మధ్యాహ్నం 1.55 గంటలకు మాపుయి, మేఘన ప్రయాణిస్తున్న విమానం లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో దిగింది. ఐజ్వాల్‌కు దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ విమానాశ్రయం చుట్టూ పచ్చని కొండలు పరుచుకుని ఉన్నాయి.
విమానం చక్రాలు రన్‌వేను తాకగానే ప్రయాణికుల్లో కదలిక మొదలైంది. కొందరు అప్పుడే సీట్లలోంచి లేచి నిలబడ్డారు. మాపుయి, మేఘన కూడా తమ సీట్ల పైనున్న లగేజ్ కంపార్ట్మెంట్ నుంచి బ్యాగులు తీసుకున్నారు. అయితే విమానం ఇంకా ఆగలేదు. రన్‌వే దాటి నెమ్మదిగా టాక్సీవేపై సాగుతోంది. మేఘన పక్కనే నిలబడిన మాపుయి తన బ్యాగును భుజానికి తగిలించుకుంటూ చెప్పింది.
“మా అమ్మానాన్నలు ఖావ్జాల్లో ఉంటారు. ఐజ్వాల్ నుంచి దాదాపు నూట యాభై కిలోమీటర్లు. ఖావ్జాల్ వెళ్లే దారిలో ఐజ్వాల్ వస్తుంది. ఐజ్వాల్‌లో మా మామయ్య, అత్తయ్య ఉంటారు. ముందు వాళ్లను కలుద్దాం.”
“సరే,” అంది మేఘన. “నీ ఇష్టం.” మాపుయి కాసేపు ఆలోచించి మళ్లీ చెప్పింది.
“మా మామయ్య బాగా డబ్బున్నవాడు. పెద్ద కాంట్రాక్టర్. మనకు ఏదో ఒక విధంగా సహాయం చేయగలడు.” ఆ మాట విన్న మేఘన తల ఊపింది. ఇప్పటివరకు వాళ్లు ఎదుర్కొన్న సమస్యల మధ్య ‘సహాయం చేయగల మనిషి’ అనే మాటే ఆమెకు కొంత ఊరటనిచ్చింది.
కొద్ది క్షణాల్లో విమానం పూర్తిగా ఆగిపోయింది.
బయట నుంచి మెట్లను విమాన ద్వారానికి అమర్చారు. తలుపు తెరుచుకోగానే చల్లని కొండగాలి లోపలికి పలకరింపుగా వచ్చింది. మాపుయి ముఖంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. ఎన్నాళ్లకో తన నేల మీద అడుగుపెడుతున్న అనుభూతి! మేఘన బ్యాగు భుజాన వేసుకుని ఆమె వెనక నడిచింది. ఇద్దరూ విమానం నుంచి మెట్లు దిగారు.
మాపుయి క్షణం ఆగి చుట్టూ చూసింది. దూరంగా పచ్చని కొండలు ఒకదాని వెనుక మరొకటి ఆకాశంలో కలిసిపోతున్నట్లున్నాయి. మేఘాలు వాటి శిఖరాలను ముద్దాడుతున్నాయి.
మేఘనకు అది కొత్త ప్రపంచం. మాపుయికి మాత్రం— అది తన నేల. తన మూలాలు. తన గతం. కానీ ఈసారి ఆమె ఇంటికి తిరిగి వచ్చింది కేవలం కూతురిగా కాదు.
తనతో పాటు మేఘనను తీసుకొచ్చింది. వాళ్లిద్దరి ముందు ఇప్పుడు ఖావ్జాల్కు దారి ఉంది. ఆ దారిలో ఐజ్వాల్ ఉంది. ఐజ్వాల్‌లో మాపుయి మామయ్య ఉన్నాడు. ఆ మామయ్య చేయబోయే సహాయం వారి ప్రయాణాన్ని ఏ మలుపు తిప్పబోతోందో అప్పటికి వారిద్దరికీ తెలియదు.
“ఈ విమానాశ్రయానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది,” అంది మాపుయి.
“ఏమిటది?”
“రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన విమానాశ్రయం అంటారు.”
“వింతగా ఉందే!” అంది మేఘన చుట్టూ చూస్తూ. ఆ తర్వాత మాపుయి చేతిని పట్టుకుని నవ్వింది. “నువ్వు లేకపోతే ఇక్కడ నేను పరాయిదానిలా ఉండేదాన్ని. మంద నుంచి తప్పిపోయిన గొర్రెపిల్లలా!”
ఇద్దరూ మెట్ల మీదుగా కిందికి దిగారు.
“ఇక్కడి నుంచి ఐజాల్‌కి ఎలా వెళ్తాం?” అడిగింది మేఘన.
“టాక్సీలు ఉంటాయి. భయపడకు.”
కానీ విమానాశ్రయం బయటకు వచ్చేసరికి ఒక్క టాక్సీ కూడా కనిపించలేదు.
మేఘన ఆశ్చర్యంగా మాపుయి వైపు చూసింది.
“టాక్సీలు ఉంటాయన్నావు. ఒక్కటీ కనిపించడం లేదే!”
“ఐజాల్ నుంచి ఏదైనా టాక్సీ తిరిగి వచ్చేవరకు ఎదురు చూడాలి.”
విమానాశ్రయం ఆవరణలోని పూలతోట దగ్గర ఇద్దరూ కూర్చున్నారు. చుట్టూ కొండగాలి. పూల మొక్కలు మెల్లగా ఊగుతున్నాయి. దూరంగా పచ్చని కొండలు ఆకాశంతో కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి.
మేఘన ప్రయాణ లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టింది.
“మాపుయి! మన విమాన ప్రయాణం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు పట్టింది కదా?”
“అవును.”
“ఇందులో తమాషా చూడు. ఐజాల్‌కి విమాన టికెట్ మూడు వేల ఏడు వందలు. టాక్సీ ప్రయాణం మూడు వేల ఎనిమిది వందలు! అలాంటప్పుడు ఎవరు టాక్సీలో వస్తారు?”
మాపుయి నవ్వింది.
“నీ లెక్కలో చిన్న తప్పుంది. విమానంలో మూడు వేల ఏడు వందలు ఒక్కొక్కరికి. టాక్సీలో నలుగురు ప్రయాణించవచ్చు. నలుగురికీ కలిపి మూడు వేల ఎనిమిది వందలు.”
మేఘన నుదుటి మీద చేయి కొట్టుకుంది.
“ఓహ్! యా! అది మర్చిపోయాను.”
కొద్దిసేపటికి ఒక పాత మారుతి 800 టాక్సీ వచ్చింది.
మాపుయి వెంటనే లేచి డ్రైవర్‌ను పిలిచింది. అతనితో వేగంగా ఏదో భాషలో మాట్లాడింది. ధర మాట్లాడుకుని ఇద్దరూ కారులో కూర్చున్నారు.
“ఏ భాషలో మాట్లాడావు?” అడిగింది మేఘన.
“మిజో.”
“మిజో భాషా?”
“అవును. ఇప్పుడు మిజోను లాటిన్ లిపిలో రాస్తారు.”
“ఓహ్! అంటే దక్షిణ భారతదేశంలోని తుళు లాగా ప్రత్యేకంగా విస్తృతంగా వాడే సొంత లిపి లేకుండా మరో లిపిని ఉపయోగిస్తున్నారన్నమాట.”
కారు ముందుకు కదిలింది.
నల్లని సన్నని తారు రోడ్డు కొండల మధ్య పాములా మెలికలు తిరుగుతోంది. రోడ్డుకు ఇరువైపులా ఎత్తైన పచ్చని కొండలు. కొండల మీద చెట్లు ఒకదానికొకటి భుజాలు కలిపి నిలబడిన సైనికుల్లా కనిపిస్తున్నాయి.
మేఘన కారు కిటికీకి ముఖం ఆనించి బయటకు చూస్తోంది.
కొంతసేపటికి కారు ఒక అందమైన సస్పెన్షన్ బ్రిడ్జిని దాటింది. కింద నది ప్రవహిస్తోంది. ఆ వంతెనను చూస్తుంటే ఏదో సినిమాలో చూసిన దృశ్యం గుర్తుకు వస్తోంది.
“ఎంత అందంగా ఉంది!” అంది మేఘన.
“కింద ప్రవహిస్తున్నది త్లావంగ్ నది,” అంది మాపుయి. “మిజోరాంలో ముఖ్యమైన నదుల్లో ఒకటి. దాదాపు నూట ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది.”
“అయితే అతి పొడవైన నది ఏది?”
