Tuesday, July 14, 2020

Bharatavarsha-6

ముంబై మహానగరంలో జెట్ఏర్వేస్ విమానం దిగిన అరుణతార  అంచ గమనమున సాగుచుండెను. ఆ ముగ్ధ మనోహరి  ఠీవి చూచిన వారికి ఆమె మహారాణి యనిపించును కానీ నర్తకి యనిన నమ్మబుద్ది కాదు. యాబది వర్షములు సమీపించు చున్ననూ  ఎర్రని బుగ్గలలో తగ్గని నిగారింపు, దేహంలో తగ్గని పసిమి ఛాయతో  వెలుగుచున్న అరుణతార  కామ దృష్టితో చూచువారికి, విలాసిని వలే కనిపించును. కళాదృష్టి తో చూచిన వారికి మోహినివలే  కనిపించును. ఆమె కళ్ళు  సూదంటురాయిని ,మోము చందమామను, ఆహార్యం అప్సరను, నడక రాయంచను తలపించును. ఒక్క ముక్కలో చెప్పవలె నన్నఆమె జక్కన చెక్కిన తీరైన శిల్పమువలే  చూచువారికి తరలి వెళుతున్న తెలుగువారి తరతరాల వారసత్వ సంపదవలే  కనిపించును. 


విమానాశ్రయము లో పాలరాతి పై నడుచునప్పుడు పాలరాతి బొమ్మ వలే , దాటి బైటకు వచ్చి సూర్యకాంతిలో నడుచునప్పుడు బంగారు బొమ్మవలే కనిపించెను.  సూర్యకాంతిలో  మిలమిల మెరియుచున్న అరుణతారను చూచిన ఓ వృద్ధ ప్రయాణికుడు మరొక ప్రయాణికుడితో "ఎవరోయీ ఈ చెకుముకి? లకుముకి చందమున నా డెందమును పరిగ్రహించెన"నెను. అందుకు అతడు  "ఆమె ప్రక్కనే నడుచుచున్న మొండికట్టె ఎవడోయి, నల్లని తుమ్మమొద్దు వలెనున్నాడు, ఆమె చేతిని చూరగొనుటాయే గాక చూర్ణము చేయుచున్నాడ"నెను. అదిచూచి  మొదటి ప్రయాణీకుని ముఖము వివర్ణమయ్యెను.  విమానాశ్రయ నిష్క్రమణ ద్వారం వద్ద నుంచి బైటపడిన అరుణతార తనకై ఎదురు చూచుచున్న వాహనము నధిరోహించగా ఆమె ప్రక్కనున్న తుమ్మమొద్దు  “ఓబరాయ్” అనెను. వాహనము  దూసుకు పోయెను.

ఒబెరాయ్ నందు వాహనము దిగగానే ఆమెను సాదరంగా తురయ టెలిఫిలిమ్స్ వారు సమావేశ మందిరమునకు కొనిపోయిరి. విద్యుత్దీపకాంతిలో దగద్ధగాయ  మానమై ప్రకాశించుచున్న సమావేశ మందిరమున విద్యుత్ దీపములతో పోటీపడుచూ ఉన్నత రంగస్థలం పై కూర్చునిఉన్న తారలందరూ అరుణతార ప్రవేశముతో వెలవెలపోయిరి.   వారందరి మధ్యలో ఆమె తారల మధ్య చంద్రునివలె కనిపించెను. ద్రోణదళముల వంటి ఆమె కనులయందు విద్యాస్పర్థలో గౌడడిండిమ భట్టును ఓడించి, అతని కంచు ఢక్కను పగుల గొట్టించిన శ్రీనాధుని విజయ గర్వము అనేక మేటి నర్తకీమణుల శృంగార నాట్య భంగిమల  భంగపరిచి వారి స్థానములను కొల్లగొట్టిన ఆమె ముఖమునందు తొణికిసలాడ కాతులీనుచున్నఆమె ముఖమునే అందరూ చూచుచుండిరి.

మాయ అను పౌరాణిక నాటకము నూరు భాగములు పూర్తి చేసుకున్న సందర్భముగా నాటక విజయోత్సవమును తురయ టెలిఫిలిమ్స్ జరుప నిశ్చయించి ఏర్పాటుచేసిన సభకు ఆ నాటకమునందు ఆస్థాన నర్తకి గా ప్రముఖ పాత్ర పోషించిన అరుణతార గొప్ప ఆకర్షణ అయ్యెను. ఆమెపై ప్రశంసల వర్షము కురిసెను. కొందరు ఆమె నటనను పొగడగా మరికొందరు ఆమె నాట్యమును పొగిడిరి. కొద్దిమంది ఆమె అందమును పొగిడిరి.  ఎవరో ఒక రసికాశిఖామణి, కేరళ నుండి ఎంపికైన ఎగువసభ సభ్యుడు, శృంగారోత్సాహమున పుష్పగుచ్ఛమిచ్చునెపమున తూలిపడి  ఆమె కుచాగ్రములను స్పృశించెను. 

ఇది చూచి ఒక సభికుడు  ఏమిసాహసము, ఏమి కొంటెతనమని వ్యాఖ్యానించెను  అది విని మరొక  సభికుడు అది సాహసము గాదు దౌష్ట్యము ,  కొంటెతనము గాదు క్రొవ్విదము. అయిననూ నేటి భారత దేశమున వయసుమళ్ళిన రాజకీయవేత్తలు సిగ్గు ఎగ్గు మరిచి ఇటువంటి పనులు చేయుట సాధారణమాయెనని సరిపుచ్చుకొనెను. ఈ స్త్రీ లోలుడు మొన్ననే మూడవ భార్యను మట్టుబెట్టి ఇంకనూ పరస్త్రీల చుట్టూ భ్రమరమువలె పరిభ్రమించుచున్నాడు అనెను. అందుకు పొరుగువారు నవ్వి స్త్రీ యనిన తేనెపట్టే కదా , ఒక్క భ్రమరమేమి ఖర్మ అనేక భ్రమరములు తిరుగుచుండును. అందు నేనొక భ్రమరము నవ్వవలెనని నా ఆకాంక్ష. ఆమెను పెట్టి ఒక చలన చిత్రము రూపొందించవలెనని యోచించుచున్నాన"నెను. ఇచ్చట కామాతురులు పెచ్చుగా యున్నారు యని ప్రక్కవాడు వెనుకవరుసకు మారిపోయెను. 

కొద్దిమంది ముఖ్యులు ప్రసంగిచిన పిదప ముంబయి విశ్వవిద్యాలయ పురాణ విభాగాధిపతి ముంబై విశ్వవిద్యాలయంలోని పురాణ విద్య కు మంచి ప్రజాదరణ లభించెనని టెలివిజన్లలో పౌరాణిక మరియు చారిత్రక నాటకాలకు ఆదరణ పెరుగుటవల్ల ముంబై విశ్వవిద్యాలయంలోని సంస్కృత మరియు పురాణ కోర్సులపై విద్యార్థుల ఆసక్తిని పెరిగెనని సంస్కృత కోర్సుల ప్రవేశాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగెనని. అదనంగా, ఈ సంవత్సరం సంస్కృతం కోసం రెండు తరగతులు పూర్తి సామర్థ్యంతో నడపడం ఇది మొదటిసారి అని చెప్పుచూ” నేను చాలా మంది విద్యార్థులను వ్యక్తిగతంగా తిరస్కరించాల్సి వచ్చెను, వచ్చే ఏడాది ప్రారంభంలో రావలెనని వారిని కోరిరి. సంస్కృత కోర్సులు, తులనాత్మక పురాణ శాస్త్రము నందు (కంపారిటివ్ మిథాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు) ప్రవేశములు గత రెండేళ్ళలో అతిపెద్ద పెరుగుదలను చూసింది. ఇంతటివిజయానికి కారణమైనదర్శకులు మరిన్ని చారిత్రిక, పౌరాణిక నాటకాలను ఎంపిక చేసుకోవాలని కోరెను. ఆమె నటీ నటులను కొనియాడి, ముఖ్యంగా ఈ విజయంలో సింహభాగం నర్తకీమణి అరుణతారదే అన్నారు. సమావేశమందిరము అంతా కరతాళ ధ్వనులతో నిండెను.


సమావేశము ముగిసెను.అందరు వెడలిపోయిన పిదప అరుణతార మెల్లగా సమావేశమందిరము నుంచి నిష్క్రమించి నడుచుచుండెను నేను ఒక విలాస మందిరమును నిలిపిపెట్టి యుంచితిని, ఈ రాత్రి కి మనము నా తదుపరి చిత్రము గురించి చర్చించవలెను అని అరుణతార ప్రక్కన ఉన్ననల్లని వ్యక్తి ఆమెను  వేదించుచుండెను. అరుణతార వద్దని వారించుచూ "నాయుడుగారు, మీరు నాకు అవకాశాలు ఇచ్చినారని కృతజ్ఞతతో మీకు మారాడలేకున్నాను. మీరు ఇంత దూరము వచ్చి ఇక్కడ సమావేశములో పాల్గొనుట విడ్డురంగానున్నది. నిజము చెప్పవలెనన్న మీకు ఈ పౌరాణిక నాటకమునకు ఏమీ సంబంధము  లేదు.  బుల్లితెర కు మీకు బాదరాయణ సంబంధమైననూ కలదా? సంవత్సరముల క్రితమే  నాకు అవకాశములు మృగ్యమైనవి, నేను రాజకీయ రంగములో చేరి నిత్యమూ నిప్పులో నడుచుచుంటిని.  వెలుగు పార్టీలో  మహిళాధ్యక్షురాలిగా నా మనుగడే ప్రస్నార్ధకమయ్యెను.

 రేపు హైదరాబాదులో జరుగు పార్టీ సమావేశము నా భవిష్యత్తును నిర్ణయించును.  రాత్రికి నేనిచ్చట బసచేసిన అది నాకు మరణ శాసనమగును.నేను చలచిత్రములందు ఆశలు త్రుంచుకొంటిని.  మీకు ఏమి కావలెనో  నాకు తెలియును. కానీ అది జరగని పని అని అరుణ అనగా, నీ అందంచూసి మనసు పడి వచ్చితిని నన్ను నిరుత్సా హప రచ కు, నేను చలన చిత్రము నిర్మించలేను కానీ నిన్నూరక రమ్మన్ననని కొంత డబ్బు తీసి నాయుడు ఆమె చేతిలో కుక్కుటకు ప్రయత్నించె ను.అగ్గిమీద గుగ్గిలమువలే రేగి   అరుణ తార నాయుడిని నెట్టివేయగా అతడు క్రింద పడిపోయెను.    

ఆ దృశ్యము  చూడగానే ఇద్దరు పాత్రికేయులు నాయుడు వెంటపడిరి.  అరుణ తార అవమాన భారంతో పక్కనే ఉన్న  ఒక ఉపహారగృహములోకి వెళ్లి ఒక బల్లవద్ద  కూర్చొని  పండ్ల రసము త్రాగుచుండెను, మసకవెలుతురుతో నిండిన ఆ మందిరములో  మంద్రముగా సంగీతము వినిపించుచుండెను. భగ్న మనస్సుల నుద్దరించు వైవిధ్యభరితమైన  సంగీతం మంద్రముగా   వినిపించుచుండెను.  అది తెలియని నిర్యాణ  భ్రాంతి కలిగించుచుండెను.   ఇంతలో ఆమె మీద ఒక చేయి వాలెను, మసక వెలుతురులో అతడు వెంటనే కనిపించలేదు  కానీ  కొద్ది సమయములోనే అరుణతార అతడు ఎవరో గ్రహించెను.  అతడే జాతీయ వార్తలలో పెచ్చుగా కనిపించు రాజ్యసభ సభ్యుడు శశి.   అతడే ఇందాక  (తూలి ) తనపై పడి తనను తాకిన  కాముకుడు. 

