సంజ కెంజాయలింకనూ మడక ముందే జి ఎం హెక్టార్ వచ్చి ఆనందనిలయం ముంగిట నిలిచెను. బసవ రాఘవులు దామిని రాధాకృష్ణులు అందునుండి దిగగా భారతవర్ష వారికి నమస్కరించి స్వాగతించెను. పక్కనే ఉన్న తళుకులీను వస్త్రములందు నిలచిన నీలోత్పల దేహి కేశిని, పొడవాటి వాల్జెడ పిరుదులపై బడి యాడుచుండ, ఆ నితంబి కూడా ఇంటి కోడలివలె అతిధులను ఆహ్వానించుటయందు పాలుపంచుకొనుచుండెను. మధ్యాన్నమే వచ్చి తనకు మాలినిగారిచ్చిన వీణ నిరుపయోగముగా యున్నదని వచ్చునప్పుడు తెచ్చిఇచ్చి అత్తతో ముచ్చటలాడి పిదప వర్షుని కూడి ఇప్పుడు ప్రవేశ ద్వారమువద్ద ప్రియ సేవనము మొదలు బెట్టెను. మాలినిగారు వచ్చి దామినిని తోడ్కొని పోయినారు. వారు లోని కేగుచుండగా మెర్సిడెస్ వాహనమొచ్చి ఆనందనిలయం ముంగిట నిలిచెను.
పైడమ్మ పెంచలయ్యలను కూడివచ్చిన సందీపుడు నందిని లకు భారతవర్ష నమస్కరించి స్వాగతించుచుండగా పెంచలయ్య పైడమ్మ వర్షుని పలకరించి ముందుకు సాగుచుండగా మాలినిగారు వారిని లోనికి తోడ్కొని పోయిరి సందీపుడు వారితో వెడలి పోయిననూ నందినిని మాత్రము లోనికి పోక “బావగారు మీరు మాకు ఆంగ్లమును భోదించునపుడు పంచెలు ధరించలేదు. కానీ మీరు పంచెగట్టిన తెలుగు భాషకు రూపమువలె నుందురు అని నేను మీ ఆంగ్ల విద్యార్థినిని కావున నాకాభాగ్యము దక్కలేదు. కానీ నుదుట బొట్టు పెట్టిన మీ మూర్తికి మరింత శోభనిచ్చును పెట్టమందురా అని ఆట పట్టించుచుండెను.
అది చూచిన విదిష మిరపకాయల ధూపము వేసినట్టు ధుమ ధుమలాడుచూ ఆడిన మాటలు చాలును లోపాలకి వెళ్ళవమ్మా నీ తల్లి తండ్రులు వెళ్ళినారు కదా." అనగా నందిని వర్షునితో " ఈమె ఎవరు బావగారు ?" సహాయకురాలి వలె నున్నది అన్యులకు ఇంత చనువివ్వరాదు అని వర్షుడి చెవిలో చెప్పు చుండగా ఉక్రోషము పట్టలేని విదిష ఆమె జబ్బపై చరిచి పరపురుషులపై పడుట ఏమది ఇంకనూ వచ్చుచువారిని మేముస్వాగతించవలెను నీవు లోపాలకి పో అమ్మా అని అనగా "ఆపని వర్షుని కూడి నేను చేసెదను." అని నందిని బదులు పలికెను.
"ఇదిగో అమ్మాయి పెద్ద చిన్న లేక గురువు అని చూడక పేరు పెట్టి పిలుచుచున్నావా " అని గద్దించుచూ వర్షుడు మిన్న కుండుట చూచి విదిష కు అరికాలి మంట నెత్తికెక్కెను. భారతవర్ష వైపు మిర్రి మిర్రి చూచుచూ "నీకు చెప్పుట చేతకాని వారుండుటచే నీవిట్లు రేగుచున్నావు” అనెను. “నన్ను పొమ్మనుటకు నీవెవరివే నేనిచ్చటనే ఉండెదను” అని నందిని విదిష పక్కనే నిలిచెను. వర్షుడు మెల్లగా ఇంటిలోకి జారుకొనెను. చల్లగా చంద్రోదయము అగుచుండెను, మసకచీకట్లలుముచుండగా రాధామనోహర పుష్పములు పిల్లగాలికి తలలు ఊపుచూ పిళ్ళారిగీతమేదియో పాడుచుండెను.
