Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, March 27, 2020

కరోనా - కొత్త గురువు గారు వచ్చారు.

 మూర్ఖులు అనుభవం అనే పాఠశాలలో నేర్చుకుంటారు అనేవారు. ఒకప్పుడు అనుభవం నిజమైన గురువు. కానీ ఇప్పుడు కాలం మారి పోయింది. ఎంత  కఠిన అనుభవాన్ని పొందినా మారటం లేదు. అనుభవం అనే టీచర్ అంటే భయం పోయింది. అప్పుడు దేవుడు ఏ చేసాడో చదవండి.....


వేదం కాలంలో  దేముడు ఋషులుద్వారా , పండితులు ద్వారా మంచి చెపితే ప్రజలు విని ఆచరించేవారు. కాలక్రమేణా ప్రజలుకు వేదాలలో నమ్మకం సన్నగిల్లి సైన్స్  లో నమ్మకం ప్రబలింది. సైన్స్ సాధించిన విజయాలు తో  కిక్ ఎక్కి పోయాడు మనిషి.


ఆ కిక్ లో  మనిషి కి   మని,  షీ  సర్వస్వం అయ్యాయి. ఇంగ్లిష్ వాడు పెట్టిన పబ్లిక్ స్కూల్స్లో  ఫీజులుకట్టి చదువు నేర్చుకునే  దగ్గర నుంచి కార్పొరేట్ స్కూల్స్ లో మార్కులు కొనుక్కునే మూర్ఖులు  స్థితికి ఎదిగిపోయాడు.

ఈ స్థితిలో దేముడు కొత్త  పాఠశాల స్థాపించి , కఠినమైన అనుభవం అనే టీచర్లను నియమించి పాఠాలు నేర్పించాడు. కొంతకాలానికి మూర్కులు ముదిరి దేముడుకే పాఠాలు చెప్పసాగారు.


ఒకప్పుడు అనుభవం నిజమైన గురువు.  మూర్ఖులు అనుభవం అనే పాఠశాలలో నేర్చుకుంటారు అనేవారు. పాతకాలంలో మార్ఖులు కంటే , నేటి కాలంలో మూర్ఖులు జఢ మూర్ఖులు. అనుభవం అనే పాఠశాల లో ఎంత  కఠిన అనుభవాన్ని పొందినా మారటం లేదు.  అందుకే దేముడు కొత్త టీచర్ ని నియమించి సింగల్ సిట్టింగ్ పాస్ ఏర్పాటు చేసాడు. ఇంతకీ ఆ టీచర్ పేరు చెప్పలేదు కదూ! అతడి పేరు కొరోన.


బలిపీఠం మీద తప్ప ఏ పాఠం నేర్చుకోనివాడికి , మృత్యువే  ఉపాద్యాయుడు, కరోనా నే కరెక్ట్ గురువు. 

