తూర్పుతీర మెల్లయు వెలుగు రేఖలు ప్రసరించుచుండెను. తీరరేఖ వెంబడున్న పాథోరాశి ఎల్లయూ తళతళ మెరియుచుండెను. "విశాఖపట్నము తూర్పుతీర రత్నమను పేరు సార్ధకం చేసుకొనెను " అని ఫెర్రారీ నడుపుచున్న అగస్త్యడు బసవడితో అనెను. మువ్వవాని పాలెమందు బసవడింటివద్ద బయలుదేరిన ఫెర్రారీ వాయువేగమున పోవుచున్నది. మద్దిలపాలెము, అక్కయ్య పాలెము , తాటిచెట్ల పాలెము, మర్రిపాలెము దాటి కొత్తరోడ్డు వైపు దూసుకు పోవుచున్నది. "అగస్త్య నీవు నిన్ననే విదిష వద్దకు పోయినావు కదా మరల నేడేల వచ్చుచుంటివి?" బసవడు అడగగా "నీవు పార్వతి గూర్చి అడుగుటకు పోవుచుంటివి కదా, నాకునూ లకుమగూర్చి అడుగవలెనని ఆలోచన కలిగినది, నిన్న కేవలము మా నాన్న ఆరోగ్యము ఆస్తి గూర్చి అడిగితిని గాని లకమగూర్చి అడుగుట మరిచితిని. తల్లి లేకుండుట ఎంత భాధాకరమో మనని ప్రేమించువారొక్కరూ లేకుండుట ఎంత దుర్భరమో కదా అని అగస్త్యుడు అనుచుండగా, "లకుమ తో గడిపినపుడు అమ్మ గుర్తుకు రాలేదు కానీ ఆమె బొంబాయి పోయిన పిదప నేడు నీకమ్మ గుర్తుకువచ్చుచున్నది. సిగ్గులేని మొగమన్న నీదేకదా!అని అనుచూ అయిననూ నీకు చిన్నమ్మ ఉన్నది కదా అని బసవడు వెటకారపు మాట నొకటి తగిలించెను. అదివిన్న అగస్త్యునకు కారము రాసినట్లయ్యెను. ఈమెను అమ్మ అని మరొక సారనినచో మర్యాద దక్కదుఅని అగస్త్యుడు మొఖం మాడ్చుకొని ఆక్రోశించుచూ "తల్లి అనిన నా తల్లి మీనాక్షి" అని అగస్త్యుడు గర్వంగా చెప్పెను. ఎంతకాదన్ననూ మీ నాన్న చేపట్టిన గ్రేస్ కూడా నీకు తల్లే కదా , కాకున్నచో సవతి తల్లి .. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అని ఆశుకవితాలతో ఆట పట్టించు చుండగా ఫెరారీ కొత్తరోడ్డు చేరినది. బసవడు “కారాపిన అల్పాహారం తిని పోయెదము. ఇచ్చట దేవీవిలాస్నందు దోసెలు బాగుండును. బుచ్చిరాజు పాలెమందు తోపుడుబండి పై అమ్ము గారెలు అమ్మ చేతి వంటవలె కమ్మగా యుండును.”
అని చెప్పుచుండగా, కారాపి , తిండి గూర్చి వర్ణించుకున్నచో నీకు పుణ్యముండును. మెక్కిరమ్ము అని హోటల్ముందు కారాపగా బసవడు లోపలకి పోయెను. అచ్చటనున్న వారు ఆ కారు చుట్టూ చేరినారు. అందిద్దరు ఆంగ్లవార్తా పత్రిక పాత్రి కేయులు కలరు. " 1962 తయారీ ఫెరారీ ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కారు. గత కొద్దీ కాలంగా మీరీ ఫెరారీ వాడుచూ నగరమందు పెను సంచలనమగు చున్నారు, మాపాత్రికేయులకు చిక్కక తుర్రు మనుచున్నారు " అని అగస్త్యని వాహనంతో ఛాయాచిత్రములను గ్రహించి, కొన్ని వివరములడిగి తెలుసుకొని వెడలిరి.