చ. సితక రకాంతు లందల రుజోడు హయమ్ము లవోలె ముంగిటన్
అతివ లునిల్వ గాజల రుహమ్ము లబోలి నమేని కాంతులే
మతుల నుచిక్క బట్టమ రిపెళ్ళి కళొ చ్చె నుచూడ సందడే
రతుల ను పోలి భామలు పురిప్పి చలించ మయూర శోభలన్.
సితకర కాంతు లందలరు జోడు హయమ్ములవోలె ముంగిటన్
అతివలు నిల్వగా జలరుహమ్ము లబోలిన మేని కాంతులే
మతులను చిక్కబట్టమ రిపెళ్ళి కళొ చ్చెను చూడ సందడే
రతులను పోలి భామలు పురిప్పి చలించ మయూర శోభలన్.
చంద్రు కాంతిలో జోడు గుఱ్ఱములవలె ఇంటి ముంగిట ఇరువరు అతివలు (నందిని విదిషలు) నిలువగా జలరు హ మ్ముల (కలువపువ్వుల)ను పోలి వారి మేని కాంతులు మెరియుచుండగా వారి అందము మతులు పోగొట్టు చుండగా ఆ ఇంటికి పెళ్లి కళ వచ్చెను. రతులను పోలిన ఆ ఇంటి కోడళ్ళు పురిప్పి చలించు చుండగా చూడ సందడే కదా.
కొలది సమయము తరువాత వారునూ ఇంటిలోకి ప్రవేశించిరి. వారందరి సందడితో ఆ మండువా లోగిలి పెండ్లి పందిరి వలె నగుపించసాగెను. పురుషు లందరు తెల్లని పంచెలుగట్టి తారలల్లె తళ తళ మెరియుచుండ సందీపుడొక్కడే నీలి సూటు లో చుక్కలందు చంద్రుడి వలె వెలుగుచుండెను.సోఫాల పై వరుని తల్లి తండ్రులు సందీపుడు నందిని కూర్చొని యుండగా మంజూష వారికెదురుగా తివాచీపై కూర్చొని యుండెను. మాలిని దామిని విదిష నిలుచొని యుండిరి. రాఘవ రాధాకృష్ణ కుర్చీలపై కూర్చొనిరి, బసవ కేశవులు మంజూష వద్ద నిలుచుని యుండిరి. సందీపుని మనసున రణము జరుగుచున్న చిత్ర మింకనూ తిరుగుచుండుటచే భారతవర్ష కళ్ళలోకి సూటిగా చూడలేకుండెను.
“సందమామ లాటి పిల్ల కాసి సూడకుంట దిక్కులు సూత్తావేటిరా!” అని పైడమ్మ అనెను. రాఘవుడు " సందీపు నిలో ఎందుకో ఆందోళన కనిపించుచున్నది, అని వర్షుని వైపు చూచెను . వర్షుడు విషయము అర్ధము చేసుకొని బావగారు అని సాందీపుని సంబోధించి " మా చెల్లిని చూచినచో మీ ఆందోళన తగ్గును." అని సాందీపుని దగ్గరికి పోయి భుజముపై చేయి వేసి చెప్పెను . పిల్ల కూడా అట్లే యున్నది ఇదంతయూ మా ఆయన పనే , ఈ పెండ్లి చూపుల తతంగమేలనో మనసులు కలిసినవి మాటలు ఇచ్చి పుచ్చుకొనినారుకదా నేరుగా ముహూర్తము పెట్టుకొనిన పిల్లలకీ శ్రమ తగ్గునుకదా అని దామిని అనెను, విదిష కూడా అట్లు చేసిన బాగుండెడిదని అనెను.
