Eazy Foreign Languages

This blog is about German and French Language in Vijayawada. Articles, poems, songs and experiences of poolabala

Sunday, August 11, 2024

ఇంగ్లీష్ కి ఏమైనా కొమ్ములున్నాయా ? -

ఇంగ్లీష్ కి ఏమైనా కొమ్ములున్నాయా ? - విజయవాడలో (బెంజ్ సర్కిల్ వద్ద) తొలి మరియు అతిపెద్ద ఫారెన్ లాంగ్వేజెస్ స్కూల్ డైరెక్టర్, బహుభాషా కోవిదుడు, బహుళ గ్రంథకర్త పూలబాల.
.
ఇంగ్లీష్ మీడియం కుట్ర - చదువంతా అదే మీడియం లో ఎందుకు ?
జీవితాంతం ఈ బానిసత్వం ఎందుకు ? ఇది కుట్ర మాత్రమే.
నా అభిప్రాయం కాదు అనుభవం చెబుతున్నాను.

నావద్ద ఫ్రెంచ్ జర్మన్ వంటి భాషలను రెండు లేదా మూడు నెలలు నేర్చుకుని విదేశాల్లో చదువుకో గలుగు తున్నారు ఉదోగాలు చేయగలుగుతున్నారు. జర్మన్ లేదా ఫ్రెంచ్ మీడియం లో ఎవరూ చదువుకోడం లేదు.


తెలుగు మాట్లాడడానికి అనుమతించని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలని ఇప్పటికీ చూస్తున్నాం , మాట్లాడితే పిల్లవాడి మెడలో తెలుగు మాట్లాడను అని బోర్డు కట్టి ఊరేగించిన పాఠశాలలనీ చూసాం. తెలుగు తల్లి నోటికి తాళం వేసి తెలుగువాడిని కాపలాగా పెట్టి వెళ్లిన ఇంగ్లిష్ వాడిని , కోట్లాది మంది భారతీయులను చంపిన ఇంగ్లీష్ వాడిని స్మరిస్తున్నాం, వాడి బాష నేర్చుకుని తరిస్తున్నాం. ఇంగ్లీష్ నేర్చుకోపోతే ఉద్యోగం రాదు అని చదువు ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని నమ్ముతున్నాం.

ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే ఉద్యోగం మాట అటుంచి ఇంగ్లిష్ కూడా సమంగా రాడంలేదు. ఆంగ్ల నాగరికతా వ్యామోహాన్ని సినిమా తో పెంచుతున్నాం. వచ్చిన ఆవగింజంత ఆంగ్లభాష ను గుమ్మడికాయంత చూపిస్తూ జాతి మొత్తం వాళ్ళ లా వేషాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇదంతా చూసి ఇంగ్లీష్ వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత కూడా బానిసత్వం వదల్లేదనిపించి . అందుకే అచ్చతెలుగులో భారతవర్ష అనే గ్రంథం రాయడం జరిగింది.

మన భాష మన ధర్మము. ధనము జీవిత ప్రయోజనము కానీ ధర్మము జన్మాంతర ప్రయోజనమని తెలియజెప్పి అట్టి ధర్మమునకు మూలము సంస్కృతి అని, ఆ సంస్కృతికి నాంది భాష అనే సత్యాన్ని తెలియజెప్పే సరళగ్రాంధిక ప్రబంధం , వేయి కవితల సమాహారం , అచ్చతెలుగు మాధుర్యం భారతవర్ష.
.
పుట పుట లోను పరుగులెత్తు గోదారిని తలపించే వృత్త పద్యాలు, పద్య సౌందర్యాన్ని సవాలు చేసే గద్య సౌందర్యం వెరసి తెలుగు భాషను బంగారు పల్లకి పై ఊరేగించు ప్రబంధకావ్యం భారతవర్ష.

"భారతవర్ష " ఇంత పెద్ద గ్రంథాన్ని (1265 పేజీలు ) చదవడం కూడా అంతసులభం కాదు అందుకే ఒక సాంస్కృతిక కార్యక్రముద్వారా సంగీత నృత్త్యములతో వృత్త పద్యములతో ప్రదర్శిస్తే తెలుగు భాషా మాధుర్యమును ఆస్వాదిస్తారు కదా.

"ఇలా క్షీణిస్తున్న తెలుగు భాషకు అడుగంటుతున్న సంప్రదాయాలకు ఊపిరిలూదడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న తరుణంలో తెలుగు వారి స్పందన కరువయ్యింది . ఒక సాంస్కృతిక కార్యక్రమానికి స్కూల్ లో ఒక గంట అవకాశం ఇవ్వమని యాజమాన్యాలని కోరినప్పుడు చీదరించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎలావుందంటే ఫారిన్ లాంగ్వేజెస్ అంటే పరిగెత్తుకొస్తున్నారు తెలుగు ఊసెత్తితే తల తిప్పుకుని పోతున్నారు. " అంటున్నారు ఈజీ ఫారెన్ లాంగ్వేజెస్ వ్యవస్థాపకులు పూలబాల.

2 comments:

  1. ఆలోచన , భావ వ్యక్తీకరణ , లోతైన అంతర్మథన అన్నియు మాతృభాష లోనే
    ఆంగ్లము కేవలము ఆ సమయమునకు బతుకుతెరువు కొరకు మాత్రమే
    కార్పోరేట్ విద్యా మాయ అటుంచితే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ వెర్రి లో మన తెలుగు జాతి మునిగిపోతోంది , ఇప్పట్లో బయటపడగలమా

    ReplyDelete
    Replies
    1. ఇప్పట్లో మనం బైట పడలేము చాలా కాలం పడుతుంది ఈలోగా ఏ విదేశీ శక్తి అయినా మనదేశాన్ని చెప్పుచేతల్లోకి తెచ్చుకోకుండా ఉంటే...

      Delete