“బరాక్.”
మేఘన ఆసక్తిగా ఆమె వైపు తిరిగింది.
“బరాక్ నది చాలా పొడవైనది. మణిపూర్, నాగాలాండ్, మిజోరాం, అస్సాం ప్రాంతాలతో సంబంధం ఉన్న గొప్ప నదీ వ్యవస్థ. చివరకు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ సుర్మా వంటి పేర్లతో ప్రవహిస్తూ బంగాళాఖాతానికి చేరుతుంది.”
“అచ్చం గంగానదిలాగే!” అంది మేఘన. “మన గంగ బంగ్లాదేశ్‌లోకి వెళ్లాక పద్మ అని పిలుస్తారు కదా!” “అవును.” ఆ తర్వాత కొంతసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
మేఘన కిటికీ బయట ప్రపంచంలో మునిగిపోయింది. ఎత్తైన పచ్చని చెట్లు...
దూరంగా ఒకదాని వెనుక మరొకటి నిలిచిన కొండశ్రేణులు... కొండల మధ్య మెరుస్తున్న నీటి మడుగులు... లోయల మీద తేలుతున్న పలుచని మేఘాలు...మిజోరాం అద్భుతంగా ఉంది మాపుయి!” అంది చివరకు. “ఇంత అందంగా ఉంటుందని ఊహించలేదు.”
మాపుయి ముఖంలో తన నేల గురించి చెప్పుకునే ఆనందం కనిపించింది.
“మిజోరాం అంటే కొండల దేశం. కొండలు, లోయలు, నదులు, సరస్సులు... ఎక్కడ చూసినా ప్రకృతే. ఎన్నో కొండశ్రేణులు రాష్ట్రం పొడవునా విస్తరించి ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న మైదానాలు కనిపిస్తాయి. సరస్సులు ఉన్నాయి. జలపాతాలు ఉన్నాయి.”
మేఘన కళ్ళు మాత్రం బయటే ఉన్నాయి.
“మన దక్షిణ భారతదేశంలో చాలామందికి మిజోరాం గురించి చాలా తక్కువ తెలుసు,” అంది. “నాకే ఇంతవరకు ఏమీ తెలియదు. భాషా పాఠ్యపుస్తకాల్లో మిజోరాం మీద ఒక మంచి పాఠం ఉంటే ఎంత బాగుంటుంది! పిల్లలు దేశాన్ని మ్యాప్‌లో మాత్రమే కాదు, మనుషుల ద్వారా, ప్రకృతి ద్వారా కూడా తెలుసుకోవాలి.”
మాపుయి ఆమె మాటలకు సంతోషంగా నవ్వింది. ఇంతలో కారు ఒక సొరంగంలోకి ప్రవేశించింది.
ఒక్కసారిగా వెలుతురు మాయమైంది. కారు హెడ్లైట్ల కాంతి మాత్రమే చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది. మాపుయి ముఖంలో క్షణకాలం ఏదో చిన్ననాటి భయం మెరిసింది.
సొరంగం దాటి వెలుతురులోకి వచ్చిన తర్వాత ఆమె ఊపిరి పీల్చుకుంది.
“నాకు ఇప్పటికీ టన్నెల్లంటే కొంచెం భయం,” అంది. “చిన్నప్పుడు టన్నెల్లోకి రైలు వెళ్లగానే ఏడ్చేదాన్ని.” మేఘన ఆమె వైపు చూసింది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు.
తర్వాత మెల్లగా అంది— “చూశావా మాపుయి... కారు చీకటి సొరంగం నుంచి బయటకు వచ్చింది.”
“అయితే?” “అలాగే నీ జీవితం కూడా ఆ చీకటి పెళ్లి నుంచి బయటకు వస్తుంది.”
మాపుయి ముఖంలోని చిరునవ్వు మాయమైంది. మేఘన ఆమె చేతిని పట్టుకుంది.
“నీకు స్వేచ్ఛ రావడానికి ఏ సంప్రదాయం అడ్డొచ్చినా ఎదుర్కొందాం. అవసరమైతే పెళ్లికొడుకు తండ్రికి ఇవ్వాల్సిన bride price కూడా నేనే ఇస్తాను. నీకు విడాకులు ఇప్పిస్తాను.” మాపుయి ఏమీ మాట్లాడలేదు. కారు మాత్రం కొండల మధ్య ముందుకు సాగుతూనే ఉంది.
చివరకు వారు ఐజాల్లోని జార్కావ్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. లాల్బువాయా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కారు ఆగింది. టాక్సీ దిగుతూ మాపుయి అంది— “మా అంకుల్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో నాకు సరిగ్గా తెలియదు.” మేఘన ఆశ్చర్యంగా చూసింది.m“అదేంటి?”
“ఆయన ఒకచోట స్థిరంగా ఉండడు. పనుల కోసం తిరుగుతూనే ఉంటాడు. కానీ మా ఆంటీ రెమీ మాత్రం ఇక్కడే ఉంటుంది.” “ఆమె ఏం చేస్తుంది?”
“బ్యూటీషియన్. ఆమె పార్లర్‌కి వెళ్దాం. అక్కడ ఉంటే మనల్ని ఇంటికి తీసుకెళ్తుంది.”
ఇద్దరూ దివా బ్యూటీ పార్లర్‌లోకి అడుగుపెట్టారు.
లోపల ఒక మహిళకు ఫేషియల్ చేస్తోంది రెమీ.
మాపుయిని చూడగానే ఆమె చేతులు ఆగిపోయాయి.
“మాపుయి!” ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆనందం ఒకేసారి మెరిశాయి.
ఇద్దరూ వేగంగా మిజో భాషలో మాట్లాడుకున్నారు. మేఘనకు ఒక్క మాట కూడా అర్థం కాలేదు. కాసేపటి తర్వాత మాపుయి ఆమెను ముందుకు తీసుకొచ్చింది.
“ఇది మేఘన. నా స్నేహితురాలు.” రెమీ చిరునవ్వుతో పలకరించింది.
పార్లర్లో అప్పటికి ఒక్క మహిళా కస్టమర్ మాత్రమే ఉంది.
రెమీ వెంటనే తన అసిస్టెంట్‌ను పిలిచి ఏదో చెప్పింది.
ఆ అమ్మాయి బయటకు వెళ్లి— పార్లర్ తలుపుకు బయట నుంచి తాళం వేసింది.
మేఘన కళ్ళు పెద్దవయ్యాయి. “ఏం చేస్తోంది?”
మాపుయి ఆమె చెవి దగ్గరకు వంగి గుసగుసలాడింది.
“మరో కస్టమర్ లోపలికి రాకుండా బయట నుంచి తాళం వేయించింది.”
మేఘన నవ్వు ఆపుకోలేకపోయింది. “మీ ఆంటీకి డెడ్లీ ఇంటెలిజెన్స్ ఉంది!”
మాపుయి కూడా నవ్వింది. రెమీ మాత్రం ఏమీ జరగనట్టే ప్రశాంతంగా తన కస్టమర్ ఫేషియల్‌ను వేగంగా పూర్తి చేసింది. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి అసిస్టెంట్‌ను మళ్లీ పిలిచింది.
తలుపు తెరుచుకుంది. కస్టమర్ బయటకు వెళ్లింది. అసిస్టెంట్‌ను కూడా ఇంటికి పంపించింది రెమీ. తలుపు మళ్లీ మూసుకుంది. ఇప్పుడు పార్లర్లో ముగ్గురే— రెమీ, మాపుయి, మేఘన.
రెమీ ముఖంలోని ఆనందం క్రమంగా గంభీరతగా మారింది.
మాపుయి ఇంత అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి ఐజాల్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలన్న ప్రశ్న ఆమె కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. మాపుయి కూడా అది గమనించింది. కొండల మధ్య సాగిన ప్రయాణం ముగిసింది. కానీ ఆమె జీవితంలోని అసలు ప్రయాణం ఇప్పుడు మొదలుకాబోతోంది
కొండల మధ్య ఒదిగిపోయిన ఆ ప్రాంతంలో సాయంత్రం వేగంగా దిగిపోతోంది. ఇళ్ల కిటికీల్లో ఒక్కొక్కటిగా దీపాలు వెలుగుతున్నాయి. చల్లని గాలి కొండవాలుల్లోంచి జారుకుంటూ వస్తోంది.
“ఈ రాత్రికి ఎక్కడికీ వెళ్లకండి. ఇక్కడే ఉండండి. రేపు ఉదయాన్నే ఖావ్జాల్ బయలుదేరుదురు గాని,” అంది రెమీ ఆప్యాయంగా.