"నీవంటి ప్రజాదరణగల తారామణులుండవలసినది ఆకాశమున గానీ పంకిలమున గాద"ని ఆమె శ్రమను హెచ్చుజేసి మెచ్చుకొని మాట్లాడి ఆమె ఖేదమును బాపెను.   నీవు కోరినచో మా పార్టీ లో ఎం పి గా పోటీచేయుటకు  అవకాశ మిప్పింతును.  మా పార్టీ జాతీయపార్టీ  నీవు పని చేయుచున్న ప్రాంతీయపార్టీకన్నా వేయి రెట్లు మెరుగు.  విధాన సభకు  పోటీ చేసి నాయకురాలిగా  వెలగవలసిన నీవు ఒక కుటుంబపార్టీ లో  కేవలము మహిళాధ్యక్షు రాలిగా పనిచేయుట దుఃఖదాయకము." అనెను  నావద్ద ఏమిచూచి అట్లు చెప్పుచున్నారు.   నన్ను ములగచెట్టు ఎక్కించుచున్నారు" అని అరుణ అనెను.  

శశి: నీ సమస్య అచ్చటనేయున్నది.  నీవు స్వయం ప్రకాశితవు. కానీ నీప్రతిభను నీవు గ్రహించ లేకున్నావు. హిమాయల మున కూర్చొండ  వలసిన నీవు మూలగ చెట్టుకే భయపడుచున్నావు.

మీ వన్నియూ ఒత్తి పొగడ్తమాటలు అని   అరుణతార ఏమీ అర్థం కాని దాని వలె తెల్ల ముఖం వేసెను  మహారాష్ట్ర లో పోటీ చేసిన తప్పక నెగ్గగలరు. అనెను  

 శశి: మీ నాట్య భంగిమలు నా మనసులో ముద్రించి నాకు నిద్రించు భాగ్యమును లేకుండా చేసినారు.   అట్లే  మహారాష్ట్రలో హిమాలయ కీర్తిని ప్రజాహృదయ మునం దు సుస్థిర స్థానమును సంపాదించారు. ఎవ్వరేమన్ననూ మీరు పోటీచేసిన గెలు పొందుట ఖాయము. తక్షణము వెలుగు పార్టీ నాయుడిని ఒక్క తప్పు తన్ని  మీ స్థానమును చేజిక్కించుకొని సమయామాసన్నమైనది.    

అరుణ వదనము వికసించెను. అది చూచి అతడిలో కాంక్ష విప్పారెను. అతడు ఆమె  కంఠమును , పెదవులను వక్షములను చూచి మత్తెక్కి  మైమరచెను.  
 
ఆమె అందమును  తేనెపట్టు వంటి ఆమె అందమునకు  ఒక వజ్రపుటుంగరమను రాయిని విసిరెను.  నీ అందమునకు నా బహుమానము   అనుచూ ఒక వజ్రపుటుంగ రమును బహూకరించెను. అరుణ వద్దు అనునంతలోనే అతడే ఆమె వేలికి దానిని తొడిగి  "నాకు ఎల్లపుడు ఇక్కడ ఒక విలాసమందిరము నిలిపిపెట్టబడి ఉండు" ననిజెప్పి, లలామ లావణ్యమును పెనవేసుకొనెను.  తార అతడిని ఒక్క వుదుటున నెట్టి ఉంగరమును అతడి మొఖంపై కొట్టెను.   ఇట్టి స్పందననూహించని శశి " అయ్యో  తేనెపట్టు చేజారేనే!"అని మెల్లగా  అనుకొనెను. "తేనెపట్టుపై రాయి విసిరితివి  తేనెటీగ కాటు రుచి చూడుమ."ని   అరుణ అతడి చెంప పగుల గొట్టెను. శశి తత్తరపడి చుట్టూ చూసి  ఎవ్వరూ చూచుటలేదని చల్లగా జారుకొనెను. 

అరుణ నిస్సహాయముగా ఉపహారగృహములో ఒక బల్ల వద్ద కుర్చీలో కూలబడి ఒంటరి 
 పాటున తన అసహాయతకు చింతించుచుండెను. చుట్టూ మసక వెలుతురావరించి యున్నది. అల్పాహారశాలలో బల్లలన్ని యూ స్త్రీ పురుషులుతో నిండి యున్నవి. మసకవెలుతురులో వారి ముఖములు అస్పష్టముగా గోచరించుచున్నవి. ఈ హఠాత్పరి ణామము నుండి తేరుకొనకముందే వెనుకనుండి అరుణ భుజము నెవరో తాకినారు. అరుణ వెనుకకు తిరిగి చూసెను. ఆమె వెనుక ఒక స్త్రీ చిరునవ్వు తో నిలబడి యున్నది. ఆమె తనతో పాటు మాయ ధారావాహికలో తల్లి పాత్రలో నటించిన దేవయాని. ఆమె అరుణముందు కొచ్చి కుర్చీలో కూర్చొనెను.

“తల్లిపాత్రలో వయసు మళ్లిన దానివలె నటించిన నువ్వు వయసులో చిన్నదానివ”ని అరుణతార నవ్వెను. "వయసుకుతగ్గ పాత్రలు చలన చిత్రరంగమందు మాత్రమూ వచ్చుచున్నావా? పిన్న వయస్కులైన రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటివారు తండ్రి పాత్రలు వేయుచుండగా బాలకృష్ణ, నాగార్జున వంటి వృద్దులింకనూ కుర్రపాత్రలలో నటించుచూకూతురు వయసున్న పిల్లలతో గెంతుచూ కథానాయకులుగా చలామణీ అగుచు న్నారు.  అరుణ హ హ్హ హ్హ యని ఒక జీవం లేని నవ్వు నవ్వెను. ఆ విగతహాసము ను పసిగట్టి  "ఎందుకో మీరు ఆందోళనలో ఉన్నట్టు స్పష్టమగు చున్నది. మీరు వచ్చినప్పటినుంచి నేను గమనించుచున్నాను."అనెను  

"ఆ శశి చేసినదంతయూ చూచితివా?" అని అరుణ అడిగెను. నేనే కాదు ఇచ్చట ఉన్నవారందరూ చూచినారు. నీ అందము స్త్రీలనే వెర్రెత్తించును. ఇక పురుషుల సంగతి  చెప్పపనేమున్నది.   అయిననూ ఇందు నీవు చేసిన తప్పేమున్నద"ని  దేవయాని అరుణను ధైర్య పఱచుచుండగా ఇక దాచాల్సిన పనిలేదనుకొని “ఇందాక శశి నా చేతిని తాకిన దృశ్యమును చూసినావు కదా కొంచెమాందోళన గాయున్నది.పాత్రికేయులా చిత్రము నచ్చువేసి చిలువలుపలువులుగా కల్పించి వ్రాయకుందురా!" అని అరుణ కలత చెందెను. 

అది వినినంతనే దేవయాని ఘొల్లని నవ్వి “పాత్రికేయులకు ఇట్టి దృశ్యములు పరమాన్నములు. “అట్టి లైంగిక ఆరోపణలు. అక్రమ సంబంధముల వార్తలన్న ప్రజల పడిచత్తురు. మన దేశమున అత్యధికముగా చదువు వార్తలివియే!"  అని నవ్వసాగెను

అరుణ తార ముఖములో భయము తొంగి చూచెను. అది చూచి దేవయాని మరల నవ్వెను. నీవు ఎంత పవిత్రముగా నున్ననూ  పచ్చకామెర్లు  వచ్చిన ప్రజలు నిన్ను అర్థము చేసుకొని పద్దతి మారదు.   అడ్డదారులు ద్వారా పైకి వచ్చుటకు అవకాశములు కొరకు పక్క లెక్కుటకు సిద్ధముగా నున్న నావంటివారే ఎక్కువగా యున్న చిత్ర పరిశ్రమలో నే నీవునూ యున్నావు.   తాటిచెట్టుక్రింద కూర్చుని పాలు తాగిననేమి ప్రయోజనము ?

 " నేను కూడా శీలమునకు తిలోదకములిచ్చి అడ్డ దారిన అందలమెక్కవలెనా ?"  అరుణకు దుఃఖము పొరలి వచ్చుచుండెను.  దేవయాని ఆమెను బాధను  అర్థము చేసుకొని "ఆధునికంగా కనిపించే  నాట్యతారవి  కానీ నీవు సత్తె  కాలపు మనిషివి. నేడు సమాజము మారిపోయెను. ఇప్పుడు భారతదేశంలో 76% స్త్రీలు మరియు 61% పురుషులు అక్రమసంబంధములను అనైతిక చర్యగా భావించుట లేదని గణాంకములు జెప్పుచున్నవి.

అరుణ : ఏమీ గణాంకములు ఏమీ  విపరీతము.  అట్లు చెప్పువారిని చెప్పుతీసి కొట్టవలెను.  

దేవయాని : నీవు సత్తె కాలపు మనిషివనుకొంటిని క నీవు నూతిలో కప్పవలెనున్నావే  
 అక్రమ సంబంధాలు నేరం కాదు. సహజీవనం నేరం కాదు.పెళ్ళికి ముందు శృంగారం నేరం కాదు.
స్వలింగ సంపర్కం నేరం కాదు. స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. అవినీతి పరులు ఎన్నికలలో పోటీ చెయ్యడం నేరం కాదు. వ్యభిచార గృహానికి వెళ్లిన విటుణ్ని విచారించరాదు.వ్యభిచారము చేయువారిని  ఖైదు చేయరాదు. స్త్రీ కి  సంతానము కలిగినచో దానికి ఆమె భర్తే తండ్రి అగును. 
జాతీయగీతం పాడునపుడు  నిలబడకపోయినచో  నేరము కాద"ని ఉన్నత న్యాయస్తామే  జెప్పెను.

అవాక్కయిన అరుణ మెదడు స్థంభించెను  ఆమె దేవయానికి  నమస్కరించి విమానాశ్రయములకు బయలుదేరెను. "శశి చెడ్డ వాడైననూ అతడు చెప్పిన మాటలు నీకు వరములని మరువకుము. "అని చెప్పి దేవయాని చేయి ఊపెను.   


                                                                             ***


న్యూ ఢిల్లీ ప్రపంచ పుస్తక మహాసభ :  ప్రగతి మైదాన్ లో మహా సంద్రమును తలపించి పుస్తక ప్రదర్శన జరుగుచున్నది. అది  ప్రధానమంత్రి యువ 2.0 కార్యక్రమము. భారత్ మండపం నందు 2,000 కంటే ఎక్కువ ప్రచురణకర్తలు, పంపిణీదారులు మరియు పుస్తక విక్రేతలు పాల్గొని, విస్తృత శ్రేణి పుస్తకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించుచున్నారు. 

 విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శనలో భారతీయ భాషలను ప్రోత్సహించుటకు యువ రచయితలు రాసిన  పుస్తకాలను ఆవిష్కరించుచున్నారు.  మొదటగా 14వ శతాబ్దపు ఖగోళ శాస్త్రవేత్త శ్రీ మాధవ  మలయాళ అనువాదంను ఆయన విడుదల చేసినారు. 

తదుపరి సర్ చార్లెస్ ఎలియట్ రచించిన  "హిందుత్వం మరియు బౌద్ధం - ఒక చారిత్రక స్కెచ్  తెలుగు అనువాదమును ఆయన విడుదల చేసిరి. అది భారతవర్ష చేసిన అనువాదం.   అనంతరము రచయితకు 2 నిముషములు మాట్లాడుటకు అవకాశమిచ్చిరి. 

