Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Friday, February 16, 2024

లయోలా కళాశాల లో భారతవర్ష కి సన్మానం

ఫిబ్రవరి 14వ తారీకున  విజయవాడ లయోలా  కళాశాలలో  మాతృభాషా దినోత్సవం సందర్భంగా భారతవర్ష గ్రంథానికి సన్మానం జరిగింది. భారతవర్ష గ్రంథం  విడుదలై నప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడూ అనేక సార్లు భారతవర్షకు  సన్మానం జరిగింది, జరుగుతూనే ఉంది.    


భారతవర్షలో ఉన్న గొప్పతనం ఏంటి ?  ఉపయోగం ఏంటి?

భారతవర్ష సరళ గ్రాంధిక ప్రబంధం వేయి కవితల సమాహారం అచ్చ తెలుగు మాధుర్యం.నేటి కాలంలో తెలుగువ ఉపయోగంలేదని వదిలిపెట్టేసినవారికి కనువిప్పు కలిగిస్తుంది   భారతవర్ష.

  బాషా సంస్కృతిని నాశనం చేసేస్తే ఒక దేశాన్ని  సులభంగా  తమ చెప్పుచేతల్లోకి తీసుకోవచ్చు అని విదేశీపాలకులు విద్యా వినోద రంగాలను మన బాషా సంస్కృతులను నాశనం చేయడానికి వాడారు. నేటి పాలకులు కూడా వారికి ఏమీ తీసిపోలేదు. ఒక జాతంతా వేషం మార్చుకుని బ్రతుకుతున్నాది. ఆంగ్లవస్త్రధారణ లేకపోతె నాగరీకుడు కానట్టే అని నాటుకుపోఎలా చేసాం.  ఇంగిలీషులేకపోతే బ్రతుకులేదని బెదిరిస్తూ సాగిన విద్యావిధానం వల్ల తెలుగుని వదిలి పెట్టేసి అత్యధికులు ఆంగ్లాన్ని  ఆలింగనం చేసుకున్నారు. సినిమాల ప్రభావంతో ఆంగ్లంలో  మాట్లాడితే  విద్యావంతుడని  ఆంగ్లంలో మాట్లాడితేనే ప్రతిష్ట అని స్థాపించాం.  కడకు మన బాషా సంస్కృతులని భూస్థాపితం చేసేశాం. ఇది మనం సాధించింది. 

చలన చిత్ర ప్రభావంతో యువతీ యువకులు వారి తల్లితండ్రులు అంతా ఆంగ్లమిళితమైన తెలుగునే మాట్లాడుతూ చాలా చాలా తెలుగు పదాలను మర్చిపోయారు.  కొంతమంది  గొప్ప  చూబించుకోడానికి  గుర్తు ఉన్నతెలుగు పదాలకు బదులు ఆంగ్లపదాలను బలవంతంగా వాడుతున్నారు. సినిమాలు చూసేవారి పరిస్థితి ఇలాఉంటే  తీసేవారి మరోలాఉంది.  కథలో వైవిధ్యం పేరుతో  కథని నాశనం చేసి బూతు, హింసలతో రక్తి కట్టించవచ్చని వాటిని గట్టిగా దట్టించి కోట్లాదిరూపాయలు ఖర్చుచేసి  మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. 

పది సినిమాలు విడుదలౌతుంటే అందులో 9 ఘోర వైఫల్యం చవిచూస్తున్నాయి.  అసలు విషయం ఏంటంటే ప్రజలు అంత  చెత్తను భరించలేకపోతున్నారు.  అది సినిమాలు తీసేవాళ్ళకి అర్థం అవ్వడంలేదు. అందుకే అలాటి సినిమాలు తీస్తున్నారు. శంకరాభరణం లో బూతు, హింస లేవు, కోట్లు పెట్టి తీయలేదు. అయినా  శంకరాభరణంఎందుకు విజయవంతం అయ్యింది? శాస్త్రీయ సాహిత్యం శాస్త్రీయ సంగీతం. ఈ రెండు జనకోటిని ఎంతగా అలరించాయో అంతగా భారతవర్ష కూడా అలరించింది అని చదివిన పాఠకులు  పుతున్నారు.   సభ్యభాషతోను,  చక్కటి పద్యాలతోనూ,   శాస్త్రీయ గీతాలతో నూ ఆహ్లాదపరుస్తుంది. మన చరిత్ర సంస్కృతిని  సాహిత్యంద్వారా మనని ఆకట్టుకునేలా చెపుతుంది.  



