Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Tuesday, September 7, 2021

భారతవర్ష లో స్నేహ ధర్మం - మానవతా విలువలు

 ఒకడు నోరిప్పితే అసభ్యంగా మాట్లాడుతుంటాడు. వాడి ప్రవర్తన చాలా దారుణం గా ఉంటుంది. అలాటి వాడికి సభ్య ప్రవర్తన నేర్పాలంటే మనం ముందుగా ఏంచేస్తాం ? ఏం  చెయ్యాలి?  మంచి భాష నేర్పాలి. తర్వాత సభ్య ప్రవర్తన అదే వస్తుంది.  ఈ రెండు లేని వాడు ఎందుకూ కొఱగాడు. అటువంటి  - ఎందుకు కొరగాని - వ్యక్తి బసవడు.  



మొదటిలో  బసవడి  భాష ప్రవర్తన 

 1. బైక్ కొనలేక పోయావు, థూ! కనీసం ఒక స్మార్ట్ ఫోన్ కూడా కొనలేకపోయావ్, మా కాలేజీకొచ్చి చూడు ప్రతీ ఎర్రిపప్పకి కూడా స్మార్ట్ ఫోన్ ఉంది, అందరూ బైక్ల మీద కాలేజీకి వస్తుంటే నేను మాత్రం మూడేళ్లనుంచి బస్సులలో తిరుగుతున్నాను.   చేతగానప్పుడు పిల్లల్ని  కనకూడదు

2. దీనమ్మ బేక్ లాగ్స్ , ఎప్పుడు బండి కొనమని  అడిగినా , సెల్ కొనమని అడిగినా నాన్న   బేక్ లాగ్స్ అంటాడు. నువ్వు  చెల్లిని చూబెట్టి  నాకు దొబ్బులు పెడతావు. మీరు నాకేమిచ్చారు, కని పడేసారు , ఆఖరికి పేరుకూడా బసవయ్య అట , చెప్పుకోడానికే సిగ్గేస్తోంది , అందుకే బన్నీ అని చెప్పుకుని తిరుగుతున్నాను

2. అక్కడ ప్రోగ్రాం అయిపోయాక బిర్యాని  పెడతారా?" అన్నాడు పక్కనుంచి నడుస్తూ బసవయ్య. ముందే పెడతారు అని  అగస్త్య అనగా బసవయ్య మరి మారు మాటాడకుండా వెంట నడిచెను. వారు ఇరువురు ఆనందనిలయం ...

నేటి దిగజారిన యువతకి ప్రతినిధి బసవడు. ఆంధ్ర రాష్ట్రంలో సగటు యువత కి దర్పణం బసవడు.  ఉచితంగా వచ్చేది ఏది వదలడు. బైక్ సెల్ ఫోన్ కోసం తల్లి తండ్రులని వేధిస్తూ  సినిమా మోజులో పడి సంప్రదాయాలని ద్వేషిస్తూ , తన సంప్రదాయమైన బసవ అనే  పేరుని కూడా కత్తిరించుకుని సినిమావాళ్ళ లా  బన్నీ అని చెప్పుకుంటూ  ఇంజినీరింగ్ పరీక్షలలో డింకీలు కొడుతూ ఉంటాడు. భోజనం ఉచితంగా పెడుతున్నారని  భారతవర్ష ఇంటికి వెళతాడు. అంతే అలాటి మూర్ఖుడు కూడా పండితుడు అవుతాడు    

భారతవర్ష అగస్త్యతో బసవడి గురించి  : 

నీవు అవధానప్రక్రియకు ముందే విషయము నాతో చెప్పినావు , కానీ వాడు వచ్చిన పనియేమి చదువు అనిన వాడికి చుక్క ఎదురు కదా ! అని భారతవర్ష యనగా వాడిచ్చటకు వచ్చినది తినుటకు మాత్రమే అని అగస్త్య చెప్పెను.  "ఒకడు తిన్నచో మనకు నష్టమేమియునూలేదు కానీ, ఎంతకు చెడినాడోయి, అయ్యయ్యో! రజోగుణముచే ప్రేరేపితుడయ్యి  లోభమున పాతాళము జేరినాడు కదాచిన్న పెద్దల మధ్య అంతరం గమనింపక  తల్లిని గొట్టి  హీనుడయ్యి తమస్సున యాతనపడు జీవి   ఉచ్చ నీచ వ్యత్యాసములు గణింపక ఉచితముగా వచ్చినదేదైనా స్వర్గమని భావించును.

