Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, December 29, 2020

Bharatavarsha 102

బెంగళూరు:  ఎలక్ట్రానిక్స్ సిటీ. రాఘవ ఎలెక్ట్రానిక్స్ ప్రయివేట్ లిమిటెడ్ కళకళ లాడుచుండెను.

సందీపుడు వాహనం దిగి గిడ్డంగి తనిఖీ నిర్వహించి కార్యాలయము లోనకు ప్రవేశించెను.

రాఘవుని గదిలో యమున రాఘవులు కంప్యూటర్లో  సంస్థ  వెబ్సైట్ ని పరిశీలించుచున్నారు.

రాఘవ: చెన్నపట్నము నుండి విమానము ఇప్పుడేమి కలదు? ఏ విమానమునకు వచ్చినావు? పేటెంట్ కార్యాలయమందు పని పూర్తి అయినదా?

సందీపుడు: విమాన మెందులకు రైలులో వచ్చినాను?

యమున: రైలులో వచ్చినా వా! ఒక ప్రతిష్టాత్మక  సంస్థ డైరెక్టర్ వని  మరచినావా?

సందీపుడు: అద్దె భవనములో నున్న చిన్నస్థాయి పరిశ్రమ అని మరువకుంటిని.

యమున: అట్లయిన స్థానిక పేటెంట్ కార్యాలయమునకు పోయిన బాగుండెడిది, పేటెంట్  కొరకు చెన్నపట్నము దాకా పోవుటెందులకో?

సందీపుడు: భారతదేశంలో చెన్నై, ముంబై, ఢిల్లీ  మరియు కోల్కతా నందు మాత్రమే పేటెంట్ కార్యాలయాలు కలవు. బెంగుళూరునందు పేటెంట్ కార్యాలయము ఇంకనూ పెట్టలేదు.

రాఘవ: యమున మాటలు పట్టించుకొనవలదు వచ్చిన  రోజులలో సంస్థ నందు  చాలా మార్పులు తెచ్చినావు.

సందీపుడు: నేను ములిగినచో పూర్తిగా ములిగెదను యమున వలె సగము ములుగువాడను కాను. పక్కింటామె వద్ద  కార్యదర్శి , ఇచ్చట అర్ధ డైరెక్టరు. యమున మొఖమొఱ్ఱ బారెను.

యమున: ఇంతకీ పేటెంట్ లభించెనా? నగర సందర్శనము చేసి వచ్చినావా ? 

సందీపుడు: పేటెంట్ కార్యాలయమునందు పని పూర్తి అయినది. పేటెంట్ వచ్చుటకు పట్టు  కనీస కాలము నాలుగు సంవత్సరములు. మనకు లభించినది దరఖాస్తు సంఖ్య మాత్రమే. సంస్థ వెబ్సైట్ చూచుచున్నారు కదా ఎట్లున్నది ?

యమున: రాఘవ ఎలక్ట్రానిక్స్  వెబ్సైట్ అద్భుతముగానున్నది,  సంస్థ చిత్రములు, ఉత్పత్తులు,  డైరెక్టర్లు , సంప్రదించ వలసిన చిరునామా అన్నియూ చక్కగా పొందు పరచబడి సంస్థ ప్రతిష్ట ఇనుమడించునట్లు వెబ్సైట్ ఎంతో ఘనముగా యున్నది.

రాఘవ: అదియునూ సందీపుడే చేయించెను. యమున మూతి మూడు వంకరలు తిప్పెను.

రాఘవ: కొద్దీ రోజులలోనే మంచి మిత్రులైన మీ ఇరువురిని చూచుచున్న నాకు ఈసు కలుగుచున్నది. పేటెంట్ పొందుటకు ఎంత ఖర్చు అయినది?

సందీపుడు: ఖర్చు స్వల్పమే ఎనిమిది వేలు. ఉత్పత్తి ప్రక్కన పేటెంట్ (దరఖాస్తు) సంఖ్యను పొందుపరచినచో సంస్థ పై నమ్మకము పెరుగును.

ఇంతలో తలుపు  తట్టి  ఒకామె వచ్చి మార్కెటింగ్ మేనేజర్ ఇంటర్వ్యూ కొరకు పది మంది అభ్యర్థులు వచ్చినారు. అని తెలపగా సందీపుడు “యమునా నీవు ఇంటర్వ్యూ నిర్వహించుము, ఒక గంటలో ముగించిన మనకు నిపుణులతో సమావేశము కలదు. అని యమునను పంపెను.