భారతవర్ష మాట్లాడుతూ " సర్ చార్లెస్ ఎలియట్,  రచన హిందూయిజం మరియు బౌద్ధమతంలో  ఏది ప్రాచీనమైనది? ఏది ముందు పుట్టింది అని స్పష్టంగా ఉందని,  క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధమతం ప్రస్తుత వేద సంప్రదాయాల ( హిందుత్వము) నుండి ఎలా ఉద్భవించిందో రచయిత వివరించాడని తెలియజేసి బౌద్ధమతం తరువాత కాలంలో హిందుత్వమును గణనీయంగా విభేదించి విభిన్నంగా మారింది.  ఇది బ్రాహ్మణిజానికి ఒక  ప్రతిచర్యగా కనిపిస్తుంది.  అంటే  బుద్దుడి కంటే ముందే బ్రాహ్మణత్వము ఉన్నది.  బౌద్ధమతం ఒక ప్రత్యేక మతంగా పునాది వేద కాలం తర్వాత అభివృద్ధి చెందింది. అని స్పష్టంగా తెలుస్తోందని, కొంతమంది విదేశీ మతాలను అవలంభించే రచయతలు  బౌద్ధమే ముందనీ వితండవాదం చేస్తూ  హిందు చరిత్రను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని. ఇది తండ్రి కంటే ముందు కొడుకు పుట్టేడన్నట్టుగా  ఉందని భారతవర్ష తెలియజేసెను.   తదుపరి వర్షుడు రచించిన  సరస్వతీ శతకమును విడుదల గావించెను

అట్లు విద్యాశాఖామంత్రి 41 పుస్తకాలను ఆవిష్కరించెను . తరువాత అతడి సరస్వతీ శతకమును మంత్రిగారు విడుదల గావించిరి. పిమ్మట ఆయన భారతీయ సంస్కృతి, వారసత్వం, చరిత్ర,  గర్వించదగిన రాయబారులాగా రచయితలను  మెచ్చుకొనిరి. విద్యాశాఖామంత్రి మన వారసత్వ సంపదను  వెలుగులోకి తీసుకువచ్చి భావితరాలకు అందించాలని రచయితలందరి నీ కోరినారు.    

ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి, పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, జాతీయ పుస్తక సంస్థ అధ్యక్షుడు ఆచార్య  మిలింద్ యుజిసి అధ్యక్షుడు  ఆచార్య  జగదీష్ కుమార్ మరియు జాతీయ పుస్తక సంస్థ దర్శకుడు  శ్రీ యువరాజ్  హాజరయ్యారు. 


ఆనంద నిలయములో ఆ కార్యక్రమమును ప్రత్యప్రసారములో చూసిన మాలిని మంజూషలు తమ భావములను  సీతారత్నముగారి (అప్పుడు అచ్చట యుండుటతో) తో పంచుకొనుటకు ప్రయత్నమూ చేయగా   "అమెరికాలో నున్న  మా కృష్ణుడు నుండి పిలుపు వచ్చున"ని లేచి వెడలిపోయిరి. మాలిని మంజూషలు తమ భావములను రాధామనోహర పుష్పములతో పంచుకొనిరి.  

                                                                  ***



మరునాడు వర్షుడు వాయుయానములో విశాఖ వచ్చెను.అతడు స్నానము చేసి  తెల్లని పంచె ధరించి కళాశాలకు బోవుటకు తనగదిలో అద్దము ముందు నిలిచి  సిద్ధమగు చుండగా   మంజూషవచ్చి  నీకోసము అతిథులు వేచియున్నారని చెప్పెను. భారతవర్ష  కండువా ధరించి మండువాలోకి వచ్చి చూడగా  విదిష కనిపించెను. పక్కనే బసవడి  
తండ్రి సర్రాజు గారు కనిపించిరి. "బసవడిని ఆసుపత్రి నుంచి ఇంటికి పంపినారని,  వారం  రోజులు విశ్రాంతి  తీసుకొనమని చెప్పినార"ని  చెప్పెను.   అదృష్టవంతులు  
మీ  అబ్బాయికి ఎముకలు  ఏమీ  విరగలేదు.  ప్రమాదమే మీ లేదు!"అని వర్షుడనెను.

"వాడి బుద్ధి మారనంతవరకూ ప్రమాదం వాడిలోనే పొంచి ఉండును.  వాడికి మాకంటే నీపైనే గురి ఎక్కువ, వాడి బుద్ధి నెట్లైననూ మంచిదారికి మరలించి పుణ్యము కట్టుకొనుము" అని సర్రాజు గారు అర్థించిరి. ఇంతలో  ఉరుములేని పిడుగువలే  దామిని హడావుడిగా ప్రత్యక్ష మయ్యెను. మండువాలోనుండి మాలినీ మాలినీ అని పిలవసాగెను. మాలిని వంట గదినుండి పరుగున మండువాలోకి వచ్చి దామిని ముఖములో ఆందోళన ను చూచి  "ఏమాయనే అంతా  క్షేమమే కదా !"  అని అడిగెను  " లకుమను పోలీసులు ఠాణాకు పిలుచుకు పోయినారు. నాకు కాళ్ళు చేతులు ఆడకున్నవి. మా ఆయన ఊళ్ళో లేకుండెను. " అని చెప్పెను. 
 
వాళ్ళ అమ్మ ఏమైననూ చిన్న బొమ్మా రాష్ట్రములో పెద్ద పేరున్న  నాయిక ఆవిడకు జెప్పక ఎందుకీ ఆందోళన. అది మొన్ననే హైదరాబాదు చేరుకొనెను. పార్టీ లో దాని పరిస్థితి అస్తవ్యస్తముగా నున్నదని నిన్న దూరవాణిలో తెలిపెను.  నిన్న లకుమ  పరీక్షలు ముగిసినవి.   నేడు వాళ్ళ అమ్మ కడకు వెళ్ళవలసి ఉన్నది. ఈ లోపునే ఇట్లు జరిగి పోయెన"ని దామిని వాపోయెను.  "ఇంతకీ ఏమి జరిగెనో తెలపక ఏమీ ముసుగులో గుద్దులాట?" అని మాలిని అనగా

 "ఆ విషయమును నేను చెప్పెదనని ధ్వజ స్తంభము వలే నున్న ఒక పెద్దమనిషి లోనికి వచ్చెను. అతడే వర్షుడి మిత్రుడు చక్రపాణి.  అతడు  లకుమ చదువు కొనుచున్న
వాసవి ఇంజినీరింగ్  కళాశాల  ప్రధానో పాధ్యాయుడు. 

ఇది లకుమ సమస్య కాదు అందరి సమస్య. అంతర్జాలమందు   ఉదృతమగ ( వైరల్) ప్రబలుతున్న లఘుచిత్రముల జ్వాలలలో యువత సలభములవలె కాలిపోవుచు న్నారు. అధిక వీక్షణలు పొందిన చిత్రములలో వారేమి జేసిననూ మనవారు అదే చేయుచున్నారు. గోడలపైన, గొందులలోను నాట్యములు చేయుచున్నారు, రహదారుల పై ద్విచక్రికావిన్యాసములతో వీధులు విమానము మోతెక్కించుచున్నారు. మా కళాశాలనుంచి  లకుమ, స్నేహ,  ఇంకా అనేకులు ఇదే పిచ్చి లో ఉన్నారు. బెంగళూరు, హైదరాబాద్, ముంబై మరియు ఇతర నగరాలతో సహా వివిధ నగరాల్లోని యువకులు ఇదే పిచ్చిలో  నున్నారు.  అధికారులు  ద్విచక్రికా విన్యాసములు(స్టంట్ బైకింగ్‌)పై కఠిన చర్యలు తీసుకున్నారు. 25,000 నుంచి 2 లక్షల వరకూ భారీ జరిమానాలు విధించుచున్నారు. పోలీసులు ఎంత కఠినముగా వ్యవహరించిననూ వీరి పిచ్చిముదిరి జాతీయ సమస్యగా పరిణమించినది.    

వర్షుడు: మన జాతి మొత్తానికి  తెగులు పట్టుటకు కారణము అవిద్య. అందుకు కారణముమనము. మనము ఎన్నడైననూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసము గూర్చి పట్టించుకొంటిమా ? ఎప్పుడు చూసిననూ గణముల కొరకు చావగొట్టుటే మనకు తెలిసిన విద్య. 

చక్రపాణి: బాబూ  నన్ను చావగొట్టకు నేనసలే  ఆందోళనలో ఉన్నాను.


వర్షుడు : ఇప్పుడు మీ విద్యార్థులనందరినీ  విడిపించవలెనందువు అంతేకదా!

 వర్షుడు : విడిపించుట కాదు  మరల ఆ పిచ్చి లో పడకుండా చూడవలెను. 

మాలిని: సాహిత్యము నిత్యమూ ఆనందమును కలుగజేయును దానిని వదిలి క్షుద్రా నందముల  వైపు పరుగిడరాదని చెప్పుచూ వర్షుడు తరుచుగా అవధానములద్వారా రచన ల ద్వారా చెప్పుచుండును.

దామిని: లకుమకు సాహిత్యము, పుస్తకపఠనము తలకెక్కలేదు. 

చక్రపాణి కి వెదుకుచున్న తీగ కాలికి తగిలినట్టయి "వసంత పంచమికి మా కళాశాలలో  జరుగు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని సరస్వతీ శతకముఆలపించి విద్యార్థులకు మార్గ దర్శనమును చేయవలెన"ని ఆహ్వానించెను.  

విదిష  భారతవర్ష పుస్తకావిష్కరణ కార్యక్రమమును సజీవ తైలవర్ణ చిత్రముగా లిఖించి తెచ్చి వర్షున కిచ్చెను.  అది చూచి విదిషకు చిత్రకళలో నైపుణ్యము పెరిగెనని ఆమెను మాలిని గారు అభినందించిరి.    చక్రపాణి ఆ చిత్రము  చూచి ముగ్దుడయ్యెను .

"ఆర్ధిక పరిస్థితి వలన చదువు ఆపివేసి చిత్రకళ చేపట్టి రాణించుచున్న ఈ అమ్మాయి పేరు విదిష.  మా వర్షుడి బాల్య స్నేహితురాలు" అని మాలిని విదిషను పరిచయము చేసెను. విదిష చక్రపాణి గారి కాళ్ళకు నమస్కరించెను. 

"మా కళాశాలలో 12వతరగతి  కూడా కలదు. నీవు చదువుకొన్నచో నీకు" .. అట్లనుచున్న చక్రపాణి వైపు భారతర్ష వాలుగా ఒక్క చూపు చూసెను  " మీ కళా శాలలో ఒక్కరికైననూ ఈ సంస్కారమబ్బేనా? " అన్నట్టున్నది ఆ చూపు.  "సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు!" అని ఆశీర్వదించి చక్రపాణి  బయలుదేరెను. భారతవర్ష కూడా బయలుదేరెను. వారిద్దరూ మండువా దాటుచుండగా అగస్త్యుడు చేతిలో వార్తాపత్రిక తో పరుగుపరుగున వచ్చెను. 

 అతను వార్తాపత్రికను వర్ష చేతుల్లో పెట్టెను.  వర్షుడు  చదువుట  ప్రారంభించెను 

"ఒడిశా రైలు ప్రమాదం" పలాస సమీపంలో హౌరా మెయిల్ యొక్క మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. నౌపుడా జంక్షన్ నుండి బయలుదేరిన తర్వాత లెవల్ క్రాసింగ్ వద్ద సాయంత్రం 4 గంటలకు ఎద్దును ఢీకొట్టడంతో ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ సంఘటన  తెల్లవారుజామున జరిగింది.  ఈ ప్రమాదంలో  నలుగురు  ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు  మిగితావారికి   స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద గాయాలతో ఉన్న ప్రయాణికులు పలాస రైల్వే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (ఆ నలుగురు ప్రయాణీకుల ఛాయాచిత్రాలు ముద్రించ బడ్డాయి.) "

రైలు ప్రమాదమునకు మనకు ఏమి సంబంధము? ఇది నాకెందుకిచ్చితివి అని వర్షుడు అగస్త్యనడిగెను. "ప్రమాదం జరిగి రైల్వే ఆసుపత్రి లో ఉన్న వారి చిత్రములు చూడుము" .ఆ మొదటి చిత్రము మా నాన్నది. అని అగస్త్యుడు అనెను.   

