Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, December 18, 2020

Bharatavarsha 95

నవి ముంబయి పాటిల్ మహా క్రీడా ప్రాంగణము (స్టేడియం): యాబది వేల  మంది కూర్చొని చూచుటకు వీలుగల సమ్పద్వర మహా క్రీడా ప్రాంగణము పాటిల్ స్టేడియం  స్థౌల్యమున క్షీరాబ్ధి  సవాలు చేయుచుండెను. గోళాకారపు హరిత పచ్చిక తలము చూడ ప్రేక్షకుల కన్నులు చెదురు చుండెను. దాని చుట్టూ వర్తులాకారముగా నిర్మించిన ఉన్నత సోపానములుపై ఉచితాసములు అమర్చబడినవి. అంతర్జాతీయ క్రీడల కాశ్రయమిచ్చిన ఆ క్రీడా ప్రాంగణ మందు ఒక ప్రత్యేక  కాంటిలివర్ పైకప్పు  నిర్మాణమునకు జర్మనీ దేశమునుండి ప్రత్యేకమైన గుడ్డనురప్పించినారు. ఈ పై కప్పు  స్తంభముల ఆధారము లేక  ఒక కాడపైననిలిచి   ప్రేక్షకులకు  అన్ని కోణముల నుండి  నిరాటంక  వీక్షణను(unobstructed view) అందించును. పచ్చికతలము(green court) క్రింద పరుచుటకు, టన్నులకొలది జింక మట్టిని దక్షిణాఫ్రికా నుండి నౌకలలో రప్పించిరి. ఆ క్రీడా ప్రాంగణ మందు గల ప్రతి నిర్మాణమూ అత్యున్నత శిల్పకళా చాతుర్యమును ప్రతిబింబించుచుండెను.

Aerial view of the night audience throng

ఐదు వందల కిలోవాట్ల సౌరవిద్యత్ కేంద్రము,   పదహారు అత్యవసర ద్వారములు,  తొమ్మిది  టెన్నిస్ ఆట స్థలములు, నాలుగు  అంతః  బ్యాడ్మింటన్ ఆటస్థలములు , రాచ ఉద్యానవన  పరిమాణమున అలరారు ఈత కొలను మరియు విలాస  శీతల విశ్రాంతి మందిరములు కలవు. అందొక  విలాస విశ్రాంతి భవనమందు మీనాక్షి దుస్తులు ధరించుచున్నది. అద్దము ముందు నిలబడి   పయటను సవరించుకొనుచుండగా  ప్రఫుల్ల ఆమె  గదిలోకి ప్రవేశించి ఆమె వంపుసొంపులు కని తత్తరపాటుచెంది, బయటకు పోవుచూ ద్వారము వద్ద నిలిచి "పొలమారి కుత్తుక సవరించుకొని  "లోనికి రావచ్చునా?" యని అడుగగా మీనాక్షి నవ్వి ఎందుకు బయటకు  పోయినావు?" అని అడుగగా "నీవు చీర సింగారించుకొనుచుండగా వచ్చినాను కదా అని అనుచూ దగ్గు చుండగా మీనాక్షి మంచినీరు అతడి నోటికందించెను. తాగిన పిమ్మట " ఏమయినది ?" అని అడగగా ప్రఫుల్ల " నీ అందము విద్యుత్ ఘాతము వలె  తగిలినది" అనెను. మీనాక్షి "అదటులుండనిమ్ము ఈ క్రీడా భవనము ఎంత విశాలముగా నున్నది. యాబది వేల ప్రేక్షకుల ముందు ప్రదర్శనా?! మనమెపుడూ ఇంత  పెద్దకార్యక్రమము చేయలేదు. నాజీవితం ఆశయము నెరవేరుచున్నది. ఇందుకు నేను నీకు రుణపడి యుండవలెను. ఈ  భవనము కళకళ లాడుచూ ఎంత అందముగా ఉన్నదో కదా!" అని మీనాక్షి అనగా "నీ అందము ముందు ఇదంతయూ దిగదుడుపే.  నీ జీవిత కాల ఆశ నెరవేరుచున్నది, నా జీవితననూ ఒక ఆశ గలదు  అది ఎప్పుడు నెరవేరునో కదా !" అని ప్రఫుల్ల తన్మయత్వమందుచు ఆమె అందమును వర్ణించు చుండగా  ఛాయాగ్రాహకుడు వచ్చుటచే  బయలుదేరమని జెప్పి బయటకు పోయి వేచియుండెను. 

