న్యూ ఢిల్లీ నార్త్ అవెన్యూ అరుణతార నివాసం: రాత్రి పెరుగుచున్నది కానీ మాలిని అరుణల ఆసక్తి తరగ కున్నది. “నేడు నీ బిడ్డ కష్టము ఫలించింది . జాతీయస్థాయి లో గుర్తింపు లభించినది. జీవిత కాలసాఫల్యము నొందిన వర్షుడు మేడపైన గదిలో ప్రశాంతముగా నిద్రించుచున్నాడు. విదిషయూ క్రింద నా గదిలో ఆదమరిచి నిద్రించుచున్నది. తల్లికి మాత్రము నిద్ర పట్టకున్నది. అరుణ చెంతనే సోఫాలో కూర్చొన్న మాలినితో అనెను . “నా మనసు నిండినది, చిత్తశాంతము నొందితిని. మహానంద డోలికయందు నా మనసు పసిపిల్లవలె ఉయ్యాలలూగుచున్నది. ఇట్టి వేడుక బంధుమిత్ర పరివారము వలన ద్విగుణీకృతమైనది, కానీ మధ్యలో నందినితో గొడవ ఎచ్చటికిపోవునో అని భయపడితిని. తక్షణమే సమసిపోవుట గొప్ప అదృష్టముగా భావించవలెను.”
తార : ఆ అదృష్టము కూడా ద్విగుణీకృతము అగునేమో ?
మాలిని: నీ ఉద్దేశ్యము నాకర్థము కాకున్నది.
తార : అనగా నీకిద్దరు కోడళ్ళు వచ్చుఅవకాశము కలదేమో! వీరిరువురి వాలకం చూసిన ఒకటే హృదయము కొరకు పోటీ పడుచున్నట్లు తోచుచున్నది.
మాలిని: నందినిదంతయూ చిలిపితనము. ఆమె చిలిపితనము విదిషను ఆటపట్టించునంతవరకే. కానీ నందిని నాబిడ్డ మంజూష కంటే సరళమైనది , సరసమైనది.
తార : కానీ ఆమె పండితురాలు. పాండిత్యమనిన వర్షుడు మైమరచును. చూచితివికదా
మాలిని: ఏమమ్మా అరుణమ్మ నీవు నన్ను ఆట పట్టించుచున్నావే పాండిత్యమనిన నా బిడ్డకు ఇష్టమే అట్లని పాండిత్యమున్న వారినందరినీ కట్టుకొనునా? కట్టుకొనిన విదిష ఊరుకోనునా! నందిని పండితురాలయిన విదిష దైవ శక్తి సంపన్నరాలు.
ఆమె శక్తి గూర్చి వినియుంటిని. కానీ చూడలేదు. ఆర్ద్రరాతి కావచ్చుచున్నది పోయి పడుకొనుము నేను రేపు బారామతి పోవలసియున్నది. సాయంత్రమునకు తిరిగి వత్తును. నీవు బారామతి పోవుటకు కుదరదని విదిష చెప్పినది. స్థానిక కార్యక్రమమున్నది వెళ్ళక తప్పదు. అని తార అనెను
***
ఆదిత్యుని కోమల కిరణములు లేలెమ్మని జగతిని తట్టి లేపుచున్నవి. ఆశిరుడు శిశిర కాంతను తన లంబ కిరణములతో తాకుచూ హిమ బిందువుల తో తడిసిన ఆమె దేహమును ముద్దాడు చుండెను. మాలిని అరుణతారాలు మండువా గదియందు కూర్చొని యుండగా పనివారు కాఫీ అందించుచున్నారు. శుకము చూతవృక్షము పై కూర్చొని తీయని రాగాలాపన చేయుచున్నది ఒక పరిచారిక చీమ వాసిత రేఖామార్గమును ఆహారాన్వేషణకు సాగుచుండెను, ఒక ఛిక్రోదము ఉన్నత వృక్ష శాఖనధిరోహించి పారిభద్ర ఫలమునారగించుచుండెను. ఉచ్చాకాశ మునెగురు గరుడ మొకటి శరవేగమున క్రిందకు జారి తన లక్ష్యమును ఛేదించి పైకెగిరిపోయెను. కళాదృష్టి తో చూచిన ఆదిత్యుడు భాగవతార్ అనగా నిర్దేశకుని వలె జగతి రంగస్థలంపై పిపీలకాది ఛిక్రోద, ఖగ కరిపర్యంతము నృత్యాభినయ చతుర సంభాషణలతో సాగు యక్షగానము వలె నగుపించును.