Monday, March 2, 2020

జానపదాల్లో శృంగారం


ఈరోజుల్లో మ్యూజిక్ లేదా  సంగీతం  అంటే ఇష్టపడని వారుంటారా ?  దాదాపు   లేరనే చెప్పాలి. సంగీతం అనగానే చాలామందికి గుర్తొచ్చేది పాటలు.  సంగీతం అంటే కేవలం పాటలు కాదు.  గాత్ర సంగీతం, వాద్య సంగీతం అని రెండు రకాలగ ఉంటుంది  సంగీతం. గాత్ర సంగీతం అనగానే మనకి ఘంటసాల , బాలసుబ్రమణ్యం, మొహ్మద్ రఫీ వంటి గొప్ప గాయకులు గుర్తొస్తారు . వాద్య సంగీతం అనగానే ద్వారం వెంకట స్వామి , హరిప్రసాద్ చౌరాసియా , పండిట్ రవి శంకర్  , షేక్ చిన్నమస్తాన్ వంటి గొప్ప  వాద్యకారులు గుర్తొస్తారు.   పాటలు అనగానే చాలామందికి గుర్తొచ్చేది సినిమాపాటలు. సినిమా పాటలేకాకుండా నిజ జీవితం లో కూడా పాటలు ఉంటాయి. మరి నిజ జీవితం లో కూడా  సినిమాల్లో లాగా  పార్కుల్లో  చెట్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడు కున్నట్లు , నిజ జీవితాల్లో పాటలు ఉంటాయా? అవును ఉంటాయి . అవే జానపదగీతాలు , వీటినే జానపదాలు అని కూడా అంటారు. ప్రజలచే ప్రజలకొరకు రచించబడి  ప్రజలచే పాడుకొనబడే గీతాలు జానపదాలు.
జానపదమనగా జనపదానికి సంబంధించింది. జనపదమనగా పల్లెటూరు  జనపదమున నివసించు వారు జానపదులు, జానపదులు పాడుకునే గీతాలను జానపద గీతాలు అంటారు. వీటినే ఆంగ్లములో flok songs అని అంటారు. తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. పామరులు   లక్షణ విరుద్ధ మయిన భాష వాడతారు. ఉచ్చారణ సరిగా ఉండక పోడంతో నాగరికులు వాటిని “అపభ్రంశ” మంటారు.   లక్షణ విరుద్ధ మయిన భాష గ్రామ్యము’ అన్నారు. గ్రామ్యమనగా పామరజన భాష.  కూర్చో  అనే పదానికి మారుగా  కూకో , పడుకో అనే పదానికి మారుగా తొంగో అనే  పదాలను వాడతారు. అందుకే  జానపదగీతాలలో సామాన్యముగా ఛందస్సు కనబడదు కానీ  కొన్నిసార్లు చక్కని ఛందస్సు కూడా ఉంటుంది.

సినిమా పాటల్లో విషాద గీతాలు, యుగళ గీతాలు , భక్తి గీతాలు,  విప్లవగీతాలు .   జానపద  గీతాల లో కూడా అనేకరకాలుంటాయి. సినిమాపాటలని సినిమాపాటల రచయితలు రాస్తారు వీరిని లిరిసిస్ట్ లు అంటారు. కానీ జానపదాలు ఎవరు రాస్తారు ఎవరు రాయాలి ? జానపదం మన పల్లెల జీవన విధానం. జానపదగీతాలు జీవితం లోంచి పుట్టుకొచ్చినవి.  కుమ్మరి , కంసాలి , కూలి పనివారు , గృహిణిలు , పొలం పని చేసుకునే స్త్రీలు,  బెస్తవారు అందరూ రచయితలే, అందరూ గాయకు లే  ఇవి కల్పిత గీతాలు కాదు.   శ్రమని మరిపింపజేసి పనిని ముందుకు తీసుకెళ్లే జీవన గీతాలు.

కేవలం పల్లెటూరిలో , పుట్టిన పనివారు మాత్రమే  జానపద గీతాలు రాయాలా?

ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ ప్రొఫెసర్గా పరిశోధన విద్యార్థులకు 30 సంవత్సరాలు   మార్గదర్శనం  చేసిన డాక్టర్ దేవరాజు గ్రామీణ ప్రజల భాషలో ఎందుకు రచనలు చేయకూడదు అని  మొదలుపెట్టి అనేక జానపదాలు రాశారు. ఫ్రెంచ్, జర్మన్ , స్పానిష్ , ఇటాలియన్ ఇంగ్లిష్ వంటి  ఫారిన్ లాగ్వేజెస్ భోదించే నేను కూడా జనభాషని ఉపయోగించి అనేక జానపద గీతాలు రచించాను. గొప్ప వాగ్గేయకారుడు, శ్రీనివాసుని భక్తుడు, ఆంద్ర  పదకవితా పితామహుడు గా పేరుగాంచిన అన్నమాచార్యుల వారు కాలంలో ప్రసిద్ధములైన జానపద బాణీలలో చాలా పదములు రాసారు. జానపద గీతాలను ఎవరైనా  వినొచ్చు అనేది ఎంత నిజమో   అలాగే ఎవరైనా రాయచ్చు అనేది కూడా అంతే నిజం.