రాఘవ: పేటెంట్ (దరఖాస్తు) సంఖ్యను వెబ్సైటు నందు పొందుపరచినాను. అన్నట్టు చెప్పుట మరచితిని నీ కాబోవు అర్ధాంగి ఫోనుచేసెను. మరల చేసెదనని చెప్పినది.

సందీపుడు: నవ్వి ఆ యమున ఉన్నప్పుడు ఈ మాట చెప్పినచో నన్ను ఆట పట్టించెడిది. ఇరువురూ నవ్వు కొనుచుండగా ఫోను మ్రోగినది.

మంజూష : మా అమ్మ విశాఖపట్నము వచ్చుటకు ఇంకనూ రెండు రోజులే సమయము కలదు.   రాఘవుడు విష యము అర్థమయ్యి  బైటకు వెడలుచుండగా సందీపుడు వలదని వారించి మంజూషతో వచ్చుటకు వీలుపడదని సంభాషణను ముగించెను.

సందీపుడు: మన సంస్థ నందు  మధ్య స్థాయి, పైస్థాయి వారందరూ, ఈ సమావేశమునకు హాజరు కావలెను. వారి పేర్లు వివరములు నీవద్ద ఉన్నావా ?

రాఘవ: పుస్తకము చూచి చెప్పవలెను , పుస్తకము తెప్పించమందువా ?

సందీపుడు: అవసరము లేదు మధ్య , ఉన్నత  స్థాయి సిబ్బంది కలిపి 59 మంది కలరు అందు ఉన్నత స్థాయి వారు 21 మంది ఈ సమావేశమునకు హాజరు కావలెను , మధ్య స్థాయి వారితో రేపు సమావేశము జరుపవలెను.

రాఘవ , సందీప యమునలు కొత్తగా చేరిన మార్కెటింగ్ మేనేజర్ మరియు ఇరువది యొక్క మంది ఉన్నత స్థాయి సిబ్బంది, మొత్తము25మంది, తో సమావేశము మొదలయ్యెను. 

సందీపుడు : రాఘవ ఎలక్ట్రానిక్స్ ఎదుగుదల స్థంబింబించిన సంస్థ అన్నచో మీరు కలవర  పడుదురెమో! ఎదుగుదల నిలచిన సంస్థ  మనుగడ కోల్పోవుటకు  ఎంత కాలము పట్టును? గుట్టలుగా పడియున్న పీ సి బీ, స్పీకర్స్, హెడ్ ఫోన్స్  సరుకు నిల్వలు పరిశీలించగామనము డిమాండ్ తో సంబంధము లేని ఉత్పత్తి చేయుచ్చున్నాము. తెలియుచున్నది

ఇన్వెంటరీ మేనేజర్: మార్కెటింగ్ మేనేజర్ కావలెనని ఎప్పటి నుండో అనుకొనుచున్నాము   డైరెక్టరు (రాఘవ) గారు ఎందుకో మార్కెటింగ్ మేనేజర్  అవసరమును పట్టించుకొనలేదు.

సరఫరా మేనేజర్: ఇన్వెంటరీ  మేనేజర్ గారు ఇన్వెంటరీ పేరుకొనుట గమనించుచున్నారుకదా మీరు ఉత్పత్తి తగ్గించమని ఎందుకు చెప్ప కున్నారు?

ఇన్వెంటరీ మేనేజర్ : సరఫరా మేనేజర్ గారు, అది నాపని కాదు డిమాండ్ ను బట్టి ఉత్పత్తి  చేసి నిలవ చేసు కొందురు. ఆ డిమాండ్ లెక్కించుట నా పని కాదు. సరఫరా మేనేజర్ గా నిన్ను అమ్మకాల గూర్చి ప్రశ్నించిన ఎట్లుండును ?

సరఫరా మేనేజర్: నాపని వచ్చిన ఆర్డర్లు సరఫరా చేయుట. అమ్మకాలు నాపని ఎట్లగును?