 మీనాక్షి బయలుదేరెను. ఆమె పియానోను ఇద్దరు మోసుకు వచ్చుచున్నారు ప్రఫుల్ల ఆమె ప్రక్కనే నడుచుచుండెను, బృందంలో ఇతర వాద్య కారులు వారిరువురిని అనుసరించుచుండిరి వారు నడుచుట కూడా తెరపై ప్రసారమగుచుండగా వేలాదిమంది చూచుచుండిరి. ప్రఫుల్ల మీనాక్షి చెవిలో “సంగీత కారులు వీనుల విందు చేయుదురు  నీవంటి అందాల రాసి సంగీత కారిణి  అయినచో  ప్రేక్షకులకు కనువిందు కూడా చేయును ” అని అనగా మీనాక్షి అతడి వైపు కోరగా చూసెను "దృశ్య ప్రసారములకు, తెరలకు  ఒక కోటి రూపాయలు ఖర్చు అగుచున్నవి " అని ప్రఫుల్ల మాట మార్చెను.

సూర్యుడు అస్తమించి చీకట్లలుముచుండెను. జ్ఞాన కాంతులందు నింపెసలారు  సనాతని వదనమువలె ఆ క్రీడాప్రాంగణము  సౌర విద్యుత్ దీప కాంతులందు దగ దగా మెరియుచుండెను.  ఆ ప్రాంగణ మధ్య పది ఎకరముల వర్తుల హరితతృణము పైనొక రంగస్థలం నిర్మించబడెను.  దూర ప్రేక్షుకులకు ఆ వేదికపై నున్నబృహత్  సంగీత బృందం కొండపల్లి బొమ్మల వలే కనిపించును.  అందుచే శక్తివంతమైన ఛాయాగ్రాహక యంత్రమును ఒక యంత్ర హస్తముపై రంగస్థలము ముందుంచి వేదికపై జరుగుచున్నదంతయూ  రాక్షస పరిమాణమునున్న పెక్కు తెరలపై నలుమూలలా చూపు ఏర్పాట్లు జేసినారు.  

                                           ***

శా. నీలాకా     సమునం     దుజాబి     లిదియే       నీలాంబ  రీరాగ  మే                                                

ఆలాపిం    చుచుపా      లమబ్బు    లజరీ        హారావ    లీదాటె  నే                                                    

కాలాత్మా   సరసీ          రుహాక్షి      కనులే       కవ్వించు   కేదారి   రా                                                  

గాలస్వా    రసిక          స్వరాల      వీనులన్    గావించు   మాధుర్య మే   


వేదిక నధిరోహించిన మీనాక్షిని మబ్బుల మాలలను దాటి నేలవాలిన జాబిల్లి యని  తన  స్వరార్చన తో ప్రేక్షకులకు వీనుల విందు గావించునని వర్షుడు కవితార్చన చేసెను. ప్రేక్షకులను స్వాగతించుచూ స్వరార్చన మొదలయ్యెను. చిన్మయ  గానలహరి  చిదానందము మొనరించుచుండగా ముందువరసలో కూర్చొన్నవిదిష  తీగవలె  వర్షునల్లుకొని జీవన స్వావశీయమునందు కరుగుచుండెను. తెలుగు మలయాళ  తమిళ కన్నడ గీత చందములు  ఆంగ్ల గీతముల  అందములతో బంధములు  వేసుకొని  హృదయములను అల్లుకొను చుండెను.   విభిన్న విలక్షణ శృంగార  విభావరి యందు "కమాన్ హగ్ మీ టైట్"  అని పాటగాడు వేదికపై పాడుచుండ అతడి స్థానమందు విదిష  వర్షుని రూపమునే కాంచుచుండెను. కమాన్ హగ్ మీ  అని గాయకుడు పాడుచుండగా బృందమందలి సభ్యులందరూ ఏక స్వరమున  " గ్రీట్ మీ  కిస్ మీ , టచ్ మీ , హేట్ మీ కిక్ మీ కట్ మీ ఫైనల్లీ  బైట్ మీ " అనుచూ మంద్రముగా సంగీత తరంగమును సృష్టించగా వేలాది మంది కూర్చొని జాలక నిలిచి , నిలవజాలాక్ ఊగి , ఊగ జాలక సోలుచుండిరి.    విదిషకను లందు వేదికపైన జంటల  శృంగార నృత్య భంగిమలు కదులుచుండెను. ఆమె కనులు అరమోడ్పులై   మత్తెక్కి వాలుచుండగా వర్షుని మెడను మునిపంట కొరికెను. " కెవ్వను వర్షుని కేక ఆ సంగీత తరంగమందు కలిసిపోయెను." వర్షుని జంటను చూచి  మీనాక్షి కనులు కిలకిల నవ్వెను. పాట  ముగిసినూ   మీనాక్షి వాద్యమునాపక సంగీతోత్పాతమును సృష్టించెను వర్షుడు లేచి రెండుచేతులూ ఎత్తి  ఆ సంగీత సరస్వతికి కైమోడ్పుచేయగా  పెల్లుబికిన స్వరములు క్రమముగా  చల్లబడెను.  విదిష కనులు చెమర్చెను.  