మేఘన, మాపుయి ఒకరినొకరు చూసుకున్నారు.
రెమీ అప్పటికే వంటగదిలోకి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికే వంటగదిలో పాత్రల చప్పుడు మొదలైంది. మధ్యమధ్యలో రెమీ గొంతు వినిపిస్తోంది. ఆమె పాత మిజో పాటలు పాడుకుంటూ వంట చేస్తోంది. ఆ పాటల అర్థం మేఘనకు తెలియదు. కానీ వాటి స్వరంలో కొండల నిశ్శబ్దం, అడవుల జ్ఞాపకాలు, ఏదో తెలియని విషాదం కలిసినట్లు అనిపించింది.
“మీరిద్దరూ వెళ్లి స్నానం చేసి రండి. తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం,” వంటగదిలోంచే అరిచింది రెమీ.
స్నానం చేసి వచ్చిన మేఘన చీర కట్టుకుంది. మాపుయి సంప్రదాయ మిజో వస్త్రం ‘పువాన్’ ధరించింది. రెమీ మాత్రం సౌకర్యంగా ఒక మ్యాక్సీ వేసుకుంది.
భోజనాల బల్లమీద తెల్లని పింగాణీ పళ్లాలు, గిన్నెలు అమర్చింది రెమీ. వేడివేడి వంటకాల నుంచి ఆవిరి పైకి లేస్తోంది.
“మిజోలు ఎక్కువగా మాంసాహారులు,” అంది రెమీ. “చేపలు, చికెన్, పంది మాంసం, రొయ్యలు—అన్నీ తింటాం. కానీ నీ కోసం కొన్ని ప్రత్యేకంగా చేశాను.”
ఒక్కొక్క వంటకాన్ని చూపిస్తూ చెప్పింది.
“ఇది వెదురు మొగ్గల వేపుడు. ఇది ‘చుమ్ చుమ్ హాన్’—ఆవిరితో ఉడికించిన కూరగాయల మిశ్రమం. ఇది రొయ్యల వేపుడు.”
తర్వాత మేఘన వైపు చూసింది.
“మేఘనా, నువ్వు నాన్‌వెజ్ తింటావా?”
“లేదు ఆంటీ. నేను తినను.”
“అందుకే నీ కోసం కూరగాయలు ఎక్కువగా చేశాను.”
భోజనం పూర్తయ్యేసరికి మేఘన ముఖంలో తృప్తి కనిపించింది.
“నిజంగా చాలా రుచిగా ఉంది ఆంటీ!”
రెమీ నవ్వింది.
అంతలో మాపుయి పడకగదిలోకి వెళ్లి ఒక గిటార్ తీసుకొచ్చింది. దాన్ని తన అత్త చేతిలో పెట్టింది.
రెమీ గిటార్ అందుకుంటూ మేఘన వైపు చూసింది.
“తెలుసా? ‘మేఘనా’ అనేది ఇక్కడ ఒక నది పేరు కూడా.”
“నిజమా?”
మేఘన ఆశ్చర్యపోయింది.
“అవును!”
అంటూ రెమీ గిటార్ తీగలను మీటింది.
ఆమె వేళ్ల కింద స్వరాలు ఒక్కొక్కటిగా ప్రాణం పోసుకున్నాయి. మాపుయి ఆనందంగా వింటోంది. మేఘనకు రెమీ మరో కొత్త వ్యక్తిలా కనిపించింది—చలాకీగా మాట్లాడే గృహిణి మాత్రమే కాదు, సంగీతాన్ని ప్రేమించే గిటారిస్ట్ కూడా.
పాట ముగిసిన తర్వాత మేఘన గోడమీద ఉన్న ఒక పురుషుడి ఫొటోను గమనించింది.
“ఆంటీ... అంకుల్ ఎక్కడ?”
రెమీ గిటార్ తీగల మీద వేళ్లు ఆపి, ఆ ఫొటో వైపు చూపించింది.
“అదిగో! ఆయనే డైరియల్లోవా.”
“ఇంటికి ఎప్పుడు వస్తారు?”
రెమీ పెదవుల మీద కొంటె నవ్వు మెరిసింది.
“ఇంట్లోనే ఉన్నాడు.”
మేఘన చుట్టూ చూసింది.
“ఎక్కడ?”
“ఇంకో ఇంట్లో!”
అని రెమీ గట్టిగా నవ్వింది.
మేఘనకు అర్థం కాలేదు.
మాపుయి మాత్రం తల వంచుకుని చిరునవ్వు నవ్వింది.
కొద్దిసేపటి తర్వాత రెమీ నవ్వు ఆపి చెప్పింది.
“నేను ఆయన నాలుగో భార్యను.”
మేఘన ముఖం ఒక్కసారిగా మారిపోయింది.
“నాలుగో భార్యా!”
ఆమె నమ్మలేనట్లు రెమీ ముఖంలోకి చూసింది.
“మరి... అప్పటికే ముగ్గురు భార్యలు ఉన్న వ్యక్తిని మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు?”
రెమీ మళ్లీ నవ్వింది. కానీ ఈసారి ఆ నవ్వులో మొదటిలా చలాకీతనం మాత్రమే లేదు. దాని వెనుక చెప్పలేని జీవితం దాగి ఉన్నట్లు మేఘనకు అనిపించింది.
“మేఘనా... మనుషుల జీవితాలను మనం బయటినుంచి చూసి లెక్కలు వేస్తాం. కానీ లోపలికి వెళ్లాక ఆ లెక్కలు అంత సులభంగా ఉండవు.”
మేఘన మౌనంగా ఉండిపోయింది.
రెమీ నెమ్మదిగా మిజో సమాజపు పాత ఆచారాల గురించి చెప్పడం మొదలుపెట్టింది. కొండ ప్రాంతాల ప్రజలను బ్రిటిష్ కాలపు రచనల్లో కుకీలు, కుకీ-చిన్ తెగల వంటి విభిన్న పేర్లతో పేర్కొన్నారని, శతాబ్దాలుగా వివాహం, కుటుంబం, ఆస్తి వంటి విషయాల్లో ఎన్నో సంప్రదాయాలు కొనసాగాయని వివరించింది.
“పాత సమాజాల్లో పురుషుడి మాటకే ఎక్కువ విలువ ఉండేది. స్త్రీకి వివాహం తర్వాత కూడా ఆస్తిపై స్వతంత్ర హక్కు చాలా పరిమితంగా ఉండేది. పెళ్లి సమయంలో వచ్చిన వస్తువుల విషయంలో కూడా పాత సంప్రదాయాల ప్రభావం ఉండేది. విడాకుల విషయంలోనూ స్త్రీ స్థానం బలహీనంగానే ఉండేది,” అంది రెమీ.
మేఘన శ్రద్ధగా వింటోంది.
“అయితే ఇప్పుడు పరిస్థితి మారలేదా?”
“చట్టాలు మారాయి. సమాజం కూడా మారుతోంది,” అంది రెమీ. “వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో సంస్కరణల కోసం ఎన్నో సంవత్సరాలు చర్చలు జరిగాయి. కొత్త చట్టాలు వచ్చాయి.”
“అది మంచిదే!” అంది మేఘన. “పాత సంప్రదాయంలో అన్యాయం ఉంటే కొత్త చట్టం దాన్ని సరిచేయాలి.”
రెమీ చిన్నగా నవ్వింది.
“చట్టం మార్చడం సులభం మేఘనా. మనిషి మనసు మార్చడం అంత సులభం కాదు.”
ఆ మాటతో గదిలో క్షణం నిశ్శబ్దం నెలకొంది.
గిటార్ ఆమె ఒడిలోనే ఉంది.
రెమీ మళ్లీ తీగను మెల్లగా మీటింది.
“ప్రేమ, వివాహం, కుటుంబం—వీటి రూపాలు కాలంతో మారుతుంటాయి. ఒకప్పుడు సమాజం సహజంగా అంగీకరించిన కొన్ని విషయాలను తర్వాతి తరాలు తిరస్కరిస్తాయి. ఒకప్పుడు నేరంగా చూసిన కొన్ని సంబంధాల గురించి తర్వాత సమాజమే తిరిగి ఆలోచిస్తుంది. చట్టం ముందుకు వెళ్లొచ్చు; సమాజం వెనకే ఉండొచ్చు. కొన్నిసార్లు సమాజం ముందుకు వెళ్తుంది; చట్టం వెనకబడిపోతుంది.”