ఇది పరస్పర నిందారోపణములు చేసుకోను సమావేశము కాదు ఇప్పుడు మార్కెటింగ్ మేనేజర్ గారు వచ్చినారు నేటి నుండి వారు అమ్మకాలు పెంచుటకు కృషి చేసెదరు. 

 యమునా మార్కెటింగ్ మేనేజర్ ఆచారి గారిని అందరికీ పరిచయము చేసెను. అందరూ ఆయన అనుభవమును విని కరతాళ ధ్వనులు చేసిరి.      

 

మన సంస్థ వార్షిక అమ్మకాలు ప్రస్తుతకు రెండు కోట్లు , రాబోవు రెండు సంవత్సరములలో 5 కోట్లు అమ్మకాలు సాధించుట మన లక్ష్యము అందుకేమి చేయవలెను అన్నదే నేటి చర్చ.

నిపుణులు, వివిధ శాఖలవారు పాల్గొనుటచే చర్చలు సుదీర్ఘ  మగుచుండెను, సమయము 4 గంటలు అయినది.తినుటకు బూందీ త్రాగుటకు తేనీరు  సరఫరా చేయబడినవి సమావేశ మందిరమంతయూ మాటలు నవ్వులతో కొలది సమయము గడిచెను.  కొలది విరామము తరువాత నిపుణుల యందు పెద్ద యగు నారాయణ: సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు చేసి స్పీకర్స్ కి బ్లూటూత్ అమర్చుట మంచిదని సూచించగా రాఘవుడు అంగీకరించెను. 

సందీపుడు అందుకగు ఖర్చు వినియోగ దారునిపై భారమును పెంచునని ధర పెరిగిన యెడల వినియోగ దారులు  బోస్ , జె బి ఎల్ వంటి స్పీకర్స్ కొనుటకుమొగ్గు చూపినచో సంస్థ నష్టములు మరింత పెరుగునని  వలదనెను

ఇట్లు చర్చలు సాగు చుండగా గడియారం 6 గంటలు చూపుచుండెను. సమావేశమునకు వచ్చిన వారు తమకు తోచిన  అభిప్రాయములు మరింత చెప్పుచున్నారు

వినియోగదారుల అభిరుచులు మరియు ప్రాధాన్యతలు కూడా ఎప్పటికప్పుడు మారుచుండుటచే ఎలక్ట్రానిక్  ఉత్పత్తి దార్లు సేవాదార్లు  కొత్త ఉత్పత్తు లకు రూపకల్పన చేయవలెను . 

కస్టమర్ అభిరుచులు మారినట్లే, డిమాండ్లో కూడా అనిశ్చితి ఉండును.  డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి నుంచుటకు సమర్థవంతమైన పరిశీలన అవసరము

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ తయారీ సేవా పరిశ్రమలో చాలా పోటీ ఉన్నది. వ్యాపారం కొరకు  ధరలను ఎల్లప్పుడూ తక్కువగా ఉంచాలి.  ధరల యుద్ధం  చాలా సంస్థలకు తట్టుకోలేని  నష్టాన్ని కలిగించుచున్నది. 


ప్రతి ఒక్కరూ ఈ రోజు నాణ్యతనాశించుచున్నారు. నాణ్యతపై ఎక్కువ దృష్టి  నిలపవలెను. ఉత్పత్తులు మరియు సేవల నాణ్యతకు హామీ ఇవ్వ వలెను.

త్వరలో  సిసిటివి  మార్కెట్ 20,000 కోట్లకు చేరుకుంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. సిసిటివి కెమెరాలను ఉత్పత్తి చేయవలెను 

మొబైల్ ఫోన్ చరవాణిని  ఉంగరము మాదిరిగా వేలికి  ధరించుట  కొత్త పంథా కానున్నది. మల్టిఫంక్షనల్ స్మార్ట్ రింగ్ గా వీటిని వ్యవహరించుచున్నారు జాక్కామ్ R3  స్మార్ట్ రింగ్  జనాదరణను పొందినది కావునా మనము స్మార్ట్ రింగ్ ల ను ఉత్పత్తి చేయవలెను   

సందీపుడు  శ్రోతగా మారెను. యమున రాఘవులు ముగించమని సాందీపుని వైపు చూచుచుండిరి ఇంతలో ఫోను మ్రోగెను. మంజూష : సమావేశము ముగిసెనా ! నన్ను పట్టించుకొనుట మానివేసినావా , లేక నను పూర్తిగా మరి చినావా ?