గొంతు కొలిమిలో రాత్రిని కరిగించు కంసాలి శృతి లయలను పడుగు, పేకలుగా తీర్చిదిద్ది  రాత్రికి రాగాల రంగులద్ది    కంసాలి నేతశాలిగా మారి శ్రోతలకు పట్టు బట్టలల్లగా,  పాత్రికేయులు విశ్రాంతి మరిచి  పదుల  వర్ణ చిత్రములను,  వందల హస్తములు,  వేల పదములను  తమ తమ పత్రికలలో కూర్చి,  లక్షలాది కాపీలను ముద్రించి,  కోట్లాదిమంది పాఠకులకు పంచుటకు శ్రమించు చుండగా ముంబయి శాంతాక్రజ్  విమానాశ్రయము నుండి ఢిల్లీ పోవు విమానమొకటి నిసీదినెగురు చుండెను. “ఢిల్లీ పోయిన పిదప ఏమని చెప్పవలెను అని విమాన గవాక్షము వద్ద కూర్చొన్న వర్షుని పై వాలుచూ విదిష అడిగెను.   సంగీత విభావరి చూచుటకు  బొంబాయి పోయినామని నిజమునే తెలుపవలెను. అని వర్షుడనగా "   నీ తెలివి చాలించిన సంతోషించెదను,  చిన్నప్పుడు బడిలో  నీ ప్రోత్సాహముతో ఇట్లే నిజము జెప్పి తిట్లు తింటిని, మాకెందుకు తెలపలేదని , మేమునూ వచ్చెడివారమని ఆ ప్రౌఢలిరువురూ  అన్నచో ఎప్పుడేమి చేసెదవు?” అని విదిష ప్రశ్నించెను. వర్షుడు మౌనము వహించెను    “మాజంట సరససల్లాపములకు భంగమగునని చెప్పెదవా?” అని మరల ప్రశ్నించెను. వర్షుడు మౌనము వహించెను. “వారు పెద్దవారు కావున ఏదైనా దేవాలయమునందు పూజలో పాల్గొనినామని  తెలిపిన సంతోషింతురు” “అట్లు చెప్పిన నమ్మెదరా?” అని వర్షుడు అడుగుచుండగా  “చెప్పవలసిన తీరున చెప్పినచో నమ్మెదరు. మొద్దావతారము వలే నున్నావే!   నేనెట్లు చెప్పేదనో గ్రహించి నడుచుకొనవలెను.”  అని తన బ్రియోద్వృత్త కుంభ స్తనములు   వర్షుని ఛాతికానుచుండగా  విదిష ఆతడి కంఠ సీమనల్లుకొనెను.                   