చ. జగతి మరాళ కాంతుల తొచక్క గవేడు కజేయు చుండగా
మిగుల వన్నెల కాంతుల నుమెచ్ఛు చుపువ్వు లుపాడు వేళలో
ఖగము రెక్కలు జాచుచి రుగాలు లుతావు లుచల్లు చుండగా
సగమ గుబాధ జూడమ నసార ఉషోద యవేళ ప్రకృతిన్
పికము చేయు గానము నాలకించుచూ వెండి వెన్నెల కాంతులీను చీర మరకత రాగ రవిక ధరించి సర్వాంగ స్వర్ణాభరణ భూషిత విదిష అభ్యంగనమొనర్చిన కురులను తుడుచుకొనుచు ఆహా రమణీయమగు ఈ ప్రకృతిని వర్ణించనచో మనసు ఇంకనూ రంజిల్లును కదా అనుకొనెను.
ఆ.నిత్య హృదయా నందము నిచ్చు భాష
ముత్య పువెలుగు లీనుచు ముచ్చ టించి
విచ్చి నమసును మెచ్చుచు వెచ్చ జేయు
ఎన్న డు తరగ కపారు ఏఱు భాష
"రా అమ్మ కాఫీ త్రాగమ"నుచూ అరుణతార పిలిచి కూర్చోడబెట్టు కొనెను. ఏమే నాఎదురుగానే కూర్చొందువా ? “ఆమె కూర్చొన మని నది” “ఆమె కూర్చొని మన్నచో మా అత్త వున్నది ఆమె ఎదురుగా నేను కూర్చొనను అని నీవు చెప్పవలెను కదా” మాలిని ముఖమున కోపము ప్రస్ఫుటంగా కనిపించుచున్నది. బేల వలే విదిష లేచి నిలిచినది అప్పుడు మాలిని " వర్షునికి కాఫీ ఇచ్చుట ఏమియూ లేదా నీవు తాగిన నాబిడ్డకు కాఫీ ఎవరిచ్చెదరు ? " అనగా విదిష పెదవులు విచ్చుకొని కనులు మెరిసినవి.
ఆమెకు మేడెక్కి ప్రియునివద్దకు పోవలెనని ఉన్ననూ శంఖిణీ రాక్షసులవలె కూర్చొన్న ఇద్దరినీ దాటి పోవుట బాగుండదని వేచియుండెను. కాఫీ కప్పు చేతికిచ్చి మాలిని పోయి వర్షునకు ఇచ్చి రమ్మని పంపెను .
"వర్షిణి కి ఇష్టమైన చీర ధరించి సింగారించుకుని పోవుచున్నది, అగ్ని పై ఆజ్యమును జల్లు చున్నావు" “నా కొడుకు పై నాకు నమ్మకముంది” “నాకు లేదమ్మా , ఎంత పండితుడైనా మగబుద్ధి ఎచ్చటికి పోవును?” "ఏమగు నమ్మా వాడే మైననూ ఆడపిల్లా భయపడుటకు , ఆడపిల్ల అట్లు చేసినా అన్నీ అమర్చి పెట్టి పెళ్లి చేయుచున్నాడు , అట్లేమైనా జరిగినచో వారి పెళ్లి నేను జరిపింతును సరేనా!" “ఊ , నీ కోడలికి నీకు లేనిది నాకెందుకు మధ్యన” అని పుల్లవిరుపు మాట లాడుచుండగా “అబ్బబ్బ కాఫీ ఇచ్చుటకు పొయినాదమ్మా , సర్వము అర్పించుటకు కాదు” ఇట్లు వారి హాస్య ములు సాగుచుండగా ఒక కుర్రవాడు " మేడం న్యూస్ పేపర్స్ " అని గాజుబల్లపై పెట్టి వెడలెను.