 సందీపుడు: సమావేశము ఇంకనూ కొనసాగుచున్నది. తరువాత మాట్లాడుకొన వచ్చును అని సంభాషణ నిలిపి వేసెను. సమావేశము ముగిసి అందరూ వెడలిన పిదప సమావేశ మందిరమున రాఘవ, సందీప యమునలు మాత్రము మిగిలిరి.

రాఘవ: అందరమూ అలసిపోయినాము. నేటి  సమావేశము  చారిత్రాత్మకము. చాలా విషయములు వెలుగులోకి వచ్చుటయే కాక సంస్థ భవిష్యత్తుకు మార్గదర్శకముగా నుండును.    

యమున: మార్కెటింగ్ మేనేజర్ గారిపై నాకు నమ్మకము కలిగినది , అపారమైన అనభవం కలిగినవారు, నిపుణులు సలహా పాటించినచో  రాఘవ ఎలక్ట్రానిక్స్  తప్పక వృద్ధిలోకి వచ్చును. 

 

సందీపుడు:  మార్కెటింగ్ మేనేజర్ అనుభవజ్ఞులే  అయిననూ  సెల్లింగ్  ఈజ్ నాట్ టెల్లింగ్. ఆయన పనితనము  చూపి నిరూపించుకొనవలెనుకదా. ఎంత తక్కువ లాభమునకైనా పాత సరుకు అమ్మివేయ వలెను. కొత్త అన్వేషణలు ప్రారంభించుటకు మనవద్ద నిధులెచ్చటున్నవి?  సి సి కెమెరాలు  ఉత్పత్తి చేయవలెనన్న మన సంస్థకున్న నిధులు సరిపడునా?  సెల్ఫోన్స్  ఉత్పత్తి చేయవలెనన్న అంబానీ వంటి వారు సిద్ధముగా లేరు అందుచేతనే వారు నెట్వర్క్ సేవలు అందించుచున్నారు. మనము కలలు కనుట మానవలెను.  

రాఘవ: అదియునూ నిజమే, నీవు వచ్చిన తరువాత 10 మందిని కొత్తగా సంస్థ లోకి  తీసుకొనినాము. ఒక్క వారములో సంస్థ అభివృద్ధి పనులకు నాలుగు లక్షలు ఖర్చు అయ్యెను. మీనాక్షి 50 లక్షలు ఇచ్చుటచే పరిస్థితి మెరుగానే యున్నది. 

యమున:  విశేష ప్రతిభావంతురాలు, నీకంటే పెద్దామెను ఇట్లు మీనాక్షి అని ఏకవచనమున సంభోదిం తువా? “త్వరలో ఆ అందాలరాశి చేతిని అందుకొందును , ఇంకనూ ఆమెను మీనాక్షిగారు అని పిలవవలెనా, అట్లు పిలిచిన బాగుండునా?”

సందీపుడు:  నీ ప్రేమికురాలి పేరు మీనాక్షి అన్న మాట. మరి ఆమెకు నీ ప్రేమను తెలిపినావా ?ఆమె అంగీకరించెనా ?

రాఘవ: ప్రేమించుకున్న ఇంత  ధనసాయము చేయునా ? కానీ ఎందుకో గత కొద్దీ రోజుల నుండి ఆమెను కలుసుకొనుటకు  ఇంటికిపోయిననూ , ఆమె ఇంటివద్ద నుండుటలేదు!

యమున: నిజమే నిన్ను ప్రేమించుచున్నది , ఒక కొడుకు వలే ప్రేమించుచున్నది. ముంబై సంగీత కార్యక్రమమునందు చూచి ఆమె  ప్రతిభకబ్బురపడి ఒక కన్నడ చిత్రమునకు సంగీతము సమ కూర్చమని ఒక దర్శకుడు ఆమెను ఆహ్వానించెను.  ఒక హిందీ దర్శకుడు  కూడా ఆమెను  ఒక చిత్రమునకు సంగీతము సమ కూర్చమని ఆహ్వానించెను. గత కొద్దీ రోజులగా చిత్ర సంగీతము సమకూకూర్చుచు చూ తలమునకలుగా నుండెను. ఆమె నిన్ను ఆదృష్టితో చూచుటలేదు.