మేఘన ఆలోచనలో పడింది.
“అయితే బహుభార్యత్వం?”
రెమీ కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పింది.
“అది మిజో సమాజానికే చెందిన కథ కాదు. ప్రపంచ చరిత్రలో ఎన్నో సమాజాల్లో అది కనిపిస్తుంది. ముఖ్యంగా సంపద, అధికారం ఉన్న పురుషుల జీవితాల్లో.”
మేఘనకు ఆ రాత్రి రెమీ ఒక విచిత్రమైన పుస్తకంలా అనిపించింది. ప్రతి పేజీ తిప్పినప్పుడూ కొత్త విషయం బయటపడుతోంది.
రాత్రి బాగా పొద్దుపోయింది.
ముగ్గురూ నిద్రకు ఉపక్రమించారు.
మరుసటి ఉదయం మాపుయి స్వగ్రామమైన ఖావ్జాల్ బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ఇంటి ముందు ఒక వ్యక్తి కనిపించాడు.
“అంకుల్!” అంది మాపుయి.
మేఘన వెంటనే గుర్తుపట్టింది.
గోడమీద ఫొటోలో చూసిన డైరియల్లోవా!
అతను లోపలికి వచ్చి వారితో కొద్దిసేపు మాట్లాడాడు. మాపుయి సమస్య అంతా విన్న తర్వాత పెద్దగా సిద్ధాంతాలు చెప్పలేదు. చాలా సాధారణంగా, చాలా ఆచరణాత్మకంగా ఒక మాట అన్నాడు.
“మీరు మాపుయి తండ్రిని ఒప్పించాలనుకుంటున్నారు కదా?”
“అవును,” అంది మేఘన.
“అయితే అతను తీసుకున్న వధువు మూల్యానికి పది రెట్లు ఇవ్వండి. అవసరమైతే ఇరవై రెట్లు ఇవ్వండి.”
మేఘన కళ్లు పెద్దవయ్యాయి.
“ఏమిటీ!”
డైరియల్లోవా నవ్వాడు.
“డబ్బు మిజోరాంలోనూ పనిచేస్తుంది. ప్రపంచంలో మిగతా చోట్ల పనిచేసినట్టే.”
“కానీ పది రెట్లు... ఇరవై రెట్లు అంటే?”
“భయపడకు. సంప్రదాయ వధువు మూల్యం లక్షల్లో ఉండదు. సాధారణంగా చిన్న మొత్తాలే. మాపుయి తండ్రి పది వేల రూపాయలు తీసుకుని ఉంటాడు... అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు.”
మేఘన అతని ముఖంలోకి చూస్తూ నిలబడిపోయింది.
ఇంత క్లిష్టమైన సమస్యకు అతను చెప్పిన పరిష్కారం ఆమెకు మొదట పిచ్చి ఆలోచనలా అనిపించింది.
కానీ...
మనిషిని సంప్రదాయం బంధిస్తే, ఆ సంప్రదాయానికి అతనే పెట్టుకున్న ధర చెల్లించి ఆ బంధాన్ని తెంచగలమా?
ఆ ప్రశ్న ఆమె మనసులో తిరుగుతూనే ఉంది.
రెమీని ఆప్యాయంగా కౌగిలించుకుని మేఘన వీడ్కోలు చెప్పింది.
“థాంక్యూ, ఆంటీ.”
“మళ్లీ రావాలి,” అంది రెమీ.
మాపుయి తన అత్తను హత్తుకుంది.
మేఘన డైరియల్లోవా వైపు తిరిగింది.
“థాంక్యూ, అంకుల్. మీ సలహా విచిత్రంగా ఉంది... కానీ ఉపయోగపడుతుందేమో!”
డైరియల్లోవా నవ్వాడు.
“కొండల్లో దారి ఎప్పుడూ నేరుగా ఉండదు. గమ్యం చేరాలంటే మలుపులు తిరగాల్సిందే.”
ఆ మాట మేఘనకు నచ్చింది.
కొద్దిసేపటికి మేఘన, మాపుయి ఖావ్జాల్ వైపు బయలుదేరారు.
వాహనం కొండదారిలో ముందుకు సాగుతోంది.
ఒకవైపు లోతైన లోయలు. మరోవైపు ఆకాశాన్ని తాకుతున్న పచ్చని కొండలు.
మేఘన మాత్రం బయట ప్రకృతిని చూడడం లేదు.
ఆమె మనసులో ఒక్కటే తిరుగుతోంది—
పది వేలకు అమ్ముడైన ఒక నిర్ణయాన్ని... లక్ష రూపాయలతో తిరిగి కొనగలమా?
***
The taxi stand is at Dawrpui which is just one kilometer to Mc Donald hills. Mapuii and Meghana went on walk. In every street there is a church. At barabazar they saw several Maruti 800 cars. Maruti cars are common at sight as taxis in Mizoram. said Mapuii. “Churches also” added Meghana
మాపుయి కొండలవైపు చూస్తూ చెప్పడం మొదలుపెట్టింది.
“మన చుట్టుపక్కల ఉన్న చాలా రాష్ట్రాల్లాగే మిజోరాం కూడా బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత భారతదేశంలో భాగమైంది. ఒకప్పుడు ఈ కొండ ప్రాంతాలంటే బయటి ప్రపంచానికి భయం. కొండ తెగల మధ్య యుద్ధాలు, తలలు నరికే ఆచారాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. బ్రిటిష్‌వారు సైనిక బలంతో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత వెల్ష్ మిషనరీలు ఇక్కడికి వచ్చారు. వారి ప్రభావంతో క్రమంగా క్రైస్తవ మతం విస్తరించింది. ఇప్పుడు మిజోరాంలో అత్యధికులు క్రైస్తవులే. అందుకే ఐజాల్లోనే కాదు, మారుమూల కొండ ప్రాంతాల్లో కూడా ఇళ్ల మధ్య నుంచి ఆకాశంవైపు చూస్తున్న చర్చి శిఖరాలు కనిపిస్తాయి.”
చెప్పడం ముగించిన మాపుయి ఒక టాక్సీని పిలిచింది.
డ్రైవర్‌కు వెళ్లాల్సిన చోటు చెప్పగానే అతను తలుపు తెరిచాడు. ఇద్దరూ ఎక్కారు. కొండల మధ్య మెలికలు తిరిగే రహదారిపై కారు నెమ్మదిగా సాగుతోంది.
రెంఫామ్లీ సినిమా దగ్గరికి రాగానే మాపుయి నవ్వుతూ అంది—
“ఇక్కడ మారుతీ కార్లు కనిపించినంత తరచుగా సినిమా థియేటర్లు కనిపించవు.”
మేఘన నవ్వింది.
“ఐజాల్‌లో థియేటర్లు చాలా తక్కువ. రెంఫామ్లీ వాటిలో ముఖ్యమైనది,” అంది మాపుయి.
“అంతేనా?” ఆశ్చర్యంగా అడిగింది మేఘన.
అప్పటివరకు మౌనంగా కారు నడుపుతున్న డ్రైవర్ లాల్తన్హావ్లా వారి మాటల్లో కలిశాడు.
“ఇక్కడి ప్రజలకు ప్రకృతి, పాట, నృత్యం అంటే చాలా ఇష్టం మేడమ్. సినిమా చూడటం ఒక్కటే వినోదం కాదు. ఎక్కడైనా పాట మొదలైతే చాలు, ఇంకొకరు గొంతు కలుపుతారు. నృత్యం మొదలైతే చూస్తున్నవాళ్లు కూడా వచ్చి చేరిపోతారు. సంకోచం చాలా తక్కువ.”
మేఘన ఆసక్తిగా అతని మాటలు విన్నది.
“అంటే ఇంకా ఆధునికత రాలేదన్నమాట!” అంది మాపుయి.
లాల్తన్హావ్లా అద్దంలో ఆమెవైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
“ఆధునికత రాలేదని కాదు. పాశ్చాత్యీకరణ పూర్తిగా మింగేయలేదని చెప్పాలి.”
ఆ మాట మేఘనకు నచ్చింది.
ఆమె కిటికీలోంచి బయటకు చూసింది. కొండలు, లోయలు, మబ్బులు—మనిషి మారుతున్నా నేల తన స్వభావాన్ని ఇంకా కాపాడుకుంటున్నట్టుంది.
ఉదయం పది గంటల సమయంలో వారు ఖావ్జాల్ చేరుకున్నారు.
