Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, December 11, 2020

Bharatavarsha -90

బసవడు బల్లిపాడులో బస్సు దిగి చేతి గడియారమందుసమయము చూచుకొనగా మధ్యానము మూడు గంటలు కావచ్చుచుండెను.   భుజాన సంచితో, నల్లని అద్దము లతో హనుమంతుని విగ్రహము దాటి, గ్రామములోనికి పోవుచుండగా గ్రామస్తులు కొత్త మనిషని  వింతగా చూచుచుండిరి వారి చూపులు దాటి  కోనేరు దాటి లోపలి సాగుచుండెను.  కొలది దూరము సాగిన పిదప జనసంచార మంతరించెను.  బసవడి బూట్ల చప్పుడు వినిపించు చుండెను గులక రాళ్ళ బాటలో ఆటలాడుచున్న పాలపిట్టల పరిగెడుచున్నవి. బసవడు తలతిప్పి చూడగా చుట్టూ సాలములల్లిన క్షేత్రములు. ఆ శాఖలందు దాగిన గువ్వలు బసవని చూచి నవ్వినవి. అతడు సమీపించుచుండగానే గులక రాళ్ళ బాటలో ఆటలాడుచున్న పాలపిట్టలు తుర్రుమన్నవి. లజ్జావతి కాలికి తగిలి సిగ్గుతో ముడుచుకొన్నది.

లజ్జావతి యందు పార్వతి లజ్జాముకులిత వదనము కనిపించెను.  చంద్రమతి వాలకతనము స్ఫురించెను. కనిపెంచ కున్ననూ కన్నె పిల్ల మనసును శాసించుచున్నది. ఈమె మనసు కఠిన కాచకము ఎట్లు సహింతుమీ అరాచకము. ఇట్లు చింతాక్రాంతుడైన బసవని 

కర్ణము నేదో అవ్యక్త మధుర ధ్వని తాకి అతడి బిగిసిన స్వాంతమును సాంత్వన పరుచుచున్నది. చిక్కని  శాలముల వాలి చూపుకి చిక్కక కలకణ్ఠ కూయుచున్నది. కొలది దూరములో మదనగోపాలుని దేవాలయము కనిపించెను. బసవని మది పులకించెను. అతడియందు ఆసుకవి ఉదయించెను.

 “ఏమీ ప్రకృతి అందము ఏమీ శృంగనాదము తాక డెందము గలుగు మోదము

  ఏమీ చిత్రవాలము ఏమీ మాపటికాలము చూపె చిత్రవిచిత్ర జాలము  

  ఏమీ శుభ సూచకము ఏమీ మధుర వాచకము ఏమో మదన ప్రేరితము”                                             

ముందుకి సాగుచున్న బసవడి మదిలో ఆలోచనలు సుడులు తిరుగుచుండెను. “తల్లి తండ్రులతో పోయి కలిసి నప్పుడు కుదిరదు పొమ్మన్నది ఇప్పుడేది దారి” యని యోచించి తికమక పడుచూ మొదట మదన గోపాలుని ఆలయమునకేగి ఆ స్వామి దర్శనము జేసుకొని “పార్వతిని బడయు మార్గము చూపమ” ని వేడఎదో శక్తి పుట్టి నేరుగా పార్వతి ఇంటికి పోయెను. కానీ నేరుగా లోపలికి పోక ప్రాంగణ మందున్నమొక్కల చాటున నక్కి పిల్లివలె మెల్లగా కదులు కిటికీ వద్ద నక్క వలె నక్కి వినుచుండెను. ఇంతలో పార్వతి ఏడుపు వినిపించెను. తలయెత్తి కిటికీ నుండి లోపలి చూచెను

విశాలమైన గదియందు పార్వతి, చంద్రమతి, అరుణతార, ఆమె ప్రక్కన తుమ్మ మొద్దువలెనున్న ఒక పురుషుడు కనిపించగా అరుణతార ఇచ్చటమిచేయుచుండెనో అనుకొనెను కానీ పరికించి చూడగా చూచుటకు అరుణ తారవలెనున్ననూ  ఈమె అరుణతార కాదు,   పిన్న వయస్కురాలు. కొంత సేపటికి ఆమె చంద్రమతి కూతురు సుకన్యఅని, ఆమె ప్రక్కనున్న వ్యక్తి చంద్రమతి అల్లుడు చక్రవంతుడు అని, వారు అమెరికానుండి వచ్చినారని అర్థమయ్యెను. 

చక్రవంతుడు : పార్వతి , నీవు బసవని మరచిపోవలెను 

చంద్రమతి : ఇంకాతని ఊసేంతమాత్రము ఎత్తవలదు 

సుకన్య :  అతడిని మార్చుటయే కాక గౌడను వివాహమాడవలెను. 

పార్వతి :  అందరిముందు బసవని కిచ్చిచేయుట కొప్పుకొని ఇప్పుడు వలదనుచున్నావు . నేనతడినే చేసికొందును. 

చక్రవంతుడు :   పార్వతి!  మూర్ఖము వహించవలదు. పర్యావశానములూహించిన ఇట్లు మాట్లాడవు. నీ పై కట్ట గౌడ మనసు పడెను.  వాడికి తరగని ఆస్తి ఉన్నది. నిన్ను పువ్వులలో పెట్టుకొని చూచుకొనును. వాడిని కాదన్నచో కోట్ల  విలువ చేయు మా  పొలములు మాకు దక్కనివ్వడు. అది తెలిసికొని మాట్లాడవలెను. 

డబ్బు  కొరకు నామనసును ఎట్లు  చంపుకొందును ?