అందుకే సాధించింది ప్రపంచ రికార్డు మాత్రమే కాదు. ప్రజాదరణ కూడా. ఆధ్యాత్మిక భక్తి సాంకేతిక   సంగీత వైమానిక రంగాల లోతులను ఆవిష్కరించి  చందో బద్దపద్య సంసృత గీతాలతో నింపి,  సాహిత్య సరదాలు అద్ది శృంగారంలో మరిగించిన అద్భుత కావ్యం భారతవర్ష. 

                            2023 ఫిబ్రవరి  రాష్ట్ర సాహిత్య అకాడెమీ అధ్యక్షురాలు సమక్షంలో 

2023 మార్చ్ లో   వుయ్యూరు లో సరసభారతివారి  ఉగాది సన్మానం.

2023 మార్చిలో పామఱ్ఱు ఘంటసాలపీఠం  వారి ఉగాది సన్మానం.

2023 ఏప్రిల్ లో అనంతపురం జిల్లా గణిగెర లో నేను లేకున్నా  గ్రంథానికి సన్మానం 

2023 లో ఆగస్టు 23 న  ఉషోదయ పాఠశాల లో భారతవర్ష సాహిత్య సన్మానం  

2022 ఫిబ్రవరి లో  సిద్ధార్థ మేనేజ్మెంట్ , ఫార్మసీ కళాశాల చాలా ఘనము గా చేశారు. 

 2022 మే లో స్కాట్-స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో భారతవర్ష సాంస్కృతిక కార్యక్రమము, 

2022 లో మార్కాపురం లో భారతవర్ష సాహిత్య పరిచయం సాంస్కృతిక కార్యక్రమం జరిగాయి. 

2023 ఫిబ్రవరి లో ప్రభుత్వ సన్మానం  మాతృబాష సేవా శిరోమణి  బిరుదు కూడా వచ్చింది.


మన  భాష మన శ్వాస , మన సంస్కృతి  మన ఉనికి ఆత్మ నిగ్రహం , ఇంద్రియ నిగ్రహం , సత్యవాకుపాలన, తపోబలం బ్రహ్మచర్యం ఇలాటి మాటలకి నేడు కాలం చెల్లిపోయింది.  ఇంద్రియ నిగ్రహం   బ్రహ్మచర్యం బూతుమాటలు. మంచి ఫిగర్ , కెవ్వు కేక , ఫుల్ ఎంజాయ్  ఆన్ లిమిటెడ్ ఫన్,   ఇలాటిమాటలే సినిమా  వ్యాపార ప్రపంచం  పుట్టిస్తున్నది.  మంచి  మాటలు   మన సంస్కృతిని, విలువలని నిలబెడతాయి,మన బాషా మన సంప్రదాయాలకు నిలువెత్తు రూపం భారతవర్ష. భారత సంస్కృతికి విశ్వరూపం భారతవర్ష .

అందుకే  ప్రతి సంవత్సరం భారతవర్షకి  సన్మానం జరుగుతోనే ఉంది. ఇది నాకు జరిగే సన్మానం కాదు. తెలుగుకి జరిగే సన్మానం. సరస్వతికి జరిగే సన్మానం.  ఈ సందర్భంగా భారతవర్ష పాటలను ఈ బ్లాగ్ లో పొందుపరుస్తున్నాను  

భారతవర్ష ఉద్దేశ్యం తెలుగులో ఉండే మాధుర్యాన్ని చూపుతూ ఇంగ్లిష్  తెలుగు అందాన్ని ఎన్నటికీ అందుకోలేదు అని నేటితరానికి నిరూపించడం.   

"నీ ఆదర రాజీవముల సొంపారు శోణిమ శోభలు నిర్జించును నింగి కెంజాయలనైన, నీ చలచ్చంచ లన  నేత్ర సౌందర్య చాతుర్య  మహిమ అబ్బునే  మేటి పద్మంబు లకైన  గుబ్బారాశుల రాసికెక్కిన  గిబ్బరాశిని గాంచి గుబ్బతిల్లవే రసికడెందంబులెల్ల నీ నీలి జీమూత సంకాశ చారు కేశముల్ నర్తించవే  చంచజఘనాంగి నీ జఘనమెలల, నీముత్తెంపు మేని కాంతులన్ జూచి పాలిపోవే పారిజాత పుష్పంబులైన" 