స్త్రీలే అన్ని విషయములూ నిర్ణయించినచో పురుషులము మేమెందులకు అని రాకి అనుచుండగా కేశవుడు "పెట్టెలు మోయుటకు" అని చమత్కరించెను. అందరూ ఘొల్లుమని నవ్వినారు. ఎట్టకేలకు వాతావరణము తేలిక పడినది. ప్రేమించుకొనుట , తదుపరి ఘర్షణలు ఎట్లో జరిగి పోయినవి. వాటి ప్రభావమింకనూ పసి మనసులపైనున్నది. ఈ పెండ్లి అంతయూ పెండ్లి చూపులనుండి అన్ని యదా విధిగా సజావుగా జరిపించిన యెడల పిల్లల మనసులతో పాటూ పెద్దల మనసులు కూడా కుదుట పడును. అని చెప్పి విదిషవైపు చూచి నీవింకనూ చిన్నపిల్లవేకదా ఎన్నిపెళ్లిలు చేయించినావు నీవిట్లు మాట్లాడతగదమ్మా అని చెప్పెను.
విదిష జింకపిల్ల వలె బెదురుకళ్ల నాడించుచూ మాలినిగారివద్దకు పోయి ఆమె భుజము పై వాలెను . మాలినిగారు ఆమె తలనిమిరి ఓదార్చుచుండగా సోఫా పై నుండి నందిని కూడా లేచి మాలిని గారివద్దకు పోయి మరొక భుజముపై తలపెట్టుకొనెను. మాలినిగారు ఆమె తలను కూడా ప్రేమగా నిమిరి. మీరిద్దరూ నాకు రెండు కళ్లు అని ముద్దాడిరి. విదిష వెంటనే విసవిసా పోయి మంజూష ప్రక్కనే కూర్చొనెను , నందినికూడా మంజూషవద్దకే పోయి మరొక ప్రక్క కూర్చొనెను. ఒకరినొకరు కొరకొరా చూచుకొనుచుండగా కేశవుడు “వారిమురిపెములు చూచుటకింకనూ సమయము కలదు ముందు చెల్లాయి (మంజూష) సంగతి చూడవలెను.” అనెను. హాస్యము వెల్లివిరిసెను.
మంజూష విదిషకంటే ఎక్కువ సన్నిహితముగా మాట్లాడుచూ నందినితోనే మెలగ సాగెను. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములువాడి కదా. వెంటనే విదిష వర్షునివద్దకుపోయి కొలది దూరములో నిలిచి తన పుష్పాలంకృత ద్రాష్టిగ కేశములను పొడవాటి పూల జెడను చేతపూని నిలవగా నందిని కూడా తన నాజూకు కౌనును త్రిప్పుకొనుచూ పోయి అతడికి మరొకప్రక్క నిలిచెను. పెళ్లి చూపులు మంజూషకి వలే కాక వీరిద్దరికి (పెళ్లి చూపులు) వలే తోచుచున్నవి అని దామిని అనగా పెంచలయ్య సందీపుని మంజూషను ఏమైనా మాట్లాడుకొనవలసినదేమైననూ ఉన్నదా లేనిచో పెద్దలము మాట్లాడుకొనవలసినవి ఇంకనూ యున్నవి అనెను.