నవంబరు చలి కొండల మీద నుంచి నేరుగా వచ్చి శరీరాన్ని తాకుతోంది. కారు దిగగానే మేఘన చేతులను ఛాతీకి దగ్గరగా ముడుచుకుంది.
“అబ్బా! ఎంత చలి!”
మాపుయి నవ్వింది.
వారి ముందు వాలుగా ఉన్న తగరపు పైకప్పుతో చిన్న ఇల్లు కనిపించింది. చుట్టూ కొండలు. వాటి ఒడిలో ఒదిగిపోయిన చిన్న పట్టణం. మేఘన చుట్టూ చూసింది. చాలా ఇళ్లకు వాలుగా వేసిన తగరపు పైకప్పులే.
“వర్షం ఎక్కువగా ఉండే కొండ ప్రాంతం కదా. అందుకే ఇలాంటి పైకప్పులు ఎక్కువగా కనిపిస్తాయి,” అంది మాపుయి.
టాక్సీ డ్రైవర్‌ను అక్కడే వేచి ఉండమని చెప్పి ఇంటివైపు నడిచింది.
తలుపు దగ్గరకు చేరకముందే లోపలి నుంచి ఒక స్త్రీ, ఒక వృద్ధుడు బయటకు వచ్చారు.
మాపుయిని చూడగానే వారి ముఖాలు వెలిగిపోయాయి.
“మా!”
మాపుయి పరుగెత్తి తల్లిని కౌగిలించుకుంది. తర్వాత తండ్రిని హత్తుకుంది.
ఎన్నాళ్లకో ఇంటికి వచ్చిన కూతురిని చూసిన ఆనందం ఆ ఇద్దరి కళ్లలో కనిపించింది.
మేఘన కొంచెం దూరంగా నిలబడి ఆ దృశ్యాన్ని చూస్తోంది.
మాపుయి ఆమెను దగ్గరకు తీసుకొచ్చింది.
ఇంట్లోకి అడుగుపెట్టగానే మేఘన ఆశ్చర్యపోయింది. ఇల్లు పెద్దది కాదు. కానీ ప్రతి మూలలోనూ ఒక కళాత్మకమైన శ్రద్ధ కనిపిస్తోంది. వెదురుతో చేసిన కుర్చీలు, బల్లలు, చిన్న అలంకరణ వస్తువులు—ఇంటికి ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చాయి.
మేఘన వెదురు కుర్చీలో కూర్చుని దాని చేతివేళ్లపై చెయ్యి వేసింది.
“పర్ఫెక్ట్! ఎంత అందంగా ఉంది!”
“ఈ ఫర్నిచర్ అంతా మా నాన్నే చేశాడు,” గర్వంగా చెప్పింది మాపుయి.
మేఘన వెంటనే ఆయనవైపు తిరిగింది.
“వండర్ఫుల్, అంకుల్! మీ పేరేమిటి?”
మాపుయి నవ్వింది.
“ఆయన రైతు. ఇంగ్లీష్ రాదు.”
అది విన్న తండ్రి వెంటనే అభ్యంతరం చెప్పినట్టు చెయ్యెత్తాడు.
“ఐ... లిటిల్... లిటిల్ ఇంగ్లీష్!”
మేఘన నవ్వింది.
ఆయన తన ఛాతీ మీద చెయ్యి పెట్టుకుని గర్వంగా అన్నాడు—
“నేమ్... లాల్డెంగా!”
అంతటితో ఆగలేదు. వంటగదిలో ఉన్న భార్య దగ్గరకు వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చాడు.
ఆమెవైపు చూపిస్తూ—
“నేమ్... లాలి!”
అన్నాడు.
మేఘన పగలబడి నవ్వింది. మాపుయి కూడా నవ్వకుండా ఉండలేకపోయింది.
లాలి మాత్రం సిగ్గుగా నవ్వి మళ్లీ వంటగదిలోకి వెళ్లిపోయింది.
కొద్దిసేపటికి లాలి వేడివేడిగా ఆహారం తీసుకొచ్చింది. అన్నంతో చేసిన స్థానిక వంటకం, ఆకుకూరలు, మూలికలతో చేసిన చట్నీలు—మేఘనకు అన్నీ కొత్తగానే కనిపించాయి.
టాక్సీ డ్రైవర్‌ను కూడా లోపలికి పిలిచింది లాలి.
“అతనికీ పెడుతున్నారా?” ఆశ్చర్యంగా అడిగింది మేఘన.
“మనతో ఇంత దూరం వచ్చాడు కదా,” అంది మాపుయి సాధారణంగా.
అందరూ తింటున్నారు.
లాలి మాత్రం నిలబడి వారికి వడ్డిస్తోంది.
మేఘన చూపు మళ్లీ గోడల మీదున్న వెదురు అలంకరణలపై పడింది.
“ఇంటి అలంకరణ చాలా అందంగా ఉంది.”
“ఆ చెక్కడాలన్నీ మా అమ్మ చేసినవే. వెదురు పనిలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది.”
మేఘన లాలివైపు కొత్త గౌరవంతో చూసింది.
ఇంత చిన్న ఇంట్లో ఎంత కళ ఉంది!
కానీ ఆమె ఇక్కడికి వచ్చింది ఆ కళను చూడటానికి కాదు.
చెప్పాల్సిన విషయం గుర్తుకు రాగానే ఆమె ముఖంలోని ఆనందం మాయమైంది.
“మాపుయి... ఇప్పుడు చెప్పాలి.”
మాపుయి ముఖం పాలిపోయింది.
తల్లిదండ్రులవైపు చూసింది.
నోరు తెరవలేదు.
“నువ్వే చెప్పు,” అంది మేఘన.
మాపుయి తల అడ్డంగా ఊపింది.
తండ్రి ముఖం చూస్తే ఆమెకు ధైర్యం రావడం లేదు.
మేఘన పరిస్థితి ఇంకా విచిత్రం. ఆమెకు చెప్పాలనే ధైర్యం ఉంది. కానీ మిజో భాష రాదు.
చివరకు లాలిని ఎదురుగా కూర్చోబెట్టుకుని ఇంగ్లీషులో నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది.
“మీ అమ్మాయి... ఒక వ్యక్తిని ప్రేమిస్తోంది. అతని పేరు మన్జీత్. ఆమె తన వివాహ బంధం నుంచి బయటకు రావాలని కోరుకుంటోంది...”
లాలి కొన్ని మాటలు అర్థం చేసుకుంది. కొన్ని అర్థం కాలేదు.
ఆమె అయోమయంగా కూతురివైపు చూసింది.
అప్పుడే పక్కన కూర్చున్న డ్రైవర్ లాల్తన్హావ్లా విషయం గ్రహించాడు.
“నేను చెబుతాను మేడమ్.”
అతను మిజో భాషలో వివరించడం మొదలుపెట్టాడు.
కొన్ని క్షణాల్లోనే లాల్డెంగా ముఖం మారిపోయింది.
అతని గొంతు పెరిగింది.
మాపుయి తల వంచుకుంది.
తండ్రి మాటల్లో కోపం, కుటుంబ గౌరవం, సంప్రదాయం—అన్నీ కలిసిపోయాయి.
మేఘన మధ్యలో మాట్లాడటానికి ప్రయత్నించింది.
అతను వినలేదు.
లాలి మాత్రం ఏమీ మాట్లాడకుండా కూతురివైపు చూస్తోంది.
కొద్దిసేపటికి ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు జారాయి.
ఆ కన్నీళ్లు చూసిన తర్వాతే లాల్డెంగా గొంతు కొంచెం తగ్గింది.
కానీ చంఫై వెళ్లి అల్లుడి కుటుంబంతో విడాకుల విషయం మాట్లాడమని మేఘన కోరగానే అతను పూర్తిగా తిరస్కరించాడు.
“నేను రాను.”
ఆ మాటను అనువదించాల్సిన అవసరమే లేదు. అతని ముఖమే అర్థం చెప్పింది.
మేఘనకు ఒక్కసారిగా దారి మూసుకుపోయినట్టనిపించింది.
ఇంత దూరం వచ్చి, మాపుయి తండ్రే సహాయం చేయకపోతే ఇక ఎవరితో మాట్లాడాలి?
విషయం తెలిసి పొరుగువాళ్లు కూడా ఒక్కొక్కరుగా ఇంటికి చేరుకున్నారు. చిన్న ఇల్లు క్షణాల్లో పెద్ద సభగా మారిపోయింది. ఎవరి అభిప్రాయం వారిది. సంప్రదాయం, వివాహం, కుటుంబ గౌరవం—మాటలు గది నిండా తిరుగుతున్నాయి.