ఆధునిక వ్యవహారశైలికి  నిత్య జీవిత  సంభాషణలకు తెలుగే మెరుగు అని చూపడం,

టాలీవుడ్నందు సృజనాత్మకత లోపించుటయేగాక, బంధుప్రీతి దురాశ పెచ్చు మీరినది. ఇచ్చట కథలకు కొరత ఉన్నదను వారేగానీ కొత్తకథలను ఆహ్వానించు వారులేరు. సింహభాగము మూసపోత చిత్రములు, ముతక దర్శకులు, వృద్ధ కథానాయకులు. మిగిలిన యువకులు వారి సంతానమే గాని  అన్యులెవ్వరునూ కానరారు. అందుచే దశాబ్దములతరబడి అవే ప్రేమ, ప్రతీకార చిత్రములనటు దిప్పి ఇటు దిప్పి జూపుచున్నారు.  ఎవరైననూ ప్రతిభ గల్గి మంచి దర్శకుడు,  రచయిత  అవ్వవలెనని ఊవ్విళ్లూరుచూ కథలను పట్టుకుని ఫిల్మ్ నగర్ నందడుగిడిన ఆషాఢ భూతులు వాసన  పసిగట్టి  వారిని  కొనిపోయి దర్శకునకు కథ వినిపించెదనని  మోసగించి, బిడ్డలనెత్తుకు బోవు దొమ్మల గుండులవలె  వారియొద్దనుండి ధనమును దోచుకొను చున్నారు.

సాంకేతిక విషయాలకు  ఆంగ్ల పదాలు నప్పుతాయి అవే సరైనవని ఒక అపోహ ఉంది   ఆధునిక సాంకేతిక విషయాలను ఇంగ్లిష్ లో చెప్తేనే  బావుటుందనుకుంటారు.  అచ్చ తెలుగులో వ్రాస్తే ఎలా ఉంటుందో చూడండి. భారతవర్షలో హైద్రాబాదునగర వర్ణన

"బహుళ  అంతస్తుల నగరులుతో మాదాపురమును తలదన్నునట్లుండు మణికొండ కాశ్మీరు  కంబళి పై నుంచిన  గజ దంష్ట్ర నిర్మిత రత్నమయ  కళాఖండమనిన అతిశయోక్తి కాదు. అచ్చట  పది సంవత్సములుకు పైగా నిర్మించిన ద్వాదశ హార్మ్యముల  లాంకోహిల్స్  యను ఒక సుందర పట్టణము మణికొండ శిరమున బంగారు  కిరీటము వలె నొప్పు చుండును. నిశీధిని విద్యుత్ దీపకాంతులీనుచూ ద్వాదశావతారము వలె అగుపించు ఆ ద్వాదశ ఆకాశ హార్మ్యముల నడుమ  సిగ్నేచర్ టవర్స్ యను భూమండ లోత్తుంగ ధామము మహాపర్వతమును పోలి గగనాంతర రాళములోనికి  చొచ్చుకొనిపోయి చూచువారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించినట్లగు పించును."

ప్రకృతిని వర్ణించిన తీరు భాషపై మక్కువ పెంచే లా చేస్తుంది 

అతిధి గృహము చుటూ పచ్చిక కనువిందు జేయుచుండెను ఆ పచ్చిక నందొక  జలయంత్రమమర్చబడి యున్నది, అందుండి పైకి చిమ్ము రెండు నీటి ధారలు    ఈడైన నిగ్గులాడి  తన జోడైన సొగసుకాడిని గూడి సయ్యాటలాడుచూ  ఒయ్యార మొలికించునట్లున్నది.  చిప్పిల్లు ధారల విరజిమ్ము సూక్ష్మ బిందువుల పై  బడిన సూర్యకాంతి పరావర్తనము ఇంద్రధనుస్సును ఆవిష్కరించింది. జలయంత్రము చుట్టూ మిట్ట పల్లముగా నున్న పాలరాతి కట్టడము ముత్యపు చిప్పవలె నుండి ఆ కైవారం వెంబడి గుత్తులు గుత్తులు గా బడి యున్న ఎర్రని పూలు జేగంటలు మ్రోగించు చున్నట్లున్నవి. ఆ మనోహర దృశ్యము కాముకునకు మిధునమును,  తత్త్వజ్ఞునకు ప్రకృతి శ్రీమన్నారాయణునకు జేయు పూలంగిసేవను  ఆవిష్కరించు చున్నది. 