వర్షుడు: వెళ్లదలచితివా ? అని అడిగెను. అతడి స్వరము నూతులోనుంచి వచ్చినట్టున్నది. అగస్త్యుడు అవునని తలూపెను.

వర్షుడు: చెప్పితిని కదా సమయము వచ్చినచో ధైర్యము, మనసు అవే  వచ్చును. 
 అగస్త్యుడు నవ్వెను . వర్షుడు కూడా నవ్వెను. అగస్త్యుడు రైలు నిలయముకు బయలు దేరెను  

                                              
                                                                 ***

సరస్వతి పూజ : 

వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ తీర్చిదిద్దిన సంక్రాంతి రంగవల్లివలె, బహుళ వర్ణము లలిమిన నింగివలె, ఎర్రని తామరలు నిండిన కొలనువలె మనోహరముగా నయన పరితోషకముగా యున్నది.  వర్షుడు ప్రవేశద్వారం కడనిలిచి ఆ అలంకారములు మైమరచి చూచుచుండెను. ప్రధానోపాధ్యాయుడు చక్రపాణి మరియు ఇతర అధ్యాపక సిబ్బంది ఎదురేగి స్వాగతము పలికినారు.   విద్యార్థుల లో  అల్ప సంఖ్యాకులు పసుపు వర్ణ సంప్రదాయ వస్తములను ధరించి పొద్దుతిరుగుడు పువ్వుల తోటవలె, అమ్మవారి భక్తులవలె   అగుపించిరి.   కొద్దిమంది  విద్యార్థినులు చిలక పచ్చని వస్త్రములను ధరించి చిలకలవలె అగుపించిరి. పెక్కుమంది  వేదిక కడ  నీలి తూలోరూకములను (జీన్స్) ధరించి పుష్పాలంకృత సరస్వతీ విగ్రహముచుట్టూ చేరియున్నారు.

వారు భక్తి భావము లేక తైలసంస్కారము లేని జుట్టువలె,  రక్త హీనతగల మనిషివలె పేలవముగా అగుపించిరి. వారు పాదరక్షలను సైతము విడువక వేళాకోళము లాడుకొనుచున్నారు. వారిని చూచిన  వర్షునికి  ఎంగిలి మంగలమును సాలిగ్రామముకడ బెట్టినట్టు, మర్కటమునకు బొట్టుకాటుక దిద్దినట్టు, మార్జాలమునకు కిరీటము పెట్టినట్టు, అవలక్షణములవాడిని అలంకరించినట్టు వెగటనిపించెను. వారితో   లకుమ కూడా కూడుటతో  వర్షుడి వదనమును  విషాద ఛాయలు కారు మబ్బులవలె అలిమెను. విద్యార్థుల కలకలమును చూచి కాలహరణము చేయక చక్రపాణి మరియు అధ్యాపకులు వర్షుని నేరుగా వేదికపైకి ఆహ్వానించిరి. వర్షునికి  పుష్పగుచ్ఛ మివ్వవలసి నదిగా  కళాశాల ప్రధానోపాధ్యాయుడు కోరినప్పుడు  ఉత్సాహముగా విద్యార్థులు పోటీపడిరి. అదిచూచి  చక్రపాణి  "ఆంధ్రావనిలో ఎచ్చటకి పోయిననూ నిన్ను గుర్తింతురు కానీ  మా విద్యార్థులుకూడా నిన్ను గుర్తించుటనాకానందదాయకమ"నెను. ఒక  అమ్మాయి
వేదికనెక్కి వర్షునకు పుష్పగుచ్ఛమిచ్చెను. పెద్దలు వర్షుని వేదికపై కూర్చొండబెట్టిరి.
   
అక్కడ ఒక ప్రత్యేక ఆసనము ఖాళీగా యున్నది. భారతవర్ష దాని కేసి చూచుచుండగా చక్రపాణి అది ఒక ఆజ్ఞాత అతిథి కొరకని అతడిని చివరిలో పరిచయము చేసెదనని తెలిపెను. 

ప్రధానోపాధ్యాయుడు  ముఖ్య అతిథిని దీపం వెలిగించమని ఆహ్వానించెను. భారతవర్ష దీపం వెలిగించి ఉపన్యాసకులందరినీ దీపం వెలిగించమని పిలిచెను.   దీప జ్వలనం తరువాత  కొంతమంది పసుపు వస్త్రములు ధరించిన విద్యార్థులు  సరస్వతికి వందన గీతమును  గానం చేసిరి.  రువాత వర్షుని  ప్రసంగం ప్రారంభమాయెను. 

అందరికీ వసంత పంచమి  శుభాకాంక్షలు! 
వేదిక నలంకరించి పెద్దలందరికీ నమస్కారములు. 
విద్యార్థినీ విద్యార్థులకు ఆశీర్వచనములు.   

వసంత ఋతువును స్వాగతించడంమరియు జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని గౌరవించడం ఈ వసంత పంచమి ఉద్దేశ్యములు.  వసంత పంచమి కొత్త శక్తి, సృజనాత్మ కతలకి ప్రతీక. కళ, జ్ఞానం, సృజనాత్మకత మరియు విద్య కొరకు జ్ఞాన దేవత ఆశీర్వాదం అవసరము.  జ్ఞానమునకు అధినాయిక సరస్వతి ... వెనకనుంచి పిల్లి కూతలు వినబడి నవి. వర్షుడు మట్లాడుటాపెను. చక్రపాణి విద్యార్థులను నిశ్శబ్దముగా నుండమని హెచ్చ రించెను. వర్షుడు ప్రారంభించెను. వెనకనుంచి ఆవులింత శబ్దములు వినిపించి నవి.  వర్షుడు వరసమార్చెను. 

పాశ్చాత్త్య  నాగరికతే  ఉనికి, ఊపిరి అన్నట్టు వస్త్రధారణ,  భక్తి అనిన అజ్ఞానమని  గురువులకు నమస్కరించుట  అసౌకర్యమని భావించువారు నేటి కాలమున ప్రభలిపోవు చున్నారు.  వారు సరస్వతి పూజనేకాక సరస్వతిని కూడా లక్ష్య పెట్టరు. మరి వారు నమ్మునవి ఏమి?  అని వర్షుడు అడిగెను. 

హ్యుమానిటీ,  టెక్నాలజీ, ఈక్వాలిటీ  అను మాటలు  వెనుకనుంచి  వినిపించినవి.

భారతదేశ  రక్షణ వ్యయము ఎంతో  తెలుసునా? అని అడిగెను.  అంతా నిశ్శబ్దము  అలుము కొనెను.   భారవర్ష   "సాలీనా ₹6.81 లక్షల కోట్లు"  అనెను. ఒక్క క్షణము
అజాగ్రత్తగా ఉన్నచో రెప్పపాటులో చొరబాటుదారుల ప్రవేశించుచున్నారు దేశములను ఆక్రమించుకొను చున్నారు.మానవత్వము ఎచ్చట కలదు? అధునాతన ఆయుధములు సాంకేతిక పరిజ్ఞానము ఉన్ననూ దురాశ ఆక్రమణ  తగ్గినవా?   మానవ ప్రవర్తన ఏమి మారినది? మానవత్వమే యున్నచో అధునాతన ఆయుధములను సమకూర్చు కొనుటకు లక్షల కోట్లు ఖర్చుచేసి, భయముతో సరిహద్దుల వద్ద సైనికులను రాత్రి పగలు కాపలాపెట్టి భయముతో వణకవలసిన పనేమి?  

దేశభక్తి , దైవ భక్తి లేని వారు ఉన్నచో ఎంత సాంకేతికత యున్ననూ నిరుపయోగమే. మంగోలియన్ల దాడులను అరికట్టుటకు  2000 సంవత్సరములు శ్రమించి చందమామ నుంచి కూడా కనబడు నంత పెద్ద గోడ,  చైనా గోడ ను కట్టిన తరువాత  చైనాపై దాడులు ఎట్లు  జరిగినవి?  దేశభక్తి లేని లంచగొడులవల్ల. చక్కటి వ్యక్తిత్వమునకు, జ్ఞానమునకు స్మృతికి  భక్తి విశ్వాస ములే  మూలము. బ్రహ్మ యొక్క శ్వాస నుండి ఉద్భవించి, ప్రపంచానికి జ్ఞానం, సంగీతంఅందించిన సరస్వతి ని నిర్మల మనసుతో ప్రార్థించ రండు అని సరస్వతి పై ఒక చక్కటి గీతమునఆలాపించెను. 

చతురాస్య ముఖజం చతుశృతీ కంఠ నిక్షిప్తం..........
కమల దళ యుగళ నయన పుటం కచ్చపీ కరభూషితం  భారతీ వందనం 
కళకళలాడే నీ శశివదనం సనాతనం శుభకరం.   భారతీ వందనం.

 సుధలను చిలికే నీ శుభ వదనం, జ్ఞాన సంగీత సాహిత్య సదనం 
బ్రహ్మ ముఖమున శ్వేతాంబరివై వేదములొకచేత వీణను ఒకచేత
 పూని జనించిన జ్ఞాన రూపిణి భారతీ వందనం. భారతీ వందనం.

భారతీ వందనం భారతీ వందనం భారతీ వందనం.

సరసిజనాభుకు, పద్మభవునకు విశ్వసృష్టికి బాసటనొసగిన పలుకుజెలికి 
ఆ విద్యల తల్లికి వందనం. భారతీ వందనం. భారతీ వందనం.

నీ కన్నులు రెండు కవితాంబుధిలు ఆ అంబుధిఘోషలు నీ శ్వాసలో కదులు 
అవి కవిహృదయంలో ఆగక మెదలు 
నీ ఉఛ్వాసాన వేలభాషలు  నీ నిస్వాసాన వేదఘోషలు 
యోగ్యత భాగ్యము గలిగిన యోషలు  మార్చరు తమతమ వేష భాషలు
తెలిసిన పురుషులు పరుషములాడక సరసముగా నవరసములు గ్రోలుచు
నీ పదములపై మధుపములైవ్రాలి కవితా సుధలే గ్రోలుచుందురు

కళకళలాడే నీ శశివదనం సనాతనం శుభకరం - భారతీ వందనం 
సుధలను చిలికే నీ శుభ వదనం, జ్ఞాన సంగీత సాహిత్య సదనం
నీ శుభ వదనం ప్రతిభకు నిలయం, సుందర కళలకు ఆరంభం 
నీ హృదయం కరుణా సదనం సనాతనం శుభకరం భారతీ వందనం

భారతవర్ష పాట ముగించగానే చక్రపాణి  "ఇందాక చెప్పిన ఆజ్ఞాత అతిథి ఇప్పుడు వేదిక నలంకరించి సరస్వతీ శతకంలో వంద పద్యములను ఒక  గంటలో ఆలపించున"ని ప్రకటించెను.  ప్రకటన ముగియుటతోనే వేదికపై మరీదు కనిపించెను.   భారతవర్ష ఆశ్చర్యమునకుగురి అయ్యెను. అతడు ఆశ్చర్యము నుండి తేరుకొ నులోపు మరీదు సరస్వతి ప్రార్ధన పద్యములు మొదలుబెట్టెను. 
  