పైడమ్మ “మా కోడలు వీణ వాగించుతాది అని ఇన్నాను , ఒక ఈన పాట అనుచుండగా సందీపుడు తల్లివైపు " ఇప్పు డెందుకు పెండ్లి అయినా పిదప వాయించునులే " అని అనగా అందరూ నవ్వు చుండిరి . అబ్బో కాబోవు పెళ్లా మనిన ఎంత అపురూపమో అని రాఘవువుడనగా , మా ముంగీస కూడా ఎంత బుద్ధిమంతురాలయిపోయెనో అని రాకి అనెను. " మాలినిగారు " పిల్లకి వీణావాదనము బాగుగా రాదు ఈ ఇంట వీణ వాయించునది మా పిల్లవాడు " అని చెప్పగా బాగుగా రావలసిన పనియేమున్నది పిల్ల వాయించవలెను కానీ పిల్లవాడు వాయించుటకు సందర్భము కాదుకదా అని రాఘవుడనెను .
వీణావాదనముతో పని ఏమున్నది మంజూష పాడిననూ చాలునని బసవడు ఒక ఆసు కవితను దొర్లించెను.
వంటి మెరుపులోనే వేయి రాగాలు, కంటి కొసలలోనే వెలుగు దీపాలు
తీగవంటి పిల్ల తీగమీటనేలా సాహితీ వరపుత్రుని సరస గిరసము
వీడి వరుసకూడి సరసముగా పాటపాడ విన్నవారి వీనుల తేనె కురియు.
అన్నింటికీ సందర్భమున్నది కానీ నీ ఆసుకవితలకు సందర్భము లేకుండెను అని అగస్త్యుడు చమత్కరించెను. మరల నవ్వులు విరుపూచి వాకిటనున్న విరులనల్లుకొన్నవి. మంజూష ముందు వీణ యుంచబడినది. మంజూష బేలగా వర్షుని వైపుచూచి పిదప సందీపుని వైపు చూడగా అతడి మనసు ద్రవించి "పాటపాడిన చాలుకదా వీణా వాదనమెందులక"ని కాబోవు ఇల్లాలికి ఇక్కట్లు తప్పించుటకు ప్రయత్నించుచుండగా రాఘవుడు " అత్తగారు కోరినారు కోడలు ఆమె కోరిక తీర్చవలెను మధ్యలో నీవెందులకు గింజుకొనుచున్నావు?” అని తీక్షణముగా అడిగెను. "మంజూష నీవు పాట పాడుచూ వీణా వాదనము చేయవలెను. పాట నీకిష్టము" అని రాకి అనగా దామిని రాకివైపు తీవ్రముగా చూచెను. నందిని "ఎదో ఒక పాట అయినా ఎట్లు కుదురును మా కులదైవం గోపాలుని కీర్తించుచూ గానము చేయవలెను" అని నిబంధనను జేర్చెను.
కేశవుడు " చెల్లికి కంగారుగానున్నది కావున గోపాలుని పై పాట నేను పాడెదన"ని ముందుకు వచ్చుచుండగా " పోవయ్యా నీ డ్రామా గానములిచ్చట కుదరవు ఇవి పెండ్లి చూపుల"ని నందిని కొట్టి పారవేసెను నందిని పాడుట మొదలు పెట్టు చుండగా ఏసు ప్రబువు పై గానము చేయరాదా యని పెంచలయ్య అడిగెను. పైడమ్మ సివంగివలె లేచి " ఆల్ల కాడ నీ మతం ఊసెత్తనని, ఆల్ల పద్దతి పకారంగా (హిందూ వివాహము ) పెల్లి సేత్తానని మాటిచ్చినావా , నాను కూడా ఆవిసయం ఒట్టేయించుకొన్నానా ? ఒట్టేసి సెప్పేవా నేదా? అవిటవిటికి సెప్పాలేటి ? మడిసివికాదేటి ?? " అనగా కొలది సేపు నిశ్శబ్ధమావరించెను.