                                                                       ***  

తెల్లవారినది మాలిని , తారలు ఎదురు ఎదురు గా సోఫాలలో  కూర్చొని యుండగా కాఫీ  వచ్చెను. మాలిని " నీ ప్రమాణ స్వీకారోత్సవం రెండు రోజులలో జరుగునని విన్న పిదప మాఇంట  పెళ్లి వలే అని పించుచున్నది. నీ కూతురు కి తెలిసిన ఎంత సంతోషించునొకదా!" " అవును ఫోనులో సంతోషించును, దానికి చలన చిత్రములను మించిన ఉత్సవములేవియునూ లేవు బల్లిపాడు  ఉత్సవమునకు రమ్మని బ్రతిమాలి న గ్రామమునందు హోటల్ లో దిగి గుడికి రాక  ఒక సినిమాతారవలే ప్రవర్తించెను. నాతొ మాట్లాడినపుడు కూడా అది తారవలే మాట్లాడుచుండెను.   ఇక నాకు కూతురెక్క డుండెను? సుందరి యందు కూతురిని చూచుకొనుచున్న నాకు,  నేడు రెండవ  కూతురు దొరికెను. ఇక నాకు కేశవుడు కొడుకు  అని గద్గద స్వరమున పలికెను.  మాలిని అరుణతార కనుల మాటున ప్రేమ రాహిత్య ఒంటరి జీవితమున దాగిన నీలి నీడలను మనసుతో  దర్శించి  “చక్కటి బిడ్డల తల్లివి నువ్వు, నీ అదృష్టమును కొనియాడవలెను అనుచుండగా, విదిష  బంగారు  చేలాంచలము గల శ్వేతాంబరము  ధరించి కాఫీ తీసుకొని మేడమీదకు పోవుచుండెను.   

కాఫీ ఇచ్చుటకు బయలుదేరినాదండీ జాణ అచ్చట ముచ్చట లాడక వెంటనే మేడ దిగి  రావలెను అని అత్తగారి పెత్తనమును చూపగా, అరుణతార " నాకూతురు అమాయకురాలు అది జాణ  ఎట్లయినది, నీకొడుకు  అమాయకుడో ఆమె మెడ  చూచిన ఎవరికైననూ తెలియును అని మాలినితో పోట్లాడి విదిష ను సముదాయించెను. పిదప విదిష మేడ పైకిపోగా వర్షుడు మంచముపై కనిపించలేదు. కాఫీ కప్పు తో  లోపలి అడుగు పెట్టిన విదిష ను తలుపు చాటున నక్కిన వర్షుడు వెనుకనుండి వాటేసుకొనెను. అతడి తాకిడికి కప్పు నేలపై బడి ముక్కలయ్యెను. క్రిందనే కూర్చొని యున్న కాంతలిరువురూ ఆ శబ్దమును విని వీరేమి చేయుచున్నారో అని అచ్చెరువొందుచుండగా " మేడం న్యూస్పేపర్స్ " అని కుర్రవాడు వార్తా పత్రికలను కాఫీ బల్లపై పెట్టి పోయెను. " ప్రఫుల్ల లీవ్స్ ముంబై స్పెల్ బౌండ్ " అని పతాకశీర్షికతో వార్త  రమ్యముగా ప్రచురించబడెను ప్రఫుల్ల బృంద ప్రదర్శనను, రంగస్థల చిత్రములను  మీనాక్షి చిత్రములను వివిధ వార్తాపత్రికలలో పలుభంగిమలలో ముద్రించి నారు. అని అరుణతార చెప్పుచుండగా “ ప్రేక్షకుల చిత్రములను కూడా ముద్రించి నారు. 

అని మాలిని ఒక వార్తాపత్రికానందు విదిష వర్షుని కొరుకుచున్న చిత్రమును చూపెను, ఇదిగోనమ్మ నీ కూతురు అమాయకురాలు అనుచుంటివి  కదా  అప్పుడే క్రిందకు వచ్చిన  విదిష కు విషయము  భోదపడెను ఆమె వెనుతిరిగి పోవుచుండగా మాలిని ఆమె చెవిని దొరకబుచ్చుకొనెను. ఇంతలో ఛాయాగ్రాహకుల బృందమొకటి ప్రవేశించి " We are from BBC India. Mr. Varsha has invited us to record a program at home. Is it his house?” అని అడుగగా అరుణ వారిని కూర్చోండ బెట్టెను. అప్పటికే వర్షుడు తయారయ్యి క్రిందకు దిగుచుండెను.


No comments:

Post a Comment