ఇలాటి బసవడు సభ్య భాష నేర్చు కోడమే కాకుండా తన  భాషతో అందరినీ ఆశ్చర్య పరుస్తాడు. 

1. కొండకచో బూతు సంభాషణములను నెరుపుచు కాలహరణము చేయుటకు సభలో   నీచులంద ధముడొక్కడు, ఆంగ్లసర్పద్రస్టుండై ఆంగ్లమునాలింగనమును జేసుకొని శ్లాఘించుచుండ  "పరపిండము తస్కరింపబూనిన పరేతుఁడి(ప్రేతాత్మ) వలెనున్న   మ్రుచ్చుడెవ్వఁ డీవు ? " యని బసవడు నిప్పులు కక్కుతాడు  

2.  ఎలెక్ట్రిషన్ ని పిలిచిన యెడల మైక్ సరిచేయును” అని ఒక నిర్వాహకుడు అనగా, బసవడు  ఇట్లనెను

ఓవిద్యుత్వేత్తా, ధ్వనిపెంపు యంత్రోద్దారకా, సమయపాలన కాటంకమగుచున్నది  యంత్రమును సరిజేసి  కవి పండిత వరేణ్యులాశీనులైన ఈ విద్వాంసవిరాజమాన సాహితీసభను నిర్విఘ్నమొనర్చరయమున రమ్ము.”యని ఆశుకవితా ప్రజ్ఞనందరినీ అలరించెను.

3.  భారతవర్ష సాహిత్య సభను నిర్వహించుటమిక్కిలి ఆనందదాయకము, అందులకార్ధికసహాయము చేయుచున్న సాహిత్యమండలి అధ్యక్షులు. శ్రీ పైడిరాజుగారికి, ఇతర సభ్యులందరికి నా నమోవాక్కముల నర్పించుచున్నాను. పండితులకు  ఉన్నతులకు  వేడుకగల్గించు సాహితీ రూపకం    ప్రారంభకులకు సదావకాశమువేదజ్ఞుఁడుఅవధాని , కవియైన భారతవర్ష  సరసన నిలుచుటయైన నావంటి అల్పజ్ఞానుల సుకృతము. విద్యాంసుల ఉచ్ఛ్వాసనిశ్వాసములైననూ, విదుషీమణుల నూపురముల ఘోషయైననూ, జ్ఞాన ప్రేరితములు,స్ఫూర్తిదాయకములు. తెలుగు సాహిత్య సభకు  మంగళమగుగాక!!! 

ఆరు నెలలలో బసవడిలో  వచ్చిన మార్పునుజూసి మిత్రులందరూ విస్మయమొందిరి. బసవడి  తల్లిదండ్రులు, బుచ్చమ్మ,సర్రాజు అమితానందమునొందిరి. గర్వమున కించిత్తు గగుర్పాటు కూడా కలిగెను.

  

11 వ భాగం లో సాహిత్య సభ ముగిసిన రాత్రి  ఇంటిదారిలో 

సాహిత్య సభ నుంచి నడుచుకుని వస్తున్నప్పుడు. రాఘవ జెఫ్రీ షాజార్  కాంట్రబురీ టేల్స్ ఆంగ్ల సాహిత్య చరిత్ర లో అత్యంత ప్రాముఖ్యతను కలిగిన గ్రంథరాజమని అనిచెప్పెను.భారతవర్ష  కాంట్రబెరి టేల్స్ గురించి  చెప్తాడు.   బైరిరెడ్డి, సందీప్ లకు భారతవర్ష భాష కొంచము కష్టము అనిపించగా  బసవడు వారికి అర్ధమయ్యే  చలన చిత్ర భాషనందు   ఆద్యంతమూ నవ్వు తెప్పించేలా చెపుతాడు


33 వ భాగం లో రమ్య చందన పుట్టినరోజున 

బుచ్చెమ్మగారు పుణుఁకులు, పాలకాయలు పులిబొంగరములు వంటి పలు భక్ష్యములు జేసినారు, వంటగదిలో పీట వేసి అగస్త్యను పిలిచి ఆరగించమనిజెప్పి “నేడు బసవయ్య చెల్లి రమ్యచందన పుట్టినరోజు  ఒక కవిత చెపుతాడు  "జివజివ జివ జివ లాడుచున్నది దేహము జిల్లని లాగుచున్నది ప్రాణము" అని.  అగస్త్య చెప్పిన కవిత కంపరం కలిగిస్తున్నదని చెప్పి  బసవడు చెప్పే కవిత అతడి భాషా పటిమను చూపించేలా ఉంటుంది బసవడు ఇలా చెప్తాడు 