అంబర వర్ణన 

"జాము రాత్రి దాళువాళించిన నక్షత్ర ముక్తావళి క్రమక్రమముగా కరిగిపోగా, జాముచుక్క  యొక్కటి అంబరమున మిగిలియున్నది. బాలభానుడాకాశమున కూర్మము వలె ప్రాకుచుండ కెంజాయ లలుముకొన్న అంబరముదయరాగము పాడుచుండెను. మలయమారుతాము తాకగ  ప్రకృతి యంతయు పులకరించ నల్లంచి గాఁడు(Indian robbin) అల్లన రాగమేదియో పాడుచుండగా, పిగిలి పిట్ట యొకటి బిగ్గరగా కూయుచుండెను. ఆ కూత  ఉదయరాగమందు మేళవించి ఎగయుచున్న  కపిలవర్ణ  తీవ్రతను తెలియజేయుచూ అప్పుడే కళ్ళు తెరిచిన అరుణతారకు మేలుకొలుపు రాగమువలెననిపించెను. ప్రకృతి ఎంత ముచ్చటగా నున్నదోకదా!"


భారతవర్ష సరళ గ్రాంధిక  ప్రబంధ లో గద్యము పద్యంతో పోటీ పడుతూ చదువరులను అలరిస్తూ ఉంటుంది  భారతవర్ష లో 200 వృత్త పద్యాలు ఉన్నాయి.  ఇందులో నవరసాల పద్యాలు వున్నాయి. 

 శృంగారం, వీర, కరుణ, అద్బుత, హాస్య, భీభత్స, భయానక, రౌధ్ర, శాంత ఇలా తొమ్మిదిని మనం పేర్కొనవచ్చు. అయితే ఈ తొమ్మిదీ ఒకదానికొకటి తీసిపోనివి అందుకే  వీటిని  “నవ రసాలు” గా పిలుస్తారు.  

భారతవర్ష  పద్యాలు  విని పులకరించని వారు లేరు.    అందుకే  ఎక్కడికెళ్లినా ఈ పద్యాలని ఆలపిస్తూ ఉంటాను. అయినా ప్రాచీన కాలంలోనే ప్రముఖ సాహిత్య శాస్త్రజ్ఞులు “శృంగారంరసరాజం” అన్నారు. 



భారతవర్ష రికార్డ్ మాత్రమే కాదు అద్భుతం కూడా.  ప్రతి రికార్డ్ అద్భుతం కాదు. చెవులో వెంట్రుకలు ఎక్కువగా ఉన్నందుకు, చేతి వేళ్ళ గోళ్లు పొడవుగా ఉన్నందుకు, ముఖంపై ఎక్కవ నత్తలను ఎక్కించు కున్నందుకు, ఇలా అనేక కంపరం పుట్టించే విషయాలకు కూడా రికార్డులు ఉన్నాయి అందుకే ప్రతి రికార్డ్ అద్భుతం కాదు అన్నది. భారతవర్ష రికార్డ్ అద్భుతం అపురూపం కూడా.



1. అబలను కాపాడిన అరుణతారకు వర్షుని కృతజ్ఞతాంజలి 

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత మాతా

శుంభ  నిశుంభ హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణ వర్జిత  గంగాజనిత  విచలిత  రసన  మాతా   

అంబకమునకందక  అంబరమున సంబరముగ శోభిల్లు మాతా

సంకటములు బాపుటకు తరలొచ్చిన మాతా

మామనసులె ఆనందనిలయమీ వేళా

ఆనందనిలయమునకు సంబరమీ వేళా

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా  దిగంబర పరంపర సాగించుహేలా

జనయిత్రి ప్రసవిత్రి సావిత్రి మాతా

వరవినుత గుణరహిత తపో జ్వలిత మాతా

త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత  మాతా

షుమ్బ  నిషుమ్బ  హారిణి ద్వాదశరూపిణి మాత

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణవర్జిత  గంగా జనిత  విచలిత  రసన  మాతా  

విలంబము సేయక విడంబము వీడగా

దుష్కర్మున కంకకకరణము మొనర్చిన  తారా

ధరలోని ధర్మాన్ని నెలకొల్పిన తారా  నృత్యప్రియ శివప్రియ జనప్రియ

దిగంబర పరంపర సాగించుహేలా  దిగంబర పరంపర సాగించుహేలా

త్రివేణి సంభవి శాంభవి మహిషాసుర మర్ధిని శాంభవి

కైలాసవాసిని శాంభవి  సింహవాహిని శాంభవి

దుర్గతినాశినీ శాంభవి,  శాంభవి శాంభవి శాంభవి.

