Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, December 29, 2020

Bharatavarsha -103

న్యూ ఢిల్లీ కొనాట్  ప్లేస్ : ఢిల్లీ వాసులందరికీ సుపరిచితమగు కొనాట్ ప్లేస్ ఆ పేరు ఎట్లు వచ్చెనో  బహుకొద్దిమందికి మాత్రమే తెలియును. భారత దేశ ప్రధాన ఆర్థిక, వాణిజ్య మరియు వ్యాపార కేంద్రాలలో ఒక టైన ఈ ప్రదేశము న్యూ ఢిల్లీ నడిబొడ్డున అనేక ప్రసిద్ధ భారతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలకాలవాలమై  సిపిగా సంక్షిప్తీకరించబడిది. సిపి ఒక ప్రధాన షాపింగ్, విలాస (నైట్ లైఫ్) మరియు పర్యాటక కేంద్రం. భారత రాజధాని భవనములు వైస్రాయ్ హౌస్ , సెకెటేరియట్ ,పార్లమెంట్ వంటివి కొనాట్ ప్లేస్ (సిపి) చుట్టూ కేంద్రీకృతమై ఉన్నవి. స్వాతంత్రమునకు పూర్వము 1921 లో భారతదేశాన్ని సందర్శించిన  ఐదవ కింగ్ జార్జ్   యొక్క మామ అయిన డ్యూక్ ఆఫ్ కొనాట్ పేరు దీనికి పెట్టిరి. ప్రపంచములో తొమ్మిదవ స్థానములో నున్న అతి ఖరీదైన భవనములు గల ప్రదేశమిదియే. 

అత్యంత ఆహ్లాదముగానుండు ఈ ఉద్యానవనమునందు రెండువందల ఏడు అడుగుల ఎత్తుగల త్రివర్ణపతాకము మేఘ మండలమును ముద్దాడుచుండును. అదే ఉద్యానవనమున వర్తులాకార సోపానములతో నిర్మించిన రంగ భూమి, ఆ పక్కనే నీటిని ఎగజిమ్ము జల యంత్ర ము, నీటి కొలను , ఆ కొలను పక్కన సొరంగమార మొకటి భూగృహ రైలు(మెట్రో) మార్గమునకు దారితీయుచూ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ కు కొనిపోవును. ఢిల్లీ నడిబొడ్డున గల అతిపెద్ద మెట్రో స్టేషన్ ఆ ఉద్యానవనముక్రింద దాగియుండెను అన్నవిషయము ఆశ్చర్యము కలిగించుచుండును.ఆ ఉద్యానవనమున అచ్చటనే పచ్చిక నందు పొదల మాటున అచ్చిక బుచ్చిక లాడు జంటలు చూడ కనులు చెదురు చుండును.  

తిరిగి తిరిగి అలసి సొలసి ఆ ఉద్యానవన పచ్చిక నందు  సేద తీరు జంటలలో  కేశవుడు రంజని కూడా ఉండిరి. రంజిని " నాడు ఈ వర్షుడు దొడ్డమనిషి అని చెప్పినావు ?" " నేడునూ అదియే చెప్పుచున్నాను , మాగురువుగారు మహా దొడ్డ మనిషి ." " బాగు బాగు పిల్లికి  సాక్ష్య మన్నట్టు న్నది , అవ్వ విదిషతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుచున్నాడు , కుతుబ్ మినారు , పాలికా బజారు చాందిని చౌక్  ఎచ్చట చూచిననూ నువ్వు గింజలవలె వీరే కనిపించిరి." " హహ్హ హ్హ హ్హ  ఏమి  చెప్పుచున్నావు  నీవు నూ అదేపని చేయుచున్నావు కదా" అని కేశవుడు  అనగా రంజిని " మన సంగతి వేరు , మనము వారివలె ఒకరిపై ఒకరు పడి  తిరుగుచున్నామా?"  కేశవుడు నవ్వుచూ తలతిప్పి, వర్షుడు విదిష  ఒకరి కొకరు తాకుచూ  పక్కనే ఉన్న ఒక పొదల మట్టున కూర్చొని యుండుట  చూచి  గుండె మందగించి ఊపిరి నిలిచి నిలువు గుడ్లు పడెను."   