నీ ఆధర రాజీవముల సొంపారు శోణిమ శోభలు నిర్జించు నింగి కెంజాయలనైన, నీ చలచ్చంచల నేత్ర సౌందర్యచాతుర్యమహిమ అబ్బునే మేటి పద్మంబులకైన, గుబ్బరాసుల రాసికెక్కిన గిబ్బరాసిని గాంచి గుబ్బతిల్లవె రసికడెందంబులెల్ల, నీలజీమూత సంకాశ చారు కేశముల్ నర్తించవే చంచజ్జఘనాంగి జఘనమెల్ల ,  నీ ముత్తెంపు మేని కాంతులన్ చూచి  పాలిపోవె  పారిజాత పుష్పంబులైన  అని చెప్పిన   బసవడి ఆశుకవితావనమున  మరుమల్లి, బంతి, చామంతి, సన్నజాజివంటి పుష్పములు వికసించెను 

50 వ భాగం లో శ్రీ కృష్ణ తులాభారం నాటికలో 

ఇంతలో అయ్యో  శిల వంటి నా శిరమును తాకి నీపాదము కందెనేమోయని వర్షుడు సత్య భామ  పాదములొత్తు చుండెను ప్రముఖ వార్తాపత్రికల పాత్రికేయుల సమూహము అచ్చట మోహరించి ఛాయా చిత్రములు గ్రహించు చుండిరికృష్ణుని గాన మాధుర్యము సత్యభామ సౌందర్యమున రసహృదయములు తడిసి ముద్దయినవి  అని ఒక పాత్రికేయుడు ప్రశంసించ బసవడు  లేచి తన ఆశుకవితా ప్రతిభను  చూపి గట్టిగా పద్యమును పాడెను

"రంగస్థల మంతయూ  బహుళ కాంతులు  భాసిల్లు చుండ గా నొక్క కాంతయే కాంతి 

నంతయూ గొని  కుందన చందము తులకరించ, కన్నార్ప మరిచె కళామందిరము." 

తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టు కుంటాడు. పార్వతి అనే చిన్నదాని మనసు గెలుచుకుంటాడు. ఆమెని పెళ్ళాడి   ఆమె  మనసులో కోరిక తెలుసుకొని  వీణ బహుమతిగా ఇస్తున్నప్పుడు  అతడు ఎంత సున్నిత మనస్కుడో అర్ధం అవుతుంది  అగస్త్య అనే స్నేహితుడిని  కుట్ర నుంచి  బైటకు లాగడానికి సాయం చేస్తున్నప్పుడు అతడి మంచి తనాన్ని స్నేహ ధర్మాన్ని  మెచ్చుకో కుండా ఉండలేము.  అదే అగస్త్య  తప్పుచేస్తే ( సుందరిని మంచితనాన్ని ఆసరాగా చేసుకొని ఆమె జీవితాన్ని ) అగస్త్య కి బుద్ధి చెప్పడాన్ని చూసినప్పుడు అతడి ధర్మ బుద్ధిని చూస్తాం.   

ఢిల్లీ  ఆంద్రభవన్ లో ,  బల్లిపాడులో , ఆనందనిలయం లో , మధురవాడలో, కలువుప్పల పాడులో  అనేక సందర్భాలలో బసవడు పాడిన ఆశు కవితలు ఒక పుస్తకం గా కూడా వేయొచ్చు.    బసవడి  పాత్ర మలసిన తీరు చూస్తే రచయిత రచనలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో  అర్ధం అవుతుంది.  ఇలా ప్రతి పాత్రలోనూ స్నేహ ధర్మం కనిపిస్తుంది . ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినట్టు ఒక స్నేహితుడి( భారతవర్ష ) వల్ల మారిన బసవడు మరొక స్నేహితుడి (అగస్త్య)ని మారుస్తాడు. ఇలా అనేక పాత్రలు  స్నేహబంధాన్ని సమోన్నతంగా నిలబెట్టి   మానవతావిలువలను ధర్మ బుద్ధిని చాటుతాయి.  అందులో సందీపుడి పాత్ర ఒకటి. 

సందీపుడు  సంస్కారానికి మారుపేరు.      