 2. అరుణతారను దుర్గగా భావించి  అతిథి సత్కారము    

చేయుచూ విదిష  మంజూషలు పాడిన పాట   

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

ఈ దీనుల లోగిలి లోకి  అడుగిడరావమ్మ 2

నీ అడుగుల సవ్వడి వినగా  చెట్టు చేమ వికసించెనమ్మా  

నీ పాద ముద్రలు పడగా ధర్మం ధరలో  విలసిల్లేనమ్మా 

నీ గజ్జెలు ఘల్ ఘల్ మనగా దుష్టశక్తులు తొలగేనోయమ్మా

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా

ఈ దీనుల లోగిలి లోకి  అడుగిడరావమ్మ 

నీ విభుని విభూతి పొందుటే  ఈ జన్మకు గొప్ప అనుభూతోయమ్మా 

నే  చేసిన పుణ్యము కొలది నిను కొలిచెడు  భాగ్యము పొందితి నోయమ్మా  

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా2

ముష్కర మూకల భంజించి  విషమును దీసి విదిషను నిలిపితివి 

ప్రతప్త మానస దీనులకు ధీమా నిచ్చి దీటుగ నిలిపితివి 

అమ్మ దుర్గ మళ్లీ రావమ్మా అమ్మ దుర్గ వెళ్లీ రావమ్మా 

(త్రిమూర్తి ప్రేరిత,  త్రిభువన విలసిత  త్రినేత్ర భూషిత మాతా 

శుంభ  నిశుంభ హారిణి ద్వాదశరూపిణి మాత 

చండ ముండ సంహారిణి  నిశ్చలరూపిణి మాత

త్రిగుణ వర్జిత  గంగాజనిత  విచలిత  రసన  మాతా   

త్రివేణి సంభవి శాంభవి మహిషాసుర మర్ధిని శాంభవి

కైలాసవాసిని శాంభవీ సింహవాహిని శాంభవి 

దుర్గతినాశినీ శాంభవి శాంభవి శాంభవి శాంభవి)

3.అన్వేషణలో అలసిన వర్షుని విషాద గీతము  

 శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా

కాలము  వాలమై రణముకు పిలవ  మిత్రుడు శత్రువై విషమును చిందించ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

ఋణములు వ్రణముమై  బ్రతుకును  పొగిలించ

ఆడు మాటలు వాడి ఈటెలై మనసును గ్రుచ్చ

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

ఈతి బాధలు నష్టము కలిగించ 

నాతి బాధలు  నరకము తలపించ  తుష నే  త్రుంచ రుష నే పెంచ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

న్యాయము చితకగ  సాయము వెతకగ

నిత్య విఘ్నాలు  వేదన మిగిలించ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

కాలము  వాలమై రణముకు పిలవ 

ఋణములు వ్రణములు  బ్రతుకును  రగిలించ 

మిత్రుడు శత్రువై విషమును చిందించ 

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా

వాసన లే యమ  పాసములయ్యి 

సంచిత కర్మలుఉదంచనమయ్యి  

హృదయము రగిలించ  జగములు ఇగిలించ 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా 