జానపదం మన పల్లెల జీవన విధానం. జానపదగీతాలు పల్లె జీవితం లోంచి పుట్టుకొచ్చినవి.  పల్లె ప్రజల జీవితాల లో ప్రేమ, పెళ్లి , శృంగారం,  వంటి అనేక  విషయాలను ఈ జానపద గీతాలు  హృద్యంగా  వెల్లడిస్తాయి. అనేక  జానపద గీతాలు చాటుమాటు శృంగారాన్ని ఆవిస్కహరించాయి.  " ఊరి బయట పొలము కొనరా సావాసాగాడా సావాసాగాడా , నేనొస్తు పోతుంటాను సావాసాగాడా సావాసాగాడా  అని  స్త్రీ  పాడే పాట ,  యెర్ర చీర కొంటా , ఎద్దులబండి ఎక్కిస్తా  , నా ఎంకి రాయే నా ఎనకాల రాయే,  అని పురుషుడు అంటే  "ఎర్రి మీదున్నావో , ఎలాగున్నావో ఎర్ర  గున్నానంటూ ఎనక పడతావు ఎనక మావున్నా డని   ఎరికలేకున్నావు " అని స్త్రీ పాడుతుంది పల్లెటూరులో ఉండే శృంగార సమ్మందాలకు ఈ శృంగార గీతాలు అద్దం పడతాయి .

కామందు కొంచం దయ చూపితే మురిసిపోయే పల్లె పడచు హృదయాన్ని,  ఒక మహా వృక్షాన్ని కొట్టేసే టప్పుడు పల్లె పడిన బాధ ను, జానపదాలు అద్భుతంగా ఆవిష్కరిస్తాయి . రామాయణం లో ఘట్టాలను జానపదాలలో ఎంతో సునాయాసంగా  పాడుతుంటారు.   పాటలు ఆరు నుంచి పది పేజీల నిడివి కలిగి ఉన్నాయి . వాళ్ళ జ్ఞాపక శక్తి ని మెచ్చుకు తీరాల్సిందే.

జానపదాలంటే కేవలం పల్లె పాటలే కాదు ఆదివాసీలు , సంచారజాతుల వారి సాహిత్యం కూడా

ఆది వాసులు, సంచారజాతులు ,నాగరిక  సమాజానికి  దూరంగా ,   అభివృద్ధి కి నోచుకోక జావనసాగిస్తున్న జాతులు.  తెలంగాణ రాష్ట్రంలో  వందకు పైగా సంచార జాతులున్నాయి. గుర్తింపులేని సంచారాజాతుల  సాహిత్యం మరుగున పడిపోయింది వారిని సమాజంలో భాగమని గుర్తించాలని జాతులు కోరుకుంటున్నాయి. వారి సంస్కృతీ సాంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని వారి కళలను ప్రోత్సహించి జాతుల పరిరక్షణకు తోడ్పడితే బాగుంటుంది. సాహిత్య చరిత్రలో ఆదివాసీ గొంతులు దాదాపు శూన్యంగిరిజన సాహిత్యం రెండు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. అవి 1. గిరిజనేతరుల సహానుభూతి సాహిత్యం. 2. గిరిజనుల స్వీయానుభవ సాహిత్యం.

"డగడా  పర్బో  బోగో "  అనే జానపద గేయం  గిరిజనేతరుల సహానుభూతి సాహిత్యం క్రిందకి వస్తుంది .  గొండి  జాతికి చెందిన ఎలకోడి అనే గిరిజన పడుచు లంబాడజాతికి చెందిన రాందాస్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. కానీ ఎలకోడి  తండ్రి  ఆమె ఇష్టానికి వ్యతిరికంగా గొండి జాతికి చెందిన ఒక అయోగ్యుడితో మనువు జరిపిస్తాడు. గోండులు , బిల్లులు , జార్వాలు అనేక ఆదివాసీ జాతులున్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క విడాకుల ఆచారాలున్నాయి. గొండి జాతి భార్య కి ఇష్టం లేకపోతే,  భర్త అంగీకరించకున్నా విడాకులు ఇవ్వ వచ్చు.  విడాకులు ఇవ్వాలంటే రెండవ భర్త,  మొదటి భర్తకి నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుంది. ఇష్టంలేని మొదటి మనువుని విడిచి రాందాస్ ను పెళ్లాడాలని ఎలకోడి కోరిక. రాందాస్ ఎలకోడిని దక్కించుకోడానికి డబ్బు చెల్లించాలి. డబ్బు సంపాదించడానికి రాందాస్ పట్టణం వెళతాడు.  పండుగనాడు డబ్బుతో తిరిగొస్తానని వెళ్లిన లంబాడోళ్ళ రాందాస్ వస్తాడా రాడా అని ఆందోళన చెందుతూ పాడేపాట "డగడా  పర్బో  బోగో "