నీరద  యాన స నాతని          

వారము లోనిల చి యుంటి వాక్జెలి నీకై     

నేరము లెంచక రమ్మా 

కోరన విద్యల నొసగుము  కూరిమి  తోడన్ 


ధనమెం   తున్నను  అందున   

ఘనమే  మికలదు  తలంప  కలిగే యాలో 

చనలే  ముందుకు  నడుపిం    

ధనమం   చుతెలిసి  నవాడు  ధన్యుడు ఇలలో 


జాపితి  కరములు నీకడ 

జూపుము నీదయ నొసంగి  శుభమగు  విద్యన్ 

చూపుము  తోవను ముందుకు 

దీపుర  మగుకను  లతోడ   దీపము  నీవై 



మందమ   తినిమతి మరుపును 

తొందర తలపు   లనెల్ల   తొలగిం  చమ్మా            

 అందరు మెచ్చెడి గుణమును   

 చిందర   కానిత  లంపులు  చిరముగ నిమ్మా  


వందన  మగునీ  వదనము  

కుందన కాంతుల నుచిమ్ము కోపము   లేకన్

పొందిక   కగలధి  నాయిక         

సుందర రూపము   నుచూడ   శోకము  తొలగున్ 


వదలను భారతి పదములు    

వదలను పుస్తక  ముచూపు   మార్గము విడిచా     

పదలను ఎన్నడు పిలువను 

మదకట  వెలుతురు నుదెచ్చు  మనసుకు   విద్యే 


వందన మిదిగో  భారతి

సుందర   సుమముల నుదెచ్చి   శోభిత  మగునీ 

స్కందము లకుమా  లగవే 

సందమ   మగురూ     పుచూడ   సంతస   మవదా 


కోరిన విద్యల   నిచ్చెడి 

 భారము   నీదిక   బలమగు  బాటను చేసా  

 సారము నియ్యగ వేడెద  

 కూరును  నీదయ   కలిగిన   కోరిన వెల్లన్ 


 ప్రతిమ   చదువరి మనసున    

ప్రతిష్ట జేసిన దిజాలు ప్రతిభ తానే             

 పాతము  వలెవ  చ్చి బడును    

 స్మృతియు కూడును చదువరి  సతకాం తుడగున్


పదికా వ్యముల నింటికి 

 విధిగా దెచ్చిచ దవంగ విజయం తథ్యం 

 సుధలే నోటన పొంగగ 

 బుధుడే నీచెలి మికోరు భుమిలో సుమతీ

మరీదు అట్లు అవలీలగా శతకమును పూర్తి చేసెను. అందరి కరతాళ ధ్వనులమధ్య వర్షుడు మరీదుకి  సన్మానము జేసెను.  మరీదు కళ్ళు చెమర్చినవి. 

                                                                     ***



 










 
   


Monday, July 13, 2020

Bharatavarsha 5 Basava in hospital


బసవని తలకు కట్టు కాలికి కట్టుతో ఆస్పత్రిలో మంచముపై స్పృహలేక పడియున్నాడు. బసవడి  తలిదండ్రులు బుచ్చమ్మ , రాజుగారు, చెల్లి  రమ్య,  అగస్త్య పూర్ణిమ  అతడి మంచము వద్ద నుండిరి.  బసవడు మెల్లగా కళ్ళు తెరిచి వారిని చూచెను. ద్విచక్ర వాహన ఊరేగింపు  (బైక్ రాలీ)లో ద్విచక్రికను అతివేగముగా నడిపి,  ముందుపోవు వారిని అధిగమించు  చుండగా ఎదురుగా వచ్చిన భారీ వాహనము ఢీకొని తలకి కాలికి దెబ్బలు తగిలెను. బైరెడ్డి వచ్చినాడు. ఆ ఊరేగింపు నిర్వాహకుడు అతడే. బసవడికి అతడే తన వాహనమునిచ్చెను. రాజుగారిని బైటకు పిలిచెను.  కాసేపు పిదప బసవడి  తండ్రి లోపలకి వచ్చి  భార్యకు మెల్లగా ఎదో చెప్పి  ఆమె చేతి బంగారు గాజులు తీసి ఇవ్వగా  బైటకు వెడలెను. బసవడు ఏమైనదని తల్లిని అడిగిననూ ఆమె మౌనము వహించెను.  

అహ్మద్ బైరెడ్డి  వచ్చి  వాహనము బాగుచేయించుటకు పదివేలు పట్టుకుపోయినారు. అని వారి సంభాషణ విన్న బసవడిచెల్లి రమ్య చెప్పెను.  బసవడికి కళ్ళు మూతలు  పడినవి. వైద్యుడు వచ్చి అందరినీ బైటకు పంపివేసెను. బసవడు అట్లు ఎంతసేపు ఉండెనో అతడికి గుర్తు లేదు.  స్పృహ వచ్చిన పిదప ఎవరో ఇద్దరు మగ గొంతులు వినిపించుచుండెను.  బసవడు కొద్దిగా కనులు తెరిచెను.  తన గదిలో ఎదురుగా సందీపుడు , రాఘవ కూర్చొని యుండిరి.   

బుద్ధిమంతులు పెద్దలు చెప్పగా విని నేర్చుకొందురు. మూర్ఖులు అన్నీ తమ అనుభవముద్వారా నేర్చుకొందురు. బసవడు మూర్ఖుడు వాడికి ఇట్లు కావలసినదే. అని సందీపుడనెను. రాఘవ నీవేనా అట్లనుచున్నావు అని సందీపుడు అనగా "మరేమి చేయమందువు. వాడికి జ్ఞానము లేదు మంచి ఏదియో  తోచదు. ఎవ్వరు చెప్పిననూ వినువాడు కాదు. తల్లితండ్రులనే కొట్టు రకము. బాధపడనిచో వాడికి బోధపడద"ని రాఘవ అనెను.  వారాడుమాటలు వినదలిచి  బసవడు కనులు  మూసుకొనెను.

సందీపుడు " ఇతడి తలిదండ్రులను చూచిన జాలికలుగుచున్నది వీడి దుస్థితిని చూచి వారెంత దుఃఖించుచున్నారో "  అనెను 

రాఘవ: బసవడి దుస్థితికి కారణము వారే. తల్లి అతిగారభము చేసినది.

 సందీపుడు : కానీ తండ్రి ఎప్పుడూ మందలించుచుండును కదా.

వీడు పూరిగా చెడిపోవుటకు కారణము తండ్రే. ఎదో ఒక రకముగా చదువు పూరి అయ్యి పట్టా చేతికొచ్చిన చాలని " నిన్నూ  రాఘవ వలె  అమెరికా పంపించెదన"ని కొడుకుకి చెప్పుచుండును.  అమెరికాలో భారతీయుల పరిస్థితి దారుణముగా నున్నదని నేనెంత చెప్పిననూ అతడు పట్టించుకొనడు."అని రాఘవ అనెను. "అటువంటి తండ్రులు ఉందురా!" అని సందీపుడు నోరెళ్ళ బెట్టెను. అదే సమయమున సీతారత్నం వచ్చి, బసవడికి బుట్టతో తినుటకు తెచ్చి అతడు పడుకొని ఉండుట చూసి   రాఘవను పలకరించెను "

 ఏవయ్య రాఘవా ఇప్పటికైనా  అర్థమైనదా  ఇచ్చట జీవితము లేదని . మా అబ్బాయి కృష్ణుడు అచ్చటే యున్నాడు.  ఇచ్చట కాళ్ళీడ్చుకొని తిరుగుటమాని  అమెరికా మరల పొమ్ము  అద్భుతముగా నుండును. అని హితవు పలికి వెడలిపోయెను. 

కొడుకుకి అచ్చట ఎటున్నాడో కానీ అతడు అమెరికాలో ఉన్నాడని చెప్పుకొనుట ఈమెకి అద్భుతముగా యున్నది. అచ్చట ఎంత అద్భుతముగా నున్నదో నిజము నిలకడ మీద తెలియును అని రాఘవనెను. 

పెద్దలకి  అమెరికాయే స్వర్గము. పిల్లలకి సినిమా యే  స్వర్గము  అని  సందీపుడు అనగా

"సినిమా నటులను స్వాతంత్య్ర  సమరయోధులవలె   చూపించు చున్నారు కదా! రౌడీలను నాయకులుగా చూపించుచూ యువకుల  మనస్సులను నేరపూరిత విషయాల వైపు ఆకర్షించుచున్నారు . చెత్త భాష,  ప్రవర్తనను  ప్రజాదరణ పొందేలా చేయుచున్నారు."

"హీరో పాత్ర ద్వారా వారు సమాజంపై మరియు సంప్రదాయాలపై దాడి చేయుచున్నారు. ఉపాధ్యాయులు మరియు సమాజంలోని పెద్దల పట్ల   నిర్లక్ష్య మరియు ధిక్కార వైఖరి వారు వీరోచితంగా చూపిస్తున్నారు పండితుడు కంటే ఒక నేరస్తుడు పోకిరీ గొప్పవాడని  చూపుచున్నారు. 

"మన  యువకులు వారిని  గుడ్డిగా అనుసరిస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు . వారు వెండితెరపై చూసేది  వాస్తవికత కాదని నిజజీవితం అందుకు భిన్నంగా ఉండునని గ్రహించలేకున్నారు.   పాఠశాలలు  సినిమా వ్యతిరేకంగా విద్యను అందించాలి కానీ వారు పరీక్షలు, మార్కులే తప్ప ప్రవర్తన ని పట్టించుకోడంలేదు. తొలినాళ్లలో సినిమా ప్రజలను అలరించే సందేశం తో కూడిన వినోదం అందించేది . మాయాబజార్ మరియు పాండవ వనవాసం వంటి చిత్రాలు మన సంప్రదాయాలు మరియు ఇతిహాసాల గురించి జ్ఞానాన్ని ఇచ్చాయి. నేటి సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, హింస కామాన్ని  రెచ్చగొట్టే   సినిమాలు తీసి  గల్లా  పెట్టెలు నింపుకుంటున్నాయి. 


సందీపుడు :  తెల్లవారి వలెనే  పరిస్థితి  ఇంత దిగ జారినది. వారే మితిమీరి హింస శృగారములకు ఆద్యులు.  

రాఘవ : జేమ్స్ కామెరూన్  కెనడా చిత్రనిర్మాత. అతను 'భగవద్గీత' నుండి ప్రేరణ పొంది 'అవతార్' చిత్రాన్ని నిర్మించెను. అంతర్జాతీయ చిత్రనిర్మాతలు హిందూ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది చిత్రాలను రూపొందించుచుండగా , మన చిత్రనిర్మాతలు మన సంప్రదాయాల నుండి తప్పించు కొనుచున్నారు. చిన్నప్పుడే టీచర్ తో ప్రేమ, తల్లి తండ్రులని తన్నడం,   పెళ్ళికి ముందు సహజీవనం వంటి సినిమాలు తీస్తున్నారు.  నకిలీ ప్రేమ,  వర్గ పోరాటం, రౌడీల కథలను చూపుటకు  ఆసక్తి చూపుతున్నారు, తరచుగా గురువులను మరియు దేవుళ్లను అవమానించుచూ  నటులను దేవుళ్ళుగా చూపుచున్నారు.


సందీపుడు :నిజ జీవితంలో  నటులలో అనేకమంది  క్రూరులు  నీచులే.  వాస్తవానికి వారు కీర్తి పేరుతో డబ్బును దోచుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది ఆదాయపు పన్ను చెల్లించరు.ఇది తెలిసినవాడెవ్వడైననూ  వారిని అసహ్యించుకొనును. నన్ను పిలచిననూ నేను ఊరేగింపులో పాల్గొనలేదు.  

"అలాటి  నటుల పుట్టినరోజులు జరుపుకోవడం, రోడ్లపై వారి నిలువెత్తు బొమ్మలను పెట్టడం  పెట్టడం, వాహన ఊరేగింపులు నిర్వహించడం ముఖ్యంగా పాలాభిషేకం చేయడం  ఎంత సిగ్గుమాలిన చర్య !  ఇది పాఠశాలలకు అవమానం."

"రెండేళ్ల క్రితం తమిళనటుడి విజయ్ ఇంట్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేశారు. 66 కోట్ల నల్లధనాన్ని కనుగొని వారు ఖంగు తిన్నారు.  అది నల్లధనం కాదు.  ప్రజాధనం. ఈ సంఘటన మొత్తం తమిళ రాష్ట్రాన్ని కుదిపి వేసెను. ఇలాంటి సినీ నటులు వెండితెరపై పేదలకు న్యాయం కోసం పోరాడుతారు  చూసి చప్పట్లు చరుచువాడు చదువుకొన్నవాడు నీచుడగును "

ఇట్టి నీచులు స్వాతంత్ర్య సమరయోధులు, గొప్ప నాయకుల పుట్టినరోజులలు ఎప్పుడూ జరుపుకొనరు    అమ్మ నాన్న పుట్టిన రోజులు వీరికి గుర్తుండవు .