 అట్లే స్తంభించిన కేశవుని చెంతకు తీసుకొని తన వొడిలో పడుకొనమని చెవిలో గుసగుసలాడెను." కేశవుడు " ఇది బహిరంగ ప్రదేశము అట్లు చేసిన ..." అను చుండగా

చుట్టూ చూడుము ఎన్ని రంగు రంగుల జంటలు అట్లు పడుకొని యున్నవో , చీకటి పడుచున్నది కదా భయము వీడుము" అని ప్రోత్సహించెను. వలదు వలదు చుట్టూ చూడవలదు అట్లు చూచిన మనకి ఇబ్బంది కలగవచ్చు " అని కేశవుడు అనుచుండగా రంజిని పక్కనే ఉన్న విదిష జంటను చూడనే చూచెను. పద ఇచ్చటినుండి పోవలెను అని చటుక్కున లేచి కేశవుని తల్లి  పిల్లి తన కూనను నోటకరుచుకు పోయినట్టు కేశవుని కొనిపోయెను. “అయ్యో! చిన్న కోరిక తీర్చలేక పోతిని అని కేశవుడను చుండగావారిరువురు క్రింద చూచుకొనక పచ్చిక పై కూర్చొన్న, కాలికడ్డుపడ్డ ఒక జంటను , తన్నుకొని వారిపై పడిరి.  పొరపాటుజరిగినది ఏమీ అనుకొనవలదని రంజని చెప్పుచుండగా కేశవుడు వా రిని దామిని - రాకి జంటగా గుర్తించి సిగ్గుపడి రంజిని చేతినందుకొని పరుగువంటి నడకతో అచ్చటనుంచి జారుకుని రంగప్రదేశమున జరుగు సంగీత కచేరీ వినుటకు వచ్చిన శ్రోతలమధ్య సోపానములపై కూర్చొనిరి. 

 ఒకామె కొనుగోలు చేసిన వస్త్రముల సంచులను పక్కన పెట్టుకొని కూర్చొని  మరొకామెతో మాట్లాడు చుండెను.  కేశవునకు అది చూసి వొళ్ళు మండెను. కేశవుడు ఆ మహిళతో " ఏవమ్మా ఇచ్చట స్థలము కొరతగానుండగా , మహారాణివలే వస్తువులన్నీ పరిచి కూర్చొంటివే ? కొంచమే జరగరాదు " అని నిష్టూరమాడెను. ఆమె మొఖం త్రిప్పి చూడగా కేశవునకు పై ప్రాణములు పైకి పోయి గొంతు తడారెను. ఆ తల త్రిప్పి చూచిన  మహిళ మాలిని గారు , ఆప్రక్కనఉన్నది అరుణతారగారు. కేశవుడు ఏమియునూ చెప్పలేక తత్తరపడుచుండగా రంజిని  దూరములో సోపానములపై కూర్చొన్న విదిష వర్షుని గాంచి ఆవిషయమును మాలిని గారి కెఱింగించెను.కొలది నిమిషములపిదప అందరూ  కారులో నార్త్ ఎవెన్యూ అరుణతార నివాసము చేరిరి. 

అందరి కంటే ముందు  దిగి వర్షుడు చకచకా మేడపైకి పోయినాడు. విదిష మెల్లగా పిల్లివలె వర్షుని అనుసరించుచుండగా , మాలినిగారు ప్రవేశించి " విదిషా ఇటురామ్మా , అని పిలచి  ప్రదేశములు తిరిగినారా, వర్షునితో ఢిల్లీ  ఎట్లున్నది? అని ప్రేమగా అడుగుచుండగా విదిష కళ్ళు  చెమర్చెను. జీవితంలో ఇరువురూ ఎన్నోకష్టములు పడి స్వర్ణకాలమందడుగిడిరి , ఇప్పుడు కన్నీళ్ళెందుకమ్మా అని కోడలిని అక్కున జేర్చుకొనెను. " నాజీవితము నందు  అమృతతుల్యమగు క్షణములు ఇవి ఆనందబాష్పములు. దక్కవనుకొన్న అవకాశములు "  " వేచి చూచిన అందరి కలలూ పండునమ్మా , మా కనుల వెలుగు , కలలు మీరే అని చెప్పుచూ అప్పుడే ప్రవేశించిన అరుణతారను చూచి  " అరుణా నీ కూతురికి గట్టిగా చెప్పుట నీకు చేతకాకున్న పరిస్థితి ఇంకనూ శృతి మించును " అని మాలిని అను చుండగా అరుణ తార " మగవాడి బుద్ది ఏమాయెను? నాకూతురు అమాయకురాలు , ముందు నీకొడుకు సంగతి  చూడవలెను " అని తార మీద మీదకి పోవుచుండగా విదిష " అమ్మా , ఆయన తప్పులేదు , నేను కోరగా  .." అని విదిష అరుణను బ్రతిమాలెను. " నీకేమీ తెలియదు తల్లి నిన్నుఅల్లుడు నిన్ను  మాయచేసి కొని పోయెను " అని మేడపైకి పోయెను.