ఇవి వార్తలా ! అన్నీ శుభలేఖలువలే నున్నవి. ఆహా !!!!! అరుణా నాకొడుకు చిత్రము చూడుము ది హిందూ మొదటి పేజీ లో అచ్చువేసినారు. ఓహో !!!!! ఇంకొక పత్రిక హిందూస్తాన్ టైమ్స్ కూడా వర్షుని గూర్చి వ్రాసినది. అమెరికాలో లూయీవిల్ సాహిత్యోత్సవము న పాల్గొనుటకు వర్షునికి ఆహ్వానము చదువుచూ మాలిని గాలిలో తేలి పోవుచున్నది . అరుణతార " మాలిని నీవు నేడు భోజనము చేయునట్లు కనబడుటలేదు. " అవును నాకొడుకింత ప్రయోజకుడైనాడు నాకలలు పండినవి నాకు ఆకలి ఎట్లు కలుగును. " మరి ఇంత ప్రయోజకుడైన కొడుకుకి ఈ సామాన్య మైన నల్ల పిల్లను ఎట్లు చేసుకొందువు? వేరేదైననూ మంచి సమ్మందం చూడమందువా ?"
ఆహా హా హా .. ఎంత చక్కగా విసిరినావమ్మా వల , నా మనసు కనిపెట్టవలెనని. నాకొడుకు వలచి వరించుచుండగా నాకేమి కష్టము , ఇప్పుడే చెప్పుచున్నాను నాకోడలిని నల్లపిల్ల అనిన ఊరుకొందును కానీ సామాన్యురాలు అనిన ఊరుకొనను." అనుచుండగా ప్రధాన మంత్రి కార్యాలయము నుండి ఫోను వచ్చినది మాట్లాడినపిదప అరుణతార గుడ్లు తేలవేసి సోఫాలో కూలబడినది. మాలిని కి కంగారు పుట్టి సోఫాలో కూర్చొని నిలువు గుడ్లు వేసిన అరుణతారను కదు పుచుండెను. గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పదవిని అరుణ తారకి ఇచ్చుచున్నట్లు సమాచార మందెనని తెలిపి, నేడు పీ ఎం ఓ కార్యాలయమునకు పోవలెను. అరుణా, మాలా యని ఒకరినొకరు ఆలింగనము చేసుకొనిరి. నా కోడలిని సామాన్యురాలని అంటివే ఆమె అడుగు పెట్టిన తరువాత నీకు మంత్రి పదవి వచ్చినది ఇప్పుడేమందువు ? అని మాలిని తారను అడగగా " ఒప్పుకొందును , కలలోనైననూ ఊహించని పదవి వరించుట చాలా విడ్డూరముగానున్నది " అని అరుణ ఒప్పుకొని ఈమె గూర్చి నీవు చెప్పిన వన్నీ నేడు నమ్ముచున్నాను అనెను.
" బ్రేక్ఫాస్ట్ రెడీ మేడం " అని పనివారి పిలుపు వచ్చెను. మాలిని చెవులు దిబ్బడ వేసినవి వార్తాపత్రికలలో తనయుని చిత్రము మరల మరల చూచి ఆనందించుచున్నది. "వార్తాపత్రికలలో చిత్రములనే చూచి మురియుచున్నావు మేడమీద ఏ చిత్రములు చేయుచున్నాడో చూడవలెను. నా శోభనం రాత్రి అమ్మలక్కలు అట్లే చూచినారట. ఆ కాలమునందు అది యొక్క ఆన వాయతీ గాయుండెడిది."