సంభాషణ ముగిసెను వారిరువురూ వెడలిపోయిరి . బసవడి కళ్ళు తెరుచుకొనెను. 

                                                                            ***

అన్న సంతర్పణ అవధానం ముగిసినది.  భారతవర్ష, అగస్త్య ఇద్దరూ  పెరటి  చెట్టు క్రింద  కూర్చుని  మాట్లాడుకొనుచుండగా    మంజూష లకుమను  తోడ్కొనివచ్చెను. “వర్ష,  కార్యక్రమము ఎట్లు సాగెను ,సమయమునకు రాలేకయినందుకు విచారించుచున్నాను  ఏమీ అనుకొనరాదు “ అని లకుమ  అనెను.  

“విచార మెందులకు  రాకూడదనే నీవు  రాలేదు , నీకు అవధాన ప్రక్రియ అనిన వెగటించునని మా అన్నకు తెలియునులే అని మంజూష హాస్యమాడుచుండగా వర్షుడు  “ఓహో లకుమా! ఎప్పుడువచ్చితివి? పొద్దుపోయి వచ్చితివే, అనెను. “నీవునూ  దామినివలె మాట్లాడుచున్నావు,  నాలుగు  రోజులులో  నా పరీక్షలు ముగియును. నేను మా అమ్మ  వద్దకు హైద్రాబాదు పోవుచున్నాను. నిన్నొక చిన్న సహాయమర్ధించ వచ్చితిని” అనెను  చేయగలిగినదేదైనా తప్పక చేతునని వర్ష పలుకగా. “ నేను కళాశాల వసతి గృహమునకు పోయి చదువుకొందును. నాకు దామిని వసతిగృహమునందు స్వేచ్ఛలేదు. నా కదలికలపై దామిని ఆరాలుతీయుట నాకు మిక్కిలి అప్రియముగ నున్నద”ని  లకుమ  అనెను.  

వారు మాటలాడుచుండగా కాఫీ తెచ్చుటకు మంజూషలోపలికి పోయెను. లకుమ అగస్థ్యతో కరచాలనము చేసెను. అది చూచి  మాలినిగారు  "ఒకే పాఠ శాలలో  చదువుకొన్న మీ అందరూ ఇట్లు కలుసుకొనుట చూచిన ముచ్చటగానున్నది. లకుమా, దామిని ఉత్తమురాలు నీక్షేమము కోరే ఏదైననూ చెప్పును.”అని అనిరి “ఆమె పురాతన పద్ధతులు నావంటికి సరిపడవు. స్వేచ్ఛా భావములు గల ఏ ఆధునిక  స్త్రీ ఆమెను మెచ్చదు.” అని లకుమ అనెను. 

నీ స్వేచ్ఛను ఆమె ఎట్లు హరించివేయుచున్నదో తెలుపుము అని వర్షుడు చల్లగా అడిగెను 

అఖిల భారత విద్యార్ధి సంఘం నేడుదేశవ్యాప్త సమ్మెకు   పిలుపునిచ్చెను  ఆ  సమ్మె లో  నేను పాల్గొన్నందుకు పెద్ద రాద్దాంతము జేసెను.  విద్యార్థులు విప్లవాల్లో పాల్గోనవలెనని విద్యార్ధి సంఘాలు కోడై కూయుచున్నవి. దామిని అవేమీ ఎరుగదు ఆడది సంసారము ఇంటిపనులకొరకే పుట్టెననన్నట్లు మాట్లాడును. అని లకుమమండి పడెను.

"చదువుకుని   గరిట పట్టుటయా ఛీ ఛీ  ఎంత సిగ్గు చేటు ఎర్రజెండా పట్టి పోలికేకలు వేయవలెను కానీ!" అని వర్షుడు వ్యంగముగా అనుటలో కనిపెట్టి "నీ వెప్పుడు రచనలు, అవధానములు  చేసుకొనుచూ అదే లోకము అనుకొనుచున్నావు. నీకు స్త్రీ వాదము గురించి స్వేచ్ఛ విప్లవముల   గురించి ఏమి తెలియును ? అని వర్షునికి  ఘాటు గా సమాధానమిచ్చెను. 

స్త్రీవాదమీ నీకు తెలియును దాని వెనుక ఉన్న కుట్ర నీవెరుగవు. మగవానితో అన్ని రంగములందు పోటీపడి రాణించవలెనని.  మగవానివలె  దుస్తులు వేసుకుని  తమది కాని మగ బ్రతుకు బ్రతుకుట  భారమని నేడు ఆలస్యముగా స్త్రీలు తెలుసుకొనుచున్నారు. మగవాని వలే పనిచేసి  సంపాదించుచూ, ఇంటికి వచ్చి మరల ఇల్లాలి బాధ్యతలు నిర్వహించుటతో స్రీలు  శ్రమదోపిడీకి గురి అగుచున్నారని తెలుసుకొనుము. 
 
"ఇంకా స్వేచ్ఛ అనే త్రాగుట , తిరుగుట అని భాద్యతలను విస్మరించుట  అనుకొనుచున్నారు. ఎట్టి భావములను స్వేచ్చాభావములని తలకి పట్టించుచున్నారో నేటి కాలమందు చలన చిత్రములను చూచెడి వారికి  తెలియున"ని మాలినిగారు అనగా వర్షుడు " చూచెడి వారికి చూచి చెడిన వారికి కాదమ్మా ఆలోచించెడివారకు తెలియును. చలచిత్రములలో సంభాషణాలేకాక  కాక  గీతములందు కూడా  ఇట్టి చెత్త భావములనే దట్టించి శ్రోతలపై  రుద్దుచున్నారు." అని వర్షుడనగా "చిత్ర గీతములందు  ఏమి దట్టించారయ్యా   నేను  చెవులో ఈ పాటల యంత్రము నుంచుకొని  నుంచుకొని నిత్యమూ  అనేక గీతములను వినుచున్నాను నాకేల కనిపించవు? "అని లకుమ అనెను.  

"లకుమా నీవు ధన్య జీవివి."  అని అగస్త్యుడు అనెను.   

వర్షుడు " ఏదీ  నీ  పాడు యంత్రమును ఇటిమ్మ"ని తీసుకొని మీట నొక్కగా ఒక తెలుగు చిత్ర గీతము వినిపించుచుండెను. "చెవికి పోగు పెడితే తప్పు , జుట్టుకు రంగు కొడితే తప్పు ఒంటికి టాటూ వేస్తే తప్పు ఫ్రెండ్స్ కూడా తిరిగితే తప్పు , బొడ్డుకి రింగు పెడితే తప్పు టైటుగా ప్యాంటూ వేస్తె తప్పు నైట్ అంతా మెలకువ తప్పు 9'o క్లాక్ లేస్తే తప్పు  బ్రేక్ ది రూల్స్ ....ఎగ్జామ్  ఫీజు నొక్కితే తప్పు పరీక్షా వేళా క్రికెట్ తప్పు ఊరుకుంటే ఎన్నో చెబుతార్రా  బ్రేక్ ది రూల్స్ ..." వర్షుడు యంత్రమును కట్టేసి ఇలాటి పాటలు విన్నచో ఎవడైననూ  బాగుపడునా ?"  అనెను 

లకుమ : కానీ సంగీతము అద్భుతముగా నున్నది కదా!

అగస్త్యుడు : ఆ హా హా ఏమి బుర్ర ఏమి బుర్ర  ఆలోచనా రాహిత్యము వరప్రసాదము తల్లీ  సాహిత్యము ఎంత చెత్తగానున్ననూ మనకభ్యంతరము లేదు. పచ్చగడ్డి కైననూ మసాలా దట్టించినచో లొట్టలేసుకుని తినుటకు జనులు అలవాటు పడినారు.  హేపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యరా , హత విధీ!  ఇది తెలుగు పాట అట. " అని అగస్త్యుడు ఈసడించెను. 

లకుమకు అగస్త్యునికి వాగ్యుద్దము మొదలాయెను. ఇంతలో మంజూష కాఫీతో ప్రవేశించి అంతటితో ఆపవలెను సినిమాలను ఎక్కువ చర్చించిన అంతకంటే పాపము మరొకటిలేదు అనుచూ అందరికీ కాఫీ ఇచ్చి వర్ష నేడు కార్తీక పౌర్ణిమ మరిచితివా అనిగుర్తు చేసెను. ఓహో మరచితిని , నేడు పౌర్ణమి పూజ కలదు." అనెను. 


అదివిని లకుమ నవ్వుచూ "నీకిటువంటి చాదస్తములు కలవని నాకు తెలియదు,  సంధ్యావందనాలు, పూజలు, వ్రతాలు… విసుగు."  అని లకుమ అనగా  మంజూష "ఈ పూజ ఎందుకు చేతురో తెలుసా? యని అడిగెను.  " నీవు ఈ మూడాఛారామని వదలి విప్లవాల బాటలో  నడచుట మంచిది.   " లకుమ హితవు పలికెను .

నీకు హితబోధ బాగుగా జరుగుచున్నదే! నీకు చెప్పిన వారిని పూజలనాపమని చెప్పి వారు ఒప్పుకొందురేమో తెలుసుకొనుము . అని మంజూష అనెను.   

అఖిల భారత విద్యార్ధి సంఘం నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె లో పాల్గొంటివికదా  ఇంతకూ సమ్మె ఎందుకో తెలుసుకొంటివా ? అని అగస్త్యుడు అడిగెను  

కేరళలో కాషాయీకరణ జరుగుచున్నదట. దానికి వ్యతిరేకముగా నాదములు చేసినాము.  

అగస్త్య  : కాషాయీ కరణ జరుగుచున్నదా అనగా నేమి ? 
 లకుమ: వారంతే జెప్పినారు. అని లకుమ మూతి విరిచి ముఖము తిప్పుకొనెను  
బాగు బాగు  ఆ రెండు ముక్కలు జెప్పి చేతికి జెండా ఇచ్చినారన్నమాట. అచ్చట విశ్వవిద్యా లయములో సరస్వతి విగ్రహమును తొలగింప మని వీరు యాగీ చేయుచున్నారు అని అగస్త్యుడు విషయమును జెప్పెను. 

సరస్వతి  విద్యలకు అధినాయిక ఆమెను తొలగించుటన్న విద్యను తొలగించుటయే.  ఈ పనులన్నీ చేయువాడు  బైరెడ్డి  అహ్మద్   వారితో నీవు జేరుటయా?  నీ వేలుతో నీ కన్ను పొడుచుచున్నారు.  అని మాలిని ఆవేదన చెందెను . వచ్చే వసంత పంచమినాడు సరస్వతి పూజ చేయుము. అని మంజూష లకుమకు  పరిహారము చెప్పెను.      

లకుమ : శాస్త్ర  సాంకేతిక పరిజ్ఞానము మాత్రమే మానవాళికి వెలుగు చూపగలదు 
అగస్త్య : విప్లవం కూడా ఉండవలెను. ఎందువలెననగా వారు చెప్పినదానికి మనము డూ డూ బసవన్న వాలే తలా ఊపవలెను కదా! 

 వారట్లు మాట్లాడు కొనుచుండగా వర్షుడు పోయి సంధ్య వార్చుకొని వచ్చెను.
నీకు ఈ చాదస్తము కూడా ఉన్నదా అని లకుమ వర్షుని చూసి నవ్వెను 

"స్నేహితులు చెప్పినది విని నీవట్లనుచున్నావు కానీ నీకై నీవు చదివి , శోధించి తెలుసుకున్నది కాదు.  లకుమ  "గూగుల్ నందుకూడా అట్లేయున్నది " అనెను. " గూగుల్ నందు ఒక అజ్ఞాని అట్లు వ్రాసిన అదియే నిజమని నమ్మతగదు. గూగుల్ నందు కొన్ని తప్పులు దొర్లినచో వారునూ సరి చేసికొందురు. నేడందరూ ఏది ప్రచారము గావించిన అదే నిజమని నమ్ముచున్నారు.  సంధ్యా వందనము సూర్యుడికి శక్తినిచ్చి  ఆధ్యాత్మికంగా  విశ్వానికి చైతన్య మిచ్చును."
 