ఆ నిశ్శబ్దమును చీల్చుకొని వీణానాదము గంగా ప్రవాహము వలె అందరి చెవులను తాకినది. మంజూష గానము లేకనే వీణ వాయించు చుండగా ఆమె ప్రక్కనే కూర్చొని నందిని తాను వ్రాసిన సంస్కృత గీతము నాలపించెను
ప్రాతః కాలే నంద నందనే పూజా సమయే వందిత గురుః
విద్యాసమయే ముకుంద మురారీ సంధ్యా సమయే నంద నంద
క్రీడాసమయే గోపికా ప్రియా మానసచోరా గోపాల గోపాల
ఉత్తిష్ఠ యావత్ శయన పర్యంతం సతతము తవ నామస్మరణే కృష్ణా
గానము , వాదనమూ ముగిసిన పిదప అందరూ నందినిని కొనియాడిరి. పైడమ్మకీ విషయము తెలిసిననూ భర్త ఎప్పుడూ కుమార్తె సంస్కృత రచనా ప్రతిభను వినియుండ కపోవుటచే సంబ్రమాశ్చర్యములకు లోనయ్యేను.
పిదప తన బిడ్డలు గొప్పవారని చెప్పుకొనుచు మురిసి పిదప పెంచలయ్య కట్నము విషయమై నసిగి నసిగి పలు పలు సంభందములు లక్షల కట్నము ఇవ్వజూపినారని చెప్పెను. పరోక్షంగా అతడికి పెద్ద కట్నము పై మనసున్నదని ఎరిగించెను . మాలినిగారు పైడమ్మతో " ఎంతనుకునుచున్నారో తెలిపిన ఒక మాటనుకొనవచ్చునని తన కొడుకు పది లక్షలు వరకు సర్దుబాటు చేయున"ని చెప్పగా పెంచలయ్య " కోట్లలో సంపాదించువానికి ఇంటివ్వవలెనో నేను చెప్పవలెనా " అని సాగ దీసెను . వర్షుడు "ఒక యాబది లక్షలు ఇచ్చెదనని" చెప్పగా " కోటి యని పెంచలుడు బిగించెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యమునొంది పెంచలయ్య తెంపరితనమును గర్హించుచుండగా భారతవర్ష తల్లి వైపు చూచెను. సందీపుడు నందిని వారించిననూ ప్రయోజనము లేకుండెను. అందుచేత కొంత విలంబ మగుచుండెను. ఇంతలో సిద్దాంతిగారు విచ్చేసినారు. విషయము తెలిసి పెంచలయ్యకు హితము చెప్పుచుండగా మంజూష కళ్ళలో నీళ్లు తిరిగినవి " మంజూష మూతిముడిచి మొఖం మాడ్చెను . ' పెంచలయ్య కన్నీరు పెట్టుకొని "మా కోడలుచే కంట నీరు పెట్టించుచున్నారు , నాకంట నీరు పెట్టించుచున్నారు. వాడిపై నేను పెట్టుకొనిన ఆశలడియాసలయినచో నాజీవితమంతయూ దుఃఖింతును." అని మర్యాద భాషలో మన్ననగా అడుగుచుండగా భారతవర్ష ఒక కోటి కట్నమిచ్చి చెల్లి పెళ్లి చేయుటకు సమ్మతించి చెక్కు వ్రాసి ఇచ్చెను. మరుసటినెలలో మూర్తము నిర్ణయించబడెను. సిద్ధాంతి గారు పంచాంగం చూసి ముహుర్తమును నిర్ణయించి శుభలేఖ వ్రాసి ఇచ్చినారు అది వర్షుని చదవమనగా " స్వస్తిశ్రీ చాంద్రమానేనా విళంబినామ సంవత్సర మాఘ మాస బహుళ దశిమి బుధవారం రాత్రి 7. 40 నిమిషాలకు హస్తా నక్షత్ర యుక్త మిధున లగ్నమందు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మంజూషను .." చదువుచుండగా మంజూష మొఖం కళ్యాణ కాంతులతో వెలిగెను. వారి ఇరుహృదయములలో భజంత్రీలు మ్రోగుచుండెను అట్లు మంజూష వివాహము నిశ్చయమయ్యెను
This comment has been removed by a blog administrator.
ReplyDelete