కవిత్వాంశాలను బట్టి జానపద విభజనము
1.         జోల పాటలు 2.  లాలి పాటలు 3.  పిల్లల పాటలు 4.            బతుకమ్మ పాటలు
5.         గొబ్బిళ్ళ పాటలు 6.        సుమ్మీ పాటలు 7.          బొడ్డేమ్మ పాటలు 8.ఏలెస్సా, ఓలెస్సా
9.         వానదేవుని పాటలు 10. తుమ్మెద పాటలు 11.     సిరిసిరి మువ్వ పాటలు
12.       గొల్ల పాటలు 13.జాజఱ పాటలు 14.కోలాటపు పాటలు 15.తలుపుదగ్గర పాటలు
16.       ఏల 17.            చిలుక 18.         సువ్వాల 19.     భ్రమర గీతాలు 20.         నాట్ల పాటలు
21.       కలుపు పాటలు 22.       కోతల పాటలు 23.         చెక్కభజన పాటలు 24.జట్టిజాం పాటలు
25.       వీధిగాయకుల పాటలు 26.         పెళ్ళి పాటలు 27.గ్రామదేవతల పాటలు
28.       తత్త్వాలు 29.     భిక్షుకుల పదాలు

ముందుగా జానపదాల్లో జోలపాటలు; జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు.  హాయి గొలిపే మరో జోలపాట - కస్తూరి రంగ రంగ కస్తూరి రంగ రంగా మాయన్న కావేటి రంగ రంగా శ్రీ రంగ రంగ రంగా నినుబాసి నేనెట్లు మరచుందురా
  చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే వెండి గిన్నెలో వేడిబువ్వ తేవే” ఈ జోల పాటకు వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు పాట  అన్నమయ్య రాసినది చాలామందికి తెలియకపోవచ్చు  కానీ తెలుగు తల్లులందరికీ  సుపరిచితమైన పాట చందమామ రావే.  అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి. తల్లులు మరిన్నిజానపదాలు నేర్చుకుని వారసత్వపు ఆస్తి లాగా పిల్లలకి సంక్రమింపజేయకపోతే మన సంస్కృతి నిష్క్రమిస్తుంది    దేశంలోనైనా , ఆచారాలతో , కట్టుబట్టలతో కూడిన భాష  , కధలు , చరిత్రతో  తరతరాలుగా సంక్రమించాలి అప్పుడే దేశం తనదైన  సంస్కృ తి   తో నిండుగా కళకళ లాడుతుంది  ఆస్ట్రేలియాలో అనాదిగా ఉన్న నేటివ్ ఆస్టేలియన్స్ ను అబొరిజీన్స్ అంటారు. వారిని గుర్తించడానికి ఒక తరనుంచి మరో తారానికి సంక్రమించిన  సంప్రదాయ భాష కథలు ముఖ్య ఆధారం.

లాలి పాటలు:  రామాలాలీ మేఘశ్యామాలాలీ  తామరస నయనా దశరథ తనయా లాలీ
లాలిపాటలవల్ల బిడ్డని నిద్ర జోకొట్టడమంటె  ప్రశాంతిని బిడ్డకి అందించడమే.
మరొక సుపరిచితమైన లాలిపాట  ఏడవకు ఏడవకు  వెర్రి పాపాయి ఏడిస్తే నీ కనుల నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను పాలైనా కారవే బంగారు కనుల