ఏమో నాకు తెలియదు సంధ్యావందనము మూఢనమ్మకమును బ్రాహ్మణులు అందరిపై  అని లకుమ అనగా ,  సంధ్యావందనము చేయమని   బలవంత పెట్టి రుద్దువారెవరు కలరు .     

మరి విప్లవమను అమాయకులపై  ఎవరు ర్ధుచున్నారు?  తెలియునా ? తెలుసుకోకున్నచో నీవే నష్టపోయెదవు. మన కళాశాలలో విద్యార్థులే కళాశాలలోంచి విప్లవం లోకి విప్లవంలోంచి అడవుల్లోకి  అచ్ఛనుండి శాశ్వత చీకటిలో కి పోయిరి. 

విప్లవమంటే  అన్యాయం పై తిరుగుబాటు అని అమాయకులని ఆవేశపరులని రెచ్చగొట్టి  ఉద్యమాల్లోకి లాగుతారు . కానీ  ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక టూల్ విప్లవం. విప్లవమంటే  ఒక రాజకీయ మాఫియా . దానికి మొదటి స్థాయిలో  స్టూడెంట్ ఫెడరే షన్, పీ. డి. ఎస్. యు నగరాల్లో ఉంటాయి.  అవి మంచి ని నాదాలతో  తో ఆవేశపరులు ఆకట్టుకుంటాయి. దాని కాళ్లు చేతులు అడవుల్లో ఉంటాయి. పీపుల్స్ వార్ గెరిల్లా వార్,  అవి రవన్న వర్గం, ఆశన్న వర్గం, వేణు అన్న వర్గం, రామకృష్ణ వర్గం ఇలా వర్గాలుగా ఉంటాయి. 

విప్లవం తల రాజకీయ పార్టీ. ఆ తలలో ఆలోచన ఏంటి ? 
రాజ్యాధికారం. 1967లో పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరి గ్రామంలో స్థానిక భూస్వాములు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ నాయకుల నాయకత్వంలో సాయుధ రైతు తిరుగుబాటుతో నక్సలిజం ప్రారంభమైంది. మావో జెడాంగ్ బోధనల నుండి ప్రేరణ పొందిన ఈ ఉద్యమం "ప్రజా యుద్ధం" ద్వారా రాష్ట్రాన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది.

 విప్లవం అంటే కనిపించని రాజకీయం. 

రష్యన్ విప్లవం: రష్యాలో విప్లవాన్ని  లెనిన్ నేతృత్వంలోని రాడికల్ రాజకీయ సమూహం బోల్షెవిక్‌లు ప్రారంభించారు. అక్టోబర్ 1917లో, బోల్షెవిక్‌లు  ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రారంభించి, కీలకమైన భవనాలను స్వాధీనం చేసుకుని,  ప్రభుత్వాన్ని పడగొట్టి  సోవియట్ నేతృత్వాన్ని మార్చారు.     ఈ  సంఘటనను అక్టోబర్ విప్లవం అని పిలుస్తారు.

 

ఫ్రెంచ్ విప్లవం   :ఫ్రెంచ్ విప్లవం 1789 నుండి 1799 వరకు ఒక దశాబ్దం పాటు కొనసాగింది. ఇది 1789 ఎస్టేట్స్-జనరల్‌తో ప్రారంభమై 1799 నెపోలియన్ బోనపార్టే ప్రభుత్వాన్ని పడగొట్టడంతో ముగిసింది. 

స్పానిష్ విప్లవం : స్పానిష్ విప్లవం" 1936 నుంచి 1939 వరకు కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాగింది .  రిపబ్లికన్ లోయలిస్ట్ వర్గానికి, నేషనలిస్ట్  వర్గానికి మధ్య జరిగిన పోరు.  నేషనలిస్ట్ వర్గాన్ని నడిపించింది ఆర్మీ జనరల్ ఫ్రాన్సిస్కో. ప్రజలని రెచ్చగొట్టి,ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ మాన్యుయెల్ అజాన్యా ప్రభుత్వం పైన ఆర్మీతో తిరుగుబాటు చేసాడు.  జర్మనీ, ఇటలీ సహాయంతో ప్రజాస్వామ్య  ప్రభుత్వాన్ని కూలద్రోశాడు.  జాతీయవాదుల విజయం ఫ్రాన్సిస్కో నియంతృత్వంతో స్పానిష్ విప్లవం  ముగిసింది.

విప్లవం అంటే విదేశీ శక్తులు : తిరుగుబాటు ఎక్కడ మొదలైనా పొరుగుదేశాలు ప్రవేశించడం మామూలే కదా. చాలాదేశాల్లో తిరుగుబాటు చేయించేవే అవి. నీ చదువుని బుర్రని , చదువుని జీవితాన్ని మన దేశాన్ని  అల్లకల్లోలం చేసేదే విప్లవం.  ఉద్యమాలన్నీ నిజాయతీగా జరిగినవా? అంటే ప్రజలకోసం లేదా ప్రజా ప్రయోజనాల కోసం జరిగినవి కావు. ఉద్యమాల్లో ఎక్కువ రాజకీయ ప్రయోజనాలకోసం జరిపించినవే.  అందుకే  లెనిన్ "ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో తెలుసుకోవాల”ని అంటాడు.      

 నర్మదా బచావో ఆందోళన్ క్రియాశీలక  పాత్ర వహించిన మేధా పాట్కర్  పేరు వినియుందువు . ఆమె లేవదీసిన ఉద్యమం అభివృద్ధికి ఆటంకం అని ఆలస్యముగా తెలిసినది   నర్మదా బచావో ఆందోళన్ లో  సర్దార్ సరోవర్ ఆనకట్ట ప్రాజెక్టును బాగుగా  ఆలస్యం చేసినది , ఆమీ ఉద్యమంవలన వలన దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి అవసరమైన నీరు మరియు విద్యుత్ లభించలేదు   

అభివృద్ధి ప్రాజెక్టులను నిరోధించడానికి పాట్కర్ యొక్క  సేవా సంస్థలు అంతర్జాతీయ సంస్థల నుండి (ఫోర్డ్ ఫౌండేషన్ మరియు జార్జ్ సోరోస్ నుండి నిధులు స్వీయకరించినవి. అవి మొత్తంలో డబ్బును తీసుకొనెను 

లఢక్ కు చెందిన విద్యా , వాతావరణ  క్రియాశీలక కార్యకర్త  సోనమ్ వాంగ్చుక్ ప్రజలను ప్రత్యేక రాష్ట్రము కావలెనని రెచ్చగొట్టి పెద్ద రగడ సృష్టించి వార్తలలోకి ఎక్కినాడు. అతడి బ్యాంకు ఖాతాలలో కోట్లాది రూ పాయలకు లెక్క లేదు అనుమతి లేకుండా యితడు కోట్లకొలది  విదేశీ నిధులను పొంది యున్నాడు

హెచ్ ఎం టి,  బి ఈ ఎల్ ,  ఎం టి పి సి, ఏర్ ఇండియా , బీ ఎస్ ఎం ఎల్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు  తప్పుడు కార్మిక సంఘాలకి వారి  విప్లవాలకు, సమ్మెలకు  బలిఅయిపోయినవి.అని భారతవర్ష చెప్పగా  

 “లకుమ ఆశ్చర్య పోయెను ఇవన్నీ ఎప్పుడు చదువుచున్నావు ? నేను చదువజాలను కానీ చెప్పినచో  వినుటకు బాగున్నది” లకుమఅనగా. అగస్త్య “అదియునూ ఒక సుగుణమే, నేటివారికి పుస్తకపఠనమన్న అత్తిపూచినట్టే.  కోటికొక్కడు పుస్తకపఠనము నందు ఆశక్తి కనబరుచును” వినుట కూడా  గొప్ప సుగుణమే. వినుటకు కూడా ఇష్టపడనివారుందురా అని లాకుమా అనగా. " మన బసవడు ఉన్నాడు కదా " అని అగస్త్యుడు గుర్తుచేసేను.



శ్రీ తులసి ప్రియ తులసి జయమునియ్యవే జయమునియ్యవే .. సతతము నిను సేవింతుము సత్కృపకనవే” మంజూష తులసి పూజాగీతమును పాడి  ప్రదక్షణ ఆచరించి పూజ ముగించి న తరువాత అందరూ లోపాలకి వెళ్లిరి. అబ్బో నీకిట్టి పాటలు వచ్చునా ! అని అగస్త్య అనగా   మాలిని గారు “పూజలు  వ్రతములు  ఖగోళ గతులను నిత్య జీవితమునకు దగ్గరగా తీసుకువచ్చి నిత్యా జీవితమును ఆనందమయము చేయునని నమ్మినచో  అందరూ నేర్చుకొనవచ్చు”  

సంస్కృతి సంప్రదాయములు దేశభక్తి లేని  సాంకేతిక పరిజ్ఞానము కొయ్యగుర్రము వంటిది చక్రములు లేని వాహనము వంటిది. అని వర్షుడు చెప్పెను లకుమ, అగస్త్య  ఇరువురు బయలుదేరవలెను అనగా " నేడు అతిధులకు భోజనము పెట్టుట మన సంప్రదాయము కావున పూజ చూసి భోజనం చేయవలసినదిగా మాలినిగారు కోరిరి . 


భోజనములు  ముగిసిన పిదప వర్ష గదిలో గోడపై అతికించి ఉన్న చిత్రము అగస్త్య లకుమలను ఆకర్షించెను. అది ఒక పెద్ద వృక్షము. దాని దిగువున వంశ వృక్షము అని వ్రాసి ఉన్నది.  ఇది ఎందులకు ? అని అగస్త్య ప్రశ్నించెను. “మీ తాతగారి గురించి  నీకెంత తెలియును అని అడిగెను ?”   అని వర్ష అడుగగా “చాలా  కొంచెము తెలియును” అని అగస్త్య అనెను.  మీ తాతగారి నాన్నగారి గురించి ఏమైనా తెలియునా ? అని అడుగగా అగస్త్య పెదవి విరిచెను. వర్షుడు" తెలుసుకొనుటకు ప్రయత్నించుము నేను ప్రయత్నించుచున్నాను" అనెను నీకు ఇట్టి ఆసక్తి ఎట్లు కలిగెను అని అగస్త్యుడు అనగా  

వర్షుడు  "మా తాతగారు సైన్యమునందు పనిచేసి రెండవ ప్రపంచ యుద్దములో పాల్గొనిరి. భారత సైనికులు రెండు లక్షల యాబదివేలమంది పాల్గొనగా ఎనబదివేలమందికి పైగా వీరమరణము పొందిరి.  ఆ కాలమందు సైనికులు గోతులులో  రోజులతరబడి కూర్చొని ఉండెడివారు. వారు ఏదైనా ఆరోగ్య నెపమున సెలవడిగిన కాల్చి చెంపెడివారు , బయటకుపోవుటకు అవకాశములేక  నిస్పృహ తో తుపాకీ గొట్టమును నోటిలో పేల్చుకుని  సెలవు తీసుకొనెడివారు.
వర్ష: మా తాతగారు యుద్ధమందు వీరమరణము  పొందినారు.
అగస్త్య: ఏ యుద్ధమందు  వీర మరణము పొందినారు?  