మేఘన ఒంటరిగా నిలబడి ఒక సమాజంతో వాదిస్తున్నట్టనిపించింది.
ఆమెకు కోపం వచ్చింది.
నిరాశ వచ్చింది.
అయినా వెనక్కి తగ్గాలని మాత్రం అనిపించలేదు.
చివరకు లాలి లేచి నిలబడింది.
ఆమె ఏదో మిజోలో చెప్పింది.
గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.
మేఘన డ్రైవర్‌వైపు చూసింది.
అతను అనువదించాడు.
“ఆమె మీతో వస్తానంటోంది.”
మేఘన ఆశ్చర్యంగా లాలివైపు చూసింది.
కూతురి కోసం తల్లి ముందుకొచ్చింది.
మాపుయి కళ్లలో నీళ్లు నిండాయి.
చంఫై వైపు ప్రయాణం మొదలైంది.
కారు కొండల మధ్య చిన్న చిన్న గ్రామాలను దాటుకుంటూ సాగుతోంది.
ఒక గ్రామం దగ్గర రంగురంగుల దుస్తుల్లో ప్రజలు గుంపులుగా కనిపించారు. పాటలు వినిపిస్తున్నాయి. యువతీ యువకులు నృత్యాలు చేస్తున్నారు. పిల్లలు పరుగులు తీస్తున్నారు. వృద్ధుల ముఖాల్లో కూడా పండుగ ఆనందమే.
“ఏం జరుగుతోంది?” అడిగింది మేఘన.
మాపుయి కిటికీలోంచి చూసింది.
“థాల్ఫావాంగ్ కూట్.”
“అంటే?”
“పొలాల్లో కలుపు తీసే పనులు పూర్తయ్యే సమయంలో జరుపుకునే సంప్రదాయ పండుగ. వ్యవసాయ పనుల్లో ఒక ముఖ్యమైన దశ ముగిసిందన్న ఆనందాన్ని అందరూ కలిసి జరుపుకుంటారు. పాటలు, నృత్యాలు, ఆటలు... గ్రామమంతా ఒక కుటుంబంలా మారిపోతుంది.”
మేఘన బయటకు చూసింది.
రోడ్డుకు ఒకవైపు పండుగ.
పాట.
నృత్యం.
నవ్వులు.
కారు లోపల మాత్రం మౌనం.
మాపుయి కిటికీకి తల ఆనించి బయటకు చూస్తోంది. ఆమె కళ్లలో ఏ ఆనందమూ లేదు.
తన నేల పండుగ చేసుకుంటోంది.
తన ప్రజలు పాడుతున్నారు.
తన గ్రామాలు నాట్యం చేస్తున్నాయి.
కానీ ఆమె మాత్రం తన జీవితంలోని అత్యంత కఠినమైన ప్రయాణం చేస్తోంది.
మేఘన మెల్లగా మాపుయి చేతిని పట్టుకుంది.
మాపుయి ఆమెవైపు చూసింది.
ఏమీ మాట్లాడలేదు.
మాటలు అవసరం కూడా లేదు.
కొండల మధ్య కారు చంఫై వైపు సాగిపోతోంది.
వెనుక పండుగ సంగీతం క్రమంగా దూరమవుతోంది.
ముందు ఏముందో ఎవరికీ తెలియదు
మిజోరాం నలుమూలలా నివసించే వివిధ గిరిజన తెగల ప్రజలు థాల్ఫావాంగ్ కుట్ పండుగ సందర్భంగా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. రంగురంగుల సంప్రదాయ వస్త్రాలు ధరించిన యువతీ యువకులు నృత్యాలతో, పాటలతో తమ సంస్కృతిని ఆవిష్కరిస్తారు. కొండల మధ్య పుట్టి పెరిగిన ఆ కళారూపాలు వేదిక మీదకు వచ్చినప్పుడు మిజోరాం మొత్తం ఒక రంగుల స్వప్నంలా కనిపిస్తుంది.
మధ్యాహ్నం రెండు గంటలకు మేఘన, మాపుయి చాంఫై చేరుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా జోరామ్‌థంగా నివసిస్తున్న ఇంటికి వెళ్లారు. అతడు తన భార్యలతో కలిసి అక్కడే ఉంటున్నాడు.
వాళ్లు వచ్చిన విషయం తెలిసిన క్షణం నుంచే ఇంట్లో కలకలం మొదలైంది. మాటలు మాటలు పెరిగాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సాయంత్రం వరకు ఆ ఇల్లు వేడెక్కిపోయింది.
“కొన్ని రోజులుగా ఈమె ఇక్కడ ఉండడం లేదు. భర్త ఇంటిని వదిలి పారిపోయింది. ఇది మన సంప్రదాయానికి విరుద్ధం!” అంటూ జోరామ్‌థంగా తండ్రి ఆగ్రహంతో మాపుయి తల్లిదండ్రులనే తప్పుబట్టాడు.
అంతవరకు ఓపికగా వింటున్న మేఘనకు కోపం వచ్చింది.
“ఆమెకు ఇష్టం లేని పెళ్లిలో ఆమెను బలవంతంగా ఎలా ఉంచుతారు?” అంటూ ఎదురు ప్రశ్నించింది.
కానీ అక్కడ మేఘన ఒంటరిది. ఆమె మాటకు మద్దతుగా నిలిచేవాళ్లు చాలా తక్కువ. లాలి మాత్రం మాపుయి తరఫున గట్టిగా మాట్లాడేందుకు ప్రయత్నించింది. అయినా కుటుంబ పెద్దల మధ్య కొన్ని సందర్భాల్లో ఆమె కూడా మౌనంగా ఉండక తప్పలేదు.
మాపుయి ఎక్కువగా మాట్లాడలేదు.
అందరి వాదనలూ విన్న తరువాత మాత్రం ఒక్క మాట స్పష్టంగా చెప్పింది.
“నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ఈ బంధంలో ఉండలేను.”
ఆ మాటతో గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
అయినా వివాదం ముగియలేదు.
చివరకు జోరామ్‌థంగా తండ్రి చేసిన ఒక ప్రతిపాదన మేఘనను దిగ్భ్రాంతికి గురిచేసింది. విడిపోవడానికి ముందు మాపుయి తన కుమారుడికి ఒక బిడ్డను కనాలని అతడు సూచించాడు.
మేఘనకు క్షణం పాటు తాను విన్నది నిజమేనా అనిపించింది.
అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం—జోరామ్‌థంగా భార్యలు కూడా మాపుయి చుట్టూ చేరి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేయడం.
మాపుయి ముఖం పాలిపోయింది.
మేఘన మాత్రం ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది.
“నీకు ఇష్టం లేని నిర్ణయానికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు,” అంది స్థిరంగా.
గంటల తరబడి సాగిన చర్చలు, వాదనలు, రాజీ ప్రయత్నాల తరువాత సూర్యుడు కొండల వెనుకకు దిగిపోతున్న సమయంలో చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు.
మాపుయి, జోరామ్‌థంగా పరస్పర అంగీకారంతో విడిపోవడానికి ఒప్పుకున్నారు.
అవసరమైన పత్రాలపై సంతకాలు పూర్తయ్యాయి.
ఆ బంధం నుంచి మాపుయిని పూర్తిగా బయటకు తీసుకురావడానికి మేఘన మూడు లక్షల రూపాయలు చెల్లించింది.
పత్రాలన్నీ చేతికి వచ్చిన తరువాత మాపుయి కొద్దిసేపు వాటినే చూస్తూ నిలబడిపోయింది.
అవి కేవలం కొన్ని కాగితాలు కావు.
తనకు ఇష్టం లేని జీవితానికి వేసిన ముగింపు సంతకాలు.
తన స్వేచ్ఛకు తెరుచుకున్న కొత్త తలుపులు.
ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
మేఘన ఆమె భుజం మీద చేయి వేసింది.
“పద… ఇక వెనక్కి చూడకు.”
కొద్ది కాలానికే వాళ్లు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.
విమానం మిజోరాం పచ్చని కొండల మీదుగా పైకి లేస్తుండగా మేఘన కిటికీలోంచి కిందకు చూసింది. మేఘాలు నెమ్మదిగా కొండలను కప్పేస్తున్నాయి.
ఆమె మనసులో మాత్రం ఆ రోజు జరిగిన సంఘటనలే తిరుగుతున్నాయి.
కొద్దిసేపటి తరువాత తల అడ్డంగా ఊపుతూ అంది—
“ఎంత అందమైన నేల… కానీ నాకు అర్థంకాని ఆచారాలు కూడా ఎన్ని!”