జానపదాల్లో మరో ముఖ్యమైన కోవ  బతుకమ్మ పాటలు

బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే.
పిల్లల పాటలు కూడా జానపదాలు  సున్నితమైన భావాలను ఆటలను నేర్పుతాయి
వానల్లు కురవాలి వాన దేవుడా  , వరిచేలు పండాలి వాన దేవుడా అంతో చక్కటి భావం ఉన్న పాటను వదిలేసి
రైన్ రైన్ గో అవే, అనే పాటను నేర్పిస్తున్నారు.  రైన్ రైన్ గో తో స్పెయిన్ డోన్ట్ షో యువర్ పేస్ అగైన్  అనే పాట  తో పోలిస్తే ఏది అర్ధవంతమో తెలుసుకోలేమా ? డోన్ట్ షో యువర్ పేస్ అగైన్  అంటే వాన మళ్లీ  ఎప్పటికీ రావద్దని కదా , వాన ఎప్పటికీ రాకూడదంటే ఎం తింటాం?

నారింజ కాయ నిన్ను చూడగానె నా నోరూరు, చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా. చిట్టి చిట్టి మిరియాలు చిట్టి చిట్టి మిరియాలు,చెట్టుకింద పోసి అనే  సృజనాత్మకత , సజీవ సౌందర్యం ఉట్టి పడే చిన్నపిల్లల పాటల్లో ఉండేవి జానపదాలు. అనేక భాషల పిల్లల పాటలతో పోల్చి చూసినప్పుడు తెలుగు జానా పదాలలో పిల్లలపాటలు ఎంత  సున్నితంగా ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు . ఫ్రెంచ్ పిల్లలపాట కూడా ఒకటి ఇక్కడ విందాం.

Alouette, gentille alouette Alouette, je te plumerai, Je te plumerai la tête, Je te plumerai la tête Et la tête! Et la tête! Alouette, Alouette!

దీని అర్ధం పిచ్చుకా నీ ఈకలు నీ పీకుతా , ఇటురా , తలపై ఈకలు పీకుతాను , ముక్కు పీకుతాను .. అని సాగుతుంది పాట , ఫ్రెంచ్ చదువుకునే  పిల్లలకి అందరికీ పాట తెలుసు ఎందుకంటే వారి టెక్స్ట్ పుస్తకాల్లోఈ పాట  ఉంటుంది. పాటలో సున్నితత్వాన్ని బదులు కర్కశత్వం కనిపిస్తుంది , ఇలాంటి పాటలు పిల్లలకి ఏం భోదిస్తాయి ? తెలుగు జానపదాల్లో మార్దవం వేరు కదా!

ఈ జానపద గేయాల్లో ఒక్కోసారి జీవితానికి ఆరోగ్యానికి పనికొచ్చే అమూల్యమైన విషయాలు ఉంటాయి.
కాళ్ళాగజ్జీ కంకాలమ్మ వేగు చుక్కా వెలగామొగ్గా మొగ్గా కాదూ మోదుగబావీ నీరూ కాదూ నిమ్మల వారీ
వారీ కాదూ వావింటాకు ఆకూ కాదూ గుమ్మడి పండూ కాల్దీసి కడగా పెట్టు.
గజ్జి వచ్చినప్పుడు కంకోలం అనే ఆకును రుబ్బి పూయాలి. తగ్గక పోతే వేకువ ఝామున లేత వెలక్కాయలోని గుజ్జును పూయాలి. దానికీ తగ్గక పోతే మోదుగ ఆకును రుబ్బి పూయాలి. తగ్గడమ్ ప్రారంభించాక నిమ్మరసాన్ని బాగా పలచన చేసి కడగాలి. ఇంకా మాడక పోతే వావింటాకు పూయాలి. గుమ్మడి పండులోని గుజ్జు కూడా గజ్జికి మందే. చికిత్సా విధానాలన్నిటినీ సూక్ష్మంలో మోక్షం లాగ వివరించే పాట ఇది. కాలు తీసి కడగా పెట్టు అనడంలో గజ్జి అంటు వ్యాధి కాబట్టి జాగ్రత్తగా ఉండమనే సూచన ఉంది.  అంటే జానపదాలు ఒక బంగారు గని.
తలుపు దగ్గర పాటలు: ఇవి ముఖ్యముగా తలుపు దగ్గర ముఖా ముఖి జరిగిన సంవాదాలు పాటల రూపంలో ఉంటాయి. ఒక తలుపు పాటలో సత్యభామ శ్రీకృష్ణుడు ఇంకో పాటలో సీతారాములకు తలుపు దగ్గర సంవాదము. ఇంకో తలుపుదగ్గర పాట బాలకృష్ణ భామలకు సంవాదము.ఇంకో తలుపుల పాట పార్వతి పరమేశ్వరుల  సంవాదము
చెక్క భజన: రాయలసీమలో - మరీ ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల్లో - చెక్కభజన పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో తిత్తి, మద్దెల, కంజీర వాయిద్యాలుగా ఉండేవి. చెక్కభజన భజన రెండు చెక్కలను లయాత్మకంగా కొట్టడం ద్వారా అద్భుతమైన సంగీతాన్ని సృష్టించి దానికి అనుగుణంగా అడుగులు వేసే కళ. చెక్కభజనలో అడుగులకు అనుగుణంగా పాటలో వేగం, ఊపు, ఉంటాయి. ఒకప్పుడు హార్మోనియం, డప్పు వాద్యాలతో రమ్యంగా ఉండే చెక్కభజన, కేసియో, స్టీరియో వాడకంతో జానపద సహజత్వం పోయి కృత్రిమత్వం వచ్చింది.