సందీపుడి పాత్ర కవితలు చెప్పదు . తల్లి వయసు మనసు   ఉన్న మీనాక్షి కి  రాఘవుడు ఆకర్షితుడైనప్పుడు అది తప్పు అని సూటిగా చెపుతాడు.   మీనాక్షి సందీపుడిని   తన బంగళాకి ఆహ్వానించినప్పుడు మితంగా మాట్లాడి మర్యాదగా నడుచుకుంటాడు. మీనాక్షి ఎంత శ్రీమంతురాలో తెలుసు , ఆమెకు డబ్బు ఇవ్వాలనున్నా సందీపుడు చెయ్యిజాపే  రకం కాదు   తన  కష్టం మీద తన కాళ్ళ మీద నిలబడే రకం.  రాఘవుడితో వ్యాపార వ్యవహారాలు మాట్లాడుతున్నప్పుడు కరుకుగా  మాట్లాడతాడు. అతడి పద్దతి నచ్చలేదని సూటిగా చెప్పి డబ్బు ఇచ్చేసి పంపించేసి వ్యాపారం తన సొంతం చేసుకుంటాడు.  సందీపుడు మితంగా సూటిగా మాట్లాడే రకం కష్టపడి పని చేసే రకం. 

బసవడి పాత్ర తో పోలిస్తే కొంచెం నిడివి లో తక్కువగా ఉంటుంది కానీ గుణం లో కాదు. చెల్లి నందిని పథకంలో భాగంగా  భారతవర్ష చెల్లి మంజూష ని ప్రేమలోకి దింపినా పెళ్లి చేసుకోవాలనే యోచిస్తాడు తప్ప మంజూషని మోసగించాలని చూడడు. మంజూష ని పెళ్లి చేసుకుని ఆమె అల్లరి అంతా స్నేహితుడు  భారతవర్ష మీద గౌరవంతో  భరించి మంచి భర్తగా  ఉంటాడు. భార్య చెపింది కదా అని స్నేహితుడి భారతవర్ష నుంచి ప్రయోజనం పొందాలని చూడడు.  సందీపుడి తక్కెట్లో  స్నేహం  ప్రేమ  సమంగా తూగుతాయి. బసవడితో సమంగా తూగే పాత్ర సందీపుడి పాత్ర. 

ప్రౌఢ స్త్రీల పాత్రలలో ఘనమైన పాత్రలు అరుణతార, మీనాక్షి.

అరుణతార ఔదార్యానికి  మీనాక్షి ఉదాత్తతకి మారుపేర్లగా నిలిచే పాత్రలు. ఇద్దరు భర్తలకి దూరమైన స్త్రీలు. తంజావూరు  ఉన్నత పండిత  కుటుంబంలో  పుట్టిన ఆగర్భ శ్రీమంతురాలు మీనాక్షి. ఆమె  భర్త దక్షిణామూర్తి యవ్వనస్తురాలి మోజులోపడి మీనాక్షిలాంటి పద్మాన్ని గచ్ఛపిక్కలాంటి గ్రేస్ కోసం వదులుకుంటాడు. మంచి గంధం చెట్టు తనని నరికేస్తున్నా సువాసనని వెదజల్లుతుంది మీనాక్షి కూడా అలాగే విడాకుల తో పాటు తన ఆస్తి కూడా భర్తకి ఇచ్చేస్తుంది.  ఉదాత్తత వల్ల సంక్రమించిన పేదరికంతో  మురికివాడలో  పంకంలో పద్మంలా ఉన్నా  అసమాన సంగీత ప్రతిభతో సూర్యుడిలా సినీ ప్రపంచంలో  ఉదయిస్తుంది. టట్ట.. టాడా వంటి  సంగీతంతో కుర్రకారు నరాలను మీటే జేను స్వరరాణి బిరుదాంకిత, నాద బ్రహ్మ.కోటీశ్వరురాలైనా ధనాన్ని కాక గుణాలని అంటిపెట్టుకుని బ్రతుకుతుంది ఈ మంచి గంధం చెట్టు. అహంకారంతో అరుణతారని వీడిన ఆమె భర్తని సక్రమ మార్గంలో  పెట్టే పద్దతి, అందుకు ఆమె పడిన శ్రమ పాఠకుడి గుండెల్లో నిరంతరం నిలిచిపోతుంది. మీనాక్షి - స్నేహధర్మం, మానవతా ధర్మం, మమకారం  కలసి  ప్రవహించే త్రివేణి సంగమం భారతవర్ష కోవెలలో  మీనాక్షి కాంతులీనే దీపం.