మాపుయి ఏమీ మాట్లాడలేదు.
కిటికీ బయటకు చూస్తూ మౌనంగా కూర్చుంది.
మిజోరాం కొండలు మేఘాల వెనుక కనుమరుగవుతున్నాయి.
కానీ ఆమె జీవితంలో మాత్రం మొదటిసారిగా ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
***
చలి ఢిల్లీని, నోయిడాను తన మంచు చేతులతో నెమ్మదిగా కౌగిలించుకుంటోంది. రాత్రి ఏడున్నర గంటలు.
నోయిడాలోనే అతి పెద్ద వివాహ వేదికల్లో ఒకటైన సాఫ్రాన్ బాంక్వెట్ ఆ రాత్రి వెలుగుల సముద్రంలా మెరిసిపోతోంది. విష్ణు సిసోడియాకు చెందిన ఆ విశాలమైన కళ్యాణ మండపం పూలతో, దీపాలతో, రంగురంగుల విద్యుద్దీపాలతో ఒక ఇంద్రభవనంలా మారిపోయింది.
ఒకే ముహూర్తం.
మూడు జంటలు.
ఒకే వేదిక మీద మూడు జీవితాలు కొత్త అధ్యాయాలను ప్రారంభించబోతున్నాయి.
పండితుల మంత్రోచ్చారణల మధ్య డాక్టర్ మయాంక్ మనూ మెడలో మంగళసూత్రం కట్టాడు.
అదే శుభక్షణంలో మయూర్ కైరా మెడలో మూడు ముళ్లు వేశాడు.
మంజీత్ మాపుయిని తన జీవిత భాగస్వామిగా స్వీకరించాడు.
అక్షింతలు వర్షంలా కురిశాయి.
చప్పట్లు మార్మోగాయి.
విష్ణు, దేవకి ముగ్గురు దంపతులను ఆశీర్వదించారు.
దేవకి వివాహం ఎంత నిరాడంబరంగా, వ్యక్తిగతంగా జరిగిందో—ఈ మూడు వివాహాలు అంత వైభవంగా జరిగాయి. వ్యాపార దిగ్గజాలు, క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు... ఆ వేడుకకు అతిథులుగా వచ్చారు. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లు మీర్ చందానీ, వివేక్ పండిట్ కూడా అక్కడే ఉన్నారు. మేఘన తల్లిదండ్రులు, ఆమె చిన్న కొడుకు కూడా ఆ ఆనందంలో భాగమయ్యారు.
ముందువరుసలోని సోఫాలో దేవకి పక్కనే లకుమ కూర్చుంది.
ఎర్రటి పట్టుచీరలో లకుమ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
“ఈ ఎర్ర చీరలో చాలా అందంగా ఉన్నావు లకుమా!” అంది దేవకి.
“థాంక్యూ!” నవ్వింది లకుమ.
దేవకి ఆమె చెయ్యి పట్టుకుంది.
“నువ్వు మాకు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.”
మేఘనను విడుదల చేయించడంలో తాను చేసిన సహాయం గురించే దేవకి మాట్లాడుతోందని లకుమ అనుకుంది.
“అది నా బాధ్యత,” అంది మర్యాదగా.
దేవకి వెంటనే—
“వివేక్ లేకపోయి ఉంటే కైరా జీవితం నాశనమైపోయేది,” అంది.
లకుమ ముఖంలో చిరునవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది.
కైరా?
ఆ పేరు వెనుక తనకు తెలియని కథ ఏదో ఉందని ఆమెకు అర్థమైంది.
వివేక్ తనతో కైరా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు.
ఆమె మరేదో అడగబోతుండగా—
“దేవకీజీ!”
పండిత్‌జీ పిలిచాడు.
“వస్తున్నాను,” అంటూ దేవకి వేదికవైపు వెళ్లిపోయింది.
లకుమ మాత్రం అక్కడే కూర్చుండిపోయింది.
అప్పుడే వెనుక వరుసలో ఇద్దరు మహిళలు మాట్లాడుకోవడం ఆమె చెవిలో పడింది.
“అదిగో... అతనే వివేక్ పండిట్. ఆ బెంగాలీ పెళ్లికూతుర్ని కాపాడిన డిటెక్టివ్.”
“అవునా?”
“అవును. ఇప్పుడు వివేక్‌తో మాట్లాడుతున్న ఆ దంపతులు కనిపిస్తున్నారా? వాళ్లే ఆ అమ్మాయి—కైరా—తల్లిదండ్రులు.”
“అయితే ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చి ఉంటారు.”
లకుమ నెమ్మదిగా తల తిప్పింది.
దూరంగా వివేక్ కనిపించాడు.
అతనితో మాట్లాడుతున్న కైరా తల్లిదండ్రులు కనిపించారు.
ఆమె కళ్లలో కోపం మెరిసింది.
ఇంత పెద్ద సంఘటన జరిగిందా?
అయినా వివేక్ తనతో ఒక్క మాట కూడా చెప్పలేదా?
మరుక్షణం అక్కడ ఉండలేకపోయింది.
లేచి వేగంగా కళ్యాణ మండపం బయటకు నడిచింది.
వందలమంది అతిథుల్లో ఆమె వెళ్లిపోవడాన్ని ఎవరూ గమనించలేదు.
ఒక్క వివేక్ తప్ప.
లకుమ అడుగుల్లోని కోపాన్ని అతడు దూరం నుంచే గుర్తించాడు.
“లకుమా!”
అతడు పరుగెత్తాడు.
కానీ అప్పటికే ఆమె కారు స్టార్ట్ అయింది.
కారు గేటు దాటి రాత్రి చీకటిలోకి దూసుకుపోయింది.
వివేక్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
బయట నిలబడి ఉన్న టాక్సీని ఆపి ఎక్కాడు.
“ఆ ఎర్ర కారు... ఫాలో చేయండి!”
టాక్సీ దూసుకుపోయింది.
కళ్యాణ మండపంలో మాత్రం ఆనందం కొనసాగుతూనే ఉంది.
మేఘన మాపుయి, జిత్తూ పక్కన నిలబడి ఉంది.
మాపుయి కళ్లలో కన్నీళ్లు ఆగడం లేదు.
ఆమె జీవితానికి స్వేచ్ఛ ఇచ్చిన స్నేహితురాలు మేఘన.
తన కోసం లక్షలు ఖర్చు చేసి, చివరకు తన బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా మిగలకుండా చేసుకున్న స్నేహితురాలు.
ఆ విషయం విష్ణుకు తెలుసు.
అతడు మేఘన దగ్గరకు వచ్చాడు.
“మేఘనా... నీకు ఒక బహుమతి.”
ఆమె చేతిలో కొన్ని పత్రాలు పెట్టబోయాడు.
“ఏమిటిది?”
“ఒక కమర్షియల్ కాంప్లెక్స్.”
మేఘన ఉలిక్కిపడింది.
“లేదు! నేను తీసుకోను. ఇంత పెద్ద బహుమతి నాకు వద్దు.”
విష్ణు నవ్వాడు.
దేవకి ముందుకొచ్చింది.
ఆ పత్రాలను మేఘన చేతుల్లో పెట్టింది.
“ఇది నీ కోసం కాదు మేఘనా.”
“మరి?”
దేవకి చిన్న కన్నయ్యవైపు చూసింది.
“ఇది మా చిన్న కన్నయ్యది. వాడు పెద్దవాడయ్యే వరకు నువ్వు కేవలం దానికి సంరక్షకురాలివి.”
మేఘనకు మాట రాలేదు.
తన సంపదను కోల్పోయినందుకు ఆమె ఎప్పుడూ బాధపడలేదు.
కానీ దేవకి చూపించిన ప్రేమ ముందు ఆమె గుండె కరిగిపోయింది.
ఆమె దేవకిని కౌగిలించుకుంది.
డబ్బు ఆమెను ధనవంతురాలిని చేయలేదు.
మనుషులు ఆమెను ధనవంతురాలిని చేశారు.
విష్ణు మరో నిర్ణయం ప్రకటించాడు.
“కన్నయ్య కోసం మథురలో ఒక భవనం సిద్ధం చేశాను. అక్కడ ఆసుపత్రి ప్రారంభించాలి.”
డాక్టర్ కన్నయ్య ఆశ్చర్యంగా అతని వైపు చూశాడు.
“మామయ్యా...”