"ఇంకనూ కొద్దిసేపటిలో అమెరికాపోవు విమానము కలదని తెలిసి ఇట్లు చేయుచున్నావా? , పిల్లను అట్లు తిప్పుట మంచిపనా ?" అని అడుగు చుండగా విదిష తారవెనుక నిలబడి వర్షుని వైపే చూచుచూ సైగలు చేయుచుండెను." నావైపు చూచి మాట్లాడక పిల్లమొఖంలోకి చూచెదవేమి అని గద్దించెను"  నా పాస్  పోర్ట్ కనిపించుటలేదు అని వర్షుడు అంతయూ వెతుకు  చుండగా  అరుణతార ముసిముసినవ్వులు నవ్వుచూ మేడమెట్లు దిగి క్రిందకు వచ్చెను. పిదప విదిషా నీవచ్చటమి చేయుచున్నావు ?" అని కేక వేసెను . " ఆయనకు సహాయము చేయుచున్నాను ." అని సమాధానము వచ్చెను . అప్పుడు తార మాలిని వైపు చూచి " అట్లున్నదమ్మ నీ కొడుకు వ్యవహారము , ఎంత గడుగ్గాయిని కంటివమ్మా " అని యెద్దేవాచేసెను. 

  పిదప సోఫాలో కూర్చొన్న కేశవుని  “రంజినితో నీ స్నేహము మీరు చున్నది. కానీ నేను మీ మాట మీరు వాడను కాను  అందుకే  అడుగుచుంటిని  సుందరిని నీకు అనుకొనుచున్నాము. నేను తులశమ్మగారికి మాట ఇచ్చితిని. మీమాట నిలపమని కోరినచో నా ప్రాణమంతయూ నిత్తును. నాలో అర్ధ భాగము రంజినిను కోల్పోవుటకు సిద్ధముగానున్నాను. మరి అందులకు ఆమె ఒప్పుకొనునా? అరుణమ్మ వద్దన్నచో ఒప్పించు భాద్యత నీదే అని రంజనితో  మొదటే చెప్పినాను. తార రంజిని వైపు చూసెను.    మాలిని రంజిని వైపు ఉత్కంఠ తో చూచుచుండెను. మెడపైనుండి విదిష వర్షలు కూడా వచ్చి మాలినిగారి ప్రక్కన నిలిచిరి. 

మీరు  సుందరిని ఇచ్చి చేయుటకు నిశ్చయించిన నేను ఆక్షేపించు దానను అడ్డు కొను దానను కాను. కేశవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించుచున్నాడో , నేను కేశవుని అంతే  ప్రేమించుచున్నాను. మీరు కోరిన కేశవుడు కాదనడు అట్లే కేశవుడు కోరినచో  నేను కాదనను. అని రంజిని విషణ్ణ వదనమున తెలిపి మా ప్రేమ నీతి  మాలినదని అనుకొనవలదని,  గుడ్ల నీరు క్రక్కుకొనుచుండగా మాలిని తారవైపు చూచుచూ నిలిచెను. కొంత సేపు నిశ్శబ్దము రాజ్యమేలెను. ఆ నిశ్శబ్దమును చీల్చుచూ " మీ  ఆత్మ నిగ్రహము గొప్పది , మీ పరస్పర ప్రేమానురాగము లిట్లే కలకాలమూ  నిలువవలెను."      అనుచుండగా కేశవు డు  అరుణ కాళ్లపైపడెను , రంజిని  అతడిని అనుసరించెను. అరుణ ఇరువురిని లేవనెత్తి చేరువైపులా వారిని పొదివి పట్టు కొనెను. భర్త తో విడి వంటిరి జీవితమును గడుపుచున్న నీకు,  అవివాహితుడైన కేశవునకు కుదిరినచో, ఇందులో మోసము అవినీతి లేదు.  ఇది నీతిమాలిన పని ఎట్లగును ?

మరి సుందరి సంగతి ఏమి చేయవలెను? అని మాలిని గారు అడుగగా " సుందరితో నిన్ననే మాటలాడితిని, ఆమె కేశవుని చేసుకొనుటకు నిరాకరించెను. అందరూ కలసి అల్పాహారమును భుజించిన పిదప వర్షునకు  వీడ్కోలు  పలుకుటకు ఇందిరాగాంధీ విమానాశ్రయము పోయిరి.   పిదప వారు విశాఖపట్నమునకు, రంజిని కేశవులు హైదరాబాదునకు  ఎగిరిపోయిరి 

2 comments:

  1. వర్షుడు లక్ష్యాన్ని సాధించుట యే కాక ప్రేమలోనూ విజయం సాధించెను.వేచి చూచిన అందరి కలలు పండును అన్నది జీవిత సత్యం.ఇక బసవడి ప్రేమ విజయాన్ని చూడాలి.

    ReplyDelete