శాంతమానసము నీయవే శారద,  నీరద యాన నీదయ రాదా

  4.  పార్వతి పెళ్లి చూపుల  పాట 

 ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం

సస్య కేదారముల  పాఱెడి  సారం భవాబ్దినావిక గీతా సారం

విహసిత సుందర వదనం వంశీధర  వర  మదనగోపాలం 

విహసిత సుందర వదనం వంశీధర వర  మదనగోపాలం  ప్రహసిత II

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం

మురళీకృత రవ మాయాజాలం బ్రహ్మ సమ్మోహన భవబంధహారం

విలసిత శ్యామల వర్ణం  మదన గోపాలా   నీ సుందరరూపం  

మదన మనోజ్ఞం ముజ్జగములకే మూగ్ధ మొహనం 

విలసిత శ్యామల వర్ణం  మదన గోపాలా   నీ సుందరరూపం  

మదన మనోజ్ఞం ముజ్జగములకే మూగ్ధ మొహనం   

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

కుసుమాకర  వర కంఠహారం కుసుమాకర  వర కంఠహారం

సస్య కేదారముల  పాఱెడి  సారం భవాబ్దినావిక గీతా సారం

ప్రభాత భూషిత శుభదివాకరం మనోరధబంధన  సుధాకరం  

జగత్ప్రాణ  పోషకం  శివంకరం  గోపి  ప్రేరక  జీవదాయకం  

దుఃఖ భంజకం మనోరంజకం  

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం 

హరిహరాదులకు  అత్మానందం   భవబంధహారం 

ప్రహసిత వసంత గీతం  మదన గోపాలా  నీ వేణుగానం

మురళీకృత రవ మాయాజాలం  ప్రహసిత వసంత గీతం


5. మీనాక్షి సూన్యతను  పోగొట్టుచు ఆమె పుట్టినరోజునాడు

ఆమె జన్మ సార్థకమైనదని   తెలియజేయుచు  వర్షుడు పాడిన పాట   

జగదానందకారకం నీ జననం   మధుర సురరాగ స్వర కల్ప సృజనాత్మకం

జగదానందకారకం నీ జననం,  మధుర సురరాగ  స్వర కల్ప సృజనాత్మకం

నీజీవన తత్వము జీవిత లక్ష్యము సృజనాత్మక సుమధుర సంగీతమూ

నీగానమె నీ గమనము, నీ గమనమె గరిమాగమ నిగమ ప్రయాణము 

నీ గానమున విఱియు నవరాగమూ  అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము  

జగదానందకారకం నీ జననం  సరస స్వర రాగ – యోగ సంయోగ జన రంజకం 

నీ పెదవులు పలుకు పరతత్వము నీ  గానము  విన గలుగు పరవశత్వము

నీ రాగము నొలుకు వాత్సల్యము అదివిన్న మనసుకు  నిశ్చలత్వము

అదె ఆత్మ పరమాత్మ సందర్శనం

జగదానందకారకం నీ జననం మధుర  గీర్వాణ - శరణ  నిశ్శరణ  శివరంజకం  

నీ పదములు వెలుగు పరబ్రహ్మము ఇహపరముల కొసగు నదిమార్గము

నీ గానమున నిండు నవభావము  ఆ భావమున మెండు అభావము

కైవల్యమునకు చూపు నదిమార్గము

జగదానందకారకం నీగానం మధుర సురరాగ బ్రహ్మ పరబ్రహ్మ  జ్ఞానోదయం

నీ గానమున విఱియు నవరాగమూ  అది రాగ నవ రాగ, దుర్గుణ రాగ నిర్గమ మార్గము 

గుణ గణ ధనము నీరాగమూ, నవనిధులుకు చూపునది మార్గము

వచనము : మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకరకచ్ఛపౌ, ముకుందకుందనీలాశ్చ ఖర్వశ్చ నిధయో నవ.

 జగదానందకారకం నీ జననం,  జగదానందకారకం నీ జననం 2

6.  భారతవర్షచే  మీనాక్షి కి  సాహిత్య సత్కారము 

 సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ

గారాల కూనలమ్మ రాగాలు పూయునమ్మ  

సృష్టించెను బ్రహ్మ ఇది గ్రీష్మ  కోకిలమ్మ,  

రాగాల కూనలమ్మ  గారాలు సేయరమ్మ,  

అమ్మమ్మ చూడరమ్మ  అందాల కోయిలమ్మ, 

అజంత శిల్పమమ్మ  తరగలెత్తు రాగాల తంజావూరు కొమ్మ 

యాగాలు చేయ జేజెమ్మ జెజ్జరిల్లి జేజి, ఈ కొమ్మ నిచ్చెనమ్మ 

ఆ సోమిదమ్మ కొమ్మ  కమ్మ నైన రాగాలకు  పెమ్మి ఈ అమ్మ 

సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ, 

గారాల  కూనలమ్మ రాగాలు పూయునమ్మ 

రాత్రనక పగలనక గుమ్మటిల్లు గుమ్మ  

దీపమై వెలుగునిచ్చు పత్తి వత్తి లెమ్మ 

సంగీతసంద్రమం దీదు రాచమీనమమ్మ 

చిమ్మ చిమ్మ ప్రోది చేసి తరతరాల కిమ్మ 

జాజి కొమ్మ లెమ్మ ఇది  జాతి సంపదమ్మ 

పలుకుకలికి పాదాల మంజీరమమ్మ  

 కంజీర నాదమమ్మ కలకంఠి ఈ కొమ్మ

సుస్వరాలు  మాలగట్టి పాటకూర్చు బ్రహ్మ

సంగీత తిలక మమ్మ  నాదబ్రహ్మ లెమ్మ 

ఇది జాతి సంపదమ్మ.