" ఛీ ఛీ ఆకాలమున పల్లెటూర్లందు అట్లు చేసెడివారు. నేడేట్లు చేయుము గదిలోకి తొంగి మన మెట్లు చూతుము. నాబిడ్డ పుస్తకముల పురుగు , ఎల్లప్పుడు చదువుకొనుచుండును , అది నాకు తెలియును. "
నీవిచ్చటనే యుండుము అరుణతార మేడ పైకి పోయెను. తలుపు మూసిలేదు తెర మాత్రము అడ్డుగానుండెను. తెరకొద్దిగా తొలగించి అరుణ చూచుచుండెను.
కాఫీ చల్లారిపోవుచున్నది లెమ్ము అని బల్లపై కాఫీ కప్పును పెట్టి విదిష వర్షుని చెవిలో గుసగుసలాడుచుండెను కానీ వర్షుడు లేవకుండెను . తడిసిన కురుల చివరిభాగములతో నిద్రించుచున్న ( నటించుచ్చున్న) అతడి చెవిపై రాసేను. అతడు కనులు తెరుచు సమయమునకు ఆ గదిలో నున్న బీరువా ప్రక్కన దాగొని మరల అతడు కనులు మూసుకొన్న పిదప వచ్చి కురులతో చెంపపై రాసేను. ఇట్లు రెండు సార్లు జరిగిన పిదప మూడవసారి వర్షుడు తటాలున చెయ్యిజాపి వెనుకకు పోవుచున్న విదిషను పట్టుకొనబో గా ఆమె పైట అతడి చేత చిక్కెను.
వర్షుడు పైటను అట్లు పట్టుకొని మెల్లగా విదిష వద్దకొచ్చెను. పైట వదిలి వెనుకనుండి విదిష నడుముపై చేతులు వేసి , ఆమె మెడపై తన పెదవులనుంచి హత్తుకొనెను. విదిష మంత్రించినట్లు ఏమాత్రము ప్రతిఘటన లేక మైనపు బొమ్మవలె అతడి శ్వాస యందు కరుగుచుండెను. భ్రమరము పుష్ప ముపై వాలినట్లు వర్షుడు ఆమె మెడపై చెక్కిళ్ళపై వాలి తన పెదవులతో ఆమెను చుంబించు చుండగా అతడి చేతులు ఆమె నడుముపై నర్తించుచుండెను. అరుణతార చటుక్కున క్రిందకి పోయి మాలినితో " నీవు చెప్పినది నిజమే నీ కొడుకు పుస్తకముల పురుగు అని చెప్పిన నేను నమ్మలేదు కానీ పోయి చూచిన పిదప అదియే నిజమని తేలేను , నీవునూ పోయి చూచిరమ్ము అని చెప్పగా మాలిని చకచకా మెట్లెక్కి తెరచాటునుండి చూచి అవాక్కయ్యేను. "నందిని నిన్ను బావగారు అని పిలుచుచున్నది కదా నాకుకూడా నిన్ను అట్లే పిలవవలెనని యున్నది."అని విదిష అడిగెను. "నీవు బావా అని పిలువుము" అని వర్షుడు అనెను విదిష " బావా " అని తమకముగా పిలిచెను. వర్షుడు ఆమెను ఏమిజేసెనో కానీ ఆమె కెవ్వని అరిచెను. మాలిని వెంటనే గబగబా మేడదిగి వచ్చెను. ఆమెను చూసి అరుణ తార " నీ మొఖం చూచిన నీ కొడుకు చాలాముందుకి పోయినట్లున్నదే. బాగుగా చదువుకొనుచున్నాడమ్మా! చిన్నపిల్లవాడనుకొనుచునన్నది !" అని వేళాకోళమాడు చుండగా మాలిని " ఈ సంవత్సరము ఆఖరి ముహూర్తము మంజూషది. వచ్చే సంవత్సరము మొదటి ముహూర్తమునకు వీరికి పెళ్లి జరిపించెదను. " అనెను
No comments:
Post a Comment