జానపద గీతాల ప్రాముఖ్యత - నేడు జానపద గీతాలు ఒక అవసరం అని చెప్పవచ్చు

ఒకప్పుడు మన పల్లెలలో జానపద కళారూపాలు కళకళ లాడుతుండేవి . ఆంధ్రప్రదేశ్ లో మన చరిత్ర , సంస్కృతుల కు దర్పణం పట్టే అనేక  అనేక  జానపద కళలు అంతరించిపోయాయి. ఒగ్గు కథ, బుర్రకథ, కోలాటం, తోలుబొమ్మలాట, తప్పెటగుళ్ళు, శారదగాండ్రు, చెంచుబాగోతం, కొమ్ముకథ, వీధి నాటకం, పిచ్చుకకుంట, వీరముష్టి, దొమ్మరాట, కొఱవంజి, గొల్లసుద్దులు, జంగం కథ, జక్కుల కథ, కాటిపాపలకథ, దాసరికథ, చెక్క భజన, యక్షగానం, పులివేషాలు ఆదరణ కోల్పోయాయి. ఎక్కడ చూసినా అస్లీల సినీ రికార్డ్ డాన్స్ లు. పట్టణాల్లో ఇంక సరే సరి , ఎక్కడ చూసినా  సినిమాలు. జన జీవితమంతా   సినిమా పాటల మయం. సినిమా పాటలంతా ఆంగ్ల మయం . ఆంగ్ల వాద్య పరికరాలు , ఆంగ్ల బాణీలు ,ఆంగ్ల  స్వరము, ఆంగ్ల   ఉచ్చారణ, మన సంగీతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తరుణంలో మన చరిత్ర, సంస్కృతి , భాష క్షీణించిపోతున్నఈ  సమయంలో జానపద గీతాలు మన   భాష సంస్కృతి లను మనకు గుర్తుచేస్తాయి .

జానపదాలు అభిమానించడం అంటే మన భాషను ప్రేమించడమే అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
జానపదాలు తమలో పల్లెల చరిత్రను , ప్రజల జీవన విధానాన్ని, నిక్షిప్తం చేసు కున్నాయి. కొండవీడు మందేరా - కొండపల్లి మందేరా కాదనువాడుంటే - కటకం దాకా మందేరా.   శ్రీ కృష్ణదేవరాయలు కటకంపై యుద్ధానికి వెళ్తూ శకునం చూడగా ఒక రజకుడు పాట పాడుతూ తన బిడ్డడిని నిద్రపుచ్చుతున్నాడంట.  ఇలా ప్రతి పాట వెనుక ఒక కథ ఉంటుంది.  జానపదాలను ప్రేమిస్తే మన భాషని మన భాషని ప్రేమించినట్టే , మన సంస్కృతి ని స్పృశించినట్టే . జానపదాలను  ప్రేమిద్దాం.