“1940 దంకెక్ అనే ఫ్రెంచ్ పట్టణములో జర్మన్ సేన బ్రిటిష్ సేనను అడ్డగించి వెనక్కి పంపింది. అడాల్ఫ్ హిట్లర్ “బ్లిట్స్ క్రీగ్” ,ఒక తరహా మెరుపుదాడి, పథకం వల్ల 68,000 బ్రిటిష్ సైనికులు చనిపోయారు అందులో మా తాతగారు ఉన్నారని భావన. మాతండ్రిగారు,  కూడా అట్లే సైన్యమునందు పనిచేసి వీరమరణము పొందినారు.”
అగస్త్య: భావన అనుచున్నావు, ఖచ్చితంగా తెలియదా ?
వర్ష : ఎట్లు తెలియునోయి అది యుద్ధము, భౌతిక కాయాలని ఇండ్లకు పంపుటకు ఎట్లు వీలుపడును? సమాచారం కూడా ఊహామాత్రమే. దంకెక్నుంచి నలుగురు ఈతగాళ్లు ఈదుకుని ఇంగ్లాండ్ పోయినారని అప్పట్లో అనుకున్నారట. గజఈతగాళ్ళు మాత్రమే అట్లు చేయుటకు వీలున్నది. మాతాత గజ ఈతగాడు.
అగస్త్య: నాకునూ మా పూర్వీకుల పై ఆసక్తి కలుగుచున్నది. లకుమ మరి నీకు మీ పూర్వీకుల గూర్చి తెలుసుకొనవలెనని లేదా ?
లకుమ : మా పూర్వీకులు రాజనర్తకులని మా అమ్మ ఆప్పుడప్పుడు చెప్పుచుండును వారు ఎట్టివారో అందరికీ  తెలియును వారి గూర్చి తెలుసుకొనుట వ్యర్ధము. వర్షుడు "అగస్త్య ఆసక్తి ఉన్న ముందునువ్వు మీ తాతగారి గురించి తెలుసుకొనుము.   అగస్త్య "నేను మా   నాన్న ని కలసి సంవత్సరములాయెను. ముందు నేను మా నాన్నగారిని  కలిసెదను. లకుమ కారులో అగస్త్యను వదిలిపెట్టెదనని చెప్పగా లకుమ అగస్త్య కలసి బయలుదేరిరి. 

Sunday, July 12, 2020

Bharatavarsha - Agastya story 4

"ఇది ఏమి చోద్యము మీ  తండ్రిగారు దక్షిణామూర్తి  అగ్నిహోత్రము వంటివారని వినికిడ"ని  వర్షుడనెను. "నిప్పుకైననూ చెదపట్టుటయే కలియుగ ధర్మము."యని అగస్త్యుడు బదులు పల్కెను."నాఉద్దేశ్యము  స్వదార ఉండ పరదార ఏలననీ.."యని వర్షుడు అనగా , అగస్థ్య "నేను గ్రహింపజాలకుంటిని " అనెను . "స్వదార అనిన అగ్నిసాక్షిగా పెండ్లాడిన స్త్రీ, పరదార అనిన పొరుగువాని భార్య"యని భారతవర్ష వ్యాఖ్యానించగా అగస్థ్యముఖము జేగురించెను  "పొరుగింటిపుల్లకూర రుచియని వినలేదా? అయిననూ స్వధర్మమునే విడిచిన వాడికి స్వదార ఒక లెక్కా? " అని అగస్త్యుడనగా "మీ నాన్నగారు క్రైస్తవ్యం పుచ్చుకొనిరా ? అదన్న మాట మీ అమ్మగారు మీ నాన్న గారితో  విడిపోవుటకు కారణము"అని వర్షుడు అనెను. "తాను  మారుటయే  కాక మా అమ్మను కూడా మతము మారవలెనని బోధించుచున్నాడు. ఆర్థిక సామాజిక స్థితిని ఆసరా గా తీసుకొని ప్రభావితం చేసి మతమార్పిడి చేయుట, ఇది కదా బలవంతపు మత మార్పిడి అన్న. ఇట్లు మతము మార్చుట తప్పు , చట్ట వ్యతిరేకము కదా !


ముమ్మాటికీ చట్ట వ్యతిరేకమే కానీ కంచె చేను మేసిన చందాన ఇంటి పెద్ద మతము మారి ఇంటి వారందరినీ అందరినీ మార్చుట సర్వ సామాన్యమైపోయినది.  నా విద్యార్థిని నందిని ఇంతకూడా ఇదే సమస్య.  తన తండ్రి మతము మారి చర్చ్ లు నడుపుచూ ధనార్జన కొరకు  ఊరందరినీ మతమార్పిడి కి ప్రోత్సహించుటయేకాక, తన భార్య బిడ్డలను కూడా మతము మారవలెనని వేదించుచున్నాడు.   

 వర్షుడు: మారిన ప్రతి ఒక్కడూ తమ క్రింద నున్నవారిని అందరినీ  మార్చవలెనని చూచుటయే హీనము ,  కానీ ఆది కాలము నుంచి  ప్రభుత్వములే ఈ పనికి పూనుకొనుట హీనాతి హీనము.  

అగస్త్య : ఆది కాలము నుంచి అనగా ?

వర్షుడు: ఆంగ్లేయుల  కాలము నుంచి.  భారతీయ ఆంగ్ల కవయిత్రి   తోరుదత్త కుటుంబమే ఇందుకు సాక్ష్యము.   జాన్ కీట్స్ అను ఆంగ్లకవి వలె పిన్న తోరుదత్త వయసులో 21 సంవత్సరములకే మరణించెను. బియాంకా అనే ఆంగ్ల నవల , జూర్నాల్ మద్మజేల్ దాహ్ర్వ్    అనే ఫ్రెంచ్ నవల పూర్తి చేయకనే క్షయతో  మరణించెను. 

 అగస్త్య : ఆమె గురించి కొంచము వినియుంటిని  అని అగస్థ్య అనెను " వారి తల్లిదండ్రులు గురించి వినియుండవు, వారిది దత్ వంశము,   ఆమె తండ్రి గోవింద దత్ బ్రిటిష్ వారిపాలనలో వారి పలుకుబడి లోనయి  చర్చ్ వల్ల  విశేష  ప్రభావితము గావించబడి 1862 లో మతమార్పిడి పొంది యున్నాడు. తొరుదత్ తాత గారు రసమే దత్ హిందూ స్కూల్ స్థాపకులు కీర్తికెక్కిన విద్యావేత్త , ఆమె దాయాదుఁడు రొమేష్ ( రమేష్ కాదు) చందర్ దత్ చరిత్రకారుడు, రచయిత మరియు అధికారివలెపాలనాధికారి   అనిన  ఐ.ఏ.ఎస్. అధికారి  ఇటువంటి విద్యాధికులైన వారిని బ్రిటిష్ వారు అధికారబలంతో సునాయాసముగా మతము మార్పిడి చేసెడివారు.  పాపము తొరుదత్ తల్లి  ఎంతో వేదన చెందిననూ  తరువాత భర్తనే అనుసరించెను. 

అగస్త్య :   ఎంత దారుణము అప్పటిలో  తెలవారు  అట్లు చేసినారా ? 

వర్షుడు: అప్పట్లో ఏమి ఖర్మ! నేటికీ ఆంధ్ర రాష్ట్రము ముఖ్యమంత్రి అదే పని చేయుచు న్నాడు. అతని క్రింద  పనిచేయు మంత్రులు , పాలక సిబ్బంది లో అత్యధికులు అతనిని సంతృప్తి పరుచుటకు మతము పుచ్చుకొనవలసినదే. 


అగస్త్య : అనగా క్రిందివారు పైవారికొరకు ఆత్మను అమ్ముకొనవలసినదేనా! మా అమ్మ కూడా భర్తకు కట్టుబడి మతం మారవలెనని చెప్పుచున్నావా? 


అట్లుచేసినచో పాపమని జాలిపడెదను.  మీ అమ్మగారి తెగువను మెచ్చుకొనుచున్నాను. 

52 ఏ. డి నందు థామస్ అను వర్తకుడు  భారతదేశమునందు ప్రవేశించిన మొదటి కిరస్తానీయుడు. అతడిని  థామస్ ఆపొజెల్  అని కూడా అందురు.   అతడు కేరళలో మతమార్పిడుల కు శ్రీకారం చుట్టిననూ 72 లో అతడు తన రెండవ భారత సందర్శనములో తన కార్య క్రమములను చెన్నపట్టణమునాకు మార్చి వేసెను.  అచ్చట ప్రజలకు ఆ మతము ఏమాత్రము నచ్చలేదు . అందుకు  వారు అతనిని చంపివేసిరి. 1523 లో పోర్చుగీసు వారు అతడి సమాధిపైన చర్చ్(థామస్ చర్చ్) ని నిర్మించినారు. అప్పటి చెన్న పట్టణమే మద్రాసుగా మారి సెయింట్ థామస్ చర్చ్ యే సాంథోమ్ గా మారెను. మరికొంతకాలం పిమ్మట చరిత్ర పై స్పృహ కలిగిన వారు దానిని తిరిగి  చెన్నైగా మార్చి వేసినారు. చరిత్ర స్పృహకల్గి, వేదమును గౌరవించు ప్రజలుండిన మతమార్పిడులు దుర్లభము అగును. హేతువాదులమని చెప్పుకొనువారు  కొందరు, జనవిజ్ఞానవేదికని చెప్పుకొనువారు కొందరు, బౌద్దమని చెప్పుకొనువారు కొందరు   వేదములను తూలనాడి దేశ సంస్కృతి  సంప్రదాయములపై విషము కక్కెదరు. 


అగస్త్య : జై భీమ్!! జైబుద్ధ!! అని బైరెడ్డి వర్గీయులు పలకరించుకొందురు.  బుద్ధునడ్డుపెట్టుకుని   వేదములను చులకన చేయుదురు. భౌతిక రసాయన శాస్త్రములను అడ్డు పెట్టుకుని మన సంప్రదాయములు చెత్త అని దుర్బాషలాడుదురు. 

"ఇదంతా కుట్ర, దుర్భుద్ధితో దేశ వ్యతిరేకులు చరిత్రను వక్రీకరించి విద్యయందు జొప్పించిన ఫలితము." అని వర్షుడనెను "వీరికి ఎట్లు బుద్ధి చెప్పుటయో" అని అగస్త్యుడు అనగా  అదట్లుండనిమ్ము నీ తలితండ్రులు వేరుపడినప్పటికీ ఇరువురూ బాగుగానే యున్నారు కదా? వారెచ్చటున్నారు ? అని వర్షుడు అడిగెను   


" మానాన్న ఎగుమతి వ్యాపార సంస్థను స్థాపించి యున్నాడు. నాల్గు కోట్ల పెట్టుబడికి చేరిన పెద్ద సంస్థకి  పెట్టుబడి అంతయూ మా అమ్మ ఆస్తే. ప్రస్తుతము మా అమ్మగారు చెన్నపట్నములో ఉద్యోగము చేయుచూ నాకు కావలిసిన ధనము పంపుచున్నారు. మా తల్లిదండ్రులు ఎప్పుడో వేర్పడిననూ  విడాకులు వ్యాజ్యము  నడుచుచున్నది.   ఆస్తుల గొడవలింకనూ మిగిలియున్నవి.

నీవు వసతిగృహములో ఉన్నావని తెలియును, కానీ  ఈ గొడవలు నాకు దెలియవు.   కానీ అవి మనము తీర్చునవి కావు న్యాయస్థానము చూచుకొనును. నీకొచ్చిన  సమస్య  ఇంకా ఏమైననూ ఉన్నదా?

అగస్త్య: ఒక కారణముచే తల్లి వద్దకు మరొక కారణముచే తండ్రివద్దకు పోవుటకు మనసు రాకున్నది.


వర్షుడు: కాలము వచ్చినచో  ధైర్యము, మనసు అవే  వచ్చును.అంతవరకూ వేచియుండుము. 



Philosophical - verse

 దేహమంటే దాహము — దాహము వలెనే దేహము తనివితీరని దాహము — తనువుల కొరకే మోహము దేహమంటే దాహము — కవ్వించు కామోత్సాహము  కన్నీటితో సహవాసము కనిపించని ద...