“నువ్వు డాక్టర్వి. భవనం సంపాదించడం నీ పని కాదు. మనుషుల ప్రాణాలు కాపాడటం నీ పని.”
కన్నయ్య కళ్లు చెమ్మగిల్లాయి.
ఇంతలో మరో చిన్న వివాదం మొదలైంది.
మనూ తన అపార్ట్‌మెంట్‌ను కైరాకు తిరిగి ఇచ్చేయాలని పట్టుబట్టింది.
కైరా ఒప్పుకోలేదు.
“నాకు వద్దు.”
“అది నీ ఇల్లు,” అంది మనూ.
“కాదు.”
చివరకు దేవకి మధ్యలోకి వచ్చింది. మయూర్‌తో మాట్లాడింది. మయూర్ కైరాను ఒప్పించే ప్రయత్నం చేశాడు.
ఎంతో చర్చ తరువాత కైరా ఒక షరతుతో అంగీకరించింది.
“అద్దెకు మాత్రమే ఉంటాను.”
“సరే,” అంది మనూ. “అద్దె ఎంత?”
కైరా సమాధానం చెప్పకముందే దేవకి నవ్వుతూ తీర్పు చెప్పింది.
“నెలకు ఒక పూలగుత్తి... ఒక కొబ్బరికాయ.”
అందరూ నవ్వారు.
“కానీ వాటిని మథురకు వచ్చి స్వయంగా ఇవ్వాలి!” అంది దేవకి.
కళ్యాణ మండపం చప్పట్లతో మార్మోగిపోయింది.
ఆ అద్దె డబ్బు కాదు.
బంధాన్ని కొనసాగించడానికి పెట్టిన షరతు.
కొంతసేపటికి విష్ణు అందరినీ చూస్తూ తన నిర్ణయం చెప్పాడు.
“నేను, దేవకి మథురకు వెళ్తున్నాం.”
అందరూ అతని వైపు చూశారు.
“నా వ్యాపారాలను ఇక నా తమ్ముడు చూసుకుంటాడు. నా బెంగాలీ కూతురు కైరా పెళ్లయిపోయింది. నా మిజో కూతురు మాపుయి పెళ్లయిపోయింది. నా ఆంధ్రా కూతురు మేఘన—తనకు నచ్చిన మనిషి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటుంది.”
మేఘన నవ్వింది.
“కానీ ఆమె కొడుకును మాత్రం నేను మథురకు తీసుకుపోతున్నాను.”
అంటూ విష్ణు చిన్న కన్నయ్యవైపు చూశాడు.
“వాడు మా చిన్న కన్నయ్య.”
దేవకి ఆనందంగా ఆ బాలుణ్ణి తన చేతుల్లోకి తీసుకుంది.
“వాడిని నేను చూసుకుంటాను.”
మేఘన తన కొడుకు బుగ్గలపై ముద్దులు పెట్టింది.
ఆమె తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరించారు. మథుర పెద్ద దూరమేమీ కాదు. కావాలనుకున్నప్పుడల్లా మేఘన వచ్చి తన కొడుకును చూడవచ్చు.
విష్ణు దేవకివైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
“చాలా సంవత్సరాలు పనిచేశాను. సంపాదించాను. ఇక నాకు పరుగులు వద్దు. ప్రశాంతత కావాలి. కొంచెం ఆనందం కావాలి. మథుర నాకు ప్రశాంతత ఇస్తుందని అనుకుంటున్నాను.”
అతడు దేవకివైపు మరింత ప్రేమగా చూశాడు.
“దేవకి నాకు ఆనందం ఇస్తుంది.”
దేవకి సిగ్గుగా నవ్వింది.
అప్పుడే డాక్టర్ మయాంక్ సరదాగా అడిగాడు—
“చిన్న కన్నయ్యను దేవకిగారు చూసుకుంటారు సరే... మరి పెద్ద కన్నయ్యను ఎవరు చూసుకుంటారు?”
మనూ వెంటనే అతని చెవికి దగ్గరగా వంగింది.
“నేను.”
మయాంక్ ఆమెవైపు చూశాడు.
మనూ చిరునవ్వుతో చెప్పింది—
“నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. నువ్వు ప్రజలకు సేవ చెయ్యి. నేను నీకు సేవ చేస్తాను.”
క్షణం ఆగి అతని కళ్లలోకి చూసింది.
“మథురే మన బృందావనం.”
దూరంగా మేఘన నిలబడి ఉంది.
దేవకి చేతుల్లో ఉన్న చిన్న కన్నయ్య తన తల్లివైపు చూస్తూ చిన్నచిన్న చేతులు ఊపుతున్నాడు.
మేఘన కూడా చేయి ఊపింది. ఆమె కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి.
కానీ అవి దుఃఖపు కన్నీళ్లు కావు. తన కొడుకు తనకు దూరమవుతున్నాడనే కన్నీళ్లు మాత్రమే కాదు.
ఎన్నో తుఫానులు దాటిన తరువాత తన జీవితంలోని మనుషులందరూ ఒక్కొక్కరుగా తమ తీరాన్ని చేరుతున్నారని చూసిన సంతృప్తి కూడా వాటిలో ఉంది.
కైరాకు ఒక ఇల్లు దొరికింది. మాపుయికి స్వేచ్ఛతో కూడిన జీవితం దొరికింది.
మనూకు ప్రేమ దొరికింది. కన్నయ్యకు సేవ చేయడానికి ఒక మార్గం దొరికింది.
విష్ణుకు విశ్రాంతి దొరికింది. దేవకికి ఒక పెద్ద కుటుంబం దొరికింది.
మేఘనకు? ఆమెకు ఇంకా ప్రయాణం మిగిలే ఉంది. చిన్న కన్నయ్య మరోసారి చేయి ఊపాడు. మేఘన నవ్వుతూ చేయి ఊపింది. వెనుక పెళ్లి మండపంలో మంగళవాద్యాలు వినిపిస్తున్నాయి.
ముందు— మథుర దారి ఎదురుచూస్తోంది.
***
Wow. The ending is superb. The story started with the introduction of a posh girl Kyra. But ended with an emotional touch. Well described the beauty and culture of Mizoram. Mizoram is beautiful. But the lives of Mizo women are painful. Any way Mapui was relieved from meaningful marriage. She was not fighting with her parents. Her fighting is against the community. Finally, she won the battle. Vishnu and Devaki adopting the son of Meghana and settle in Madhurai. Wow, nice to imagine the scene. What a nice lady Lakuma! The investigation of vivek is very nice and he saves the Agarwal for Kyra. All are got married. Very happy to see the couples. The relations between people and helping nature are heart touching. Happy days! Happy ending!;
ReplyDeleteThank you very much. I really enjoyed reading your feedback. Please read episode 29 also. I think you missed it.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis story is filled with pure emotions and human values.In this fast moving world, I just can't believe this some people don't accept 2nd marriage. This story can inspire them, who wanted to start again a happy & new life. Characters detailing was fantastic. Showing friendship bonding b/w those characters is lovely. Not only with emotions writter maintain some suspence part in story.
ReplyDeleteBefore that , writter explained the beauty of NOIDA & GREATER NOIDA. In the last part explained about MIZORAM beauty and their culture was too Good. And one imp. Thing is want to discuss i.e. ETHNIC DAY CELEBRATIONS. Reading this kind of celebrations , now I can understand some ethnics and their culture. Describing about their culture in stories & dances like Jharkhand - Tribal dance , Himachal Pradesh - Nati folk dance, Bharatanatyam was performed by tamil girls. And Manu performed Rajastan Ghoomar & Kalbelia folk dances and A.P. ethnic food. Knowing this unknown things in this story is feeling Happy.
Some scenes like why manalini gave money to mayak , and Mayak and Mayur twist revealing , How vivek saves Kyra's life , it would have been nice if lvy had written a little better in my opinion. Romantic parts worked well in some scenes. After 20th part the story turns very fast new characters introducing one by one was too quickly but it's fine.
Personally I love manu's character. Beauty , innocence , helping others without expecting anything in return , being kind to the person next to her. All this things influenced me to love the character.
We want more Good stories from you sir and we want to know new things in your stories sir. Keep writing sir Thank you....
Feel good story in this I tell you know about theory of the story good emotions are behind in this story there is some people are not accept any second marriages nowadays yes it's true getting the second marriage is very wrong thing the people who restarting their lives the story will motivate them it's true ultimate writer Pola Bala was explained Devaki Mapuiee Meghana said his feelings with them. Friendship is a relationship of mutual affection between the people they did justice to the friendship off the rolls
ReplyDelete