బసవడు బయటకు వచ్చి వాహనమెక్కెను. "విదిష ధ్యానములోకి పోయినచో పడ్డ శ్రమ అంతయూ వృధా అగును. కావున నేరుగా సబ్బవరం పోవలెను." అని వాహనమును నడప సాగెను. ఫెరారీ వాయువేగమున నైరుతి దిక్కుగా సాగి కొలది సేపటిలో సబ్బవరం చేరెను.
***
నంది నాటకోత్సవాల్లో పాల్గొని భానోదయ కళాబృందము కర్నూలు నుండి హైద్రాబాద్ వేనులో వెనుతిరుగుచుండెను. కేశవుడు, రంజిని కాక నక్క నాగేశ్వరరావు , పిల్లి పాపాయమ్మ , కొత్త సుబ్బారావు ముగ్గురే వాహనమందుండిరి. వాహన చాలకుడు మస్తాన్ వాహనమును నిదానముగా నడుపుచు “భా ఆ ఆ నోజీగారు కూడా వచ్చిన బా ఆ ఆ గుండెడిది.” “భానోజీరావు గారు నిన్ననే హైద్రాబాదునందు కొంత మంది మన కళాకారులతో కలిసి రంగసాయి థియేటర్ ఫెస్టివల్ లోపాల్గొని అలసినారు.” అని రంజిని చెప్పెను. “ఆ ఉత్సవము కూడా నందిఉత్సవము వలే నుండునా? నా ఆ ఆ కు నూ నటించ వలెననున్నది.” మస్తాన్ నత్తిగా మాట్లాడుచూ వాహనమందున్న కళా కారులందరికి వినోదమందిచుచున్నాడు.
“నీవు నటించెదవా?” అని పాపాయమ్మ అడుగగా సుబ్బారావు "రంగస్థలమున ఎవరి సంభాషణలు వారే చెప్పుకొన వలెను. నీవు చలచిత్ర రంగమందు ప్రయత్నించవచ్చు.” అనెను వాహనమందు ముసిముసి నవ్వులు నెలకొన్నవి.
“కేశవా నీవునూ రంగసాయి థియేటర్ ఫెస్టివల్ లోపాల్గొని కదా, మరి నీవు విశ్రాంతి తీసుకొనకపోతివా? నీవునూ అలిసితివేమో? నేను ఒక మాసమునుండి రంగుకు రంగస్థలముకూ దూరముగా యున్నాను, మరల ఇదిగో నంది ఉత్సవములతో.. ” అని నక్క అనెను.
కళాభారతి ఆడిటోరియం నందు విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖతో కలిసి నిర్వహించినది. ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహిం చిరి. మధ్యాహ్నం 3. 00 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరిగినవి. అని అడిగిన ప్రశ్నతో పొంతనలేని సమాధానమునిచ్చెను.
ప్రశ్న కార్యక్రమము గూర్చికాదు. నీవునూ అలిసితివేమో? మరి నీవు విశ్రాంతి తీసుకొనకపోతివా? అని కొత్త సుబ్బా రావు కేశవునకు నక్క నాగేశ్వరావు అడిగిన ప్రశ్నను గుర్తు చేసెను. "రంజని గారిని నీడవలె కేశవుడు అంటిపెట్టుకొని యుండును, ఆమె ఎచ్చటున్న కేశవుడచ్చ టే యుండును. అని పాపాయమ్మ అనుచూ నీవు ఇంకనూ కొత్త సుబ్బా రావు అనుకొనుచున్నావా పాత సుబ్బారావు ! " సుబ్బారావు ఆమెను పాపి పాపాయమ్మ అని అనుటతో ఇద్దరి మధ్య కీచులాట మొదలయినది.
“అబ్బబ్బ ఎప్పుడూ వాదులాటలేనా, కేశవుడు నిద్రించుచున్నాడు. మస్తాన్ని చూచి మౌనము నేర్చుకొనుడు” అని రంజిని అనగా వారందరూ నవ్వుకొనిరి. ఇంతలో రంజిని గారి ప్రక్కనే కూర్చొని యున్న కేశవుడు ఆమె భుజము పై సోలి నిద్రించ సాగెను.
“కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాల రంగస్థల కళాకారులతో పోటీపడి తన నటప్రావీణ్య మును పౌరాణిక పద్యము లను ప్రదర్శించి కేశవ బ్రహ్మ (రావణ బ్రహ్మ వలె)పేగులు చించుకొనెను.” అని కొత్త సుబ్బారావు చమత్కరించెను. ఆసియాబుక్ ఆఫ్ రికార్డ్స్ నెలకొల్పవలెనని తాను ప్రదర్శించు కళ వివరములను తెలుపుచూ కేశవుడు న్యాయ మూర్తులకు అభ్యర్ధన పంపగా, వారి వద్దనుండి స్పందన లభించెను. అని రంజిని గారు చెప్పగా నాగేశ్వరరావు "ఎందుకొచ్చిన ఆరాటమిది"అని నవ్వుచుండగా, పాపాయమ్మ "కేశవుడు కళాపిపాసి అతనికి కళాతృష్ణ యున్నదినీకు భోగలాలసత స్వార్ధము తప్ప కళాతృష్ణ లేదు . ఇతరుల కళాతృష్ణను అల్పముగా చేసి మాట్లాడుట నీకు తగదు. అయినా భోగలాలస పెచ్చరిల్లి స్వార్ధ పరుల ప్రాబల్యము ప్రపంచమున నానాటికీ పెరుగుచున్నది. ఇట్టివారు క్షణమాలోచించక , కించిత్తు వెనుదీయక సద్భుద్ది ని భంజించుచున్నారు. అని గీత శ్లోకము నాలపించెను.
“యజన్తే సాత్వికా దేవాన్యక్ష, రక్షాంసి రాజసాః | ప్రేతాన్భూత గణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||”
సత్వ గుణము గలవారు దేవతలను , రజోగుణము గలవారు యక్షులను రాక్షసులను , తమో గుణము గలవారు భూతప్రేతములను ఆరాధించెదరు అని దీని భావము. అని ముగించెను. రంజని ఆమెను ఆశ్చర్యముగా చూచుచుండెను.
అందరినీ వినోదపరుచుటకు మన పేగులు చించుకొనుచున్నాము, మరల పోటీలు రికార్డులు నెలకొల్పుట బ్రద్దలుగొట్టుట అని జెప్పి మన బుర్రలు బ్రద్దలు గొట్టుకొనుచున్నాము.రంజిని గారు మీవలె శ్రీ మంతుడినైనచో నేనీ నాటకమును పండించుట గాక నాజీవితమును పండించుకొందును. అని నక్క అనుచుండెను.
ఇంతలో ఒక పెద్ద సరుకులను కొనిపోవుచున్న పెద్ద లారీ మీదకు వచ్చుట గమనించి మస్తాన్ వేన్ ను రహదారి పై నుండి పక్కకు దింపి మరల ఎక్కించెను అందువల్ల వేన్ పెద్ద కుదుపు పొంది ఆసనములపై కూర్చున్నవారు క్రిందకు విసిరివేయబడిరి . కేశవుడు చేతిపై ఆనుకొనగా చేతికి దెబ్బ తగిలెను, రంజిని కాలు సీటు క్రింద చిక్కుకొని మెలితిరిగి నొప్పిచేసెను. మరల ఏట్లో రెక్కుకొని సర్దుకొని కూర్చొనిరి. మస్తాన్ ని అందరూ నిందిచుచుండగా రంజని "మీచేతిలో చక్రమున్న మీరంతకంటే ఏమిచేతురో ఆలోచించవలె"నని అందరినీ మందలించెను.
మృత్యువు తృటిలో తప్పిన పిదప వాహనమందు ఆధ్యాత్మిక మేఘములలుముకొన్నవి. "మానవ జీవితమూ క్షణ భంగురము అందుచే మనము జీవితమునాస్వాదించవలెను" అని సుబ్బారావు అనగా నక్క " నేను చక్కటి తిండి తీర్థముతో నాజీవితమును ఆనందించెదను, మరి నీవెట్లు ఆనందించుచున్నావు అని సుబ్బారావుని అడగగా " నేను నా ఫ్రెండ్ తో ..... అని కొత్త చెప్పెను. కేశవుడు నవ్వి నిద్రలోకి జారుకొనెను.