కోట్లనిన  ఖాతరు లేకుండెను చూడెట్లు మాట్లాడుచున్నదో. అని చక్రవంతుడు సుకన్యతో అనగా సుకన్య పార్వతినొక్క బుగ్గ పోటుపొడిచెను. అది చూచి బసవడి  ప్రాణము విలవిల లాడెను. " ఒరేయ్ జాంబవంతుని వలె నున్నావు  నీవు చక్రవంతుడివి కాదురా, జాంబవంతుడివి, అల్పబుద్ధి." అని బసవడు తన మనసులో అనుకొనెను.

పార్వతి: ఆ పొలములు మా అమ్మ చారుమతి ఆస్తి అవి మా పొలములు   

చంద్రమతి పార్వతినురిమి చూచి. “డబ్బు అన్నచో లేక లేకుండెను, డబ్బుకొరకు మనసును చంపుకోకున్న, ఆ గౌడ మనుషులను చంపును. భాగవతార్ నేమిజేసినాడో ఎరుగవా? బసవని చేసుకొన్న అందరికి ముప్పువాటిల్లును” అనెను.

ఇంతలో సుకన్య  " చక్రీ , కిటివద్ద ఎవడో  తచ్చాడుచున్నాడు " అని తెలపగా  చక్రి బిగ్గరగా కేకలు వేయసాగెను. పార్వతి కూడా బసవని చూచి " వీరు మూర్ఖులు  నీవు పారిపొమ్ము " అనెను. కానీ బసవడు లోపలిప్రవేశించి  " నేనంతయూ వింటిని " అని చంద్రమతితో పలికెను.  అప్పుడు చంద్రమతి " అంతయూ వింటివి కదా , మరొక సారి ఈ ఛాయలకు  రావలదు అని హెచ్చరించెను. బసవడు ఊరుకొనువాడు కాదు , మాటకు మాట జెప్పెను. చక్రి రెచ్చెను. బసవని రెండు గుద్దులు గుద్దెను పిమ్మట  "మూడవగుడ్డు గుద్దినచో నేలకొరిగె దవు.  పొమ్ము" అనెను. 

బసవడు ఓర్చుకొని నిలబడి చక్రిని ఒక్క గుద్దు గుద్దగా అతడు నెలకొరిగెను. " మీరు పార్వతిని హింసించుచున్నారని బలవంతపు పెళ్ళికి పాల్పడుచున్నారని నేను పోలీసులకు తెలిపెదను. అని పార్వతికి "నీవు ధైర్యముగా నుండుమ"ని జెప్పి వెడలిపోవుచుండెను.   సుకన్య చక్రిని లేవనెత్తెను.  పోలీసులకు తెలిపిననూ  గౌడకేమీ కాదురా.   నేను గౌడకు తెలిపినచో   నీవీ వూరు దాటగలవేమో చూడుము. అని గౌడకు దూరవాణి యందు విషయమునెఱిగించి  "క్షేమమముగా  నీ వీ వూరు దాటి  నాకు ఫోను చేసిన నేను నీవున్నచోటు కి  పిల్లని తెచ్చి నీకప్పగింతు"ననెను.  

                                                                      ***
బసవడు మరల ఆలయమునకు పోయి చాలాసేపు అక్కడ కూర్చొనెను.  ఇంతలో చీకటి పడెను. బసవడు గోపాలుని ప్రార్ధించి బస్సెక్కుటకు పోవుచుండగా రౌడీలవలె నున్న ఇద్దరు వ్యక్తులు అతడిననుసరించు చుండిరి . బసవడది గమనించిననూ గమనించనట్లు ముందుకు సాగు చుండెను. గులకరాళ్ల బాటపై అతడి బూట్లు చప్పుడు తప్ప ఏమీ వినరాకుండెను. అతడి అడుగుల లయయందే వారు అడుగులు వేయుచున్నారు. వారు గౌడసోదరులని అతడి మనసు దృఢముగా చెప్పుచున్నది. బసవడు ఆగెను. వెంక అడుగుల చప్పుడు ఆగినది. బసవడు తన సంచి నుండి ఒక పెద్ద వత్తిగల  శక్తి వంతమైన  దీపావళి బాంబును, సిగరెట్టును ఒకేసారి వెలిగించి వెనుక కొన్ని అడుగుల దూరములోనున్న గౌడసోదరులపై విసిరెను. ఆపేలుడుకి వారి కళ్ళు బైరులు క్రమ్మి ప్రక్కనున్న నీటి గుంటలో పడిరి. బసవడు ముందుకి సాగిపోయెను.

                                                                     ***

అగస్త్యుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచెను. "ఇదంతయూ స్వప్నమా?" ఇంకనూ నిజమనుకొంటిని. అయిననూ తెల్లవారుఝామున వచ్చు కళలు నిజమగునని ఒక నమ్మకము కలదు అనుకోని బసవడికి దూరవాణి కలిపెను. బసవడికి విషమునెఱిగించగా అతడు " నీవేమి చూచినావో ఖచ్చితముగా  అదే జరిగెను. ఏమి జరిగేనా ఖచ్చితముగా అదియే చూచితివి " అని చెప్పగా బసవడు ఖంగు తినెను. 

" నిన్న నీగూర్చి ,  నా సమస్య పరిష్కారము గూర్చి విదిష వద్దకు పోయితిని. నా భవిష్యత్తును తెలిపమని  కన్నీరు పెట్టుకొనగా, నీకే  తెలియును అని మాటఇచ్చి పంపెను. ఇది ఖచ్చితముగా ఆమె పనే అని ఇప్పుడు తెలియుచున్నది. " అనగా బసవడి పై ఉల్కాపాతము కురిసెను. విదిషా విదిషా నాకు నీవే దిక్కని విదిష వద్దకు బయలు దేరెను.  

No comments:

Post a Comment