చారుమతి - అరుణతార 

దేవదాసి చారుమతి ఇంటిలో ఆపద ధర్మంగా ఒక రాత్రి  తలదాచుకున్న అరుణతారకు ఆమె కుటుంబంతో  శాశ్వత సంబంధం ఏర్పడుతుంది.  ఆ దేవదాసి ఆ రాత్రే  కన్ను మూయడం  ఒక  కారణం గా కనిపించినా అది బాహ్యం మాత్రమే. అంతర్లీనం గా ఉండే  మరో కారణం అరుణతార ఔదార్యం . 

గొప్ప వితరణ శీలి సంఘ సేవకురాలు అయినా చారుమతి అడిగిన వారికి లేదనకుండా ఇచ్చితనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా  చనిపోతుంది.  అంత ఉత్తమురాలి  ఇంట చనిపోయే నాటి రాత్రి  అరుణ తార అతిధి.  మీరు దేవుడిని నమ్మితే ఇది విధి అని చెప్పచ్చు.  ఒక నాట్య ప్రదర్శన ఇవ్వడానికి ఆ మారుమూల పల్లెకి  వెళ్లి  ఆమె గుడిసెకి చేరడం దైవికం.   చని పోయే టప్పుడు కూడా  కర్ణుడు తన పన్ను దానం చేసినట్టు, ఇవ్వడానికి ఆమె వద్ద ఏమీ లేకపోయినా, తన గుడిసెలో తలదాచుకునే చోటిచ్చి చనిపోతుంది.  ఆమె ఒక అనాధ బాలుడిని చేరదీస్తుంది. అరుణతార చారుమతి అంత్య క్రియలు నిర్వహించి . ఆ పిల్లవాడు  కేశవుడుని తన కొడుకులా చూసుకుంటుంది. తన కూతురు చదువుకోకపోయినా పేదరాలయిన సుందరిని లక్షలు ఖర్చు చేసి పైలెట్ ని చేస్తుంది .  ఎం పీ గా ఉన్నా  కేంద్రమంత్రిణి  అయినా సీదా సాదాగానే బ్రతుకుతుంది, మధ్యతరగతి వారితోనే తిరుగుతుంది.  

గ్రామీణ శాఖా మంత్రిగా బేంకాక్ సమావేశానికి వెళుతున్నప్పుడు, సహాయమంత్రి, సెక్రటరీ బేంకాక్ చాలా రొమాంటిక్గా  ఉంటుంది  మీరు అక్కడ అన్నీ సందర్శించుటకు  ఏర్పాట్లు చేస్తున్నాము అని చెపుతారు అప్పుడు అరుణతార   There is nothing romantic about underdevelopment and rural poverty అంటుంది ఈ మాటలు   వృత్తి పట్ల ఆమెకు గల అంకితభావాన్ని సూచిస్తాయి. మంత్రిగా , మనిషిగా , అయోగ్యుడైనా భర్త కి (దూరమైన) భార్యగా తనగురించి  కలత చెందకుండా  ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కుంటుంది.  పెడదారిపట్టిన కూతురి తల్లిగా కూతురిగురించి ఆలోచిస్తూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుతూ ఆ వయసు అమ్మాయి సుందరి ని కూతురు గా భావించి ధర్మ బుద్ధితో బ్రతుకుతుంది . ధర్మో  రక్షతి రక్షితః అన్నట్టు  ఆమె జీవితం లో వెన్నెల కాస్తుంది. గంగా నది కాశీ పట్టణాన్ని పునీతం చేసినట్టు అరుణతార భారతవర్ష గ్రంధాన్ని పునీతం చేసే పాత్ర.   

భారత వర్ష లో  రెండవ తరం  పడుచు స్త్రీలలో అత్యుత్తమ పాత్ర సుందరి పాత్ర.     మొదటి తరం ప్రౌఢల సరసన నిలబడగల పాత్ర  సుందరి పాత్ర . తనను నిలబెట్టిన వారిని  నెలకొరగాలి అనే అత్యంత కృతజ్ఞాతా  భావంగల పాత్ర.  సహాయం చేసిన వారి ఋణం తీర్చుకోవాలని చూసే పవిత్రమైన పాత్ర  . to be continued

భారతవర్షలొ అన్ని పాత్రలు గూర్చి  చదివితే  ఎలా ఉంటుందో చదివిన వాళ్ళే చెప్పాలి.  


1 comment:

  1. Bharata varshalo goppataname paatrala roopakalpana.Dhakshinaamurthy chanipoyetappdu meenakshi mokham chustu chanipoyina drusyam adhbhutam. Bhasha oka ettayite paatralu oka ettu.

    ReplyDelete