***
సబ్బవరం చేరిన మిత్రు లిద్దరూ ఊరంతయూ జన సమ్మర్దమును చూచినారు. ఏదో రాజకీయ సభ ఉన్నదేమో వాహన సమ్మర్దము జనసమ్మర్దము హెచ్చుగా యున్నవి. ప్రముఖల వాహనములు రోడ్లపై తిరిగాడు చున్నవి. అనుకొనుచూ కొత్తగా శేషాచలము నిర్మించిన ఆశ్రమము ప్రారంభోత్సవమని గుడ్డ పతాకములపైన వ్రాసి, తోరణములు కట్టియుండుటచే చూచి వారచ్చటికి పోయిరి. కొండల మధ్య నున్న ఇరువది ఎకరముల స్థలమందు ఆశ్రమము నిర్మించబడినది. పెద్ద ప్రహరీ గోడ, చక్రములపై దొర్లు ఇనుపగేటు, దాటి లోపలకు పోయిన పూలమొక్కలతో ఉద్యానవనము, మధ్య జలాశయము, దాటిన పిదప పెద్దచెట్లతో తపోవనము, కూర్చొనుటకు పాలరాతి బల్లలు, ఇంకనూ లోపలి పోగా శివాలయము దాటిన పిదప పెద్ద భవనము. సాధు, బైరాగి భక్త జనముతో , సందర్శకులతో ఆశ్రమమంతయూ కోలాహలంగా నుండెను. ఇంతలో డగ డగ డగ డగ మనుచు ఆకాశమందు పెద్ద రెక్కల చప్పుడు అగుచుండెను. బసవ కేశవులు తల ఎత్తి చూసి ఉదగ్ర వాహన ( హెలి కాఫ్టర్ ) మొకటి నేరుగా పోయి ఆశ్రమమునందు వాలెను. ముఖ్య మంత్రి గారు .. ముఖ్యమంత్రి గారు అని మాటలు వినబడినవి. బసవడు అగస్త్యతో “ఆమె మనతో చదువుకొన్న విదిషేనా అని పించుచున్నది , ముఖ్యమంత్రే వచ్చి చూచుచుండగా మనము వేచి చూచుటకూడా దండగ మననెవరు పట్టించుకొందురు.”అనెను. “ చూచుచున్నాము కదా ముఖ్యమంత్రులు ఇట్లు తయారయినారేమి! సన్యాసులు అమ్మలచుట్టూ తిరుగుట తప్ప వీరికేమి పనిలేకుండెను.” ఆగస్త్యు డనెను .
అనేకమంది జనులు తిరిగి వెడలుచుండిరి. కొంతమంది స్త్రీలు శివాలయములో కూర్చొని "ఈ శివాలయము పాతది వలే నున్నది, అని ఒక స్త్రీ అనగా పాతదే ఒకప్పుడు అమ్మ ( విదిష) తన ఇంటినుంచి ఇచ్చటికి వచ్చి దర్శనము చేసుకొనెడిది, నేడాస్థలమును చలము గారు పొంది ఆశ్రమ నిర్మాణము చేసినా రు." అని మరొక యువతి అనెను.
ఒక చోట అన్న దానకార్యక్రమము జరుగుచున్నది. బసవడు అగస్త్య ఆ ప్రక్కగా ఒక చిన్న సమూహము కనిపించెను . శేషాచలం చుట్టూ పలువురు చేరి మాట్లాడు చుండిరి. పెంచలయ్య కూడా అందులో కలడు. వారిరువురూ వెనుదిరిగ నిశ్చయించుకొని గేటు వద్దకు చేరు సమయమునకు ఉదగ్ర వాహన మెగిరిపోయెను వెనుతిరిగి చూడగా విదిష వారి వెనుకనుండెను. భోజనములు కొనిపోయి విదిష వడ్డన గావించెను, అచ్చట వలతి కూడా వడ్డన చేయుచుండెను. భోజనములైన పిదప. ఆశ్రమమంతయూ ఖాళీ అగుచుండెను వారందరూ తపో వనమునకు చేరి ఒక చెట్టు క్రింద పాలరాతి బల్లపై కూర్చొనిరి .
