భారత దేశమున ఈ సంగీత బృందములు బహు తక్కువ , వేళ్ళ పై లెక్కింప వచ్చు, మన దేశమున సంగీతమునకు ఎందుకీ దురవస్థ ? “
భారతమంతయూ నొక్క రీతిగా నీతిమాలిన చలనచిత్రముల నీలి నీడలు కమ్ముకొనగా , కమ్మని సంగీతము పంజరమున చిక్కిన పక్షివలె గిలగిలా తనుకొనుచున్నది. సూపర్ స్టార్, మెగా స్టార్ అని బిరుదు లు తగిలించుకొని కథా నాయకులని చెప్పుకొను కళా ద్రోహులు నాటకమును పాడెపై పరుండబెట్టి శవయాత్ర చేయుచున్నారు. వీరికి అతుకుల నటనకి కోట్లేలయీయవలె నని ఒక్కడూ అడుగువాడు లేడు . వీరు ఉపాద్యాయులకంటే గొప్పవారా కారే ? వీరికి పదివేల నెలసరి జీతముపై ప్రభుత్వ కొలువిచ్చిన వీరెంతటి ఘనులో లోకమునకు తెలియవచ్చును.
ఈ గ్రూప్ లో చేరుట మంచిదా? ఇచ్చటన్నియూ సజావుగా సాగునా? బాగుండునా?
ఈ బ్యాండ్ గురించి విన్నచో మీరు ఇది ఎంత మంచి అవకాసమో గ్రహించగలరు.
చూచితిరి కదా పది కచేరీలు మాతో చేసినారు ఏదో డబ్బు ముట్టెనను మాటే గానీ మా ఆర్కెస్ట్రా లో మీ ప్రతిభ వెలవెల పోవుటయే తప్ప మీకొరుగునదేమియునూ లేదు. మ్యూజిక్ బ్యాండ్ నందు డబ్బు తో పాటుగా సృజనాత్మకతకు అవకాశముండును, మాతో యున్నచో ఈ అనుకరణ విద్య యందు బడి ఉన్న విద్వత్తు సర్వనాశనమగును. మీనాక్షికి తండ్రి గుర్తుకొచ్చెను .
ఇక డబ్బు విషయము కూడా చెప్పవలెను కదా. భారత దేశమున వేళ్ళ పై లెక్కింప గల మ్యూజిక్ బ్యాండ్ లలో అగ్రగణ్యమైన బ్యాండ్ ప్రఫుల్ల. వీరికి సాలుకు సుమారు ఇరువది ప్రదర్శనలుండును. ప్రదర్శనకు వీరు పది లక్షలు నుండి పాతిక లక్షలు దాకా వసూలు చేసెదరు. అన్ని ఖర్చులు తానే భరించి ఆ మొత్తమును ఐదుగురి సభ్యులకు పంచుట ఆనవాయితీ గా ఆ బ్యాండ్ ను నడుపు చున్న ప్రఫుల్ల ను చూసినారు కదా
మీనాక్షి: అతడి ప్రదర్శన యందు సృజనాత్మకత , సృజనాత్మకత యందు కళాతృష్ణ కనిపించెను. అని ఒప్పందంపై సంతకమును చేయగా ఐదు లక్షల చెక్కును అందజేసెను.
వ్యాసుడు: వీరికి బెంగుళూరునందు కార్యక్రమములు తరుచుగా నుండును , కావునా మీరు బెంగుళూరు నందు ఉండవలెను , మీ విమాన టికెట్లు రెండు రోజులలో నేను హృదయాలజిస్ట్ కు అందజేసెదను. గ్యాస్ గ్యాస్ అయినదా మీ పని , మేము ఉక్కు క్లబ్ నందు కార్యక్రమమునకు పోవలెను అనుచూ వ్యాస్ నోటిలో అప్పుడే వెలిగించిన సిగరెట్టును లాగివేసి " నీకు పొగ త్రాగరాదని చెప్పినన్ను కదా నాముందే సిగరెట్టూ కాల్చెదవా ' యని పరిగెత్తుచుండగా వ్యాస్ వెంట పడెను. అడ్డు వచ్చిన పని వాడి చేతిలో బూజులు దులుపు కర్ర ను లాక్కొని మేడపైకి పోయి అచ్చట సిగరెట్టును పారవేసి క్రిందకు వచ్చెను.
దామిని : ఛీ ఛీ చిన్న పిల్ల వానివలె ఎట్లు పరిగెడుచున్నాడో చూడుము
మీనాక్షి " ఇంకా పిల్లలులేరని అనుట ఎందులకు మీ శోభనమేట్లు జరిగేనో ?
దామిని వెంటనే కొంగును లాగి కప్పుకొని "ఏమిటా పాడు ప్రశ్న ?"
మీనాక్షి: నీవు పైట ఎందుకు కప్పుకొన్నావు , ఎదో జరిగి ఉండును , ఇంత చిలిపి మనిషి మొదటి రాతి ఏమి చేసెనో?