సృష్టించెను బ్రహ్మ ఇది రమ్యమైన కొమ్మ, 

గారాల  కూనలమ్మ రాగాలు పూయునమ్మ  

సృష్టించెను బ్రహ్మ ఇది గ్రీష్మ  కోకిలమ్మ,  

రాగాల కూనలమ్మ  గారాలు సేయరమ్మ,  

అమ్మమ్మ చూడరమ్మ  అందాల కోయిలమ్మ,

 అజంత శిల్పమమ్మ   దృష్టి తీయరమ్మ


7.  అంగయార్ కన్నె  పశ్చాత్తాపముతో  రాముని పై పాడినపాట  

నీలమేఘ శ్యామా రామా నీ మనసెట్లు తెలుసుకొందు  నన్నెట్లు మలచుకొందు   

రఘుకులతిలకా రామచంద్రమా  సుగుణము లొలకే  రాజచంద్రమా

నీలమేఘ శ్యామా రామా  నిను ఎట్లు  తెలుసుకొందు నామనసెట్లు తెలుపుకొందు

చల్లని చూపుల మెల్లని స్వామి  ఏ వనములలో తిరగను నీ కై, 

నీ పదములకై వేచాను యుగమై   నీ  తలపులలో మిగిలాను  సగమై

జింకను కోరిన సీతతపన కై వంకలు దిరిగి  లంకాపతినే జేరితివి వెరవక పోరు చేసితివి

లంకకు వారధి వేసిన స్వామీ  నాజీవన సారథి నీవేస్వామీ

నీలమేఘ శ్యామా రామా  నిను ఎట్లు తెలుసుకొందు నామనసెట్లు తెలుపుకొందు

కారడవులలో జీవితము    తరగని  కష్టాల కడలి ప్రయాణము ,  

చూపెను కర్తవ్య  పరాయణము   తరతరాలకు ఆదర్శమూ  

 నర నారాయణ సంగమమో  విగ్రహవాన్ ధర్మః రామో, 

నీలమేఘ శ్యామా రామా నీ మనసెట్లు తెలుసుకొందు  నన్నెట్లు మలచుకొందు 

గొప్పమనసుతో తప్పులు గాచి  చప్పున రారా రామచంద్రమా!


7. సరస్వతిని కీర్తించుచూ  మాలిని  వీణపాట 

 పుస్తక ధారిణి భాషా వాహినీ  శాంతిరూపిణీ కచ్ఛపి ధారిణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - అతులిత స్వర రాణీ  వీణా పాణి,  

అలసిన మనసును మురిపించు విరిబోణి అమరగాన మును అలరించుగీర్వాణి  

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే   

మూలాధారిణి మంజుభాషిణీ  హంసవాహిని సూక్ష్మ రూపిణి –అతులిత  స్వరరాణీ వీణా పాణి

కోరి వేడుచూ కొలిచిన భక్తుని జ్ఞాన మార్గమున నడిపించు యోగిణి

నాదము నీవే,  వేదము నీవే,  వేదన బాపే భామిని నీవే  - 

యశో కారిణి ఆనందదాయిని వేద రూపిణి, కమల లోచని - అతులిత స్వరరాణీ వీణా పాణి

దుర్భోధ పీడిత దుర్లోక మూషిత నిర్దోష పురుషుల ముక్తి ప్రదాయిని

నాదము నీవే, వేదము నీవే, వేదన బాపే భామిని నీవే - 

శుద్ధ స్ఫటిక రూపాయై ముక్తాలంకృత సర్వాంగ్యై నిష్కళాయై                                               

వాగ్మ్యై వరద హస్తాయై వరదాయై నమోనమః

దుర్బల మానస, ఉన్మాద పీడిత ఉన్మార్గ జీవుల కరుణించు మాలిని

నాదము నీవే, వేదము నీవే,  వేదన బాపే  భామిని నీవే - అతులిత  స్వర రాణీ


8. పెళ్లివేడుకలలో భారతవర్షను కీర్తిసూ  నందిని  పాడిన పాట 

   సనాతనీ   విద్యామాతే సర్వశాస్త్ర   పరంజ్యోతి 

   జ్ఞానప్రదా   యనీదేవీ   వేదాగ్రణి    నమోస్తుతే

   మితభుద్ది ఏవం పరిమిత శుద్ధి, ధనం పరితః పరి భ్రమణం నిత్యం                     

   నివసితి ఏవ బహు అల్ప ప్రపంచం కదాపి చేతతి ప్రత్యక్ష  ప్రపంచం

   లేఖిక భుద్ది లోక ప్రసిద్ధి ఉదారబుద్ధి వాగ్దేవి బద్దం 

  సుశబ్ద శోభిత సుందర కోసం భారత వర్షం అనేకవర్ణం  

   రసిక రంజకం దుఃఖ భంజకం పండిత ప్రభవ కవితా తరంగం  

   పండిత పారంగత గీర్వాణ కావ్యం, కారు కృత కావ్యం వాణి సంభూతం 

   చారు సందేశం అమృత భాండం బహు దుఃఖ వారణం ఆనంద సాగరం

   భువనైక సుందర మాంగళ్య తోరణం.  భారత వర్షం సర్వతీ పుత్రం 

   సర్వతీ పుత్రం బహుజన మిత్రం సర్వతీ పుత్రం బహుజన మిత్రం

   కష్టాని క్లేశాని  నిర్భర  లోకం,  దుర్హిత దుష్కృత అవరోధక లోకం 

   అమీవ, కైటవ కాళిందివ లోకం తస్మిన్ లోకే సుక తాండవకృష్ణం.  