***
వేను రంజిని గారిల్లు చేరెను. రంజిని గారు కాలు నొప్పిచే నడవలేక మెక్కుచుండగా కేశవుడు తన భుజము పై ఆమె చేతిని వేసుకొని ఊతమిచ్చి లోపలి గొనిపోయెను. వాహనము కళాకారులను తీసుకొని పోవుచుండెను నక్క " కేశవుడు నక్క తోకను తొక్కినాడు ఐశ్వర్యవంతురాలైన స్త్రీ " అను చుండగా కొత్త " మొదట మనుషులను మనుషులుగా చూచుట నేర్చుకొనుము నీకు ఆరోగ్యము చెడి నెలకాలము పని చేయకున్ననూ జీతమిచ్చి ఆదరణ చూపినది. డబ్బున్నచో విలాసజీవితమును గడిపవలెనని నీవు కోరుకొనుచున్నావు. అదే డబ్బు ఆమె వద్ద ఉన్ననూ నీవంటి అనేక పేద కళాకారు లను ఆదుకొనుచున్నది. మనిషి వలె ఆలోచింపుము."అని సుబ్బారావు హితవు పలికెను.
రంజిని కేశవులు ఇంటిలోకి ప్రవేశించిరి. స్నానములయిన పిదప రంజిని, చేతి నొప్పితో భాధ పడుచున్న కేశవునకు తానే స్వయముగా తినిపించెను. కేశవుడు ఆమెను గదిలో మంచమువరకూ నడిపించుకునిపోయి మంచము పై పరుండబెట్టి బెణికిన ఆమె పాదమునకు మందు పూసి సేవచేసి , నొప్పి తగ్గకున్న రేపు సాయంత్రము ఢిల్లీ లో జరుగు సభకు పోవలదు . అని చెప్పి కేశవుడు వెను దిరగగా కేశవా ఇటు రమ్ము అని పిలచి నుదుటిపై ముద్దాడెను.
***
కొలది సమయము తరువాత బసవడు " నావిషమెట్లున్నదో జూడుము నోటివరకు వచ్చిన కూడు తినుటకు లేకుండెను ,నిన్నటివరకూ పార్వతినిచ్చెదనని చెప్పిన చంద్రమతి నేడు కుదరదు పొమ్మనుచున్నది అనెను. పార్వతి కిష్టమైన ఆమెట్లు ఆపగలదు. అనగా గౌడ సోదరుల విషయము చెప్పగా విదిష నవ్వసాగెను. " పార్వతి ఇచ్చటికి వచ్చును నీవు చింతించవలదు అని చెప్పగా అగస్త్యుడు " నాకు లకుమ దక్కు మార్గమేదైననూ కలదా యని చాలావిచారముగాయున్నది అని చెప్పుచుండగా విదిష మొఖము నందు నవ్వు మాయమయ్యెను , మెల్లగా మొఖం బిగుసుకొనెను , కనులు ఎరుపెక్కేను వలతి విషయము గ్రహించి ' రేపు మేము ఢిల్లీ పోవలెను వర్షునకు పురస్కారము కలదు ' అని మాట మార్చి అగస్త్యుని పొమ్మని సైగ చేసెను .
అగస్త్యుడు అర్థము జేసుకొనక " లకుమ మనసు మార్చమని వేడుకొనుచుండగా ఎరుపెక్కిన విదిష కనులు విశాలమ గుచుండగా ఒక్క సారిగా ఆమె లేచి నిలిచెను. పదడుగుల ఎత్తు విగ్రహము కనిపించుచుండ అగస్త్యునికి దిక్దిగంతముల చీకట్లలిమి కనులు కానకుండెను. అగస్త్యుడు పైకి చూడగా విదిష తల చెట్టు శిఖర మంత ఎత్తులో కానవచ్చెను. అగస్త్యుడు చేష్టలుడిగి ఆమె పాదములపైన బడెను. బసవడు దుర్గా స్తోత్రమును చదివి ఆమెను శాంతింప అగస్త్యుని బైటకు తీసుకువచ్చెను. పిదప అగస్త్యుడు ఇల్లు చేరువరకూ ఏమియూ మాట్లాడక రాయివలె కూర్చొనగా బసవడే కారు నడిపెను.
No comments:
Post a Comment