 రాఘవ: ఆమె నన్ను ఏ దృష్టితో చూచుచున్నదో  నీకు చెప్పెనా ? నీవామె వద్ద చేరి నా ప్రేమను చెడగొట్టు చున్నావు.

సందీపుడు:  మీరిరువురూ వాదులాటలాపిన మనము జయనగర్ పోవలెను. జయ నగర్లో  ఒక పరిశ్రమల సలహాదారుడు కలడు అతడి సలహా పాటించి అనేక పరిశ్రమలు వృద్ధిలోకి వచ్చినవి, నేటి మన చర్చల సారాంశమును మరియు  నా నిర్ణయమును అతడి ముందుంచి అతడి సలహా తీసుకొని రేపటినుంచి కొత్త మార్గమున సంస్థను నడపవలెను. 

రాఘవ: నీ నిర్ణమా ? నీవేమి నిర్ణయించుకొంటివి ?

సందీపుడు:  మీరు మీ గొడవ  ఆపిన అదియునూ చెప్పెదను. ఈ ఉత్పత్తులను అన్నీ రేపటినుంచే  ఆపివేయవలెనని నేను నిర్ణయించుకొంటిని. 

ఉత్పత్తి నిలిపివేసిన మరి మనమేమి చేయవలెను ?

సందీపుడు: అది తెలుసుకొనుటకే  మనము సలహాదారు వద్దకు పోవుచున్నాము . అమ్మకాలు లేని ఉత్పత్తులు చేయు టెందులకు? నష్టములు పెంచుకొనుట ఎందులకు ? 

రాఘవ: ఇప్పుడు ఇంకనూ పని చేయవలెనా! నాజీవితము హరించుకు పోవుచున్నది, నేను మీనాక్షిని చూడవలెను . నాజీవితమును ఆమెకు అర్పించవలెను. నిత్యమూ ఆమెతో తీపి కలలు కనుచున్నాను 

యమున: రాఘవ నీవు సంస్థను వృద్ధిలోకి తీసుకు వచ్చెదవని  నేను పగటి కలలు కంటిని. 

నీవు సంస్థను వృద్ధిలోకి తీసుకువచ్చువాడవు కాదని  తేలిపోయెను. సంస్థను ఎప్పుడు వీడిపోవలెనన్న ఆటంకపరచనని మాట ఇచ్చితివి గుర్తున్నదా "ఆ గుర్తున్నది" అని రాఘవుడనెను 

యమున: అయినచో నేను చెప్పవలసిన ఆఖరిమాట ఒకటున్నది, నేను సంస్థ ను వీడు చున్నాను. రేపటినుండి నేను రాలేను. మన దారులు వేరు     

సందీపుడు: యమున నీవు రాఘవుని నమ్మి భంగ పడితివి. నేను ఎవ్వరిని నమ్ముకొనక నన్ను నమ్ముకొని  కలలు కనక, వాస్తవ ప్రపంచము లో సాగుచున్నాను. మీఇద్దరు మీ మీ దారులు చూచుకొనుడు , సంస్థను నేను చూచు కొందును. సలహాదారు వద్దకు నేను ఒక్కడినే పోవుచున్నాను అంటూ సందీపుడు వంటరిగానే బయలుదేరెను.  

3 comments:

  1. చక్కని కొనసాగింపు

    ReplyDelete
  2. ఈ సుదీర్ఘ భాగంలో వ్యాపారానికి సంబంధించిన చాలా విషయాలు పొందుపరిచారు.

    ReplyDelete
  3. ఈ భాగము వ్రాయుటకు అత్యంత కఠోర పరిశ్రమ చేయవలసి వచ్చింది. అమెరికాలో పర్డు యూని వర్మిటీలో ఎలక్ట్రానిక చదువుకొని అక్కడ పెద్ద కంపెనీలో పని చేసిన శ్రీ కిషోర్ గారు రితో చర్చించిన తరువాత కూడా ఆ జ్ఞానము చాలక, చాలా వెబ్ సైట్స్ సందర్శించిన తర్వాత మాత్రమే ఈ భాగము వాయగలినాను అర్థము చేసుకొనగలవారు మీరు కాక ఎవ్వరు? Thank you very much.

    ReplyDelete