దామిని : రాత్రి పరుగులు తీయలేదు పగలు సిగ్గు తీసెను , నాకంటే ముందు నిద్ర లేచి నా చీర నెత్తుకు పోయెను. నేను బయటకు రాలేక గదిలోనే ఉండిపోగా మా అత్తగారు కంగారు పది తలుపు బాడుచుండగా , దుప్పటి చుట్టుకుని ఆమెకు విషయమును చెప్పగా ఆమె చీర ఇచ్చెను.
మీనాక్షికి నవ్వాగలేదు . ముగ్గురు బయటకు వచ్చుచుండగా ప్రఫుల్ల చేయి వూపుచుండెను " పుల్ల , ఆరోగ్యము జాగ్ర త్తగా చూసుకొనుము" అని చెప్పి వాహనమును తెచ్చి నిలిపేను. దామిని మీనాక్షిలు వెనక కూచోన్నాగా వాహనము ఉక్కు క్లబ్ ను చేరెను.
పది కిలో మీటర్లు విస్తీర్ణము గల వి ఎస్ పి టి ( స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ ) నందు ఐదవ సెక్టారు ఉక్కు క్లబ్ నందు వర్షునకు ఘన సన్మానము జరిగెను. మంజూష , మాలిని , రంజని, కేశవుడు, భానోజీరావుగారు , కళాకారుల బృందం , భారతవర్ష పనిచేయు మజ్దూర్ సంఘము , కళాభిమానులు ఇంకనూ పత్రకారులు, దృశ్యమాధ్యమ వార్తా ప్రతినిధులు , హాజరు అయ్యిరి 600 మంది కూర్చొనుటకు( సిట్టింగ్ కెపాసిటీ ) 900 మంది నిలబడి యుండుటకు ( ఫ్లోటింగ్ కెపాసిటీ ) వసతిగల క్లబ్ మండపము పూర్తిగా నిండిపోయి నందిని ఉన్ననూ ఎవరికీ కాన రాలేదు. కార్యక్రమము మొత్తము వార్త దృశ్య ప్రసారము గావించబడెను. కర్మాగారం ఆరుగురు డైరెక్టర్లలో ఒక్కరైన పట్నాయక్ గారు కాలభై మాని డాక్టర్ భానోజీరావు మిత్రులు.
" ఒక పండిత వరేణ్యుడు , సాహితీవేత్త , శతావధాని రాష్ట్ర ప్రజలు మెచ్చిన శ్రీకృష్ణ పాత్రధారి ఇచ్చట ఈ ఉక్కు కర్మాగారమందు శారీరక శ్రమ చేయుచున్నడిని తెల్సి తల్లడిల్లినాను. ఈ సన్మానము చేయుట మన అందరి అదృష్టము. భారతవర్షని డైరక్టర్ కి సలహాదారుగా నియమించుచున్నాను" అని అతడి అంగీకారమును కోరెను. వర్ష మాట్లాడుచూ " డైరక్టరుగారి కళాభిమానానికి , భాషాభి మానానికి వందనములు , సహృదయముతో వారిచ్చిన పదవికి కృతఙ్ఞతలు కానీ ఈ కర్మాగారమందు సలహాదారులు గా సాంకేతిక నిపుణులను నియమించుకొనుట నేనెరుగుదును భాషావేత్త ఒక్క రవ్వయిననూ ఉపయోగములేదు నాకు సహాయపడవలెనన్న వారి మంచి బుద్ధి , ఔదార్యమునకు కృతఙ్ఞతలు కానీ ఆపదవి నేను చేపట్టజాలను, అని సున్నితముగా తిరస్కరించెను. పిదప కళాకారులందరికి సన్మానమును జరిగినవి. సత్య భామ పాత్రధారి వేదికపైకి పోగా పలువురు హర్షధ్వనులు చేసిరి. రంజని కి కేశవునకు కూడా సన్మానము జరిగెను. వర్షుడు కూడా కేశవునకు ఒక శాలువా కప్పెను. చివరిగా పట్నాయక్ గారు భారతవర్షకు ఒక లక్షరూపాయలు బహుమతి గానివ్వగా వర్షుడా పైకమును మజ్దూర్ సంఘమునకు కానుకగానిచ్చెను. సభ ముగిసెను.
ఆహ్లాదంగా ఉన్నది ఈ భాగము.
ReplyDeleteచక్కగా పరుగులు పెట్టించారు. చదువరులను
కడు రమ్యముగా సాగుచున్నది గ్రంథం మరల మరల చదవాలని అనిపించేలా హాయిగా ఉన్నది.
అభినందనలు
ఈ దృశ్యము చదువుతున్నట్టు గా లేదు.చూస్తున్నట్టుగా ఉంది.🙏మీ శ్రమ కనపడుతుంది.
ReplyDeleteమీరు చదివి ఆనందిస్తే నా శ్రమ ఫలించి నట్టే. వాద్య పరికరాల వైభవము , వాయుయానాల వైనము , పునర్జన్మ బంధము, సంస్కృత కావ్యాల అందము , తెలుగు పద్యాల ఛందము కలబోసిన ఈ కావ్యము నాకు జ్ఞాన చక్షువులను ఇచ్చింది. మీరు నాకు స్ఫూర్తిని ఇస్తున్నారు.
ReplyDelete