   భారత వర్షం తాండవ కృష్ణం తాండవ కృష్ణం కవితా తృష్ణం

   గీర్వాణ నిర్వాణ రాగ సంకీర్ణం…     యాస్యతి నందిని 

   నందనందనం నందనందనం మమ అదృష్టం.


9.   సరస్వతి మాతను ఆవిష్కరించుచు  భారతవర్ష పాడిన పాట  











చతురాస్య ముఖజం  చతుశృతీ  కంఠ నిక్షిప్తం,  

 కమల దళ యుగళ నయన పుటం కచ్ఛపీ  కరభూషితం - భారతీ వందనం 


కళకళలాడే  నీ శశివదనం  సనాతనం శుభకరం - భారతీ వందనం 

సుధలను చిలికే నీ శుభ వదనం,  జ్ఞాన సంగీత సాహిత్య సదనం   

 భారతీ వందనం భారతీ వందనం భారతీ వందనం.

 

బ్రహ్మ ముఖమున శ్వేతాంబరివై   

వేదములొకచేత   వీణను ఒకచేత 

పూని  జనించిన   జ్ఞాన రూపిణి 

 భారతీ వందనం.  భారతీ వందనం. 

 

సరసిజనాభుకు, పద్మభవునకు 

విశ్వసృష్టికి బాసటనొసగిన 

పలుకుజెలికి ఆ విద్యల తల్లికి  వందనం. 

భారతీ వందనం.  భారతీ వందనం.  


నీ కన్నులు  రెండు  కవితాంబుధిలు

ఆ అంబుధిఘోషలు నీ శ్వాసలో కదులు 

అవి కవిహృదయంలో ఆగక మెదలు

నీ ఉఛ్వ్వాసాన వేలభాషలు

నీ నిస్వాసాన వేదఘోషలు 

యోగ్యత భాగ్యము గలిగిన  యోషలు 

మార్చరు  తమతమ వేషభాషలు 

తెలిసిన పురుషులు పరుషములాడక 

సరసముగా నవరసములు గ్రోలుచు 

అన్యభాషలకు అర్రులుచాచక 

నీ పదములపై మధుపములైవ్రాలి  

కవితా సుధలే గ్రోలుచుందురు 


కళకళలాడే  నీ శశివదనం  సనాతనం శుభకరం - భారతీ వందనం 

సుధలను చిలికే నీ శుభ వదనం,  జ్ఞాన సంగీత సాహిత్య సదనం   

 భారతీ వందనం భారతీ వందనం భారతీ వందనం.


నీ శుభ వదనం  ప్రతిభకు  నిలయం,  సుందర కళలకు ఆరంభం 

నీ హృదయం కరుణా  సదనం  సనాతనం శుభకరం భారతీ వందనం   


10. పతాక సన్నివేశం  - ముగింపు  గానం

 భారత వర్షం సారంగం పద తారంగం 

భారత వర్షం పద రంగం పద చదరంగం 

వినువీధి కెగసిన వీరతురంగం విశ్వమానవుని వీరంగం 

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

కౌముది లో కమ్మదనం కౌగిలిలో వెచ్చదనం

అనురాగముతో నీ మెడకి  పూసిన శ్రీ గంధం

రాగాలల్లిన ప్రణయ మారుతం , నీ మనసు కట్టిన  మంగళ సూత్రం

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం *

భారత వర్షం సారంగం పద తారంగం - 

భారత వర్షం పద రంగం పద చదరంగం -

కృతకర్మ కూర్చిన  ద్రుతవిలంబితం  

స్రుతి స్మృతి సంగమ రాగ చోదితం 

శ్రుత్యంత శోభిత కౌస్తుభం 

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం 

భారత వర్షం సారంగం పద తారంగం - 

భారత వర్షం పద రంగం పద చదరంగం -

అంబరమంటిన కవితా సంబరం 

నీలో నాలో కురిసిన వర్షం, ఒకరికి ఒకరు  అంకితం

భారత వర్షం భారత వర్షం  భారత వర్షం







No comments:

Post a Comment